కథ

పొగరుబోతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ....

అలవాటు ప్రకారం పొద్దునే్న అయిదు గంటలకల్లా మెలకువ వచ్చేసింది సరోజకు. ‘గేటు చప్పుడు అయితే లేచి తలుపు తీయవచ్చును’ అని బద్ధకంగా అలా పడుకుంది. గడియారమైనా కాస్త మెల్లిగానో, వేగంగానో తిరగవచ్చును గానీ మాబు మాత్రం ఠంచన్‌గా ఆరు గంటలకల్లా పనికి వచ్చేస్తుంది.
కాస్త కునుకు పట్టిందేమో, మళ్లీ మెలకువ వచ్చేసరికి గడియారం ఏడు గంటలు చూపిస్తోంది.
పక్కన ఉన్న మాధవరావు గాఢనిద్రలో ఉన్నట్టు సన్నగా వినబడుతున్న గురక చెపుతున్నది. గభాలున మంచం దిగి తలుపులు తాళాలు తీసి బయటకు వచ్చింది సరోజ. గేటుకు తగిలించిన సంచీలో పాల పాకెట్లు తీసుకుని బయటకు వచ్చి అటూ ఇటూ చూసింది మాబు జాడ కనబడుతుందేమో అని.
‘చెప్పకుండా మానేయదు. జ్వరంగానీ వచ్చిందేమో. రెండు రోజుల నుండి కాస్త దగ్గుతోంది కూడా’ అనుకుంటూ కాఫీ డికాక్షన్ వేసి, పాలు సన్నసెగలో స్టౌమీద పెట్టింది. ప్లాస్టిక్ టబ్‌లో ఉన్న బుట్టెడు అంట్లు చూసి నీరసం వచ్చింది ఆమెకు.
‘చుట్టుపక్కల చేసే వేరే ఏ పనిమనిషిని అయినా పట్టుకోవాలి’ అనుకుంటూ మళ్లీ బయటకు వచ్చింది.
గబగబా నడుచుకుంటూ వెళ్తున్న జానకి కనబడింది సరోజకు.
‘ఇదిగో జానకీ ఒకమాట’ అని పిలిచింది.
‘చెప్పండి ఆంటీ!’ వెనక్కి వచ్చి అడిగింది.
ఇరవై ఏళ్ల వయసులో ఆడపిల్లలకు సహజంగా వుండే ఆకర్షణతో పాటు చక్కని కనుముక్కు తీరు ఉండడం వలన అందంగా ఉంది జానకి. దానికి తోడు పొడుగ్గా ఉండే జుట్టు భుజాల దాకా కత్తిరించుకుని క్లిప్‌తో జుట్టు బంధించింది. చిన్న బొట్టు, చుడీదారు డ్రెస్‌లో ఆధునికంగానూ ఉంది.
తనని ఆంటీ అని సంబోధించడము నచ్చని సరోజ ముఖం చిట్లించింది. ‘అడ్డమైన వాళ్లు ఆంటీ అని పిలవడమే’ విసుగ్గా అనుకుంది.
‘ఇంట్లో పొయ్యిలో పిల్లి లేవకపోయినా షోకులకు మాత్రం తక్కువ లేదు’ అనుకుంటూ, అవసరం తనది కనుక పైకి ప్రసన్నంగా మాట్లాడింది.
‘నిన్న మా స్నేహితులు భోజనానికి వస్తున్నారని బోలెడు అన్నం వండినట్లు ఉన్నాను. చాలా మిగిలిపోయింది. తీసుకుపోతావా?’ అని అడిగింది. అన్నం గినె్నతోపాటు మిగిలిన పాత్రలు కడిగిమ్మని అడగవచ్చు ననుకుంటూ.
జానకి అమ్మ మాదమ్మ కొనే్నళ్లు సరోజ వాళ్లకు పాలు పోసింది. తెల్లవారుఝామున గేదెను ఇంటి ముందుకు తోలుకు వచ్చి పాలు పిండి పోసేది. పొదుగు కడగడానికి నీళ్లు, చేతికి రాసుకోవడానికి ఆముదం సరోజనే అడిగేది. కడిగిన తరువాత పాల తపేలాలో నీళ్లు ఎంత వొడుపుగా వొంపేది అంటే అందులో అరగ్లాసు నీళ్లు కచ్చితంగా మిగిలే ఉండేవి. నురుకు పడకుండా కొలుస్తున్నా అంటూనే నురుగు పోసేది.
ఆ తరువాత రోజుల్లో గేదె చేపుకు వచ్చి పాలు బాగా ఇవ్వడానికి ఏదో ఇంజెక్షన్ పొడిచేది. అది చూడలేక వాడుక మానేసి పాల పాకెట్లు కొనుక్కోవడం మొదలుపెట్టింది సరోజ.
మాదమ్మ కూడా గేదెలు అమ్మేసి నాలుగు ఇళ్లల్లో పని చేసుకోవడం మొదలుపెట్టింది అని విన్నది. మాదమ్మ కూతురు కూడా ఎక్కడో చేస్తోందని మాబు చెప్పింది.
‘నేను చద్ది అన్నం తీసుకువెళ్లను ఆంటీ! పాచి పనులు కూడా చేయడం లేదు’ అని ‘మాధురి ఎక్కడ ఉంది ఆంటీ?’ అని ఒక్క క్షణం ఆగి అడిగింది జానకి.
సరోజకు గుర్తుకు వచ్చింది. తన కూతురు మాధురి ఆరో తరగతి దాకా దగ్గరే వున్న స్కూలులో చదివింది. ఈ పిల్ల దాని క్లాసే. ఒకరోజు మాధురి ఈ పిల్లని ఇంటికి తీసుకువచ్చి నేరుగా పడక గదిలోకి పిల్చుకుపోయింది.
‘ఎవరి అమ్మాయివి పాపా?’ అని అడిగింది సరోజ.
‘మీకు పాలు పోసే మాదమ్మ కూతుర్ని ఆంటీ’ అన్నది.
మాధురిని లోపలికి పిలిచి ‘ఎవరిని బడితే వాళ్లను లోపలికి తీసుకురాకు’ అని గట్టిగా చెప్పింది.
పై ఏడాది మాధురిని ప్రైవేట్ స్కూల్‌లో చేర్పించింది.
‘అబ్బో వీళ్ల కోసం వేడిగా వండి వార్చాలి కాబోలు. ఈవిడగారు అక్కడ కుర్చీలో కూర్చునే ఉద్యోగం చేస్తున్నట్టు గొప్పలు పోతోంది’ అనుకుంటూ ‘అమెరికాలో ఉంది’ అని చెప్పి పాలు స్టౌ మీద పెట్టిన విషయం గుర్తుకు వచ్చి లోపలికి వచ్చింది సరోజ.
మరునాడు మాబు పనిలోకి వచ్చాక అడిగింది సరోజ. ‘మాదమ్మ కూతురు ఎవరి ఇంట్లో పని చేస్తోందే’ అని.
‘పని అంటే అక్కడ అపార్ట్‌మెంట్‌లో ఉండే టీచర్‌గారి పాపను పొద్దుటి నుండి సాయంత్రం దాకా చూసుకోవడం అమ్మా! తీరిక దొరికినప్పుడూ తన పుస్తకాలు చదువుకుంటుందిట’ చెప్పింది మాబు.
‘చదువు మానేసింది కదా ఇంకా ఏం పుస్తకాలు’ అంది సరోజ.
‘ఇంట్లో ఉండే చదివి బి.ఏ. చేసిందని వాళ్ల అమ్మ చెప్పిందమ్మా. ఇప్పుడు ఏదో ఉద్యోగం కోసం పరీక్ష రాస్తుందట అందుకోసం చదువుకోవాలంట’ అంది మాబు.
‘అప్పుడెప్పుడో కనబడి కూతురు పెళ్లి కుదిరిందని చెప్పిందే మాదమ్మ?’ సందేహంగా అడిగింది.
‘పిల్ల బాగుంది, చదువుకుంది’ అని, ‘వాళ్లే వచ్చి చేసుకుంటామని అడిగారని కూడా అన్నది’ మళ్లీ ఆమే అంది.
‘అవును అమ్మా! అప్పుడు పోలీసు ఉద్యోగం వస్తుంది పిల్లోడికి అని కట్నం కూడా మాట్లాడుకున్నారు. ఇప్పుడు తీరా ఆ ఉద్యోగం చేతికి వచ్చాక కట్నం ఎక్కువ ఇస్తేనే చేసుకుంటాము అన్నారు. అమ్మా నాయనా ‘సరే అట్లనే ఇస్తాము’ అన్నా జానకి మాత్రం సుతరాము అన్నదిట.
‘అంతేకాదు అమ్మా. ఆ పిలగాడి మీద పై ఆఫీసరుకు ఫిర్యాదు కూడా చేసింది. ఆయన తిట్టిండో ఏమో వాళ్లు మళ్లీ వచ్చినారంట. ఈ పిల్ల ససేమిరా చేసుకోనూ అని ఖరాఖండిగా చెప్పింది’ ఆ పిల్ల ధైర్యానికి ఆశ్చర్యపోతున్నట్టు.
‘అది బాగానే ఉంది గానీ ఆ పిల్ల వట్టి పొగరుబోతు లాగా వుంది. చద్దన్నం తీసుకువెళ్లను, పాచిపని చేయను అంటూ గొప్పలు పోయింది’ అంది.
‘చదువుకున్న దాన్నని టెక్కు పడుతుంది అమ్మా, ఇప్పుడు తాను పని చేస్తున్న ఇంట్లో వాళ్లు, వాళ్ల బాబు పుట్టిన రోజని స్నేహితులని భోజనానికి పిలిచినారంట. వాళ్లు తిన్న ఆకులు తీసేయమంటే ఎంగిలి ఆకులు ముట్టుకోను అని పోయింది అని చెప్పింది ఆయమ్మ’ మరింత ఉత్సాహంగా చెప్పింది మాబు.
అమ్మగారింట్లో జరిగినవన్ని మాబు వెళ్లి జానకి తల్లి మాదమ్మకు చేరవేసింది. మాదమ్మ పొద్దునే్న కూతురు మీద తిట్ల దండకం అందుకుంది.
‘నాలుగు పుస్తకాలు చదువుకున్నానని నువ్వు గొప్పదానివి అయిపోయినావనుకుంటున్నావా?’ అంటూ.
‘ఆ యమ్మ పిలిచి అన్నం తీసుకు పోతవా అంటే చద్దన్నం వొద్దన్నావంట. మనకేమి అంత ఎక్కువైందా? నాలుగు గినె్నలు కడిగి ఇస్తే తప్పైందా? ఆళ్లు మనం ఒకటే కులం అని ఆ అమ్మ పోయినప్పుడల్లా కాఫీ ఇస్తాది? అడక్కపోయినా పాతచీరలు ఇస్తాది? పండక్కు చేసుకున్న పులిహోర, పరవాన్నం పెడుతుంది’ అంటూ.
‘ఆ అమ్మ నిన్ను తనతో సమానంగా కుర్చీలో కూచోనిస్తుందా వాళ్ల కులమేనని? వాళ్లు తినే కంచంలో నీకు పెడుతుందా? పనిమనిషి కోసం పక్కకు పెట్టిన గ్లాసులో కాఫీ ఇస్తుంది. వాళ్లు వాడుకోని, సొట్టలు పడిన స్టీలు కంచంలో అన్నం పెడుతుంది. వాళ్లు డబ్బులున్నోరు అమ్మా. చదువు, డబ్బు ఉంటే ఏ కులమైనా కలుపుకుంటారు. ఆ తేడాలు నాకు వద్దు. ఆ తిండి వద్దు. నేను కష్టపడి సంపాదించుకుంటా. తింటాను’ పెడసరంగా జవాబు ఇచ్చింది జానకి.
‘నువ్వు పనిచేసే ఇంట్లో పిల్లోడిని పట్టుకునే దానికి రెండు వేలు ఇస్తున్నారు. వాళ్ల స్నేయితులు అన్నం తిన్న ఆకులు తీసేందుకు నీకేం మాయరోగం? లడ్డూలు, జిలేబీ ఇస్తే వద్దన్నావంట ఏమీ ఎక్కువైందా?’ మద్దమ్మ గొంతు పెంచింది.
‘వాళ్లు తిన్న ఎంగిలి ఆకులు నేనెందుకు తీయాలి? వాళ్లు తిని ఎక్కువై వదిలేసిన స్వీట్లు ఏరి పక్కన పెట్టి నాకు ఇచ్చింది ఆ యమ్మ. వద్దు అన్నా. తప్పేముంది? ఆ ఇల్లు కాకపోతే ఇంకో ఇల్లు. నేను పనిచేస్తే జీతం ఇస్తారు. వూరికే కాదు’ తల్లికి గట్టిగా జవాబు చెప్పి పుస్తకాలు తీసుకుని బయటకు పోయింది జానకి.
‘ఈ పిల్లతో ఎట్లా ఏగల్నొ ఏమో అక్కా! నా తల తినేస్తోంది. దీని చెల్లెండ్లిద్దరూ చెప్పిన వాటిని పెండ్లి చేసుకుని పొయినారు. ఉద్యోగం రానిదే చేసుకోనని మొండి పట్టుపట్టి కూచుంది’ మాదమ్మ తన గోడు వెళ్లబోసుకుంది మాబుతో.
సోమవారం నుండి శుక్రవారం దాకా టీచరుగా రెండేళ్ల కొడుకుని పొద్దున్న తొమ్మిది నుండి సాయంత్రం అయిదు గంటల దాకా చూసుకుంటుంది జానకి. శనివారం, ఆదివారం వాళ్లే చూసుకుంటారు. జానకి పనిలోకి రాదు. ఆ రెండు రోజులు తన బట్టలు ఉతుక్కుని, ఇస్ర్తి చేసుకోవడానికి, లైబ్రరీకి వెళ్లి పుస్తకాలు తెచ్చుకోవడానికి వాడుకుంటుంది జానకి.
ఆ ఆదివారం జానకి పెద్ద చెల్లెలు ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చింది. రేగిపోయిన జుట్టు, వేళ్లుతట్లు తేలిన చెంపలు ఏం జరిగిందో చెప్పకనే చెబుతున్నాయి. ‘నువ్వేమీ అనకపోతే నీ మొగుడు ఎందుకు కొడతాడు?’ అంటూ కూతురిని నిలదీసింది మాదమ్మ.
అంగట్లో వచ్చిన డబ్బు అంతా తాగి తగలేస్తే ఎట్లా అన్న దానికి కొట్టారు ఏడుస్తూ చెప్పింది చెల్లెలు.
‘అంటే మాత్రం కొడతాడా? నువ్వూ తిరిగి కొడితే కుదిరేది రోగం’ రోషంగా అంది జానకి.
‘అమ్మా, కొడుకు కలిసి చావబాదారు అక్కా’ బోరుమంది చెల్లెలు.
‘అయితే మీరు మీరు చూసుకోవాల. ఇట్లా అమ్మ అయ్యా కాడికి పరిగెత్తుకుని వస్తే ఎట్లా?’ అంది మాదమ్మ.
‘నువ్వు అక్కడికి పోవొద్దు. ఇంట్లోనే ఉండు. నేను పోయి మాట్లాడి వస్తా’ అంది జానకి.
అన్నట్టుగానే దినె్న దేవరపాడులో ఉన్న వాళ్ల ఇంటికి పోయింది జానకి. పోతూపోతూ వెంట తనకు కుదిరి తప్పిపోయిన పోలీసు అతన్ని వెంటబెట్టుకు పోయింది.
ఇంకోసారి చెల్లి వొంటి మీద దెబ్బ పడితే అమ్మా, కొడుకు స్టేషన్‌కు పోవాల్సి ఉంటుందని బెదిరించి మరీ వచ్చింది.
తల్లితో ఏ విషయం చెప్పకుండా చెల్లిని తీసుకుపోయి విడిచి వచ్చింది.
తాను పనిచేసే టీచర్‌గారికి మాత్రం చెప్పింది. ఆ టీచర్ మాబుతో చెప్పిందట.
మాబు ద్వారా విషయం విన్న సరోజ ఆశ్చర్యపోయింది. ‘అబ్బో ఈ పిల్ల పొగరుబోతే కాదు చాలా గడుసుపిల్ల కూడా’ అంది మాబుతో.
‘అవ్ అమ్మా ఇట్లాటి పిల్లని నిఖా చేసుకునేందుకు ఎవరు ముందుకొస్తరు’ అంది మాబు చేతులు తిప్పుతూ.
‘జానకి పని మానేసిందా ఏమిటే ఈ నడుమ కనబడలేదు. మన ఇంటి ముందు నుండే కదా పోతుంది?’ మాబును అడిగింది సరోజ.
‘లేదమ్మా! గవర్నమెంట్ ఆఫీస్‌లో గుమస్తా ఉద్యోగాలకి పరీక్షలు ఉన్నాయంట. అవి రాయటానికి వారం రోజులు పనికి రానని చెప్పిందట’
మాబుకు మాదమ్మకు మంచి స్నేహం గనుక విషయాలన్ని తెలుస్తాయి.
‘సరేగానీ, రేపు నువ్వు తొందరగా వచ్చి పని ముగించు. నేను రైతు బజారుకు పోయి కూరలు తెచ్చుకోవాలి’ ముందు రోజే చెప్పింది సరోజ.
అనుకున్నట్టే పది గంటలకల్లా ఆటోలో బయలుదేరింది సరోజ. రైతు బజార్లో కావలసిన కూరగాయలు కొనుక్కుని బరువైన సంచీ మోసుకుంటూ బయటకు వచ్చి ఆటో కోసం చూస్తోంది.
అంతలో బుధవారపేట నుండి సీ కాంప్ వైపు వస్తున్న ఒక మోటార్‌బైక్ స్పీడుగా వచ్చి సరోజను రాసుకుంటూ ముందుకు పోయింది.
అమ్మా అంటూ సరోజ బ్యాలెన్స్ తప్పి కింద పడింది. ఆమె తల రోడ్డు మీద వున్న రాయికి కొట్టుకుంది.
బైక్‌లో పోతున్న కుర్రాళ్లు కనీసం ఆగి వెనక్కి చూడకుండా దూసుకుపోయారు. సరోజకు స్పృహ తప్పింది.
‘అయ్యో! ఎవరో పాపం పడిపోయింది. ఈ కాలం కుర్రాళ్లకి ఒళ్లు పై తెలీడంలేదు. ఎట్లా పడేసిపోయారు
చూడు’ ఒక్కొక్కరూ ఒక్కొక్క మాట అంటున్నారు గానీ సహాయం చేయడానికి ముందుకు రాలేదు.
అంతలో పరీక్ష సెంటర్‌కి వెళ్లడానికి సీ కాంప్‌కు వచ్చిన జానకి ముందుకు వచ్చి చూసింది.
‘అయ్యో మాధురి అమ్మగారు’ అంటూ ఆటోను పిలిచి ‘ప్లీజ్ సాయం పట్టండి’ అని అడిగి ఆమెను ఆటోలోకి చేర్చింది.
‘తొందరగా పోనీ అన్నా. గవర్నమెంట్ ఆస్పత్రికి’ అంటూ దగ్గరే ఉన్న ఆసుపత్రికి చేర్చింది.
సరోజకు రెండు గంటల తరువాత స్పృహ వచ్చి కళ్లు తెరిచేసరికి తాను ఆస్పత్రిలో మంచం మీద ఉన్నట్టు తెలిసింది. తనవైపే దిగులుగా చూస్తూ కూచున్న భర్త కనపడ్డాడు. ఒకవైపు చేతికి రక్తం ఎక్కిస్తున్నారు. తలకు కట్టుకట్టి ఉంది.
‘ఎవరు నన్ను ఆస్పత్రిలో చేర్చింది?’ నీరసంగా అడిగింది సరోజ.
‘మాదమ్మ కూతురు జానకి లేదు? ఏ కాంప్ మోంటెస్సరీ స్కూల్‌లో మధ్యాహ్నం రెండు గంటలకు మొదలయ్యే పరీక్ష రాయడం కోసం ముందుగానే బయల్దేరి షేర్ ఆటోలో సి క్యాంప్ దాక వచ్చిందట. అక్కడి నుండి కలెక్టర్ ఆఫీస్ వెనుక స్కూల్‌కి వెళ్లడానికి ఆటో కోసం చూస్తున్న జానకి నువ్వు స్పృహ తప్పి కిందపడి ఉండడం చూసి ఆటోలో తీసుకువచ్చి చేర్పించిందట. నీకు రక్తం బాగా పోయిందని, ఎక్కించాలని అంటే తానే రక్తం ఇచ్చిందిట’ ఆయన నెమ్మదిగా జరిగింది చెప్పాడు.
‘అవునమ్మా. జానకిది ఓ గ్రూప్ రక్తం. నెలకు ఒకసారి ఆస్పత్రికి వచ్చి రక్తం డొనేట్ చేసి వెళ్తుంది. ఆ పిల్ల ఇక్కడ డాక్టర్లకు, నర్సులకు ఎరికే. అందుకే జానకిని చూడగానే వెంటనే చేర్చుకున్నారు. పరీక్ష రాయడానికి పోతూ కూడా నీ కోసం రక్తం ఇచ్చి పోయింది పాపం. ఇప్పటిదాకా ఇక్కడే ఉంది. సారుకి ఫోన్ చేసి ఆయన వచ్చాక వెళ్లింది’ జానకిని మెచ్చుకుంటూ చెప్పింది నర్సు.
ఆ సాయంకాలం సరోజను చూడడానికి ఇంటికి వచ్చింది జానకి. ‘ఇప్పుడెలా ఉంది ఆంటీ. మీరు అట్లా కింద పడి ఉంటే చూసి చాలా భయం వేసింది. దేవుడి దయ వల్ల మీకు ఫ్రాక్చర్ ఏమీ కాలేదు’ సరోజ చేతులని పట్టుకుని అడిగింది జానకి.
సరోజకు కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ‘ఆంటీ’ అన్న పిలుపు ‘అమ్మా’ అన్నట్టు వినిపించింది.
‘దేవుడిలాగా నీవు ఆ సమయానికి అక్కడికి రాబట్టి ఇలా క్షేమంగా ఇల్లు చేరాను’
‘కన్నకూతురులా రక్తం ఇచ్చి కాపాడావు. నీ రుణం ఎలా తీర్చుకోను?’ గద్గద స్వరంతో అంటూ జానకి రెండు చేతులు గుండెల మీద పెట్టుకుంది సరోజ.
‘అయ్యో అంతమాట అనకండి ఆంటీ. మీరు ఆశీర్వదించాలి. ఈ విషయం మాధురికి చెప్పకండి. కంగారు పడుతుంది’ అంది జానకి.
‘మీ అంకుల్ అప్పుడే చెప్పేయడం అది భయపడి, ఏడ్చి, జాగ్రత్తలు చెప్పడం అయింది. నీకు ముఖ్యంగా చాలాచాలా థాంక్స్ చెప్పమన్నది’ చెప్పింది సరోజ.
‘పరీక్షకు వెళ్లే గాబరాలో కూడా నువ్వు చూపిన మానవత్వం గొప్పది జానకీ’ మరోసారి జానకి చేతులు పట్టుకుని అంది సరోజ.
‘మనిషి ప్రాణంకన్నా పరీక్ష ఎక్కువ కాదు ఆంటీ. ఒకవేళ పరీక్ష టైమ్‌కు అందుకోలేకపోతే పై ఏడు రాస్తాను. అంతే కదా. ఏమైనా సహాయం కావాలా ఆంటీ? పని ఏమైనా ఉంటే చెప్పండి. చేసి వెళ్తాను’ అడిగింది జానకి.
‘ఓ పని చేయి. ఆంకుల్‌కి, నీకు, నాకు మూడు కప్పుల కాఫీ కలుపుకుని రా. తాగిపోదువుగానీ’ అంది సరోజ.
‘్ఫల్టర్‌లో డికాక్షన్ ఉంది. కప్పులు గూట్లో వున్నాయి. పాలు ఫ్రిజ్‌లో పెట్టాను చూడు’ మళ్లీ తానే అంది సరోజ.
పది నిమిషాలలో కాఫీ తెచ్చి వాళ్లకి చెరో కప్పు ఇచ్చి తాను ఒక కప్పు తీసుకుంది.
‘నీకు ఈ ఉద్యోగం తప్పకుండా వస్తుంది. అప్పుడు నేను నీకు పార్టీ ఇస్తాను’ అభిమానంగా అంది సరోజ.
తాగిన తర్వాత ‘వస్తాను ఆంటీ జాగ్రత్తగా ఉండండి’ అని చెప్పి వెళ్లిపోయింది జానకి.
‘పొగరుబోతు, అనుకున్న ఈ పిల్ల ఎంత మంచిది? ఆమె ఆత్మగౌరవం అహంకారంగా కనబడింది తనకు. జానకికి ఈ ఉద్యోగం వచ్చి సంతోషంగా ఉండాలి’ మనసులో అనుకుంది సరోజ.
*

--డా. తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం