కథ

ప్రయాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణ ప్రచురణకు
ఎంపికైన కథ
*
‘రే పు మనం ఒంగోల్ వెళ్తున్నాం’ అన్నాను సాగర్‌తో.
నా వైపు కొన్ని క్షణాలు ఆశ్చర్యంగా చూసి ‘అంత సడన్ ప్రయాణం పెట్టారేమిటి నాన్నా? అక్కడేమైనా ముఖ్యమైన పని ఉందా?’ అని అడిగాడు.
‘అవున్రా.. చాలా ముఖ్యమైన పని. తప్పకుండా చేయాల్సిన పని’
‘నేనెందుకు నాన్నా? నాకిక్కడ చాలా పనులున్నాయి. మీరు వెళ్లిరండి’
‘ఇది మనిద్దరం కలిసి చేయాల్సిన పని. రేపు రాత్రి పదింటికి ట్రెయిన్. రెండ్రోజులకు అవసరమైన బట్టలు సర్దుకో’ అన్నాను.
‘రిజర్వేషన్ చేశారా?’
‘ప్రయత్నించాను. దొరకలేదు’
సాగర్ ఏమీ మాట్లాడలేదు. నా వైపు నమ్మలేనట్టు చూసి వెళ్లిపోయాడు. వాడికి ఊహ తెలిసినప్పటి నుంచి ముందే రిజర్వేషన్ చేయించుకున్న ఏసీ బోగీల్లో తప్ప ప్రయాణం చేయలేదు.
మరునాడు ప్రయాణానికి సిద్ధమైన సాగర్ వైపు చూశాను. చలువ చేసిన ఖరీదైన సూట్, టై, నల్లగా నిగనిగా మెరుస్తున్న బూట్లు...
‘ఇలా కాదు. మాసిపోయిన చౌక బట్టలేమైనా ఉంటే తొడుక్కో. ఇంట్లో వాడే మామూలు చెప్పులు వేసుకో. మనం ఈ రోజు జనరల్ బోగీలో ప్రయాణం చేయబోతున్నాం’ అన్నాను నవ్వుతూ.
సాగర్ మొహంలో ఓ క్షణం వ్యతిరేక భావమేదో కన్పించి వెంటనే మాయమైంది. నేనేం చేసినా బాగా ఆలోచించి అతని ఉన్నతిని కాంక్షించి చేస్తానన్న నమ్మకం వాడికుంది. నేను కోరుకున్నట్లే తయారయి వచ్చి నా ఎదురుగా నిలబడి ‘ఇప్పుడు జనరల్ కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణించే వాడిలానే ఉన్నాను కదూ’ అంటూ నవ్వాడు.
సింహపురి ఎక్స్‌ప్రెస్. ట్రెయిన్ రావడానికి సరిగ్గా పది నిమిషాల ముందు స్టేషన్లోకి ప్రవేశించాం. ‘రెండు టిక్కెట్లు కొనుక్కుని రా’ అంటూ సాగర్ చేతిలో డబ్బులు పెట్టాను. తన చేతిలో ఉన్న డబ్బుల వైపు చూసి మళ్లా నా వైపు చూసి ‘రెండు టిక్కెట్లు వస్తాయా?’ అన్నాడు. ‘వస్తాయి. తొందరగా వెళ్లు. ట్రెయిన్ వచ్చే సమయం అయింది’ అన్నాను.
ట్రెయిన్ ప్లాట్‌ఫాం పైకి వచ్చేసింది. సాగర్ జాడ లేదు. మరి కొద్ది సేపట్లో ట్రెయిన్ బయల్దేరబోతోందన్న ఎనౌన్స్‌మెంట్ రెండోసారి విన్పించింది. ఓ క్షణం నాలో అనుమానం. సాధారణ బోగీలో ప్రయాణం చేయడం ఇష్టం లేక కావాలని ఆలస్యం చేస్తున్నాడేమోనని. వెంటనే నాకు నేను సమాధానం చెప్పుకున్నాను. సాగర్ అలాంటివాడు కాదు. ఒకవేళ నిజంగానే ఇష్టం లేకపోతే ఎవరేమనుకున్నా సరే కరాఖండిగా చెప్పేసే రకం.
సాగర్ పరిగెత్తుకుంటూ రావడం కన్పించింది. వాతావరణం చల్లగా ఉన్నా వాడి నుదుటి మీద చెమట బిందువులు. ‘చాలా పెద్ద క్యూ ఉంది నాన్నా. ట్రెయిన్ వచ్చిందని తెలియగానే తోసుకున్నారు’ అంటూ బలహీనంగా నవ్వాడు. డ్రెస్ మార్చుకుని వచ్చి నా ఎదురుగా నిలబడినపుడు నవ్విన నవ్వుకీ ఈ నవ్వుకీ చాలా తేడా ఉండటం గమనించాను.
ఇద్దరం వేగంగా సాధారణ బోగీల వైపు నడిచాం. సింహపురి ఎక్స్‌ప్రెస్‌కి ఐదు ఏసీ బోగీలు, పధ్నాలుగు స్లీపర్ బోగీలు, మూడు సాధారణ బోగీలున్నాయి. మేం వెళ్లే సమయానికే ఆ మూడు బోగీలు నిండిపోయాయి. ఇంకా మనుషులు తోసుకుంటూ ఎక్కుతూనే ఉన్నారు.
‘నాన్నా. సూది పట్టేంత స్థలం కూడా లేదు’ అన్నాడు నా వైపు నిస్పృహగా చూస్తూ.
ట్రెయిన్ కదిలింది.
‘ఈ పెట్టెలో ఎక్కేద్దాం. లోపలికెళ్తే ఎంతో కొంత స్థలం దొరుకుతుంది’ అంటూ నేను కూడా తోసుకుని లోపలికెక్కాను. నా వెనకే సాగర్ కూడా ఎక్కాడు. కదలడానికి అవకాశం లేనంత జనం.. టాయిలెట్‌కి ఆనుకుని నిలబడ్డాం. ఎవరో ముసలాయన టాయిలెట్ కెళ్లాలన్న ఆరాటంలో మనుషుల కాళ్లని తొక్కుకుంటూ గోడలా అడ్డు నిలబడిన వాళ్లని వయసు మళ్లిన అభిమన్యుడిలా ఛేదించుకుంటూ వస్తున్నాడు.
‘బండెక్కి పావుగంట కూడా కాలేదు. అప్పుడే ఏం తొందరొచ్చింది పెద్దాయనా’ అంటూ ఒకతను విసుక్కున్నాడు.
‘నువ్వూ ముసలాడివైనపుడు తెలుస్తుందిలే నాయనా’ అన్నాడా ముసలతను.
ఎలాగోలా కష్టపడి టాయిలెట్ దగ్గరకు చేరుకున్నాడు. తలుపునకు అడ్డంగా నిలబడి ఉన్న నేను అతనికి వీలు కల్పిస్తూ పక్కకు జరిగాను. అతను తలుపు తీయడానికి ప్రయత్నించాడు. రాలేదు. తలుపేమైనా బిగుసుకుందేమోనని నేనూ ప్రయత్నించా. తెరచుకోలేదు. లోపలి నుంచి ఎవరో గడియపెట్టి ఉంటారని అర్థమైంది. ‘లోపల ఎవరో ఉన్నారు’ అన్నాను అతన్తో.
‘మనం ఎక్కినప్పటి నుంచి ఎవరూ లోపలకి వెళ్లలేదు కదా నాన్నా’ అన్నాడు సాగర్.
తలుపు మీద మెల్లగా తట్టాను. సమాధానం లేదు. మరోసారి తట్టాను. ముసలతనికి తొందరగా ఉందేమో తలుపు మీద దబదబా బాదాడు. మెల్లగా తలుపు తెరుచుకుంది. లోపల ఓ నలభై ఏళ్ల వ్యక్తి అతన్తోపాటు పనె్నండేళ్ల వయసున్న కుర్రవాడు బిక్కుబిక్కుమంటూ నిలబడి ఉన్నారు. వాళ్ల దగ్గర టికెట్ లేదని నాకర్థమైంది. అతను బైటికి రాకుండా భయంగా చూస్తుంటే ‘ఏం పర్లేదు బైటికిరా. నినె్నవరూ టికెట్ అడగర్లే’ అని భరోసా ఇచ్చాను. వాళ్లు బైటికొచ్చాక ముసలతను లోపలికెళ్లాడు. అప్పటి వరకు పల్చగా వ్యాపించి ఉన్న దుర్గంధం తలుపు తీసిన వెంటనే ముక్కుపుటాల్ని అదరగొట్టేసింది.
‘వీటినెవరూ శుభ్రం చేయరా?’ ముక్కుని కర్చ్ఫీతో గట్టిగా మూసుకుంటూ అడిగాడు సాగర్.
‘పేదవాళ్లని ఎవరు పట్టించుకుంటారు చెప్పు. బడుగు జీవులు కదా. పట్టించుకోకున్నా నోరెత్తరన్న ధైర్యం. వానపాములకన్నా వీళ్ల బతుకులు కనాకష్టం’ అన్నాను.
ముసలాయన బైటికి రాగానే మరోసారి అందరికీ నరకంలో ఉన్న స్పృహ కలిగింది.
నిలబడీ నిలబడి కాళ్లు పీకుతున్నాయి. అప్పటికి రెండు గంటల నుండి నిలబడి ఉన్నాం.
‘నేను కూచుంటారా’ అన్నాను.
‘ఎక్కడా’ అన్నాడు ఆశ్చర్యపోతూ సాగర్.
‘ఇక్కడే’ అంటూ కింద చతికిలపడి కాళ్లు బయటకి వేలాడదీశాను. ప్రాణానికి హాయిగా అన్పించింది. ‘నువ్వూ కూచుంటావా?’ అని అడిగాను. ‘లేదు. నిలబడ్తాను’ అన్నాడు. నాకు తెలుసు వాడు కూచోలేడని.
‘ఎలా కూచోగలిగారు నాన్నా? కాళ్లు పైకి పెట్టుకోండి. ఏమైనా తగిల్తే ప్రమాదం’ అన్నాడు.
‘ఏం కాదులేరా. నా చిన్నప్పుడు ఇలా ఎన్నిసార్లు ప్రయాణం చేశానో. నాకలవాటేలే’ అన్నాను.
రాత్రి ఒంటిగంట దాటింది. ఆకాశంలో నక్షత్రాలు అచ్చెరువొంది నావైపు చూస్తున్నట్టనిపించింది. చంద్రుడు మేఘాల కొంగు చాటున దాక్కుని మురిపాలు పోతున్నట్టున్నాడు. చల్లటి గాలి వీస్తోంది.
వరంగల్ స్టేషన్‌ని సమీపిస్తున్నప్పుడు లేచి నిలబడ్డాను. ఓ పదిమంది దిగుతున్నారు. ఎక్కడానికి పాతిక మంది వరకూ తయారుగా ఉన్నారు. ‘లోపలికెళ్దాం పద’ అంటూ నేను ముందుకు కదిలాను.
సీట్ల మధ్య ఉన్న దారిలో టవళ్లు పర్చుకుని నిద్రపోతున్నారు. ‘ఏయ్. జరగండి. దారికడ్డంగా పడుకుంటే నడిచేవాళ్లకు ఇబ్బంది కాదా?’ అంటూ సాగర్ అదిలించినా ఒక్క అంగుళం కూడా కదలకుండా పడుకునే ఉన్నారు. వాళ్లపై నుంచే సగం తొక్కుకుంటూ ముందుకెళ్లాం. ఖాళీ స్థలమే కన్పించలేదు. మనుషులు ఒకరి మీద ఒకరు కూచున్నట్టు క్రిక్కిరిసి ఉన్నారు. బోగీ చివర్లో ఒకచోట పై బెర్తు ఖాళీగా కన్పించింది. మాతోపాటు మరో ఇద్దరు కుర్రాళ్లు దాన్ని చూసి టు వైపు జంప్ చేయబోతున్నారు.
‘క్విక్’ అంటూ అటుకి గెంతి ఒక్క ఉదుట్న పైకెక్కి కూచున్నా. సాగర్ నా వెనకే బెర్తు పైకి ఎక్కి కూచుంటూ ‘మీలో ఇంత వేగం నేనెప్పుడూ చూళ్లేదు నాన్నా. నాకన్నా యూత్‌లా అన్పించారు’ అన్నాడు నవ్వుతూ. ట్రెయిన్ ఎక్కాక ఇదే వాడు మొదటిసారి నవ్వటం...
‘అవసరం మనిషి చేత ఏమైనా చేయిస్తుంది’ అన్నాను.
‘రెండు కావస్తోంది. మీరు పడుకోండి నాన్నా’ అన్నాడు బెర్తు చివరికి జరుగుతూ సాగర్.
‘మేల్కొని ఉండటం నాకలవాటేరా. నువ్వే పడుకో. నిద్ర లేకపోతే నీరసపడ్తావు’ అన్నాను.
ఇందాకటి కుర్రాళ్లిద్దరిలో ఒకతను మా బెర్తు మీద ఎగిరి కూచుంటూ ‘ఇది స్లీపర్ కోచ్ కాదు హాయిగా పడుకోడానికి’ అన్నాడు.
మా ఎదురుగా ఉన్న పైబెర్త్ మీద ఎవరో ముసుగుతన్ని పడుకుని ఉన్నతన్ని చూపించి ‘అతన్ని లేపు మరి’ అన్నాడు సాగర్.
‘నిద్ర పోతున్న వాళ్లని లేపకూడదు. పాపం’ అంటూ అతను కూచునే కళ్లు మూసుకుని నిద్ర కోసం ప్రయత్నించసాగాడు. కింద నిలబడిపోయిన మరో కుర్రాడు ముసుగుతన్ని పడుకుంటున్నతన్ని గట్టిగా తట్టి లేపాడు. ‘లేలే... కూచోడానికే చోటు లేక చస్తుంటే దర్జాగా పడుకున్నావే’ అన్నాడు. అతను కొద్దిగా కళ్లు తెరిచి చూసి, ఖళ్లుఖళ్లున దగ్గి, మళ్లా పడుకుంటూ ‘ఈ పొద్దంతా జొరం కాసింది సామి. పేణం బాగోలేదు. వొల్లంతా మా సెడ్డ సలపరం. నీర్సం’ అన్నాడు.
సాగర్ కూడా కళ్లు మూసుకుని నిద్రకు ఉపక్రమించాడు. మా వెనక పక్క బెర్తుల్లో ఎక్కడో చంటిపిల్ల ఉన్నట్టుంది. ఏడుపు లంకించుకుంది. పెద్దగా ఏడుస్తోంది. గుక్కపట్టి మరీ ఏడుస్తోంది. ఎంత సముదాయించినా ఏడుపు ఆపటంలేదు.
‘పిల్లకు ఉక్కబోస్తుందేమోనమ్మా’ అంది ఓ పెద్దావిడ. ‘ఇదిగో బాబూ. నీ పక్కనే స్విచ్ ఉందిగా. కొద్దిగా ఫ్యాన్ వేయి. చంటిపిల్ల ఏడుస్తోంది’ అంది కిటికీ పక్కన కూచుని ఉన్నతనితో. ‘్ఫ్యను తిరగటం లేదు. స్విచ్ వేసే ఉంది’ నిద్ర మత్తులోనే సమాధానమిచ్చాడతను.
సైడ్ బెర్తు మీద కూచుని ఉన్న ఒకావిడ ‘రేయ్.. ఎవడ్రా నా మీద సెయ్యేసింది’ అంటూ భద్రకాళిలా లేచింది. ఆమెకు పాతిక్కి మించి వయసుండదు. బక్కపల్చగా చామనచాయతో ఉంది. నుదుట రూపాయి కాసంత పెద్ద బొట్టుంది. ‘ఈడే.. ఈడి సేయే నాకు తగిలింది’ అంది అదే బెర్తు మీద కూచుని ఉన్న వ్యక్తిని తన భర్తకు చూపిస్తూ. ‘నా మొగుడికి నీ మీద సెయ్యెయ్యాల్సిన కర్మేం పట్లేదు’ అంది ఆమె పక్కనే కూచుని ఉన్నావిడ. అతను నిద్దట్లోంచి లేచి వెర్రి మొహం వేస్కుని పోట్లాడుకుంటున్న ఆడవాళ్ల వైపు చూస్తున్నాడు. పాపం నిద్దట్లో పొరపాటున చేయి తగిలి ఉంటుందనుకున్నాను. భద్రకాళి భర్త అతన్ని కొట్టడానికి పైపైకి పోతున్నాడు. ఎవ్వరూ సర్దిచెప్పే ప్రయత్నం చేయడంలేదు.
వీళ్ల కొట్లాట ముగియక ముందే ఒంగోలు వచ్చేసింది.
నేను పుట్టి పెరిగిన వూరయినా అమ్మానాన్న ఎప్పుడో చనిపోయి ఉండటంవల్ల బంధువుల యింట్లో దిగాం. సాగర్ టిఫిన్ తిని గాఢనిద్రలోకి జారుకున్నాడు. నేను వూళ్లోని పాత స్నేహితుల్ని కల్సుకుని ఒంటిగంటకల్లా తిరిగి వచ్చేశాను. అప్పటికీ సాగర్ నిద్రపోతూనే ఉన్నాడు. వాణ్ణి లేపి ఇద్దరం భోజనం చేశాక తిరుగు ప్రయాణానికి స్టేషన్ చేరుకున్నాం.
సమయం రెండున్నర గంటలు. ‘ఇపుడు హైదరాబాద్ వెళ్లడానికి ఏం ట్రెయిన్ ఉంది నాన్నా?’ అని అడిగాడు సాగర్. ఎప్పుడూ ముద్దబంతిపూవులా విప్పారినట్టుండే వాడి మొహం వాడిపోయి ఉంది.
‘ఇప్పుడు మనం విజయవాడ వెళ్తున్నాం. అక్కడి నుంచి హైదరాబాద్’ అన్నాను. ‘మరో పావుగంటలో ప్యాసింజర్ ఉంది’ అన్నాను.
‘ప్యాసింజరా? నాన్నా... జోక్ చేస్తున్నారా?’ అన్నాడు వాడు.
నేను నవ్వి వూరుకున్నాను. ప్యాసింజర్ వచ్చింది. భారతదేశం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య అధిక జనాభా అనే దానికి నిదర్శనంగా బోగీల నిండా జనం. మేము పావుగంట ముందే ప్లాట్‌ఫాం మీద ఉన్నందువల్లేమో ఇద్దరికీ కూచోడానికి కొద్దిగా జాగా దొరికింది. సాగర్ పక్కన కూచున్నతను స్నానం చేసి ఎన్ని రోజులైందో చెమట కంపు కొడ్తున్నాడు. అంత రద్దీలోనూ ఎదురు బెర్తులో కూచుని ఉన్నతను గుప్పుగుప్పున బీడీ కాలుస్తున్నాడు. సాగర్‌కి పొగ తాగేవాళ్లంటే అస్సలు పడదు.
ముళ్ల కంప మీద కూచున్నంత అసహనంగా కూచున్నాడు సాగర్.
‘ఇబ్బందిగా ఉందా?’ అని అడిగాను.
‘నిన్న చేసిన ఘోరమైన ప్రయాణాన్ని ఓ పీడకల అనుకుని మర్చిపోయేంత సమయం ఇవ్వకుండానే మళ్లా ప్రయాణం పెట్టారు. నిద్రలేని బడలిక కూడా తీరలేదు నాన్నా. ఇది ఇంకో నరకంలా ఉంది’ అన్నాడు.
‘అలా అనుకుంటే ఎలా? రోజూ ఎన్ని లక్షల మంది ఇలాంటి ప్రయాణాలు చేస్తున్నారో గమనించావుగా?’ అన్నాను.
వాడు మాట్లాడకుండా కిటికీ వైపు తిరిగి కర్చ్ఫీతో ముక్కు మూసుకుని కూచున్నాడు.
ట్రెయిన్ మెల్లగా ఎడ్లబండిలా కదుల్తోంది. ఎక్కడబడితే అక్కడ ఆపేస్తున్నాడు. ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ప్రాధాన్యత ఇచ్చాకే ఈ బండికి సిగ్నల్ ఇస్తున్నారు.
‘శిక్షలా ఉంది నాన్నా. గంటన్నరలో వెళ్లిపోయేవాళ్లం. ఇలా వెళ్తే విజయవాడ ఎప్పటికి చేరతామో’ అన్నాడు సాగర్.
‘కొన్నిసార్లు శిక్షలు కూడా మేలు చేస్తాయి. అవి మన శరీరాన్ని మనసునీ ఉత్తేజపరిచి ఆలోచనని విశాలం చేస్తాయి’
‘ఇలా గంటలు గంటలు రైలు ఆగిపోతే ఎంత సమయం వృధా నాన్నా? సమయం విలువ తెలియదా వీళ్లకి?’ అన్నాడు చిరాగ్గా.
‘పేదవాడి సమయం కదా. ప్రభుత్వం దృష్టిలో దానికి విలువ లేదు’ అన్నాను.
రాత్రి ఏడింటికి హైదరాబాద్ చేరాల్సిన రైలు ఎనిమిదింటికి చేరింది.
రైలు దిగిన వెంటనే ‘ఇక నా వల్ల కాదు నాన్నా. మీరు ప్యాసింజర్ ట్రెయిన్లూ జనరల్ బోగీల్లో ప్రయాణం అంటే నేను మీతోపాటు హైద్రాబాద్ రాను. రాత్రికి ఇక్కడే ఏదైనా హోటల్లో రూం తీసుకుని ఉదయం ఫ్లయిట్లో వస్తాను’ అన్నాడు.
‘నాకు తెలుసు నీ ఓపిక నశించిందని. ఇక్కడి నుంచి వేరే ఏర్పాటు చేశాలే. ముందే టిక్కెట్లు రిజర్వ్ చేశాను. మొదట బయటికెళ్లి ఏదైనా మంచి హోటల్లో భోం చేద్దాం పద’ అన్నాను.
టాక్సీ మాట్లాడుకుని డివిమనార్ హోటల్లో భోజనం ముగించి తిరిగి స్టేషన్ చేరుకున్నాం. పదింటికి ట్రెయిన్లో ఏసీ కోచ్‌లోకి ఎక్కి కూచున్నాం. బండి బయలుదేరాక ‘నేను పడుకోడానికి పై బెర్త్‌కి వెళ్తాను’ అన్నాడు సాగర్. ఏసీ బోగీలో వున్నా అతని మొహంలో చిరాకుని గమనించాను.
‘ఈ ప్రయాణాలు ఎందుకు చేయించానో అర్థమైందనుకుంటాను’ అన్నాను.
‘నాకర్థమైందిలెండి. నేను సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసి రైల్వే సర్వీస్‌కి సెలెక్టయ్యాను కదా. వచ్చే వారం నుంచే ట్రెయినింగ్ మొదలవబోతోంది. ఇన్నాళ్లూ ఏసీ బోగీల్లో ప్రయాణించిన నాకు నాన్ ఏసీలో ప్రయాణం ఎలా ఉంటుందో చూపించాలనుకున్నారు. అంతేనా?’ అన్నాడు.
‘కాదు. రైల్వే అధికార్లు ఎప్పుడూ ఏసీల్లో ప్రయాణించే వారి కోసం మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించడం గురించే ఆలోచిస్తుంటారు. పేదవాళ్లు ప్రయాణించే జనరల్ బోగీల గురించి, ప్యాసింజర్ రైళ్ల గురించి పట్టించుకోరు. నువ్వు ట్రెయినింగ్ తర్వాత రైల్వేలో అధికారిగా ఉద్యోగంలో చేరతావు. ఉద్యోగ జీవితంలో నీవు సుదీర్ఘమైన ప్రయాణం చేయబోతున్నావు. ఇంకా ఉన్నత పదవులు అధిరోహించి నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదుగుతావు. ఆ ప్రయాణంలో మనం చేసిన ఈ ప్రయాణం గుర్తు పెట్టుకుని పేద ప్రయాణీకుల కోసం ఏమైనా చేస్తావన్న ఆశ. ఆకాంక్ష’ అన్నాను.
సాగర్ క్షణకాలం నా కళ్లల్లోకి చూసి, నా చేతిలో చేయి వేస్తూ ‘తప్పకుండా చేస్తాను నాన్నా. మీ ఉదాత్తమైన కోరికని ఉద్యోగంలో ఉన్నంత కాలం గుర్తు పెట్టుకుంటాను. మీరేదో పాఠం చెప్పాలన్న ఉద్దేశంతో చింత బరికెతో కొట్టి చెప్తున్నారని బాధపడ్డాను. నాకు హృదయానికి హత్తుకునేలా చెప్పడం కోసం ఆ దెబ్బలు మీరూ తింటున్నారన్న విషయం విస్మరించాను. లేకపోతే చిన్నప్పుడు పేదరికంలో మగ్గినా కష్టపడి చదివి బ్యాంక్ ఆఫీసర్‌గా ఎదిగిన మీరు జనరల్ బోగీలో టాయిలెట్ల దగ్గర కింద కూచుని ప్రయాణం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ ప్రయాణాన్ని ఎప్పటికీ మర్చిపోను నాన్నా’ అన్నాడు.
వాడు చేయబోతున్న సుదీర్ఘ ఉద్యోగ ప్రయాణంలో వాడి గమ్యమేమిటో తెల్సుకున్నాడన్న తృప్తితో నిద్రకు ఉపక్రమించాను.

సలీం.. 7588630243