కథ

నేను బాగున్నానా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్యేక బహుమతి
రు.2,500 పొందిన కథ
**
‘నిన్ను ముద్దు పెట్టుకోనా రాజూ?’ అంది ఇరవై మూడేళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రిషిత, ఇరవై ఎనిమిదేళ్ల పద్మరాజుతో.
పద్మరాజు తన సిస్టమ్ ముందు కూర్చోనుండగా రిషిత తన సీట్లోంచి లేచొచ్చి అతని మీదికి వంగుతూ ఈ మాటంది.
ఇంకా ఇలా అంది. ‘అయిదున్నరయింది గదా. ఆఫీసులో చిన్న అరవై మందీ వెళ్లిపోయారు. మనిద్దరమే మిగిలాం.. ఈ ప్రాజెక్టు వర్కొకటి, జిడ్డు!... ప్చ్, ఏంటో!’ రిషిత రాజు మొహం మీదికి వంగబోయింది.
రాజు తన చెయ్యి అడ్డం పెట్టుకున్నాడు. ‘ఇప్పుడవేం వద్దులే. బుద్ధిగా నీ సీట్లోకెళ్లి కూర్చో’ అన్నాడు.
‘బోర్ కొడుతోంది, మరి!’
‘ఇంటికెళ్లి బువ్వ తిని పడుకో’
‘అమ్మా నాన్నా తమ్ముడూ బెంగళూరు వెళ్లారు. నేనొక్కత్తినే వారం రోజులుండాలి. ఎలా?’
రాజు మాట్లాడలేదు.
అరగంటయ్యాక ఇద్దరూ ఆ ‘పరాశర సొల్యూషన్స్’ కంపెనీ లోంచి బయటకొచ్చి ఎవరి బైక్ మీద వాళ్లు వెళ్లిపోయారు.
* * *
ఒకరోజు మధ్యాహ్నం లంచ్ అయ్యాక రిషిత రాజుతో అంది, ‘రాజూ, వాణిశ్రీ టైపులో చెంగావి రంగు చీరెతో నా సెల్ఫీని ఫేస్‌బుక్‌లో పెట్టాను. ‘బాగున్నానా ఫ్రెండ్స్?’ అని అడిగాను. నూట యాభై లేకులూ, ‘సూపర్’ ‘నైస్’ అంటూ యాభై కామెంట్లూ వచ్చాయి. కానీ ఒక కామెంటు మాత్రం ఏమిటో తెలుసా?... ‘నీ మొహాన బొట్టు లేదు. బట్టలు కాషాయం రంగువి. నువ్వు హిందువువా, జీహాదీవా, అమరావతికి రాబోయే బౌద్ధ సన్యాసినివా? అని! అంటే నేను సన్యాసినిలా ఉన్నానట. ఎంత ఇన్సల్టింగా ఉందో చూశావా?’
‘ఎలా ఉన్నావని అడిగావుగా?.. ఇంతకీ ఎవడు వాడు?’
‘టి.. ఎ.. టి.. అట. అంటే తాటాకుల రావో, తాతారావునో!... నువ్వే చూడు.’ రిషిత రాజుకు తన ఫోను ఇవ్వబోయింది.
రాజన్నాడు, ‘నేను స్మార్ట్ ఫోన్ వాడను. అసలు ముట్టుకోను. నేను వాడేది నోకియా వాయిస్ ఫోనే. అసలు టీవీ కూడా న్యూస్ కోసం తప్ప చూడను’
‘ఎందుకని?’
‘నా మానసిక, శారీరక, ఆయురారోగ్య భాగ్యాల కోసం!’
‘ఏడ్చినట్టుంది.. అసలు నీకు ఇంత మంచి ‘పరాశర్ సొల్యూషన్స్’ కంపెనీలో ఉద్యోగం ఎలా వచ్చిందని?’
‘నేను మూడేళ్లు హెచ్.సి.ఎల్‌లో పనిచేసి సీనియర్‌ని అనిపించుకున్నాను. అప్పుడే ఈ పరాశర్‌లో చీఫ్ టెక్నికల్ ఆఫీసర్‌ని అయ్యాను’
‘ఎలా అయ్యావు?’
‘ఎలా అయ్యానో ఆర్నెల్ల క్రితం చేరిన దానివి నీకెలా తెలుస్తుంది? పక్కసీట్లో కూర్చుని చూడగానే అర్థమై పోయానా?... సర్లే ‘హై స్టీల్ బేరింగ్స్’ కంపెనీ ప్రాజెక్టు పూర్తయిందా? గ్రూప్ లీడ్ నన్ను తోమేస్తున్నాడు’
రిషిత చురుగ్గా చూసింది. ‘సర్లే, పెద్ద పోజు! నేనూ బి.టెక్‌నే బాబూ!’
* * *
పదిహేను రోజుల తర్వాత మళ్లా రిషిత రాజుతో అంది ‘చూడు చూడు. నేను ఎంచక్కా పాంటు, స్లీవ్‌లెస్ షర్టూ వేసుకుని జుట్టు ముందుకు సాగదీసుకుని తీసుకున్న ఫొటో పెట్టాను. దీనికి రెండొందల లైకులూ ‘అదిరింది’ అనీ, ‘డూపర్’ అనీ వంద కామెంట్లూ వచ్చాయి. కానీ.. కానీ.. ఇదేమిటి, ఎవడో కామెంట్ పెట్టాడు, ‘నువ్వు అమ్మాయివైతే పాంటూ స్లీవ్‌లెస్ షర్టు ఎందుకు? అబ్బాయివైతే కట్ చేసిన చింపిరి జుట్టెందుకు? జడ వేసుకోవటం చేతకాదా?... అసలు నువ్వు హిజ్రావా కొంపదీసి!’ - వీడు.. ‘ఎ... ఎన్.. డి గాడట. అంటే అండారావో, అండమాన్ రావో అయ్యుంటాడు. రాస్కెల్, ఆడపిల్ల అందం మెచ్చుకోలేనివాడు అసలు మగాడేనా అని!’
పద్మరాజన్నాడు. ‘అది అందమని నువ్వనుకుంటున్నావు. కాలక్షేపం లేని బచ్చాగాళ్లందరూ ‘డూపర్’ అన్నారని పొంగిపోతున్నావు. ‘ఎ.. ఎన్... డి’ అన్నదే కరెక్టేమో? అలాంటి టైట్ డ్రెస్ వేసుకుని జుట్టు అలా గాలికి వదిలేస్తేనే ఆడపిల్లలు ఇబ్బందుల్లో పడుతున్నారేమో, ఆలోచించుకో?... ఇటీవల కోజికోడ్‌లోని ముస్లిం మహిళా కళాశాల ప్రిన్సిపాల్ సీతామహాలక్ష్మి అన్నావిడ, ‘టైట్ పాంట్లు, లెగ్గిన్స్, పొట్టి చొక్కాలు నిషిద్ధం. సల్వార్, చుడీదార్, ఓవర్‌కోటు- లు ధరించాలి. ముస్లిం విద్యార్థినులైతే నకాబ్, స్కార్ఫ్‌లు ధరించొచ్చు. అందరూ జడ కూడా వేసుకోవాలి’ అని రూలు పెట్టిందట. దానికి ముస్లిం కుటుంబాలన్నీ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాయి. హిందూ తల్లులే నీళ్లు నముల్తున్నారు! రాష్ట్ర కళాశాలల అధ్యక్షుడు ఫజల్ గఫూర్, ‘ఇది కరెక్టే తప్పదు!’ అన్నాడట.. అసలు ఢిల్లీలోని కాలేజీల్లో కూడా ఇట్లాంటి నిబంధనలే అమల్లోకొచ్చాయి’
చిరాగ్గా అంది రిషిత. ‘ఆడపిల్లల డ్రెస్సుల మీద కంట్రోల్ ఏమిటి? ఆఫీసులో అయితే ఏదో యూనిఫాం ఉంటుంది. ఓకే! కాలేజీల్లోనూ బయటికెడితేనూ మాత్రం ఇన్ని ఆంక్షలా! అసలు ఆడపిల్లల్ని బతకనివ్వరా?’
‘బతకనివ్వరా అని నువ్వడగవలసింది ఎవర్నో తెలుసా?.. ఆడపిల్లల్ని వెంటపడి వేధించే రౌడీలనీ, అత్యాచారాలు చేసే రాక్షసుల్నీ, ఇంట్లోంచి లేవదీసుకెళ్లి తాళి కట్టేసి, ఆ కుటుంబాన్ని ఛిద్రం చేసే సామాజికపు చీడపురుగుల్నీ - ను! కాలేజీ యాజమాన్యాలు ఆడపిల్లల్ని బతికించుకోవాలనే చూస్తున్నాయి!’
* * *
వారం తర్వాత రిషిత మళ్లీ పద్మరాజుతో అంది, ‘ఇప్పుడు నువ్వు నా ఫొటో చూడాల్సిందే. నా ముప్పైవేల జీతంలోంచి డబ్బుతో కొత్త డ్రెస్సు కొనుక్కున్నాను. ఇదుగో’ ఆమె తన ఫోను చూపించింది.
రాజు చూసి అన్నాడు, ‘మొఘల్ -ఎ- ఆజమ్ సినిమాలో డాన్స్ చేస్తూ మధుబాల వేసుకున్న డ్రస్సు ఇదే కదా!’
కోపంగా అంది రిషిత. ‘నువ్వూ అదే అంటున్నావా, మగబుద్ధి పోనిచ్చావు కాదు! నీకు కుళ్లు’
‘ఇంకో కుళ్లుగాళ్లు ఎవరేంటి?’
‘ఇదుగో వీడున్నాడుగా, అండారావో, అండమాన్‌రావో! ‘నువ్వు మధుబాలలాగా ముస్లిం డాన్సర్‌వి అని అర్థం అయ్యింది.. కానీ మధుబాలంత గొప్పగా డాన్స్ చెయ్యగలవా?... అసలు నువ్వేం చేస్తూంటావు? నీ టాలెంట్ ఏంటో చెప్పకుండా డ్రస్సులు మార్చి ఫొటోలు పెట్టగానే అందగత్తెవి అని మేం అనాలా?..’ అంటున్నాడు’
‘నీకేదన్నా టాలెంట్ ఉంటే చెప్పూ? దానికొచ్చేవి నిజాయితీ లైకులూ.. నిజాయితీ కామెంట్లూనూ!’
‘వీళ్లందరికీ టాలెంట్లు ఉండేడ్చినయ్యా, నన్నడగటానికి!’
‘మరి నువ్వే అడుగుతున్నావుగా, ‘నేనెలా ఉన్నానని!’
‘చెప్పానుగా నీకు కుళ్లు! మగ కుళ్లు!’
* * *
ఆ శనివారంనాటి సాయంత్రం ‘పరాశర సొల్యూషన్స్’ అయిదేళ్ల కంపెనీ ఆనివర్సరీకి మగవాళ్లందరూ పంచె లాల్చీతోనూ, ఆడవాళ్లందరూ చీరె, జడ లేక ముడితోనూ రావాలని సర్క్యులర్ వచ్చింది. ఇష్టం ఉన్నా లేకపోయినా చచ్చినట్టు అందరూ అట్లాగే వచ్చారు.
ఆ కార్యక్రమం ఒక హోటల్‌లో ఏర్పాటయింది. స్టేజి మీదికి ఒక జూనియర్ ఇంజనీర్ వచ్చి జోకులు చెప్పాడు. ఒకమ్మాయి వచ్చి కూచిపూడి నృత్యం చేసింది. ఒకమ్మాయి సంగీత కచేరీ చేసింది. అందులో ‘పిబరే రామ రసం’ ‘చింతా నాస్తి కిల’ వగైరా కీర్తనలు పాడింది. అందరూ పరవశంతో చప్పట్లు కొట్టారు. అమెరికానో ఆస్ట్రేలియానో వెళ్లాలని తాపత్రయపడటం మానేసి ఒక యువకుడు ఒక చిన్న స్టార్టప్ కంపెనీని స్థాపించి పైకెలా వచ్చాడో ఒక హాస్య నాటకంగా చేసి చూపించారు ముగ్గురు యువకులు. దానికీ చప్పట్లు మోగాయి. ఎటువంటి డాన్సులూ ఎవ్వరూ చెయ్యలేదు. ఇట్లా గంట కార్యక్రమం అయింతర్వాత కంపెనీ సీఇవో, కంపెనీ ఎం.డిని వేదిక మీదికి ఆహ్వానించారు. ‘ఇప్పుడు మన ఎం.డి. జ్ఞానిగారు కొద్దిసేపు మాట్లాడి ప్రతి ఒక్కరినీ స్టేజి మీదికి పిలిచి సన్మానిస్తారు’ అన్నారు.
వెంటనే ఎం.డి. జ్ఞాని వచ్చి అన్నారు, ‘మన కంపెనీ లాభాల్లో లేదు. నష్టాల్లోనూ లేదు. కానీ కొద్దికాలంలో లాభాల్లోకి దూసుకుపోతుందనే నమ్మకాన్ని మీరందరూ నాక్కలిగిస్తున్నారు. నేను ఇందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. దానికి ప్రోత్సాహకంగా మీకు అందరికీ జీతం నెలకు టెన్ పర్సెంట్ పెంచుతున్నాను. ఇంక్రిమెంటు కాకండా ఇచ్చే ఇన్‌సెంటివ్ ఇది!’
చప్పట్లు మారుమోగిపోయాయి.
సీఈవో పేరు పేరునా అందరినీ స్టేజి మీదికి ఆహ్వానించగా వారి ఊరూ, తల్లిదండ్రులూ వగైరాలు పరిచయం చేసుకుంటూ శాలువా కప్పి, స్వీట్ పాకెట్ ఇచ్చి గౌరవించారు జ్ఞాని. చిట్టచివరిగా పద్మరాజు, రిషిత వెళ్లారు. జ్ఞాని, ‘రిషిత అంటే అర్థం ఏమిటమ్మా?’ అన్నారు. ‘నాకు తెలీదండి’ అంది రిషిత.
‘మీ వాళ్లు నీకు మీ పెద్దవాళ్ల పేరు గానీ, దేవతల పేరు గానీ పెట్టవలసింది. నాకు తెలిసినంతవరకూ దీని అర్థం ఏమిటంటే, ‘తీవ్రమైన కోపం గలది’ అని. అంతకన్నా, ‘ఋషిక’ అని పెట్టి ఉంటే బాగుండేది. మంత్రాలు రచించేది అని అర్థం. నువ్వు మారుతున్న టెక్నాలజీని నేర్చుకుని మన కంపెనీకి లాభాలు తెచ్చిపెట్టేదానివి!’
రిషిత సిగ్గుపడుతూ తల వంచుకుంది.
చటుక్కున పద్మరాజు అన్నాడు, ‘ఈ అమ్మాయి తెలివిగల పిల్ల. కష్టపడి పని చేస్తుంది’
నిశితంగా చూశాడు జ్ఞాని. ‘తెలుసు. నువ్వు చెప్పక్కర్లేదు. రోజూ ఈ అమ్మాయి వర్క్‌షీట్‌ని సిస్టమ్‌లో చూస్తున్నానుగా! కానీ... పేరు.. తీరు.. ప్రవర్తన కొంచెం మారాలి!... ఓకె ఆల్ ది బెస్ట్!’
పద్మరాజు తలవంచుకున్నాడు.
భోజనాల తర్వాత కార్యక్రమం ముగిసింది.
* * *
రెండు వారాల తర్వాత ఒక శనివారం రిషిత ఏడుపు మొహంతో ఆఫీసుకొచ్చింది. పద్మరాజు గమనించాడు. కావాలనే టైమయిపోయిన తర్వాత కూడా సిస్టమ్ ముందు కూర్చోనున్నాడు. ఆ ఇద్దరూ తప్ప ఆఫీసంతా ఖాళీ!
రిషిత అంది, ‘రాజూ! నా బతుకు బస్టాండయిపోయింది. చూడూ’ అంటూ తన ఫోనిచ్చింది.
ఆ ఫోనులో ఉన్న ఫొటోలో ఆమె తెల్లచీరె, తెల్ల జాకెట్టూ, తెల్ల బొట్టూ, చెవులకు తెల్ల జూకాలూ, మెళ్లో తెల్ల లాకెట్‌తో ఉన్న గొలుసు, చేతులకు తెల్లవీ బంగారంవీ గాజులు, తలనిండా మల్లెపూల పెద్దదండ ఉన్నాయి. ఇంతేకాకుండా ఒక కన్ను సగం మూసుకుని, పక్కవాటుగా రెండో కన్నుతో చూస్తూ కాలు మీద కాలేసుకుని, చేతిలో పాలగ్లాసుతో, కుర్చీతో కూర్చునుంది!
‘ఏమైంది?’ అన్నాడు రాజు.
‘లైకులు మూడొందలు సరే. కామెంట్లు చూడు’
‘కామెంట్లు లేవు. అందరూ వాళ్ల నెంబర్లిచ్చారు’
‘అందులో చివరి కామెంట్ చూడు. ఎ.ఎన్.డి. గాడి పోస్టు అది’
‘నీ చీరె ఖరీదెంత? గాజుల ఖరీదెంత? పాయింటుకొచ్చేస్తున్నాను ‘నీ రేటెంత?’.. నా నెంబరిస్తున్నాను, చెప్పేయ్’ అనుంది. తప్పేముంది?’
రిషిత రుమాలుతో గుడ్లనీరు తుడుచుకుంది. ‘నేను సరదాగా దిగిన ఫొటో. ఇంజనీర్ని. ఏమయిపోయానో చూడు! మగవెధవ లందరూ రాస్కెల్స్! స్కౌండ్రల్స్! వీళ్లని గ్యాస్‌ఛేంబర్లో పడేసినా పాపం లేదు! ఛీఛీ’
రాజు ఆమెను ఫోన్ ఆమెకిచ్చేశాడు. ‘రేపు నీకు పుట్టబోయే కొడుకూ, వాడికి పుట్టబోయే మనవడూ... అందరూ ఇట్లాగే ఉంటారు. డౌట్ లేదు. నీ తండ్రీ తాతలూ ఇట్లా లేరనే గ్యారంటీ ఇవ్వగలవా?... అందుకనే ఆడపిల్లలు మగపిల్లల్ని రెచ్చగొట్టేట్టు ఉండకూడదు. ‘నేను బాగున్నానా’ అని నువ్వడగవలసింది నీ మొగుణ్ణి. అంతేకాని రోడ్ రోమియోలని కాదు. ఏదన్నా అయితే నినె్నవరు కాపాడతారు?.. అసలందుకనే ఆడపిల్లలు స్మార్ట్ఫోనులు వాడకూడదన్నారు పెద్దలు’
ముక్కు చీదుకుంటూ కళ్లు తుడుచుకుంటూ కూర్చుండిపోయింది రిషిత. తేరుకుని చివరి కంది, ‘సరే, నిన్నడుగుతున్నాను, నేను బాగున్నానా?’ ఇలా అంటూ పక్కకి మొహం తిప్పుకుంది.
రాజన్నాడు, ‘మీ అమ్మా నాన్నల మధ్య నువ్వూ, మా అమ్మానాన్నల మధ్య నేనూ కూర్చొని ఉండగా ఈ ప్రశ్న మనిద్దంర ఒకళ్లనొకళ్లం అడగాలి. సిస్టమ్స్ మధ్యలోనూ సర్వర్ల పక్కనా కూర్చొని కాదు... ఇలా ఫేస్‌బుక్‌లో అడక్కూడదని మీ అమ్మ ఎప్పుడూ చెప్పలేదా?’
‘చెప్పలేదు... పోనీ నువ్వు చెప్పొచ్చుగా...’ నువ్వు చెప్పు నేను మారతాను’
‘టి... ఎ.. టి అదే, తత్త్వజ్ఞాని, అదే జ్ఞానిగారు.. మా నాన్న.. ఫంక్షన్లో చెప్పాడుగా, మారావా?’
‘ఏంటీ టి..ఎ. టి.. అంటే ఎం.డిగారా, మీ నాన్నా.. మైగాడ్.. మరి మీ అమ్మ’
‘ఎ... ఎన్..డి, అదే ఆండాళ్లమ్మ!’
‘అయామ్ డెడ్’
‘నో యూ ఆర్ లక్కీ... మారతానన్నావు గదా... వాళ్లక్కావలసిందదే!’
చటుక్కున రిషిత మళ్లీ మొహం పక్కకి తిప్పుకొని చెయ్యి చాపింది.
‘ఇదీ, ఇప్పుడు కరెక్ట్ - అదే టచ్’ రాజు ఆమె చెయ్యి ముద్దు పెట్టుకున్నాడు! *

-గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు- 9885798556