కథ

ఈ మట్టిలోనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణ ప్రచురణకు
ఎంపికైన కథ
*
అన్నం తింటున్న శివయ్యకి కొడుకు మాటలు గుర్తొచ్చాయి. మూడు రోజుల క్రితం కొడుకు చెప్పినప్పుడు వాటి గురించి అంతగా ఆలోచించలేదు. కానీ రోజులు గడుస్తున్నకొద్దీ వాటి అంతరార్థం బోధపడి అతని మనసులో అలజడి మొదలైంది. ఆలోచించే కొద్దీ అతనిలో భయంతో కూడిన ఆందోళన ఎక్కువైంది. తనకు ఊహ తెలిసినప్పటి నుండీ ఆ ఊరు, అక్కడి పరిసరాలు, ఆ మట్టి పరిమళం, అక్కడి మనుష్యులు, వారి ఆత్మీయతలు అన్నీ సంపూర్ణంగా అనుభవించాడు. ఊపిరి ఉన్నంతవరకూ ఈ ఊరి మట్టితోనే తన సంబంధమనుకున్నాడు. తన మరణంతోనే ఆ ఊరితో సంబంధం తెగిపోతుందనుకున్నాడు. కానీ కొడుకు మాటలు తలచుకున్న కొద్దీ అతనికి బాగా పరిచయం ఉన్న వస్తువేదో తన నుంచి దూరం కాబోతుందనే భయం పట్టుకుంది.
‘ముసలితనంలో ఏ సౌకర్యాలూ లేని పల్లెటూళ్లో ఉండి ఇబ్బందులు పడకపోతే తనతో పట్నానికి వచ్చి దర్జాగా ఒక ముద్ద తిని విశ్రాంతి తీసుకొమ్మ’నే కదా తన కొడుకు చెప్పింది. దానికెందుకు తను అంతగా తల్లడిల్లుతున్నాడో తెలియట్లేదు శివయ్యకి. అయినా ఆలోచిస్తుంటే కొడుకు మాటల్లో ప్రేమ కంటే స్వార్థమే వినిపించింది. అందుకే ఆ విషయాన్ని తల్చుకున్నప్పుడల్లా ఒంట్లోంచి ఏదో భయం నిలువెల్లా పాకసాగింది. దాంతోపాటు కొడుకు చెప్పిన ఇంకో మాట కూడా గుర్తుకొచ్చింది. ‘మీరెలాగూ నాతోనే ఉంటారు కాబట్టి ఇంట్లో దీపం పెట్టేవాళ్లు లేకుండా ఇల్లు బోసిగా ఉండటం బాగోదు, ఎంతొస్తే అంత రేటుకి ఇల్లు అమ్మేసి అందరం పట్నంలోనే హాయిగా ఉందా’మని చెప్పడమే శివయ్య బాధకు కారణం. ఇంతకు ముందు మీరు నా దగ్గరే ఉండొచ్చని తీసుకెళ్లిన కొడుకు చేసిన ఘనకార్యాలు శివయ్య మనసులో సుడులుగా తిరుగుతూనే ఉన్నాయి. కూర్చుంటే కుర్చీలు మాసిపోతాయి. నడిస్తే ఇంట్లో పరిచిన తెల్లని బండల మీద మరకలు పడిపోతున్నాయని కోడలు కొడుకుతో చెప్పడం, కాస్త శుభ్రంగా ఉండొచ్చు కదా అని కొడుకు తామిద్దరికీ చెప్పడం బాగా గుర్తుంది శివయ్యకి.
వాకిట్లో మట్టితో ఆడుకుని, మట్టిని నోట్లో పెట్టుకుని, ఒళ్లంతా మట్టి రాసుకుని మురికిగా ఉన్న కొడుకుని ఆ మట్టితోనే ఎత్తుకుని ముద్దుపెట్టుకునేవాడు తను. ఇప్పుడు అదే మట్టి తమ మధ్య పొరపొచ్చాలు రావడానికి ఒక కారణంగా కనపడడం ఆశ్చర్యంగా ఉంది. ఒంటిని చేత్తో రాస్తే మట్టే రాలుతుంది తప్ప మణులూ, మాణిక్యాలూ రాలవనే సంగతి కొడుక్కి ఎప్పటికి అనుభవంలోకి వస్తుందో అనుకున్నాడు శివయ్య. దానికి తోడు వీళ్ల కట్టూబొట్టూ కూడా కొడుక్కి కోడలకి నచ్చకపోవడంతో కళ్లల్లో నీళ్లు కళ్లల్లోనే దాచుకుని ఎప్పుడెప్పుడు తను పుట్టిన మట్టి మీద కాలుపెడతానా అని శివయ్య మనసు ఎంతగానో పరితపించింది. ఇప్పుడు ఈ ఇంటిని కూడా అమ్మేసి వాళ్లతో తీసుకెళ్తానంటున్నాడు కొడుకు. తీరా అక్కడికెళ్లాక ఇంతకు ముందు జరిగిన సంఘటనలే మళ్లీ జరిగితే ఎక్కడికెళ్లాలో, ఎవరి దగ్గర తలదాచుకోవాలో అర్థంకాలేదు శివయ్యకి. ఈ ఊరిలోనో, ఈ ఇంటిలోనో ఉంటే కనీసం ‘తిన్నావా’ అని అడిగేవాళ్లుంటారు. బాగున్నా, బాగోలేకపోయినా పరామర్శలు చేసేవాళ్లు ఉంటారు. ఒక్కసారిగా ప్రాణం పోయినా ఇంత బాధ ఉండేది కాదేమో. గుర్తొచ్చినప్పుడల్లా గుండెని మెలితిప్పే జ్ఞాపకాలతో ముడిపడి ఉన్న ఈ ఇంటిని ఉంచుకోవాలో, దానితో సంబంధాన్ని తెంచుకోవాలో ఎంత ఆలోచించినా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాడు శివయ్య.
అన్నం తింటూనే వాకిట్లో ఉన్న భార్య రమణమ్మ వంక చూశాడు శివయ్య. మంచమీద దుప్పట్లు సర్దుతూ తన పనిలో తనుంది. కొడుకు నిర్ణయం గురించి రమణమ్మను అడగాలనుకున్నాడు శివయ్య. అడిగినా ఏం చెప్తుందిలే అనుకున్నాడు. ఎంత కాదనుకున్నా కడుపున పుట్టిన కొడుకు ముసలితనంలో తల్లినీ తండ్రినీ తనతో తీసుకెళ్తానంటే ఎవరికైనా ఆనందంగానే ఉంటుంది. తన భార్య కూడా అందుకు అతీతురాలేమీ కాదు. ఆమె ఏ మాటా చెప్పకపోయినా కొడుకు ప్రస్తావన రాగానే ఆమె కళ్లల్లో కనిపించే ఆనందాన్ని చాలాసార్లు చూసి నవ్వుకున్నాడు శివయ్య. అందుకే అడిగినా ఉపయోగం ఉండదనుకుని ‘పొలం గట్టుదాకా వెళ్లొస్తాన’ని భార్యతో చెప్పి బయల్దేరాడు శివయ్య.
ఒక్కో వీధినీ దాటుకుంటూ పెద్ద వంతెన దగ్గరికొచ్చాడు. వంతెన దగ్గరున్న చెట్ల కింద వయసుమీరిన ముసలి వాళ్లు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. పశువుల్ని చేలకు తోలుకెళ్తూ ముందుకెళ్తున్న వాళ్లను దాటుకుని బ్రిడ్జిని సమీపించాడు. బ్రిడ్జిపై నుండి కిందికి చూస్తే కాలువ ప్రశాంతంగా ప్రవహించడం కనిపిస్తోంది. ఆకతాయి కుర్రోళ్లు బ్రిడ్జిపై నుంచి కాలువలోకి దూకి ఈత కొడుతున్నారు. కనీసం కొడుక్కి ఈ కాల్వలో ఈతకొట్టిన సంగతైనా గుర్తుందో లేదో! ఈత రాక ఇబ్బంది పడుతుంటే తను ఈత నేర్పించిన సంగతి గుర్తొచ్చి తనలో తానే నవ్వుకున్నాడు. అయినా అన్నీ నేర్చుకున్న పక్షులు ఎగరకుండా ఉండాలనుకోవడం కూడా మూర్ఖత్వమే అవుతుంది కదా అని సరిపెట్టుకున్నాడు. బ్రిడ్జి దాటి కొంచెం ముందుకెళ్తే పెద్ద కంకరరోడ్డు వస్తుంది. అది దాటి ఒక అర కిలోమీటరు నడిస్తే పైనుండి కిందికి దిగి పొలాల్లోకి వెళ్లే దారి కనిపిస్తుంది. గట్టు దిగి పొలం గట్టు మీద నడవసాగాడు. అరటి తోటల్ని, కంద తోటల్ని దాటి తన పొలంవైపు నడిచాడు.
గట్టు మీద ఉన్న వేపచెట్టు కింద కూర్చుని పొలం వైపు చూశాడు శివయ్య. ఏపుగా పెరిగి నిండుగా కనిపిస్తున్న అరటితోట వంక ఆర్తిగా చూసుకున్నాడు. చిన్నచిన్న పిలకల్ని తెచ్చి నాటినప్పుడు అవి సరిగా పెరుగుతాయో లేదోనని చాలా ఆందోళన పడ్డాడు. వాటి చుట్టూ పాదులు చేయడం, వేళలు తప్పకుండా నీళ్లను వదలడం, కలుపు మొక్కలు పెరిగితే ఎకరం చేను చుట్టూ తిరిగి వాటిని ఏరేయడం గుర్తొచ్చింది. అరటి మొక్కలు సగం ఎదిగేదాకా వాటిని కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. నేడో రేపో గెలలు దిగడానికి సిద్ధంగా ఉన్న తోటను చూసుకుని తృప్తిగా తలాడించాడు.
తన కొడుక్కి ఐదు సంవత్సరాల వయసున్నప్పటి నుండీ ఆ మెట్ట భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు శివయ్య. సంవత్సరానికి ఇవ్వాల్సిన కౌలు డబ్బులు అప్పుచేసి తీసుకురావడం, వాటిని తీర్చడానికి కష్టపడడం. పంట చేతికి రాగానే అరటి గెలలకు సరిగా ధరలేదని చెప్పి ఎంతో కొంత చేతిలో పెట్టి దళారి పంట మొత్తం పట్టుకుపోవడం, మిగిలిన డబ్బులు వేటికి సర్దుబాటు చేయాలో తెలియక సతమతమవడం ప్రతీ సంవత్సరం శివయ్య జీవితంలో జరుగుతున్న సంఘటనలే. అయినా పొలం కౌలుకు తీసుకోవడం మానలేదు, పంట పండించడమూ మానలేదు. మట్టిలో చేతులు పెట్టినప్పుడల్లా తన జీవితంలో పోగొట్టుకున్నదేదో దొరికినట్లుగా ఆనందపడేవాడు. అరటి మొలకలు చిన్నచిన్న పిలకలేసినప్పుడల్లా చిన్నపిల్లాడిలా చేనంతా తిరుగుతూ సంబరపడేవాడు. కాలవ నుంచి వచ్చే నీళ్లను మొక్కలన్నీ తడిసేటట్లుగా మళ్లించేవాడు. పనున్నా లేకపోయినా ఏదో వంకతో పొలం వెళ్లి ఆ చివరి నుంచి ఈ చివరి దాకా ఒకసారి చూసుకుంటేగానీ మనసు తృప్తిగా ఉండేది కాదు. ‘సరిగా ఇల్లు కూడా గడవడానికి పనికిరాని పంటను చూసుకోవడం దండగ’ అని రమణమ్మ ఎన్నిసార్లు చెప్పినా వినేవాడు కాదు శివయ్య. మనిషి చేసే ప్రతీ పని నుండి ప్రతిఫలం ఆశిస్తే బాధ తప్ప ప్రయోజనం ఉండదనే విషయం అతను తన జీవితానుభవాల నుంచి నేర్చుకున్నాడు. కొన్ని పనులు ఆదాయం కోసం చేస్తాం, కొన్ని పనులు ఆత్మతృప్తి కోసం చేస్తాం. అలా కాకుండా మనకు ప్రయోజనం వచ్చే పనులే చేయాలని మనిషి భావించడం అత్యాశే అవుతుంది. కొడుకైనా కొబ్బరిచెట్టైనా బాగా ఎదిగి నీడనిచ్చినప్పుడో తోడుగా నిల్చినప్పుడో వాటి ప్రయోజనం నెరవేరినట్లవుతుంది తప్ప అండగా నిలబడాలనే నిబంధన లేదు. కాలం కలిసిరావాలి, కష్టం తెలిసి రావాలి.
గట్టుమీద కూర్చుని చేనువంక చూశాడు. ‘ఈ రోజు మనదనుకున్నది రేపు ఇంకొకరిదవుతుంద’నే విషయం ఎంత నచ్చచెప్పుకున్నా మనసుకెక్కట్లేదు. చేతికి దొరికిన మట్టిగెడ్డల్ని దూరంగా విసిరేశాడు. తను ఎంత చెప్పినా వినట్లేదని పెద్దమనుషులతో చెప్పించడానికి పంచాయతీ పెట్టిస్తానని చెప్పి వెళ్లిన కొడుకు సాయంత్రానికి వస్తాడు. రాత్రికి పంచాయితీ పెడతారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. తనిక్కడే ఉండాలి, తన ఊపిరి ఇక్కడే పోవాలి. ఎవరూ లేనిచోట అనాథలా, అనామకంగా తన ప్రాణం పోవడం శివయ్యకి ఇష్టంలేదు. ఎంత నష్టమైనా, ఎన్ని కష్టాలొచ్చినా తనను ఆదరించిన ఈ మట్టిలోనే ప్రాణాలు విడవాలి. ఒక దృఢ నిశ్చయానికి వచ్చినట్లుగా పైకి లేచాడు.
* * *
ఊరు ఊరంతా చక్రరాయి పక్కనున్న రామమందిరం దగ్గరికి చేరింది. ప్రతీ ఇంట్లో ఏదో ఒక రూపంలో గొడవలున్నా పక్కింట్లో గొడవ జరుగుతుందంటే ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. తమలో తామే గొణుక్కుంటూ, నవ్వుకుంటూ మాసిన బట్టలతోనూ రేగిన జుట్టుతోనూ ఊరి జనాలందరూ గోడలకు ఆనుకుని నిలబడ్డారు.
రామమందిరం అరుగు మీద వరసగా కూర్చున్నారు పదకొండు మంది పెద్దమనుషులు. రోడ్డుకి రెండు మూడు మెట్ల వరసలో ఎత్తుగా ఉండడం, ఊరంతటికీ మధ్యలో ఉండడం వల్ల ఏ కార్యక్రమం జరిగినా రామమందిరాన్ని రచ్చబండగా వాడుతుంటారు. మనుష్యులకు సాధారణంగా ఉండే బలహీనతలన్నీ ఆ పెద్దమనుషులకు కూడా ఉంటాయి. అయినా కొన్ని సమస్యలకు పరిష్కారాలు సూచించేటప్పుడు, పెళ్లిళ్లు, చావులప్పుడూ వారి పెద్దరికానికి గౌరవం, విలువా పెరుగుతుంటాయి.
చొక్కాజేబులో దాచుకున్న పొగాకు బయటకి తీసి చేతితో చుట్టుకుంటూ ‘ఎవడిమట్టుకాడు ఏమీ మాట్టాడకుండా అట్టా నిలబడిపోతే విషయం ముందుకెట్టా కదులుద్దీ...’ అన్నాడు పెద్దలలో ఒకడైన రాఘవయ్య.
మిగతా పెద్దలందరూ ఆయనకు వంత పాడారు.
మళ్లీ రాఘవయ్యే కల్పించుకుంటూ ‘చూడు శివయ్యా.. సలహా చెప్పడానికి అందర్నీ పిల్చి నువ్వు బెల్లంకొట్టిన రాయిలా కూసుంటే ఎట్టారా? అసలు నీ సంగతి ఏందో చెప్పు. ఆ నోటా ఈ నోటా విన్నదాన్నిబట్టి నీదసలు ఇక్కడికొచ్చి చర్చించాల్సినంత అవసరం ఉన్న సమస్య కాదురా..’ చెప్పి మిగతా అందరివైపూ చూశాడు.
ఒక మూలగా కూర్చున్న శివయ్య కంగారుపడ్డాడు ఆయన మాటలతో. ‘అదేంది పెద్దమనిషీ అట్టా మాట్టాడతావు. సమస్య లేకుండా మీ అందర్నీ పిలవడం నాకేమైనా సరదానా..’ అన్నాడు తన్నుకు వస్తున్న కోపాన్ని ఆపుకుంటూ.
‘మరి ఏముందిరా నీ విషయం.. కొడుకు దగ్గరకెళ్లి కూసుని తినడానికెందుకురా నీలుగుతున్నావు? నాకే కొడుకులుండి వాళ్లు నన్ను రమ్మని పిలిస్తే ఎగిరి గంతేసి ఎల్లిపోయేవాడిని..’ లంకపొగాకు గప్పున పీల్చి పొగ బయటకి వదుల్తూ చెప్పాడు రాఘవయ్య. ఉన్న ఇద్దరి కూతుళ్లకూ మంచి కుర్రోళ్లను చూసి పెళ్లిళ్లు చేశాడు రాఘవయ్య. పండుగలకో పబ్బాలకో వాళ్లు ఇక్కడికి రావడమో లేదా వీళ్లు అక్కడికి వెళ్లడమో జరుగుతుంది. పొలం మీద ఏమైనా డబ్బులొస్తే తన ఖర్చులకు ఉంచుకుని మిగతాది ఇద్దరు కూతుళ్లకీ పంచుతాడు. ఒంట్లో బాగోకపోతే కూతుళ్లు అల్లుళ్లతో సహా వచ్చి బాగయ్యేదాకా ఇంట్లోనే ఉండి మంచీచెడు చూసుకుంటారు. అందుకే అంత ధీమాగా మాట్లాడుతాడు రాఘవయ్య.
‘నీకేంలే కొడుకుల్లాంటి అల్లుళ్లు దొరికారు కనుక ఎన్ని కబుర్లైనా చెప్తావు. అందరకీ అట్టా కుదరదుగా..’ మనసులో మాట పైకి అనేశాడు ఇంకో సంఘ పెద్ద లక్ష్మయ్య. తనలో తానే ముసిముసిగా నవ్వుకున్నాడు రాఘవయ్య.
కాసేపటి తర్వాత కూర్చున్న చోటి నుండి పైకి లేచిన శివయ్య తలకు చుట్టుకున్న తుండుగుడ్డను భుజం మీద వేసుకుని పెద్దమనుషుల వైపు చూసి ‘అయ్యా.. మీ అందరికీ నా గురించి తెలుసు. చిన్నప్పటి నుంచీ ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి మీ కళ్ల ముందే తిరుగుతున్నాను. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మీరందరూ నావైపున్నారనే ధీమాతోనే నేను రోజులు గడుపుతున్నాను. కానీ నాదసలు సమస్య కాదంటే నాకు చాలా బాధగా ఉందయ్యా..’ అన్నాడు శివయ్య.
అక్కడే ఒక కూర్చున్న శివయ్య కొడుకు రాజు కోపంతో తనలో తనే బుసలు కొట్టసాగాడు. తనది స్వార్థమో కాదో తనకు తెలియదు. తనకున్న ఇల్లు అమ్మేసి తల్లిదండ్రుల్ని తనతో తీసుకెళ్లాలనుకున్నాడు. అదే విషయం తండ్రితో చెప్పాడు. కానీ దానికి ఒప్పుకోక పోవడం వల్ల గత్యంతరం లేక ఈ పంచాయితీ పెట్టించాల్సి వచ్చింది. తండ్రి ఒప్పుకుంటాడనే ధీమాతో ఉన్న రాజు ఇప్పుడు విషయం పంచాయితీకి చేరడంతో తండ్రి మీద కోపం రాసాగింది. దానికి తోడు నాలుగ్గోడల మధ్య తేలాల్సిన విషయం నలుగురిలోకి చేరడంతో తల కొట్టేసినట్టుగా ఉంది.
కాసేపటి తర్వాత రాఘవయ్య కల్పించుకుంటూ ‘సరేరా శివయ్యా.. నీ సంగతి ఒక్కసారి వివరంగా చెప్పు’ అన్నాడు. దానికి సమాధానంగా చెప్పడం ప్రారంభించాడు శివయ్య. ‘అయ్యా.. మీ అందరికీ తెలిసిన విషయాలే అయినా ఒకసారి గుర్తుచేయడం అవసరం అని చెప్తున్నాను. చిన్నతనంలోనే నా తండ్రి చనిపోతే నా తల్లి ఎంతో కష్టపడి నన్ను పెంచి పెద్దచేసింది. కూలిపనులు చేసి నన్ను పెంచుతూ మాకొక నీడ కోసం రూపాయి రూపాయి దాచి ఆ ఇల్లు కట్టింది. నేనెప్పుడూ ఆ ఇంటిని ఒక ఆస్తిలాగా చూడలేదు. నా తల్లిలాగే భావించాను. తిన్నా తినకపోయినా ఆ ఇంట్లో పడుకుంటే మా అమ్మే నన్ను ఓదార్చుతున్నట్లుగా ఉండేది. ఆమె చనిపోయాక నా అన్నవాళ్లు లేక నేనెంత బాధపడ్డానో నాతోపాటు మీకు కూడా తెలుసు.
ఏ సంబంధమూ లేకపోయినా ఒక ఊరిలో ఉన్నాం కనుక నా మంచీ చెడూ చూసి ఊరివాళ్లు చేతనైనంత సాయం చేశారు. సొంత భూమి లేకపోయినా కౌలుకు వ్యవసాయం చేసి ఎవరి మీదా ఆధారపడకుండా నా తిండిగింజలు నేను సంపాదించుకో గలుగుతున్నాను. అలా వ్యవసాయం చేసే ఒక్కగానొక్క కొడుకుని పెంచి పెద్ద చేశాను. ఆ భగవంతుడి దయ వల్ల బాగా చదువుకుని ఆడి బతుకాడు బతుకుతున్నాడు. నేనెప్పుడూ వాడి నుంచి ఏమీ ఆశించలేదు. ముసలితనంలో తల్లిదండ్రులకి చేతికర్రలు కొడుకులే అని ఆడు గుర్తిస్తే చాలు..’ చెప్పడం ఆపి కూర్చున్న పెద్ద మనుషుల వంక చూశాడు శివయ్య.
‘నువ్వు చెప్పేది నాకు తెలుసురా శివయ్యా. ఎంతో కష్టపడి వ్యవసాయం చేసి కొడుకుని చదివించావు. వాడు ప్రయోజకుడయ్యాడు. నీ రుణం తీర్చుకుంటానంటున్నాడు. ఎందుకు ఆలోచిస్తున్నావో అర్థంకాకుండా ఉంది. అరటితోట వేశావు. అది కాపుకొచ్చి ఎంతో కొంత లాభాన్నిస్తానంటుంటే వద్దంటావేంట్రా..’ అన్నాడు రాఘవయ్య.
శివయ్య ఏం చెప్తాడోనని అందరూ ఆయనవైపు చూడసాగారు. ‘అయ్యా.. నేను ఇక్కడే పుట్టాను. ఇక్కడే పెరిగాను. ఇక్కడే ఈ మట్టిలోనే కన్నుమూస్తాను. ఇక్కడి నుంచి నేనెక్కడికీ వెళ్లలేనయ్యా..’ అన్నాడు శివయ్య.
‘ఒరేయ్ శివయ్యా.. బొందిలో ప్రాణమున్నంతవరకేరా నీదీ, నాదీ అనే పంతం. అది పోయిన తర్వాత ఈ చిలక ఎక్కడికిపోతుందో, ఈ కట్టె ఎక్కడ కాలుతుందో ఎవడికి తెలుసు. నువ్విక్కడున్నా, ఎక్కడున్నా నీ ప్రాణం పోయాక ఈ మట్టిలోనే కదా కలిసేది. దాని కోసం ఇంత పీకులాట ఎందుకురా..’ ఆగాడు రాఘవయ్య.
పంచాయితీ ఎక్కడ మొదలైందో, ఎలాంటి మలుపులు తీసుకుంటుందో, చివరికెలా ముగుస్తుందో ఎవరికీ అర్థం కాకుండా ఉంది. కొంతమంది శివయ్య అసలేం చెప్పాలనుకుంటున్నాడో అర్థంకాక అయోమయంగా, జాలిగా అతని వంక చూడసాగారు. మరి కొంతమంది అతనిది పిచ్చివాదన అని చిరాకు పడసాగారు. ఇంకొంతమందైతే ఈ పంచాయితీ పెట్టడమే దండగ అని తమలో తామే నవ్వుకోసాగారు.
కాసేపటి తర్వాత ‘అయ్యా.. నా చిన్నతనంలో జరిగిన సంగతి నాకిప్పటికీ గుర్తే. ఈ ఊరునుంచి అన్నీ అమ్ముకుని కొడుకుతోపాటే పట్నానికెళ్లిన మన వెంకటేశం శవం ఈ ఊరొచ్చినప్పుడు అతని శవం ఏ ఇంటి దగ్గరుంచాలో, ఎక్కడ పూడ్చిపెట్టాలో తెలియక ఎంత రచ్చ జరిగిందో నా వయసున్న వాళ్లందరికీ గుర్తుండే ఉంటుంది కదా బాబూ..’ ఆగాడు శివయ్య.
అక్కడున్న శివయ్య వయసు వారందరిలోనూ ఇరవై ఏళ్లనాటి సంఘటన మనసులో కదలాడసాగింది. రాఘవయ్య తండ్రి హనుమంతు అప్పుడు పెద్దమనుషుల్లో ఒకడు. ఇప్పుడు పెద్దమనుషులుగా ఉన్నవాళ్లలో కొంతమందికి ఆ విషయం గుర్తుంది. రాఘవయ్యకి మాత్రం తన తండ్రి ద్వారా ఆ సంఘటన మనసులో నాటుకుపోయింది.
భార్య చనిపోయిన తర్వాత కొడుకు మాటలు నమ్మి ఊరిలో ఉన్నవన్నీ అమ్మేసుకుని కొడుకుతోపాటే పట్నానికి వెళ్లిపోయాడు వెంకటేశం. ఊరిని వదలలేక, కొడుకుతో వెళ్లలేక ఎంతో బాధపడిపోయాడు. కొనే్నళ్లు గడిచిపోయాయి. ఊరంతా అతని గురించి మర్చిపోయే సమయంలో అతని శవాన్ని తీసుకుని ఊర్లోకొచ్చాడు కొడుకు హరి. అతని పేరుతో సెంటు భూమి కూడా లేకపోవడంతో ఎవరింటి దగ్గర శవాన్నుంచాలో తెలియక ఎవరి మట్టుకు వాళ్లు వౌనంగా ఉండిపోయారు. హరి మాత్రం శవం బాధ్యతంతా మీదే అన్నట్లుగా నిర్లక్ష్యంగా ఉండిపోయాడు.
అక్కడున్న హనుమంతు హరిని చూసి ‘నువ్వుండే చోట వెంకటేశాన్ని కాల్చడానికో, పూడ్చడానికో వీలు కుదరలేదేంట్రా.. శవాన్ని ఇక్కడిదాకా తీసుకొచ్చావు..’ అన్నాడు. దానికి సమాధానంగా ‘నేనేదో పట్నంలో చిన్న పని చేసుకుని బతుకుతున్నాను. అక్కడ శ్మశానాలు ఎక్కడుంటాయో నాకు తెలియదు. ఒకవేళ ఉన్నా మనకు అక్కడ పూడ్చిపెట్టడానికి అవకాశం ఉంటుందో ఉండదో తెలియదు. ఆ విషయాలన్నీ ఎవర్నడగాలో అసలు తెలియలేదు. నిన్న సాయంత్రం ఉన్నట్టుండి ఒక్కసారిగా వెనక్కి విరుచుకు పడిపోయాడు. ప్రాణం పోయే ముందు ఊరు ఊరు అనడం మాత్రం నాకు గుర్తుంది. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను...’ తండ్రి పోయాడన్న బాధ ఏ కోశానా అతని మాటల్లో ధ్వనించలేదు.
‘ఉన్నవన్నీ అమ్ముకుని తండ్రిని తీసుకెళ్లిపోయావు. మరిప్పుడు శవాన్ని ఎక్కడుంచమంటావు?’ సూటిగా ప్రశ్నించాడు హనుమంతు. ‘నాకేం తెలుసు. అది మీ ఇష్టం. అక్కడవకాశం లేదంటే ఏ కాలవగట్టునో వదిలేసి నా దారిన నేను పోతాను...’ అన్నాడు హరి నిర్లక్ష్యంగా.
ఆ మాటలు విన్న పెద్దమనుషులతోపాటు ఊరి జనాలందరూ హరిని కొట్టడానికి సిద్ధమయ్యారు. ఆడవాళ్లు నోటికొచ్చినట్లుగా శాపనార్థాలు పెట్టసాగారు. అందరి మనసూ అసహ్యంతో నిండిపోయింది. కాటికి కాళ్లు చాపుకున్న ముసలి వాళ్లందరిలోనూ ఏదో తెలియని భయం తాండవించింది. ఊరిలో శవాన్ని పెట్టుకుని దెబ్బలాడుకోవడం మంచిది కాదని భావించిన పెద్ద మనుషులందరూ శవాన్ని రామమందిరం పక్కనున్న అరుగు మీద దింపి చేయవలసిన కార్యక్రమాలన్నీ జరిపించారు. ఆ సంఘటన జరిగి చాలా ఏళ్లైనా వాళ్ల మనసుల్లో ఇంకా పచ్చిగానే కదలాడుతోంది. ఆ తర్వాత హరి ఏమయ్యాడో వాళ్లకు తెలియదు. మళ్లీ ఇనే్నళ్ల తర్వాత అటువంటి సమస్యనే రేపుతూ శివయ్య పంచాయితీ మొదలైంది.
ఒక్కసారిగా ఆలోచనల్లోంచి బయటికొచ్చిన రాఘవయ్య తల విదిలించి ‘ఒరేయ్ శివయ్యా.. ఎప్పుడో జరిగిపోయిన సంఘటనను పట్టుకుని భయపడడం అంత మంచిది కాదురా. కాలమెప్పుడూ ఒకేలా ఉంటుందా? అటువంటి సంఘటనలే మళ్లీమళ్లీ జరుగుతుంటాయా?’ అన్నాడు తుండుగుడ్డతో కళ్లు తుడుచుకుంటూ.
‘జరగాలని నేను కోరుకోవట్లేదయ్యా. జరుగుతాయని కూడా నేను చెప్పట్లేదు. ఒకవేళ నా విషయంలోనే అలా జరిగితే ఎలా ఉంటుందోననే నా బాధంతా. వాడి నుంచి నేనేమీ ఆశించట్లేదు. ఓపిక ఉన్నన్నాళ్లు ఏ పొలమో పుట్రో పండించుకుని నేనూ నా ముసల్దీ బతుకీడ్చేస్తాం. ఎవరూ తెలియని చోటుకెళ్లి గొప్పగా బతుకుతామో లేదో తెలియదు. కానీ ఎన్ని కష్టాలున్నా ఉన్న ఊర్లోనే ఉంటే మనసుకు నెమ్మదిగా ఉంటుందయ్యా. నేనుంటున్న ఇల్లు కట్టడానికి నా తల్లెంత కష్టపడిందో నేను కళ్ళారా చూశాను బాబూ.. ఇవ్వాళ నాతో మా అమ్మ లేకపోయినా నా ప్రాణమున్నంతవరకూ ఆ ఇల్లుంటే చాలు.. నాకింకేమీ వద్దు బాబూ.. రేపు మేము చచ్చిపోతే కర్మకాండలు జరిపించి వెళ్లమనండి బాబూ.. అదే ఈ జన్మకు పదివేలు..’ భుజం మీదున్న కండువాలో ముఖం దాచుకుని ఏడ్వసాగాడు శివయ్య.
పెద్దమనుషుల ముఖాలన్నీ విచారంగా వాలిపోయాయి. చుట్టూ చేరిన వాళ్లందరూ దిగాలుగా చూడసాగారు. గాలి కూడా స్తంభించిపోయింది. బ్రతికుండగా ప్రపంచాన్ని జయించిన మనిషి చేతులు పోయేటప్పుడు పిడికెడు మట్టి కూడా తీసుకెళ్లలేవు. అయినా బతుకంతా మట్టితోనే తాదాత్మ్యం చెందుతుంది. బంధాలూ బాంధవ్యాలన్నీ మట్టితోనే ముడిపడి ఉంటాయి. ప్రతీమనిషి వేదాంతాన్ని ఎన్నిసార్లు విన్నా ఒంటికి పట్టించుకోకుండానే జీవితాన్ని గడిపేస్తాడు. ఏదో సాధించానని భ్రమపడతాడు. గర్వపడతాడు. చివరికి పోయినప్పుడు మనిషి మీద చల్లిన చిల్లర కూడా తీసుకెళ్లకుండానే అంతిమయాత్ర మొదలవుతుంది. శవాన్ని గోతిలో దించాక మనిషి మీద మూడుసార్లు చల్లే పిడికెడు మట్టితో ముగిసిపోతుంది జీవితం. అయినా బ్రతికినన్నాళ్లూ వేటికోసమో ఆశపడుతూ, ఆరాటపడుతూ అందరితోనూ తెగతెంపులు చేసుకుంటాం. ఆలోచించేకొద్దీ ఆవేదనతో నిండిపోయింది రాజు మనసు. ఒక వస్తువును అమ్మడం, నచ్చిన దాన్ని కొనుక్కోవడం చాలా తేలికనుకున్నాడు. కానీ పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా అన్ని సందర్భాలలోనూ తోడుండే ఊరి సంబంధాలు ఎంత బలీయంగా ఉంటాయో కళ్లారా చూశాడు. ‘ఒక్కరి కోసం అందరూ’ అనే భావన ఊరి జనాల ఊపిరిలో ఎంతగా మమేకమవుతుందో ప్రత్యక్షంగా చూశాడు. స్వార్థబుద్ధితో వచ్చిన తనకు త్యాగబుద్ధిని నేర్పించిన అక్కడున్న పెద్దమనుషుల వంకా, దీనంగా నిల్చున్న తల్లిదండ్రుల వంకా చూస్తూ బరువెక్కిన గుండెతో ముందుకు నడిచాడు.
*

డా.జడా సుబ్బారావు.. 9849031587