కథ

ఈత మజ్జిగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎప్పటి నుండో ప్రసాద్‌ను చూద్దామనిపించి అఫీస్ పనిమీద ముంబయి వెళ్లినవాడిని తిరిగి వస్తూ పూణేలో దిగి ప్రసాద్‌కు ఫోన్ చేశాను. గంటలో వచ్చి నన్ను తను ఉంటున్న ఆఫీసు క్వార్టర్స్‌కు తీసుకు వెళ్లాడు. అతని ఇంటికి రావడం అదే మొదటిసారి. ఇల్లు ఏమంత పెద్దది కాకపోయినా ఒంటరివాడికి పెద్దది లానే అనిపించింది. అప్పటికి అతని పెళ్లి ప్రయత్నాలు లూప్ లైన్ లో ఆగి ఉన్నాయి. అంతకుమునుపు నేనూ పూణేలో పనిచేశాను. ఆక్కడి లాడ్జి జీవితానికి హోటల్ భోజనానికి రెండు సంవత్సరాలు కాకుండానే మొహం మొత్తిపోయి ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్ వచ్చేశాను. అదృష్టవశాత్తూ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలో మంచి ఉద్యోగమే వచ్చింది. నాకు నచ్చని విషయం బదిలీలు ఉండక పోవడం, మూడు సంవత్సరాలకు ఒకసారి పెట్టేబేడా సర్దుకుని పొలోమని ఊళ్లు తిరగడం నావల్ల కాదు.
ఆ రాత్రి హోటల్ లో భోజనం చేసి రెండో ఆట ఇంగ్లీషు సినిమా చూసి అతని ఇంటికి చేరుకునేసరికి పనె్నండున్నర దాటింది. డాబామీద పరుపులు వేసుకొని పడుకున్నాం కానీ వెంటనే నిద్ర పట్టలేదు. గంటన్నరకు పైగా కబుర్లు చెప్పుకుంటుండం గా బడలికకు కనురెప్పలు బరువెక్కి ఆవలింతలు రావడం మొదలైనపుడు ప్రసాద్ హఠాత్తుగా అన్నాడు. ‘‘నేనో భగ్న ప్రేమికుడినిరా’’
ఉలిక్కిపడ్డాను. రెక్కలు వచ్చినట్టు నిద్ర ఎగిరిపోయింది. చాలా సంవత్సరాల నుండి మా ఇద్దరి మధ్య స్నేహం ఉన్నా అతని వ్యక్తిగత విషయాలు నేను ఏనాడు అడుగలేదు. అతను చెప్పలేదు. నాగురించి నేను ఏవిషయం దాచుకోలేదు. అతని గురించి తెలుసుకోవాలని అనిపించలేదు. అతని మాటకు జాలివేసి లేచి కూర్చున్నాను. చంద్రుడి వెలుగులో అతని కళ్లలోంచి నీళ్లు కారుతున్నాయి. చిన్న గా ఏడుస్తున్నట్టు అనిపించింది. ఇన్ని సంవత్సరాలు మా స్నేహితంలో అలాఅతనిని చూడడం అదే మొదటిసారి. అతనిని ఎలా సముదాయించాలో నాకు తట్టడం లేదు. అతని మ ఆటలు రవంత కరుకుగా ఉన్నా నాకు తెలిసి సున్నిత మనస్కుడు.
‘ఏమైంది?’ అడిగాను.
వెంటనే జవాబు చెప్పలేదు.
లేచి కూర్చుని కళ్లు తుడుచుకున్నాడు. వెనె్నల వెలుగు చల్లగా ఉంది. ఏమైంది అని మళ్లీ అడుగుదామనుకునేంతలో ప్రభావతి గురించి నీకెప్పుడూ చెప్పలేదనుకుంటాను’అన్నాడు.
చెప్పలేదు అన్నాను నేను
ప్రభావతీ నేను బి.ఎస్.సి వరకు కలిసి చదువుకున్నాం. ఇంటర్‌లో ఉండగానే దగ్గరయ్యాం. డిగ్రీ పూర్తయినతరువాత బి.ఎడ్ లో చేరింది. నేను యూనివర్సిటిలో చదవడం మొదలెట్టాను. బి.ఎడ్ అయిన వెంటనే ఆమె లోకల్ ఉన్న మిషన్ హైస్కూల్ లో టీచర్‌గా చేరింది. నేను ఎంఎస్‌సి పూర్తి చేసిన వెంటనే నాకిక్కడ ఉద్యోగం దొరికింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అయినందువల్ల స్థిరపడిపోయానిక్కడ. ఈ నగరాన్ని చూసి మీరంతా వెళ్లిపోతుంటే నాకు బాధవేసింది.
‘‘ఇంతదూరంలో ఉన్నా ప్రభావతి మీద నాకున్న ప్రేమ మరింత ఎక్కువైంది. మంచి సమయం చూసుకొని పెళ్లి చేసుకొందామని అనుకున్నాం. ఎంత త్వరగా అయితే మంచిదనిపించసాగింది. ఎంచేతంటే ఆమెకు సంబంధాలు వస్తున్నాయి. ఏదీ ముడి పడడం లేదు. అన్ని విషయాలు ఎప్పటికప్పుడు ఉత్తరాలు ద్వారా తెలియ
జేస్తోంది.
‘‘మావాళ్లు నాకు సంబంధాలు చూస్తున్నారు. గానీ దాటేస్తూ రాసాగాను. దూరంగా ఉన్న నాకు పిల్లనివ్వడానికి అవతల వాళ్లు ముందుకు రాకపోవడం నాకు ప్లస్ పాయింట్ అయింది. ప్రభనూ వదలి నేనుండలేను. తనూ అంతే మేం ఒక్కటికావాలి. మా పెళ్లి వెనక్కి నెట్టేయకుండా మావాళ్లకు ప్రభావతి గురించి చెప్పాను. నీ ఇష్టమే మా ఇష్టం అన్నారు. అక్కా బావలను వాళ్లింటికి పంపించి ఆమె తల్లిదండ్రులతో మాట్లాడించాను. ఆమె తల్లిదండ్రులు ప్రభను నాకివ్వడానికి వీలుకాదంటే వీలుకాదన్నారు. కారణం ఏమిటో కూడా చెప్పడానికి ఇష్టపడలేదు. మావాళ్లకన్నా నేనెక్కువ నిరుత్సాహ పడిపోయాను.
నాకు సెలవు దొరికి ఉంటే మా ఊరు వెళ్లి వచ్చి ఉండేవాడిని. ఆడిట్ జరుగుతుండడం వల్ల నా కాళ్లు కట్టి పడేసినట్టయింది. కదలేకపోయాను. ప్రభకు ఉత్తరం మీద ఉత్తరం రాయడం మొదలెట్టాను. నా ఉత్తరాలు తనకు అందడం లేదా ఏమో ఏ ఉత్తరానికీ జవాబు వచ్చేదికాదు. చాలా బాధవేసేది. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం అయ్యేదికాదు. అక్కనాకు స్నేహితులాలిగా ఉండేది. ఆమెకయినా చెప్పుకుందామని చాలా సార్లు అనిపించింది. కాని ధైర్యం చేయలేకోపోయాను.
కొద్దిరోజుల తరువాత ప్రభావతి నాకు ఉత్తరం రాసింది. కవరులోంచి ఉత్తరం తీయకముందు ఎంత సంబరపడిపోయానో తీసి చదివాక అంత నిరుత్సాహపడిపోయాను. తను ఏమని రాసిందంటే
నా పెళ్లి నిశ్చయించబడింది. నా ఇష్టానిష్టాలు ఎవరూ పట్టించుకోవడం లేదు. తాంబూలాలు పుచ్చుకోవడం కూడా జరిగింది. మూడు నెలలు గడిచిన తరువాత మంచిరోజు చూసి మిగిలిన కార్యక్రమాలు పూర్తి చేస్తారట. నా చేతులు కాళ్లు కట్టేసినట్టు ఏం చేయలేకపోయాను. ఈ జన్మకు ఇంతేనేమో అనిపిస్తోంది. నిజం చెబుతున్నాను. నాకు పెళ్లి అయ్యాక మగపిల్లాడు పుడితే నీ పేరు పెట్టుకుంటాను. లేదూ నాకు ఆడపిల్ల పుడితే ప్రసీద అని పెట్టుకుంటాను. నా పిచ్చి ఆలోచనలో పడి నువ్వు ఏం చేసుకోకు.నామీద ఒట్టు. పెళ్లికి కార్డు పంపుతాను. నువ్వు రాకపోతే ఎంతో సంతోషిస్తాను. ఇహనుండి దయచేసి నాకు ఉత్తరాలు రాయకు. ఇది నా చివరి ఉత్తరం. ఉంటాను. మామూలుగా చివర్లో ఉండే ప్రేమతో, అనేక ముద్దులతో , నీ , కేవలం నీ లాంటి పదాలు ఏమీ లేవు. సంతకం మాట అటుంచి కనీసం పేరయినా రాయలేదు.
అతను చెబుతూనే ఉన్నాడు. ఎంతగా ప్రయత్నించినా నిద్రను ఆపుకోలేకపోతున్నాను. నిద్రలోకి జారిపోయాను. ఉదయం బాగా పొద్దుపోయేక లేచేసరికి అతనూ లేడు, పరుపు లేదు . అతనికథ పూర్తిగా విననందుకు నామీద నాకే కోపం వచ్చి ఉండాలి. అతని తత్వం నాకు బాగా తెలుసు. సంతోషం వచ్చినా కోపం వచ్చినా తనను తను పట్టుకోలేడు. పదినిముషాల్లో మామూలు మనిషి అయిపోతాడు. ఈ పదినిముషాల్లో జరగకూడనిది జరగిపోతుంటుంది.
చాపతో పరుపు చుట్టి మెట్లు దిగి కిందకు వచ్చాను. అతను మధ్యగదిలోని సోఫాలో కూర్చుని దినపత్రిక చదువుకుంటూ అవుపించాడు. నన్ను చూడగానే పత్రిక పక్కన పెట్టి బెడ్ కాఫీ తాగుతావా అన్నాడు.
రాత్రంతా నిద్ర పోలేదేమో కళ్లు ఎర్రగా వాచి ఉన్నాయి.
‘తాగుతాను’ అని పడక గదిలోకి నడిచి పరుపు రెండో మంచం మీద పరిచి మధ్య గదిలోకి వచ్చి కూర్చోగానే కాఫీ తెచ్చి ఇచ్చాడు. నేను వినలేక పోయిన విషయాల గురించి అడుగుదామనిపించింది. కానీ అడగలేదు.
ఆ సాయంత్రం నన్ను హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కించి ఫ్లాట్‌ఫాం మీద నిలబడి ఉండి కదిలాక నువ్వు నన్ను మళ్లీ చూస్తావో లేదో అంటుంటే అతని కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అతను ఎంతగా బాధపడుతున్నాడో నాకు అర్థమైంది.
అతని చేతిమీద నా చేయి వేసి ‘అంత మాట అనకు. త్వరలోనే నిన్ను తప్పకుండా చూస్తాను ’అన్నాను. అతను వేగంగా నడుస్తూ ఏదో అన్నాడు కాని బండి వేగం అందుకోవడంలో అతనన్నది స్పష్టంగా వినిపించలేదు.
హైదరాబాద్ వచ్చాక అతన్ని ఛీరప్ చేయడానికి వారం విడిచి వారం ఐదు ఉత్తరాలు రాశాను. దేనికీ జవాబు రాలేదు. అతను ఏమైనా అఘాయిత్యానికి పాల్పడ్డాడేమో అని భయం వేసింది. బేగంపేట అబ్జర్వేటరీ ఆఫీసులో పని చేస్తున్న అతని స్నేహితుడి ఆఫీసు నెంబరు వెతికి పట్టుకుని ఫోన్ చేసి ప్రసాద్ గురించి ఆదుర్దాగా అడిగాను. అప్పట్లో సెల్‌ఫోన్లు ఉండేవికావు. ఎస్.టి.డి చేయాలన్నా ఇబ్బందిగా ఉండేది. అతనికేం నిక్షేపంగా ఉన్నాడు. నినే్న అతనితో ఫోన్‌లో మాట్లాడాను అన్నాడు. నినే్న అతనితో ఫోన్‌లో మాట్లాడాను అన్న మాటలు విని నా మనసు తేలిక పడింది.
తరువాత అతని స్నేహితుని ద్వారా ప్రసాద్‌ను పూణే ఎయిర్‌పోర్టు నుండి నాసిక్ ఎయిర్‌పోర్టుకు మార్చారని అంటుండం ముంబయిని విడిచాడని, తరువాత అస్సాం వెళ్లాడని విన్నాను. అతని ఆఫీసు నెంబర్ కోసం తంటాలు పడ్డాను. కానీ దొరకలేదు. అతన్ని మిస్ అయ్యానని చాలాసార్లు అనుకుని బాధ పడ్డాను. సంవత్సరాలు గడిచిపోయాయి.
మా సంస్థకు అవసరమయి కొరియర్ సర్వీసులకు ప్రకటనలు ఇచ్చాం. కొటేషన్స్ వచ్చాయి. తక్కువ కోట్ చేసిన మూడు కంపెనీలను నెగోషియేషన్స్‌కు పిలిచాం. మూడు పేరున్న కంపెనీలే. గమ్మత్తేమిటంటే మూడు కంపెనీలు ఒకే ధర కోట్ చేశాయి. నెగోషియేషన్స్‌లో ఎవరూ రూపాయి కూడా తగ్గలేదు. ఈ ప్రక్రియలో ఒక కంపెనీ నుంచి పాల్గొన్న మేనేజర్ పేరు ‘ప్రసీదా’ ఆ అమ్మాయి నుండయినా నా ప్రసాద్ వివరాలు తెలుస్తాయేమో అనిపించింది. ఎన్నో సంవత్సరాలు కిందట ప్రసాద్‌కు ప్రభావతి రాసిన చివరి ఉత్తరంలోని మాటలు నాకు ఇంకా గుర్తు ఉన్నాయి.
‘మీదే ఊరమ్మా’ అడిగాను.
‘్భమవరం’ అందా ప్రసీద
ప్రసాద్ కూడా భీమవరమే.
ప్రసాద్ ఇంటిపేరు చెప్పి అతను మీకు తెలుసా? కనీసం పేరయినా విన్నావా అడిగాను.
ఆ ఇంటిపేరుగల వాళ్లెవరూ నాకు తెలియదండీ అంది.
నిరుత్సాహపడ్డాను. దొరికాడు అనుకొనేంతలో జారిపోయాడు. మీ అమ్మగారి పేరు ప్రభావతా అని అడుగుదామని మాట నోటి చివరి దాకా వచ్చింది. కానీ అడగలేకపోయాను.
ఎందుకు అడుగుతున్నారు అడిగింది.
మీ ఊరు భీమవరం అనేసరికి అతను గుర్తువచ్చాడు
అంతే అన్నాను.
మా సంభాషణ అంతటితో ముగిసిపోయింది.
సంవత్సరంన్నర గడిచాక బేగంపేట ఎయిర్ పోర్టు అబ్జర్వేటరీ నుండి ప్రసాద్ స్నేహితుడు గపూర్ నాకు ఫోన్ చేసి ప్రసాద్ హైదరాబాదులోనే ఉంటున్నాడు.‘ నెంబర్ మెసేజ్ చేస్తాను మాట్లాడు’ అన్నాడు. ఫోన్ చేసిన మధ్యాహ్నానికి మా ఇంటికి వచ్చాడు. మనిషిని గుర్తుపట్టలేకపోయాను.

మారిపోయాడు. చాలా సంతోషం వేసింది. అతన్ని కౌగలించుకుని రెండు మూడు నిముషాలు ఉండి పోయాను. నాకు బాధ కలిగించిన విషయం ఏమిటంటే అతని ముఖం దుఃఖభారంతో ఉండడం ప్రభావతి దెబ్బనుండి కోలుకోకపోవడం అయి ఉండదు. అది ఏమంత పట్టించుకోవలసిన విషయం కాదు. టీ చేసి ఇచ్చాను తాగాక ‘నీ భార్యాపిల్లలు బయటకు వెళ్లారా’ అడిగాడు.
‘ఎవరు లేరు’ అన్నాను.
‘అదేమిటి’
‘పెళ్లి చేసుకొనే వయసులో ఏదీ కుదరలేదు.’చూస్తుండగానే వయసు నలబైయికి వచ్చేసింది. ఎవరు ముందుకు రాలేదు. నాకూ ఆసక్తి పోయింది. ఈ పుస్తకాలు పాటలు కేసెట్లు సీడీలే నా ప్రపంచం అయింది. జీవితంలో నేను సాధించిందేమీ లేదు అన్నాను.
ఆ మధ్యాహ్నం నా ఇంటికి దగ్గరగా ఉన్న హోటల్‌కు తీసుకొని వెళ్లాను. ఆసమయంలో జనం అట్టే ఉండరు. మూలగా ఉన్న సీట్లో కూర్చున్నాం. ఏమేమి కావాలో ఆర్డరిచ్చాక తన గురంచి చెప్పడం మొదలు పెట్టాడు.
అస్సాంలో పని చేస్తుండగా దుబాయ్ నుండి మంచి అవకాశం వస్తే వెళ్లిపోయాను. అక్కడ ఐదు ఏళ్లు పనిచేశాను. డబ్బులకేం కొదువ లేదు. గానీ ఒక సమయంలో ఇహచాలనిపించి తిరిగి వచ్చేశాను. లోగడ పనిచేసిన ఉద్యోగం కోసం ప్రయత్నం చేశాను. కానీ లాభం లేకపోయింది. బ్రేక్ ఇన్ సర్వీస్ అవడానికి పెన్షన్ అర్హత పోయింది. ఇక్కడకు వచ్చి మెడికల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో మేనేజర్‌గా చేరాను. ఉప్పల్ లో ఫ్లాట్ కొనుక్కుని అందులో ఉంటున్నాను. అమ్మాయికి పెళ్లయింది. తరుత వాడు వికలాంగుడు. వికలాంగుల స్కూల్ చేర్పించాను. వాడి స్కూలుకు సెలవు ఇచ్చినపుడు ఇంటికి వస్తుంటాడు. వాడితో సమస్మ ఏమిటంటే వాడింట్లో ఉంటేప్రతిదీ ఆగమాగం చేస్తాడు. నా లాప్ టాప్ నన్ను వాడుకోనియ్యడు. నాసెల్ ఫోన్ వాడి దగ్గరే ఉండాలి. అంతకు ముందు మూడు నాలుగు సెల్ ఫోన్లు కొనిచ్చాను. కోపంలో వాటిని విసిరి కొట్టి విరగొట్టేశాడు. ఏమిట్రా ఈ పని అని అడిగితే మాటే వినడు. పైగా నానాయాగీ చేస్తుంటాడు. కొట్టడానికి మనస్సు ఒప్పదు. మేం బతికున్నంత కాలం వాడివి చూసుకొగలం. మేం పోయాక వాడెలా బతుకుతాడో అని తలుచుకుంటే బాధ వేస్తుంటుంది. వాడు చేసే పనులేమో చికాకుకలిగిస్తుంటాయి. నేను పడుకునే మంచం వాడికి కావాలి. నా మంచం మీదే గలీసు చేస్తుంటాడు. కావాలని వాడి మంచం మీద వాడు పడుకోడు. వాటి బాధపడలేక బాల్కనీలో చాప, పరుపేసుకుని పడుకుంటే అక్కడకు వచ్చి నన్నక్కడి నుంచి లేపేస్తాడు. ఏం చేయాలో అర్థం కాదు. మళ్లీ స్కూల్ లో ఏ పిచ్చిపనులు చేయడు. అందరితో మాగా మెలుగుతాడు. వాళ్ల ఆటల్లో పాల్గొంటే చాలా బహుమతులు గెల్చుకున్నాడు. .. ఆగాడు.
అప్పటికి మాకు రెండు పెగ్గులయ్యాయి. అతని కెపాసిటీ ఇన్ని సంవత్సరాలలో పెరిగినట్టు పెరిగినట్టు అనిపించింది. మరో రెండు చార్జీలు మంచింగ్ చెప్పాను. తన గురించి చెబుతున్న సమయంలో అతని భార్య నుంచి అనుకుంటాను. మూడు సార్లు ఫోన్లు వచ్చాయి. ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు ఎంత సేపట్లో వస్తావు? కోపంగా అంటున్న మాటలు విరుచుకుపడుతున్నట్టుగా వినిపించాయి. జవాబులు చెప్పేటపుడు ముఖంలోకి ఇబ్బందికరంగా చూస్తుంటే నాకు అతని మీద జాలి వేసింది. అతను ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఆమె తెలుసుకోవడం ప్రేమ అని అంటారేమో నాకు తెలియదు. ఒక మిత్రుడిని ఎన్నో సంవత్సరాల తరువాత కలుసుకుని కబుర్లు చెప్పుకుంటూ హోటల్ కూర్చుని ఉన్నాం అని చెప్పడానికి ఎందుకు భయపడుతున్నాడో నాకు అర్థం కాలేదు.
కొద్దిసేపు మవునంగా ఉండి, మరో లార్జ్ లాగించాడు. ఈసారి సోడా కలుపుకోలేదు.గొంతు సవరించుకుని ‘మా ఇంట్లోనే నేను పరాయివాడి నేమో నని రోజుకు ఒకసారి అయినా అనిపిస్తుంటుంది. నా భార్య హెడ్ మిస్ట్రెస్‌గా పనిచేస్తోంది. గమ్మత్తు ఏమిటంటే నన్నొక స్టూడెంట్ లా చూస్తుంటుంది. నా జీతం కన్నా మూడు రెట్లు ఎక్కువ గానే వస్తుంటుంది. అందుకు నాకు అసూయ లేదు. ఎవరికీ చెప్పుకోలేని విషయం ఏమిటో తెలుసా నవ్వొద్దు. ఇంట్లో మూడొంతులు పని నేనే చేయాలి. అంతే ఇంట్లో పనిమనిషి లేదు. ఆమె ధాటికి ఎవరూ రారు. సాయంత్రం ఆమె స్కూలు నుండి ఇంటికి వచ్చిన గంటలో నేనింటికి చేరుకోవాలి. ఆమె మాటకు ఎదురు చెప్పకూడదు. దేని గురించి ఎక్కువ మాట్లాడకూడదు. వౌనంగా కూర్చున్నా భరించదు. కన్సొలేషన్ ఏమిటంటే మా పిల్లలముందు బయట వాళ్ల ముందు ననే్నమనదు. నిజం చెప్పమంటావా? నేనో నరకం లో బతుకుతున్నాను. .. చెపుతున్నాడు. చేయి ఎత్తి సంజ్ఞ చేయగానే సివార్డ్ మరో రెండు లార్జ్‌లు ఆర్ దరాక్స్ తెచ్చిపెట్టాడు. రెండు గుక్కల్లో గ్లాసు ఖాళీ చేశాడు. ఇంత తీసుకొన్నా మనిషి మామూలుగా ఉన్నాడు. మాట లు తడబడడంలేదు. తేలికగా మరో రెంటు లార్జీలు లాగించేట్టు ఉన్నాడు.
నన్నువెంటనే ఇంటికి రమ్మని హుంకుం జారీ చేసింది. సాయంత్రం వరకు వెళ్లను గాక వెళ్లను. ఇప్పుడు వెళ్లినా సాయంత్రం వెళ్లినా మాటలు ఎటూ పడకుండా తప్పించుకోలేను. కాకపోతే మోతాదు రవంత ఎక్కువ అవుతుంది. జీవితం ఇలా ఉంటుందని నేనూ హించలేదు. అందరి భార్యలు ఇలా ఉండనే ఉండరు. చాలాసార్లు ఇల్లు వదిలి ఎటైనా వెళ్లి పోదామని అనుకున్నాను. వెళ్లి ఎక్కడో బతికేంత ధైర్యం ఈ వయసుకులేదు. తట్టుకోలేను. అంటుంటే కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి.
అందరూ ఉన్నవాడివి నువ్వే అలా అనుకుంటే మరి ఎవరు లేని వాడిని నేనేమనుకోవాలి. ఇంకోలార్జ్ చెబుతాను.
తలూపాడు.
‘అడగనిదే సలహాలు ఇవ్వకూడదు అంటారు చనువు కొద్దీ ఇస్తున్నాను. నువ్వొక పని చేసి ఉండాల్సింది’ అన్నాను.
రుమాలుతో కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పు ఏమిటిది అన్నాడు.
ధైర్యం చేసి వాళ్ల వాళ్లను ఎదరించి నువ్వు ఎంతగానో ప్రేమించిన ప్రభావతిని చేసుకొని ఉండుంటే ఇప్పుడు నువ్వు ఇన్ని బాధలకు లోను అవుతుంటే వాడివి కావేమో అన్నాను.
రుమాలు మడతలు పెడుతూ ‘‘నేను చేసుకొంది ప్రభావతినే’’ అన్నాడు.
గొంతులో గుటక అడ్డం వచ్చింది. రెండు లార్జీలు పడితే గానీ మామూలు కాదు.

- బి.పి. కరుణాకర్