కథ

పాపం.. పసివాళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అమ్మా... వైష్ణవీ! ఈ రోజు మీ మాస్టారు కనిపించార్రా! నువ్వు డాక్టరువి అవుతానన్నావట కదా! ఆయన ఆ విషయం చెప్పి, నువ్వు కచ్చితంగా సాదిత్తావని, ఈలైతే చదివించమని చెప్పారు. కలాసులో నువ్వే పస్టట కదా! నిన్ను డాక్టరు చదివించేంత తోమత మీ నాన్నకు, నాకూ లేదు గాని, నువ్విప్పుడు ఆరో తగతే కదా తల్లీ! నువ్వు డాక్టరు చదివే వయసు వచ్చేటప్పటికి చదివించగలిగే తితికి వత్తామేమో చూద్దాం! నువ్వు మాత్రం ఇలాగే చదువు’ తమ్ముడు కూతుర్ని దగ్గరకు తీసుకుని పరంధామయ్య అన్నాడు. బుధవారం సంతలో కనుచీకటి పడుతుండగా కూరగాయల దుకాణం సర్దుకొని, మిగిలిపోయిన కూరగాయలు, తక్కెడ మోపెడ్ వెనక సీటు మీద పెట్టి కట్టుకుని, రెండు కిలోమీటర్లు ప్రయాణం చేసి రేవుకి చేరుకుని, గోదావరి దాటి వారంటున్న దీవిలోకి వచ్చేటప్పటికి చాలా నీరసంగా ఉంది. అయినప్పటికీ, సంతలో వైష్ణవికి చదువు చెప్పే ఉపాధ్యాయుడు చెప్పిన విషయాలు మెదడులో తిరుగుతుండటంతో తనింటికన్నా వందడుగుల ముందు వచ్చే తమ్ముడింటి దగ్గర ఆగి, లోపలకు వెళ్లి వైష్ణవితో మాట్లాడాడు.
అప్పుడప్పుడూ బావగారు తమింటి దగ్గరాగి వెళ్లడం అలవాటే కాబట్టి, వైష్ణవి తల్లి రత్నవల్లి అతని మాట వినగానే, ఓ పెద్ద గ్లాసుతో మంచినీళ్లు తీసుకుని వెళ్లింది. తన కూతురుతో ఆయన అన్న మాటలు విన్న తర్వాత మంచినీళ్లు అందిస్తూ ‘ఎందుకు దానికి ఆశలు కలిగిస్తారు? రేపు డాక్టరు చదివిస్తానన్నారు కదా చదివించండని మొండిపట్టు పడుతుంది. అనుకున్నది అయిపోవాలనుకునే మొండిదని మీకూ తెలుసు కదా!’ అంది.
‘మొండిపట్టు పట్టేదే ఉండాలమ్మా! ఎందుకంటే, అలాంటి పిల్ల ఉన్నప్పుడే మనం కూడా ఏదొకటి చేసి చదివిత్తాం! మనం ఏదొకటి చేసి చదివితే, మొండిది కాబట్టి, ప్రయత్నం రుదా కాకుండా సాదిత్తాది’
‘ఏదొకటి చేసి చదివించడానికి అదేమైనా చిన్న చదువేంటన్నయ్యా! మన వల్ల అయ్యేది కాదులే అన్నయ్యా!’ పొలం నుంచి వచ్చి, కాళ్లు కడుక్కుంటూ ఇంట్లో సంభాషణ విని, లోపలకు వస్తూ అన్నాడు పరంధామయ్య తమ్ముడు కృష్ణారావు.
‘శుభం పలకరా పెళ్లికొడకా అంటే, పెళ్లికూతురు తాళి తెగుతుంది అన్నాడంట! అలా ఉంది మీ ఇద్దరి తీరు. ఎప్పుడూ ఇలానే ఉండిపోతామేంటి? దీన్ని డాక్టర్ని చేయడానికైనా మరింత కష్టపడి సంపాదించి, రుద్దిలోకి వత్తామేమో!’
‘ఇది డాక్టరయ్యే విసయం అటుంచు. మధ్యాన్నం మొక్కజొన్నల యాపారి చంద్రశేఖరం వచ్చాడు. వాళ్ల తమ్ముడు మన చంద్రికను పడవలో చూశాడట. మొన్నామధ్య దర్మయ్యగారి మొక్కజొన్నలు తొకం వేస్తున్నప్పుడు వచ్చాడులే! అప్పుడు చూసుంటాడు. పెళ్లి చేసుకుంటానంటున్నాడంట! చాలా మంచి సంబందం.. పైగా వాళ్లకు, మనకు దూరపు చుట్టరికం కూడా ఉంది. వరస లెక్కగట్టాను. వాళ్లు మనకు వరసైన వాళ్లే! మన మొక్కజొన్నలు తూకం వేసుకోవడానికి చంద్రశేఖరం రేపు వత్తాడు. ఈ విసయం గురించి నిన్ను అడిగి, రేపు చెప్పమన్నాడు’
‘అదింకా పదోతరగతే కదా చదువుతోంది. అప్పుడే పెళ్లేంటిరా! అయినా దానికన్నా పెద్దది ఉండగా చిన్నపిల్లను ఇంటి కోడలను చేసుకుంటానని అడగడమేంటి? ఆ చంద్రశేఖరంకు బుద్ధుండాలి కదా! మొన్న అమలాపురం పెళ్లికి వెళితే, అక్కడ కూడా సిరంగిశెట్టి వాళ్లు చంద్రికను చూసి, వాళ్లబ్బాయికి చేసుకుంటామని, అమ్మాయి చదువు అయ్యేవరకూ ఎదురుచూత్తామని మీ వదిన్ని అడిగారట! ఎప్పుడేమడగాలో తెలియకుండా పోతోందిప్పటి మనుసులకి. మళ్లీ గాని అడిగితే, చదువు అయ్యాక పెళ్లి గురించి ఆలోచిత్తామని చెప్పమన్నాను.’
‘అదేంటన్నయ్యా! అది చాలా గొప్ప సంబందం కదా! అలా చెడగొట్టుకోవడం ఎందుకు? ఇప్పుడు సంబందం మాట్లాడుకుని, పద్దెనిమిదేళ్లు నిండాక పెళ్లి చేత్తే బాగుంటుంది కదా?’
‘అమ్మాయి అందంగా ఉందనడిగేత్తే, మనం అమ్మాయి ఉద్దేశం ఏంటో తెలుసుకోకుండా పెళ్లికి ఒప్పేసుకోవడమేనా? పెళ్లి వయసు వచ్చేటప్పటికి అమ్మాయి ఆలోచనలెలా ఉంటాయో, ఆశలు ఎలా ఉంటాయో అని ఆలోచించకుండా పెళ్లి కుదుర్చుకుని, కొనే్నళ్ల తర్వాత ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోమనడం సరైన ఇసయం కాదు. టెంతూ, ఇంటర్మీడియేట్టూ అయిన తర్వాత, ఏ ఇంజనీరింగు కాలేజీలోనో మంచి సీటు వత్తే, తను చదువుకుంటానంటే, మనం మాటిచ్చామని, పెళ్లి చేసుకోమనడం ఎంతవరకూ సరైందంటావు? దీనికి సంబందం కుదురుపోతే, పెద్దదానికి ఏదొక సంబందం అడావిడిగా చూసి చేసేయాలి. అలా చేస్తే, ఎటువంటివాడు మనకు అల్లుడవుతాడో? కాబట్టి, పెళ్లిగోల పక్కన పెట్టి, పిల్లలను మనం ఎంత కష్టపడైనా చదివించుకుందాం!’ అన్నాడు పరంధామయ్య. ఆడపిల్లలన్న చిన్నచూపు చూడకుండా తన ఇద్దరి ఆడపిల్లలను, తమ్ముడి ముగ్గురు ఆడపిల్లలను బాగా చదివించాలని కోరుకునే మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి పరంధామయ్య.
‘హోంవర్క్ చేసుకోవాలి పెదనాన్నా!’ అంటూ వైష్ణవి అతని దగ్గర్నుంచి వెళ్లబోయింది.
‘రేపు రెండో శనివారం కదరా! రేపు, ఎల్లుండ సెలవు కదమ్మా!’
‘లేదు పెదనాన్నా! రేపు స్కూల్లో మొక్కలు నాటే కార్యక్రమం ఉంది. స్కూలుకు రమ్మన్నారు’ వైష్ణవి అక్క సంధ్య అంది.
‘అలాగా?! నాకు తెలీదు కదా! వెళ్లు.. వెళ్లు. ఓం వర్కు చేసుకో!’ అంటూ వైష్ణవి చేయి వదిలిపెట్టాడు పరంధామయ్య.
‘నేను వెళ్లొస్తాన్రా చిన్నా! అమ్మా రత్నవల్లీ! పిల్లలు చదువుకోవడం అయిపోయిన తర్వాత ఈ జంతికలు పెట్టు’ అంటూ తను తెచ్చిన చేతి సంచీలోంచి ఓ పొట్లాం తీసి, అక్కడున్న ప్లాస్టిక్ కుర్చీలో పెట్టి గడప దాటాడు. కృష్ణారావు అరుగు మెట్ల మీదకు టార్చ్‌లైట్ చూపిస్తూ, ‘జాగ్రత్త అన్నయ్యా!’ అన్నాడు. పరంధామయ్య మెల్లగా దిగి, తనింటి వైపు నడిచాడు.
పెదనాన్న సంత నుంచి వస్తూ తమ ఇంటి దగ్గర ఆగాడంటే, తినడానికి తమకు ఏదొక తాయిలం తెచ్చాడని పిల్లలు ముందే ఊహిస్తారు. తామూహించినట్లే జరిగినందుకు పిల్లలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. అందరికన్నా చిన్నపిల్ల వైష్ణవి చెల్లెలు దీవెన ‘అమ్మా! జంతికలు పెట్టూ..’ అంటూ రాస్తున్న పుస్తకాన్ని అక్కడ పెట్టేసి, తల్లి దగ్గరకు పరుగున వెళ్లింది. ఆ అమ్మాయి అదే దీవిలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో నాల్గో తరగతి చదువుతోంది. అక్కలిద్దరూ రేవు దాటి పొరుగూరు వెళ్లి, ఉన్నత పాఠశాలలో సంధ్య ఎనిమిదో తరగతి, వైష్ణవి ఆరో తరగతి చదువుతున్నారు. పెదనాన్న కూతుర్లలో చిన్నమ్మాయి చంద్రిక వారిద్దరితోపాటు అదే పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. చంద్రిక అక్క విశాల ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతోంది.
ఉదయం ఎనిమిదిన్నర గంటలకు నలుగురు అక్కచెల్లెళ్లు బయలుదేరారు. మరో పదిమంది విద్యార్థులు వైష్ణవి చదివే పాఠశాలకు వెళ్లడానికి, ఇంకో నలుగురు విశాల చదివే కళాశాలకు వెళ్లడానికి నది ఒడ్డున వచ్చి ఉన్నారు. అంతకుముందు సుమారు ఓ నలభై మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లిపోయారు. ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలకన్నా సుమారు ఓ గంట ముందు మొదలైపోతాయి. గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. పసివయసు నుంచీ ఆ గోదావరి పాయను అంతకన్నా ఎక్కువ వరద మీదున్నప్పుడు కూడా దాటడం వారికి అలవాటే! ఆ దీవిలో ఉన్నవారు నిత్యావసర వస్తువులకు సైతం నది దాటి వెళ్లవలసిందే! విశాల ముగ్గురు చెల్లెళ్లతోపాటు మిగిలిన పదిమంది విద్యార్థులతో పొరుగూరు ఉన్నత పాఠశాల వరకూ నడిచి వెళ్లి, అక్కడ్నుంచి కాలేజీకి ఆటోలో వెళ్లింది.
ఆ రోజు పాఠాలేం పెద్దగా చెప్పలేదు. ఉపాధ్యాయులు విద్యార్థుల చేత సమాజం పట్ల బాధ్యతాయుతంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించి, మొక్కలు నాటించారు. మధ్యాహ్నం మూడు గంటలకు అన్ని కార్యక్రమాలు ముగిశాయి.
‘చంద్రక్కా! ఈ రోజు గోదారి పోటు మీదుంది కదా! అన్ని కార్యక్రమాలూ అయిపోయాయి కదా! పెందలాడే వెళ్లిపోతామని హెడ్‌మాస్టర్ సార్ని అడుగక్కా! నాకు ఈ రోజెందుకో భయంగా ఉంది’ అంది వైష్ణవి.
‘సరే! అడుగుతానుండు’ అని చంద్రిక ప్రధానోపాధ్యాయుని గదికి వెళ్లింది. బయటకు వస్తూ, ‘మన దీవి వాళ్లందర్నీ సార్ వెళ్లిపొమ్మన్నారు’ అంటూ కొంచెం బిగ్గరగానే అరిచింది చంద్రిక. అందరూ కేరింతలు కొట్టుకుంటూ పుస్తకాల బ్యాగ్‌లలు వీపులకు తగిలించుకున్నారు. కేరియర్ బ్యాగులు ఓ చేత్తో పట్టుకుని వేగంగా బయలుదేరారు.
వేగంగా నడుస్తూ రోజూకన్నా తక్కువ సమయంలో రేవు చేరుకున్నారు. అప్పటికే ఓ పడవ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. పరుగుపరుగున వెళ్లి, సుమారు పదిహేను మంది విద్యార్థులు ఆ నాటు పడవ ఎక్కారు. పడవకు భారం పెరిగింది. ఆ పడవలో అంతమంది ఎక్కకూడదు. కానీ, ఎక్కడం, ఎలాగో ఆ ఒడ్డుకు చేరడం రోజూ జరుగుతుండటంతో అలా చేయడంలో ఉన్న ప్రమాదం వారికి తెలియడంలేదు. అందుకే పడవ నడిపే వ్యక్తులు కూడా అభ్యంతరం చెప్పలేదు. కాకపోతే, పడవ ఇంజన్ కండిషన్ బాగోలేదన్న విషయం నడిపేవాళ్లకు మాత్రమే తెలుసు. ఆ రేవు దాటించి, డబ్బులు వసూలు చేసుకోవడానికి జరిగిన వేలంపాటలో ఆ హక్కు పొందిన వ్యక్తిది ఆ పడవ. ఇంజన్ కండిషన్ బాగోలేదని ఎవరికీ తెలియనివ్వొద్దని ఆ ఇద్దర్నీ అతను ఆదేశించడంతో వాళ్లు ఆ విషయాన్ని రహస్యంగా ఉంచారు. అలాగే కొన్నాళ్లు పడవను ఉపయోగించేస్తే, ఆ తర్వాత బాగుచేయించవచ్చన్నది అతని ఉద్దేశం.
విద్యార్థులు రోజుకన్నా ముందు వెళ్లిపోతున్నామన్న ఆనందమే గాని, మిగిలిన విషయాలు వాళ్లకు పెద్దగా తెలీదు. తమతోపాటు అనేక మంది పెద్దవాళ్లు ఆ పడవలో ప్రయాణం చేస్తున్నారన్న ధైర్యం వాళ్లకే తెలియకుండా వాళ్లల్లో ఉంది.
‘పెద్దక్క కూడా వచ్చేస్తే బాగుండును’ అంది వైష్ణవి.
‘అదేమన్నా మన స్కూలనుకుంటున్నావేంటి? కాలేజి! అన్ని పిరియడ్‌లు అయితే గాని పంపరు. ఇంకో గంటలోనో, గంటంపావులోనో వచ్చేస్తాదిలే!’ అంది చంద్రిక.
పడవ బయలుదేరింది. పిల్లల్లో ఉత్సాహం మరింత పెరిగింది. పావుగంటలో అవతల ఒడ్డుకు చేరిపోతారు. మరో పావుగంటలో ఇళ్లకు చేరుకుంటారు. వాళ్ల ముఖాల్లో ఆనందం. అమ్మ పెట్టబోయే తాయిలాలు గుర్తుకొచ్చి నూర్లుతున్నాయి.
‘అక్కా! రాత్రి పెదనాన్న మా ఇంటికొచ్చి, నన్ను డాక్టర్ని చదివిస్తానన్నారు. నిజంగా నేను డాక్టర్ని అవుతానంటావా?’ వైష్ణవి చంద్రిక నుద్దేశించి అడిగింది.
‘రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత మాతో కూడా అన్నారు. నిన్ను డాక్టర్ని చేయడానికి చిన్నాన్నకు సాయం చేయాలన్నారు’
‘అవునా? నాకు చాలా ఆనందంగా ఉందక్కా! అవునూ.. నువ్వేం అవుదామనుకుంటున్నావక్కా?’
‘సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అవుదామనుకుంటున్నాను’
‘మా నాన్న నీకు పెళ్లి చేసేద్దామనుకుంటున్నారు’ సంధ్య కలగజేసుకుని అంది.
‘ఆ విషయం కూడా నాన్న రాత్రి అమ్మతో చెబుతున్నప్పుడు విన్నాను. నేనిప్పుడే చేసుకోను. ఇంజనీరింగ్ చేసిన తర్వాత కొన్ని రోజులు ఉద్యోగం చేయాలి.. ఆ తర్వాతే పెళ్లైనా, గిల్లైనా?’
‘నేను కూడా ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నాను అక్కా! బాగా ఖర్చవుతుందా? మా నాన్న కూలిపని చేసి తెచ్చిన డబ్బులతోనే నేను చదువుకోవాలి. నీకు తెలుసు కదా!’ ఏడో తరగతి చదువుతున్న ప్రక్క ఊరు అమ్మాయి మాలిక చంద్రికను అడిగింది. ఆ దీవిలో ఆరు ఊళ్లున్నాయి.
‘ఎంసెట్‌లో మంచి ర్యాంక్ వస్తే ఎక్కువ ఖర్చవదు. నువ్వు తెలివైనదానవు కదా! నీకు మంచి ర్యాంకే వస్తాదిలే!’ చంద్రిక ఆ అమ్మాయిని ప్రోత్సహించింది.
‘ఎంసెట్టంటే ఏంటి..’ మాలిక మాట పూర్తికాకముందే పెద్ద శబ్దమవడం,
పడవ పెద్దగా కంపించడం ఒకేసారి జరిగాయి. పడవలో ఉన్న పిల్లలందరూ ఎగిరి నదిలో పడిపోయారు. భయంతో వాళ్లు చేసిన ఆర్తనాదాలు నది మీద వీస్తున్న తేమ గాలిలో ప్రతిధ్వనించాయి. ఇద్దరు ముగ్గురు పెద్దలు కూడా పడిపోయారు. పడవలో ఉన్న స్ర్తిలు నదిలో పడి కొట్టుకుపోతున్న పిల్లలను చూస్తూ బిగ్గరగా ఏడుస్తున్నారు. పురుషులు అచేతనంగా ఉండిపోయారు. అక్కడ నది వెడల్పు తక్కువే గాని, నది మధ్యలో నాలుగైదు తాడిచెట్ల లోతుంటుంది. దూకి ఎవర్నైనా కాపాడాలన్న సాహసం చేయలేక పోతున్నారు. వరద గోదావరి వేగంగా ప్రవహిస్తోంది. వీపులకున్న పుస్తకాల బ్యాగ్‌లతో విద్యార్థులు కొట్టుకుపోతున్నారు. ఎటు చూసినా జలమయం. క్రింద అగాధం. కాళ్లకు ఏం అందడం లేదు. పైన నీరు, నోటులోకి, ముక్కు రంధ్రాల్లోకి, చెవుల్లోకి నీరు వెళ్లిపోతోంది. మాలిక తను ఇంజనీరింగ్ చదవకుండానే చనిపోతున్నందుకు బాధపడుతోంది. ఏడుపొస్తోంది. కన్నీరు వరద గోదావరి నీటిలో కలిసిపోతోంది. భయం వేసేస్తోంది.. మరణ భయం! ఇంజనీరింగ్ చదవకుండా చావకూడదని చంద్రిక ఈత కొట్టడానికి ప్రయత్నిస్తోంది. కానీ, ఆమెకు ఈత అంతగా రాదు. అలసిపోయి ప్రయత్నం విరమించింది. ‘పెదనాన్న నన్ను డాక్టర్ చదివిస్తానన్నారు. నన్ను కాపాడు దేవుడా!’ మనసులో ఆ పైవాణ్ణి అర్థిస్తోంది వైష్ణవి.
పిల్లలు నదిలో కొట్టుకుపోతున్న దృశ్యం చూసిన ఆ నది మీద బ్రిడ్జ్ నిర్మాణం చేస్తున్నవారు, వారి దగ్గరున్న ఫంట్‌తో వేగంగా వెళ్లి, వీలైనంత మందిని కాపాడుతున్నారు. ఇరు ఒడ్డుల ఉన్న పడవలు కూడా బయలుదేరాయి - పిల్లలను కాపాడడానికి. కొందరిని పుస్తకాల బ్యాగ్‌లు ముంచేస్తే, కొందరిని అవే కాపాడాయి. పుస్తకాల బ్యాగ్ నదిలో తేలుతుంటే, ఓ పడవతను దాన్ని తీశాడు. దానితోపాటు ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఆ పడవలోనికి వచ్చింది. ఆమె బోర్లా పడటం వల్ల ఆ బ్యాగ్ నీటిలో తేలుతూ ఆమెను మునిగిపోకుండా చేసింది. సుమారు పదిమందిని కాపాడారు. ఐదుగురిని మాత్రం కాపాడలేకపోయారు. ఆ ఐదుగురు - చంద్రిక, సంధ్య, వైష్ణవి, మాలిక, అశోక్ అనే ఆరో తరగతి అబ్బాయి.. వైష్ణవి క్లాస్‌మేట్. అశోక్‌ని నువ్వు ఏమవుతావని అతని ఉపాధ్యాయుడు అడిగినప్పుడు ‘కలక్టర్నవతాను సర్. కలక్టర్నై మా దీవికి అన్ని సౌకర్యాలు వచ్చేలా చేస్తాను సర్’ అన్నాడు.
ఆ అబ్బాయి అన్నంత పనీ చేసేస్తాడేమోనని, అలా జరిగితే, ఆ దీవి వాసుల జీవితాలతో చెలగాటం ఆడడం కుదరదని కాబోలు విధి అతన్ని మొగ్గప్రాయంలోనే త్రుంచేశాడు.
భగవంతుడి పేరెత్తితే, తప్పంతా ఆయనదే. మాదేం లేదంటారు ప్రభుత్వ యంత్రాంగం. ఇంజన్ చెడిపోయిన పడవతో రేవు దాటిస్తున్నవాడు కూడా ‘్భగవంతుడి చిత్తం లేనిదే ఏదీ జరగదు. నాదేముంది? ప్రజలను ఏదొక విధంగా రేవు దాటించేద్దామనుకున్నాను. భగవంతుడు ఇంత పని చేసేశాడు’ అంటాడు. బ్రిడ్జ్ పనులు మొదలుపెట్టినప్పుడు ‘ఇక్కడ మేం తవ్వుతుంటాం కాబట్టి ఇక్కడ వడి పెరుగుతుంది. కాస్త దూరంగా దాటింపు ఏర్పాటు చేసుకోండి’ అని బ్రిడ్జ్ నిర్మాణ సంస్థ చెప్పింది. కానీ, అక్కడ నది వెడల్పు తక్కువ కాబట్టి ఆ సంస్థ వద్దన్న చోటే దాటిస్తున్నాడు - డీజిల్ తక్కువ ఖర్చవుతుందని. రిపేరులో ఉన్న పడవ అక్కడ వడికి అదుపుతప్పి, బ్రిడ్జ్ కోసం తయారైన పిల్లర్లలో ఓ పిల్లర్ని ఢీకొట్టి, పడవ కంపించి, పిల్లలు నదిలో పడిపోయారు.
అక్కడ రేవు దాటించవద్దని ఆ దీవి ప్రజలు కూడా అతన్ని గట్టిగా అడగలేకపోయారు. కారణం రేవు దాటింపునకు ఎక్కువ బాడుగ అడుగుతాడేమోనని.
అందరూ ఎంత నిర్దయగా ప్రవర్తించారు?! అక్కడ బ్రిడ్జ్ నిర్మాణం మొదలైనప్పుడే ప్రభుత్వాధికారులు అక్కడ పరిస్థితి ఏంటని గమనించి ఉండాలి. కానీ, ఏ అధికారీ అటు కనె్నతె్తైనా చూడలేదు. పసిపిల్లలు ఉదయం, సాయంత్రం రేవు దాటుతున్నారు కాబట్టి, వారి దగ్గర బాడుగ తీసుకునే పాటదారుడైనా వాళ్ల రక్షణ కోసం ప్రత్యేకమైన రక్షణ వలయంతో కూడిన పడవనైనా ఏర్పాటు చేయాలి. ఇంజన్ సరిగా పని చేయని పడవలో వాళ్లు ఎక్కుతుంటే చూస్తూ ఊరుకున్నాడు. ప్రజలు హడావిడిగా రేవు దాటి వెళ్లి, పని చూసుకుని వచ్చేయడమే తప్ప, తాము ఎటువంటి ప్రమాదకర పరిస్థితిలో రేవు దాటుతున్నామన్న ఆలోచన చేయలేదు. ఫలితంగా వీరందరూ కలిసి ఉజ్వల భవిష్యత్ ఉన్న ఐదుగురి విద్యార్థులను పొట్టన పెట్టుకున్నారు. పరిసరాలనే గమనించే స్థితిలో లేడు మనిషి. తన ప్రాణం పోతున్నా పట్టించుకునే స్థితిలో కూడా లేడు. ప్రకృతిని కాపాడుకుంటే, అది మనల్ని కాపాడుతుందని చెబుతున్నా దాన్ని పాడుచేసుకుంటున్నాం! ఆ రేవులో పడవ మునిగిపోయే ప్రమాదం ఉందని ఆలోచించే తీరిక ఎవరికుంది?
ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వాలకు రాబోయే ఎన్నికల గురించే ఆలోచనంతా! ప్రజల రక్షణ, సంక్షేమం వాళ్లకు అక్కర్లేదు. తాము చేసే ప్రతి పని వల్ల వచ్చే ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వస్తాయన్న ఆలోచనే గానీ, ఏయే ప్రాంతాలలోని ప్రజలు ఎంతెంత ప్రమాదాల్లో ఉన్నారన్న ఆలోచన ఉండనవసరం లేదు! అధికారులు పై అధికారులను మెప్పించగలిగితే చాలు, తమ విధులను ఎలా నిర్వహిస్తున్నామన్న ఆలోచనక్కర్లేదు! జిల్లాధికారి కాని, మండలాధికారి గాని, పంచాయితీ అధికారిగాని తమ పరిధిలోని ప్రజల జీవనంలో ఉన్న సమస్యల పరిష్కారం గురించి పై అధికారులకు తెలియజేయవలసిన అవసరం లేదు. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు, ప్రభుత్వ యంత్రాంగాల పని తీరు ఇలా ఉన్నా ప్రజలు వారికే ఓట్లు వేసి గెలిపించవలసిన పరిస్థితి! అటువంటి పాలనలో ప్రజలూ అలానే ఉన్నారు.
తర్వాత వచ్చిన ప్రైవేటు పాఠశాలల, కళాశాల విద్యార్థులను అంతకు ముందు పిల్లలను కాపాడిన ఫంట్ రేవు దాటించింది. విషయం తెలిసి ఏడుస్తూనే ఇళ్లకు చేరారు. ముఖ్యంగా విశాల తన ముగ్గురూ చెల్లెళ్లనూ తలుచుకుని.. తలుచుకుని వెక్కివెక్కి ఏడుస్తోంది.
కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న పిల్లల తల్లిదండ్రుల పరిస్థితి హృదయవిదారకంగా ఉంది. దీవిలో ఆ రాత్రి శోకదేవత నెలవై ఉంది. పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులు నిరంతరంగా రోదిస్తూనే ఉన్నారు. వారిని ఎలా ఓదార్చాలో మిగిలిన వారికి అర్థం కావడంలేదు. ఒకే కుటుంబం ముగ్గురు పిల్లలను కోల్పోయింది. ఇద్దరు కూతుర్లను కోల్పోయిన రత్నవల్లిని ఓదార్చే ధైర్యం ఎవరూ చేయలేక పోతున్నారు. రక్షించబడిన పిల్లల తల్లిదండ్రులు తృటిలో తప్పిన ప్రమాదాన్ని తలుచుకుంటూ భయంతో వణికిపోతూ మెతుకు ముట్టలేదు. వాళ్లందరినీ చూస్తున్న మిగిలిన ప్రజలు వారి పిల్లల స్థానంలో తమ పిల్లలుంటే తమ పరిస్థితిని ఊహించుకుని ఉలిక్కిపడుతున్నారు. ఆ రాత్రి ఆ దీవి ఉపవాసం చేసింది.
తెల్లవారేటప్పటికి ఎన్.డి.ఆర్.ఎఫ్, ఎస్.ఆర్.డి.ఎఫ్, నేవీ, ఎయిర్‌ఫోర్స్ దళాలు వచ్చాయి. అనేక టీమ్‌లుగా పడవల మీద, హెలికాప్టర్ల మీద తిరుగుతూ గాలింపు మొదలుపెట్టాయి. సాయంత్రానికి అశోక్ మృతదేహాన్ని కనుగొన్నాయి. మరో రెండు రోజులకు మాలిక, చంద్రిక దేహాలు దొరికాయి. వారం రోజుల పైనే గాలించారు. డాక్టర్ అవ్వాలనుకున్న వైష్ణవి దేహం కాని, ఆమె అక్క సంధ్య దేహం గాని దొరకనే లేదు. సముద్రం దగ్గర్లోనే ఉంది కాబట్టి, సముద్రంలోకి కొట్టుకుపోయాయో, నదిలోనే ఎక్కడో ఆ టీమ్‌లకు కనిపించని చోట ఉండిపోయాయో.. వారి తల్లిదండ్రులు ఆఖరి చూపునకు కూడా నోచుకోలేక పోయారు. ఆ రెండు దేహాలూ శవ సంస్కారాలకు నోచుకోకుండా చేపలకు ఆహారమై పోయాయి.
ప్రభుత్వం మృతుల ఒక్కొక్కరికీ ఐదు లక్షల రూపాయల చొప్పున వారి కుటుంబాలకు నష్టపరిహారం అందించింది. పరంధామయ్య మూడు చెక్కులు రెండు చేతులతో పట్టుకుని, ‘తమ్ముడూ! మన పిల్లలను మనం డాక్టర్లుగా, ఇంజనీర్లుగా చదివించక పోయినా, మనకు డబ్బు సంపాదించి పెట్టార్రా!’ అంటూ ఘొల్లున ఏడ్చాడు. కృష్ణారావు అతన్ని కౌగిలించుకుని భోరుమన్నాడు.
కొన్ని రోజులు గడిచాయి. విద్యార్థులు ఆ భయాన్నుంచి కోలుకుని, పాఠశాలలకు వెళ్లడం మొదలుపెట్టారు. విచిత్రం ఏమిటంటే - రేవు దగ్గర పరిస్థితుల్లో ఎటువంటి మార్పూ రాలేదు. ఎక్కడ దాటించడం ప్రమాదం అని చెప్పారో అక్కడే దాటిస్తున్నారు. నాటు పడవల మీద ప్రయాణం ప్రమాదం కాబట్టి, ఫంట్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పింది గాని, ఏ ఫంట్‌నూ ఏర్పాటు చేయలేదు. నాటుపడవల మీదే అందర్నీ.. విద్యార్థులను సైతం దాటిస్తున్నారు. మరి కొన్ని రోజులకు అంత ఘోర ప్రమాదానికి ప్రధాన కారకుడైన రేవు పాటదారుడు డబ్బుతో నిర్దోషిగా నిరూపించుకుని ఆ నది ఒడ్డున రేవు దగ్గర గతంలో ఏర్పాటు చేసుకున్న నిర్మాణంలో పంకా కింద కూర్చుని, స్వయంగా డబ్బులు వసూలు చేసుకుంటున్నాడు. ప్రజలు అంతా మరిచిపోయి, ఏమీ ఎరగనట్లే అతనికి డబ్బు చెల్లించి, అతను ఏర్పాటు చేసిన నాటు పడవల మీద రేవు దాటేస్తున్నారు. కొందరు ‘ఓ సంవత్సరం ఎలాగో దాటేస్తే, బ్రిడ్జ్ తయారైపోతుంది. అప్పుడు వీడి డొక్కు పడవలు ఎక్కనవసరం లేదు’ అనుకుంటున్నారు తప్ప అతడు అక్కడ కూర్చుని రేవు దాటింపు నిర్వహించడానికి అర్హుడు కాదని ఎవరూ అనడంలేదు.

కథలకు ఆహ్వానం
‘ఆదివారం ఆంధ్రభూమి’కి కథలు పంపవలసిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 500 003.
పీడీఎఫ్ ఫార్మాట్‌లో sundaymag@andhrabhoomi.net కు మెయల్‌లో పంపాలి.

-తోట సుబ్రహ్మణ్యం