కథ

నగ్నసత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణ ప్రచురణకు
ఎంపికైన కథ
**
‘కారు ఆపు’ అన్నాడు సత్య డ్రైవర్‌తో.
అది ఓ మురికివాడలో బహిరంగ స్థలం. ఓ పక్క చెత్త కుప్పలు, మరోపక్క కుక్కలు, ఓ పక్క పందులు. మధ్యమధ్య రొచ్చు గుంటలు. ఒక మూల బోరులోంచి వేసిన నీళ్ల పంపు.
డ్రైవర్ కారాపి, తలుపు అద్దం తీసి చటుక్కున ముక్కు మూసుకుని, ‘ఇక్కడా?’ అన్నాడు.
సత్య ముక్కు మూసుకోలేదు. ఆ బహిరంగ స్థలం మధ్యలో కేరింతలు కొడుతూ ఆడుకుంటున్న తనీడు పిల్లల్ని అబ్బురంగా చూస్తున్నాడు.
సత్యకి ఐదేళ్లు. బడిలో చేరి రెండేళ్లయింది. అతడి తండ్రి - హోదాకి మంత్రి, చెప్పడానికి సేవకుడు, పేరు రాజు. మనసులో రాజుననే అనుకుంటూ, నడతలోనూ రాజులాగే ఉంటాడాయన. అందుకు తగ్గట్లే అప్పుడే రాజు అనుచరులంతా సత్యని కాబోయే మంత్రిగా నిర్థారించేశారు.
‘ఊఁ ఇక్కడే’ అని, ‘వెళ్లి అక్కడాడుకుంటున్న పిల్లల్లో విస్సు ఉన్నాడేమో కనుక్కో’ అన్నాడు సత్యం.
విస్సు సిద్దు కొడుకు. సిద్దు రాజు ఇంట్లో తోటమాలి. అప్పుడప్పుడు తండ్రితో వచ్చి తనూ పని చేస్తుంటాడు.
తనీడు వాడు తోట పని చెయ్యడం ఆశ్చర్యమనిపించింది సత్యకి. వాణ్ణి పలకరించి మాట్లాడితే, మరింత ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది.
విస్సు బడికి వెళ్లడం లేదు. రోజులో సగ భాగం తనీడు పిల్లల్తో ఆటలాడుతూ గడిపేస్తాడు.
సత్యకి చదవడానికి కామిక్ బుక్స్ ఉన్నాయి. చూడ్డానికి తనకంటూ ప్రత్యేకంగా ఇవి ఉంది. ఆడుకుందుకు వీడియో గేమ్స్ ఉన్నాయి. తినడానికి ఏమడిగితే అవున్నాయి. తీరుబడి ఉన్నప్పుడల్లా వాటితోనే వాడికి కాలక్షేపం.
తన వయసు పిల్లలు, తనీడు పిల్లలతో ఆటలాడుకోవచ్చని వాడికింకా తెలియదు. ఏమాడుకోవాలో కూడా తెలియదు. ‘ఆటలంటే?’ అనడిగాడు.
సత్య చెప్పాడు. వాటిలో గోళీలున్నాయి. దాగుడు మూతలున్నాయి. ఫుట్‌బాల్, క్రికెట్ కూడా ఉన్నాయి. ఇంకా ఏమేమో ఉన్నాయి. ఐతే రోజుకో ఆట కాదు. రోజూ అన్నీ ఆడుకుంటారు.
రాజుకి ఫుట్‌బాల్, క్రికెట్ తెలుసు. వాటికో రోజు సరిపోదని తెలుసు. ఆ ఆటల గురించి తనకి తెలిసిన కొన్ని ప్రశ్నలు వేశాడు. ఐతే ఆ ఆటలకు సంబంధించి విస్సుకి తెలిసిన నియమాలు, ప్రమాణాలు పూర్తిగా వేరు. అందుకే విస్సు ఇచ్చిన జవాబులు సత్యకి బొత్తిగా అర్థం కాలేదు.
‘ఒకసారి మీ ఆటలు చూడాలి’ అన్నాడు సత్య చివరికి.
విస్సుకి గర్వంగా అనిపించింది. తామెక్కడ ఆడుకునేదీ చెప్పాడు.
సత్యకి తెలుసు - అక్కడికెళ్లి వాల్ల ఆటలు చూడ్డానికి తలిదండ్రులొప్పుకోరని. అందుకని బడికి డుమ్మాకొట్టి ఒకరోజు అక్కడికి వెళ్లాలనుకున్నాడు. అందుకు తన కారు డ్రైవర్ సహకారం కోరితే అతడో పట్టాన ఒప్పుకోలేదు. కొంచెం బ్లాక్‌మెయిల్ చేసి, కొంచెం డబ్బాశ చూపించి ఒప్పించాడు. అలా ఆ రోజక్కడికి వచ్చాడు.
డ్రైవర్ విస్సుని పిల్చుకుని వచ్చాడు.
విస్సు దుమ్ము కొట్టుకుని ఉన్నాడు. జుట్టు అట్ట కట్టి ఉంది. చిరిగిన బట్టలు.
సత్యవి ఇస్ర్తి బట్టలు. ఇన్‌షర్ట్ చేసి టై వేసుకున్నాడు. నున్నగా దువ్విన జుట్టు. కాళ్లకి మేజోళ్లు, షూస్. పచ్చని రంగులో మిసమిసలాడిపోతున్నాడు.
‘నేను కూడా మీతో ఆడచ్చా’ అన్నాడు సత్య.
విస్సుకి సత్య మనిషిలా కాక దేవతామూర్తిలా అనిపించాడు. అతడి ముందు తానొక అంటరానివాడిలా అనుభూతి చెందాడు. ‘ఆటలా, నీతోనా? వద్దు వద్దు’ అన్నాడు.
వాడి అభ్యంతరమేమిటో సత్యకి అర్థం కాలేదు. ఆడతానని నొక్కించాడు. ఏమనాలో తెలియక, ‘మా వాళ్లొప్పుకోరు’ అన్నాడు విస్సు.
సత్య అక్కణ్ణించి పిల్లలాడుతున్న చోటకి నడిచాడు. కానీ వాళ్లూ అంతే! వాణ్ణి చూస్తూనే భయపడిపోయారు. అందులో కొంత గౌరవ భావం కూడా ఉంది.
సత్యకి అర్థమైంది. వాళ్లు మట్టిగొట్టుకుని ఉంటే, తను మిసమిసలాడిపోతున్నాడు. ఆ తేడా పోవాలని వాడు ఉన్నట్లుండి నేల మీద పడి దొర్లాడు. డ్రైవర్ వాణ్ణి వారించినా వినలేదు. అట్నించి నరుక్కు రావాలనుకున్న డ్రైవర్ విస్సు వైపు తిరిగి, ‘బాబు బట్టలు మాసినా ఫరవాలేదు. కానీ వంటికి మట్టయితే, అయ్యగారి క్కోపమొస్తుంది. మిమ్మల్నందర్నీ పోలీసులకి అప్పగిస్తాడు’ అని బెదిరించాడు.
అప్పటికే సత్య ముఖానికీ, కాళ్లకీ, చేతులకీ బాగా మట్టి అయింది. వాడి రూపం మారింది.
విస్సు బృందం హడలిపోయారు. నలుగురు కలిసి సత్యని బలవంతంగా నీళ్ల పంపు దగ్గరికి తీసుకెళ్లారు. వొళ్లు కడగడానికి సత్యకి బట్టలు విప్పేయబోతుంటే వాడు ప్రతిఘటించాడు.
‘మేము సత్యని శుభ్రంగా తయారుచేస్తాం. దగ్గర్లోనే మా యిల్లు. తెలుసుగా! నాన్న ఇంట్లోనే ఉన్నాడు. తీసుకుని రా. సత్యని ఆయనకి అప్పగిస్తాం’ అన్నాడు విస్సు.
డ్రైవర్‌కి సిద్దు ఇల్లు తెలుసు. బయల్దేరాడు.
* * *
అడవిలో కాయ. జలధిలో ఉప్పు. రెంటినీ కలిపితే ఊరగాయ.
గుడిసెలో సిద్దు. మేడలో రాజు. ఇద్దరూ కలిసేది ఊరు కాయ - అంటే ఊరుని రక్షించడానికి అనుకున్నప్పుడు బయటపడిన నగ్నసత్యం ఈ కథ!
‘రాజుగారీ సాయంత్రం మనింటికొస్తారుట’ అని ఆ రోజు సిద్దు తన భార్య పూర్ణతో అన్నాడు.
శిథిలావస్థలో గుడిసె. గుడిసె చుట్టూ సూర్యకాంతి. గుడిసె లోపలా సూర్యకాంతి. గుడిసె లోపలున్న సిద్దు, పూర్ణల మొహాల్లో మాత్రం కళాకాంతులు లేవు.
సిద్దు తోట పనులు చేస్తాడు. పూర్ణ ఐదారిళ్లలో పాచిపనులు చేస్తుంది. ఇద్దరికీ అక్షర జ్ఞానముంది. ఆర్థికంగా కాకపోయినా, ఆ ప్రభావం వారి దాంపత్యానికి ఉపయోగపడింది. వాళ్లకి ఒక్కడే కొడుకు - విస్సు!
సిద్దు తల్లిదండ్రులు గ్రామంలో ఉన్నారు. తండ్రి సంపాదన అంతంత మాత్రం. మధుమేహంతో బాధపడే తల్లి వైద్యానికీ, మందులకీ సిద్దు డబ్బు పంపాలి. అతడి అక్కడ పెళ్లి బాకీకి వడ్డీ డబ్బూ తనే పంపాలి.
విస్సుని చదివించాలని వాళ్లనుకోవడం లేదు. ఫీజులు లేకపోయినా - బడి అనగానే మంచి బట్టలు, పుస్తకాలు, ఇంకా ఇతర ఖర్చులు ఉంటాయి. అందుకని కొడుక్కి ఇంట్లోనే రాయడం చదవడం నేర్పి - ఇప్పట్నించీ తోట పని నేర్పాలని వాళ్లనుకున్నారు. వాళ్లకి జీవితమంటే జీవించడమే - ఆశించడం కాదు!
సిద్దుకి దురలవాట్లు లేవు. భాషలో మర్యాద ఉంటుంది. వీలునుబట్టి చుట్టుపక్కల వాళ్లకి తనకొచ్చినంతలో అక్షరజ్ఞానం కలిగిస్తాడు - అదీ ఉచితంగా. అందుకే ఆ వాడలో - అతడికి పేరు, గౌరవం ఉన్నాయి.
అదే వాడలో ఉండే సుబ్బుకి చదువు లేదు. లేని అలవాట్లూ లేవు. నోరు విప్పాడంటే - బూతు పారాయణమే!
వాడలో జనం సుబ్బుని సిద్దుతో పోల్చి ఈసడిస్తూంటారు. దాంతో సుబ్బుకి తిక్కరేగింది. సిద్దుని తిట్టబోయాడు. ప్రతిగా జనం అతణ్ణి తిట్టారు. సిద్దుని కొట్టబోయాడు. ప్రతిగా జనం అతణ్ణి కొట్టబోయారు.
డబ్బవసరమైనప్పుడు సుబ్బు ఓ ఛోటా రాజకీయ నేతకి కాని పనులు చేస్తుంటాడు. సిద్దు విషయంలో తనకి ఏదైనా ఉపాయం చెప్పమని అతడాయన్ని కోరాడు.
‘ఉత్తినే గొడవ పడి కలకాలం నెగ్గుకురాలేవు. సిద్దుకి దురలవాట్లు మప్పు. ఒప్పుకోకపోతే ఇల్లు తగలెడతాననో, పెళ్లానే్నదో చేస్తాననో, కొడుకు నెత్తుకుపోతాననో బెదిరించు. ప్రతి మనిషికీ దురలవాట్ల మీద కొంత మోజుంటుంది. దానికేదో వంక కావాలి. నువ్వు బెదిరించు. వాడొప్పుకుంటాడు. ఒప్పుకోడూ, నా పేరు చెప్పు. ఒకసారి దురలవాట్లకి లొంగేక వాడు నీ కాలి కింద తొత్తే అనుకో’ అన్నాడు నేత.
సుబ్బు అలాగే చేశాడు.
విషయం దూరం వెడుతోందని సిద్దుకి అర్థమైంది. ముల్లుని ముల్లుతోనే తియ్యాలని, తన సమస్యని రాజుకి చెప్పాడు.
రాజుది రెండంతస్థుల మేడ. ఆ మేడ చుట్టూ ఉన్న విశాలమైన పెరడులో - రకరకాల మొక్కలు, కూరగాయల పాదులు. వేప, కరివేప, మామిడి, నేరేడు, సపోటా, పనస, నిమ్మ వగైరా రకరకాల చెట్లు.
ఆ తోట అందాన్ని తాజాగా ఉంచే మేకప్‌మాన్ సిద్దు. అతడా ఇంటి తోటమాలి.
సిద్దుకి జీవితమంటే జీవించడమే. రాజుకి మాత్రం జీవితమంటే జీవితమంతా ఆశించడమే!
సిద్దు తన గోడు చెప్పగానే రాజులో ఆశలు రేగాయి.
కొద్ది నెలల్లో ఎన్నికలు రానున్నాయి. సిద్దు ఉండే వాడలో కనీసం వెయ్యి ఓట్లున్నాయి. ఇంచుమించు అన్నీ సిద్దుకి అనుకూలం. సిద్దు తనవాడైతే చాలు. అవన్నీ తనకే!
ఆయన తలచుకుంటే సుబ్బుని వాడ నుంచి తరిమెయ్యగలడు. ఛోటా నేతని ఎక్కడుంచాలో అక్కడుంచగలడు. కానీ అలాంటి పనులు చాలా పెద్దవాళ్ల కోసం చెయ్యాలి. మరీ సిద్దులాంటి వాళ్ల కోసం కాదు.
ఐనా గోటితో పోయేదానికి గొడ్డలెందుకు?
‘ఒకపూట నీ ఇంటికొస్తాను. నీతో కలిసి భోంచేస్తాను. అది చాలు. నువ్వు నా మనిషివని తెలియడానికి! ఆ తర్వాత ఎవ్వరూ నీ జోలికి రారు’ అన్నాడు రాజు వరమిస్తున్నట్లుగా.
అప్పుడే ఆయన ఆలోచనల్లో ఆ దృశ్యాలన్నీ - దినపత్రికల్లో వార్తలుగా, టివి ఛానెళ్లలో కథనాలుగా - కళ్లకు కడుతున్నాయి. పైసా ఖర్చు లేకుండా ఎంత ప్రచారం!
‘తమరా, నా ఇంటికా?’ అన్నాడు సిద్దు తెల్లబోయి.
సిద్దుకి రాజు దేవతామూర్తి. ఆయన్ని దూరాన్నించి చూసి చేతులు జోడించగలడు. ఆయన తినే తిండికి పనికొచ్చే కాయగూరలూ, ఫలాల కోసం పగలూ రాత్రీ శ్రమించగలడు. కానీ ఆయనతో సరిసమానంగా పక్కన నిలబడనైనా లేడు. ఆయనకి తనింట్లో భోజనమా?
కానీ - రాజుని కాదనే ధైర్యమూ సిద్దుకి లేదు.
* * *
ఇంటికొచ్చిన రాజుని ఎలా ఆదరించాలా అని సిద్దు దంపతులు మీమాంస పడుతున్నారు. ఆలోగా అక్కడికి రాజు కారు డ్రైవర్ వచ్చాడు. జరిగింది చెప్పాడు.
సిద్దు ఉలిక్కిపడ్డాడు.
రాజు తనింట్లో భోజనానికి ఒప్పుకోవచ్చు. కానీ ఆయన కొడుకు మురికివాడకు వచ్చి అక్కడి పిల్లలతో ఆటలాడుతూ ఆ మురికిని అంటించుకుంటే భరించగలడా?
‘ఎంత పని జరిగింది?’ అంటూ ఉన్నపళంగా బయల్దేరాడు.
డ్రైవర్ కారెక్కమన్నాడు. కానీ రాజు కారు - రాజు తోటమాలి ఎక్కుతాడా?
సిద్దు కారెక్కలేదు. కానీ కారుకంటే వేగంగా పిల్లలాడుకునే బహిరంగ స్థలానికి వెళ్లాడు.
ఆ సమయానికి అక్కడ చూసిన దృశ్యం, రాజుని కలవరపరిస్తే, డ్రైవర్ని నిశే్చష్టుణ్ణి చేసింది.
పిల్లలందరూ కలిసి ఓ రబ్బరు బంతితో ఫుట్‌బాల్ ఆడుతున్నారు. వాళ్లలో సత్య కూడా ఉన్నాడు.
అప్పుడు సత్య రాజు కొడుకులా లేడు. ఆ పిల్లల్లో తానూ ఒకడిలా ఉన్నాడు. చెప్పలేనంత ఉత్సాహంతో ఉన్నాడు. బాల్యాన్ని బాల్యంలా ఆనందిస్తున్న సంతృప్తికి మారురూపంలా ఉన్నాడు.
సిద్దు రాగానే సత్య ఉత్సాహంగా, ‘వీళ్లంతా నన్ను కూడా ఆడనిస్తున్నారు. ఇక్కడ చాలా బాగుందంకుల్!’ అన్నాడు.
సత్య సిద్దుని అంకుల్ అనడం అదే మొదటిసారి. అతడి ముఖంలో కలవరం రెట్టింపయింది. ‘విస్సూ! మనమెక్కడ, ఆ బాబెక్కడ! వాళ్లతో మనకి ఆటలా?’ అని గట్టిగా అరుస్తూ ఇంకా ఏదో అనబొయ్యాడు.
విస్సు వెంటనే, ‘నేను కూడా సత్య మనలా కాదు, వేరనుకున్నాను నాన్నా! కానీ వాడికి బట్టలిప్పి స్నానం చేయించాంగా, అప్పుడు తెలిసింది - వాడూ మాలాంటి వాడేనని!’ అన్నాడు.
అప్పుడు డ్రైవర్ ఉలిక్కిపడ్డాడు. సిద్దు ఉలిక్కిపడ్డాడు.
వాళ్లే కాదు- అసహాయులమనుకుంటూ, బానిస మనస్తత్వంతో బ్రతుకు నడిపే సామాన్యులెందరో కూడా బహుశా ఉలిక్కిపడి ఉంటారు.
మనిషినీ మనిషినీ వేరు చేస్తున్నదేమిటో అంతకంటే స్పష్టంగా ఎవరు చెప్పగలరు?
కొడుకు ద్వారా బయటపడిన నగ్నసత్యం కలిగించిన ఉలికిపాటు - రాజుకివ్వాల్సిన ఆతిథ్యం విషయంలో ఎంతవరకూ సహకరించిందో పాఠకుల ఊహకందదా?

-వసుంధర.. 9885620065