కథ

నడచి వచ్చిన దారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణ ప్రచురణకు
ఎంపికైన కథ
*
‘మీరనుకుంటున్నట్టు మీకు తెలిసినంతగా నాకు తెలియకపోవచ్చు గానీ నడిచొచ్చిన దారి మాత్రం నాకు బాగా గుర్తుంది. అనుభవాలు మనుషుల్ని రాటుదేలుస్తాయంటారు. ఇలాగే ఆ రామచంద్రాన్ని నమ్మి మోసపోయి ఆరేళ్లు. ఎన్ని అవమానాల పాలయ్యామో... మీకు గుర్తున్నట్టు లేదు. ఇంకా నేర్చుకోరా?’
గినె్నలోని మజ్జిగని ఒకటికి రెండుసార్లు గుంటగరిటెతో కలయ తిప్పి అతని పళ్లెంలో పోస్తూ పదునెక్కువైనా పల్చటి స్వరంలో రాజేశ్వరి అన్న మాటల్తో శేషాద్రికి కోపం బుస్సున పొంగుకొచ్చింది.
‘ఇంకాపుతావా? నేనెళ్తున్న పనేంటి? నువ్వు పేల్తున్న పేలాపనేంటి? ఇప్పుడా రామచంద్రంగాడి సంగతెందుకు ఎత్తావ్? అసలు దీనికీ దానికీ సంబంధం ఉందా? వెధవ గోల.. వెధవ గోలని? శుభమా అంటా ఇంతకాలానికి ఒక్కడంటే ఒక్కడొచ్చాడు కొంటానని. ఎన్నాళ్లయ్యింది ఆ చెక్క అమ్మకానికి పెట్టి? ఒక్కడు? ఒక్కడంటే ఒక్కడైనా ముందుకొచ్చాడా? రాకరాక వచ్చినోణ్ణి వదులుకోమంటావా?.. అవతల బేంకోడు తరిమి తరిమి కొడుతున్నాడు అగ్రికల్చర్ లోనెప్పుడు కడతావని. ఇంకా ఇలాగే చూస్తా ఊరుకున్నామంటే వేలం వేసి అమ్ముకుని మిగిలిన రూపాయో పాపాయో చేతిలో పెడతాడు. ఏమో...! పెడతాడో చాల్లేదని లాక్కుంటాడో ఎవరికి తెలుసు? అయినా అణుగుడు పెట్తల్లే ఇంట్లో కూర్చునుండే వాళ్లకి ఏం తెలుస్తుంది? ఎప్పుడూ అన్నం తినేటప్పుడే పెడతావ్ పెంట...’ కోపంగా అరుస్తూ తినే తినే పళ్లాన్ని విసిరికొట్టి అక్కడ్నించి లేచిపోయేడు శేషాద్రి.
ఆ విసుర్లోని శక్తికి పేద్ద శబ్దం చేసుకుంటూ అంత దూరం వెళ్లి పడి గుండ్రంగా తిరిగీ తిరిగీ ఆగిపోయింది.
మజ్జిగ మెతుకులన్నీ ఇల్లంతా చెల్లచెదురుగా పడిపోయాయి.
అప్పుడే అన్నం తిని తన గదిలోకెళ్లి నడుం వాల్చిన ఇంద్రమ్మ అరుపులు విని గుండె దడెత్తిపోయి మెల్లగా బయటికొచ్చింది. వస్తూనే.. ‘ఆడు కోపంగా ఉన్నప్పుడు మాట్లాడొద్దని ఎన్నిసార్లు సెప్పినా.. ఇదొక్కద్ది.. ఇనిసావదు..’ కసిరింది కోడల్ని.. అత్తగారూ తననే అనేసరికి మరింత తెల్లబోయింది రాజేశ్వరి.
‘ఇప్పుడు మాట్లాడకపోతే ఇంకెప్పుడు మాట్లాడతానత్తయ్యా..! ముల్లుకు తగిల్తే చీర చిరుగుద్దని గదా బాధ. చిరిగాకా చేసేదేముంటుంది’ అత్తగారికి బదులిచ్చి.. అంతలోనే మొగుడికేసి చూస్తూ...
‘అయినా.. మీకెన్నిసార్లు చెప్పేను తినేతినే అన్నాన్నలా విసిరి కొట్టొద్దని? నోటికాడికొచ్చిన కూట్ని ఇలా విరజిమ్మటమేనా? ఇంకా ఏమనుభవించాలని? పడ్డ కష్టాలు చాల్లేదా? ఈ ముద్ద కోసమేగా ఇన్ని పాట్లు? ఆ ముద్దైనా దొరక్క కడుపులో కాళ్లెట్టుకు పడుకున్న రోజులు గుర్తున్నట్టు లేవు మీకు. మొగుడూ పెళ్లాలన్నాకా మాటామంతీ ఉండదా? ఇంత విసుగైతే ఎలాగ? మీకసలే మజ్జిగన్నం తినకపోతే తిన్నట్టుండదంటారు. వస్తారా? రారా? మీర్రాకపోతే నేనూ తినను...’
పడిన పళ్లాన్నలానే వదిలేసి మరో పళ్లెం తెచ్చి టేబుల్ మీద పెడుతూ భార్యన్న మాటలకి మరింత రెచ్చిపోయాడు శేషాద్రి. ‘పెట్టేవ్ లే పెంట? కడుపు నిండిపోయింది’
‘సరే..! మీ ఇష్టం. ఒక్క పూట తినకపోతే పెద్ద నష్టమేం లేదు గనా.. నా ఈ ఒక్క మాటా ఇనండి. మీరు ఆ సోమరాజుని నమ్మద్దు. ఎందుకు చెప్పేనో నా మాట వినండి...’
‘నమ్మద్దో.. నమ్మద్దో! ఇదే గోల. వాడా కాదా దీన్ని కొనిపెట్టింది? వాడ్ని నమ్మకపోతే అంత చవగ్గా ఆ పొలం మనకొచ్చేదా?’ కోపంతో ఊగిపోతూ అన్నాడు.. చెప్పులు తీసి కాళ్లకేసుకుంటూ..
‘రెంటికీ తేడా లేదా? కొనిపెట్టడం వేరు. కొనటం వేరు. కొనిపెట్టటానికి నోట్లో నాలుకతోపాటు ఒకటికి నాలుగుసార్లు తిరగటానికి బండిలో పెట్రోలుకి పైసలుంటే చాలు. మాటలే కదా కొనటానికైనా, అమ్మటానికైనా. అయినా ఊరికే కొనిపెట్టాడా? రెండు శాతం కమీషన్ తీసుకోలేదా ఏంటి? కొనటం అలా కాదు గదా...? పదకొండెకరాల ముప్పై ఆరు సెంట్ల భూమి. ఎకరా తొమ్మిదిన్నర లక్షల కాడికి కోటి దాటుద్ది. ఆ సోమరాజుకి అంత సత్తా లేదని మీకు మాత్రం తెలియదా?’
‘తెలుసు. బాగా తెలుసు. ఆ చుట్టుపక్కలా పాతికెకరాల ఏక చెక్కుంది. పైగా కూతురూ, కొడుకూ ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. తక్కువగా అనుకోకు’
‘ఆయనకి పాతిక ఎకరాలే ఉందో... పాతిక్కొంపలే ఉన్నాయో... మనకి అనవసరమండి. చెక్కుంటం వేరు చేతిలో పైసలాడటం వేరు. తీరా సేల్ అగ్రిమెంట్ రాసుకున్నాకా మూడ్నెల్లే పెడతారో, ఆర్నెల్లే పెడతారో రిజిస్ట్రేషన్‌కి గడువు. గడువులోగా రిజిస్ట్రేషన్ చేయించలేకపోతే న్యాయంగా అయితే అగ్రిమెంటు కేన్సిల్ అవ్వుద్ది. ఆ లెక్క ప్రకారం తీసుకున్న బజానా కూడా వెనక్కి ఇవ్వక్కర లేదు. దానికొప్పుకుంటాడా? ఎవరు మాత్రం వదులుకుంటారు. పోనీ ఇంకొకడికి అమ్ముకుందామంటే ఆ సోమరాజుకి స్థానబలమక్కడ. కేన్సిల్ అయిన అగ్రిమెంట్ ప్రకారం ఒకవేళ మనం వేరే వాళ్లకి పొలాన్ని అమ్ముకున్నా.. ఆ కొనుక్కున్నోళ్లని చేలో అడుగుపెట్టనివ్వకపోతే ఏంటి పరిస్థితి? ఇక్కణ్ణించి మీరెల్లి అక్కడున్న వాడ్ని ఏం చెయ్యగలరు? ఆపైన కోర్టులు, పంచాయితీలు. రాజకీయ నాయకులు ఎంటరై సెటిల్మెంట్ చేస్తాం ఎంత శాతం నాకిస్తావంటే ఎంత శాతం నాకిస్తావ్ అంటూ పిల్లీ, పిల్లీ పోరాటాన్ని కోతి తీర్చినట్టు మధ్యలో వాళ్లే కదా బాగుపడేది. ఇదే కదా జరిగేది...’
‘శుభం పలకరా అంటే...’ అని శేషాద్రి ఇంకా ఏదో అనబోతుంటే.. అంతలోనే అందుకున్న రాజేశ్వరి
‘కీడెంచి మేలెంచరా’ అని కూడా ఆ నోటితో వాళ్లే చెప్పేరు. మరొకరో మరొకరో అయితే వాళ్ల గురించి మనకీ తెలియదు. ఇంత ఓపిక పట్టిన వాళ్లం. ఇంకో నెల ఆగమనండి బేంకు వాళ్లని. మొత్తం కట్టేద్దాం. ఇన్నన్ని లోన్లు తీసుకుని ఇంతింత వడ్డీలు కడుతున్నాం. అసలు మనం బతకటమే బేంకోల్లని మేపటానికా అన్నట్టు. అడిగి చూడండి.. ఎందుకొప్పుకోరు? అంతగా అవసరమైతే నేనొస్తాను...’
‘వచ్చేవ్‌లే పెద్ద. ఇదొక్కటే మిగిలింది..’ ఈసడింపుగా అన్నాడు ముఖం మరో పక్కకి తిప్పుకుంటూ.
‘ఏం? అంత ఈసడింపెందుకు? లోను తీసుకునేటప్పుడు సంతకాలకి బేంకుకు రాగా లేంది.. అడగటానికొస్తే తప్పా..? పౌరుషం అన్ని చోట్లా ఉండాలి. అయినా నేనింత ఇదిగా చెప్పాలా? మీకు మాత్రం తెలియదా? ఇన్ని అనుభవాలయ్యాకా కూడా నేనిలాగే నమ్ముతానంటే ఇంతకంటే నేను చెప్పగలిగింది మాత్రం ఏముంటుంది?
‘నా అనుమానం ఏంటంటే బ్రోకరు పని చేసీ చేసీ ఎంగిలి మెతుకులు తిన్న కాకిలాగా బాగా బలిసినట్టున్నాడు సోమరాజు. దాంతో మరో మెట్టెక్కేద్దామని దీన్ని తానే తీసేసుకుంటానని చెప్పి బజానా ఇచ్చి కోటి పైమాట పలికే పొలాన్ని కొనటానికి సిద్ధమై పోతున్నాడు. అతనికి ఎంత పొలం ఉన్నా అందులో ఏం పండుద్దో మనకి తెలియదా? ఇంతలోనే కోటి రూపాయలు ఎక్కడ్నించి తెస్తాడు? కాస్తంత ఆలోచించండి. మీరెంత పక్కాగా కాగితాలు రాసుకుంటే మాత్రం...’
‘ఏంది నీ గోల? వింటున్నానని తెగ రెచ్చిపోతున్నావ్...?’
‘నేనేం రెచ్చిపోవటం లేదు. ఏం చూసుకుని రెచ్చిపోవాలి? జరగబోయేది చెప్తున్నా అంతే..! మీరెన్నన్నా అనండి. నా అనుమానం నాది. అతను కచ్చితంగా మారు బేరానికి అమ్మటానికే బజానా ఇస్తున్నాడు. అమ్మకానికి పెట్టి ఇన్ని నెల్లయినా మనకి రానోళ్లు ఈ సోమరాజుకి మాత్రం ఎక్కణ్ణించొస్తారు?’
‘ఆయనకి తెలిసినోళ్లంతా నీకు దెల్సా? పెద్ద గొప్పగా మాట్లాడేను అనుకోకు...’
‘ఆ వెటకారాలే వద్దు. ఆయనకి తెలిసిన వాళ్లు నాకు తెలియటమేమిటి? మీ మాటల్లో అర్థం ఉందా? తీరా బజానా తీసుకున్నాకా గడువు లోపల రిజిస్ట్రేషన్ చెయ్యకపోతే ఏం చెయ్యాలో ఒకళ్లకి ఇద్దరితో ఆలోచిస్తారని నేను చెబుతా ఉంటే హేళనలా? సర్లెండి నాకెందుకొచ్చిన గొడవ? మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి.. మీరెప్పుడు విన్నారు గనక నా మాట.
అవ్వాళ్టికి ఇవ్వాళ ఉంటే తిందాం.. లేదంటే కడుపులో కాళ్లెట్టుకు పడుకుందాం.. అంతేకానీ డబ్బులు చేతిలో లేవని ఆ బిల్డర్ రామచంద్రం ఇంటి జోలికెల్లద్దని నెత్తీనోరూ బాదుకున్నాను. విన్నారా? ఆరేళ్లపాటు ఎన్ని బాధలు పడ్డాం. ఆయనగారి కూతురు ఇంటర్‌లో చేరినప్పుడు మొదలైన కపట నాటకానికి ఆమె ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరాకా కానీ తెర పడలేదు. ఒకటా రెండా? ఏకంగా ఆరేళ్లు. ఏదో అప్పటికైనా ఆ పిల్ల సకాలంలో చదువు పూర్తి చెయ్యబట్టిగానీ లేదంటే ఇండ్రెన్ బుడ్డే దారని ఎన్నిసార్లనుకోలేదు? అవన్నీ.. పాతబడిపోయాయ్ అనుకోకండి...’
ఆ రోజైనా.. ఈ రోజైనా ఆడ్వాళ్ల మాట వినటమేమిటి అనే కదా మీ అహం..? ఆడవాళ్లంటే అంత లోకువ పనికిరాదు...’
‘మెళ్లిరగదీస్తా ఇంకొక మాట ఎక్కువ మాట్లాడావంటే.. ఆ గాడిద నా కొడుకు సంగతి ఇప్పుడెందుకు? తోలు మెత్తగుందని సవరదీస్తే మెళ్ల మీదకెక్కి ముడ్డితో దేకిందంట... వింటున్నాను కదా అని ఊరికే మాట్లాడేవంటే నాలిక చీరి కాకులకీ గద్దలకీ వేస్తాను. ఏమనుకున్నావో...’ రెచ్చిపోయేడు శేషాద్రి.
‘వేసావ్ లే వెళ్లు. వెళ్లి పని చూసుకో...’ వింటున్న కొద్దీ బీపీ పెరిగిపోసాగిందేమో ఇంద్రమ్మలో... గొడవ ఇంకెంత దూరం పోతుందోననే భయంతో.. కొడుకుని గుమ్మం దగ్గరకంటా తోసి వెనక్కొచ్చి మెల్లగా అక్కడున్న పట్టె మంచం మీద కూలబడుతూ పందెం కోడిలా ముక్కెగరేస్తున్న కోడల్ని చూస్తూ,
‘ఊరుకోవే రాజస్రీ..! నువ్వైనా ఒక్కడుగు వెనక్కి తగ్గు. ఆడి సంగతి తెలవందేముంది?’ కోడల్ని కసిరింది.
రాజేశ్వరి పట్టించుకునే స్థితి ఎప్పుడో దాటిపోయింది. ఆడదాని బతుకెప్పుడూ అరిటాకే..! ఏదొచ్చి మీదపడ్డా, ఇదెల్లి వేటి మీద పడ్డా చిరిగేది అరిటాకే. అందరూ ఆమెని అనేవాళ్లే. అనుభవాలు ఆమెకి గొంతిచ్చాయేమో.. అంతే స్థాయిలో...
‘ఎందుకెత్తద్దు? ఆ రామచంద్రం మాయమాటలు నమ్మి ఆయన చెప్పినదానికల్లా గంగిరెద్దులాగా బుర్రూపి రమ్మన్న చోటికల్లా పరిగెత్తేరు? ఏమైంది? ఉన్న నాలుగు సవర్లూ లోను కట్టడానికే కరిగి ముద్దయితే ఎన్నాళ్లని కాలే కడుపుల్తో ముణగదీసుకుని పడుకున్నాం? ఎన్నిసార్లు తలుపు వెనకాల దాక్కోలేదు? ఏవీ గుర్తున్నట్టు లేదు.
తెలివైన వాడు ఎప్పుడూ నడిచి వచ్చిన దారినీ, తొక్కిన ముళ్లనీ, కోసిన పూలనీ మరిసిపోడు. మళ్లీ మళ్లీ అవే ముళ్లు తొక్కుతానంటే కడుపు నాయగట్టుకోవటానికి అప్పటి వయసు వేరు ఇప్పటి వయసు వేరు. పెద్దాళ్లం అవలా? వేషాలు కాకపోతే..! మాటకు ముందు మెళ్లిరిగదీస్తాను అనటం ఏమిటసలు... పేద్ద అదేదో మీకే వచ్చినట్టు...’
‘అంటే అన్నాళ్లే.. ఊరుకో..! అన్నంత మాత్రాన విరగదీసేస్తాడా ఏంటి. ఊరుకో. కాసేపు’
‘నిన్నసల.. ఏం చేసినా పాపం లేదు. అయిందానికీ, కాని దానికీ పేద్ద అన్నీ నాకే తెలుసన్నట్టు చెప్పొచ్చింది. పేనుకి పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందంట... ఏదో కాస్తంత మాటా మంచీ చెప్పేసరికి తగులుకుందండీ.. నా సామిరంగా.. నాలుక తిప్పుడే తిప్పుడు... తిప్పుడే తిప్పుడు.. నా చెప్పుతో ననే్న కొట్టినట్టు...’
‘చెయ్యండి. ఏది చేసినా మీకే చెల్లు. ఆడదాన్ననేగా ఇంత జులుం నా మీద. మరీ అంత అలుసు పనికిరాదు ఆడాళ్లంటే.. గుంజకి తాడుగట్టి చల్లకవ్వం తిప్పీ తిప్పీ మజ్జిగ నుంచి వెన్న వేరుచేసి మిమ్మల్ని ఇంతటోడ్ని చేసింది ఈ ఇంద్రమ్మ కదా? కాలు విరిగిపోయి ఎద్దు మూలన పడితే కాడి భుజానకెత్తుకుని వ్యవసాయం చేసి మరీ పంట పండించిన ఆడరైతు బిడ్డయ్యుండీ ఆడవాళ్లని ఆడిపోసుకోవటానికి మీకు నోరెలా వచ్చిందో. అవ్వాళ మీ నాన్న, మీ అమ్మగారి మాట వినకుంటే ఇవ్వాళ ఈ ఎకరాలకెకరాలు ఎక్కడ్నించొచ్చేయో... నడిచి వచ్చిన దారిని అడిగితే తెల్సుతుంది. ఆస్తులు సంపాదించటం కాదు. వాటిని నిలబెట్టుకోవటం రావాలి’
భార్య మాటలకి బుసలు కొడుతున్న పామే అయ్యాడు శేషాద్రి. హద్దులు మీరిన అసహనంతో తలుపుని పగిలేట్టు భళ్లున తన్ని కోపంగా బయటకి వెళ్లిపోయాడు.
‘మజ్జిగన్నం తినకపోతే ఆడికిట్తే కళ్లెర్రబడిపోతాయి వేడిచేసి.. చిన్నప్పట్నించీ అంతే వాడికి. ఏటెల్లకాలం ఈదటమే అయిపోయింది బతుకు...’ అంటూ కింద వొలికిన అన్నాన్ని బట్టతో పళ్లెంలోకి ఎత్తుతున్న కోడలి వైపు చూస్తూ, ‘ఒక్కడుగు తగ్గితే నీ సొమ్మేం పోద్దేరాజస్రీ. వాడి కోసం సంగతి తెలుసు కదా?’
‘మీకు తెలియదు అత్తయ్యా! ఈ మనిషి చేసిన పన్లకి కుటుంబం పరువెక్కడ పోతుందోనని ఎంతమంది కాళ్లు పట్టుకున్నానో మీకేం తెల్సు... బాధ పడతారని నేనెప్పుడూ చెప్పలేదు మీకు...’
‘అంతేలే..! నాకేం తెల్సు. నువ్వే పడ్డావ్. నాతో చాలాసార్లు అన్నాడా మాట. కాదన్ను. కానీ మగాడు కదా.. ఆవేశంలో అలా అంటాడుగానీ వాడికి నువ్వంటే ప్రాణం... కాలం కలసి రాక కానీ.. నిజానికి ఆ రోజుల్లో ఆ ఊళ్లో అంత చిన్న వయసులో బీఫార్మసీ పాసయ్యేడంటే చుట్టుపక్కల ఊళ్ల నుంచి గూడు బళ్లు కట్టుకుని మరీ వచ్చి వాలారు పిల్లనిస్తామని.
వాడూ ఆలోచిస్తాడు...’
‘ఏమో అత్తయ్యా.. ఏమి ఆలోచిస్తారో గానీ.. ఆలోచిస్తే ఇలా ఎందుకుంటాం.. చెప్పండి! మీకెప్పుడూ చెప్పలేదుగానీ..’
రాజేశ్వరి ఆలోచన్లు ఆరేడేళ్లు వెనక్కి పోయాయి.
* * *
చదువు పూర్తయ్యాకా కొన్నాళ్లు ఏదో కంపెనీలో పనే్జసినా మెల్లమెల్లగా మెలకువలన్నీ తెలుసుకుని కొడితే ఏనుగు కుంభస్థలమే కొట్టాలని తనే సొంతంగా లోన్ తీసుకుని చిన్న ఫార్మస్యుటికల్ కంపెనీ మొదలెట్టాడు శేషాద్రి.
మొదట్లో బాగానే సంపాదించాడు. అంతా ఆకాశానికెత్తేసారు. లోన్లన్నీ తీరి అప్పుడప్పుడే నిలదొక్కుకుంటున్నాడు.
అనుకోకుండా దేశమంతా ఆవరించిన ఆర్థికమాంద్యం అతని మీదా ప్రభావం చూపించింది. దానికి తోడు గోరుచుట్టు మీద రోకటి పోటన్నట్టు... శేషాద్రి కంపెనీ ఉత్పత్తి చేసే రెండు రకాల మందుల్నీ ప్రభుత్వం నిషేధించటంతో మొదలయ్యాయి కష్టాలు. కంపెనీకి ఆయువుపట్టే శేషాద్రి ఉత్పత్తి చేసే ఆ రెండు
మందులూ. గుక్కతిప్పుకోలేని శేషాద్రి మెల్లమెల్లగా ఉద్యోగుల్ని తగ్గించసాగాడు. దానికి తోడు ఆర్డర్లకి అనుగుణంగా సప్లై చేసిన సరుకు తాలూకు రావాల్సిన సొమ్ము కూడా రాకపోవటంతో ఇక తన వల్ల కాదని కంపెనీని అమ్మేసి అప్పులన్నీ తీర్చేయగలిగాడు కానీ కుటుంబం మాత్రం ఆర్థిక ఇబ్బందులకు లోనైంది. పిల్లల చదువులు మధ్యలో ఉండిపోయాయి.
పరిస్థితులు ఎంతగా చేజారిపోయాయంటే.. ఒక ఫార్మస్యుటికల్ కంపెనీ అధినేతగా అంతెత్తుకు ఎదిగిన శేషాద్రి పరిస్థితుల ప్రభావంతో పూలమ్మిన చోటే కట్టెలమ్మినట్టు తన బి.్ఫం సర్ట్ఫికెట్‌ని మెడికల్ షాపు పెట్టుకోవడానికి నెలకి ఎనిమిది వేల రూపాయలకి అద్దెకివ్వటం వరకూ. కార్లూ, డ్రైవర్లూ.. పనివాళ్లతో కూడిన గతం కళ్ల ముందు కదలాడుతుంటే ప్రస్తుత పరిస్థితుల్ని తట్టుకోలేక, ఇమడలేక మరెవరికీ ముఖం చూపించలేక ఇంటిపట్టునే ఉండసాగాడు.
రాజేశ్వరి పరిస్థితులకి తలవంచే మనిషి. ఉన్నదాంట్లోనే సర్దుకోవటం ఆమెకి పుట్టుకతో వచ్చింది.
అంత పెద్దగా చదువుకోకపోయినా లోకజ్ఞానం తెలుసు. పరిస్థితులెప్పుడూ ఆమెకి ఆకళింపే.
వాస్తవం అర్థమవటానికే. ఒక్కసారి అర్థమయ్యాకా మళ్లీ నడక మొదలు పెట్టచ్చు. శేషాద్రి ఇంకా గతంలోనే బతకసాగాడు. పడినోడు మళ్లీ లేచి పుంజుకోవాలంటే నేలని అందుకు తగ్గట్టు మార్చుకోవాలి. అప్పుడే లేవటం సాధ్యం. కానీ శేషాద్రి ఎంతసేపూ మళ్లీ ఎగబాకాలనే తప్ప ఎందుకు పడ్డామో ఆలోచించే యోచన కోల్పోయాడు.
అదే దెబ్బేసింది రామచంద్రం రూపంలో వచ్చి. అదో బలహీన క్షణం.
ఒక్కసారి జీవితంలో దెబ్బతిన్న మనిషి ప్రతీదీ శంకిస్తాడు. ఏదీ ఆత్మవిశ్వాసంతో చేయలేడు.
జేబులో రెండు రూపాయలు ఉన్నవాడి ఆత్మవిశ్వాసం ఒకలా ఉంటే రెండొందలున్న వాడి ఆత్మవిశ్వాసం ఒకలా ఉంటుంది. ఒక్క రూపాయి ఖర్చు చెయ్యాలంటే రెండు రూపాయలున్నవాడు సవాలక్ష ఆలోచిస్తాడు. తడబడుతూనే రూపాయి బయటికి తీస్తాడు. ఫలితం కూడా ప్రతికూలంగా ఉంటుంది. పోతే పోయిందిలే, ఒక్క రూపాయే కదా అని రెండొందలున్నవాడు ధైర్యంగా ఒక రూపాయి పెట్టుబడి పెడతాడు. ఫలితం కూడా అలాగే ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో వేసే అడుగది.
రామచంద్రం రెండో కోవకి చెందినవాడు. అతను బిల్డర్. ఆర్థిక మాంద్యం అతన్నీ చుట్టుముట్టింది. కూతుర్ని కాలేజీలో చేర్చాలి. చేతిలో డబ్బుల్లేవ్. ఏం చెయ్యాలో తోచని పరిస్థితుల్లో శేషాద్రి గుర్తుకొచ్చాడు అతనికి.
జీవితం నడ్డి విరిచేసాకా.. ఎలాగైనా నిలబడలేనా అనే ఆశ అందర్నీ నమ్మేట్టు చేస్తుంది. ఆ నమ్మకమే రామచంద్రం బుట్టలో పడిపోయేట్టు చేసింది శేషాద్రిని.
‘శేషూ..! ఇద్దరం ఇబ్బందుల్లో ఉన్నాం. ఇద్దరికీ డబ్బు కావాలి. ఇందులో నీకొచ్చే నష్టం ఏమీ లేదయ్యా..! నా మాటిను. అన్నీ కలుపుకుంటే పదొందల నలభై అడుగుల ప్లాటు. నా ప్లాటు నీ పేరు మీదుంటుంది. అంతకంటే కావాల్సిందేముంది?
ఏదో దేశమంతా ఆర్థిక మాంద్యం రాబట్టిగానీ లేదంటే.. అసలు మిగుల్నేంటి ప్లాటులు. ఎగల్నెత్తెయ్యరూ! ఈ పరిస్థితి కాస్తంత దాటిందంటే మళ్లీ మామూలే. అందాకా ఇద్దరం ఇబ్బందుల్లో ఉన్నాం. దాన్నించి గట్టెక్కాలంటే ఇలా చేస్తే బాగుంటుందని అనిపించింది. ఆ మాటకొస్తే నాకు తెలిసినోళ్లకి కొదవే లేదు ఈ ఊళ్లో. కానీ అందర్నీ నమ్మలేం కదా. తీరా వాడెవడి పేరుతోనో రాసానంటే రాసాకా వాడేం చేస్తాడో...? అందుకే ఎవర్నీ నమ్మలేక నిజాయితీపరుడివి నినె్నంచుకున్నాను. ఆ లోనేదో శాంక్షన్ అయ్యిందనుకో. నీకో సగం, నాకో సగం. ఇద్దరం ఇబ్బందుల్నించి బయటపడచ్చు. పిల్లకి ఇంటర్లో మంచి కాలేజీలో సీటొచ్చింది. హాస్టల్ ఫీజు కూడా ముందే కట్టమనేసరికి పెద్ద ఇబ్బందొచ్చి పడింది. నువ్వు ఊ అంటే ఇద్దరం బయటపడిపోతాం. బాంకు మేనేజర్ కూడా బాగా తెలిసినోడే.. ఇక వాయిదాలంటావా? నీకేమీ ఇబ్బంది రాకుండా నెలనెలా నేనే కట్టుకుంటాను. ఏమంటావ్?’
శేషాద్రి ఏమీ మాట్లాడకపోయేసరికి మళ్లీ రామచంద్రమే అన్నాడు.
‘నువ్వంతగా కాదంటే చెప్పు. పోస్ట్ డేటెడ్ చెక్కులు ఎన్ని కావాలంటే అన్నీ ఇప్పుడే నీ కళ్ల ముందే సంతకాలు పెట్టి మరీ ఇచ్చేస్తాను...’
మరీ అంత నమ్మకంగా చెప్పేసరికి కాదనలేక పోయాడు శేషాద్రి. పైగా అనుకోకుండా వచ్చిన అదృష్టంలా మనసులో తెగ సంబరపడిపోయాడు. ఇల్లు తన పేర్న ఉంటుందనే ధైర్యంతో సరే అనేసి ఆ సాయంత్రం ఆ మాటకాస్తా పెళ్లాం చెవిన వేశాడు.
బలహీనంగా ఉన్నప్పుడే భార్య మాటకి విలువ. బాగ ఉన్నప్పుడెప్పుడూ ఏ మాటా ఇవాళ ఇలా జరిగిందని చెప్పని భర్త ఈ మధ్య ప్రతీదీ తనతో చర్చిస్తూంటే తన మీదెంతో బాధ్యతుందనుకుంది రాజేశ్వరి. అందుకే బాగా ఆలోచించి..
‘తాననుకున్నది సాధించే వరకూ నిద్రపోనివాడు విజేత. కాబట్టే చెక్కులిస్తానని, ఇల్లు రాస్తానని చెప్పి ఒప్పించగలిగాడు ఆయన మిమ్మల్ని. బిల్డర్‌కి మనకి ఆట్టే అనుభవం కూడా లేదు. ఈ మాత్రం పరిచయానికి ఏకంగా ఇల్లే రాసేస్తానన్నాడంటే ఏదో మతలబు ఉండదంటారా? నన్నడిగితే ఈ పుట్టలో వేలు పెట్టడం అంత మంచిది కాదేమో అనిపిస్తుందండి. ఎందుకంటే ఇల్లు మీ పేర వ్రాసి, లోనొచ్చి పిల్లని కాలేజీలో చేర్చేదాకా ఎవరికైనా ఇంట్రెస్ట్‌గానే ఉంటుంది. తీరా ఆయన లోన్లు కట్టలేదనుకోండి. ఎక్కడ్నించి తెస్తారు? మనం అసలే సిగ్గు విడిచి ఫార్మసీ పట్టా తాకట్టెట్టి ఏదో అంతంత మాత్రంగా బండి లాగుతున్నాం. రేపు లోను కట్టాల్సిన పరిస్థితే వస్తే ఎవరి కాళ్లు పట్టుకుంటారు నెలనెలా?’
చెట్టున చచ్చి వేలాడుతున్న ఉడత మాంసం నోరూరిస్తుంటే దానందుకోవటానికి గుంట చూసుకోకుండా పైపైకి ఎగిరి గుంటలో పడ్డ నక్కలా పెళ్లాం మాటలు రుచించని శేషాద్రి రామచంద్రం వలలో చిక్కనే చిక్కాడు.
అంతే, తర్వాత అంతా చకచకా జరిగిపోయింది. అప్పట్లో ఆ ఫ్లాట్‌కి మార్కెట్లో ఉన్న రేటు ప్రకారం అయిదు లక్షల అరవై వేలు లోను శాంక్షన్ చేసింది బేంకు. ఆ బాధలేవో రామచంద్రమే పడ్డాడు. ఇల్లు శేషాద్రి పేరుతో రిజిస్టర్ అయ్యింది.
నిజానికి దాని మీద శేషాద్రికి హక్కున్నా లేకున్నా కొంత సంతోషపడి పెళ్లాన్ని సరదాగా ఫ్లాటు చూసొద్దాం రమ్మన్నాడు.
రానంది రాజేశ్వరి. శేషాద్రే ఒకట్రెండు సార్లెళ్లి చూసొచ్చాడు. అయితే ఆ సంతోషం ఎంతోకాలం నిలవలేదో అతన్లో. ముందనుకున్న ప్రకారం లోన్లో సగం శేషాద్రికి ఇవ్వలేదు రామచంద్రం. సరిగదా ముఖం చాటేసాడు. తెల్లబోయాడు శేషాద్రి. అడిగి, అడిగీ వదిలేసింది రాజేశ్వరి.
లోన్లు కడుతున్నాడు, ఇల్లు మన పేర్న ఉంది అని అల్ప సంతోషానికి పోయాడు తప్ప, రానున్న ప్రమాదాన్ని ఊహించలేక పోయాడు శేషాద్రి. అయిదు నెలలు లోను కట్టి ఆ పైన చేతులెత్తేశాడు రామచంద్రం. పైగా ఫ్లాటు చూడ్డానికి వెళితే అడ్డుకోవటానికో మనిషి, ఎప్పటికప్పుడు శేషాద్రి ఇల్లు అమ్మకుండా నిఘాకో మనిషి. తల తిరిగిపోయింది శేషాద్రికి.
నెలలు గడుస్తున్న కొద్దీ లోన్లు కట్టమని ముందుగా ఫోన్లతో మొదలైన బేంకోళ్ల అభ్యర్థన ఉత్తరాలూ, నోటీసుల దాకా వెళ్లి చివరికి ఏకంగా ఇంటికే వచ్చి బెదిరించటం దాటి ఆఖరుగా డిఫాల్ట్ కేసుగా పేపర్లో వేయిస్తామనీ, ఇల్లు వేలం వేయిస్తామని బెదిరించేదాకా వచ్చింది. ఈ బాధ భరించలేక శేషాద్రి ఇంటి పట్టున ఉండటం తగ్గించి ఎక్కడెక్కడో తిరగటం, రాత్రికి రావటం మొదలెట్టాడు.
ఇంట్లో ఉన్న రాజేశ్వరికి మంచినీళ్లు, టిఫినే్ల కాదు, సమాధానం చెప్పటం, ఏడ్వటం, తుడవటం, బ్రతిమలాడటమే జీవితం అయిపోయింది. అక్కడికీ ఆ బాంకు ఆఫీసర్లతో.. ఉన్నదున్నట్టు వివరించి చెప్పి...
‘మీ కాళ్లు పట్టుకోమన్నా పట్టుకుంటానండి.. దయచేసి పేపర్లో వేయించద్దు. మేము చెయ్యని తప్పుకి తాతముత్తాతన్లాటి నుండీ మా ఊర్లో మా కుటుంబాలికున్న పరువు గంగలో కలుస్తుంది. దాంతో ఇదంతా మీవల్లేనంటూ మా కుటుంబం మమ్మల్ని వెలివేస్తుంది. ఆ ఇల్లు మాది కాదు. కావాలంటే ఇల్లు వేలం వేసుకుని మీ డబ్బు మీరు తీసుకోండి’ అని కాళ్లావేళ్లా పడింది.
బేంకు వాళ్లు వినలేదు. ‘మీరే అమ్మి మాకు కట్టండి. అంతగా కట్టలేకపోతే అప్పుడు మేమెలాగూ చెయ్యక తప్పదు’ అన్న వాళ్ల మాటల్తో అమ్మకానికి పెట్టినా అన్నీ తెలిసీ వచ్చే వాళ్లెవరు కొనటానికి. పైగా అనుక్షణం నిఘా నీడ వెన్నంటే ఉంటుందాయే. ఫ్లాట్ అమ్మినా, అద్దెకిచ్చినా ప్రాణాల్తో ఉండవనే అజ్ఞాత వ్యక్తుల బెదిరింపులొకటి.
రామచంద్రం ఎప్పుడో ఫోనెత్తటం మానేసాడు.
ఏం చెయ్యాలో తోచక పిచ్చెక్కిపోయేది శేషాద్రికి. చావే శరణ్యమా అనుకోక పోనూ లేదు. పెళ్లానికి కూడా ముఖం చూపించలేని పరిస్థితి. అన్ని దార్లూ మూసుకుపోయాయి.
ఏం చెయ్యాలో తోచక ఎక్కడెక్కడో తిరుగుతూ ప్రశాంతత కోసమని పార్కుకొచ్చిన శేషాద్రిని గుర్తుపట్టి పలకరించాడు. డిగ్రీలో క్లాస్‌మేట్ రామరాజు. ప్రాణం లేచొచ్చినట్లయ్యింది శేషాద్రికి.
వరసగా రెండ్రోజులు కలిసాకా మూడోనాడన్నాడు అంతా విన్న రామరాజు.. శేషాద్రితో..
‘నాకు తెలిసిన ఫ్రెండొకడున్నాడు. వాడికి అర్జంటుగా ముప్పై వేలు కావాలని అడిగాడు. అవసరమైతే తన ఇల్లు డాక్యుమెంటు ఇస్తానంటున్నాడు. నువ్వు ముప్పై వేలు చూసుకోగలిగితే ఆ ఇంటి దస్తావేజుల్తో బేంకులో లోన్ తీసుకుని అక్కడ ఆ బేంకులో కట్టెయ్యచ్చు. నీకు డబ్బులొచ్చాకా విడిపించి ఇచ్చెయ్యచ్చు. ఆలోచించుకో..’
‘్థర్డ్ పార్టీ కోల్లెటరల్ సెక్యూరిటీసా...’
‘అంతేగా.. మరి!! ఏదో ఫ్రెండవని.. సహాయం చేద్దామని. అంతే.. వాడూ నా ఫ్రెండే.. పరిచయం చేసి వదిలేస్తాను. మీరూ మీరూ మాట్లాడుకోండి...’
‘కంపెనీ బాగా నడుస్తున్నప్పుడు కొన్నాను పొలం. అదెలా ఉందో ఎప్పుడూ వెళ్లి చూళ్లేదు ఇంతవరకూ. కంపెనీకి సంబంధించి ఏదో మిషన్ కొందామని ఆ పొలాన్ని బేంకులో పెట్టాను. మా ఆవిడ పేరుతో ఉందది. చుట్టుపక్కల పొలాలోళ్లు పంటలేసేసరికి రోజురోజుకీ బాగా రేటు పెరుగుతుంది అంటున్నారు. అయితే దాన్ని బాగు చెయ్యటానికి, బోరు వెయ్యటానికే చాల అవుతుంది. కాకపోతే పెట్టుబడికే సొమ్ముల్లేవ్. అది అమ్ముడైతే అన్నీ తీర్చెయ్యచ్చు. కొన్ని కంపెనీల షేర్లు కూడా ఉన్నాయ్. కాకపోతే రేట్లే లేవు. అందాకా ఏదో ఒకటి.. సర్లే...’ అదీ అలా పరిచయమయ్యాడు నూగు రమేష్.
‘అలాగే..’ అన్నాడుగానీ ముప్పై వేలెక్కెడ్నించి తేవాలో అర్థం కాలేదు శేషాద్రికి.
అదేమంత కష్టం అనిపించలేదు రాజేశ్వరిని ఒప్పించటం ముందు.
అనుకున్నట్టుగా ఎక్కడైతే తన బి.్ఫం సర్ట్ఫికెట్ మందుల షాపుకని ఇచ్చాడో అతనే్న అడ్వాన్స్ అడిగాడు లోనొచ్చాకా ఇచ్చేస్తానని. ‘పాపం బాగా బతికినతను. కాలం కలసి రాకపోతే ఇంతేనని’ మనసులో అనుకుని ముప్పై వేలు అప్పుగా ఇచ్చాడు. బతుకుజీవుడా అనుకుంటూ దాన్ని తీసుకెళ్లి ఆ నూగు రమేష్‌కి ఇచ్చి అతనింటి దస్తావేజు తెచ్చి నిశ్చింతగా నిద్రపోయాడా రోజు.
మర్నాడు మొదలు ఆ డాక్యుమెంట్ పట్టుకుని ఎక్కని, దిగని బేంకు గుమ్మం లేదు.
ఇదే సమయంలో గోరుచుట్టు మీద రోకటి పోటన్నట్టు థర్డ్ పార్టీ కొల్లేటరల్ సెక్యూరిటీస్‌ని ఏక్సెప్ట్ చెయ్యమని అన్ని బేంకులూ ఒకటే రాగం పాడేసరికి నెత్తి మీద పిడుగు పడ్డట్టయ్యింది శేషాద్రికి. అటు ఆ ముప్పై వేలడిగితే నా దగ్గర లేవంటాడు నూగు. పైగా నా డాక్యుమెంట్ నాకిస్తావా పోలీస్ కేస్ పెట్టనా అనేసరికి చచ్చినట్టు పరువెక్కడ పోతుందోనని ముప్పై వేలు తిరిగి ఇవ్వకపోయినా నూగు రమేష్ ఇంటికి పట్టుకెళ్లి మరీ డాక్యుమెంట్ ఇచ్చి రావాల్సిన దుర్గతి వచ్చింది.
కాలం కలసి రాకపోతే తాడే పామై కరుస్తుందని ఇందుకే అన్నారేమో అనుకుంది రాజేశ్వరి ఆ రాత్రి నిద్రపట్టక దొర్లుతూ.. అయితే..
అప్పటిదాకా రామచంద్రం మోసం చేసినా ఇల్లు గడవటంలో ఎలాంటి ఇబ్బందీ లేకపోయింది బి.్ఫం పట్టా తెచ్చే అద్దె వల్ల. కానీ ఎప్పుడైతే అప్పిచ్చిన ఆ షాపోళ్లు నెలకి మూడు వేలు చొప్పున తగ్గించుకుని ఎనిమిదిన్నర వేలకి అయిదున్నర వేలే ఇవ్వటం మొదలెట్టారో.. ఇల్లు గడవటమే కష్టంగా మారిపోయింది. అయిదున్నర వేలల్లో అద్దే కడతాడా, వెచ్చాలే కొంటాడా?
వౌనంగా మారిపోయిన భర్తని గమనిస్తున్న రాజేశ్వరికి, ఆత్మన్యూనతా భావంతో అతనెక్కడ ఆత్మహత్య చేసుకుంటాడోననే కొత్త భయం మొదలైంది. అతన్ని కాసుకుని ఉండటం ఆమెకో పెద్ద పనైంది.
ఎవరికీ చెప్పుకోలేని నిప్పుల కొలిమిలాంటి బాధను మోస్తూ, చివరికి బిల్డర్ రామచంద్రం కూతురు ఇంజనీరింగ్ పూర్తయ్యి ఉద్యోగంలో చేరేదాకా ఎలాగోలా సహనంతో నెట్టుకొచ్చిన శేషాద్రి, రాజేశ్వరి తిన్నగా రామచంద్రాన్ని కలిసి మనసులో మాట బయటపెట్టారు. ఇప్పుడైనా మమ్మల్ని దీన్నించి విముక్తి చెయ్యకపోతే ఏదో ఒకటి మింగి బతుకుల్నించి విముక్తులవ్వటం తప్ప వేరే దారి లేదని మనసులో మాట బయటపెట్టేసరికి అందుకు సరేనన్నాడు రామచంద్రం.
అంతే..! ఆ తర్వాత శేషాద్రి కాళ్లకి బలపాలే కట్టుకున్నాడు.
బేంకు వాళ్లతో మాట్లాడి ఏలాగోలా.. వాళ్లని మేనేజ్ చేసి ఒప్పించి తన పేరుతో ఉన్న రామచంద్రం ఇంటిని అతని కూతురు కొనుక్కున్నట్టుగా ఆమె పేరుతో లోనుకి అప్లై చెయ్యటం, అది శాంక్షన్ కావటం, దాన్ని కేష్ చేసి తీసుకెళ్లి వడ్డీతో సహా బాంకులో అప్పు తీర్చెయ్యటం చకచకా జరిగిపోయింది.
* * *
‘అయితే కోల్పోయిన జీవితం సంగతి? అదెలా తిరిగొస్తుందత్తయ్యా..?’
‘అంతే లేమ్మా..! వాడూ సంపాదించేడు. ఏం లాభం? నిలబెట్టుకోలేక పోయాడు. కాలం కలిసొస్తే ఎంతసేపు ఎవరికైనా.. చీకటి వెనుక వెలుతురు ఉంటుంది అంటారు. కష్టాలు కలకాలం ఉండవులేమ్మా. అన్నం తిను.. అన్నింటికీ ఆ భగవంతుడు ఉన్నాడు..’ అన్న ఇంద్రమ్మ మాట పూర్తయ్యేలోపే మెల్లగా తలుపు తోసుకుని లోనికి వచ్చాడు శేషాద్రి.
అతని ముఖంలో ఏదో చెప్పలేని ప్రశాంతత.
‘ఏమైందిరా అప్పుడే వచ్చావ్..’ అంది కోడలు అన్నం పెట్టుకుంటూ ఉండటంతో కుండలో చల్లటి నీళ్లని అతనికి గ్లాసుతో అందిస్తూ...
‘గండం గట్టెక్కింది అమ్మా..’ అని తల్లితో అని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి అన్నం తింటున్న రాజేశ్వరి పక్క కుర్చీలో కూర్చుంటూ...
‘స్టాంపు పేపర్లు కోసమని సంజీవరెడ్డి నగర్ వెళ్లాను. అక్కడే.. రాఘవ కనపడ్డాడు. స్వగృహలో స్వీట్లు కొనడానికి వచ్చాడట. రాఘవ గుర్తున్నాడా? రాఘవ...’ అన్నాడు పెళ్లానే్న చూస్తూ.
‘ఏ రాఘవ?’ అంది అన్నంలో కూర వేసుకుంటూ తలెత్తకుండానే..
‘అతనే..! మన కంపెనీ బాగా నడిచే రోజుల్లో మన దగ్గర కొంతకాలం పనిచేసి తర్వాత మెడికల్ షాపు పెట్టుకున్నాడు.. గుర్తొచ్చిందా..?’
‘... ...’
‘ఆ రోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌లో ఏదో పనుండి వెళ్లిన నేను ఊళ్లో లేకపోతే నిన్ను రిబ్బన్ కత్తిరించమన్నాడు. ఇంకా గుర్తు రాలేదా?’
‘ఆ.. ఆ.. రాఘవా? ఆ గుర్తున్నాడు’ అంది ముద్ద నోట్లో పెట్టుకుంటూ.
‘అతనే కనపడ్డాడు. కూతురి పెళ్లి కుదిరిందట. ఎల్లుండి నిశ్చితార్థమట. తప్పక రమ్మన్నాడు. ఇంటికొచ్చి చెప్దామనుకున్నాడట. కనపడినందుకు సంబరపడి పెళ్లి వివరాలన్నీ చెప్పాడు. నీక్కూడా చెప్పమన్నాడు. రేపు వస్తానన్నాడు. అయితే స్టాంప్ పేపర్లెందుకని అడిగాడు. చెప్పాను. చాలా బాధపడ్డాడు. బాధపడీ...
‘నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నాకెంతో సహాయం చేసారు. పిల్ల పెళ్లి ఇంకా నెలుంది. ఈలోపు ఎందుకైనా మంచిదని ముందే డబ్బు సిద్ధం చేసుకున్నాను. మీరు సరేనంటే.. నేను సర్దుబాటు చేస్తాను. ముందు లోను కట్టేసి పొలాన్ని విడిపించండి. మళ్లీ ఫ్రెష్‌గా లోనుకి అప్లై చేద్దాం. ఆ వచ్చినదాన్ని నేను తీసుకుంటాను. వారం రోజుల్లో పనైపోతుంది. ఇంతలో పొలం అమ్మటం ఎందుకు? రేట్లు పెరుగుతాయంటున్నారు.. అందరూ’ అన్నాడు.
‘నీతో ఆలోచించి చెప్తానన్నాను..’
‘కష్టాలు మనుషులకి రాక మానులకొస్తాయా? వస్తా ఉంటాయ్. పోతా ఉంటాయ్. పొలం అమ్మటం లేదంటే దానికి మాత్రం ఆనందం కాదా? అది మాత్రం ఏమంటుంది? ముందిది తాగు. అసలే మజ్జిగన్నం తినకుండా వెళ్లావ్... వేడి చేస్తుంది’
తల్లి అందించిన మజ్జిగ గ్లాసందుకుంటూ రాజేశ్వరి కళ్లల్లోకి చూశాడు. ‘అవునా?’ అన్నట్టు.
తలెత్తి భర్త వైపు చూసిన ఆమె కళ్లల్లో నీళ్లు.

కనె్నగంటి అనసూయ... 9246541249