కడప

అధికారపార్టీ నేతలను ఆశ్రయిస్తున్న కాల్‌మనీ మాఫియా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,డిసెంబర్ 16: జిల్లాలో కాల్‌మనీ వ్యవహారం సంచలనం రేకెత్తిస్తున్న తరుణంలో కొందరు అధికారపార్టీ నేతలు, పోలీసు అధికారులకు ఈ పరిణామం ఊహించని వరంలా మారింది. అధర్మవడ్డీతో కోట్లరూపాయలు ఆర్జించిన కాల్‌మనీ జలగలు ఊబి నుంచి బయటపడేందుకు అధికారపార్టీ నేతలను ఆశ్రయిస్తూ వారి ఇళ్లచుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది కూడా కాల్‌మనీ జలగలకు వత్తాసు పలుకుతూ ఈ పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నట్లు తెలుస్తోంది. కాల్‌మనీ నిందితులకు మద్దతు ఇస్తే బాధితుల ద్వారా వ్యవహారం బయటపడితే తాము ఇరుక్కోవాల్సి వస్తుందని ఆచితూచి అడుగులువేస్తున్నట్లు తెలిసింది. గురువారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో చాలామంది నేతలు రాజధానికి పయనమై వెళ్లారు. కొంతమంది చోటామోటా నేతలు , కొంతమంది పోలీసు అధికారులు బాధితులను ఒప్పించి సెటిల్‌మెంట్ చేసుకునేలా రెండురోజులుగా తీవ్ర కసరత్తు చేస్తున్నారు. బాధితులు తాత్కాలికంగా రాజీకి వచ్చినా భవిష్యత్‌లో తమపై కక్షసాధింపులు ఉంటాయని భయపడి కేసులపై సమాలోచనలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 100 మందిని పైబడి కాల్‌మనీ నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి పెద్ద ఎత్తున డాక్యుమెంట్లు, నగదు స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. మంగళవారం నామమాత్రంగా కేవలం 12మందిని అరెస్టుచూపి రూ.18లక్షలు నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకుని రూ.2.69కోట్లు విలువచేసే 630 ప్రామిసరీ నోట్లను ఇండ్లస్థలాలను డాక్యుమెంట్లను అధికారికంగా చూపించారు. మిగిలిన వారందరినీ విచారణ పేరుతో ఆయాస్టేషన్లలోనే ఉంచారు. వారిని విడిపించేందుకు రకరకాలుగా పోలీసులకు వత్తిళ్లు వస్తున్నాయి. కాల్‌మనీ వ్యాపారులు సగానికి పైబడి పలువురు పోలీసు అధికారులతో ఇదివరకే టచ్‌లో ఉన్నవారు కావడంతో వారికి రాచమర్యాదలు చేస్తూ తూతూమంత్రంగా విచారణ చేసి వదిలివేస్తున్నారు. ప్రస్తుతం కాల్‌మనీ వ్యాపారస్తుల నుంచి సేకరించిన వివరాలు , డాక్యుమెంట్ల ప్రకారం అనధికారికంగా రూ.100కోట్లు పైబడే జిల్లాలో వడ్డీ వ్యాపారం జరిగినట్లు తెలుస్తోంది. కడప కేంద్రంగా అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లోనూ, మండల కేంద్రాల్లోనూ వందలాది కుటుంబాలు కాల్‌మనీని ఓ వ్యాపారంగా నిర్వహిస్తూ వస్తున్నారు. చిరు వ్యాపారులు, రైతులు, జూదరులకు రూ.10 లు నుంచి రూ.20లు వడ్డీతో కాల్‌మనీ వ్యాపారులు అప్పులు ఇస్తున్నట్లు తెలుస్తోంది. పురపాలక సంఘాలు, ఆర్టీసి, రైల్వే తదితర ప్రభుత్వశాఖల సిబ్బందికి కూడా రూ.10లు వడ్డీకిపైబడే కాల్‌మనీ వ్యాపారులు వడ్డీకి ఇస్తున్నట్లు సమాచారం. జీతం పడిన మరుక్షణమే కాల్‌మనీ వ్యాపారులు బాధితుల వద్దకు వెళ్లి నిలువుదోపిడీ చేస్తున్నారు. ఇదిలాఉండగా అధికారపార్టీ నేతలు ప్రత్యక్షంగా కాల్‌మనీ వ్యాపారులకు మద్దతు పలికితే ఇబ్బందులు ఎదురవుతాయని భావించి, కొందరు పోలీసు అధికారుల ద్వారా సెటిల్‌మెంట్ చేయించి పంపుతున్నట్లు తెలుస్తోంది. కాల్‌మనీ వ్యాపారులు ప్రతిపక్ష పార్టీకి చెందిన వారైతే అధికారపార్టీ నేతలే స్వయంగా పోలీసులపై వత్తిడి తెచ్చి కేసు నమోదుచేయాలని వత్తిడి తెస్తున్నారు. దీంతో కొంతమంది ప్రతిపక్ష పార్టీకి చెందిన చోటానాయకులు సైతం చేసేదిలేక అధికారపార్టీ నేతల ఇళ్లచుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రాజీమార్గం ద్వారా నాలుగురాళ్లు వెనకేసుకునే అవకాశం లభించడంతో పోలీసులు సైతం గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారాన్ని చక్కబెడుతున్నారు. బేరం కుదరిని కేసుల్లో మాత్రం వ్యాపారులను ఇరికిస్తూ కేసు నమోదు చేస్తున్నారు. మొత్తమీద కాల్‌మనీ వ్యాపారుల వ్యవహారాన్ని పోలీసులు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే తప్ప బాధితులకు న్యాయం జరిగే అవకాశం కన్పించడం లేదు.
టిడిపి కేడర్‌లో అసహనం
ఆంధ్రభూమి బ్యూరో
కడప,డిసెంబర్ 16: అధికార తెలుగుదేశం పార్టీ అధిష్టానం అనాలోచిత వైఖరి ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులను తీవ్ర అసహనానికి గురిచేస్తోంది. వైకాపా అధినేత వైఎస్ జగన్ సొంత జిల్లాలో ఆయనను దెబ్బతీయాలన్న ఏకైక లక్ష్యంతో టిడిపి అధిష్టానం పావులు కదుపుతోంది. ఈ వైఖరితో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నంచి పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న వారు ఆవేదనకు గురవుతున్నారు. ముఖ్యంగా వివిధ నియోజకవర్గాల్లోని ద్వితీయ,తృతీయ శ్రేణి నాయకత్వం పరిస్థితి అయోమయంగా తయారైంది. పదేళ్లపాటు ప్రత్యర్థులకు ఎదురొడ్డి పోరాడి ఆస్తులు, కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న తమను సంప్రదించకుండా ఎవరిని పడితే వారిని పార్టీలోకి చేర్చుకుంటే తమ పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు కూడా అధిష్టానం ఇదే వైఖరి అవలంభించింది. పార్టీలో ఏళ్లతరబడి పనిచేస్తున్న వారిని కాదని ఫలానావారు బలమైన వారంటూ వలస నేతలకు టిక్కెట్లు ఇచ్చారు. సర్వేల పేరుతో పార్టీలో పనిచేస్తున్న వారిని కాదని వలసనేతలకు టిక్కెట్లు ఇచ్చినా గత ఎన్నికల్లో జిల్లాలో కేవలం ఒకేఒక సీటు మాత్రమే టిడిపి గెలవగలిగింది. ఇంతజరిగినా దేశం అధిష్టానానికి కనువిప్పు కలగలేదు. వైకాపాకు చెందిన ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌లో అంతో ఇంతో పరపతి కలిగిన సీనియర్ నేతలకు గాలం వేస్తున్న అధిష్టానం కేడర్ మనోభావాలను ఏ మాత్రం పట్టించుకోవడంలేదు. ఈ పరిస్థితి జిల్లాలో పార్టీకి ఏమాత్రం మంచిదికాదని సీనియర్ నేతలు మొత్తుకుంటున్నా అధిష్టానం పెడచెవిన పెడుతోంది. ఎన్నికల్లో వ్యతిరేకంగా పనిచేసి కేవలం తమ రాజకీయ స్వార్థం కోసం పనిచేసిన వారిని రెడ్‌కార్పెట్‌తో ఆహ్వానించడాన్ని కేడర్ జీర్ణించుకోలేక పోతోంది. మరో మూడేళ్లవరకు ఎన్నికలు లేకపోవడంతో ప్రతిపక్షంలో ఉండి సాధించేదేమీ ఉండదనుకుంటున్న నేతలు మాత్రమే సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి వారు వచ్చినా, రాకపోయినా అట్టడుగుస్థాయిలో తెలుగుదేశం పార్టీకి కొత్తగా ఒరిగేదేమీ ఉండదు. ఇదిలావుంటే టిడిపి అధిష్టానం ఆలోచన మాత్రం మరోలా ఉంది. జగన్ సొంత జిల్లాలో వైకాపాను దెబ్బకొడితే రాష్టవ్య్రాప్తంగా ఆ పార్టీని బలహీనపర్చవచ్చన్నది వారి అంతరంగంగా ఉంది. ప్రస్తుతం జిల్లాకు చెందిన ఇద్దరు వైకాపా ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌పార్టీకి చెందిన రాష్ట్ర మాజీ మంత్రి ఒకరు టిడిపిలో చేరేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. వారు టిడిపిలోకి వస్తే తమ రాజకీయ భవిష్యత్ ఏమిటని, ఎప్పటినుంచో ఉన్న కేడర్‌కు ఏమని సమాధానం చెప్పాలని పార్టీ సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. పార్టీనుంచి బయటకువెళ్తే తిరిగి టిడిపిలోకి వచ్చే వలసనేతల వేధింపులకు గురికావాల్సి వస్తుందని భావిస్తున్న టిడిపి శ్రేణులు తమ పరిస్థితి ముందునుయ్యి, వెనుకగొయ్యిగా మారిందని వాపోతున్నారు. కొంతమంది మాత్రం తమ నాయకుడికి అన్యాయం జరిగితే తాము పార్టీలో కొనసాగినా విలువ ఉండదని, నాయకుడు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటామని చెబుతున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో ప్రస్తుతం ఇదే విషయమై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. వివిధ మండలస్థాయి నేతలంతా వైకాపా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇప్పటికే తీర్మానం చేసి అదిష్టానానికి పంపించారు. సుదీర్ఘకాలంగా పార్టీని వెన్నంటి ఉన్న కేడర్ మాటకు విలువ ఇస్తారో, కేవలం రాజకీయ వ్యూహానికి పార్టీశ్రేణులను బలిపెడతారో కాలమే నిర్ణయించాల్సి ఉంది.
మరుగుదొడ్ల నిర్మాణంలో జిల్లా వెనుకంజ!
ఆంధ్రభూమి బ్యూరో
కడప, డిసెంబర్ 16: స్వచ్చ్భారత్, నవ్యాంధ్ర అంటూ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం చేస్తుండగా, జిల్లాలో మాత్రం ఆ కార్యక్రమాలు ప్రచారానికే పరిమితమయ్యాయి. స్వచ్చ్భారత్ అభియాన్ కింద గ్రామీణ నీటి పారుదలశాఖ , పారిశుద్ద్య శాఖలచే చేపట్టాల్సిన మరుగుదొడ్ల నిర్మాణంలో రాష్ట్రం మొత్తమీద జిల్లా వెనుకబడి ఉంది. మరుగుదొడ్ల నిర్మాణంలో ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు, ఎంపిడివోలు కీలక పాత్ర వహించాల్సివుండగా సంబంధితశాఖల సమన్వయ లోపంతో నత్తనడకన నిర్మాణాలు సాగుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 73వేల 199 మరుగుదొడ్లు నిర్మించాలని లక్ష్యంకాగా, ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 7వేల లోపే నిర్మాణాలు జరిగాయి. వాటిలో కూడా కొన్ని పాక్షికంగా నిర్మాణాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్క మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12వేలు, రూ.15వేలు చొప్పున ప్రభుత్వం విడుదల చేస్తోంది. జిల్లావ్యాప్తంగా 790 పంచాయతీల్లో 43 గ్రామపంచాయతీలను జిల్లా నీటియాజమాన్య సంస్థకు బాధ్యతలు అప్పగించగా, అక్కడ నిర్మాణాలు పురోగతిలో ఉన్నాయి. ఆర్‌డబ్ల్యుఎస్ , ఎంపిడివోల ఆధ్వర్యంలో లబ్దిదారులు మరుగుదొడ్డి నిర్మించుకున్నా సకాలంలో బిల్లులు చెల్లించడంలేదు. ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు మరుగుదొడ్డి నిర్మాణంపై రికార్డు రాసిస్తే ఎంపిడివోలు బిల్లులు చెల్లించాల్సివుంది. అయితే పలువురు ఎంపిడివోల నిర్లక్ష్యం కారణంగా ఆర్‌డబ్య్లుఎస్ అధికారులు, సిబ్బంది బలిపశువులవుతున్నారు. లక్ష్యాన్ని చేరనందుకు ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులకు గత మాసంలో జీతాలు కూడా నిలిపివేశారు. జిల్లావ్యాప్తంగా 50మంది ఎంపిడివోలు, ఆర్‌డబ్య్లుఎస్ కింద 50మంది ఏఇలు, 9మంది డిఇలు, ముగ్గురు ఇఇలు పనిచేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా లబ్దిదారుల ఇళ్లచుట్టూ తిరిగి మరుగుదొడ్లు నిర్మించుకోవాలని బతిమలాడే పరిస్థితులు ఏర్పడ్డాయి. వర్క్ ఇన్‌స్పెక్టర్లు గ్రామాల్లో తిష్టవేసి లబ్దిదారుల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రజల్లో సరైన చైతన్యం లేక కొంతమంది, మరుగదొడ్లు నిర్మించుకునేందుకు స్థలాలు లేక మరికొందరు, మరుగుదొడ్ల నిర్మాణాలకు పెట్టుబడి పెట్టలేక ఇంకొందరు మరుగుదొడ్డి నిర్మించుకోలేకపోతున్నారు. నిర్మాణాలు పూర్తయినా ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు బిల్లులకు సిఫార్సు చేసినా ఎంపిడివోలు లబ్దిదారులను కార్యాలయం చుట్టూ తిప్పుకుంటూ బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో మరుగుదొడ్ల నిర్మాణాల్లో జాప్యం జరుగుతోంది. ఇప్పటికైనా అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాకు కేటాయించిన లక్ష్యాన్ని అధిగమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

జియోటాగ్‌తో అధికారుల గుండెల్లో రైళ్లు
ఆంధ్రభూమి బ్యూరో
కడప, డిసెంబర్ 16: పదేళ్లక్రితం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో జిల్లా రాష్ట్రంలోనే ప్రధమస్థానంలో నిలచింది. అయితే అక్రమాలు కూడా అంతేస్థాయిలో జరిగినట్లు తాజాగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన జియోట్యాగింగ్ విధానంలో బయల్పడుతోంది. రెండున్నర లక్షల ఇళ్లనిర్మాణాల్లో 40వేల ఇళ్లు పక్కదారి పట్టినట్లు అధికారులు తేల్చారు. దీనికి సంబంధించి ఇప్పటికే 10మంది అధికారులపై వేటుపడింది. జియోట్యాగింగ్ పద్దతి అమలులోకి రావడంతో అక్రమాల చిట్టా ఒక్కొక్కటిగా బయటపడుతోంది. జిల్లాలో అధికశాతం పులివెందుల, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో ఈ అక్రమాలు చోటుచేసుకున్నాయి. తాజాగా కేంద్రప్రభుత్వం అందరికీ ఇళ్లు పథకాన్ని రాష్ట్రప్రభుత్వం ఎన్‌టిఆర్ స్వగృహ పేరుతో ఇళ్లపథకాన్ని ప్రవేశపెట్టింది. జిల్లాకు 10వేల 500 ఇళ్లు ఎన్‌టిఆర్ పథకం కింద మంజూరు కాగా, కేంద్రప్రభుత్వం జిల్లాకు 6వేల 300 ఇళ్లను మంజూరు చేసింది. అయితే ఈ ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యేవరకు అనుమానమేనని అధికారులు చేతులెత్తేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఇళ్లు తీసుకున్నవారు మళ్లీ దరఖాస్తులు చేస్తుండటం, అధికారపార్టీ నేతలతో వత్తిడి తెస్తుండటంతో అధికారులు తలలపట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఒక్కో గృహానికి రూ.2లక్షల 70వేలు ఇస్తుండటంతో ఈ ఇళ్లపై అధికారపార్టీ కార్యకర్తల కన్నుపడింది. అధికారపార్టీ వత్తిళ్లకు తలొగ్గితే కొత్త టెక్నాలజీ ప్రకారం వెంటనే అక్రమాలు బయల్పడే అవకాశముంది. దీంతో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జాప్యమవుతోంది. ఒకపక్క అధికారపార్టీ నేతల వత్తిళ్లు, మరోపక్క జియోట్యాగింగ్ పద్ధతితో ఏంచేయాలో పాలుపోక అధికారులు సతమతమవుతున్నారు.
పేదల బతుకుల్లో కాల్‌మనీ కల్లోలం!
ప్రొద్దుటూరు, డిసెంబర్ 16: పట్టణంలో పేదల బతుకులు కార్పొరేషన్ వడ్డీలపై ఆధారపడి ఉన్నాయి. ఇక్కడ రోజువారీ వసూళ్లతో వడ్డీ వ్యాపారం దందా నడుస్తోంది. అవసరాలకొద్దీ వడ్డీరేటు నిర్ణయించి ముందస్తుగానే ఇచ్చిన ఇప్పుకు వడ్డీ తీసుకుంటున్నారు. రోజువారీ కలెక్షన్ల (కార్పొరేషన్)తో వడ్డీ వ్యాపారస్తులు పేదల బతుకులపై జలగల్లా రక్తం పీల్చుతున్నా పట్టించుకొనేవారు లేరు. కొంతమంది ఇదేపనిగా కార్పొరేషన్ వడ్డీని నడుపుతున్నారు. నూటికి పదిరూపాయల వంతున వడ్డీలు చెల్లించాలంటే ఆ పేదోనిపై భారం ఎలావుంటుందో ఇట్టే తెలుసుకోవచ్చు. అవసరానికి కార్పొరేషన్ వడ్డీ కింద వెయ్యిరూపాయలు ఇస్తే అందులో వందరూపాయలు వడ్డీ కింద ముందస్తుగా తీసుకుని రోజువారీ కలెక్షన్లు నడుస్తున్నా వీటిగురించి పట్టించుకొనేవారు లేరు. వీరి దందాకు కళ్లెం వేసేవారే కరువయ్యారు. రోజువారీ కూలీలు మొదలుకొని చిన్నచిన్న చిరు వ్యాపారులు సైతం రోజువారీ కార్పొరేషన్ వడ్డీకి తెచ్చుకుంటేగానీ వారి జీవనం సాగలేనిస్థితి. దీనిని అలుసుగా తీసుకొని చాలామంది కార్పొరేషన్ వడ్డీ వ్యాపారస్తులు ప్రొద్దుటూరులో తయారయ్యారు. దినసరి కూలీలు మొదలుకొని చిరు వ్యాపారస్తులకు రోజువారీ వడ్డీ కింద రూ.1000 నుంచి రూ.10 వేల వరకు వారి స్తోమతకు తగ్గట్టుగా అప్పులు ఇచ్చుకొని రోజువారీ వసూళ్లు చేస్తున్నారు. బంగారు నగల తాకట్టు కూడా రోజువారీ వడ్డీని గుంజుతున్నా వారి వ్యాపారానికి అడ్డూ, అదుపూ లేకుండా పోతోంది. కొంతమంది వారి ఆస్తులను తాకట్టుపెట్టిమరీ నూటికి మూడు నుంచి ఐదురూపాయల వరకు వడ్డీని గుంజుతున్నారు. ఏ వ్యాపారంలో రాని రాబడి కార్పొరేషన్, వడ్డీ, సాధారణ వడ్డీ వ్యాపారస్తులు ఆర్జిస్తున్నారంటే ఆశ్చర్యపోనవసరం లేదు. యధేచ్చగా సాగుతున్న ఈ వడ్డీ వ్యాపారం పేద, మధ్యతరగతి కుటుంబాలకు పెను భారంగా నిలుస్తోంది. ఆ వడ్డీనే కట్టేందుకు వారి జీవితాలను ఫణంగా పెడుతున్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని సామాన్యుడి పరిస్థితి ఇలా వడ్డీ వ్యాపారస్తుల కింద నలిగిపోతున్నారు. కార్పొరేషన్ వడ్డీకింద అప్పు తీసుకున్న రుణగ్రహీత రోజువారీ డబ్బులు నాలుగైదురోజులు చెల్లించకపోతే గుండాగిరీ, రౌడీయిజం చేసి ముక్కుపిండి ఆ డబ్బును వసూలు చేస్తున్న వైనం అందరికీ తెలిసిందే. ఈ కాల్‌మనీ భూతం అంతం కావాలంటే కార్పోరేషన్, అధిక వడ్డీ, తాకట్టు వడ్డీదారుల నడ్డి విరుస్తేతప్ప పేదల బతుకులు సజావుగాసాగవనేది నగ్నసత్యం. అయితే ఈ వడ్డీ వ్యాపారాలకు అడ్డూఅదుపూ లేకుండాపోవటం, చితికిన బతుకులకు ఎక్కడా అప్పు దొరకకపోతే డబ్బులు వసూలు చేయడంలో వారు ఎంత చెడ్డవారైనా తెలిసి కూడా గత్యంతరంలేని పరిస్థితుల్లో అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు పట్టణంలో పుట్టగొడుగుల్లా వెలిసినా సామాన్యుడికి రుణం అందకపోవడంతోనే ఈ అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఆయా బ్యాంకుల్లో రుణం పొందాలంటే బడాబాబులు, కొద్దిగా పరపతివున్న వారికే రుణాలు దక్కుతున్నాయి. సామాన్యుడికి రుణాలు ఇచ్చే పరిస్థితుల్లో బ్యాంకులు లేకపోవడంతో ఈ అధిక వడ్డీ, కార్పోరేషన్ వ్యాపారస్తుల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండాపోతున్నాయి.
వడ్డీ వ్యాపారస్తుల గుండెల్లో రైళ్లు
రాజంపేట: కాల్‌మనీ వ్యవహారం చిలికిచిలికి గాలివానగా మారి రాష్టవ్య్రాప్త చర్చానీయాంశంగా మారడంతో రాజంపేట డివిజన్ పరిధిలోని వడ్డీ వ్యాపారస్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. చాలామంది వడ్డీ వ్యాపారస్తులు ప్రభుత్వ నిబంధనల మేరకు వడ్డీ వ్యాపారం చేసేందుకు అవసరమైన అనుమతులు లేకుండానే నిర్వహిస్తున్నారు. ప్రజావసరాలను దృష్టిలో ఉంచుకొని న్యాయపరంగా వడ్డీ వ్యాపారంచేసే వారితో పాటు అధికంగా వడ్డీ వసూలుచేసే వ్యాపారం వారు కూడా ఉన్నారు. కాల్‌మనీ వ్యవహారం రాష్ట్రంలో ప్రస్తుతం ప్రాధాన్యాతాంశంగా మారడంతో సహజంగానే వడ్డీ వ్యాపారంచేసే వారిలో ఆందోళన కనిపిస్తుంది. కాగా కాల్‌మనీ వ్యవహారంపై రాష్ట్ర వ్యాపితంగా పోలీసు నిఘా పెరగడంతో అధికంగా వడ్డీలు వసూలుచేసే వ్యాపారస్తులు ఎప్పుడు ఏమి జరుగుతుందో అన్న భయాందోళనలకు గురవుతున్నారు. డివిజన్ పరిధిలో రకరకాల పద్దతుల్లో వడ్డీ వ్యాపారం సాగుతున్నది. రోజువారీ వడ్డీ మొదలు నెలవారీ వడ్డీ పద్దతిలో వడ్డీ వ్యాపారం సాగుతున్నది. ఇందులో బంగారం పెట్టుకొని వడ్డీలు ఇచ్చే వారి మొదలు, ఆస్తులు రిజిస్టర్ చేసుకొని వడ్డీకి రుణం ఇచ్చే పద్దతితో పాటు ష్యూరిటీ పద్దతిలో రుణం ఇచ్చే వరకు వడ్డీ వ్యాపారం సాగుతుంది. రెగ్యులర్‌గా వడ్డీలకు డబ్బులు తీసుకునే వారి విషయంలో వడ్డీ వ్యాపారస్తులు కొంత వరకు ఉదారంగానే వ్యవహరిస్తున్నారు. ఎలాంటి ష్యూరిటీలు లేకుండా నమ్మకంపై కూడా వడ్డీకి రుణం ఇస్తుండడం జరుగుతుంది. ముఖ్యంగా కాంట్రాక్టు వ్యాపారంచేసే వారితో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారంచేసే వారికే అధిక మొత్తంలో రుణం అవసరమవుతొంది. ఇలాంటి వారు తమకు తోచిన పద్దతుల్లో రుణం తీసుకుంటుండడం జరుగుతుంది. అయితే దిన కూలీలు, కార్మిక కుటుంబాలు తమ అవసరాలకు 5వేల మొదలు 10, 20 వేల వరకు రుణం తీసుకునే వారే అధికవడ్డీలు చెల్లించక తప్పనిసరి పరిస్థితిని ఎదుర్కొంటుండడం జరుగుతుంది. ఏదిఏమైనా కాల్‌మనీ వ్యవహారంతో వడ్డీలకు కూడా రుణం దొరికే పరిస్థితులు కష్టమవుతాయన్న ఆందోళన రుణాలు అవసరమైన వారు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటివరకు రుణాలు ఇస్తూ వ్యాపారం సాగిస్తున్న వడ్డీ వ్యాపారస్తుల్లో కూడా కాల్‌మనీ ప్రకంపనల ప్రభావం కనిపిస్తుంది.
వైకాపాకు వత్తాసు పలుకుతున్న కమిషనర్
కడప (టౌన్), డిసెంబర్ 16: పదవి ముఖ్యంకాదని, ప్రజలకు న్యాయం చేయలేని పక్షంలో తన పదవికి రాజీనామా చేయడానికైనా సిద్దమేనని కడప నగరపాలక సంస్థ 50వ డివిజన్ కార్పొరేటర్ ఇ.సుజాత బుధవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రజలకోసం అహర్నిశలు పాటుపడుతూ నిద్రాహారాలు మాని రాష్ట్ర శ్రేయస్సు కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతులకు రుణమాఫీ, చంద్రన్న కానుక, రంజాన్ తోఫా, ఎన్‌టిఆర్ ఆరోగ్యశ్రీ, డ్వాక్రా రుణమాఫీ, పెన్షన్, మరుగుదొడ్లు తదితర పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. అయితే తాము అధికారంలో ఉండి కూడా ప్రజలకు ఎటువంటి న్యాయం చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. కార్పొరేషన్ కమిషనర్ చంద్రవౌళీశ్వరరెడ్డి కేవలం వైకాపా కార్పొరేటర్లకు వత్తాసుపలుకుతున్నారని, టిడిపి వారికి సహకరించడం లేదన్నారు. దీంతో ప్రజలంతా టిడిపి కార్పొరేటర్లను నిలదీస్తున్నారన్నారు. జిల్లా నాయకత్వం కార్పొరేటర్లను పట్టించుకున్న పాపాన లేదన్నారు. ముఖ్యమంత్రి జిల్లా సంక్షేమం గురించి చొరవచూపుతున్నా జిల్లా నాయకత్వం కార్యకర్తలను మరిచి కేవలం పబ్లిసిటీ మీదనే దృష్టిపెడుతున్నారని విమర్శించారు. సిఎం ప్రవేశపెట్టిన జన చైతన్య యాత్రలో నగరంలో 50డివిజన్లు ఉండగా, 4డివిజన్లలో మాత్రమే జన ఇంటింటికీ తిరిగారన్నారు. 46 డివిజన్లలో టిడిపి జెండా ఆవిష్కరించడం , ఫోటోలకే పరిమితమయ్యారన్నారు. కార్యకర్తలు, కార్పొరేటర్లు, ఎంపిటిసి, జెడ్పిటిసిల బాగోగులను, వారి సమస్యలను పట్టించుకునే వారే టిడిపిలో కరువయ్యారన్నారు. తాను ప్రజలకు న్యాయం చేయలేని పక్షంలో రాజీనామాకు సైతం సిద్ధంగా ఉన్నానని సుజాత పేర్కొన్నారు.
వైవియులో మెగా స్వచ్చ్భారత్
కడప (కల్చరల్), డిసెంబర్ 16: యోగివేమన విశ్వవిద్యాలయంలో బుధవారం మెగా స్వచ్చ్భారత్ కార్యక్రమంలో భాగంగా ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఉన్న పిచ్చిమొక్కలు తొలగించి సుందరంగా తీర్చిదిద్దారు. 500 మంది విద్యార్థులు పిఆర్వో ఈశ్వరరెడ్డి సమన్వయంతో ఎన్‌ఎస్‌ఎస్ కో-ఆర్డినేటర్ డా.రామప్రసాద్‌రెడ్డి, ప్రిన్సిపల్ ఆచార్య జయపాల్ గౌడ్, రిజిస్ట్రార్ డా.నజీర్ అహ్మద్‌లతోపాటు కడప నగరంలోని శ్రీహరిడిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, విశ్వవిద్యాలయంలోని తెలుగు, హిస్టరీ, జుయాలజి, పొలిటికల్ సైన్స్ , మ్యాథమ్యాటిక్స్, సైన్స్ శాఖలకు చెందిన విద్యార్థులు, అధ్యాపకులు స్వచ్చందంగా పాల్గొన్నారు.
శానిటేషన్, మంచినీటి సరఫరాపై ఆర్‌డి సమీక్ష
కడప (టౌన్), డిసెంబర్ 16: శానిటేషన్, మంచినీటి సరఫరా పనితీరుపై రాయలసీమ పరిధిలోని 25 మున్సిపాల్టీల అధికారులతో బుధవారం కడప నగరపాలక సంస్థ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి రాయలసీమ మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ విజయలక్ష్మి ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమృత్‌కు ఎంపికకాని రాయలసీమ పరిధిలోని 25 మున్సిపాల్టీల కమిషనర్లు, చైర్‌పర్సన్లు, ఇంజనీరింగ్ అధికారులతో ఆమె సమావేశమయ్యారు.
ఏపియుఎఫ్‌ఐడిసి ద్వారా అమృత్‌కు ఎంపిక కాని మున్సిపాల్టీల్లో 70శాతం నిధులను ప్రభుత్వం భరిస్తుందని, 30శాతం మున్సిపాల్టీలే భరించాల్సి వుంటుందన్నారు. ప్రధానంగా ఈ పథకంలోకి తాగునీటి సమస్య, శానిటేషన్, స్వచ్చాంధ్ర కార్యక్రమాలకు నిధులు మంజూరవుతాయని ఆమె తెలిపారు.