ఈ వారం కథ

ఆదర్శ చీకటి (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మీరు సమాజంలో పేరున్నవారు. ఈ పట్టణంలో గుర్తింపు వున్నవారు. ఇలా మాకు చెప్పకుండా తల్లిదండ్రులకు చెప్పకుండా రహస్యంగా పెళ్లిళ్లు చేయటం పద్ధతేనా?’’
ప్రశ్నకు షాక్ తిన్నాడు విశ్వం. ఇలా సూటిగా ప్రశ్నిస్తారని విశ్వం భావించలేదు. ఇలా పదిమందిలోకి పిల్చి ప్రశ్నిస్తారని కూడా విశ్వం ఊహించలేదు. ఎందరి పెళ్ళిళ్ళో చేసాడు. ఎన్నడూ ఇటువంటి ప్రశ్న రాలేదు. తల్లిదండ్రులను కాదని, కులం కాదని, కట్నం వద్దని, ఆడంబరాల పెళ్లికాదని ఆదర్శ వివాహం చేసుకున్నవారున్నారు. అవి తక్కువ సంఖ్యలో వున్నా- అందులో మెజారిటీ పెళ్లిళ్లు విశ్వం చేతుల మీద జరిగినవే. విశ్వం లెక్చరర్. ఆ పట్టణంలో పేరున్న లెక్చరర్. కమ్యూనిస్టుగా ఆ పట్టణంలో విశ్వంకు పేరుంది. ఆ పట్టణంలో కమ్యూనిస్టు పార్టీ పెద్దగా లేదు. కానీ విశ్వంకు విలువ బాగానే వుంది. విలువకు కారణం తాను కమ్యూనిస్టు అని ఎన్నడూ చెప్పుకోలేదు. అదీ ఒక కారణం కావచ్చు. అంతకంటే ముఖ్యమైన కారణం విశ్వం ఆదర్శం, మంచితనం, రాజీపడలేని వ్యక్తిత్వం. కొన్ని ఆదర్శాలపట్ల నిజాయితీగా వుండటం విశ్వం నిబద్ధత.
విశ్వం మంచి సమాజం కోసం కలలు కనటమే కాకుండా అందుకు అడుగులు వేస్తుంటాడు. ఆయన పెద్ద పెద్ద మాటలేమీ మాట్లాడడు. సిద్ధాంతాలు, ఆదర్శాలు వల్లించటం, మంచి సమాజమంటే ఆయన దృష్టిలో ద్వేషం, మోసం, దోపిడీ లేని సమాజం. మంచి సమాజమంటే తోటివారిని ప్రేమించే సమాజం. రేప్‌లు, మానభంగాలు లేని సమాజం, కులాలు మతాలు లేని సమాజం.
విశ్వం మంచి సమాజం గూర్చి పెద్దగా కలలు కనలేదు. పోరాటాలు, ఉద్యమాలు, ప్రజల చైతన్యం ద్వారా మంచి సమాజం రావచ్చు. సమిష్టి చైతన్యం అవసరం. సమిష్టి పోరాటం ద్వారా మంచి సమాజం వస్తుంది. సమిష్టి పోరాటం రూపురేఖలు ఇపుడే లేవు కనుక సమాజం మంచి కొరకు, సమాజ మార్పు కొరకు అయినంత చేయాలని విశ్వం ఒంటరి కృషి పదేళ్లుగా చేస్తున్నారు. పట్నంలో ఆయనకు మంచి పేరుంది. ప్రజల కొరకు విశ్వం అడుగులు వేస్తున్నారు. మంచి కొరకు విశ్వం పాటుపడుతాడు. అందులో భాగంగానే కులాలు మతాలు పోవాలని, మానవులంతా ఒకటేనని- వరకట్నం మహిళల పాలిట శాపంగా మారిందని, పది సంవత్సరాలుగా కులాంతర, మతాంతర వివాహాలను, వరకట్నం లేని వివాహాలను ఆదర్శ పెళ్లిళ్లను ప్రోత్సహిస్తున్నాడు, చేస్తున్నాడు. ఈ పెళ్లిళ్ల నిర్వహణ ఎంతవరకు వచ్చిందంటే- ప్రేమించుకున్న యువతీ యువకులు విశ్వం దగ్గరికి రావటం, విశ్వం వారి పెళ్లిళ్లు చేయటం- ఈ పది సంవత్సరాలలో చాలానే చేశారు.
ఇలా విశ్వం పెళ్లిళ్లు చేయడంవల్ల తల్లిదండ్రులకు కోపంగా వున్నా- విశ్వంను ఏమీ చేయలేకపోయారు. ఎందుకు? విశ్వంకు పట్నంలో మంచి పేరుంది. ప్రజలలో పలుకుబడి వుంది. నిజాయితీపరుడనే విశ్వాసముంది. ఏమీ చేయలేకపోయారు. ఇలా పెళ్లి చేసుకుంటామని వచ్చేవారినుండి కొన్ని హామీలు పొందేవారు. వరకట్నం తీసుకోకూడదు. పూలదండలు మార్చుకొని పెళ్లి చేసుకోవాలి. పెళ్లి ఆడంబరంగా వుండకూడదు. భవిష్యత్తులో ఆదర్శంగా జీవించాలి. ఇవీ ఆయన షరతులు.
ఆయన షరతులు ఎవరు ఎంతగా ఆచరించారనేది చెప్పటం కష్టం. ఆయనకు ఆ అవసరం లేదు. తన బాధ్యత తాను నిర్వర్తిస్తున్నానని ఆయన సంతృప్తి. ఒక లక్ష్యంతో పనిచేస్తున్నానని విశ్వం మనసులో తృప్తి.
ఆదర్శ పెళ్లిళ్లు చేసుకున్నవారంతా కమ్యూనిస్టులు కాదని విశ్వంకు తెలుసు. కమ్యూనిస్టులందరూ ఆదర్శ పెళ్లిళ్లు చేసుకున్నారని ఆయన భావన కాదు. కమ్యూనిజం ఆదర్శ పెళ్లిళ్లకు నాంది పలుకుతుంది. అంతవరకే నిజం. ప్రపంచీకరణ పంజా విసురుతున్న ఈ సమయాన, డబ్బు అవసరం- వ్యామోహం పెరిగిన ఈ కాలంలో ‘ఆదర్శాలు’ నిలకడగా వుంటాయని విశ్వం నమ్మటం లేదు. ఎవరు ఏ దారిలో నడిచినా తాను సరిగ్గా నడవాలని విశ్వం ఆలోచన, ఆదర్శాలు, కమ్యూనిజం స్వార్థం కోరుకుంటున్న రోజులు. ‘ఆదర్శ పెళ్లిళ్లు’- కమ్యూనిస్టులుగా తీర్చిదిద్దుతాయని ఆయన భావించలేదు.
సామాజిక వ్యవస్థ మార్పుకు వివాహ వ్యవస్థ మార్పు అవసరమని విశ్వం భావించారు. కులాంతర, మతాంతర ఆదర్శ వివాహంవలన భవిష్యత్తులో మంచి సమాజం వస్తుందని ఆశ. వరకట్నం, ఆడంబర పెళ్లిళ్లు దుర్మార్గమైన సమాజానికి ప్రతీకగా విశ్వం భావించారు. అయితే ‘తాము పెళ్లి చేసుకుంటామని.. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించటంలేదని వచ్చేవారంతా విశ్వం ఆదర్శాలను నమ్మి ఆ దారిలో వస్తున్నవారు కాదు. తమ ప్రేమ సఫలం కావాలని- పెళ్లి రూపం తీసుకోవాలని వస్తున్నవారే ఎక్కువ. ఈ విషయం విశ్వంకు తెలుసు. తెల్సినా లోతులలోకి వెళ్లాలని ఆయనకు లేదు. ప్రాథమిక దశ.. జరుగనీ.. అనుకున్నాడు. ఆదర్శాలకు కూడా స్వార్థం వుంటుందని ఆయనకు తెల్సు.
పెద్దల ముందు నుంచి వచ్చిన ప్రశ్నకు విశ్వంకు ఏమి సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. ఎవరి గూర్చి ఈ ప్రశ్న వచ్చిందో విశ్వంకు తెల్సు. నాలుగు రోజుల క్రితం వాళ్లిష్టప్రకారం జానకంపేట నర్సింహ్మస్వామి ఆలయంలో సుహాసిని, సురేందర్ పెళ్లి జరిగింది. పెళ్లి పెద్ద విశ్వం మరో నలుగురు స్నేహితుల సాక్షిగా పూలదండలు మార్చుకొని పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి అటూ ఇటూ వారి తల్లిదండ్రులకు తెలియదు. ఇద్దరూ విశ్వం విద్యార్థులే. ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుకుంటున్నారు. రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు.
సుహాసిని రెడ్డిల అమ్మాయి. పట్టణంలో పెద్ద పేరున్న ఎక్సైజ్ కాంట్రాక్టర్ కూతురు. ఆయన పేరు మహేంద్రరెడ్డి, కోటీశ్వరుడు. సురేందర్ మామూలు కుటుంబంలోనుండి వచ్చిన విద్యార్థి. తండ్రి టీచర్, తల్లి బీడీలు చేస్తుంది. టీచర్ అయినా సామాన్య కుటుంబమే. పైగా బిసి కులం.. ఈ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని అటూ ఇటూ తల్లిదండ్రులకు తెల్సు. ఎవరికీ ఇష్టం లేదు. కోటీశ్వరుడు రెడ్డి- బిసి బీద కుటుంబం అబ్బాయిని ఎలా అంగీకరించగలడు? పెద్దవాళ్ళతో సంబంధం, ఎటుపోయి ఎటు తిరుగుతుందో.. వద్దని సురేందర్ తల్లిదండ్రులు కూడా హెచ్చరించారు. ఇద్దరూ వినలేదు.
తల్లిదండ్రులు ఒప్పుకోరని ఖచ్చితంగా ఇద్దరికీ అర్థమయిన తర్వాత- ఇక లాభం లేదని లెక్చరర్ విశ్వం దగ్గరకు వచ్చి ‘పేము పెళ్లి చేసుకోవాలనుకున్నాం, ప్రేమించుకున్నాం, మా తల్లిదండ్రులు ఒప్పుకోవటంలేదు, మీ ఆశీస్సులు కావాలి’ అన్నారు.
‘ఒప్పించాల్సిందే’ అన్నాడు ఖచ్చితంగా విశ్వం.
‘‘వాళ్ళు ఒప్పుకోరు’’
‘‘నేను మాట్లాడుతాను, ఒప్పిస్తాను’’ అన్నాడు విశ్వం.
‘‘వాళ్ళు ఒప్పుకోరు. మాట్లాడటం అవసరం లేదు. మీ అభిప్రాయాల మేరకు ఆదర్శ పెళ్లి చేసుకుంటాం. ఆదర్శంగా జీవిస్తాం’’ అన్నారు ఇద్దరూ.
మొదట్లో ఒప్పుకోలేదు విశ్వం. ఒప్పుకోకున్నా మనమే పెళ్లి చేసుకోవచ్చు అని ఇద్దరు అనుకున్నారు కానీ- అలా చేసుకుంటే మహేంద్రరెడ్డి ఒప్పుకుంటాడా? ఆయన చేతిలో పోలీసులున్నారు. గూండాలున్నారు. బ్రతకనిస్తాడా? ఇద్దరూ వేరే బ్రతికినా.. ఎక్కడ బ్రతికినా సుఖంగా క్షేమంగా బ్రతుకనివ్వడు. ఈ భయం అబ్బాయికుంది, అమ్మాయికుంది. విశ్వం ఆధ్వర్యంలో జరిగితే అటువంటి భయాలకు ఆస్కారముండదు. ఇదే వారి ధైర్యం.
రెండు మూడు రోజులు వరుసగా తిరిగారు ఇద్దరూ విశ్వం వద్దకు! పోలీసుల వద్దకు వెళ్లమన్నారు. వాళ్లు చేస్తారు స్టేషన్‌లో అన్నాడు విశ్వం.
‘‘వాళ్లు చేయరు సార్! మా నాన్న చేతిలో పోలీసులు కీలుబొమ్మలు. నెల నెలా వేలు తీసుకుంటారు’’ అంది సుహాసిని.
విశ్వంకు ఈ వ్యవహారంలో ఇరుక్కోవటం ఇష్టం లేదు. ఆదర్శ పెళ్లి-, కులాంతర పెళ్లి, సామాజిక మార్పుకు పనికొచ్చే పెళ్లి కానీ సమాజంలో తగువు. తల్లిదండ్రులకు చెప్పకూడదంటారు. సమాజంలో వద్దంటారు. ఆఖరుకు అన్నాడు-
బాగా చదివిన వాడివి నీవు. ఈ ప్రేమ దోమ ఏమిటీ. లక్షలిచ్చి నీకు పిల్లనిస్తారు’ అన్నాడు

సురేందర్‌తో విశ్వం.
సుహాసినికి లెక్చరర్ విశ్వం మాట నచ్చలేదు. కోపమొచ్చింది కానీ.. నిశ్శబ్దంగా వుంది.
‘‘లక్షలు వద్దు నాకు, పైసా వద్దు, ప్రేమించుకున్నాం, పెళ్లికి మీ సహాయం కోరుతున్నాం’’
ఇలా ఇద్దరు మొండికేయటంతో రహస్యంగా ఇద్దరి పెళ్లిచేసారు. రెండు రోజులలో ఊరంతా తెల్సిపోయింది. సురేందర్ తల్లిదండ్రులు వూరు విడిచి పారిపోయారు మహేందర్‌రెడ్డి భయంతో.
అదే విషయం విశ్వంను అడగటానికి పెద్దలు పిల్చారు. పెద్దలలో వార్డు కౌన్సిలర్ ఒక పార్టీ అధ్యక్షుడు. కుల పెద్దలూ వున్నారు.
‘‘మీ పిల్లలు పదే పదే తిరిగారు. మీ అమ్మాయిని పదే పదే అడిగాను. మీకు చెప్పి ఒప్పిస్తానన్నాను, బెదిరించాను. పోలీస్ స్టేషన్‌కు వెళ్లమన్నాను. కాదు కూడదన్నారు. ఇప్పుడే చేసుకుంటాం, అక్కడే చేసుకుంటాం అన్నారు. ఆఖరుకి స్కూల్ సర్ట్ఫికెట్స్ తెప్పించాను. మేజర్ అయ్యారు.. మీ యిష్టం’’ అన్నాను.
విశ్వం సూటిగా ధైర్యంగా చెప్పటంతో అక్కడున్నవారు ఖంగుతిన్నారు. జవాబు ఏమీ చెప్పాలో వారికి అర్థం కాలేదు. ‘‘ఎలా చేస్తావు? తల్లిదండ్రులుండగా, సమాజముండగా...’’ అనాలనే కోపముంది కానీ ఎవరూ అనలేదు అంటే విశ్వం ఎదురుతిరిగితే.. వారి భయం వారిది.
జవాబు చెప్పాడు కానీ- అంతా పెద్దలు, రాజకీయ నాయకులు, కోటీశ్వరులు. వాళ్ల అమ్మాయి పెళ్లి విషయం. ‘‘తిడితే.. కొడితే.. సమాజం అండ కూడా దొరుకదు’’ భయపడ్డాడు విశ్వం.
ఐదు నిమిషాల నిశ్శబ్దం తర్వాత
‘‘సరే జరిగిందేదో జరిగింది. ప్రేమించుకున్నారు, మీరు పెళ్లి చేశారు విశ్వంగారు. మంచియో చెడియో ఏదో జరిగింది. మహేంద్రరెడ్డి అభిప్రాయం ఏమిటంటే, తన బిడ్డ పెళ్లిని ఘనంగా మళ్లీ చేస్తానంటున్నారు. పిల్లల్ని ఒప్పించమని మిమ్ములని పిల్చాం’’ అన్నాడు వార్డు కౌన్సిలర్.
ఇందుకా పిల్చింది అనుకున్నాడు విశ్వం. భయం ఎగిరిపోయింది. ‘ఒకసారి పెళ్లి జరిగిపోయిందిగా’ అన్నాడు విశ్వం.
‘‘అందరి ముందు ఇంకోసారి నా శక్తికి తగ్గట్గుగా’’ అన్నాడు మహేంద్రరెడ్డి.
‘‘అదెలా సాధ్యమండీ, ఆదర్శ పెళ్లి అంటే నేను ముందు వుండి చేసాను. సంప్రదాయ పెళ్లి, ఆడంబరాల పెళ్లికి నేను విరుద్ధం.’’
‘‘మీరు విరుద్ధం, పిల్లల్ని ఒప్పించండి!’’ బెదిరించినట్టుగా అన్నాడు కౌన్సిలర్.
‘‘పిల్లలు ఒప్పుకోరు, వాళ్లు ఆదర్శం కొరకే ఈ పెళ్లి చేసుకున్నారు.’’
‘‘మీ పిల్లలన్నట్టుగా మాట్లాడుతారేమిటీ మీరు’’ అన్నాడు ఒకరు అందులోనుండి. వాడు పట్టణంలో పేరుగాంచిన గూండా. వాడి మాటలలో బెదిరింపు వుంది.
‘‘మీరు ఒప్పించుకోండి’’ అంటూ తప్పించుకున్నాడు విశ్వం.
‘‘మీ యింట్లో వున్నారుగా, మేము పిలిస్తే రారు’’ అన్నాడు మహేంద్రరెడ్డి కొంత కరుకుగా.
విశ్వం యింట్లో లేరు కానీ విశ్వం అధీనంలో వున్న మాట నిజం.
ఫోన్ చేసి పిల్లల్ని - మహేంద్రరెడ్డి ఇంటికి భయం లేదని- రమ్మన్నాడు విశ్వం.
****
అరగంట తర్వాత ఇద్దరు వచ్చారు. రాగానే మహేంద్రరెడ్డి తల్లి, భార్య లోపలనుండి బయటకు వచ్చారు. సుహాసినికి నానమ్మ అంటే ప్రేమ. దగ్గరగా తీసుకుంది. వాతావరణం కొంచెం ప్రశాంతంగా కనిపించసాగింది.
విశ్వం అన్నాడు ‘‘సుహాసినీ.. మీ నాన్న మీ పెళ్లికి ఒప్పుకొన్నాడు, ఘనంగా మళ్లీ పెళ్లి చేస్తాడట’’.
సుహాసిని విచిత్రంగా చూసింది మాష్టారు విశ్వం వైపు. ఆ చూపులో కృతజ్ఞత కూడా వుంది. సుహాసిని క్లాస్ లెక్చరర్ విశ్వం.
విశ్వం ఆశించిన జవాబు లేదు. ‘‘ఇంకెందుకూ పెళ్లి చేసుకున్నాంగా, జరిగిపోయిందిగా’’ అంటుందని, అంటారని విశ్వం ఆశ. ఆ మాటల కొరకు ఎదురుచూస్తున్నాడు. ఆ మాటలు ఇక్కడున్నవారి చెంప చెళ్లుమనిపించటమే కాదు సమాజం చెంప చెళ్లు మనిపిస్తాయి. ఇదే విశ్వం ఆశ. విశ్వం ఆశయాల ఆశ. విశ్వం ఆదర్శాల ఆకాంక్ష.
ఐదు నిమిషాలయినా సుహాసిని నుండి జవాబు రాలేదు. భర్త సురేందర్ కనులలోకి చూడసాగింది.
విశ్వం మళ్లీ అన్నాడు ‘‘సురేందర్! విన్నావనుకుంటాను, మీ మామయ్య మీ పెళ్లి మళ్లీ ఘనంగా చేస్తారట’’.
అందరూ నిశ్శబ్దం, జవాబు కొరకు నిరీక్షిస్తున్నారు.
‘‘సార్ నాకు అర్థం కాలేదు, మళ్లీ పెళ్లి అంటే...?’’
‘‘మీ పూల దండల పెళ్లి పెళ్లి కాదని.. సాంప్రదాయ పెళ్లిలాగా.. కార్డులు, పందిళ్లు, బాజాలు భజంత్రీలు పురోహితులు.. అక్షింతలు..’’ అన్నాడు విశ్వం.
‘‘వరకట్నం ఎంత యిస్తారో అడగండి నాకు, అభ్యంతరం లేదు’’ అన్నాడు సురేందర్.
షాక్ తిన్నాడు విశ్వం... ఇదా వీడి ఆదర్శం.
‘‘ఎంతో నువ్వే అడుగు’’ అన్నాడు వార్డు మెంబర్.
‘‘పెళ్ళే చేస్తున్నాను, కన్న కూతురునిస్తున్నాను, పది లక్షలిస్తాను’’ అన్నాడు మహేందర్‌రెడ్డి.
‘‘నాకు అభ్యంతరం లేదు’’ అన్నాడు సురేందర్.
విశ్వం లేచాడు. ముఖం కళ తప్పింది. నల్లగా మాడిపోయింది. తన ఆదర్శం ఇంతగా ఫెయిల్ అవుతుందని ఆయన అనుకోలేదు.
సుహాసిని మీద కొంత ఆశ వుంది విశ్వంకు. సురేందర్ మాటకు సుహాసిని ఎదురు తిరుగుతుందనుకున్నాడు, అదే లేదు.’’
‘సుహాసినీ! నీ అభిప్రాయమేమిటీ?’ అన్నాడు ఎంతో ఆశతో. ‘వరకట్నం అమ్మాయిల పాలిట నాగుబాము’ అన్నాడు కొంత కనిపించని ఆవేశంతో.
‘‘మాస్టారూ! సురేందర్ మాటలలో తప్పేముంది. నాన్న ఇస్తానంటున్నాడు. డబ్బు మాస్టారు డబ్బు.. బ్రతకటానికి డబ్బు కావాలిగా...’’ అంది సీరియస్‌గా చిర్నవుతో సుహాసిని.
‘‘నేను ఓడిపోయాను, ఘోరంగా ఓడిపోయాను’’ అంటూ బయటకు వచ్చాడు విశ్వం మాడిపోయిన ముఖంతో మసి మనసుతో. *

-సిహెచ్.మధు
రచయిత సెల్ నెం: 9949486122

-సిహెచ్.మధు