ఈ వారం కథ

వేట ( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘సుందరీ!’’
గడ్డిమేస్తున్న ఆవులను చూస్తూ ఏదో ఆలోచనలలో ఉండిన సుందరి తల తిప్పి చూసింది.
దొంగరాముడు నవ్వుతూ తనకేసే వస్తూ కన్పించాడు.
‘నాతో నీకేం పని?’ అన్నట్లుగా విసుగ్గా చూసింది సుందరి.
కష్టపడి పనిచేసే తత్వం లేదు రాముడిలో. పశువుల సంతలో, ఇతర పల్లెలో వాళ్ళ పశువులు వీళ్ళకూ, వీళ్ళ పశువులు వాళ్లకూ అమ్మిపెట్టే దళారీ పనులతో కాలం గడిపేవాడిమీద సుందరికే కాదు.. ఆ వూర్లో ఎవరికీ సదభిప్రాయం లేదు.
‘‘నీకు సులభంగా రెండు వేల రూపాయలు వచ్చే మార్గం చెప్తా!’’ అన్నాడు దొంగరాముడు ఆమె దగ్గరగా వచ్చేసి.. ఆమెనే పరిశీలనగా చూస్తూ.
అరకొర ఆహారాలతో, అర్థాకలితో కాలం గడిపే కుటుంబంలోని పిల్లయినా వయసు తెచ్చిపెడుతున్న మార్పులతో చాలా అందంగా చురుకుగా వుంటుంది ఆమె.
‘‘దొంగోడు నీమాటలు నమ్మేదెలా?’’ అంది అనుమానంగా సుందరి.
‘‘నమ్మితే నీకే లాభం!’’ అన్నాడు రాముడు.
‘‘సరే చెప్పు!’’
‘‘ఇప్పుడు ఇక్కడే చెప్పను.. రేపు అమ్మోరి గుడి కల్ల నీ ఆవులు తోలుకురా.. అక్కడ చెప్తాను అన్నాడు రాముడు.
సుందరి వాళ్ళకున్న పొలం అంతంత మాత్రమే! వానలు లేకా, వానలు పడినప్పుడు పంటలకు గిట్టుబాటు లెక్కలు రాకా నానా అవస్థలు పడుతున్న కుటుంబం. సుందరి తమ్ముడు భీముడు పొలం పనులు లేనప్పుడు దగ్గరి టవున్‌లో లాగుడు రిక్షా లాగి ఇంతో అంతో తెస్తుంటాడు. తమకున్న రెండావులవల్లా వచ్చే పాలు పాల డిపో ఏజెంటుకు వేసి వచ్చే డబ్బు చన్నీళ్ళకు వేడినీళ్ళు తోడులా మండిపోతున్న ధరలమధ్యన రోజులు నెట్టుకొస్తున్న వుండీ లేని కుటుంబం వారిది. అందువల్ల రెండు వేల రూపాయలు అనగానే సుందరి మనసులో అంతర్గతంగా ఆశ రేగింది.
అందువల్ల మరునాడు తమ ఆవులను అమ్మోరి గుడివైపుకే తోలుకుపోయింది.
‘‘నీకు రెండు వేలు వచ్చే మార్గం చెపుతా.. నీకు ఇష్టమైతే సరే.. ఇష్టం లేకపోయినా ఈ విషయం మాత్రం ఎవరికీ చెప్పకూడదు!’’
‘‘ఎవరితో అననులే.. ఇసయమేందో చెప్పు!’’ అంది సుందరి.
‘‘అయితే ఎవరితో చెప్పనని అమ్మోరిమీద ఆన చెయ్యి!’’
రాముడలా అనగానే అయిదు నిముషాలపాటు ఆలోచనలలో పడింది సుందరి. అయితే డబ్బుమీది ఆసక్తి అమ్మోరిమీద ఆన చేసేలా చేసింది ఆమెను.
‘‘నేను చెప్పినపుడు నీవు నీ ఆవులను పెద్ద రాయుడి తోపు వైపు తోలుకువస్తే ఓ గంటసేపు ఆవులను నేను చూస్తాను.. తోపులోని మిషను బావి షెడ్డులో ఆ గంటా నీవు చిన్నరాయుడితో ఉండాలి. రెండు వేలు ఇచ్చేస్తాడు!’’ అన్నాడు దొంగరాముడు తగ్గుస్వరంతో.
‘‘దొంగ ముం...కా, మా నాయన, నా తమ్ముడూ నీ ఎముకలు ఏరేత్తారు!’’ అంటూ చేతిలోని కర్రతో రాముని నెత్తిన ఒకటి వేసింది సుందరి.
రాముని కళ్ళలో కాస్త కలవరం కన్పించింది.
‘‘నీకిష్టం లేకపోతే వదిలెయ్యి.. కానీ ఎవరికీ చెప్పనని అమ్మోరిమీద ఆన చేశావు!’’ అంటూ అక్కడ్నుండీ వెళ్లిపోయాడు రాముడు.
***
పట్టు వదలకుండా పదిసార్లు ప్రయత్నించాడు దొంగరాముడు.. తను భయపడినట్లు ఏమీ జరగకపోవడంవల్ల!
తమ కుటుంబ దుర్భర పరిస్థితులు, ఇతర ఇబ్బందులు మనసులో మెదుల్తూనే ఉండడంవల్లా, యవ్వనం తాలూకు అనాలోచిత ఆసక్తివల్లా ఓ రోజు తల వూపింది సుందరి.
మూడవ రోజే పెద్దరాయుడి తోపుకేసి ఆవులను తోలుకుపోయింది సుందరి. దయ్యాలతోపని పేరుపడ్డ ఆ తోపు వైపు పెద్దగా ఎవరూ రాకపోవడంవల్లా సునాయాసంగా ఆమె రేకుల షెడ్డులోకి వెళ్లిపోగలిగింది.
****
ఒకటి రెండుసార్లు చూసిన ఆడదాన్ని మళ్లీ మళ్లీ చూసే మనిషి కాదు చిన్న రాయుడు. కానీ సుందరిలో అతనికేదో కొత్తదనం కన్పిస్తూ రావడంవల్ల ఆమెను తరచు పిలిపించుకోవడం మొదలుపెట్టాడు.
తన సహాయం ఉందన్న కారణంతో అడపా దడపా దొంగరాముడు కూడా చెట్ల చాటునా, వంక పోరంబోకులో పొదల వెనుకా సుందరి శరీరాన్ని హత్తుకోసాగాడు.
సంతకు పోయినప్పుడు టవున్‌లో చిక్కిందనీ, ఎవర్నడిగినా తమది కాదన్నారనీ ఓ సంతనాడు ఏడు వేలరూపాయలున్న దళసరి కవరును తల్లిదండ్రులకు అందించింది సుందరి. తరువాత కూడా తన వద్ద కొంత డబ్బు చేరినా దాన్ని ఎలా ఇంట్లో ఇవ్వాలో తెలియక తన చెక్కపెట్టెలో పాతబట్టల అడుగున పాత పేపర్ల కింద దాచడం మొదలుపెట్టింది.
****
దగ్గరిదాపుల్లో తనకు పెళ్లికాగల పరిస్థితులు తమ ఇంట లేవు. అతి రహస్యంగా సాగిపోతుండడంవల్ల యవ్వనపు పొంగులోని శారీరక సుఖానికి బాగా అలవాటుపడిపోసాగింది సుందరి.
ఓ రోజు దొంగరాముడి చేతులలో పరవశంలో వుండగా..
‘‘జిల్లా ఇంజనీరు కుర్రాడు వారం రోజులు దూరపు కేంపుకు పోతున్నాడు. ఆడి భార్య పోవడంలేదట. నీవు వెళ్ళేలా వుంటే నీకు ఏడు రోజులకు ఇరవై వేల రూపాయలు నవ్వుతూ ముందుగానే ఇచ్చేస్తాడు. పైగా మంచి చీరలూ తీసిస్తాడు. టవున్ సంతలో ఓ రోజు నిన్ను చూపించానులే.. చానా మోజుపడిపోతున్నాడు!’’ అన్నాడు చిన్నగా.
‘‘అమ్మో ఏడు రోజులా? ఫైసలా అయిపోనూ?’’ అంటూ అదిరిపోయింది సుందరి.
‘‘ఏమో ఆలోచించుకో.. తిరణాలకని వచ్చెయ్యి.. ఆడితో రైలెక్కిస్తాను.. వచ్చాక పుష్కరాలకు ఎవరో తిరిపంగా పిల్చుకుపోయారనీ, క్షేత్రాలన్నీ చూపించారునీ ఏదో చెప్పుకోవచ్చు కద?’’ అన్నాడు దొంగరాముడు.
కానీ సుందరి ఒప్పుకోలేదు.. కానీ ఆలోచనలలో పడిపోయింది.
ఏడు రోజులు బయట వెళ్ళిరావడం అంటే పెద్దరాయుడి తోపులో చిన్నరాయుడితోనో లేదా చింతతోపు చివర్న దొంగరాముడితోనో గంటో, అరగంటో గడపడం కాదు.. కానీ.. ఏడు రోజులలో ఇరవై వేలు... సన్నా బన్నా మొత్తం కాదు.. ధైర్యం చేసి వెళ్లిపోయి తిరిగి వచ్చాక రాముడు చెప్పినట్లు తిరిపంగా పుష్కరాలకు, క్షేత్రాలకు వెళ్లివచ్చానని చెప్పేసి కొన్నాళ్ళ గడిచిపోయాక తమ్ముడికి ఓపాత ఆటో రిక్షా అయినా తీసివ్వచ్చు కదా అనుకుంటూ కొత్త ఆలోచనలో పడింది సుందరి.
దొంగచాటుగా అయినా తరచూ చిన్నరాయుడివల్లా అడపాదడపా దొంగరాముడివల్లా లభ్యమవుతున్న శారీరక సుఖం కూడా ఆమెకు ఆసక్తికరంగా, ఆనందదాయకంగానే ఉంది నిజానికి. ఏడురోజులపాటు వరుసగా, దర్జాగా ఆ సుఖాన్ని అనందంగా అందుకోవడం గొప్పగా వుంటుందేమో అన్న ఆలోచన అమాయకంగా డబ్బుకన్నా మిన్నగా అన్పించసాగింది.
‘‘పుష్కరాలకు పోతానంటే పంపరని చెప్పకుండా పోయి వచ్చాను!’’ అని అంటే నాలుగు రోజులు తిట్టిపోస్తారు అంతేకదా అన్న ధైర్యం కూడా ఆవహించసాగింది ఆమెకు.
ఫలితంగా ఆమె చేతుల్లో ముందుగానే ఇరవయి వేల రూపాయలు పడిపోయాయి. చుట్టుపక్కల పల్లెల్లో అప్పుడప్పుడు ఆడవాళ్ళు అదృశ్యం అయిపోయారన్న సంగతి మాత్రం మననానికి రాలేదు తనకు.
***
పక్కవూరి తిరణాళ్ళకు వచ్చిన సుందరి స్నేహితురాళ్ళ కన్నుగప్పి అడ్డదారిన టవున్ రైల్వే స్టేషన్ దారి పట్టింది. దార్లో జత అయిన రాముడు రహస్యంగా తనతోపాటు రైలెక్కించుకున్నాడు.
జంక్షన్‌లో వాళ్ళు పెద్ద రైలు కోసం ఎదురుచూస్తుండగా బెంచీలో ఆ పక్క కూర్చున్న ఎర్రచొక్కా కుర్రాడికి ఏం తోచిందో...
‘‘తను పుండై.. పలువురికి పండై
తను శవమై.. మరొకరికి వశమై
తను ఎడారై.. ఎందరికో ఒయాసిస్సై
..........’’ అంటూ అలిశెట్టి ప్రభాకర్ కవితను ఒడుపుగా వల్లించుకోసాగాడు.
దొంగరాముడికే అర్థం కాలేదు!
సుందరికేం తెలుస్తుంది?
బొంబాయి వెళ్ళే ట్రెయిన్‌లో ఫస్ట్‌క్లాస్ ఏ.సి బోగీలోకి ఓ యువకుడితో పాటు సుందరిని రైలెక్కించిన దొంగరాముడు వెనువెంటనే దొరికిన తమ ప్రాంతపు రైలెక్కేశాడు. అర్థరాత్రికన్నా ముందే రహస్యంగా వూరు చేరుకున్న రాముడిమీద ఎవరికీ ఎలాంటి అనుమానమూ కలిగే ఆస్కారం లేకపోయింది.
***
రోజులు, వారాలు, నెలలు గడచిపోయాయి!
సుందరి జాడ లేదు!!
ఆమె తల్లిదండ్రులు జీవచ్ఛవాలలా మారిపోయారు. భీముడు టవున్‌కెళ్ళి రిక్షా లాగడం మానేశాడు.
వారింట రాత్రులందు దీపాలు వెలగడం కూడా మానుకున్నాయి.
అయినా కాలం కొద్దో గొప్పో గాయాలను మాన్పుతుంది. మానవుడి నిరంతర జీవన సంగ్రామానికి అంతం ఉండదు.
***
సుందరి తల్లి ఆవులను మేతకోసం పట్టుకుపోయింది.
తండ్రి పొలం వెళ్లాడు.
ఇంట్లో వంటరిగా వున్న భీముడికి ఏం తోచిందో కానీ సుందరి పెట్టెను తెరచి నిశితంగా పరిశీలించాడు.
ఇరవై ఎనిమిది వేల రూపాయలు బయటపడ్డాయి.
‘‘ఇప్పటికి సగం పరువే పోయింది.. ఈ డబ్బు విషయం తెలిస్తే పూర్తిగా గంగపాలవుతుంది!’’ అనుకుంటూ ఆ డబ్బును తన పెట్టెలో దాచాడు.
అతనికేదో అర్థం అయింది. అంతులేని ఆలోచనలలో పడిపోయాడు.
****
‘‘సావిత్రీ!’’
ఎద్దులకోసం జొన్నకర్రలు కోసుకుంటున్న సావిత్రి తిరిగిచూసింది.
పొరుగూరి దొంగరాముడు నవ్వు మొహంతో తనకేసే వస్తున్నాడు. ఉట్ల తిరణాళ్ళప్పట్నుండీ స్వల్ప పరిచయం ఆమెకు అతనితో.
దొంగరాముడు చెప్పిన విషయం నమ్మదగినదిగా లేకపోయినా వీలు చూసుకుని గంగమ్మ గుడివైపు రావడానికి అంగీకరించింది సావిత్రి.
***
కాలం గడచిపోయింది.. పోతోంది.. సావిత్రి వాళ్ళ పల్లె పక్కని వంకవారనుండీ పెద్దరాయుడి తోపుకి చాలా దగ్గర దారుంది.
చిన్నరాయుడితోపాటు దొంగరాముడు కూడా అడపాదడపా అక్కున చేర్చుకోగలుగుతున్నాడు సావిత్రిని.
‘‘చిన్న ఆఫీసరు ఒకడు దూరపు కేంపు పోతున్నాడు. ఆడి భార్య పోవడం లేదట. నీవు ఐదురోజులు వాడితోపాటు వెళ్తే చాలు.. ముందుగానే నీ చేతులలో ఇరవై అయిదువేలు పడిపోతాయి. ఓ రోజు వానికి నిన్ను చూపించానులే.. అప్పట్నుండీ తెగ యిదయిపోతున్నాడు నీ కోసం!’’
భయంతో కూడిన ఆలోచనలలో పడిపోయింది సావిత్రి.
మూడో రోజు...
‘‘తిమ్మన్నగారి పల్లె పెద్దమ్మ జాతరనాడు నీవు జాతరకు వచ్చేసి, అక్కడ్నుండీ..’’ దారి వివరిస్తున్నాడు.
పొదలకవతల వేటకోసం దాగిన చిరుతపులిలా ఓ మనిషి తమ మాటలు వింటున్నాడని వారికి తెలియదు.
***
జాతర జనంలోంచీ బయటపడి రహస్యంగా టవున్ రైలు స్టేషన్ చేరుకుంది సావిత్రి.
రైలు వచ్చింది.. వెళ్లిపోయింది..
దొంగరాముడి జాడ లేదు!
ఇరవై అయిదు వెయ్యి రూపాయల కరకు నోట్లు అందించిన రాముడు ఎందుకు రాలేదో ఆమెకు అర్థం కాలేదు. దూరం ఆలోచించి బాడుగ ఆటో మాట్లాడుకుని వెనుకకు వచ్చేసి జాతర చేరుకుంది సావిత్రి.
ఆ రోజు రాత్రే దొంగరాముడు పడమర వెళ్ళే రైలు కింద పడి చచ్చిపోయాడని తెలిసి వాళ్ళ పల్లెటూరు కదిలిపోయింది.
అటు తిప్పి, ఇటు తిప్పి ఆత్మహత్యగా కేసు ముగించారు రైల్వే పోలీసులు.
‘‘ఎవరో చంపేసి మంచి మలుపులో రైల్వే లైను మీద వేసేశారు!’’ అనే అనుకున్నారు దొంగరాముని తల్లిదండ్రులు, బంధువులు. అయితే వారు చేయగలిగిందేమీ లేకపోయింది.
***
దొంగరాముడి కథ ముగిసిపోయింది.. ఆరు నెలలు గడచిపోయాయి.. అంతా ఆ సంగతే మరచిపోతున్నారు దాదాపుగా.
సుందరి తమ్ముడు భీముడు తన ట్రంకు పెట్టెలోని డబ్బు వెలికితీశాడు.
పనిమీద బెంగుళూరు వెళ్తున్నట్లు తల్లిదండ్రులకు చెప్పి బయల్దేరాడు.
బొంబాయి రైలెక్కిన భీముడి చేతి సంచీలో సుందరి ఫొటోలు పదిలంగా వున్నాయి.
*

-టి.ఎస్.ఎ.కృష్ణమూర్తి

రచయిత సెల్ నెం: 9347298942

-టి.ఎస్.ఎ.కృష్ణమూర్తి