కథ

క(ర)వీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలా రోజుల తర్వాత నేను రవిని కలిశాను. ‘చాలా రోజుల తర్వాత’ అని అంత పర్టిక్యులర్‌గా చెప్పటంలో నా ఉద్దేశం ఏమిటో మీకు నిదానంగా అవగతమవుతుంది. రవి మాటకారి కాదు. అలా అని బిడియస్థుడు కూడా కాదు. మితభాషి. అవసరమైనప్పుడు అవసరమైనంత మేరకే అతడి సమాధానం ఉంటుంది.
రెండు మూడు లైన్ల మన ప్రశ్నకి, ఎంతో వివరణలతో మనం అడిగే సమస్యలకి, చాలా క్లుప్తంగా, స్పష్టంగా ఒకటి లేదా రెండు మాటల్లో అతను చెప్పే సమాధానం సరిగ్గా సరిపోతుంది.
అదే ప్రశ్నకి నాలాంటి వాడైతే కనీసం పది లైన్ల సమాధానం చెబుతాడు. చిత్రమేమిటంటే - ఈ పదిలైన్ల సమాధానాన్ని క్రోడీకరించి చెబితే అది మళ్లీ రవి చెప్పే ఒకటి లేదా రెండు మాటలకి సరిగ్గా సరిపోతుంది.
ఐతే - ఇందులో ఏది తప్పు ఏది ఒప్పు అని నేను నిర్ధారించబోవటం లేదు. మనిషి రకరకాల పరిస్థితుల్లో రకరకాల సమయాల్లో రకరకాల స్థారుూ భావాల్లో ఉంటాడు. అందువల్ల అతడి అభివ్యక్తీకరణ కూడా ఆ భావాన్నిబట్టి ఉంటుంది.
ఐతే - మితంగా మాట్లాడటం అనేది ఒక కళ. అది అందరికీ చేతకాదు.
రవిని ఎప్పుడు కలిసి మాట్లాడినా అతడు నాకు ఒక అద్భుతంగా తోస్తాడు.
దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం - పెళ్లికి ముందు అతడెలా వుండేవాడో, పెళ్లై పిల్లలు పుట్టి, వాళ్లు పెద్దయ్యాక కూడా ఇంకా అలానే ఉన్నాడు.
- స్వభావం విషయంలో గానీ
- మాటల విషయంలో గానీ
- సమస్యకు స్పందించే విషయంలో గానీ!!
ఇంకో విధంగా చెప్పాలంటే - రవిని చూస్తే నాకు నిండు కుండ గుర్తొస్తుంది. అది ఎప్పుడూ తొణకదు. బెణకదు. ఎక్కడున్నా స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే - స్థిరత్వం దాని నైజం కాబట్టి. రవి కూడా అంతే!
నెలకి పది వేల రూపాయల జీతం వచ్చేటప్పుడు ఎలా ఉన్నాడో, నెలకి మూడు లక్షలు వస్తున్నప్పుడూ అలానే వున్నాడు. ఖర్చుల విషయంలో గానీ, ఆడంబరాల విషయంలోగానీ!!
అతడి చేతి వ్రాతని చూస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సాధారణంగా ప్రతి ఒక్కరికీ - వయసుని బట్టి, రాసే అవసరాన్నిబట్టి, వయసులో వచ్చే మెజ్యూరిటీని బట్టీ చేతివ్రాత మారుతుంది. కానీ రవి చేతివ్రాతలో అప్పటి నించి ఇప్పటి వరకూ ఇసుమంతైనా మార్పు లేదు. అంటే - అతడి మానసిక స్థిరత్వం అంత దృఢమైనదన్నమాట.
ఆ మాటే ఓ రోజు రవితో అంటే - ‘అయ్యబాబోయ్! నీతో మాట్లాడటం కష్టం’ అని నవ్వుతూ నా మాటని తేలిగ్గా తీసిపారేశాడు కానీ రవిని పరిశీలించటం నేనంత తేలిగ్గా వదలనుగా!
రవీ, నేను ఒకే రకమైన కాలమాన సామాజిక ఆర్థిక పరిస్థితులలో నించే ప్రపంచంలోకి వచ్చాం. కానీ పెరిగి పెద్దవుతున్న కొద్దీ మా ఆలోచనల దారులు వేరయ్యాయి. రవి పద్ధతులు, ఆలోచనలు, నడక, నడవడిక, సంప్రదాయం, సామాజిక నియమాలకు, నైతిక విలువలకు వీలుగా ఉండేవి.
అతడొక బ్రాహ్మణుడు. ఇంత ఆధునికతలోనూ తెల్లవారుజామునే నిద్ర లేస్తాడు. సంధ్య వారుస్తాడు. పూజలూ పునస్కారాలూ చేస్తాడు. ఆదిత్య హృదయం పఠిస్తాడు. కానీ, తెల్లవారితే, బయటికి వచ్చి రోడ్డు పక్క నుండే షాపులో ‘టీ’ తాగుతాడు. తన స్నేహితులైన మాంసాహారులతో కలిసి ‘తన’ భోజనం కానిస్తాడు.
ఇందులో మొదటి రెండూ సమాజ నియమాలైతే, తర్వాతి రెండూ నైతికతకు సంబంధించినవి.
మరోలా చెప్పాలంటే - తామరాకు మీద నీటిబొట్టు నిలిచిన చందంగానే - ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు జీవితాన్ని ఆస్వాదిస్తూనే, ఎక్కడివక్కడ వదిలేసి వెళ్లిపోతుంటాడు.
భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన ‘స్థితప్రజ్ఞత’ గురించి నాకు కూలంకషంగా తెలీదు గానీ, అన్నింటిలో ఉంటూనే దేనికీ చెందకపోవటమే’ దాని అర్థం ఐతే రవి నిజంగా స్థితప్రజ్ఞుడు - కనీసం నా దృష్టిలో!!
ఇదంతా రవి గురించి అతడి వ్యవహార శైలి గురించే తప్ప కులమతాల ప్రస్తావన నా ఉద్దేశం కాదు.
నిజానికి ఈ కథ రవిది కాదు. రవికి సంబంధించింది కూడా కాదు. ఇది కేవలం నాకు సంబంధించినదే. ఐతే - నా జీవితంలో రవి కూడా ఒక ‘పార్ట్’ కాబట్టి ఇదంతా చెప్పాల్సి వస్తుంది. ఆ మాటకొస్తే - నన్ను ప్రభావితం చేసిన వ్యక్తులు ఇద్దరు - ఒకరు రవి, రెండు - నా అభిమాన రచయిత పుస్తకాలు.
రవి జీవితమంతా క్రమశిక్షణతో - ఒక ఇంజనీరు ఒక బిల్డింగ్ కట్టటానికి ఎంత పకడ్బందీగా ప్లాన్ గీస్తాడో, గీసిన దాన్ని ఎంత నేర్పుగా అమలుపరుస్తాడో - అంత ప్లాన్డ్‌గా సాగింది. ఐతే - అదంతా ఎవరో ఒకరు దగ్గరుండి నడిపించింది కాదు. రకరకాల మనుషుల మధ్య, పరిస్థితుల మధ్య తనకై తాను గీత దాటకుండా, విలువలు కోల్పోకుండా ఏర్పరచుకున్న ఒక నిబంధన.
ఆ మాటకొస్తే ‘నిబంధనం’ అనేది కూడా తప్పే. ఎందుకంటే - నిబంధన అంటే బలవంతంగా రుద్దబడేది. కానీ రవి విషయంలో అది మనసులోనే పెట్టుకున్న ఒక కట్టుబాటు. అంతే!
రవి యూనివర్సిటీలో చదివే రోజుల్లో - నేను అప్పుడప్పుడూ వాళ్ల రూముకు వెళ్లటం తటస్థించేది. అప్పుడు, రవి, వాళ్ల స్నేహితులు, వారివారి పద్ధతులు చూసి ముచ్చటపడి నేను కూడా కచ్చితంగా అదే యూనివర్సిటీలో అదే చదువు చదవాలని గట్టిగా నిశ్చయించుకున్నా.
ఐతే ఆ నిర్ణయం తప్పని అప్పట్లో తెలీలేదు.
మనుషులు రకరకాలుగా ఉంటారనీ, వారి అలవాట్లు వారివారి ఆలోచనలకు ప్రతిరూపమనీ, మనిషికీ మనిషికీ ప్రవర్తనలో తేడా ఉంటుందే తప్ప పరిస్థితుల్లో కాదనీ అప్పట్లో నాకు తెలీదు.
రవి అలా వున్నా, ఇంకో స్నేహితుడు మరోలా వున్నా అది జన్మతః వచ్చిన సంస్కారం తప్ప మరోటి కాదన్న విషయం - నాకు ఎదుగుతున్న కొద్దీ అవగతమవసాగింది.
రవి గురించి ఇంత గొప్పగా చెప్పటానికీ, చెప్పాలనిపించటానికీ నాకు గల కారణం - అతడు మా వీరాంజనేయులు అయ్యవారు కొడుకు. వీరాంజనేయులు అయ్యవారంటే అప్పట్లో ఆ చుట్టుపక్కల ఊళ్లల్లో చాలా పేరున్న టీచరు. నాకు అఆల నించీ సంస్కారం దాకా నేర్పిన గురువు ఆయన. ఆయన కాలం చేశాక - ఆయన మీద వుండే గౌరవం, భక్తి రవి మీదకు మళ్లాయేమో!
ఇది ఒక కారణం.
ఐతే - నాకు రవి మీద గౌరవం రెట్టింపైన విషయం మరోటుంది.
రవి ఒక్కగానొక్క కూతురు శ్రావణి. బాగా చదువుతుంది. శ్రావణి తన సొంతంగా ఇంజనీరింగ్‌లో మంచి ర్యాంకు తెచ్చుకుని ఆ డొనేషన్లూ లేకుండా కాలేజీలో జాయిన్ అయితే, ఒక తండ్రిగా తన బాధ్యతని నెరవేర్చాలని తన కూతురికి అయ్యేంత ఖర్చు మరొకరికి పెట్టి చదివిస్తున్న వ్యక్తి - రవి. మరి అలాంటి వ్యక్తి మీద ఎవరికైనా గౌరవం పెరగకుండా ఎలా ఉంటుంది? గ్రూప్స్ పరీక్షలు రాసి, ర్యాంకు తెచ్చుకుని ట్రైనింగ్‌కి కూడా వెళ్లి చివరికి తనకిష్టమైన టీచింగ్ ప్రొఫెషన్‌లోకి వచ్చిన వ్యక్తి -రవి.
ఒక్క మాటలో చెప్పాలంటే - రవి అంటే - ఘనీభవించిన జ్ఞానానికి గుర్తు!
అలాంటి రవిని చాలా రోజుల తర్వాత కలిశాను.
కుశల ప్రశ్నలయ్యాక రవి అడిగాడు. ‘కవీ! ఈ మధ్య కథలేమైనా రాశావా?’ అని.
‘లేదు రవీ! ఆలోచనలు రావటం లేదు. ఆలోచించటంత తీరిక కూడా ఉండటం లేదు’ అన్నాను.
నేనొక చిన్నసైజు రచయితను. వృత్తి జీవితం ఒకటయితే, ప్రవృత్తి అప్పుడప్పుడూ రచనలు చేయటం. ఆ చనువుతోనే రవి నన్ను ‘కవీ’ అని సంబోధిస్తుంటాడు.
‘ఏం? ఎందుకు రాయటంలేదు? రాయటం మంచి అలవాటేగా’ అన్నాడు.
‘అవుననుకో..’ ఒకప్పుడు ఆలోచనలు బాగా వచ్చేవి రవీ. ఒక మనిషిని చూసినా, సంఘటన చూసినా, ఒక గొప్ప భావం చదివినా, విన్నా దాన్ని ఇంకో దానికి ఆపాదించి నాకు తోచిందేదో చెప్పాలనిపించేది. కానీ రానురాను మనసులో తడి ఆరిపోవటం మొదలుపెట్టింది. ఉదాహరణకు - నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ఎక్కడైనా బిచ్చగాణ్ణి చూస్తే చాలా దయ కలిగేది. వెంటనే జేబులోంచి ఎంతో కొంత తీసి అతడికి ఇచ్చేవాణ్ణి. కానీ ఇప్పుడు - ఇంత జీవితాన్ని చూసిన తర్వాత - అలాంటి వ్యక్తులెవరైనా తారసపడితే మనసుకి ‘పాపం’ అనిపించటంలేదు. ఇంకా చెప్పాలంటే - అలాంటి వాళ్లను చూసి తల తిప్పుకుంటున్నాను. అలా అని ఆ ఆలోచన అంతటితో వదిలెయ్యటంలేదు. నేనెందుకు మారాను? నిజంగా నేను డబ్బు మనిషిని అయ్యానా అనిపిస్తుంది. నిజానికి విద్యార్థిగా ఉన్నప్పటి కంటే, ఇప్పుడే నేను ఎవరికైనా ఆర్థిక సహాయం చేయగల స్థితిలో వున్నాను. మరి ఎందుకు చెయ్యటంలేదు?
అంటే నాకు రెండు కారణాలు కనిపిస్తున్నాయి.
ఒకటి - అడుక్కోవటం వాళ్ల వృత్తి. మనం వేసినా, వేయకపోయినా ఇంతమంది జనాల్లో కొంతమందైనా వేస్తారు.
రెండు - వీరంతా నిజంగా యాచకులు కారు. కేవలం ఒక గంటో, రెండు గంటలో అక్కడికొచ్చి నిలబడి దండుకొని పోయేరకం.
మరి వీటిలో ఏది నిజం - ఏది కాదు అనేది పక్కనపెట్టి ఆలోచించినా, నా ఆలోచనల పరంపర అలా సాగి కొన్నిసార్లు వేసి, కొన్నిసార్లు వెయ్యక వెళ్లిపోతుంటాను. ఇదంతా - నా ఆలోచనల్లో వచ్చిన మార్పు అని చెప్పటమే నా ఉద్దేశం. ఇది ఒక కారణం.
దీనికంటే మరో ముఖ్య కారణం - ఒకప్పుడు నేను నా అభిమాన రచయిత పుస్తకాలు చదివి స్ఫూర్తిపొంది జీవితాన్ని తీర్చిదిద్దుకున్నాను. ఐతే - నా బాధేమిటంటే- మనం ఒక కథో నవలో రాస్తే చదివే వాళ్లకి అది ఒక స్ఫూర్తిగా ఉండాలే తప్ప, అనవసర విషయాలు చెప్పి కేవలం టైంపాస్ వ్యవహారంలా ఉండకూడదు. అదీగాక - ఒక సంఘటన గురించో, ఆలోచన గురించో నాకు తెలిస్తే అది కచ్చితంగా పాఠకులకి చెప్పాలి అని బలంగా అనిపించే సమయం కోసం ఎదురుచూస్తున్నా. అలా ‘మంచి కథ’ చెప్పటం కోసం ఆలోచించే క్రమంలో రాయటం అన్నది మరుగున పడిపోతోంది’ అన్నాను.
రవి నవ్వాడు.
నవ్వి ‘... ఒకప్పుడు నీ ఆలోచనలు ఒకలా వుండేవన్నావు. ఇప్పుడు మారాయి అన్నావు. మార్పు సహజం. అదేమీ పెద్ద తప్పు కాదు. చిన్నప్పుడు చాక్లెట్ కోసం ఏడవటం సహజం. పెద్దయ్యాక కూడా ఏడిస్తే అసహజం. ఆ మార్పు వయసుతోపాటు రావాలి. మన చుట్టూ జరిగే వివిధ సంఘటనలు, విన్న విషయాలు.. అన్నిటినీ మించి ప్రాక్టికాలిటీ.. మనిషిని మార్చేస్తుంది.
మనం మారాలి కూడా.
సాధారణంగా ప్రతి మనిషీ జరిగే సంఘటనకు పాజిటివ్‌గానో, నెగెటివ్‌గానో స్పందించాలి. నీలాంటి వాడైతే ఇంకా ఎక్కువ స్పందించాలి. ఇక్కడో ఏదో జరిగినంత మాత్రాన, దాన్ని ఇంకోదానికి లింక్ చేసి అసలు ఏ మాత్రమూ పట్టించుకోకపోవటమన్నది మంచిది కాదు. కాబట్టి మనసుకి అప్పుడప్పుడు కాస్త ‘సున్నితత్వాన్ని’ అద్దుతూ ఉండు.
ఇక నీ రెండో కారణం - ‘నేను రాసే ప్రతి కథ గొప్పగా, స్ఫూర్తిగా ఉండాలని నీ అభిమాన రచయిత కూడా అనుకుని రచనలు మొదలుపెట్టలేదు. మొదట్లో తనకు తోచినవేవో రాసేవాడు. కాలక్రమేణా డబ్బు, కీర్తి పెరిగాక, అప్పటివరకూ తన కోసం రాసుకున్నవాడల్లా, పంథా మార్చి చదివే వాళ్ల కోసం రాయటం మొదలుపెట్టాడు.
ఎప్పుడైతే అతడు ‘తన కోసం’ రాస్తున్నాడని పాఠకులు భావించటం మొదలుపెట్టారో, అప్పటి నించి అతడిని ఇంకా నెత్తిన పెట్టుకున్నారు. ఐతే, ఈ పరంపరలో అతడు ఎప్పుడూ ‘మంచి’ కథ కోసమంటూ ఆగిన దాఖలాలు లేవు. తనకు నచ్చిందేదో రాసుకుంటూ పాఠకులకు ఇంకా కొత్తగా చెప్పటం మొదలుపెట్టాడు.
నీళ్ల కోసం గునపంతో నేలను తవ్వే సమయంలో వందో దెబ్బకి నీరు పెల్లుబకవచ్చు. అంతమాత్రం చేత మిగిలిన తొంభై తొమ్మిదీ పనికిరాలేదని కాదుగా!
జీవితం కూడా అంతే!
పనిచేస్తూ పోతే పర్ఫెక్షన్ దానికదే అలవాటవుతుంది.’
నాకు నిజమే అనిపించింది. మరి నేను ఈ కోణంలోంచి ఎందుకు ఆలోచించలేకపోయాను. తిరిగి రవినే అన్నాడు. ‘కథలు గానీ, కవిత్వం గానీ రావాలంటే మనిషి గతంలోకి వెళ్లాలి. నిన్నటి రోజు నువ్వు ఎలా ఉన్నావో గుర్తుంటే, ఈ రోజు గురించో, రేపటి గురించో ఆలోచన వస్తుంది. నువ్వు చెప్పేదాన్ని బట్టి - జీవితపు పరుగులో నువ్వు కూడా గతాన్ని మరిచి కేవలం రేపటి దృష్టితో అందరిలా ముందుకే చూస్తూ పరిగెడుతున్నావేమో ననిపిస్తుంది.
సాధారణంగా రచయితలూ, కళాకారులూ సున్నితంగా ఉంటారని నీకు తెలుసు. ఐతే - అది నిన్నటిలో దొరుకుతుంది గానీ, రేపటిలో కాదు. రేపటి గురించిన ఆలోచనలో - అవసరాలు, ఖర్చులు, సంపాదన, బాధ్యతలు.. ఇవే కనపడతాయి. ఫలితంగా ‘దిగులు’ మిగులుతుంది. అలా అని ఆశ ఉండకూడదని కాదు.. నిన్నటిలోకి చూస్తే.. ఎంతటి అమాయకంగా, వున్నవాటితోనే సర్దుకుంటూ, జాగ్రత్తగా.. అయినా నిత్య సంతోషంతో ఎలా వుండేవాళ్లమో గుర్తొచ్చి మన విజయం కళ్లముందు కనిపించి, తృప్తి కలిగి అది రేపటి మరొక విజయానికి ప్రేరణనిస్తుంది.
ఎక్కడైతే తృప్తి ఉంటుందో, అక్కడ ఆలోచనలు మన దారిలో నడుస్తాయి. మెదడు ఆలోచనలని ఉత్పత్తి చేస్తుంది. ఆ జల ఊరటం ఒకసారి మొదలయితే ఆపటం ఎవరి తరమూ కాదు. కాబట్టి నీ వ్యాసంగాన్ని ఆపకుండా కొనసాగించు.’
రవి చెప్పటం ముగించాడు. నాకు ఆశ్చర్యం కలిగింది. రవి చేసిన విశే్లషణకన్నా నన్ను ముగ్ధుణ్ణి చేసింది ఇంకో సంగతి - క్లాసులో తప్ప ఇంతసేపు రవి బయట మాట్లాడటం మొదటిసారి చూసినందుకు. అదీ నా విషయంలో అయినందుకు.
ఐతే - ఇంత చెప్పిన తర్వాత రవి ఎవరో మీకు అర్థమయ్యే వుంటుంది.
రవి నా స్నేహితుడు కాదు. కాస్త పెద్ద. నాకున్న చనువుతో ‘రవీ రవీ’ అని పిలుస్తూంటానంతే! ఇంతకీ రవికి నేను ఏమవుతానో చెప్పలేదు కదూ!
రవికి నేను శిష్యుణ్ణి!
అవును. రవి నా గురువు!!
మేమిద్దరం - గురుశిష్యులం!!
===========================================================

కథలకు ఆహ్వానం
‘ఆదివారం ఆంధ్రభూమి’కి కథలు పంపవలసిన చిరునామా:
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 500 003.
పీడీఎఫ్ ఫార్మాట్‌లో sundaymag@andhrabhoomi.net కు మెయల్‌లో పంపాలి.

-సడ్డా సుబ్బారెడ్డి