రాష్ట్రీయం

కోడ్ దాటగానే జల విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12శాతం కొనసాగుతున్న వృద్ధిరేటు
ఒక విద్యా సంస్థకు రంగారెడ్డి పేరు
125వ జయంత్యుత్సవంలో కెసిఆర్ ప్రకటన
హైదరాబాద్, డిసెంబర్ 12: మండలి ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే తెలంగాణ జల విధానం ప్రకటించనున్నట్టు సిఎం కె చంద్రశేఖర్ రావు ప్రకటించారు. తెలంగాణలోని నీటిపారుదల ప్రాజెక్టులను రెండు మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మాజీ డిప్యూటీ సిఎం కెవి రంగారెడ్డి 125వ జయంత్యుత్సవ సభలో కెసిఆర్ మాట్లాడారు. రంగారెడ్డి కలలుగన్న తెలంగాణ సాకారమవుతుందన్నారు. నగరంలోని ముఖ్య ప్రాంతంలో కెవి రంగారెడ్డి విగ్రహం ఏర్పాటు చేస్తామని, ఒక విద్యాసంస్థకు ఆయన పేరు పెట్టనున్నట్టు ప్రకటించారు. సమైక్యపాలనలో తెలంగాణకు సాగునీరు లభించకుండా, వివాదాలు సృష్టించేలా ప్రాజెక్టులను రూపకల్పన చేశారని కెసిఆర్ విమర్శించారు. దాదాపు ఎనిమిది నెలలపాటు తానే స్వయంగా ఇరిగేషన్ ప్రాజెక్టులపై అధ్యయనం చేసినట్టు చెప్పారు. తెలంగాణకు సాగునీరు లభించేలా తెలంగాణ జల విధానం రూపకల్పన చేశామన్నారు. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే జల విధానం ప్రకటిస్తామన్నారు. ఆంధ్రలో కలిస్తే తెలంగాణ ఏవిధంగా నష్టపోతుందో రంగారెడ్డి ఆకాలంలోనే చెప్పారని, అదేవిధంగా విడిగా ఉండటంవల్ల కలిగే ప్రయోజనాలూ వివరించారన్నారు. తెలంగాణ కష్టాలనుంచి బయటపడుతోందని, ఆదాయం పెరుగుతోందని కెసిఆర్ గుర్తు చేశారు. రాష్ట్రంలో 12శాతం వృద్ధి రేటు కొనసాగుతోందన్నారు. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం 2019 నాటికి తెలంగాణ బడ్జెట్ లక్షా 60వేల కోట్లు ఉంటుందన్నారు. ఎప్పుడు కరెంటొస్తుందో, ఎప్పుడు పోతుందో తెలీని దశలోవున్న తెలంగాణ ఆ కష్టాలను పూర్తిగా అధిగమించిందన్నారు. తెలంగాణ అభివృద్ధికి నాలుగు ప్రధాన అంశాలపై దృష్టి సారిస్తున్నట్టు చెప్పారు. వీటిలో ఇప్పటికే విద్యుత్ సమస్యనుంచి గట్టెక్కామన్నారు. 2018నాటికి 25వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతుందని, దీని కోసం 91 వేల కోట్లు ఖర్చవుతుందని, నిధులు సమకూర్చకోవడం పూరె్తైందన్నారు.
రెండున్నరేళ్లలో మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికి తాగునీరు అందిస్తామన్నారు. ప్రభుత్వ ఖర్చుతోనే ఇంట్లో నల్లాద్వారా తాగునీరు ఇప్పిస్తామన్నారు. తండాలు, గ్రామాలు, పట్టణం ప్రతి ఇంటికీ తాగునీరు అందుతుందన్నారు. దేశమంతా మిషన్ భగీరథపై ఆసక్తి చూపుతోందని సిఎం అన్నారు. ఉత్తరప్రదేశ్, బెంగాల్

అధికారులు ఈ పథకం గురించి తెలుసుకున్నారని తెలిపారు. బిహార్ గవర్నర్ అసెంబ్లీలో ఈ పథకం గురించి ప్రస్తావించి, తమ రాష్ట్రంలోనూ ఇంటింటికి తాగునీరు అందిస్తామని చెప్పారని కెసిఆర్ వివరించారు. టిఎస్‌ఐపాస్ పేరిట పరిశ్రమలకు అనుమతికై తీసుకొచ్చిన కొత్త విధానం మంచి ఫలితాలిస్తోందన్నారు. ఈ పథకం కింద ఇప్పటికే 20వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు.
సంక్షేమ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, సమాజంలోని అన్నివర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పథకాలు అమలు చేస్తున్నట్టు చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 34వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్టు కెసిఆర్ తెలిపారు. చెవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కొండా వెంకటరంగారెడ్డి స్మారక సమితి, కుటుంబ సభ్యులు తదితరులు కార్యక్రమంలో మాట్లాడారు. (చిత్రం) కొండా వెంకటరంగారెడ్డి 125వ జయంతి వేడుకలను జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్