రాష్ట్రీయం

టార్గెట్ హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యాయస్థానం విభజనకై నిలదీయండి
విభజన చట్టం హామీలపై పట్టుపడదాం
ప్రాణహిత జాతీయ హోదాకు డిమాండ్
కరవు మండలాలకు 500 కోట్ల సాయం
పార్లమెంట్‌లో బలమైన వాణి వినిపించాలి
తెరాస పార్లమెంటరీ పార్టీ భేటీలో కెసిఆర్ సూచన

హైదరాబాద్, నవంబర్ 23: విభజన చట్టంలోని హామీలన్నింటినీ అమలు చేయాలని కోరుతూ పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్ణయించింది. సిఎం కెసిఆర్ అధ్యక్షతన సోమవారం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. అన్ని శాఖల కేంద్ర మంత్రులను కలిసి విభజన చట్టంలోని హామీల అమలుకు ప్రయత్నించాలని ముఖ్యమంత్రి సూచించారు. మంత్రుల స్పందననుబట్టి పార్లమెంటులో సమస్యలను ప్రస్తావించాలని, సమస్యల పరిష్కారానికి కేంద్రంపై ఎంపీలు ఒత్తిడి తేవాలని సిఎం సూచించారు. ఘర్షణ వైఖరికాకుండా సమస్యలకు పరిష్కారానికే ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తెలంగాణ ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర హక్కులను సాధించేలా ఎంపీలు కృషి చేయాలని కోరారు. సామరస్య పూర్వకంగానే తెలంగాణ డిమాండ్లపై సిఎం క్యాంపు కార్యాలయంలో పార్లమెంటరీ పార్టీ సమావేశం సోమవారం జరిగింది. విభజన చట్టంలోని వివిధ అంశాలపై కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న వాటి గురించి చర్చించారు. అనంతరం తెరాస భవన్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో ఎంపిలు కె కేశవరావు, జితేందర్‌రెడ్డి, బి వినోద్, బూర నర్సయ్య గౌడ్ , కొండా విశే్వశ్వర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. గత సమావేశాల్లోనూ హైకోర్టు విభజనపై పార్లమెంటు సమావేశాల్లో పట్టుపడితే చూస్తాం, చేస్తాం అంటూ తప్పించుకున్నారని, ఈసారి జరిగే సమావేశాల్లో విభజనపై పట్టుపడతామని ఎంపీలు తెలిపారు. విభజన జరిగి ఏడాదిన్నర కావస్తున్నా ఇంతవరకు హైకోర్టు విభజన జరగలేదని, దీనిపై పార్లమెంటులో నిలదీస్తామన్నారు. ఈనెల 26, 27 తేదీల్లో హోంమంత్రిని, న్యాయశాఖ మంత్రిని కలిసి హైకోర్టు విభజన గురించి ప్రశ్నిస్తామని, అక్కడ లభించే స్పందనబట్టి పార్లమెంటులో ఏంచేయాలో నిర్ణయించుకుంటామని చెప్పారు. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయహోదా కోసం డిమాండ్ చేస్తామన్నారు. తెలంగాణలోని పలు మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నాయని, ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపుతోంది. కరవు ప్రాంతాల్లో తక్షణ సహాయం కోసం ఐదువందల కోట్లు విడుదల చేయాలని, నివేదిక తరువాత కేంద్ర బృందాన్ని పంపాలని కోరనున్నట్టు చెప్పారు. రైతాంగాన్ని ఆదుకోవడానికి కేంద్రం ముందుకు రావాలని కోరారు. స్మార్ట్‌సిటీల పేరుతో ఒక్కో నగరానికి వంద కోట్లు మాత్రమే కేటాయించడం సరికాదన్నారు. ముంబై ఆదాయం 30 వేల కోట్ల రూపాయలు, బెంగళూరు ఆదాయం ఏడువేల కోట్లు, హైదరాబాద్ ఆదాయం నాలుగువేల కోట్ల రూపాయలని, ఇలాంటి నగరాలకు స్మార్ట్‌సిటీ పేరుతో వంద కోట్లే ఇవ్వడం అవహేళన చేయడమేనన్నారు. స్మార్ట్ సిటీలకు కేటాయించే నిధులు పెంచాలని పార్లమెంటులో కోరుతామని చెప్పారు. ఐటిఐఆర్‌ను హైదరాబాద్‌కు కేటాయించినట్టు గతంలో కేంద్రం ప్రకటించిందని, వేలకోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని, కానీ కేంద్రం ఈ ప్రాజెక్టుపై శ్రద్ధ చూపడం లేదని ఎంపీలు తెలిపారు. ఐటిఐఆర్ కోసం పార్లమెంటులో ప్రశ్నించనున్నట్టు చెప్పారు. ఐటిఐఆర్‌కు ఇప్పటి వరకు 30 కోట్ల రూపాయలు కూడా వ్యయం చేయలేదని చెప్పారు. కేంద్రంలో ఒబిసి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని గతంలోనే డిమాండ్ చేశామని, మరోసారి ప్రశ్నించనున్నట్టు చెప్పారు. ఈనెల 26, 27 తేదీల్లో రెండు రోజుల పాటు రాజ్యాంగంపైనే చర్చ జరుగుతున్న సందర్భంలో ఓబిసి మంత్రిత్వ శాఖ గురించి ప్రశ్నిస్తామని ఎంపీలు తెలిపారు. ప్రాణహిత చేవెళ్ల జాతీయ హోదా కోసం పట్టుపడతామన్నారు. తెలంగాణలో జాతీయ రహదారుల కోసం డిమాండ్ చేయనున్నట్టు చెప్పారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయడంలో కూడా కేంద్రం వివక్ష చూపడం సరికాదని, ఇదే అంశాన్ని ప్రశ్నించాలని నిర్ణయించారు. కొత్త రాష్ట్రానికి ఇవ్వాల్సిన రాయితీలు, మంజూరు చేయాల్సిన నిధులు మంజూరు చేయాలని కోరారు.
(చిత్రం) పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలతో చర్చిస్తున్న సిఎం కెసిఆర్