కథ

గది నెం: 342

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ కథ 1889లో గ్రేట్ ఎగ్జిబిషన్ సమయంలో పారిస్ పోలీస్ ఆర్కివ్స్ నుంచి సేకరించింది. నిజానికి ఈ కథను చాలామంది రచయితలు ఇప్పటికే చెప్పారు. అయితే ఇపుడు అదే కథను సంభాషణా విధానంలో సాగుతుంది. కథ ఆరంభం బొంబాయి పట్టణంలో జరిగింది. అక్కడే కెప్టెన్ డే చనిపోయాడు. ఆయన నార్య, పదిహేడేళ్ల కూతురు ఇండియాలోనే ఉండిపోయారు. - ఆర్థర్ ఎం.జెనె్సన్
* * *
మిసెస్ డే: మొత్తానికి ఓ శుభవార్త అందిందమ్మా. ఇవాళ ఆఫీసర్స్ మెస్‌లో లంచ్‌కి వెళ్లిన సంగతి తెలుసుగా. అక్కడ కలిసిన జనరల్ మాటల మధ్యలో మన ఇంటినీ, సామాన్లనీ అతని అసిస్టెంట్ తీసుకోవడానికి ఉత్సాహపడుతున్నాడని అన్నారు.
మిస్ డే: చాలా ఆనందంగా ఉందమ్మా. నేనూ అదే అనుకుంటున్నాను. మన సామాను ఇంగ్లండ్‌కి మోసుకెళ్లడం దేనికా అని. నువ్వెప్పుడూ నాన్న గురించిన ఆలోచనల్లోనే ఉంటున్నావు. సామాన్లను ఇక్కడ వదిలేసి వెళుతున్నందుకు సంతోషంగా ఉంది. ఎప్పుడు చూసినా నాన్న డెస్క్ దగ్గరే చదువుతూనో, రాస్తూనో కనపడుతుంటావు. చాలా బాధగా ఉంటోంది.
మిసెస్ డే: నిజమే జోన్, కానీ సెంటిమెంటల్‌గా అవన్నీ ఎంత విలువయినవో నువ్వు అర్థం చేసుకోవాలి.
మిస్ డే: నేను అర్థం చేసుకున్నానమ్మా. కానీ మనం ఇంగ్లండ్ తిరిగి వెళ్లి కొత్తగా మళ్లీ జీవితం ఆరంభించాలి. ఇవేమీ లేకుండా ఇంతకన్నా మంచి జీవనం సాగించాలి.
మిసెస్ డే: నిజమే. అంతకంటే ముందుగా, ఇంగ్లండ్ చేరుకోగానే ముందు పారిస్‌కి వెళ్లి నాన్న ఆస్తి తాలూకు కాగితాలను సంపాదించుకోవడం ఎంతో అవసరం.
మిస్ డే: అమ్మా. ఓ మంచి ఆలోచన. మెర్సిలెస్‌కి చాలా బోట్స్ వెళుతుంటాయి. మనం బోట్‌లో మెర్సిలెస్‌కి వెళ్లి అక్కడి నుంచి రైల్లో పారిస్ వెళ్లవచ్చు. అక్కడి పని చూసుకుని మనం ఇంగ్లండ్ వెళ్లిపోవచ్చు. ఏమంటావ్?
మిసెస్ డే: బ్రహ్మాండం. జోన్. అయితే ఉదయమే షిప్పింగ్ కంపెనీకి వెళ్లి మెర్సిలెస్‌కి వెళ్లే బోట్ గురించి కనుక్కుని వస్తాను.
వారం రోజుల తరువాత మెర్సిలెస్‌లో..
మిసెస్ డే: పారిస్‌లో హోటల్ వసతి గురించి కాస్తంత కంగారుగా ఉంది జోన్. ఎందుకంటే ఎగ్జిబిషన్ సందర్భంగా ప్రపంచ దేశాలన్నిటి నుంచి జనం పారిస్ చేరుతున్నట్టు పత్రికల్లో వార్తలు వచ్చాయి. నాకింకా గుర్తు. మా పెళ్లయిన కొత్తల్లో ఒకసారి నాన్న, నేను క్రిల్లాన్‌లో బస చేశాం. అందువల్ల పోస్ట్ఫాస్‌కి వెళ్లి మనకు డబుల్ రూమ్ కావాలని టెలిగ్రామ్ ఇస్తే బాగుంటుంది. మహా అయితే అక్కడ ఉండేది ఒకటి రెండు రాత్రులే గదా! ఎగ్జిబిషన్‌లో నువ్వు చూడ్డానికి చాలానే ఉంటాయి. కానీ కొద్ది రోజులుగా నాకు ఆరోగ్యం అంతగా బాగోలేదు. అందువల్ల ఎక్కువ రోజులు అక్కడ ఉండలేమేమో.
మిస్ డే: అలాగయితే, వీలయినంత త్వరగా ఇంగ్లండ్ వెళ్లడమే మంచిది. అక్కడి గ్రామీణ వాతావరణంలో త్వరలోనే నీ ఆరోగ్యం తప్పకుండా కుదుట పడగలనిపిస్తోంది. పారిస్ చూడ్డానికి మరో అవకాశం రాకపోదు. స్వదేశం చూడాలనే నాకు ఎంతో ఆత్రుతగా ఉంది. నువ్వు, నాన్న వచ్చిన ప్రాంతం ఎంత బాగుంటుందో చూడాలని ఆరాటంగా ఉంది. ఇప్పుడు నువ్వూ ఇంగ్లండ్‌కి త్వరగా వెళ్లాలని ఆత్రుత పడుతున్నావు.
ఇరవై నాలుగు గంటల తర్వాత...
మిసెస్ డే: మనం కొద్ది నిమిషాల్లో గారె డి నియాన్ (పారిస్‌లో పెద్ద స్టేషన్) చేరుకోబోతున్నాం. క్రిల్లాన్‌లో మనకు ఓ గది లభించే అవకాశం ఉందనే భావిస్తున్నాను. ఇంతటి అలసట గతంలో ఏ ప్రయాణంలోనూ అనుభవించలేదు. గది చేరగానే వెంటనే కొద్దిసేపన్నా పడుకోవాలనుంది.
మిస్ డే: పిచ్చిదానా, నువ్వు నిజంగానే చాలా అలసిపోయావన్నది చూస్తేనే తెలుస్తోంది. కానీ క్రిలాన్‌లో గది దొరక్కపోతే, మరోచోటయినా గది దొరకవచ్చు. పారిస్‌లో లెక్కలేనన్ని హోటల్స్ ఉన్నాయి గదా. మనం ఇపుడు స్టేషన్‌లోకి వెళుతున్నాం. (మరి కొన్ని నిమిషాల తర్వాత) అమ్మా, మనం అదృష్టవంతులం. మన షిప్పింగ్ కంపెనీ పేరున్న టోపీతో ఉన్న మనిషిని ఒకరిని ఇప్పుడే చూశాను. క్రిలాన్‌లో మనకు గది దొరక్కపోతే, అతను మనకు వేరే బస చూస్తాడేమో. హలో సార్, మాకు సహాయం చేయగలరా? (అతన్ని పిలుస్తుంది)
షిప్పింగ్ కంపెనీ మనిషి: తప్పకుండా మేడమ్. మీకు ఏ విధంగా సహాయపడగలను?
మిస్ డే: మెర్సిలెస్ దగ్గర మీ పడవల్లోనే వచ్చాం. పారిస్ నుంచి ఇంగ్లండ్ ప్రయాణమయ్యాము. మాకు డబుల్ రూమ్ కావాలని మెర్సిలెస్ నుంచి క్రిలన్‌కు వైర్ ఇచ్చాము. ఒకవేళ, అక్కడ కుదరకపోతే మీరు మరో బస చూడగలరా?
షిప్పింగ్ కంపెనీ మనిషి: తప్పకుండా మేడమ్. నేనే వచ్చి డ్రైవర్‌కి ముందుగా క్రిలాన్ తీసికెళ్లమని చెప్తాను. అక్కడ గది లభ్యం కాకుంటే, ఆ తర్వాత మీకు ఒక గది చూస్తాను.
మిస్ డే: చాలా థాంక్స్. ఎంతో రుణపడి ఉంటాము.
షిప్పింగ్ కంపెనీ మనిషి: సంతోషం. అన్నట్టు మీ సామాను చూపించండి. పోర్టర్‌ని పిలుచుకు వస్తాను. ఆ తర్వాత కాబ్ దగ్గరికి మీరు వద్దురుగాని.
క్రిలన్‌లో కొద్ది నిమిషాల తరువాత...
మిస్ డే: నా పేరు మిస్ డే. ఈమె మా అమ్మగారు మిసెస్ డే. మేము డబుల్ రూమ్ కావాలని మీకు మెర్సిలెస్ నుంచి టెలిగ్రామ్ పంపాము.
హోటల్ క్లర్క్: అవును మేడమ్. మీరు ఎంతో అదృష్టవంతులు సుమా. అన్ని గదులూ నిండిపోయాయి. కానీ ఇప్పుడే ఒక పెద్దమనిషి తను రావడం లేదని టెలిగ్రామ్ ఇచ్చాడు. ఆయన సింగిల్ రూమ్ బుక్ చేశారు. కావాలంటే అదనంగా ఓ బెడ్ ఏర్పాటు చేయగలను. ఏమంటారు?
హోటల్ బెడ్‌రూమ్‌లో...
మిస్ డే: హమ్మయ్య. మొత్తానికి ఇక్కడికి చేరుకున్నాం. ఇంతవరకూ అన్ని అనుకున్నట్టే జరిగాయి. రేపు ఉదయం వెళ్లి నాన్న ఆస్తి తాలూకు కాగితాలు సంతకం చేసి వద్దాం. ఆ వెంటనే రైల్లో ఇంగ్లండ్ వెళిపోదాం. మనం ఇప్పుడు ఇంగ్లండ్‌కి దగ్గరలోనే ఉన్నందుకు ఎంతో ఆనందంగా ఉందమ్మా. చక్కని ఇంగ్లండ్ గ్రామీణ ప్రాంతానికి త్వరలో చేరబోతున్నాం. ఎంత త్వరగా చేరుకుంటామా అన్న ఉత్సుకతతో ఉన్నాను. సరే, మనం రెడీ అయి డిన్నర్‌కి కిందకి వెళదాం.
మిసెస్ డే: నేను నీతో డిన్నర్‌కు రాకుంటే నన్ను క్షమిస్తావనుకుంటా జోన్. నాకు చాలా అలసటగా ఉంది. ఏమీ తినలేను. కిందకు రెస్టారెంట్‌కి వచ్చి ఆ జనంలో ఉండలేను.
మిస్ డే: సరే అయితే. నేను డ్రెస్ మార్చుకుని రెస్ట్‌రెంట్‌కి వెళతాను.
మర్నాడు ఉదయం...
మిస్ డే: హాల్లో గుడ్‌మార్నింగ్ అమ్మా, రాత్రి బాగా నిద్ర పట్టిందనుకుంటా.
మిసెస్ డే: గుడ్ మార్నింగ్ జోన్. అంత బాగా నిద్రపట్టలేదనే అనాలి. బాగా అలసిపోతే, నిద్ర అంత సుఖంగా ఉండదు.
మిస్ డే: అవునా, అయ్యో! బ్రేక్‌ఫాస్ట్ చేద్దాం.. బాయ్‌ని పిలుస్తాను.
కొద్ది నిమిషాల తర్వాత ఓ ట్రేతో మెయిడ్ వచ్చింది.
మిస్ డే: అమ్మా, అదుగో టీ వచ్చేసింది. చూడ్డానికి ఇండియాలో లాగా టీ స్ట్రాంగ్‌గా కనిపించడం లేదు. కానీ ఫ్రెంచ్ టీ గురించి నేను ఊహించిన దానికంటే నయమే.
మిసెస్ డే: థాంక్యూ మరీ దారుణంగా అయితే లేదు.
మిస్ డే: తాగి చూడు. నీకు మంచిది. తాగిన తర్వాత ఆ కాగితాల గురించి ఆలోచిద్దాం.
మిసెస్ డే: ఇప్పుడే వెళ్లాలని అనిపించడం లేదు. మధ్యాహ్నం దాకా లేదా రేపు ఉదయం దాకా వేచి చూద్దాం. ఆ కాగితాలు ఉన్న వ్యక్తి నువ్వు వెళ్లి, అతను ఇక్కడికి రాగలుగుతాడేమో తెలుసుకో. అదే మంచిదనిపిస్తోంది. రేపటికి నాకు ఓపిక వస్తుందనే నమ్మకం. ఆ తర్వాత మన చివరి గమ్యానికి వెళ్లవచ్చు కూడా, ఏమంటావ్?
మిస్ డే: సరే అమ్మా. అతను దొరుకుతాడేమో చూసి వస్తాను. ముందు నేను హోటల్ డాక్టర్‌ని పిలుచుకు వస్తాను.
కొంతసేపటి తర్వాత. తల్లీ కూతుళ్లు తమ గదిలో మాట్లాడుకుంటున్నారు...
మిస్ డే: మేనేజర్ ఆఫీస్ గదిలో ఉన్నాడు. డాక్టర్‌ని మన గదికే పంపుతానన్నాడు.
అప్పుడే తలుపు కొట్టిన శబ్దం..
మిస్ డే: డాక్టర్ వచ్చాడనుకుంటా. వెళ్లి తలుపు తీస్తాను.
డాక్టర్: గుడ్‌మార్నింగ్ మేడమ్. నా పేరు డాక్టర్ డుపాంట్. మీ అమ్మగారికి బాగోలేదని మేనేజర్ చెప్పాడు.
మిస్ డే: గుడ్‌మార్నింగ్. డాక్టర్ డుపాంట్. లోపలికి రండి. పిలిచిన వెంటనే వచ్చినందుకు థాంక్స్. ఈమె మా అమ్మగారు మిసెస్ డే.
డాక్టర్: గుడ్‌మార్నింగ్ మేడమ్. మీలాగా చక్కటి ఇంగ్లీష్ నేను మాట్లాడలేను. నన్ను క్షమించాలి. ముందుగా మీ టెంపరేచర్, పల్స్ పరీక్షిస్తాను. తర్వాత కొన్ని ప్రశ్నలకు సమాధానం చెబుదురుగా...
ఓ రెండు నిమిషాల తరువాత...
డాక్టర్: మీరు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకోవచ్చునా?
మిసెస్ డే: నా భర్త మరణానంతరం నేను, మా అమ్మాయి బొంబాయి నుంచి పారిస్‌కు పని మీద వచ్చాం. మెర్సిలెస్ నుంచి నిన్న సాయంత్రమే ఇక్కడికి చేరుకున్నాం.
డాక్టర్: మీరు చాలా అలసిపోయినట్టు తెలుస్తున్నది. మీకు ఆకలి కూడా లేనట్టు ఉంది?
మిసెస్ డే: అవును డాక్టర్. నిజం చెప్పాలంటే ఈ ఉదయం అస్సలు లేవలేని పరిస్థితి.
డాక్టర్: అవును మేడమ్. బాగా అలసిపోయిన వారికి ఆకలి ఉండదు. నేను మందులు తెప్పిస్తాను. రేపు మళ్లీ వస్తాను. మీరు నాతో వస్తారా? (మిస్ డేని ఉద్దేశించి)
కిందకి వెళ్లాక...
డాక్టర్: ఆమె పరిస్థితి కొంత సీరియస్‌గానే ఉంది మేడమ్. రేపు ఇంగ్లండ్ ప్రయాణం చేయడానికి ధైర్యం చేయకండి. మీ అమ్మగారిని వెంటనే ఆస్పత్రిలో చేర్పించడం మంచిది. అందుకు అన్ని ఏర్పాట్లు చేస్తాను. కానీ మేడమ్ మీరు మా ఇంటికి వెళ్లి మీ అమ్మగారికి మందు పట్టుకు రావాలి. సారీ, మా ఇల్లు పారిస్‌కు అవతలి వేపు ఉంది. మా ఇంటికి టెలిఫోన్ సౌకర్యమూ లేదు. మీకు ఏ మందు ఇవ్వాలన్నది నా భార్యకు చీటీ రాసి ఇస్తాను.
మిస్ డే: డాక్టర్, అంత దూరంలోని మీ ఇంటికి వెళ్లి తేవడం కంటే ఇక్కడ దగ్గర్లో కెమిస్ట్ నుంచి తేవచ్చునేమో గదా?
డాక్టర్: మేడమ్ ఇది నేను తయారుచేసిన ప్రత్యేకమయిన మందు. నన్ను నమ్మండి. నేను నా భార్యకు చీటీ రాసి ఇస్తాను. నా ఇంటికి వెళ్లి మందు తీసుకుని, మళ్లీ తిరిగి రావడానికి క్యాబ్ కూడా ఏర్పాటు చేస్తాను.
ఆ అమ్మాయికి ఆ చీటీ ఇచ్చి క్యాబ్ డ్రైవర్‌కి ఎలా వెళ్లి రావాలో డాక్టర్ ఆదేశించాడు. అమ్మాయికి ఎంతో గాభరాగా ఉంది. ఎంతో అసహనంగా ఉంది. దానికి తోడు క్యాబ్ రోడ్డు వెంట మరీ నెమ్మదిగా పోతోంది. డాక్టర్ ఇల్లు పారిస్ మరో చివార్న ఉందన్నది ఆమెకు గుర్తుంది. క్యాబ్ వెళ్లడాన్ని పరిశీలించినప్పుడల్లా అది వేరే దారిలో వెళుతున్న అనుమానం పీడిస్తోంది. కిటికీలోంచి తొంగి చూసింది. క్యాబ్ నిజంగానే తాను అంతకు ముందు వచ్చిన దారిలోకే మళ్లీ వెళుతోందన్నది అర్థమయింది. ఎట్టకేలకు క్యాబ్ ఓ ఇంటి ముందు ఆగింది. అమ్మాయి పరుగున దిగి వెళ్లి ఆ ఇంటి బెల్ నొక్కింది. చాలా సేపటికి తలుపు తెరుచుకుంది.
మిస్ డే: గుడ్‌మార్నింగ్! నా పేరు మిస్ డే. డాక్టర్ డూపాంట్ మీకు ఈ చీటీ ఇమ్మన్నారు.
మిసెస్ డూపాంట్: గుడ్‌మార్నింగ్ మేడమ్. లోపలికి వచ్చి కూర్చోండి. నేనే మిసెస్ డూపాంట్. మా ఆయన ఏం రాసి పంపారో చూస్తాను. (ఆమె ఆ చీటీ చదివి) ఆయన చెప్పిన పని చేస్తాను. కానీ ఆ మందు తయారీకి ఎంతో సమయం పడుతుంది. అది సిద్ధమయ్యే వరకూ వేచి ఉండండి.
వేచి ఉండడానికి అంతే లేకుండా పోయింది. చాలాసార్లు ఆమె కుర్చీలోంచి లేచి అటూ ఇటూ పచార్లు చేసింది. ఒక్కోసారి అసలా మందు సంగతి వదిలేసి తల్లి దగ్గరకు పరుగున వెళ్లాలనిపించింది. అయినా తప్పని పరిస్థితి గనుక ఓపిక పట్టింది. చిత్రంగా ఇంట్లో ఓ గదిలో ఫోన్ మోగడం ఆమెను ఆశ్చర్యపరిచింది. ఇంట్లో ఫోన్ లేదని డాక్టర్ చెప్పడం గుర్తుకు వచ్చింది. సహనం కోల్పోయింది. ఆస్పత్రిలో తల్లి ఎలా ఉందా అని తలచుకుంటే, ఏడుపు వస్తోంది. మొత్తానికి మరి కొంతసేపటికి మందు తయారయింది. దాన్ని పట్టుకుని పరుగున క్యాబ్ దగ్గరకు వెళ్లింది. ఈసారి క్యాబ్ వాడు మరీ నెమ్మదిగా నడుపుతున్నాడు. నగరం మధ్యకు చేరగానే డ్రైవర్ క్యాబ్‌ను ఒక హోటల్ దగ్గర ఆపేశాడు. అది ఆమెకు బొత్తిగా తెలియని ప్రాంతం. ఏదో జరగబోతోందన్న అనుమానం, భయం ఆమెను పట్టుకున్నాయి. కొద్ది దూరంలో ఒక యువకుడు కనిపించాడు. అతని దుస్తుల వాలకం చూస్తే అతను ఇంగ్లీషు వాడిలా అనిపించాడు. అంతే ఆమె వెంటనే క్యాబ్ నుంచి దూరి అతని దగ్గరకు వెళ్లింది.
మిస్ డే: క్షమించండి. పరిచయం లేకున్నా మీ వద్దకు వచ్చాను. మీరు ఇంగ్లీషు వారేనా?
ఆగంతకుడు (గౌరవంగా): అవును నేను ఇంగ్లీష్ వాడినే. మీరేదో ఆందోళన పడుతున్నట్టున్నారు. నేనేమయినా సహాయం చేయనా?
మిస్ డే: నా పేరు మిస్ డే. నేను, మా అమ్మగారు క్రిలాన్‌లో ఉంటున్నాం. ఈ ఉదయం ఆమెకు అనారోగ్యం చేయడంతో హోటల్ డాక్టర్‌ను పిలిపించాను. ఆమెకు సీరియస్‌గా ఉందని అన్నాడు. పారిస్ అవతల వేపు ఉన్న తన ఇంటికి వెళ్లి మందు తీసుకురమ్మని పంపించాడు. అసలేం జరుగుతోందో అర్థం కావడంలేదు. డాక్టర్ ఈ డ్రైవర్‌కి ఆదేశాలిచ్చినా వీడు చాలా నెమ్మదిగా తీసికెళ్లాడు. అదీ మేము చాలాసార్లు తిరిగిన దారుల్లోనే తీసుకెళ్లాడు. డాక్టర్ ఇంటి దగ్గర మందు కోసం ఎన్నో గంటలు వేచి ఉన్నాను. తన ఇంట్లో ఫోన్ లేదని డాక్టర్ చెప్పాడు. కానీ నేను వేచి ఉన్నప్పుడు పక్క గదిలో ఫోన్ మోగడం విన్నాను. ఇపుడు తిరుగు ప్రయాణంలో డ్రైవర్ మరీ నెమ్మదిగా తీసికెళుతున్నాడు. క్రిలాన్‌కు తీసికెళ్లాల్సింది ఇక్కడకు తెచ్చాడు. నాకేం అర్థం కావడంలేదు. ఏదో భయంగా ఉంది.
ఆగంతకుడు: నా పేరు జాన్ బేట్స్. నేను ఇక్కడి ఎంబసీలో జూనియర్ అసిస్టెంట్‌ను. మీరు చెప్పింది చాలా వింతగా ఉంది. మీరు క్రిలాన్ చేరే వరకు మీ వెంట వస్తాను.
క్రిలాన్‌లో వారు రూమ్ నెం.342 తలుపు తాళం పెట్టి ఉండడం చూశారు. వెంటనే కిందకి క్లర్క్ దగ్గరకు వెళ్లారు.
మిస్ డే: మా గది తాళాలు ఇస్తారా, ప్లీజ్?’
క్లర్క్: మేడమ్, మీరు ఎవరిని కలవాలనుకుంటున్నారు?
మిస్ డే: నిన్న రాత్రి నేను, మా అమ్మగారు గది బుక్ చేసుకున్నాం. గది నంబర్ 342. ప్లీజ్ తాళాలు ఇవ్వండి.
క్లర్క్: కానీ, మీరేదో పొరపాటు పడుతున్నారు మేడమ్. నిన్న సాయంత్రం మీరిక్కడికి వచ్చే అవకాశమే లేదు. మరేదో హోటల్ అయి ఉంటుంది. అవును రూమ్ నంబర్ ఎంత అన్నారు?
మిస్ డే: నంబర్ 342.
క్లర్క్: కానీ మేడమ్ ఆ గది ‘లీ’ అనే ఆయన తీసుకున్నారు. మా హోటల్‌లోనే ఆయన ఎక్కువ బస చేస్తుంటారు. ఆయన మాకు ఎంతో మంచి స్నేహితుడు.
మిస్ డే: కానీ నిన్న సాయంత్రం నేను, మా అమ్మగారు వచ్చి రూమ్ బుక్ చేసుకున్నాం. నిన్న ఇక్కడున్నవారు మీ రిజిస్టర్‌లో రాసుకున్నారు. కావాలంటే పరిశీలించండి.
క్లర్క్: సరే అలాగే చూద్దాం. కానీ మేడమ్ నాకు బాగా తెలుసు. మీరు ఇక్కడ రిజిస్టర్ చేసి ఉండరని.
అంతకు ముందు రోజు రిజిస్టర్‌ను ఆమె చాలాసార్లు పరిశీలించింది. కానీ అందులో ఆమె, ఆమె తల్లిగారి పేరు గానీ ఎక్కడా లేవు.
క్లర్క్: మేడమ్ మీకు సంతృప్తేనా?
మిస్ డే: కానీ నాకు బాగా గుర్తుంది. ఇక్కడ నిన్న పేపర్లు సంతకం చేయించుకున్న వ్యక్తి ఉంగరం ఎర్రని ఎరుపు రాయి కలిగి ఉంది. నాకు బాగా గుర్తు.
క్లర్క్: కానీ జీవితంలో నేనెప్పుడూ అది చూడలేదు. మేడమ్ ఆరోగ్యం సరిగా లేనట్టుంది. పైగా ఇవాళ బాగా ఎండగానూ ఉంది.
మిస్ డే: ఈ ఉదయం మా అమ్మగారి ఆరోగ్యం బాగోలేదు. మేనేజర్ ద్వారా డాక్టర్‌ని పిలిపించాను. మీ మేనేజర్, డాక్టర్ నన్ను గుర్తు పడతారేమో, మీ మేనేజర్‌ని పిలుస్తారా?
క్లర్క్ (తిరస్కార స్వరంతో): మేడమ్, మీకు సహాయపడగలదంటే, అలానే పిలుస్తాను.
కొంతసేపటికి మేనేజర్‌తో క్లర్క్ తిరిగి వచ్చాడు. అతను ఆమెను గుర్తంచలేదు.
బేట్స్ (మిస్ డేతో): మీ అమ్మగారిని పరీక్షించిన డాక్టర్ మిమ్మల్ని గుర్తించగలడేమో? (మేనేజర్‌తో) అన్నట్టు నా పేరు జాన్ బేట్స్. ఇక్కడి బ్రిటీష్ ఎంబసీలో సెక్రటరీని. మీ డాక్టర్‌ని పిలిపించండి.
ఇరవై నిమిషాల తరువాత డాక్టర్ వచ్చాడు.
డాక్టర్: మీరేనా నన్ను కలవాలనుకున్నది. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను?
మిస్ డే: డాక్టర్, మా అమ్మగారికి మందు తీసుకువచ్చాను. ఆమెను మరోసారి పరీక్షించారా? ఇంగ్లండ్ వెళ్లడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది చెప్పగలరా? ఈ హోటల్‌లో ఉన్నవారి మాటలు అర్థం చేసుకోలేక పోతున్నాను. నన్ను ఇంతకు ముందెన్నడూ చూసినట్టు లేదని అంటున్నారు. వాళ్లకి చెప్పండి డాక్టర్, వాళ్లు పొరపాటు పడుతున్నారని. మీరే 341 గదిలో ఉన్న మా అమ్మగారిని పరీక్షించారని, మందును తేవడానికి మీ ఇంటికి మీరే పంపించారని చెప్పండి.
డాక్టర్: సారీ మేడమ్. నేనెన్నడూ మీ అమ్మగారిని చూడలేదు. కొద్ది నిమిషాల క్రితం నిన్నూ చూడలేదు. కానీ మీకు సహాయం చేయగలను.
మిస్ డే (జాన్ మేట్స్ వేపు తిరిగి): ఇక్కడి నుంచి నన్ను తీసికెళ్లండి. లేకుంటే నాకు పిచ్చెత్తేట్టుంది. వీళ్లకి లాగానే.
జాన్ బేట్స్‌కి ఆ అమ్మాయి చెబుతున్నది నిజమేనన్న నమ్మకం కలిగింది. హోటల్ క్లర్క్, డాక్టర్, మేనేజర్ చెప్పింది జాగ్రత్తగా విన్నప్పటికీ మిస్ డే చెప్పేదే నమ్మాడు. ఆమెను ఒక చిన్న రెస్టారెంట్‌కి తీసికెళ్లాడు. అక్కడ ఆమెను శాంతపరచడానికి కాస్తంత టిఫిన్ చేయించడానికి చాలా సమయం పట్టింది. అదే సమయంలో ఆమె తన తండ్రి భారత్‌లో మరణించడం దగ్గర నుంచి ఈ ఉదయం వరకూ జరిగినదంతా పూసగుచ్చినట్టు వివరంగా బేట్స్‌కి వివరించింది.
బేట్స్: మీరు చెప్పినదంతా నమ్ముతున్నాను మిస్ డే. నిజానికి నేను బ్రిటీష్ ఎంబసీలో జూనియర్ సెక్రటరీని. కానీ వారు మీకు సహాయం చేయగలరని హామీ ఇవ్వగలను. వాళ్లకి మీ కథంతా చెప్పేలోగా, ఇందుకు తగిన సాక్ష్యాలు సేకరించడం ఎంతో అవసరమని భావిస్తున్నాను. వాటి గురించి ప్రయత్నించే వరకూ మీరు ఎక్కడన్నా ఉండండి. అన్నట్టు ఓ హోటల్‌లో నాకు గది ఉంది. చాలా చిన్నది. కానీ చాలా నీట్‌గా ఉంటుంది, తక్కువ ఖరీదుదే. అక్కడ మీకు బస ఏర్పాటు చేస్తాను. మీరు అక్కడికి మారితే, తర్వాత మీరు ప్రయాణించారని చెపుతున్న ఆ షిప్పింగ్ కంపెనీకి వెళదాం. మీరు మెర్సిలిస్ నుంచి ఇక్కడికి వచ్చినట్టు సాక్ష్యాలు సేకరిద్దాం. అలాగే స్టేషన్ దగ్గర మీకు సాయం చేసిన వ్యక్తినీ పట్టుకుందాం. అతని ద్వారా క్యాబ్ డ్రైవర్‌ని, అదే మిమ్మల్ని క్రిలాన్ చేర్చిన క్యాబ్ వాడినీ కలవవచ్చు. ఈ సమాచారం పక్కాగా లభిస్తే, ఎంబసీలో మా వాళ్లతో చెప్పి మీకు సాయం చేయించగలను.
మిస్ డే: మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు మిస్టర్ బేట్స్. క్రిలాన్‌లో వాళ్ల మాటలు విన్న తర్వాత నాకు పిచ్చెత్తినట్టయింది. నన్ను నమ్మినందుకు ఎంతో ఆనందంగా ఉంది. మీ ఆలోచన బ్రహ్మాండం. కానీ నేను ఉదయం డాక్టర్ ఇంటికి వెళ్లినప్పుడు నా పర్స్ వెంట తీసికెళ్లలేదు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. ఈ సంగతి చెప్పడానికి సిగ్గుగానూ ఉంది. నా జీవితంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి ఎదుర్కొనలేదు.
బేట్స్: హోటల్ బిల్లు గురించి మీరేమీ ఆందోళన పడవద్దు. ఎంబసీ వారికి చెప్పి దాని సంగతి చూడమంటాను. మీరు మీ అమ్మగారు సంతకాలు చేసి తీసుకోవాల్సిన ఆస్తి పత్రాలు ఉన్న మనిషిని కలిసే వరకూ మీకు సహాయం చేయగలను.
మిస్ డే: వండర్‌ఫుల్. మీ మంచితనానికి ఎంతో కృతజ్ఞతలు. మీ రుణం ఎలా తీర్చుకోగలను.
బేట్స్: మీకు చిన్నపాటి సహాయం చేయడంలో ఎంతో ఆనందం ఉంది. మనం ఇప్పుడు కలసి పని చేస్తున్నందుకు మనం స్నేహితులం అయ్యాం. అందువల్ల మీరు నన్ను జాన్ అనీ పిలవవచ్చు.
మిస్ డే: అలాగయితే, నన్ను మీరు జోన్ అని పిలవవచ్చు!
గారె డి లియాన్‌లోని షిప్పింగ్ కంపెనీ వారితో, క్యాబ్ డ్రైవర్‌తోనూ మధ్యాహ్నమంతా మాట్లాడుతూనే గడిపాడు బేట్స్. మిస్ డే చెప్పినదంతా వాళ్లు నిజమేనని చెప్పారు. మొత్తం కేసు వివరాలన్నీ ఎంబసీ ముందుంచాడు బేట్స్. ఆ సాయంత్రం బేట్స్ హోటల్‌కి వెళ్లాడు.
బేట్స్: జోన్ బాగా ఆలోచించి చెప్పు. మీరు క్రిలాన్‌కి వెళ్లినపుడు 342 గదిలో ఉన్న ఫర్నిచర్ ఎలాంటిది? ఎందుకంటే ఆ గదిని రేపు పరిశీలించడానికి ఎంబసీ అధికారులను పంపించవచ్చు.
మిస్ డే: నాకు గుర్తున్నంత వరకూ కర్టెన్లు గులాబీ రంగులో ఉన్నాయి. కుర్చీలకు ఎరుపు తొడుగులు ఉన్నాయి. వాల్‌పేపర్ కూడా గుర్తుంది. అది కూడా గులాబీ రంగులోనే ఉంది. పెద్దపెద్ద ఎర్రని గులాబీ పువ్వులు ఉన్నాయి. మంచం మామూలు కొయ్య మంచమే. దానికే ప్రత్యేకతా లేదు. నాకు ఇవే గుర్తున్నాయి.
బేట్స్: చాలు, ఈ వివరాలు చాలు.
మర్నాడు మధ్యాహ్నం బేట్స్ కోసం తన హోటల్ గది దగ్గర మిస్ డే వేచి ఉంది. కొంతసేపటికి అతను వచ్చాడు.
మిస్ డే: జాన్, ఈ వ్యవహారమంతా ఫ్రెంచ్ పోలీసులకు చెప్పావా?
బేట్స్: అవును జోన్. ఎంబసీ సెక్రటరీ అన్ని ఏర్పాట్లూ చేశాడు. ఈ మధ్యాహ్నం క్రిలాన్‌కి వెళ్లాం. కానీ అక్కడ గదిలో పరిస్థితి మీరు వివరించిన దానికి పూర్తిగా భిన్నంగా ఉంది. కర్టెన్లు నీలం, తెలుపు రంగులో, కుర్చీలు గోధుమరంగు కవర్లతో ఉన్నాయి. వాల్ పేపర్ తెల్లని రంగులో అనేక పువ్వులు అలంకరించబడి ఉంది. కానీ ఎంతో ఆశ్చర్యపరిచే అంశమేమంటే వాల్ పేపర్లు అప్పుడే ఏర్పాటు చేశారు! ఒకటి రెండు చోట్ల అది సరిగ్గా అంటుకుని లేకపోవడం, చెమ్మగా ఉండడం నేను గమనించాను.
మిస్ డే: అంటే అర్థమేమిటి జాన్? మా అమ్మగారు ఎక్కడున్నట్టు? నేను బహుశా ఆమెను ఇక చూడలేనేమోనన్న భావన భయపెడుతోంది.
బేట్స్: అధైర్యపడకండి జోన్! మళ్లీ మొత్తం విషయాన్ని తిరగదోడుతాను. వారం పట్టినా పట్టవచ్చు. 342 గది చూసిన తర్వాత, ఒకటి అనిపించింది. అసలా హోటల్‌కి పేపర్ హాంగింగ్స్ చేసిన వ్యక్తి వివరాలు సేకరించాలని నిర్ణయించుకున్నాను. మన భోజన కార్యక్రమం ముగించుకుని వాడి కోసం వెదుకుదాం.
సాయంత్రం పేపర్ హ్యాంగింగ్ దుకాణం దగ్గర...
పేపర్ హ్యాంగర్: అంటే, నిన్న క్రిలాన్‌లోని హోటల్ గదికి పేపర్ ఏర్పాటు గురించేగా మీరు తెలుసుకోవాలనుకున్నది. అయినా నా పని పట్ల మీరు ఎందుకు అంత ఆసక్తి చూపుతున్నారో నాకు అర్థం కావడంలేదు?
బేట్స్: ఏ గదికి చేసిందీ సమాచారం ఇస్తే, ఈమెకు ఎంతో మేలు చేసిన వాడవవుతావు.
పేపర్ హ్యాంగర్: ఈమెకు ఆ విషయం ఎంతో ముఖ్యమైనదంటారు? సరే మంచి ఫ్రెంచ్ ప్రజల్లానే నేనూ ఈ అమ్మాయికి సహాయం చేస్తాను. కానీ అసలే రోజులు గడ్డుగా ఉన్నాయి. మాకు పని ద్వారా అంతగా సంపాదనే లేదు, మీకు తెలుసు కదా.
బేట్స్: 342వ గదికి ప్రత్యేక ఏర్పాట్లు చేశావన్నది నాకు తెలుసు. మధ్యాహ్నమే అక్కడికి వెళ్లి చూశాను. గోడలకు నువ్వు అంటించినవి ఇంకా పచ్చిగానే ఉండటం గమనించాను. మాకు చిన్నపాటి సమాచారం ఇచ్చినా, ఇరవై ఐదు ఫ్రాంక్‌లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఏమంటావు?
పేపర్ హ్యాంగర్: సరే, ఈ అమ్మాయి కోసం అంగీకరిస్తున్నాను.
బేట్స్: అంటే, ఇరవై ఐదు ఫ్రాంక్స్‌కి ఓకే అన్నట్టేగా. సరే నువ్వు ఇచ్చే సమాచారానికి అంతే ముట్టచెబుతాను.
పేపర్ హ్యాంగర్: నిన్న ఉదయం నన్ను హఠాత్తుగా అక్కడికి పంపించారు. నేను క్రిలాన్ చేరుకునేసరికే, అక్కడి ఓ గదిలోని ఫర్నిచర్ బయటకి తేవడం గమనించాను. అదే 342 గది. అందుక్కారణమేమిటో తెలుసుకోవాలనుకున్నాను. అలాంటి ఉత్సుకత ఆడవారికే కాదు మగవారికీ ఉంటుంది గదా! కానీ ఏ ఒక్కరూ సమాధానం చెప్పలేదు. అంతే చెప్పగలను.
బేట్స్: సరే డబ్బు తీసుకో. సరయిన మార్గంలోనే డబ్బును సంపాదించావనుకుంటాను. మరింత సమాచారం గుర్తు చేసుకుని చెప్పగలిగితే మరో ఇరవై ఐదు ఫ్రాంక్‌లు నీదవుతుంది. ఆలోచించు.
పేపర్ హ్యాంగర్: నాకు మరింత తెలిస్తే తప్పకుండా ఈ అమ్మాయి కోసం చెప్పేవాడినే గదా.
పక్షం రోజుల తర్వాత...
బేట్స్: డియర్ జోన్స్, క్రిలాన్‌లో సమాచారం రాబట్టడానికి అక్కడి పనివాళ్లను అందరితోనూ మాట్లాడాను. కానీ ఒక్క ముక్క అదనంగా ఏమీ లభించలేదు. తప్పకుండా ఏదో రహస్యం ఉండే ఉంటుంది. అది తెలిసిన వారికి డబ్బు ఇచ్చి నోరు నొక్కేసే ఉంటారనిపిస్తోంది.
మిస్ డే: మా అమ్మగారిని మళ్లీ చూస్తానన్న ఆశ పూర్తిగా పోయింది. నేను చేసిన పొరపాటేమిటో అర్థం గావడంలేదు. కానీ మీరు నాకు ఎంతో సహాయపడ్డారు.
బేట్స్: సహాయపడటం కంటే గొప్ప సంతృప్తి ఏముంటుంది జోన్. మీ తండ్రి దగ్గరికి మీరు ఇంగ్లండ్ వెళ్లడం, అదీ త్వరలో అనేది నాకు అంతగా ఇష్టం లేదు. మిమ్మల్ని ఎంతో మిస్ అవుతాను. త్వరపడకండి. ఇప్పటికీ రహస్యాన్ని ఛేదించడానికి సమయం ఉంది. ఫ్రెంచ్ పోలీసు అధికారులతో సంబంధాలున్నాయని మా ఫస్ట్ సెక్రటరీ ఇవాళే చెప్పారు. ఈయన అమెరికాలో కొంతకాలంగా ఉంటున్నాడు. కానీ, ఆయన మరో నాలుగయిదు రోజుల్లో ఇక్కడికి వస్తున్నారు. ఈయన ద్వారా అసలు సంగతి బయటకు తీసుకురావచ్చునని మా ఫస్ట్ సెక్రటరీ అంటున్నారు. ఈ వ్యవహారం గురించి వాళ్లిద్దరూ కలిసి మాట్లాడుకునేంత వరకయినా మీరు వేచి ఉండలేరా జోన్.
మిస్ డే: నేను అమ్మను చూడలేకపోవచ్చు. కానీ అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి వేచి ఉండగలను జాన్.
వారం రోజుల తర్వాత...
బేట్స్ (చాలా సీరియస్‌గా): పోలీసు అధికారితో మా ఫస్ట్ సెక్రటరీ మాట్లాడాడు.
మిస్ డే: నీ ముఖం చూస్తుంటే, అదేదో శుభవార్తలా అనిపించడంలేదు జాన్. నేను ధైర్యంగా ఉండగలను. అసలు సంగతేమిటో చెప్పు. అసలేం జరిగిందో చెప్పు.
బేట్స్: మీ అమ్మగారిని పరీక్షించడానికి వచ్చిన డాక్టర్‌కి ఆమె బ్లాక్ ప్లేగ్‌తో బాధపడుతోందని గ్రహించాడు. మీ అమ్మగారిని వెంటనే ఆస్పత్రికి చేర్చడానికే నిన్ను దూరంగా పంపేశాడు. నిజానికి ఆ మధ్యాహ్నమే మీ అమ్మగారు మరణించారు. ఫ్రెంచ్ ప్రభుత్వం మీ అమ్మగారి మరణవార్త ఇక్కడి పత్రికల్లో రావడం ఇష్టపడలేదు. అంతకు ముందే ఎగ్జిబిషన్ ఆరంభమయింది. ఎగ్జిబిషన్‌కి వచ్చిన ఒక వ్యక్తి మరణించారన్న వార్త ఎక్కడ పొక్కుతుందోనని పారిస్ జనం ఎంతగా కంగారు పడతారోనని వారు అనుకున్నారు. అందువల్ల ఈ విషయాన్ని రహస్యంగానే ఉంచాలని నిర్ధారించారు.
మిస్ డే: కనీసం ఇప్పటికయినా ఆ నిజం నాకు తెలిసింది. పారిస్‌లో నా కష్టాల్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను. నేను ఇంగ్లండ్ వెళతానను. అక్కడే నాకు మనశ్శాంతి లభిస్తుంది.
బేట్స్: పారిస్‌లో జరిగినది బహుశా నీవు అంత త్వరగా మర్చిపోలేవేమో జోన్
మిస్ డే: నిన్ను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను జాన్.
బేట్స్: ఆ అవకాశం నీకు ఇవ్వనులే జోన్. మరో నెల రోజుల్లో నేనూ సెలవలకు ఇంగ్లండ్ వస్తున్నాను.

===================================================================
కథలకు ఆహ్వానం
‘ఆదివారం ఆంధ్రభూమి’కి
కథలు పంపవలసిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 500 003.
పీడీఎఫ్ ఫార్మాట్‌లో sundaymag@andhrabhoomi.net కు మెయల్‌లో పంపాలి.

-ఆర్థర్ ఎం.జెనె్సన్ ‘సెలెక్ట్‌డ్ షార్ట్ స్టోరీస్’ నుంచి తెలుగు: టి.లలిత ప్రసాద్.. 92465 07736