కథ

అమ్మతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలీటం లేదక్కా!’ నెత్తి కొట్టుకున్నాడు రాఘవ.
ఎదురుగా ఉన్న పార్వతిలో మార్పేమీ లేదు. అసలు అతని మాట విన్నదో లేదో కూడా తెలీదు. ఒళ్లో ఉన్న పాపాయి తలకింద ఎడమ అరచేయి, చిన్నిచిన్ని కాళ్లమీద కుడిచేయి ఉంచి, ఎంతో ప్రేమగా, అమూల్య నిధికేసి చూస్తున్నట్లు, మొహం విప్పార్చి, మురిపెంగా, కళ్లు పెద్దవి చేసుకుని, తనివి తీరనట్లు, రెప్ప వేయకుండా చూస్తోంది పార్వతి. ఆ వైఖరికి ఒళ్లు మండి గట్టిగా అరిచాడు రాఘవ.

‘నువ్వెంత కావలించుకున్నా పరాయి బిడ్డ కన్నబిడ్డ అవుతుందా? పైగా ఆడపిల్ల! హు!’ మొహం చిట్లించాడు.
ఈ ఛీత్కారంతో ఉలిక్కిపడింది. మొహం కఠినంగా మారింది.
‘మనల్ని కన్నతల్లి ఆడదే! నీ పెళ్లాం ఆడదే! నీ కూతురు ఆడదే! అమ్మ పోయాక నీకు తోడుగా నిలబడిన అక్కను నేనూ ఆడదానే్న! ఏమంటావురా అయితే?’ కత్తిలా చూసింది.
తగ్గిపోయి మెల్లిగా అన్నాడు రాఘవ. ‘అది కాదక్కా! ఎవరైనా పెంచుకుంటే మగపిల్లాణ్ణి పెంచుకుంటారు. ఇంటి పేరు నిలబడుతుందని. కానీ ఇలా చెత్తకుండీలో దొరికిన ఏ బిచ్చగత్తె పిల్లనో తెచ్చి నువ్వెంత గారాబంగా పెంచినా ఆ లేకిబుద్ధులే వస్తాయేమో! పైగా ఆడపిల్లకి పెళ్లి చేసి మరో ఇంటికి పంపాల్సిందే కదా అని అన్నాను’ సమర్థించుకున్నాడు.
పార్వతి గొంతులోకి సౌమ్యత తెచ్చుకుంది. ‘హు! ఇంటిపేరు? బ్రతికినంత కాలం ఈ ఒంటిని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటాం. చివరికి చితిలో కాలిపోయేదే కదా! ఇక ఇంటి పేరు ఉండి ఉద్ధరించేది ఏముంది? జీవించినంత కాలం ఒకరి దగ్గర చేయి చాచకుండా బ్రతకగలగాలి. ఉన్నంతలో మరొకరికి సాయం చేయగలగాలి. అన్ని దానాల్లోనూ కన్యాదానం చాలా గొప్పది అంటారు. అంతకంటే భాగ్యం ఏముంది?’ పిల్లను ఎత్తుకుని లోపలికెళ్లిపోయింది, ఇంకేమీ మాట్లాడదలచుకోనట్లు. హు! స్వంత వాళ్లను కాదనుకుని ఈ దరిద్రాన్ని తెచ్చుకుంది. అనుభవిస్తుందిలే! కసిగా తిట్టుకుంటూ బయటపడ్డాడు రాఘవ.
పిల్లని ఉయ్యాల్లో వేసి పక్కనే కూర్చున్న పార్వతి గతంలోకి జారిపోయింది. అమ్మ కంటే అమ్మమ్మే తనకు ఆదర్శం. సుమారు శతాబ్దం కిందటి మాట. తల్లిదండ్రులు లేని పదకుండేళ్ల పిల్ల అమ్మమ్మను బంధువులంతా కలిసి పూనుకుని, అప్పటి రోజుల్లోనే డాక్టర్ చదివిన ఇరవయ్యారేళ్ల తాతయ్యకిచ్చి పెళ్లి చేసి, ఆస్తి అప్పగించి పంపారట. ఇప్పటికి ఇంకా స్వార్థం ముదరలేదు. ధర్మభీతి ఉంది ఇంకా.
కాబట్టి ఎనభై వేల ఆస్తి, రెండు మేడలు పిల్లతోపాటు తాతయ్యకి అప్పజెప్పి చేతులు దులుపుకున్నారు. ఆ రోజుల్లో ఎంబిబిఎస్ డాక్టరంటేనే చాలా గొప్ప. దానికి తోడు చేతినిండా డబ్బు. అదుపు చేసేవారు లేరు. ఇంకేం? ఎవరినో ఉంచుకుని అమ్మమ్మ నగలన్నీ అర్పించేశాడట. ఆవిడ ఒంట్లో బాగోలేదని జట్కాబండి పంపగానే ఈయన బయలుదేరి వెళ్లటం, రెండు మూడు రోజులైతే కానీ, ఇంటికి వచ్చేవాడు కాదట. అమ్మమ్మ ఎంతగా వెళ్లవద్దని కాళ్లావేళ్లా పడినా ‘నీకేం తక్కువ చేశాను?’ అని జవాబు. ఆరుగురు ఆడపిల్లలు, ఎనిమిది మంది అబ్బాయిలు. ముగ్గురు పోయి, పదకొండు మంది మిగిలారు. అమ్మ తొలి బిడ్డ. అమ్మకు పెళ్లి చేయటమే కష్టమై పోయింది. నాన్న సెక్రటేరియట్‌లో ఎల్‌డిసి. అక్క వసంత, రెండవది తను. తమ్ముడు రాఘవ. ఇంకా చిన్నవాళ్లిద్దరు ఏదో చంటిబిడ్డ వాతం వచ్చి పోయారట. అక్కను మేనమామకే ఇచ్చి పద్దెనిమిదేళ్లకు పెళ్లి చేశారు. తమ్ముణ్ణి కాలేజీలో చదివించాలని, ఆడపిల్లకు ఆ మాతం చాల్లే అని ఇంటర్‌తో ఆపేశారు. అదేం ఖర్మమో! ఇరవై మూడేళ్లయినా పెళ్లి కుదరలేదు తనకు. అక్క పుట్టింటికి వచ్చినప్పుడల్లా ‘దీనికేం సంబంధం కుదరలేదా అమ్మా! నాకు దీని వయసుకే ఇద్దరు పిల్లలు పుట్టేశారు’ అనేది గొప్పగా. తను ఎంత గాయపడేదో!
అమ్మమ్మ ‘అయ్యో సంబడం! నాకు నీ వయసుకు ఏడుగురు పుట్టారు. అదేదో డిగ్రీలు సంపాదించినట్లు గొప్ప చెప్తున్నావేంటే? దానికి రాసి పెట్టినవాడు ఎక్కడో ఉంటాడు. ఆ టైం రాలేదింకా. అంతే!’ అనేది.
స్వంత మనవరాల్ని చేసుకున్నా అమ్మమ్మకి రెండుపూట్లా తిండి పెట్టడమే దండగ అన్నట్లుండేది అక్క ప్రవర్తన. అమ్మ దగ్గరే ఉండేది అమ్మమ్మ. తనను చాలా ప్రేమగా చూసేది. ఇంత అమాయకురాలివి ఎలా బతుకుతావో అనేది. బిడ్డల్ని కనగలం కానీ రాతల్ని కనగలమా? ఇప్పుడు సుఖపడుతున్నామంటే మన పుణ్యం క్షయవౌతుందన్న మాట. కష్టపడుతున్నామంటే పాపం క్షీణిస్తుందని అర్థం. మంచిదేగా! ముందున్నవి సుఖపడే రోజులనుకోవాలి. మనవల్ల ఎవరూ బాధపడకుండా, ఎవరి మనసూ నొచ్చుకోకుండా ప్రవర్తించగలటమే పెద్ద తపస్సు అనుకో అనేది. అనుభవంతో చెప్పిన మాటలు. ఏ మత గ్రంథంలోనైనా ఉండే ధర్మం అదే కదా!
ఉయ్యాలలో పాప కదిలి ఏడ్చింది. ఈ లోకంలోకి వచ్చి పాప నోటికి పాలసీసా అందించింది. రెండుసార్లు పీల్చి అంతలోనే నిదురపోయింది. ఆ పసిపాపకి నిద్రలోనే ఏం కనిపించిందో? నిశ్శబ్దంగా పెదాలు సాగి నవ్వినట్టు అనిపించింది. కలలు వస్తాయా? చిన్నప్పుడు రేడియోలో విన్న పాట గుర్తొచ్చింది.
‘నిదురలోనా పాప నిలిచి నవ్వెనూ
దేవతలతో గూడి పరిహాసమో ఏమో!
దినదినము పాపణ్ణి దీవించి పొండీ
దేవలోకములోని దేవతల్లారా!’
నిజంగా ఏ దేవత ఇచ్చిన వరమో ఈ బిడ్డ! ఆ సమయానికే తను అక్కడ ఉండటం అదృష్టమే కదా! బొడ్డూడని పాప, రెండు వారాలుంటాయేమో! పాత గుడ్డలో చుట్టి చెత్తకుప్పపై పడేశారు. ఆటోకోసం తను అక్కడ నిలబడి వెయిట్ చేస్తోంది. కొంచెం దూరంలో ఏదో పెద్ద మాల్. అంతలో చెత్త తీసుకుపోయే లారీ వచ్చింది. ముగ్గురు పనోళ్లు దిగారు. ఒకడు గట్టిగా అరిచాడు. ‘పసిగుడ్డురా! ఇంకా ప్రాణముంది’ ఇంకోడు ‘ఏంది భాయ్ ఈ లొల్లి! పోలీసోడు చూస్తే పరేషాన్ చేస్తడు. ఇయ్యాల ఎవులి మొకం చూశావో!’ మూడోవాడు ‘కుక్కలు చూడలే గావాల్నా! లేపోతే ఈ తలికి ఖతమై పోయేటిది. ఇప్పుడేం జేయాల్న!’
తన చెవుల్లో ఈ మాటలు పడగానే వాళ్ల దగ్గరకు వెళ్లింది.
‘నేను శరణాలయంలో చేరుస్తాను. మీరేం పరేషాన్ గాకుండ్రి’ అంటూ వాళ్ల చేతిలో పర్సులో ఉన్నదంతా గుమ్మరించింది. వాళ్లు మొకాలు చూసుకున్నారు. పెద్దవాడేదో సైగ చేశాడు. ‘తల్లీ! మాకేం మాటరానీకు. పెద్దింటి ఓరులాగున్నారు. దండాలమ్మా!’ అంటూ వాళ్ల పనిలో పడ్డారు. తను ఆటో ఎక్కి భద్రంగా పిల్లను తీసుకు వచ్చేసింది. ఎండిన నేలపై వాన చినుకుల్లా పాప ఆగమనం తన నిర్లిప్త జీవితంలో వెలుగు నింపినట్లయింది. ఈ నెల రోజుల్లో ఎన్ని మార్పులు? శివరాం పోయాక ప్రాణం లేని కట్టెలా ఉన్న తనను అమ్మమ్మే గుండెల్లో పెట్టుకుని సేదతీర్చింది.
‘పిచ్చిదానా! పుట్టుకా నిజమే! చావూ నిజమే. రెండింటి మధ్యా జీవితం నిజమే. జనన మరణాల మీద మనకు అదుపు లేదు కానీ మధ్యలో ఉన్న జీవితాన్ని కొంచెమైనా మనకు నచ్చినట్లుగా, ఇతరులకు ఉపయోగపడేటట్లుగా చేసుకోలేమా? ఆలోచించు. మీ తాతయ్య ఉన్నదంతా హారతి కర్పూరంలాగా తగలేసినా, పదకొండు మంది పిల్లలతో నెట్టుకు వచ్చానా? ఈ బ్రతుక్కి అర్థం ఏమిటి అని ప్రాణం తీసుకుంటే...? అసలు ఆ అధికారం మనిషికి ఉందా అని. ఈ జీవితం దేవుడు మనకి ఇచ్చిన అవకాశం. వీలైనంతలో ఒకరికి చేయూత నిచ్చి సహాయం చేయగలిగితే, భగవంతుడు చేసే పరీక్షలో మనం పాసైనట్లే. శివరాం నీ జీవితంలోకి వస్తాడని గానీ, ఇంత సంపదని నీకు వదిలి అర్ధాంతరంగా పోతాడని గానీ కలలోనైనా అనుకున్నామా? అంతా విధి విలాసం. బళ్లో పాఠాలు చెప్పి పరీక్షలు పెడతారు. కాని బ్రతుకు పరీక్ష పెట్టి పాఠాలు నేర్పుతుంది. నీకంటె దురదృష్టవంతులెందరో ఉన్నారు. నిజంగా ఇబ్బందిలో ఉన్నవాళ్లెవరో కనిపెట్టి వాళ్లకు సాయం చేయగలిగితే, నీకు ఆత్మతృప్తి కలుగుతుంది. అవసరంలో ఉన్న వారిని ఆదుకోగలిగాననే సంతోషం, ఇంకా వీలైనన్ని మంచి పనులు చేయాలనే తపన, ఆరాటం. ఇదే జీవితమంటే. నీ చుట్టూ ఉన్నవాళ్లని గమనించు. మానవ సేవే మాధవ సేవ అన్నారు అందుకే. బంధుమిత్రులకు ఇచ్చి పుచ్చుకోవటం గొప్ప కాదు. అందరూ నా వాళ్లు అనుకోగల్గటమే నిస్వార్థం’ ఇలా ఎనె్నన్నో చెప్పి తనను మనుషుల్లో పడేసింది. మార్గనిర్దేశం చేసింది.
నిజంగా తలచుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. ఎక్కడ శివరాం! ఎక్కడ సామాన్యురాలైన తను! చదువు గానీ, రూపం గానీ, ఆర్థిక స్థితి గానీ అన్నీ అంతంత మాత్రమే. శివరాం చాలా అందగాడు. మంచి స్థితిపరులు. ఏరికోరి అప్సరస లాంటి అమ్మాయిని చేసుకున్నాడట. తల్లి మాత్రం ఉంది. తండ్రి పెద్ద వ్యాపారస్థుడు. ఏవో భూమి తగాదాల్లో బలై పోయాడట. డబ్బు, హోదా కోసం మనిషి పాకులాడుతాడు గానీ ఎంత ప్రమాదకరమైనది! ఏ బాధ్యతా లేని శివరాం తన అందానికి దీటుగా ఉన్న చక్కని చుక్కని పెళ్లి చేసుకుంటే, ఆమె అందినంత సొమ్ము మూట కట్టుకుని ఎవరితోనో లేచిపోయిందట. ఆ దెబ్బతో ఆడవాళ్లంటేనే అసహ్యం పెంచుకున్నాడు. తల్లి మనోవ్యాధితో మంచం పట్టింది. కొడుకుని తాడూ బొంగరం లేకుండా అలా వదిలేస్తే తను హరీ అన్నాక ఏమైపోతాడోనన్న దిగులు. ఇంట్లో ఆడదిక్కు లేకపోతే కుక్కలు చింపిన విస్తరిలా అయిపోతుంది సంసారం. శివరాం ఏమీ పట్టించుకోకుండా తాగుడికి, ఒంటరితనానికి బానిస అయ్యాడు. అలాంటి పరిస్థితిలో ధైర్యంగా నిలబడి, అదే ఊళ్లో ఉంటే గాయం రేగుతుందని ఈ ఊరు వచ్చారు. ఎవరు చెప్పారో! నెమ్మదస్థురాలనీ, గౌరవ కుటుంబమనీ, సీతమ్మగారే నడుం కట్టుకుని, తన కళ్ల ముందే ఇంట్లో ఒక ఆడదిక్కుని చూడందే ప్రాణం పోదని పోరాడి, భీష్మించుకుని, కొడుకుతో తన మెడలో మూడు ముళ్లు వేయించింది. వివరాం ముందు తను దివిటీ ముందు దీపంలాగా వెలవెలబోతుంది. అక్క అయితే పట్టలేక అనేసింది ‘తంతే గారెల బుట్టలో పడ్డట్టుగా అయిందే దీని పని! ఏ కోశానా ఆయనకి సరిపోదు. పైగా బోల్డు ఆస్థి.’
తను ఏనాడూ డబ్బుకి ఆశ పడలేదు. ఇంట్లో అమ్మకి, అమ్మమ్మకి చేసినట్లే అత్తగారికి సేవ చేసింది. నడమంత్రపు సిరి తనకేమీ ఉత్సాహాన్నీ, గర్వాన్నీ కలిగించలేదు. సీతమ్మగారు తనని ఎంతో ప్రేమగా చూసేది. శివరాం ఏనాడూ భార్య స్థానం ఇవ్వలేదు. అసలు ఇంట్లో మరో మనిషి ఉన్నట్లే పట్టించుకునేవాడు కాదు. ఎప్పుడు ఇంటికి వస్తాడో తెలీదు. వచ్చినా తన గదిలో ఒంటరిగానే ఉండేవాడు. పుస్తకాలు బాగా చదువుతాడు. తాగుడు, సిగరెట్లు. మనుషులతో కలిసేవాడు కాదు. తను అలాగే తప్పుకుని తిరిగేది. తల్లి గురించి డాక్టర్ వస్తున్నాడా లేదా, మందులు సరిగా వేసుకుంటోందా లేదా అని మాత్రం శ్రద్ధగా తెలుసుకునేవాడు. ఈ లోకంలో అతనికున్న బంధం తల్లి మాత్రమే!
‘తెల్లతోలు చూసి బోర్లా పడ్డాడమ్మా! మాయదారి శూర్పణఖ! వాడి బతుకుని పాడుచేసి పోయింది. పోనీలే!
పీడా వదిలింది. నువ్వు అడుగు పెట్టావు. నాకింక దిగులే లేదు. నెమ్మదిగా వాడిని దారిలో పెట్టుకో. పాత సంగతి ఎత్తకు. నేనెన్నాళ్లు ఉంటాను? ఈ ఇల్లు దిద్దుకోవాల్సింది నువ్వే’ అనేది.
ఏనాడూ తనకు అందం, డబ్బు, చదువు లేదన్న మాట అననే లేదు. రెండు నెలల్లో పోతుందన్న మనిషి రెండేళ్లపైగానే బ్రతికింది. డాక్టర్, కోడలు కాలుపెట్టిన వేళా విశేషం! సీతమ్మ గారికి కొండంత బలం వచ్చింది అనేవాడు శివరాంతో. అప్పుడు మాత్రం అతని మొహం ప్రసన్నంగా మారేది. తల్లి పోతూ ‘నాయనా! ఆడకూతురు మనసు కష్టపెట్టకు. నేను తీసుకువచ్చిన బంగారంరా ఆ పిల్ల! ఎంత సహనం! ఎంత నెమ్మది! అహంకారం గానీ, ఆశపోతుతనం కానీ లేనే లేదు. రెండేళ్ల నుంచి చూస్తున్నాను. అందరిలాంటి మనిషి కాదు. దాని జీవితం మోడు చేయకు నాయనా! నాకు ఆత్మశాంతి ఉండదు. ఇంటి మనిషిలా పట్టించుకో. నా మీద ఏ మాత్రం ప్రేమ ఉన్నా దానిని అభిమానంగా చూసుకో’ అని చెప్పి కన్ను మూసింది.
తల్లి పోయాక కొంచెం మారాడు శివరాం. తనతో ఏనాడూ మాట్లాడని వాడు కర్మ అయి అందరూ వెళ్లిపోయాక వచ్చి గుమ్మం అవతలే ఆగాడు. ‘ఇవి తాళాలు. ఆ అలమారలో అమ్మ నగలు, డబ్బు ఉన్నాయి. మీకు ఎంత కావాలన్నా, ఏం కావాలన్నా తీసుకోండి. ఇది అమ్మ కోరిక. మీరు ఎవరికీ లెక్క చెప్పాల్సిన పనిలేదు. ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లొచ్చు. మీకు ఇష్టమైన వాళ్లతో ఉండొచ్చు. ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. నేను గయలో, కాశీలో అమ్మ చితాభస్మం కలిపి, అలాఅలా తిరిగి ఎప్పటికి తిరిగి వస్తానో తెలీదు. నా కోసం మీరు బందీగా మారాల్సిన అవసరం ఏ మాత్రం లేదు’ అని తాళాలు గుమ్మం లోపల పెట్టి వెళ్లిపోయాడు. అమ్మమ్మ ముక్కున వేలేసుకుంది. ‘ఎంత నమ్మకమే అమ్మా నీ మీద! బంగారం లాంటి మనిషి! ఎలా నీవైపు తిప్పుకుంటావో మరి!’ అంది.
నేను అమ్మమ్మని తోడుగా ఉంచుకుని, అక్కడే ఉన్నాను. నలభై రోజుల తర్వాత తిరిగి వచ్చి నన్ను చూసి ఆశ్చర్యపోయాడు శివరాం. ఏమీ జరగనట్లే ఉన్నాడు. భోజనం వడ్డించి పక్కకు వెళ్లిపోతే ఇది వరకులా ఊరుకునేవాడు కాదు. మీరూ తినండి అనేవాడు. మెల్లగా మాట్లాడటం స్నేహితుల్లా కబుర్లు చెప్పుకోవటం మొదలైంది. పుస్తకాల గురించి అడిగే దాన్ని. ఒక్కో పుస్తకం తీసి కథ చెప్పమంటే ఎంతో ఉత్సాహంగా చెప్పేవాడు. ఆ పుస్తకంలోని పాత్రల చిత్రణ గురించి విశే్లషించేవాడు. క్రమంగా ఏకవచనంలోకి దిగాడు.
‘నీకేం కావాలన్నా బజారు వెళ్లి కొనుక్కో. నాకు తోచదు. ఎప్పుడూ ఆ పని చేయలేదు. అలాగే సినిమాలు, షికార్లకి వెళ్లే అలవాటు లేదు. నీవు వెళ్లాలంటే వెళ్లు. అభ్యంతరం లేదు. నీ వాళ్లని పిలుచుకోవాలంటే నేనేమనుకుంటానో అని ఆలోచించకు. ఇక్కడ సర్వాధికారాలు నీకు ఉన్నాయి. నీకు ఇష్టం లేకపోతే నన్నయినా వెళ్లగొట్టవచ్చు’ చిన్నగా నవ్వాడు.
‘మంచి మాటే! కూర్చున్న కొమ్మని నరికేసుకునే మూర్ఖురాలిలా కనిపిస్తున్నానా నేను?’ లేని కోపం నటించేదాన్ని.
‘మా అమ్మ మెచ్చిన మేలిమి బంగారానివి. పైపై మెరుగులకు మోసపోయిన మూర్ఖుణ్ణి నేను.’ మళ్లీ ఆ మూడ్ మార్చాలంటే కష్టమయ్యేది. ఇద్దరూ దగ్గరయ్యారు కానీ శారీరకంగా ఒకటి కాలేదు.
ఇద్దరికీ ఒకరంటే ఒకరికి అభిమానం, గౌరవం, ప్రేమ ఉన్నా ఏదో సంకోచం. ఎదుటి వాళ్లకు నచ్చుతుందో లేదో అన్న అనుమానంతో చొరవ చేయలేకపోతున్నారు. అలాగే ఆర్నెల్ల పైనే అయింది. అమ్మమ్మని వచ్చి తనతో ఉండమన్నా రానే రాదు. అక్క అప్పుడప్పుడు వచ్చి ‘ఇంకా ఏం విశేషం లేదా? మీ ఆయన మరీ ముంగిలా ఎవరితోనూ కలవడేమిటే? టచ్‌మీ నాట్ అన్నట్లుంటాడు. ఎలా కాపురం చేస్తున్నావే బాబూ!’ అని ఏదో ఒకటి అని గానీ వెళ్లదు. అక్క వచ్చిందంటే తన రూమ్‌లోంచి బయటఇకే రాడు వివరాం. అక్కే చొరవగా వెళ్లి కబుర్లు చెప్తుంది. నాలుగైదుసార్లు ట్రై చేశాక తనకే విసుగు పుట్టింది కాబోలు ‘మాట్లాడితే ముడుచుకు పోతాడేమిటే? జవాబు చెప్పడేం? నేనయితే ఇలాంటి మనిషితో ఉండేకంటే పారిపోయి ఏ సినిమా హాల్లోనో కూర్చుని సంతోషించేదాన్ని’ అనేసింది. ఈయన సరేసరి.
‘మీ అక్కగారు వస్తారని తెలిస్తే కాస్త నాకు ముందే చెప్పు ప్లీజ్! నేను వెళ్లి లైబ్రరీలో కూర్చుంటా. అసలు మీ ఇద్దరికీ పోలికే లేదేంటీ తమాషాగా! పాపం! మీ మామయ్య’ అనేవారు.
ఒకసారి అక్కయ్య ‘ఏం నగలు కొన్నావే?’ అని అడిగింది.
నాకు ఇంట్రెస్ట్ లేదక్కా అంటే ‘ఏడిసినట్లుంది. బోలెడు డబ్బు! చీరలు, నగలన్నా కొనుక్కోకుండా ఉప్పు పాతర వేసుకుంటావా? కట్టిన చీరలే కట్టి చిరిగే వరకు వదలవు. ఇద్దరూ సరిపోయారు. ఆయనకు మనుషులంటే గిట్టదు. నీకేమో ఏ సరదా లేదు. ఇసుక తక్కెడా పేడ తక్కెడా!’ అనేసింది. తనకు నవ్వు వచ్చింది. హాయిగా ఉండటం అంటే చీరలు, నగలూ ధరించటమా?
కాస్త మనసు విప్పి మాట్లాడుకుంటూ దగ్గరైన మమ్మల్ని చూసి విధికి కన్ను కుట్టిందేమో! లైబ్రరీ నుండి బుక్స్ తెచ్చుకుంటున్న శివరాంని లారీ మింగేసింది. నమ్మలేని నిజం! కఠిన శిలలా మారిపోయి, కన్నీళ్లను కూడా మర్చిపోయిన తనను అమ్మమ్మ గుండెల్లో దాచుకుంది. తనెందుకు బ్రతకాలి? ఎవరి కోసం? ఏనాడూ గొంతెమ్మ కోర్కెలు కోరలేదు. చిన్నప్పటి నుండి దేనికీ ఆశపడలేదు. ఒక్క చదువుకోవాలన్న తపన తప్ప. అదీ తీరలేదు. ఆస్థి, అంతస్థు కోసం ఏనాడూ కోరుకోలేదు. ఏమిటీ విచిత్రం స్వామీ! అడిగింది. ఇవ్వవు. అక్కర లేనిది ఇస్తావు. అంటే ఏమీ ఆశ పెట్టుకోవద్దు. లభించిన దానితో తృప్తిపడటం అనేగా అర్థం! జీవిత భాగస్వామిని ఇచ్చినట్లే ఇచ్చి ఏ ముచ్చటా తీరక ముందే తీసేసుకున్నావు. ఇంక ఏం చూసుకుని జీవించాలి? రాత్రిళ్లు ఇంటి కప్పు కేసి చూస్తూ అది కూలిపోయి తను చచ్చిపోతే ఎంత బాగుండును! భూమి చీలిపోయి తను అందులో కూరుకుపోతే ఎంత బాగుంటుంది? ఎవరికి ఏం అపకారం చేసిందని ఇప్పుడు తన బ్రతుక్కు ఆలంబనే లేకుండా చేసేడు దేవుడు! అందుకే శిలారూపం దాల్చాడేమో! ఎవరికీ ఏమీ సమాధానం చెప్పనక్కర లేదుగా! అనుకునేది.
అమ్మమ్మ కంటికి రెప్పలా కాపాడింది. ఒక్క నలుసయినా ఉంటే దానికి జీవితం గడిచిపోయేదని. అమ్మ ఏడుస్తుంటే ‘హు! చెప్పావులే గొప్ప మాట! నాకు ఏడుగురు కొడుకులుండి ఏం ఉద్ధరించారేం! కంటేనే పిల్లలా? భగవంతుడికి దాని మీద దయ ఉండబట్టే బంధాలు లేకుండా చేశాడు. సంసారంలో పడి ఇది నా ఇల్లు, నా వాళ్లు అన్న స్వార్థంతో కొట్టుకుంటూ, పరమార్థం లేకుండా గడ్డివాములో కుక్కలా బ్రతకమనా నీ ఉద్దేశం? ఛాల్లే!’ అని కసిరేసింది.
నా పిల్లల్ని దగ్గరుంచి చదివిస్తే నీకూ ఒంటరితనం ఉండదే అని సలహా ఇచ్చిన అక్కనూ, వ్యాపారంలో పెట్టి నీ డబ్బుని రెట్టింపు చేస్తానక్కా అని వచ్చిన తమ్ముణ్ణి జేరనివ్వలేదు అమ్మమ్మ. దాని దురదృష్టం మీకు అంటుకుంటుంది. అలాంటి పితలాటకాలేం పెట్టొద్దని గట్టిగా చెప్పింది. అక్కసుకొద్దీ నువ్వింకా ఎనే్నళ్లు ఉండబోయావు? ఒంటరిగా దిక్కులేని చావు రాసి పెట్టి ఉంది దానికి’ అని కసి తీరా తిట్టి వెళ్లారు. బాధపడుతున్న తనను దగ్గరకు తీసుకుని ఓదార్చింది.
‘పిచ్చిదానా! నీటితో నిండిన తటాకంలో కప్పలు తెప్పలుగా జేరతాయని శతకకారుడు ఎప్పుడో చెప్పాడు. బంధుమిత్రులకు ఇచ్చుకోవటం, పుచ్చుకోవటం కాదమ్మా పేరు తెచ్చి పెట్టేది. ఇచ్చినంత కాలం పొగడుతారు. చేయి విదిలించలేదో తిట్టిపోస్తారు. ఈ లోకంలో ఎందరో రెండు పూటలా తిండి లేనివాళ్లున్నారు. ఒంటి మీద తప్ప మరో గుడ్డ లేనివాళ్లున్నారు. పిల్లలు పట్టించుకోని వృద్ధులు ఉన్నారు. కామానికో, మోసానికో లోబడి కని పారేసే పసిగుడ్డులు ఎందరో! నిజమే! అందరికీ మనం సాయం చేయలేం. కంటేనే పిల్లలు కాదు. అలా అనుకుంటే మదర్ థెరెసా ఇంత చేయగలిగేదా? తమ దేశం, భాష కాని ప్రాంతానికి వచ్చి అనాథలను ఆదుకుని అందరికీ మదర్ అయింది. నాది, నా వాళ్లు అన్న మాట మర్చిపో. నీకు ఉన్న దానిలో అవసరంలో ఉన్న వాళ్లకు అజ్ఞాతంగా సేవ చేయగలిగితే... నీ జీవితం ధన్యమైనట్లే. ఆకలితో ఉన్న వాళ్లకు అన్నం పెట్టగలిగితే అన్నపూర్ణవవుతావు.. చదువుకోవాలనే నీ కోరిక తీరలేదని బాధపడకు. అర్హులైన పిల్లలు ఇద్దరు ముగ్గురికైనా నీవు సాయం చేయి. సరస్వతీ దేవిలా నిన్ను కొలుస్తారు వాళ్ల హృదయంలో. ఆ తృప్తికి ఏదీ సాటి రాదమ్మా! భగవంతుడు ఈ విధంగా నీకు నలుగురికీ సాయపడే అవకాశం ఇచ్చాడు అనుకో. నీకేం బిరుదులు రావాలనో, పదవులు కావాలనో కోరిక లేదుగా! ఇంత ఇల్లుంది. ఒక గదిలో నాలుగు కంప్యూటర్లు పెట్టి ఉచితంగా శిక్షణ ఇవ్వవచ్చు. ఈ రోజుల్లో అందరికీ అది ఉపయోగించటం రావాలి కదా! అంత డబ్బు పెట్టి కొనుక్కోలేరు కదా అందరూ. అలాగే ఇది ఎలక్ట్రానిక్ యుగం. ఆ వస్తువులు రిపేరు చేయటం ఎలాగో ఫ్రీగా నేర్పిస్తామని ప్రకటన ఇవ్వు. ఎందరికో జీవనోపాధి అవుతుంది ఆ విద్య. అందరూ డాక్టర్లూ, ఇంజనీర్లే కావాలని లేదుగా, సామాన్యులకు అందుబాటులో ఉండేట్లు, రెండు పూటలా కడుపు నింపుకోగలిగేట్లు ఉపాధి కల్పించు. చదువు రాని గృహిణులకు వారివారి అభిరుచిని బట్టి, కుట్టుమిషన్ నేర్పించటం, పచ్చళ్లు మిక్చర్లు చేయించటం వగైరాల్లో శిక్షణ ఇప్పించు. చేయాలని నీవు తలచుకుంటే ఎన్నో చేయవచ్చు. ఎందరికో ఎన్నో విధాల సహాయపడవచ్చు. జీవిత కాలం చాలదు. లే! ముందడుగు వెయ్యి. మొదలుపెడితే క్రమంగా అందరూ కలిసి వస్తారు. ఉచితంగా నేర్పిస్తే చాలా మందికి ఆధారం అవుతాయి ఏ విద్య అయినా. ‘నేను’ అన్న మాట మర్చిపో. ‘మనం’ అని నలుగురిలో కలిసిపో’ అమ్మమ్మ అప్పుడప్పుడు చెప్పిచెప్పి తన జీవితానికే ఒక అర్థం కల్పించింది.
ఇప్పుడు అమ్మమ్మ లేదు. కాని ఆమె ఇచ్చిన స్ఫూర్తితోనే శివరాం కంప్యూటర్స్... ఉచిత శిక్షణా కేంద్రం, అమ్మమ్మ పేరిట ‘దేవకీ ఫుడ్స్’ అని కారం, స్వీట్స్ వండించి పొట్లాలు అమ్మించటం, తన అత్తగారి పేరిట ‘సీతమ్మ స్టిచింగ్ సెంటర్’ అని కుట్టుమిషన్ శిక్షణా కేంద్రంలో ఉచితంగా కుట్లు నేర్పిస్తుంది. నలుగురు టీచర్లను పెట్టి, ఆర్థికంగా చితికిపోయిన వాళ్లను సెలెక్ట్ చేసి, వారికి జీవనోపాధి కల్పిస్తోంది ఈ విధంగా. తను చదువులో శ్రద్ధ ఉన్నా కాలేజీలో చదువుకోగల్గిన పరిస్థితులు లేవు చిన్నప్పుడు. ఇప్పుడు భర్త పేరు మీద ఇద్దరు పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్ ఏర్పాటు చేసింది. ఆ పని మీద వెళ్లి వచ్చేటప్పుడే ఈ బంగారు పాపాయి కనిపించింది.
ముద్దుగా పాపను నిమిరింది. అరవయ్యేళ్లు దగ్గర పడుతున్నాయి తనకు. ఇప్పుడు ఈ బాధ్యత మోయగలదా? సందేహం మనసును డోలాయమానం చేసింది. అంతలోనే ధైర్యం అమ్మమ్మలాగా వెన్నుతట్టి ప్రోత్సాహం ఇచ్చింది. అవును. నేనీ పాపకు అమ్మమ్మనౌతాను. నా తదనంతరం నేను మొదలుపెట్టిన ఈ సంస్థలన్నీ సాగటానికి దైవం ఇచ్చిన దీపం ఈ పాపాయి. దీప్తి అని పేరు పెడతాను. ఆయన వదిలిపోయిన ఆస్థిని సద్వినియోగం చేసి ఆయన ఆత్మకు నివాళి ఇస్తాను. స్థిరచిత్తంతో గోడ మీద కేలండర్‌లో చిరునవ్వు చిందిస్తున్న శ్రీనివాసునికి రెండు చేతులూ జోడించింది పార్వతమ్మ. నాకు శక్తినిచ్చి అడుగడుగునా కాపాడు తండ్రీ!’ అని వేడుకుంది.
========================================================
కథలకు ఆహ్వానం
‘ఆదివారం ఆంధ్రభూమి’కి
కథలు పంపవలసిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 500 003.
పీడీఎఫ్ ఫార్మాట్‌లో sundaymag@andhrabhoomi.net కు మెయల్‌లో పంపాలి.

ఉదయశ్రీ.. 8332902825