కడప

ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధనే ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,సెప్టెంబర్ 24: ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధనే ప్రభుత్వ ధ్యేయమని, వ్యక్తిగత శ్రద్ధతో రోగాలు వ్యాపించకుండా చూసుకోవాలని కలెక్టర్ కెవి సత్యనారాయణ పేర్కొన్నారు. శనివారం స్థానిక స్టేట్ గేస్టు హౌస్ నుంచి పాత కలెక్టర్ కార్యాలయం వరకు దోమలపై దండయాత్ర- పరిసరాల పరిశుభ్రత అనే అంశంపై ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిందన్నారు. జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో దోమలు వ్యాప్తిచెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాటి వల్ల అనేక వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. ఈదోమలను నిర్మూలించి ప్రజల ఆరోగ్యాన్ని ఆకాంక్షిస్తూ ఈ దండ యాత్ర కార్యక్రమాన్ని వాడవాడలా చర్యలు చేపడుతున్నామన్నారు. వైద్య ఆరోగ్యశాఖ, మున్సిపల్ కార్పొరేషన్, పంచాయతీరాజ్ శాఖల ద్వారా దోమల నివారణకు మురికివాడల్లో స్ప్రే చేస్తున్నామని, ఎక్కడ మురికినీరు ఉంటుందో ఆ ప్రాంతాల్లో బ్లీచింగ్, డిటిపి పౌడర్ తదితర క్రిమిసంహారక మందులు స్ప్రేచేస్తున్నామన్నారు. ప్రజలు కూడా బాధ్యతతో ఎక్కడ నీరు నిల్వవుండకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. దోమల నివారణపై గ్రామ గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగే విధంగా చర్యలు చేపట్టామన్నారు. నివాసిత ప్రాంతాల్లో దోమలు నివారించే దిశగా చర్యలు తీసుకున్నామని ఇప్పటి వరకు జిల్లాలో 12 డెంగ్యు కేసులు గుర్తించామని ఈవ్యాధి మరింత ప్రబలకుండా ప్రణాళికాబద్దంగా చర్యలు చేపట్టామన్నారు. జిల్లా వ్యాప్తంగా 600 మలేరియా కేసులు గుర్తించామని, రాయచోటి ప్రాంతంలో ఎక్కువగా ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఆయా ప్రాంతాల్లో మరింత శ్రద్ధతో పనిచేస్తున్నామన్నారు. ప్రజలందరూ దోమలు వ్యాప్తి చెందకుండా ఇళ్లు, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుని రోగాల బారిన పడకుండా జాగ్రత్త తీసుకోవాలన్నారు. తొలుత దోమలపై దండ యాత్ర, పరిసరాల పరిశుభ్రత ర్యాలీని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ శే్వత తెవతియ కలిసి స్టేట్ గెస్టుహౌస్ నుంచి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం దోమల నివారణపై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ వసంతకుమారి, డిఎంహెచ్‌ఓ రామిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ చంద్రవౌళి, డిఇఓ ప్రతాప్‌రెడ్డి, సోషియల్ ఫారెస్టు డిఎఫ్‌ఓ నరసింహులు, అదనపు డిఎంహెచ్‌ఓ డాక్టర్ అరుణసులోచనాదేవి, జిల్లా మలేరియా అధికారి త్యాగరాజు, డిటిసి ప్రాజెక్టు అధికారి డాక్టర్ జమాల్‌బాషా, డెమో ఈశ్వరయ్య, హెచ్‌ఇఓ గుణశేఖర్, ఎంఇఓ పాలెం నారాయణ, నర్సింగ్ విద్యార్థులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
దాల్మియా వద్ద ఉద్రిక్తత..
మైలవరం, సెప్టెంబర్ 24: మండలంలోని దాల్మియా సిమెంటు పరిశ్రమ వద్ద శనివారం నవాబుపేట గ్రామస్తుల ఆందోళనతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరిశ్రమకు భూములు ఇచ్చిన బాధిత ప్రజలు గత కొన్ని రోజులుగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ పరిశ్రమ వారిని కోరుతున్నారు. ఈ విషయంపై పరిశ్రమ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో బాధిత ప్రజలు గ్రామంవద్ద మైనింగ్ ప్రాంతానికి వెళ్లేందుకు, అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. దీంతో డియస్పీ సర్కార్ తన సిబ్బందితో ఆందోళన ప్రదేశానికి చేరుకొని ప్రజలను నిలువరించారు. ప్రజలను పోలీసులు నిలువరించే తోపులాటలో పలువురికి గాయాలయ్యాయి. వారిలో బి.రాములమ్మ చేయి విరిగింది. ఆమెను చికిత్స నిమిత్తం జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే మైనింగ్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసుల బందోబస్తు నిర్వహిస్తున్నారు. భూములు కోల్పోయిన రైతు కుటుంబాల వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం యాజమాన్యాన్ని అడుక్కుంటున్న వారిపై పోలీసులు దౌర్జన్యంతో నిలువరించడం దారుణమని బాధిత ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టిసారించి బాధితులకు శాశ్వత పరిష్కారం చూపాలని బాధితులు కోరుతున్నారు.
వైకాపా నేత సుధీర్‌రెడ్డి అరెస్టు
జమ్మలమడుగు, సెప్టెంబర్ 24: నియోజకవర్గ వైకాపా ఇన్‌చార్జి యం.వి.సుధీర్‌రెడ్డిని శనివారం పోలీసులు అరెస్టు చేసి అర్బన్ స్టేషన్‌కు తరలించారు. ఈ విషయంపై వైకాపా నేత సుధీర్‌రెడ్డి స్టేషన్‌లో మాట్లాడుతూ దాల్మియా పరిశ్రమ బాధితుల కోరిక మేరకు నవాబుపేటకు వెళ్తోండగా మార్గమద్యంలో పోలీసులు తమను అరెస్టు చేశారన్నారు. బాధితులతో మాట్లాడడానికి, వారి పక్షాన పరిశ్రమ వారితో చర్చించడానికి వెళ్తోన్న తరుణంలో పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. అకారణం తమను పోలీసులు అరెస్టు చేయడం సమంజసం కాదని వైకాపా నేత సుధీర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనతో పాటు వైకాపా నేతలు హనుమంతరెడ్డి, శివగురివిరెడ్డి తదితరులు వున్నారు.

రాష్ట్రంలో అవినీతి పాలన..

కడప,సెప్టెంబర్ 24: రాష్ట్రంలో రోజుకు ఒక అవినీతి తప్ప అభివృద్ధి ఏమాత్రం కన్పించడం లేదని శాసన మండలి ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య విమర్శించారు. శనివారం స్థానిక కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఓటుకు నోటు వ్యవహారంలో జరిగిన సంభాషణల వాయిస్ చంద్రబాబుదేనన్న ఆధారాలు ఉన్నా నావి కావంటూ మాట్లాడటం, తాను నిజాయితీ పరుడని చెప్పుకోవడం సిగ్గుచేటుగా ఉందని ఘాటుగా విమర్శించారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తయినా అభివృద్ధి ఏమాత్రం జరగలేదని అదుగో అభివృద్ధి, ఇదిగో అభివృద్ధి అంటూ ఊదరగొట్టడం తప్ప జరిగిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. మీడియాను అడ్డంపెట్టుకుని టిడిపి అధికారంలోనే పరిశ్రమలు వచ్చాయని చెప్పుకోవడం దారుణమన్నారు. తెలంగాణ టిడిపి నాయకులను టిఆర్‌ఎస్‌లో చేర్చుకోవడంపై చర్యలు చేపట్టాలన్న ఆయనకు ఏపిలో వైకాపా నేతలను టిడిపిలో చేర్చుకోవడంపై వర్తించదా అని ప్రశ్నించారు. కృష్ణాజలాల విషయంలో తెలంగాణపై నోరు విప్పని చంద్రబాబు ఓటుకు నోటు వ్యవహారమే అందుకు కారణమన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాజెక్టుల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని, అప్పటి నుంచి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు కూడా ఇప్పటి వరకు పూర్తి చేయకపోవడం బాధాకరమన్నారు. ప్రజా సమస్యలు ఏమాత్రం పట్టించుకోకుండా ఓటుకు నోటు వ్యవహారాన్ని కప్పిపుచ్చుకోవడానికి కుంటిసాకులతో నేను నిప్పు, నిజాయితీ పరుడని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఈ సమావేశంలో డిసిసి అధ్యక్షుడు నజీర్ అహ్మద్, పార్టీ అధికార ప్రతినిధి నీలి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు సత్తార్, చార్లెస్, నాగేంద్రనాయక్ తదితరులు పాల్గొన్నారు.

భ్రూణహత్యలు నివారించాలి
రాయచోటి, సెప్టెంబర్ 24: భ్రూణహత్యలు నిర్మూలించాలని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం రాయచోటిలో మాతాశిశు మరణాలపై భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాతాశిశు ఆరోగ్యమిషన్, ఆర్‌ఎంఎన్‌టి హెచ్‌ఏల ఆధ్వర్యంలో స్థానిక బాలికోన్నత పాఠశాలలో మాతాశిశు మరణాలపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో 120 కోట్ల జనాభా ఉంటే అందులో 20 కోట్ల ప్రజలకు పౌష్టికాహారం అందలేదని ఆయన సూచించారు. ముఖ్యంగా గర్భిణీలకు పౌష్ఠికాహారం ఉంటే పుట్టే శిశువు కూడా ఆరోగ్యవంతంగా ఉంటాడని ఆయన తెలిపారు. సమాజంలో మహిళల సంఖ్య తగ్గితే మానవ మనగడ లేదన్నారు. స్ర్తిలను గౌరవిస్తే సమాజం కూడా బాగుపడుతుందని ఆయన చెప్పారు. మహిళలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బాధ్యత తల్లిదండ్రులదే అన్నారు. భారతదేశంలో మాతాశిశు మరణాల సంఖ్య అధికంగా ఉందని, దీని నివారణకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని వచ్చారు. అందుకు ఎమ్మెల్యే స్పందిస్తూ అంగన్వాడీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. మహిళలను ఎవ్వరైనా వేధిస్తే తమ దృష్టికి తీసుకొని రావాలని సూచించారు. అలాంటి వారికి శిక్ష తప్పదన్నారు. మహిళలు కూడా ఎవ్వరిని నమ్మవద్దని సూచించారు. అనంతరం ఐసిడిఎస్ పిడి రాఘవరావు మాట్లాడుతూ బాల్య వివాహాలు చట్టరీత్యానేరమన్నారు. బాల్యవివాహాలకు పాల్పడితే వారు శిక్ష అనుభవించక తప్పదన్నారు. అనంతరం పౌష్టికాహారంపై ఐసిడి ఎస్ ఆధ్వర్యంలో స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్‌ను అధికారులు పరిశీలించారు. అనంతరం వంటల, రంగువల్లుల పోటీలు నిర్వహించారు. ఈపోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను ఎమ్మెల్యే ప్రదానం చేశారు. అదే విధంగా ఆరోగ్యవంతులైన బేబీలకు కూడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన బేబీలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ నసీబున్ ఖానమ్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందాదుల్లా, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ నాగరాజు, డాక్టర్ నితీష్, డిసిపివో ప్రసాద్, సిడిపివో శ్రీదేవి, ఎంపిపి రాజమ్మ, తహసీల్దార్ గుణభూషణ్ రెడ్డి, మున్సిపల్ ఇన్‌చార్జి కమిషనర్ సుబ్రమణ్యం, కౌన్సిలర్లు ఫయాజ్, మస్తాన్ , చెంగారమాదేవి, సహదేవ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధికి ఆటంకం జగన్ : రెడ్యం
ఖాజీపేట,సెప్టెంబర్ 24: ప్రత్యేక హోదాను మరిచి, ప్రత్యేక ప్యాకేజి కోసం ప్రయత్నించి దమిడి ఇవ్వకున్నా చంద్రబాబు స్వాగతించారని జగన్ చేస్తున్న విషప్రచారాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెదెపా రాష్టన్రాయకులు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. శనివారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చి అభివృద్ధివైపు పరుగులు పెట్టించి పోలవరం నిర్మాణానికి కేంద్రం స్పందిస్తోందని, రహదారులకు రూ.65వేల కోట్లు ఇస్తుందని, రాజధాని నిర్మాణాలకు నిధులు ఇస్తోందని ఇవన్నీ ప్రత్యేక ప్యాకేజిలో పొందుపరిస్తే దమిడి ఇవ్వలేదని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఈనిధులు తీసుకుంటూనే ప్రత్యేక హోదాకోసం పోరాడుతామని చంద్రబాబు చెప్పినా జగన్ మాట్లాడటం సరైంది కాదన్నారు. సమావేశంలో టిడిపి నాయకులు పుల్లయ్యనాయుడు, నాగేశ్వరుని కోన చైర్మన్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

సకాలంలో కేసులు పరిష్కరించాలి

కడప,(లీగల్)సెప్టెంబర్ 24: సివిల్ క్రిమినల్ కేసుల్లో కక్షిదారులకు, ముద్దాయిలకు త్వరితగతిన కేసులుపరిష్కరించడంలో న్యాయమూర్తులు వేగవంతం చేయాలని జిల్లా ప్రధాన జడ్జి గంధం సునీత అన్నారు. శనివారం జిల్లాకోర్టు ప్రాంగణంలోని జిల్లాజడ్జి కోర్టుహాలులో జ్యుడిషియల్ ఆఫీసర్ల సమీక్ష సమావేశం జిల్లా జడ్జి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి జిల్లా వ్యాప్తంగా 20మంది అదనపు జిల్లా జడ్జిలు, సీనియర్ సివల్ జడ్జిలు, జూనియర్ సివిల్ జడ్జిలు హాజరయ్యారు. వారినుద్దేశించి ఆమె మాట్లాడుతూ మార్చి 1 నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ఉన్న కేసుల పరిష్కారంలో జాప్యాన్ని విడనాడి పరిష్కరించాలన్నారు. అదేవిధం గా పెండింగ్ ఉన్న కేసుల పరిష్కారా నికి అధికారులు, ప్రజలు సహకరిం చాలన్నారు. రాజీ మార్గం ద్వారా కేసు లు పరిష్కారమవుతాయని వారు సూచించారు. సమావేశానికి నాల్గవ అదనపు జిల్లా జడ్జి అన్వర్‌బాషా, సీనియర్ సివిల్ జడ్జి ప్రసాద్, జూనియర్ జడ్జిలు ధీనా, శైలజ , లావణ్య, శోభారాణి, శ్రీ్ధర్, భారతి, లోక్ అదాలత్ కార్యదర్శి సబ్ జడ్జి యుయు ప్రసాద్, జిల్లాలోని జూనియర్, సీనియర్ జడ్జిలు హాజరయ్యారు.

వరదలు, అగ్నిప్రమాదాల్లో
క్షతఘాత్రులకు సేవలందించడమే రెడ్‌క్రాస్ సొసైటీ లక్ష్యం

కడప,సెప్టెంబర్ 24: వరదలు, అగ్నిప్రమాదాలు, యుద్ధాలు సంభవించినప్పుడు క్షతఘాత్రులకు సేవలందించడానికే రెడ్‌క్రాస్ సొసైటీ ఏర్పాటైందని కలెక్టర్ కెవి సత్యనారాయణ పేర్కొన్నారు. స్థానిక పెద్దమట్టిపులి వీధి వద్ద ఉన్న రెడ్‌క్రాస్ సొసైటీలో శనివారం ఫస్ట్ ఎయిడ్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ పై వివిధ కళాశాలల నుంచి ఈనెల 21వ తేదీ నుంచి 24 వరకు శిక్షణ పొందిన విద్యార్థులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ సేవా భావంతో విద్యార్థులు ముందుకు వచ్చి రెడ్ క్రాస్ సొసైటీ ఇచ్చిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయమన్నారు. ప్రస్తుతం శిక్షణ పొందినవిద్యార్థులు వారి వారి కళాశాలకు వెళ్లి సహ విద్యార్థులకు, అలాగే తమ ప్రాంతాల్లో శిక్షణ ఇవ్వాలని కోరారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలపై సరైన అవగాహన లేనందువల్ల ప్రజలు తక్కువ సేవలు పొందుతున్నారన్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రజలకు మంచి వైద్య సేవలు అందించేందుకు వినూత్న కార్యక్రమాలు చేపట్టి అమలు చేస్తోందన్నారు. ఎన్‌టిఆర్ వైద్య సేవలు, తల్లిబిడ్డ ఎక్స్‌ప్రెస్, ఇ-ఔషధి, శిశు సురక్షాయోజనకింద బేబి కిట్స్ పంపిణీ లాంటి వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టి ప్రజల ఆరోగ్యం మెరుగుకోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రజా ఆరోగ్యంలో భాగంగా అనేక ఉచితవైద్య పరీక్షలు అందిస్తోందన్నారు. ఎక్స్‌రే, స్కానింగ్ వంటి వాటిని ప్రజలకు ఉచిత వైద్యసౌకర్యం కల్పిస్తోందన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో సిజేరియన్ ప్రసవాలు తక్కువగా ఉన్నాయని, అయితే ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరిగి ప్రసవాల్లో 90శాతంకు మించి సిజేరియన్ జరుగుతున్న విషయాన్ని గమనించాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు బాగా మెరుగుపడినందున ప్రజలు ప్రభుత్వవైద్య సేవలను పెద్ద ఎత్తున వినియోగించుకునేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత, పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. అలాగే రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా ప్రజల ఆరోగ్య పరిస్థితులు, స్థితిగతులు పెరిగేందుకు కృషి చేయాలని కోరారు. అలాగే డిఎంఅండ్‌హెచ్‌ఓ, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సెక్రటరీ డా.రామిరెడ్డి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం శిక్షణ పొందిన విద్యార్థులకు సర్ట్ఫికెట్లు కలెక్టర్ సత్యనారాయణ అందజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌సొసైటీ రీజనల్ కో-ఆర్డినేటర్ వి.్భమశంకర్‌రెడ్డి, యూత్‌వాలంటీర్లు, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.

మొక్కలు నాటిన కలెక్టర్
కడప,(క్రైమ్)సెప్టెంబర్ 24: కొత్త కలెక్టరేట్ సమీపం, రైల్వేస్టేషన్ రోడ్డు, కడప మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 67వ వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా శనివారం కలెక్టర్ సత్యనారాయణ మొక్కలు నాటారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నాటిని ప్రతిమొక్కను సంరక్షించినప్పుడే భవిష్యత్ తరాల వారికి మనుగడ కల్పిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ వసంతకుమారి, డిఎంహెచ్‌ఓ రామిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ చంద్రవౌళి, డిఇఓ ప్రతాప్‌రెడ్డి, సోషియల్ ఫారెస్టు డిఎఫ్‌ఓ నరసింహులు, అదనపు డిఎంహెచ్‌ఓ డాక్టర్ అరుణసులోచనాదేవి, జిల్లా మలేరియా అధికారి త్యాగరాజు, డిటిసి ప్రాజెక్టు అధికారి డాక్టర్ జమాల్‌బాషా, డెమో ఈశ్వరయ్య, హెచ్‌ఇఓ గుణశేఖర్, ఎంఇఓ పాలెం నారాయణ, నర్సింగ్ విద్యార్థులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
క్రికెటర్ విజయకుమార్‌కు సన్మానం
కడప,(కల్చరల్)సెప్టెంబర్ 24: ఐపిఎల్‌కు సెలెక్ట్ అయిన కడప జిల్లాకు చెందిన పైడికాల్వ విజయకుమార్‌ను కడప ఎమ్మెల్యే ఎస్‌బి అంజద్‌బాషా కెకెఆర్ సంస్థ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. శనివారం వైఎస్సార్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన ఈకార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ నగర సమీపంలోని వల్లూరు మండలంలో పేద కుటుంబానికి చెందిన విజయకుమార్ బస్సు కండక్టర్‌గా పనిచేస్తూ క్రికెట్‌మీద అభిమానంతో ప్రాక్టీస్ చేస్తూ ఇంత ఎత్తుకు ఎదిగారన్నారు. 11వ సారి రంజీట్రోఫీకి సెలక్టు అయిన విజయకుమార్‌ను ఏపి నుంచి 190 వికెట్లు తీసి ఫాస్ట్‌బౌలర్‌గా ఎదిగి 200 వికెట్లకు దగ్గరగా ఉన్నారన్నారు. ఏపిలో రెండవ వ్యక్తిగా ఎదగనున్నారన్నారు. రాబోయే రోజుల్లో మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో కో-ఆప్షన్‌సభ్యుడు షఫీ, కెకెఆర్ సిబ్బంది, విద్యాసాధన విద్యాసంస్థల అధినేత పి.మన్సూర్ అలీఖాన్, ఫయాజ్, సోహెల్, తారీఖ్ అలీ, అలీన్, మహ్మద్ అలీ, సోయబ్, అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు.