కథ

ప్రిజిడిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణప్రచురణకు
ఎంపికైన కథ
**
సుప్రజ హృదయం గాయపడింది.. అది మొదటిసారి కాదు.
భార్గవ ఫోన్ వస్తుందంటేనే ఆమె భయపడుతుంది.
‘అతడు ‘ఫోన్ మాట్లాడినంతసేపూ.. ‘ఆ.. ఊ...’ అనడం తప్పా పెద్దగా మాట్లాడదు.
మాట్లాడితే ‘ఎదురు మాట్లాడుతున్నావేంటి?’ అంటాడు.
వౌనం వహిస్తే ‘ఏంటా పరధ్యానం..’ అంటాడు. ఎలా వేగాలి తను?
ఎక్కడైనా విదేశాల్లో ఉన్న భర్త వస్తాడంటే ఏ ఆడపిల్లయినా వేయి మధురోహలతో ఎదురుచూస్తుంది.
తనలో ఆ ఫీలింగ్స్ లేవు. భార్గతో సంసారానికి సాక్ష్యం ఆరణి... దాని వయసు నాలుగేళ్లు. యుకేజీకి వచ్చింది. ఆరణి ఉత్సాహం.. రైమ్స్ చెప్పే తీరుతో ఏకంగా ‘్ఫస్ట్’క్లాస్‌లో వేద్దాం అంది స్కూల్ ప్రిన్సిపాల్ నందిత. ‘వద్దు మేమ్.. అంత స్ట్రెస్ తను భరించలేదు..’ అంది.
ఎస్.. తనలాగే ఆరణి స్ట్రెస్ భరించలేదు.
‘అంత అనుమానాలతో అక్కడ ఎందుకుంటారు... వచ్చేయండి..’ అంది. భార్గవ అంతెత్తున లేచాడు.
‘పని లేకుండా వున్నానని అనుకుంటున్నావా?.. ఇక్కడ ఇంత కష్టపడేది నా కుటుంబం కోసమే.. వొళ్లు దగ్గర పెట్టుకొని ఉండు..’ భార్గవ హూంకరింపు. ఇంట్లో వాళ్లకు ఏం చెప్పాలో తెలీదు.
భర్త ఇన్‌సెక్యూరిటీ తను అర్థం చేసుకుంది.. రోజంతా టీవీ, లేకపోతే బుక్స్‌తో కాలక్షేపం...
‘ఆరణి స్కూల్‌లో వేకెన్సీ ఉందట.. చేరేనా?’ అడిగింది భర్తని.
‘వాళ్లిచ్చే ముష్టి.. మన పిల్ల చాక్లెట్స్‌కు కూడా సరిపోవు. తిని ఇంటి పట్టునే ఉండు. ఎవరితోనూ సంభాషణలూ పొడిగించుకోకు... ముఖ్యంగా మగాళ్లతో’ భార్గవ హితబోధ.
నిజానికి ఎదురింటి రంగనాథం ‘చెల్లెమ్మా’ అని ఆప్యాయంగా పిలుస్తాడు.. ఒక రాత్రి ఆరణికి ఎంతకీ జ్వరం తగ్గకపోతే ఆయనే హెల్ప్ చేశాడు.. పాపని తీసుకొని బయటకు వచ్చిన తనని చూసి..
‘ఏంటమ్మా ఈ సమయంలో బయటకు వచ్చారు?’ అడిగాడు.
‘పాపకు బావోలేదు రంగనాథంగారూ..’ అంది తను.
‘శారదా..’ పిలిచాడు. లోపలి నుండి ఆయన భార్య బయటకు వచ్చింది.
‘సుప్రజా వాళ్ల పాపకి బావోలేదట.. నువ్వు అక్కడికి వెళ్లు.. నేను బట్టలు వేసుకొని వస్తాను’ అని లోపలికి వెళ్లాడు. పది నిమిషాల తర్వాత దగ్గర్లోని ‘రైన్‌బో’ హాస్పిటల్‌కి వెళ్లారు.
తెల్లవారిందాకా అబ్జర్వేషన్‌లో పెట్టారు పాపని.. ‘ఆయనకి చెబుతాను..’ అంది సుప్రజ.
‘జ్వరమేగా తగ్గిపోతుంది... పాపం ఆ పిల్లాడ్ని ఎందుకు కంగారు పెట్టడం..’ అంది శారద.
‘నిజమే..’ అన్నాడు రంగనాథం. ఆ మరుసటి రోజు వైద్యులు ‘పాప’కు డెంగ్యూ అని తేల్చారు.
భార్గవ్‌కి చెప్పింది. ‘అవునా వెంటనే నాకు ఎందుకు చెప్పలేదు..’ అడిగాడు.
‘మన ఎదురింటి రంగనాథంగారూ.. ఆయన భార్య శారదగారూ తోడుగా వున్నారు మామూలు జ్వరమేగా అనుకున్నా’ చెప్పింది.
‘వాళ్లు తోడుంటే.. బిడ్డ తండ్రిగా నాకు చెప్పాల్సిన పనిలేదా’ అన్నాడు. ‘ఇప్పుడేమయింది’ అంది.
‘ఊళ్లో మా తమ్ముడు రోషన్ ఉన్నాడుగా వాడ్నెందుకు పిలిపించుకోలేదు..’ అన్నాడు.
‘ఆ పిల్లాడికి ఎందుకండీ శ్రమ...’ అంది. ‘రంగనాథం గారి శ్రమ సరిపోతుందా?..’ వ్యంగ్య వాగ్బాణం విసిరాడు. ఇక మాట్లాడేందుకు ఏమీ లేక ఫోన్ ‘కట్’ చేసింది.
వరసపెట్టి ‘కాల్’ చేశాడు. ‘ఏంటి? నీకు అంత కొవ్వు..’ అన్నాడు.
‘మాట్లాడ్డానికి ఏమీ లేదు.. వచ్చి మీ కూతుర్ని మీరు చూసుకోండి..’ అంది.
భార్గవ తల్లికి ఫోన్ చేసి పంపాడు. విజయనగరం దగ్గర్లోని ఒక గ్రామంలో వుంటుందామె..
‘వాడితో ఎప్పుడూ గొడవ పడుతుంటావ్ ఎందుకమ్మాయ్..’ అంది. జరిగింది చెప్పింది.
‘దూరంగా వుండే భర్తకి భార్యపై సవాలక్ష అనుమానాలు వుంటాయ్.. అలాంటి అనుమానాలకు తావు లేకుండా కాపురం నెట్టుకు రావాల్సింది నువ్వే..’ అంది విశాల.
‘బతుకుతెరువు మీద దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు.. భార్య మీద నమ్మకం ఉంటేనే వదిలి వెళ్లాలి అత్తయ్యగారూ. ఇలా ప్రతి నిమిషం అనుమానాలతో మనసు విషం చేసుకోకూడదు..’ అంది.
‘నాతోనే మాటకు మాటా ఎదురు చెబుతున్నావ్.. వాడికి చెప్పకుండా ఉంటావా..?’ అంది.
‘ఎవరితోనైనా నేను యధార్థమే మాట్లాడుతాను అత్తయ్యా..’ అంది.
‘కాలేజీలో రోషన్ శ్రమ పడుతున్నాడు. ఆ పిల్లాడ్ని అర్ధరాత్రులు పిలవమంటాడు. ఇప్పుడు ఏమైంది? రంగనాథంగారు నాకు సోదర సమానులు. హాస్పిటల్‌కి తీసుకెళ్లడానికి చిన్న సాయం చేశారు ఆ దంపతులు. దీన్ని కూడా ఆయన తప్పు పడుతున్నారు..’ అంది.
‘సరేలే గొడవలు పెట్టుకోకండి’ అని తను మరో రెండ్రోజులు ఉండి వెళ్లిపోయింది విశాల.
విశాల భర్త జగన్నాథం పెరాల్సిస్ వచ్చి ఊళ్లో మంచం మీద ఉన్నాడు.
‘మనిషి వాస్తవ ప్రపంచంలో బ్రతకాలి అనుకుంది...’ సుప్రజ.
దుబాయ్‌కి వెళ్లాక తనని తీసుకెళతానన్నాడు కానీ ఇప్పటివరకూ ఆ ప్రయత్నాలు చేయలేదు.
వెళ్లినవాడు.. నాలుగేళ్లు అయినా సుప్రజని తీసుకెళ్లలేదు.
ఏడాది కొకసారి నెల రోజులు వస్తాడు గానీ.. ఆ నెల రోజులు గొడవ పడటానికే సరిపోతుంది అతడికి...
సుప్రజ నిర్లక్ష్యంగా మాట్లాడిన విషయాలన్నీ తవ్వి పోసి గొడవ పడుతుంటాడు.
రాత్రయితే సుప్రజలో భయం మొదలవుతుంది. ‘శవం’లా పడుకుండిపోతుంది.
‘ఏంటి నేను చేసుకుంది శవాన్నా.. మనిషినా..’ అంటాడు.
‘మీక్కావల్సింది మనిషి కాదు కదా కానివ్వండి..’ అంటుంది.
‘ప్రైవసీ కోసమే నిన్ను పట్నంలో పెట్టాను. నీ ప్రవర్తన అవమానకరంగా ఉంది’ అన్నాడు భార్గవ.
‘నా ప్రవర్తన సంగతేమో కానీ.. మీ ప్రతీ మాట.. నన్ను అనుమానించడానికో.. అవమానించడానికో కాలు దువ్వుతున్నట్టు ఉంటాయ్..’ అంది.
ఆఖరికి ఒకరోజు ‘డాక్టర్ దగ్గరకు వెళ్దాం పదా..’ అన్నాడు. ఇద్దరూ సెక్స్ సైకాలజిస్ట్ రమణ దగ్గరకు వెళ్లారు. ఆయన భార్య ఇందుమతి కూడా డాక్టరే...
ఇద్దరికీ విడివిడిగా కౌన్సిలింగ్ చేశాక.. ‘మీ మధ్య ‘గ్యాప్’ ఎందుకు వచ్చింది...’ అడిగాడు డాక్టర్ రమణ.
‘కారణం ఏంటనుకుంటున్నారు..?’
‘అది తెలియకేగా.. మీ దగ్గరకు వచ్చాం’ చెప్పాడు భార్గవ.
‘తన మనసులోని ఆశలూ.. కోరికలూ తెలుసుకొని ప్రవర్తిస్తున్నారా?’ అడిగాడు.
‘తనకు కోరికలు ఏముంటాయి సర్.. ప్రతి నెల ఎవౌంట్ తన అకౌంట్‌లో వేస్తున్నా.. అవి ఎంత ఖర్చయ్యాయని కూడా అడగను... నాకంటే స్వేచ్ఛ ఇంకెవరిస్తారు?’ అన్నాడు.
భార్గవ్‌కి ఇక్కడ కౌన్సిలింగ్ జరుగుతున్న సమయంలోనే ఇందుమతి సుప్రజకి కౌన్సిలింగ్ చేస్తోంది.
‘స్ర్తి పురుషుల బంధాన్ని మరింత పటిష్టం చేసేది దాంపత్యమేగా.. మీకు ఎందుకు ఆసక్తి లేదు..’ అడిగింది ఆమె. ‘తెలీదు మేడమ్.. ఆయన ముట్టుకుంటే కళ్లు మూసుకోవాలనిపిస్తుంది. బట్ అది పరవశంతో కాదు..’ చెప్పింది.
‘ఎందుకని అలా...’ అడిగింది ఇందుమతి.
‘తెలీదు.. ఆ పని ఎప్పుడు పూర్తవుతుందా అని క్షణాలు లెక్కబెట్టుకుంటా..’ చెప్పింది సుప్రజ.
మరో పది నిమిషాల తర్వాత ఇద్దర్నీ ఒక దగ్గర కూర్చోబెట్టి..
‘మరో రెండు మూడు సిట్టింగ్‌ల తర్వాత కంక్లూజన్‌కి వస్తాం.. నౌ యుకెన్ గో...’ చెప్పాడు డాక్టర్ రమణ.
మళ్లీ సిట్టింగ్‌కి వెళ్లలేదు భార్గవ్..
దుబాయ్ నుండి పిలుపు రావడంతో బయల్దేరా వెళ్లాడు. ఆ తర్వాత భార్గవ్‌లో మరింత మార్పు వచ్చింది. అర్ధరాత్రులు ఫోన్ చేస్తున్నాడు. రింగ్ అయితే పర్వాలేదు.. సిగ్నల్స్ లేకపోతే తన పని అయిపొయ్యిందే.. ఫోన్ కాల్‌తో సుప్రజ ఆలోచనలు తెగాయి.
అవినాష్! ముందు ఎవరో అనుకుంది.. అతడు కాలేజీలో తన క్లాస్‌మేట్.
‘వండర్.. అవినాష్.. ఎక్కడున్నావ్?’ అడిగింది. ఆమె మనసులో ఉత్సాహం ఉరకలేసింది.
అవినాష్‌తో తన స్నేహం కాలంనాటి రోజులు గుర్తొచ్చాయి. ‘నా నెంబర్ ఎలా పట్టావ్?’ అడిగింది.
‘రెండ్రోజుల క్రితం ఇండియాకి వచ్చా.. డాక్టర్ రమణ మా మామయ్య.. ఒక కేసు విషయంలో నా సలహా అడిగారు. తీరా చూస్తే అది నీ కేసే.. మీ వారు దుబాయ్ నుండి మావయ్యకి కాల్ చేస్తుంటారట.. నిన్ను మార్చమని.. నీ కేసు వీళ్లకి ఒక కాంప్లికేషన్‌గా మారింది..’ చెప్పాడు.
‘మీ మావయ్య చెప్పిన సుప్రజా.. నేను ఒక్కరే అని ఎలా అనుకున్నావ్?’ అడిగింది.
‘నీ పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చింది అత్తయ్య.. తన పేషెంట్లది ఎవరికీ ఇవ్వదు. కానీ.. నీ కేసు విషయంలో నా అబ్జర్వేషన్ ఏమైనా హెల్ప్ అవుతుందని ఇచ్చింది... వాట్సప్‌లో నీ ప్రొఫైల్ ఫొటో చూశా.. దిసీజ్ మై సుప్రజ అని అర్థమైంది..’ అన్నాడు అవినాష్.
‘ఓ నైస్.. ఏం చేస్తున్నావ్ ఇప్పుడు నువ్వు..’ అడిగింది.
‘యుఎస్‌లో క్లినికల్ సైకాలజిస్ట్‌ని. ముదిరిపోతున్నావ్.. వెళ్లి అమ్మాయిని చూసుకోరా.. అని అమ్మా నాన్నా ఇండియాకి నెట్టారు. ఇప్పుడు నా పెళ్లి బాధ్యతలు కూడా మా అత్తయ్య, మావయ్య తీసుకున్నారు..’ చెప్పాడు.
అవినాష్ గలగల మాట్లాడటంలో దిట్ట.. సుప్రజ జ్ఞాపకాలు వెనక్కి మళ్లాయి.
తను ఇంటర్‌లో క్లాస్‌మేట్.. ప్రేమంటే స్పెల్లింగ్ తెలియదు తనకి కానీ.. ఫేర్వేల్ ఫంక్షన్ రోజు అవినాష్ ఏకంగా ప్రపోజ్ చేశాడు. చాలామంది అబ్బాయిలు అడిగినట్టే తను కూడా ఆటోగ్రాఫ్‌తోపాటూ అడ్రస్ అడిగాడు. తను ఇవ్వలేదు.. తనకు గుర్తు వున్న కొటేషన్ రాసి సంతకం పెట్టి ఇచ్చింది.
‘రేపు ఒకసారి లైబ్రరీకి రండి..’ చెప్పాడు.
‘ఎందుకు?’ అని తను అడిగింది. ‘వచ్చాక చెబుతా’ అన్నాడు.
వెళ్దామా వద్దా అని ఆలోచిస్తూ.. ఎట్టకేలకు వెళ్లాలనే నిర్ణయించుకొని వెళ్లింది. ఒక బుక్ తన చేతికి ఇచ్చాడు.. అది లావుగా బరువుగా ఉంది.. భగవద్గీత.
‘దీని మీద ఒట్టు.. నేను నిన్ను ఇష్టపడుతున్నాను.. నిన్ను నమ్మించడానికి నాకు మరో మార్గం లేదు’ చెప్పాడు.
సుప్రజ ఏం మాట్లాడలేదు.
‘మనది ప్రేమించుకొనే వయసో కాదో నాకు తెలీదు.. నీ మీద నాకే ఫీలింగ్ లేదు. మన క్లాస్‌లో నువ్వే చాలా తెలివైనవాడివి.. నాకు ఎమ్సెట్‌లో సీటు వస్తుందో లేదో తెలీదు. ఈ పిచ్చి ప్రేమలూ, భ్రమలూ.. జీవిత కాలం ఉంటాయో లేదో కూడా తెలీదు.. ఎవరూ చెప్పలేరు.. బాగా చదువుకొని
స్థిరపడి.. డాక్టర్‌కండి. ఎప్పుడన్నా నువ్వు పనిచేసే హాస్పిటల్‌కి నే వస్తే ఫ్రీ ట్రీట్‌మెంట్ ఇవ్వండి..’ చెప్పి వెనుదిరిగింది. భగవద్గీత తిరిగి ఇవ్వలేదు.
‘ఒన్ మినిట్ సుప్రజా.. ఈ భగవద్గీతలోని ఒక శ్లోకం దగ్గర నా చిరునామా ఉంది.. నువ్వు నన్ను కలవాలని భావిస్తే.. శ్లోకం క్రిందనున్న అడ్రస్‌కి వచ్చి.. నా ఫోన్ నెంబర్ అడుగు ఇస్తారు’ చెప్పాడు. చెప్పి అదృశ్యమయ్యాడు.. దరిదాపు ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం!
పుట్టింటి నుండి తను తెచ్చిన ఒక విలువైన జ్ఞాపకం భగవద్గీత. తన పిన్ని, తండ్రి ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ఇంటర్ తర్వాత తాను చదివించలేనని తన చదువు ఆసింది తన సవతి తల్లి. తన తర్వాత పిన్నితో నాన్నకు పుట్టిన ఇద్దరు ఆడపిల్లల్నీ చదివిస్తుంటే తనేం ‘్ఫల్’ కాలేదు..
కుట్లు, అల్లికలూ నేర్చుకుంది. సమయం దొరికినప్పుడల్లా పుస్తకాలు చదివింది. శ్లోకాలన్నీ కంఠతా పెట్టింది కానీ.. అవినాష్ చెప్పిన అడ్రస్ కన్పించలేదు. తన చిన్ననాటి స్నేహితుడి జ్ఞాపకంగా ఇంట్లో పదిలం చేసుకుంది. తరచుగా భగవద్గీత చేతిలోకి తీసుకుంటే.. ‘నీకు భక్తి తప్ప, రక్తి లేదు..’ అన్నాడు భార్గవ.
‘ భక్తి వుంటే చాలు అదే ముక్తి మార్గం..’ అంది.
దుబాయ్ సంబంధం అని తండ్రి మురిసిపొయ్యాడు కానీ.. తన జీవితం ‘ఎండమావులు’ చేస్తున్నాడని ఆలోచించలేదు.
అనుమానం, ద్వేషం.. పురుషాహంకారం కలగలిపితే.. దాని పేరు భార్గవ్! తొలి రాత్రి గుర్తొచ్చింది...
ఎన్నో ఆశలతో తను అతడి జీవితంలోకి అడుగుపెట్టింది.
భార్గవ్ వేసిన తొలి ప్రశ్నతో ఆమెకి దిమ్మ తిరిగింది...
‘ఇంతకు ముందు నీకేమైనా ఎఫైర్స్ ఉన్నాయా?..’ అడిగాడు. బిత్తరపోయింది. లేదన్నట్టు తలూపింది.
‘గుడ్.. నిన్ను నమ్ముతున్నాను.. నేను కూడా హానెస్ట్‌గా చెప్పాలిగా.. నాకు నాటకాలు అంటే చాలా పిచ్చి ఉండేది. అందులో హీరోయిన్ వేషం వేసిన ఒక అమ్మాయి పేరు హంసలేఖ.. తనంటే వెర్రి వ్యామోహం వుండేది. ఎక్కడ నాటకం వేసినా వెళ్లి చూసేవాడ్ని. తను వివాహిత.. నాకు తన మీద వుండే పిచ్చి వ్యామోహం చూసి.. తను చాలా మురిసిపోయింది. తనే చొరవ చూపి నాకు స్వర్గ సుఖం చూపించింది. నా పిచ్చికి పరాకాష్ఠగా ‘మనం పెళ్లి చేసుకుందాం’ అన్నా.
నన్ను వెర్రి వెంగళప్పలా చూసి మెడలో మంగళసూత్రం చూపించింది. విడాకులు ఇచ్చేయ్ పెళ్లి చేసుకుందాం అన్నా.. నిజంగా కూడా చేసుకోవడానికి సిద్ధమయ్యా.. ఆ తర్వాత వారం రోజులకి ఆమెని ఆమె భర్త చంపేశాడు. దాంతో నా లవ్‌స్టోరీ ఆగిపోయింది. ఇక ఎవరూ నాకు దగ్గర కాలేదు.. పెళ్లి తర్వాత ఇదిగో నువ్వే..’ చెప్పాడు. మనసు వికారంగా అన్పించింది.
తన భర్త ‘వర్జిన్’ కాదని అర్థమైంది.. కానీ అతడు నిజాయితీగా చెప్పిన తీరు నచ్చింది.
‘సరే గతం వదిలేయండి..’ అంది.
‘నేను ఎప్పుడో వదిలేశాను. నా భార్యకు నా గురించి చెప్పడం నా విధి కాబట్టి చెబుతున్నా...’ చెప్పాడు.
ఆమె దేహంలో ప్రతి భాగం స్పృశించాడు. మనసు సహకరించకపోయినా దేహం అప్పగించింది.
‘ఏంటి నీలో స్పందన లేదు..’ అడిగాడు. ‘ఇంక నేనేం చేయాలి...’ అంది.
‘ఒక మాటా లేదు.. మంతీ లేదు. శవంలా ఒళ్లు అప్పగిస్తున్నావ్.. హంసలేఖలా నాకు నువ్వు సుఖాన్ని ఇస్తావని ఆశించా..’ అన్నాడు. ‘తను వేశ్య... అలాంటి టాలెంట్ నాకు లేదు..’ చెప్పింది.
అతడి ఆశా నిరాశల మధ్యే కాలం గడిచింది. ఆరణి పుట్టింది. ఆ తర్వాత ఆరళ్లు మొదలయ్యాయి.
భర్త గౌరవం తగ్గించకూడదని తన తొలి రాత్రి అనుభవం డాక్టర్‌కి చెప్పలేదు.
తన కేరెక్టర్‌లోని లోపాలు తెలుస్తాయని భార్గవ్ కూడా చెప్పలేదు.
ఉరికే జలపాతం లాంటి.. అవినాష్ గుర్తొచ్చాడు. తన ప్రపోజల్ ఆ రోజు ఒప్పుకొని ఉంటే..
డాక్టర్ భార్యని అయ్యి వుండేదా తను? తల విదిల్చింది.
ఉదయానే్న ఫోన్ చేశాడు అవినాష్! సుప్రజ కళ్లలో వెలుగొచ్చింది.
‘మనం ఒకసారి కలుద్దామా?..’ అడిగాడు.
‘ఎక్కడా? ఏమిటి?’ అని అడగలేదు.
‘డాక్టర్‌గానా? ఫ్రెండ్‌గానా..?’ అడిగింది. ‘ప్రస్తుతానికి ఫ్రెండ్‌గానే..’ చెప్పాడు.
‘నేను నిన్ను కలవాలంటే ముందు పర్మిషన్ తీసుకోవాల్సింది మా ఆయన దగ్గర’ చెప్పింది.
షాకయ్యాడు అవినాష్.
‘ఎస్ బాస్.. నా ప్రతి మూవ్‌మెంట్ ఆయనకి చెబితేనే ఆయన రాద్ధాంతం చేస్తున్నారు.. తన బాల్య స్నేహితుడ్ని తన భార్య కలిసిందని తెలిస్తే.. ఒక పెద్ద కథ అల్లుతాడు.. అది మరో చరిత్ర సినిమా అవుతుంది..’ నవ్వుతూ చెప్పింది.
అవినాష్ నోట మాట రాలేదు.
‘ఓ.. గాడ్ నువ్విలాంటి కండిషన్స్‌తో బ్రతుకుతున్నావా. వాడొక ఫూల్. వాడు నీతో ఏం సుఖపడతాడు’ అన్నాడు.
‘సారీ.. మా ఆయన్ని వాడు అనకండి’ చెప్పింది.
‘అర్థమైంది.. మావయ్య చేత మీ ఆయనకి ఫోన్ చేయించి రమ్మని చెప్పిస్తా.. హాస్పిటల్‌కి వచ్చేయండి’ చెప్పాడు.

‘డాక్టర్‌గారూ కౌన్సిలింగ్‌కి రమ్మంటున్నారు. వెళ్లు. ఎవరో అమెరికా నుండి స్పెషలిస్ట్ వచ్చారట. వెళ్లి నీ మానసిక సమస్య ఏంటో చెప్పు.. నీలో మార్పు రాకపోతే.. నాకు మరో పెళ్లి చేసుకోవడం తప్పదు..’ చెప్పాడు. భర్త మాటల్లో హెచ్చరిక కన్పించింది.
‘మీరు మరో పెళ్లి చేసుకోవాలని ఉబలాటపడే పనైతే చేసుకోండి.. దానికి నన్ను కారణంగా చూపకండి’ అంది.
‘నాతో డిబేట్ ఎందుకు.. ముందు వెళ్లు. వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకో. నెక్స్‌ట్ మంత్ వస్తున్నాను.. ఏదో ఒక ‘కంక్లూజన్’కి వస్తాను..’ చెప్పాడు.
హాస్పిటల్ ఆవరణలోకి అడుగుపెట్టింది.
అక్కడ స్ట్ఫా ఆమెని అవినాష్ ఉన్న చాంబర్‌కి పంపారు.
సుప్రజని చూసి.. ‘హాయ్ ఎలా వున్నావ్?’ అడిగాడు.
సుప్రజ ముఖంలోనూ, కళ్లలోనూ వెలుగొచ్చింది.
‘నే బావున్నాను అవినాష్. వయసు తెచ్చిన ‘మెచ్యూరిటీ’ ఆమె ముఖంలో కన్పిస్తోంది.
‘నీ అందంలో ఏ మార్పు లేదు..’ అన్నాడు ప్రశంసగా.
‘పరాయి వాడి భార్య అందాన్ని పొగడకూడదు డాక్టర్..’ అంది నవ్వుతూ.
‘ఎస్. నిజమే.. సరే కాఫీ తాగుదామా?’ అడిగాడు.
అడగడమే కాదు తెప్పించాడు.
‘మా మావయ్య ఫీజు వసూలు చేయడంలో దిట్ట. ఇప్పటికే మీ ఆయన దగ్గర యాభై వేలకు పైగా తీసుకున్నాడు. బట్ వర్క్‌లో కూడా అంతే సిన్సియర్. ఇప్పుడు చెప్పు.. అసలు నీ సమస్య ఏంటి?’ అడిగాడు.
‘నాకు తెలీదు డాక్టర్.. అది మీరే చెప్పాలి..’ అంది.
‘నా దగ్గర వున్న సమాచారంని బట్టి ‘సెక్స్’కి నువ్వు సహకరించడం లేదు..’ చెప్పాడు నేరుగా.
సిగ్గుపడుతూ చూసింది.
‘నీ మెడికల్ రిపోర్ట్స్ అన్నీ చూశా.. నీ ‘బాడీ’లో ఏ లోపం లేదు.. ఎవ్విరిథింగ్ పర్‌ఫెక్ట్.. హార్మోనల్స్ ఇన్ బాలెన్స్ కూడా లేదు.. సమస్య ఇప్పుడు నీ మనసుది..’ అన్నాడు.
‘కావచ్చు..’ అంది.
‘నీ మనసులో ఆయనకు స్థానం లేదా..?’ అడిగాడు.
‘ఆ విషయం తెలీదు కానీ.. నా మనసులో మరో మగాడికి చోటు లేదు..’ చెప్పింది.
‘బట్ అతడిపైన నీకు క్రేజ్ లేదు.. అందుకే నీ దేహం సహకరించడం లేదు’ అన్నాడు.
తలవంచుకుని చూసింది. ‘మీరు ట్రీట్‌మెంట్ ఇవ్వాల్సింది బహుశా మావారికేమో..’ అంది.
‘ఆయనకీ చేశారు.. నీ ‘అందం’ మీ ఆయన్ని నిరంతరం టెంప్ట్ చేస్తూ ఉంటుంది. బట్ నీలో రెస్పాన్స్ లేదు. అదే అతడి సమస్య..’ చెప్పాడు.
సుప్రజ ఏమీ మాట్లాడలేదు. ఆమె ముఖంలో ఏదో బాధ.. ఆమెని డైవర్ట్ చేయడానికి ‘ భగవద్గీత చదివారా..?’ అడిగాడు.
‘ఇప్పటికి వందసార్లు చదివాను. ఎక్కడా నీ అడ్రస్ కన్పించలేదే?..’ అంది.
అవినాష్ నవ్వాడు. ‘నిజానికి నా అడ్రస్ ఏ శ్లోకం కిందా లేదు.. నన్ను కలుసుకోవాలని నువ్వు అనుకొని వుంటే.. స్కూల్‌కి వచ్చి నా అడ్రస్ తీసుకొనేదానివి..’ అన్నాడు.
‘స్వీయ ఆసక్తితో వెతికాను తప్ప.. నిన్ను కలుసుకోవాలని కలుసుకుంటానని నేను అనుకోలేదు’ అంది.
‘నీ పిరికితనమే ఇప్పటి నీ ‘ప్రిజిడిటీ’కి కారణమైంది. నీ మైండ్‌లో నా రూపమే రిజిస్టర్ అయ్యింది. అందుకే అతడికి సహకరించడానికి నీ దేహం సిద్ధంగా లేదు..’ చెప్పాడు.
‘అదేం లేదు.. నా పరిధులు నాకు తెలుసు...’ అంది.
‘సామాజిక కట్టుబాట్లు వేరు.. మనసు వేరు.. అది నా దగ్గరే ఆగిపోయింది నీకు. ఇప్పుడు నీ సమస్యని పరిష్కరించడం కూడా నా బాధ్యతగా మారింది..’ చెప్పాడు.
‘ఇప్పుడు నాకు సెక్సంటే ఎవర్షెన్.. సుప్రజ భర్త దుబాయ్‌లో ఉన్నాడు. ‘ఖాళీ’గా ఉంటుంది. కోరికలు వుంటాయి కదా ట్రై చేసి చూద్దాం అని నేను వెళ్లే లైబ్రరీవాడు.. పచారి సామాన్ల కొట్టువాడు.. ఆఖరికి పాలవాడు కూడా ట్రై చేస్తుంటాడు. అందరికి ఈ రక్తమాంసాలపై యావ తప్పా.. నాకూ మనసుందని చూడరు..’ అంది.
‘నీ మనసుని ఎవరేం చేసుకుంటారు. ఎంజాయ్ చేసేది దేహానే్నగా’ అన్నాడు.
కాసేపు మాట్లాడలేదు.. సుప్రజ.
‘అతడితో కలిసి బ్రతకడం కష్టం.. కానీ నా బిడ్డ కోసం తప్పదు’ అంది.
సానుభూతిగా చూశాడు అవినాష్!
‘సరే.. మనం మరొకసారి కలుద్దాం.. బట్ ఇక్కడ కాదు.. బయట రెస్ట్‌రెంట్‌లో’ చెప్పాడు.
‘వీలవుతుందో లేదో..’ అంది.
‘మీ ఆయనతో ‘బంధం’ వద్దని నువ్వు అనుకున్నాక.. ఇక భయం ఎందుకు...’ చెప్పాడు.
‘బంధాన్ని తెంచుకొనేంత సాహసం నాకు లేదు.. అంత ఆర్థిక స్థిరత్వం నాకు లేదు..’ చెప్పింది.
‘అవన్నీ రెస్ట్‌రెంట్‌లో మాట్లాడుకుందాం..’ చెప్పాడు.
మరుసటిరోజు రెస్ట్‌రెంట్‌లో కలిశారు.
‘నువ్వింకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు...’ అడిగింది.
‘నీలాంటి అందమైన.. అణకువతో ఉండే అమ్మాయి దొరక్క...’ అన్నాడు.
‘బుల్‌షిట్.. వేరే కారణాలు ఉంటాయి చెప్పండి...’ అంది.
‘నువ్వు చూసి పెట్టు ఒక అమ్మాయిని.. ఆ అమ్మాయికి గతంలో పెళ్లయి వున్నా పర్వాలేదు. బిడ్డ తల్లి అయినా నో ప్రాబ్లం..’ అన్నాడు. చురుగ్గా చూసింది.
‘జోక్‌లు వెయ్యకు బాబూ..’ అంది.
‘అదేం కాదు నిజమే చెబుతున్నా...’ అన్నాడు.
అవినాష్ మాటల్లోని అంతరార్థం అర్థమైంది సుప్రజకి. డిస్కషన్ పెంచలేదు. ఇంటికి వచ్చాక కూడా అవినాష్ మాటలే ఆమెని చుట్టుముట్టాయ్. అవినాష్ నిజంగానే తనని కోరుకుంటున్నాడా?
అతడి హృదయంలో తనకి ఇంకా చోటు ఉందా? తనొక బిడ్డతల్లి.. అతడు ఫ్రెష్..
తల విదిల్చింది! అవినాష్ ఫోన్ చేశాడు. ‘సుప్రజా మనం ఈ రోజు ఒక దగ్గరకు వెళదాం’ అన్నాడు.
ఎక్కడికి అని అడగలేదు. గతంలో బయటకు వెళ్లాలంటే బెరుగ్గా వుండేది..
భార్గవకి చెప్పి వెళ్లకపోతే.. అతడు చేసే ‘యాగీ’ గుర్తుకొచ్చేది.. ఇప్పుడు ఏదో తెగింపు...
తన మనసు ఏదో ‘స్వేచ్ఛ’ కోరుకుంటోంది.
దాని పేరు అవినాషా? తెలీదు.. అవినాషే కారులో వచ్చి పికప్ చేసుకున్నాడు.
అది ఆర్ట్ గ్యాలరీ.. ఆమె మనసు మయూరమైంది.. ‘వావ్..’ అంది.
చిన్నప్పుడు తనకి ‘చిత్రలేఖనం’ అంటే చాలా ఇ్టం...
ఎవరి బొమ్మనైనా తను ఇట్టే ‘గీసి’ ఇచ్చేది. కాలేజీ రోజుల్లో కూడా చాలామందికి ‘బయాలజీ’ రికార్డ్ కూడా గీసి ఇచ్చేది.. ఆ ‘ఆర్ట్ గ్యాలరీ’లో ఒకవైపు వున్న బొమ్మల్ని చూసి ఆమె కనుబొమ్మలు కదలాడాయి!
దేహం రోమాంచితమైంది! ’ఎస్.. అవి నావే..’ అనుకుంది.
అవినాష్ వైపు చూసింది.. ‘ఎస్.. అవునూ..’ అన్నట్టు చూశాడు.
‘ఎలా సాధ్యం ఇది?..’ అడిగింది.
‘మెడిసిన్ పూర్తి చేసుకొని.. నిన్ను వెదుక్కుంటూ.. మీ ఇంటికి వచ్చాను. అప్పటికే భార్గవని పెళ్లి చేసుకొని నువ్వెళ్లిపొయ్యావు.. ఆమెకి పెరాల్సిస్ వచ్చి ఇంట్లో ఉంది. వరుసగా పది రోజులు మెడికల్ టీంతో వెళ్లి ఫజియోథెరపీ’ చేశాను. ‘మా సుప్రజకు అన్యాయం చేశాను..’ అని బాధపడింది మీ అమ్మ.
బహుశా తనలో పశ్చాత్తాపం కలిగింది ఏమో... గోడపైన వరుసగా పేర్చి ఫ్రేమ్ చేసిన బొమ్మలు చూపించింది. అవన్నీ ‘నువ్వు వేసినవే’ అని చెప్పింది. నీలో అద్భుతమైన చిత్రలేఖనా శక్తి వుందనిపించింది. నీ చిత్రాల్ని ఎన్‌లార్జ్ చేసి చాలా ప్రదర్శనల్లో పెట్టాను. సక్సెస్ అయ్యాకే చెబుదాం అని మీ పేరెంట్స్ దగ్గర మాట తీసుకున్నాను. వాటిల్నే ఇప్పుడు ఇక్కడ ఈ ‘గ్యాలరీ’ పెట్టా.. చూశావుగా పబ్లిక్ రెస్పాన్స్...’ చెప్పాడు.
సుప్రజ హృదయం ఆనందంతో ఉప్పొంగింది.
అప్రయత్నంగా అతడి చేతిని పట్టుకొని ఊపేసింది.. ‘్థంక్యూ అవినాష్..’ అంది.
‘ఈ శుభ సందర్భంగా నాకు మంచి లంచ్ ఏర్పాటు చేయాలి..’ అన్నాడు.
‘ఎస్.. చెప్పు.. నీకు నచ్చిన హోటల్‌కి తీసుకెళ్తా.. నినే్న మా ఆయన నా అకౌంట్‌లో అవౌంట్ చేశాడు..’ అంది.
‘బయట వద్దు.. స్వయంగా నీ చేతుల్తో వండి పెట్టాలి..’ అన్నాడు.
‘నా వంట నీకు నచ్చుతుందా?’ అంది సందిగ్ధంగా. ‘తింటేగా తెలిసేది..’ అన్నాడు.
ఇప్పుడు సుప్రజ హృదయంలో ఎందుకో బెరుకు లేదు! ఏదో తెగింపు.. ఇంటికొచ్చాక.. అతడికి నచ్చే వంటలు చేసి పెట్టింది. గోంగూర పచ్చడి.. బీన్స్ తాళింపు.. పల్చగా కంది చారు, గడ్డ పెరుగుతో భోజనం వడ్డించింది.
‘ఇంత ఇష్టంగా మీ ఆయనకి ఎప్పుడైనా వండిపెట్టావా? సుప్రజా..’ అడిగాడు అవినాష్.
‘ఆయనగారికి నేనేం చేసినా నచ్చదు...’ అంది.
‘నన్ను అడిగావు కదా.. అతడ్ని కూడా ఒకసారి అడిగి చూడు ఏం ఇష్టమో’ చెప్పాడు.
అయోమయంగా చూసింది. ‘ఎనీహౌ.. మంచి భోజనం పెట్టినందుకు థాంక్స్..’ అన్నాడు.
‘మన మధ్య కృతజ్ఞతలు అవసరమా!..’ అంది.
‘అదేమో గానీ.. ఇప్పుడు నే ఇచ్చే ‘చెక్’ బిగ్ బిజినెస్ డీల్..’ అన్నాడు.
‘బిజినెస్సా..’ అంది విస్తుపోయి.
‘ఎస్.. ఇప్పటిదాకా నీ ఆర్ట్ కలెక్షన్స్ అమ్మితే నాకు దరిదాపు ఐదు లక్షల దాకా ముట్టింది. మరో ఐదు లక్షలు కలిపి ఇస్తున్నా.. నీ ‘ఆర్ట్‌ల’ను నాకు మాత్రమే అమ్మాలి ఇదీ అగ్రిమెంట్...’ అని ఒక కాగితం బైటకు తీశాడు. ‘ఓ.. నీలో బిజినెస్‌మేన్ కూడా వున్నాడా..?’ అంది నవ్వుతూ.
‘నువ్వు ఎలా అనుకున్నా నాకు అభ్యంతరం లేదు స్వీటీ’ అన్నాడు.
మూడు నెలలు గడిచాయి. సుప్రజా ఆర్ట్స్‌తో ఒక మంచి షాప్ ఏర్పాటు చేసుకుంది.
ఇప్పుడు పెళ్లికి, పుట్టిన రోజులకి వెళ్లేవాళ్లు సుప్రజ ‘ఆర్ట్’ గిఫ్ట్‌గా తీసుకెళ్లటం అలవాటు చేసుకున్నారు. సిటీలోనే సుప్రజా కలెక్షన్స్ పేరుతో రెండు మూడు ఔట్‌లెట్స్ వెలిశాయి.
* * *
భార్గవ కౌగిట్లో నలుగుతుంది సుప్రజ.
నిష్ణాతుడైన వైణికుడి చేతిలో ‘వీణ’ వయ్యారాలు పోయినట్టు అతడి చేతిలో మూర్ఛనలు పోతుంది...
ఆమె దేహంలోని ప్రతి భాగాన్ని అతడి పెదవులు అద్దుకుంటున్నాయ్..
‘అతడికి’ ఏమిష్టమో.. అవన్నీ చెయ్యడానికి ఆమె వెనుకాడడం లేదు.
‘యుద్ధ్ భూమి’లో ఇద్దరు మల్లయోధులు పోరాడినట్టు ఉంది.
ముప్పిరిగొన్న మోహం.. వ్యామోహంగా మారి.. ఆమె దేహంలోని సూర్యుడు చూడని ప్రాంతాలను కూడా అతడు దర్శించాడు. తియ్యగా ప్రాణం పోవడం అంటే ఏంటో ఇద్దరికీ అర్థమవుతూ ఉంది.
‘మమీ స్కూల్‌కి వెళ్లాలిగా ‘రెడీ’ చెయ్యవా?’ అని ఆరణి తట్టిలేపే వరకూ.. సుప్రజ లేవలేదు.
వొంటిపైన నూలుపోగు లేదు. దుప్పటి కప్పేసి ఉంది. అది గమనించిన ఆరణి ‘పప్పీ... పప్పీ షేమ్..’ అంది.
వొంటిపైన బట్టలు వేసుకోకుండా తిరిగితే ఆరణిని అలాగే అల్లరి చేసేది సుప్రజ...
నిద్రమత్తులో ఉన్న భార్గవని తట్టి లేపి.. ‘దాన్ని అలా ముందు గదిలోకి తీసుకెళ్లండి..’ అంది.
భార్గవ కూడా సిగ్గుపడుతూ లేచి..
‘చిన్నతల్లీ.. రాత్రంతా అమ్మకు నిద్రలేదు.. ఈ రోజు నేను రడీ చేయిస్తా రా..’ అని బాత్‌రూం వైపు ఆరణిని నడిపించాడు.
‘ఏంటో ఈ మనిషికి ఆరాటం.. వొంటిపైన బట్టలే వుంచడు’ గొణుక్కుంటూ లేచింది సుప్రజ.
చీర కట్టుకొని వెంట్రుకలని సరిచేసుకుంది. ఆమె పెదవులపైన సిగ్గుతో కూడిన చిరునవ్వు మొలిచింది.
‘్థంక్యూ అవినాష్..’ అనుకుంది. సరిగ్గా పది రోజుల క్రితం.. కాల్ చేశాడు అవినాష్.
‘ఏంటి సార్ ఇంత ఉదయానే్న కాల్ చేశారు..’ అడిగింది.
అప్పుడు సరిగ్గా సమయం ఉదయం ఆరు గంటలు.. ‘నీతో మాట్లాడాలి అనిపించింది సుప్రజా..’ అన్నాడు.
అతడి స్వరంలో ఏదో ఆవేదన కన్పించింది. ‘ఏయ్ ఏమైంది...’ అంది.
‘నే వచ్చి ఇప్పటికే మూడు నెలలు అయ్యింది. హాస్పిటల్‌లో నేను పెట్టిన లీవ్ అయిపొయ్యింది..’ చెప్పాడు.
‘ఇక యు.ఎస్. వెళ్లనన్నావ్‌గా..’ అడిగింది తడి ఆరిపోయిన స్వరంతో.
‘బట్ తప్పదు.. నీలాంటి పేషెంట్లు అక్కడ కూడా వుంటారు..’ చెప్పాడు.
‘అంటే నే పేషెంట్‌నా..’ అడిగింది కోపంగా.
‘అవునో కాదో నువ్వు వస్తే చెబుతా..’ అన్నాడు. రెండు గంటల తర్వాత ఇద్దరూ..
రామకృష్ణ బీచ్‌లో కలిశారు. దూరంగా సముద్రపు అలలు ఎగసిపడుతున్నాయ్...
‘నీకొక నిజం చెప్పాలి సుప్రజా..’ అన్నాడు.
‘నిజమా? ఏంటది...’ అడిగింది.
‘నాకు పెళ్లైంది. నా భార్య అవంతిక.. తను కూడా ఒక డాక్టర్. కాకుంటే గైనకాలజిస్ట్’ చెప్పాడు.
సుప్రజ అవాక్కయ్యింది!
‘డాక్టర్ రమణ ఎవరో కాదు.. నాకు పిల్లను ఇచ్చిన మావగారు.. ఇండియాకి వెళ్లి ఒకసారి మమీ డాడీని చూసి రమ్మంటే చూడ్డానికి వచ్చాను.. మావయ్యగారు మాట సందర్భంలో మీ దంపతుల సమస్య చెప్పాడు. భార్గవ నీలో మార్పు రాకపోతే డైవోర్స్ ఇవ్వాలన్న కృతనిశ్చయంతో వున్నాడు. నీలో తన బిడ్డను చూసుకున్నాడు మావయ్య. నీకు కౌన్సిలింగ్ చేయమన్నాడు.. ఒకే ఏజ్ గ్రూప్ కావడం అందులో ఒక కారణం.. నేను కౌన్సిలింగ్ చేసేది నా పూర్వ స్నేహితురాలికి అన్న విషయం అర్థమై బాధ.. ఆనందం రెండూ కల్గాయి. అత్తయ్యతో నువ్వు అన్న మాటలు కూడా తను నాకు చెప్పింది.
ఒకరోజు రాత్రి నిద్ర మాత్రలు వేసుకొని చనిపోవాలనుకొని పాపను చూసి నువ్వాగిపొయ్యావ్ అట. ఏతావతా నాకు అర్థమైంది ఏంటంటే నువ్వు డిప్రెషన్‌లో వున్నావ్...
ముందు జీవితం మీద నీకు నమ్మకం పెంచాలని నిర్ణయించుకున్నా.. అందుకు నీలోని ‘ఆర్ట్’ని అస్త్రంగా చేసుకున్నా. నేను ఊహించిన దానికంటే ఎక్కువే పుంజుకుంది నీకు బిజినెస్.
ఆ బిజినెస్ పెట్టడానికి ముందు మావయ్య మీ ఆయన భార్గవకి చాలాసార్లు ఫోన్‌లో కౌన్సిలింగ్ చేశాడు. ‘ భార్యాభర్తల మధ్య శృంగారంకి పునాది నమ్మకమే..’ అని నచ్చజెప్పాడు. ‘నీకు స్వేచ్ఛగా ఆలోచించే అవకాశం’ ఇవ్వమన్నాడు. నీ ఆర్ట్ ద్వారా సంపాదించిన డబ్బు గురించి చెబితే అతడు కళ్లు తేలేశాడు. విశేషం ఏంటంటే ‘తనకి ఇంత టాలెంట్ ఉంటే.. నేను ఈ దుబాయ్‌లో మండే ఇసుక మధ్య.. ఒంటెలతో సహజీవనం ఎందుకు? ఇండియా వచ్చేస్తాను...’ అన్నాడు.
ఇంతకీ దుబాయ్‌లో మీ ఆయన చేసే పనేంటో తెలుసా? యాభై డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య ఇసుక ఎడారిలో ఒంటెలు మేపే వ్యాపారం. నాలుక పిడచ కట్టుకుపోతుంది. మీ ఆయన స్నేహితుడు ఎవరూ దుబాయ్‌లో లేడు. ‘స్నేహితుడి వ్యాపారం చూసుకుంటున్నానని.. నీతో చెప్పాడు కానీ ఆయన చేసింది ఈ ఒంటెలు మేపే వ్యాపారమే. సెలవలు అయిపోయినా వెంటనే రాకపోవడంతో దుబాయ్ షేక్ మరొకడ్ని పెట్టుకుంటానంటే భయపడి వెళ్లాడు. ఇదంతా మావయ్య మీ ఆయన దగ్గర సేకరించిన సమాచారం. నాకు చెప్పి.. నీ మనసు మార్చమన్నాడు. డాక్టర్లు దేవుళ్లు కాదు మనసులు మార్చడానికి.. సుప్రజా.. వాస్తవాలని చెప్పి మాత్రమే ఒప్పించగలరు. మీ ఆయన అసహనం అభద్రతా భావంలోంచి వచ్చేది. అదే నీలోని ‘సెక్స్ వైముఖ్యత’కూ కారణమైంది. దీనే్న మా వైద్య పరిభాషలో ‘ప్రిజిడిటీ’ అంటారు. నిజానికి ‘సెక్స్’ అనేది భగవంతుడు మనిషికి ఇచ్చిన వరం.. ప్రపంచం మొత్తం యుగ యుగాలుగా దీని చుట్టూనే తిరుగుతుంది. దీనికి ఇంతటి ఆకర్షణ లేకపోతే.. నేల మీద మానవాళే ఉండేది కాదు. అదొక అపురూప భావన. స్ర్తి దేహమంతా ఒక ప్రయోగశాలే!
ఎక్కడ తనని ముట్టుకున్నా ఆమెకి ఆనందంతో మనసు పులకరిస్తుంది కాకుంటే...
ఒకరి వ్యక్తిత్వాలని.. ఒకరికి ఒకరు గౌరవించుకుంటూ.. ఒకరి ప్రతిభని మరొకరు గుర్తిస్తే భార్యాభర్తల మధ్య అగాధాలు ఉండవు.
కుటుంబం కోసం ఇంత కష్టపడ్డ మీ వారికి.. నీ హృదయంలో కాస్త చోటివ్వు. మీ దాంపత్యం నవశోభాయమానంగా ఉంటుంది’ చెప్పడం ఆపాడు అవినాష్.
సుప్రజ కళ్ల ముందు భర్త తమ కోసం పడ్డ కష్టాలు కనిపించాయి. అతడి మీద ప్రేమతో తన మనసు నిండిపోయింది. ‘్థంక్యూ మై ఫ్రెండ్.. నా వైవాహిక జీవితాన్ని నిలిపినందుకు...’ అంది సుప్రజ.
‘సుప్రజా.. దాన్ని రడీ చేసి బాక్స్‌లో ఒక ఆమ్లెట్ బ్రెడ్ వేసి పంపా.. రానా...’ అని దగ్గరకొచ్చాడు భార్గవ. ‘ఛంపేస్తా.. రాత్రంతా నిద్ర లేకుండా చేసింది కాక మళ్లీ వస్తున్నావా?’ అని తిడుతూనే భర్తని దగ్గరకు లాక్కుంది సుప్రజ.
* * *
మూడు నెలల తర్వాత.. ‘అల్లుడూ ఈ అవంతిక ఎవరూ..’ అడిగాడు డాక్టర్ రమణ.
‘మీ అమ్మాయి మావయ్యా..’ అన్నాడు అవినాష్.
‘ఇదేం పితలాటకం అయ్యా.. మాకసలు పిల్లలే లేరుగా.. ఆ అమ్మాయేమో.. మీ అమ్మాయిగారు బావున్నారా? అని అడుగుతుంది..’ అన్నాడు రమణ.
‘పేషెంట్ల కోసం లేని కూతుళ్లని కూడా పుట్టిస్తూ ఉండాలి మావయ్యా..’ అన్నాడు అవినాష్.
భర్త చేతిలోంచి ఫోన్ తీసుకొని.. ‘అరేయ్ నువ్వు నచ్చిన మెచ్చిన.. నీకు మిస్ అయిన సుప్రజనే మా కూతురిగా భావిస్తాం. మరో ముఖ్య విషయం సుప్రజ మళ్లీ కన్సీవ్ అయ్యింది. ఆ శుభవార్త చెప్పడానికే వచ్చింది’ అంది ఇందుమతి. ఆమె కళ్లలో కన్నీటి పొర.. యు.ఎస్.కి వెళ్లేప్పుడు సుప్రజతో తన అనుబంధం గురించి చెప్పాడు అవినాష్.
‘ఓ.. గ్రేట్.. నేను కూడా ఫోన్ చేసి గ్రీట్ చేస్తా..’ అన్నాడు నవ్వుతూ అవినాష్.
అతడి టేబుల్ పైన సుప్రజ ఫొటో నవ్వుతూ కన్పించింది.

-శరత్‌చంద్ర.. 9849241286