కడప

ఎసిసి ప్రజాభిప్రాయ సేకరణ ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం/జమ్మలమడుగు, అక్టోబర్ 20: ఎసిసి సిమెంటు పరిశ్రమ ప్రజాభిప్రాయ సేకరణసదస్సు ప్రశాంతంగా ముగిసింది. మైలవరం మండలం గొల్లపల్లెవద్ద భారీ బందోబస్తు మధ్య గురువారం ఎపి కాలుష్యనియంత్రణ మండలి అధికారి నరేంద్రబాబు, కలెక్టర్ సత్యనారాయణ అధ్యక్షతన పర్యావరణ, మైనింగ్ అనుమతులు ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కెవి సత్యనారాయణ మాట్లాడుతూ రూ.7100 కోట్లతో ఎసిసి వారు పరిశ్రమ ఏర్పాటుకు వచ్చారన్నారు. పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి పర్యావరణం, మైనింగ్ అనుమతులకు ప్రజాభిప్రాయ సేకరణ చేయడం జరుగుతుందన్నారు. అయితే పరిశ్రమకు భూములిచ్చి 20 ఏళ్లుగా ఆందోళన చెందుతున్న రైతుల సమస్యలను పరిష్కరించాల్సి ఉందన్నారు. కార్పొరేట్ పరిశ్రమలు రావడానికి జిల్లా, రాష్ట్రానికి ఎంత అవసరమో ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కూడా అంతే బాధ్యత ప్రభుత్వంపై వుందన్నారు. ఇప్పటికే ఎసిసి బాధిత రైతులకు ప్రజాప్రతినిథుల నుండి స్పష్టమైన హామీ ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో కార్పొరేట్ సంస్థలైనా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉందన్నారు. రైతులు కోరుతున్న పరిహారంపై హామీలిచ్చి వెళ్లిపోవడం కాకుండా స్పష్టమైన హామీ ఇవ్వాలని కలెక్టర్ ఎసిసి ప్రతినిథులకు తెలిపారు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పరిశ్రమ:
రూ.7100 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో 8 ఎంపిటిఎ సామర్థ్యంతో పరిశ్రమ నిర్మాణం చేయడం జరుగుతుందన్నారు. పరిశ్రమను రెండువిడతల్లో పూర్తి చేస్తామన్నారు. పరిశ్రమ సిఎస్‌ఆర్ క్రింద వుండే రూ.350కోట్లతో బాధిత గ్రామాల అభివృద్దికి ఖర్చుచేస్తామన్నారు. అలాగే కాలుష్య నియంత్రణ కోసం రూ.640కోట్లతో చర్యలు తీసుకుంటామన్నారు. పూర్తిగా కాలుష్య రహితంగా పరిశ్రమ నిర్మాణం చేస్తామన్నారు. పరిశ్రమలో 500మందికి ఉద్యోగ, వేలాది మందికి ఉపాధి అవకాశాలు ఉంటాయన్నారు. బాధిత రైతులకు వ్యక్తిగత పరిహారం చెల్లింపు విషయం డైరెక్టర్ల బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని డైరెక్టర్ నారాయణరావు తెలిపారు.
భారీ భద్రత ఏర్పాట్లు: గత మాసంలో సదస్సు జరుగకుండా ఆందోళనలకు దిగిన నేపథ్యంలో వైకాపా నాయకులను గృహనిర్బంధం చేసి, అడుగడుగునా భారీగా బలగాలను మోహరించి పటిష్టమైన బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శే్వతతెవతీయ, ఆర్డీవో వినాయకం, ఎసిసి ప్రతినిథులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

ఎసిసిపై సిఎం స్పష్టమైన హామీ
* ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
జమ్మలమడుగు, అక్టోబర్ 20: ఎసిసి బాధితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టమైన హామీ ఇచ్చారని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెలిపారుర. స్థానిక తెదేపా కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎసిసి బాధిత రైతుల విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈవిషయంపై ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పదించారన్నారు. రూ.7వేల కోట్లతో 8 ఎంటిపిఎ సామర్థ్యంతో చేపడుతున్న ఎసిసి వల్ల సియస్‌ఆర్ క్రింద రూ.350కోట్లు అభివృద్ది చేయాల్సి ఉందన్నారు. అలాగే జిల్లా మానటరింగ్ ఫండ్ క్రింద టన్ను రూ.24ల చొప్పున ఇప్పటికే కలెక్టర్ ఖాతాలో రూ.20కోట్లు ఉందన్నారు. పరిశ్రమవల్ల వచ్చే డియంయఫ్ నిధులు భారీగా బాధిత గ్రామాలకు వస్తాయన్నారు. 20 ఏళ్ల క్రిందట భూములు కొన్నప్పుడే పరిశ్రమ పెట్టిఉంటే బాధిత గ్రామాల ప్రజలు ఎంతో అభివృద్దిచెంది వుండేవారన్నారు. పరిశ్రమ పెట్టకపోవడంవల్ల బాధితులకు చాలానష్టం జరిగిందన్నారు. అందువల్ల బాధితుల పరిహారం సమస్యను సిఎం ముందు ఉంచామన్నారు. ముఖ్యమంత్రి కూడా రైతుల సమస్యను ఎసిసి పరిశ్రమ వారు పరిష్కరించాల్సిందేనని తెలిపారన్నారు. ఈ విషయంపై రామసుబ్బారెడ్డి కూడా సిఎం ముందు రైతులకు పక్షాన మాట్లాడారన్నారు. బాధిత రైతులకు న్యాయం జరుగని పక్షంలో పరిశ్రమకు ఇవ్వాల్సిన అనుమతుల విషయంపై పునరాలోచిస్తామని సిఎం స్పష్టంగా తెలిపారన్నారు. బాధిత రైతులు పరిహారం విషయంలో ఎటువంటి అపోహలు చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తెలిపారు.

అవినీతి అక్రమార్కులపై ఏసిబి కన్ను!

కడప,అక్టోబర్ 20: జిల్లాలో ఆదాయ వనరులు కలిగిన శాఖల్లో రోజురోజుకు అవినీతి అక్రమాలు విలయతాండవం చేస్తున్న నేపధ్యంలో వాటిని అరికట్టేందుకు ఏసిబి అధికారులు దాడులకు శ్రీకారం చుట్టారు. ఈనేపధ్యంలో గురువారం రాత్రి చిత్తూరు, కడప జిల్లాలకు చెందిన ఏసిబి అధికారులు రాజంపేట మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంపై ఆకస్మికదాడులు చేశారు. గురువారం రాత్రి పొద్దుపోయే వరకు కూడా ఆ కార్యాలయంలో సోదాలు, రికార్డులు అధికారులు పరిశీలిస్తున్నారు. జిల్లాలో ట్రెజరీ, సబ్‌రిజిస్ట్రార్, రెవెన్యూ, పోలీసు శాఖలతోపాటు వివిధ శాఖల్లో చిన్న చితక పని కావాలన్నా చేతులుతడిపితే తప్ప ఫైళ్లు కదలడం లేదు, పనులు కావడం లేదు. ఈ నేపధ్యంలో ప్రజలు విసుగుచెంది సంబంధిత అధికారులకు, ఉన్నతాధికారులకు అనేక పర్యాయాలు ఫిర్యాదులు చేసినా అధికారుల్లో కొంతమంది మామూళ్లమత్తులో జోగుతుండటంతో సామాన్య ప్రజలకు న్యాయం జరగలేదు. దీంతో పలువురు అధికారులపై విసుగుచెంది ఏసిబి అధికారులను ఆశ్రయిస్తున్నారు. ఏసిబి అధికారుల్లో కూడా కొంతమంది పరపతి కలిగిన అవినీతి అధికారులను, అవినీతి త్రిమింగలాలను గాలికివదిలేసి సన్న చేపలకు గాళం వేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి ప్రభుత్వ వసతిగృహాల్లో అవినీతి అక్రమాలు చోటుచేసుకుంటుండటంతడో ఆశాఖల్లో కూడా అవినీతి అక్రమార్కుల కార్యకలాపాలు పెట్రేగుతున్నా ఉన్నతాధికారులు అంటీ అంటనట్లు వ్యవహరించడంతో ఆశాఖలపై కూడా ఏసిబి అధికారులు కనే్నశారు. జలవనరులశాఖ అధికారుల్లో కూడా అవినీతి పెట్రేగింది. ఈ నేపధ్యంలో ఏసిబి అధికారులు జిల్లాపై దాడులుముమ్మరం చేస్తున్నారు. ఏసిబి అధికారులు కూడా నిష్పక్షపాతంగా వ్యహరించి ప్రజలకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

గెలుపే ధ్యేయం
పులివెందుల, అక్టోబర్ 20: పట్ట్భధ్రులు, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెదేపా మద్ధతుదారుల గెలుపే ధ్యేయంగా కార్యకర్తలు, నాయకులు పనిచేయాలని శాసనమండలి ఉపాధ్యక్షుడు సతీష్‌కుమార్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక తె దేపా కార్యాలయంలో పులివెందుల నియోజకవర్గంలోని మండలాల నాయకులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ బృందాలుగా ఏర్పడి అర్హత గల వారిని గుర్తించి ఓటుహక్కును కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డు మాజీ ఛైర్మెన్ మధుసూదన్‌రెడ్డి, పార్టీ పట్టణాధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, నంద్యాల హేమాద్రిరెడ్డి, సిద్ధారెడ్డి పాల్గొన్నారు.

అభిమానుల కోలాహలం మధ్య
‘ఎల్ 7’ సినిమా విడుదల

రాయచోటి, అక్టోబర్ 20: రాయచోటి పట్టణానికి చెందిన సినీ నిర్మాత ఓబుల సుబ్బారెడ్డి నిర్మాణ సారథ్యంలో అరుణ్ ఆదిత్, పూజా జవేరిల కాంబినేషన్ ముకుంద్‌పాండే డైరెక్షన్‌లు రూపొందించబడ్డ ‘ఎల్ 7’ సినిమా అభిమానుల కోలాహలం మధ్య విడుదల అయింది. ఇటు హీరో అభిమానులు, నిర్మాత అభిమానులు కలిసి పట్టణంలోని పలు ప్రాంతంలో పోస్టర్లు ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పటికి నిర్మాత రాహుల్ మూవీ మేకర్స్ ద్వారా బీహార్ లాంగ్వేజీలో నాలుగు సినిమాలను నిర్మించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. తెలుగులో కూడా గత ఏడాది 1 ఈ వర్షం సాక్షిగా2 సినిమాను రూపొందించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. 1 ఎల్ 72 రెండో సినిమాగా భారీ అంచనాలతో ఈ నెల 21వ తేదీన విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా థియేటర్ వద్ద, పలు కూడళ్లలో పోస్టర్లు, కటౌట్లను ఏర్పాటు చేసి అభిమానులు తమ అభిమానాన్ని చాటుకున్నారు.

విత్తన పంపిణీ రచ్చరచ్చ..
పెండ్లిమర్రి,అక్టోబర్ 20: మండలంలోని 19గ్రామపంచాయతీల్లో గత ఆరురోజులుగా విత్తనాలు పంపిణీ చేస్తున్నా రైతులకు సకాలంలో అందక గురువారం రైతులు తండోపతండాలుగా ఏఓ కార్యాలయం వద్ద చేరుకోగా వ్యవసాయాధికారులు ఎంతసేపటికీ కార్యాలయం తెరవకపోవడంతో ఆందోళనకు దిగారు. దీంతో కార్యాలయం ఆవరణలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇదే అదునుగా కొంతమంది ఆకతాయిలు కార్యాలయంపై రాళ్లు, నీళ్ల ప్యాకెట్లు విసరడంతో ఆప్రాంతమంతా గందరగోళ వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న రూరల్ సిఐ వెంకటశివారెడ్డి కడప నుంచి నలుగురు ఎస్‌ఐలను పంపించి పంపిణీ వ్యవస్థ చక్కదిద్దేందుకు తీవ్రంగా కృషి చేశారు. సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు రైతులను చెల్లాచెదురు చేశారు. విషయం తెలుసుకున్న వ్యవసాయ ఉపసంచాలకులు నరసింహారెడ్డి అక్కడకు చేరుకుని రైతులతో సమావేశం ఏర్పాటుచేసి మండలానికి అనుకున్న కోటా కంటే ఎక్కువకోట కేటాయించామని మండల వ్యాప్తంగా 5వేల హెక్టార్లలో శెనగ వేసేవారని ఈ ఏడాది 19గ్రామపంచాయతీల్లోని రైతులు శెనగవిత్తనాలకు ఎగబడటంతో ఈ పరిస్థితులు నెలకొన్నాయని ఇప్పటికే 2వేల ప్యాకెట్లు పంపిణీ చేశామని మలి విడతగా 400 ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. రైతులు ఒకేసారి వ్యవసాయ కార్యాలయానికి చేరుకోవడంతో ఈపరిస్థితులు నెలకొన్నాయని ప్రతి రైతుకు విత్తనం అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.
కువైట్ నుంచి ఇండియాకు మైనర్ బాలిక..
ఆంధ్రభూమి బ్యూరో
కడప,అక్టోబర్ 20:జీవనోపాధి నిమత్తం గల్ఫ్‌దేశంలో భాగమైన కువైట్‌కు జిల్లా నుంచి బాలికను తరలిస్తుండగా ఈనెల 17న కడప నగరానికి చెందిన మైనర్ బాలిక ఫాతిమాను కువైట్‌లో కనుగొని భారతీయ రాయబారి స్వదేశానికి విమానం ద్వారా చెన్నైకు పంపించారు. ఆమేరకు చెన్నై నుంచి మైనర్ బాలికను ఎయిర్‌పోర్టు నుంచి సరాసరి కడప రెవెన్యూ అధికారులకు ఆ బాలికను చేరవేశారు. సమాచారం అందుకున్న కలెక్టర్ కెవి సత్యనారాయణ మైనర్ బాలికలను గల్ఫ్‌దేశాలకు పంపడం నేరమని గుర్తించి స్థానిక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ మల్లికార్జునరెడ్డికి ఆ బాలికను తల్లిదండ్రులకు అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ మైనర్ బాలిక పేరు మార్పుచేసి గల్ఫ్‌దేశాలకు పంపించారు. ప్రస్తుతం మైనర్ బాలికను తల్లి కె.వెంకటరమణమ్మ అప్పగించారు. బాలిక ఫాతిమా అందించిన సమాచారం మేరకు 15-16 సంవత్సరాలు కలిగిన బాలికలు చాలా మంది కువైట్‌లో ఉన్నారని పత్రికా విలేఖర్లకు తెలిపారు. కరవు కాటకాలకు నిలయమైన జిల్లాలో గల్ఫ్ ఏజెంట్లు, కువైట్ సేఠ్స్ కోరిక మేరకు మైనర్ బాలికలను పంపి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో లంబాడి తండాలకు చెందిన మైనర్ బాలికలను గల్ఫ్‌దేశాలకు పంపుతున్న ఏజెంట్లు ప్రస్తుతం అన్ని ప్రాంతాలకు చెందిన మైనర్ బాలికలనే పేరు మార్పుచేసి వయస్సు అధికంగా వేసి పాస్‌పోర్టులో మైనార్టీ బాలికలుగా చిత్రీకరించి పాసుపోర్టులు సృష్టించి యధేచ్చగా గల్ఫ్‌దేశాలకు జిల్లా మైనర్ బాలికలను ఎగుమతి చేస్తున్నట్లు విచారణలో తేలింది. ....

రాజంపేట ఎంవిఐ కార్యాలయంపై ఎసిబి దాడులు

రాజంపేట, అక్టోబర్ 20: రాజంపేట మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్స్, రెన్యూవల్ లైసెన్స్‌లు ఇతరత్రా వ్యవహారాలకు సంబంధించి దళారీ వ్యవస్థ అధికమైనట్టు వచ్చిన ఫిర్యాదులపై గురువారం ఎసిబి అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కార్యాలయంలో సమీపంలో పలువురు ఏజెంట్లను ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. వీరితోపాటు కార్యాలయంలోని నంబరుప్లేట్, కంప్యూటర్ ఆపరేటింగ్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారివద్ద నుండి రూ.35,390 వేలు నగదును స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ కార్యాలయంలో పైసలు లేనిదే ఫైల్‌కదలని విధంగా అవినీతి రాజ్యం తాండవిస్తున్నది. ఇంట్లో ఫీజు, బయట ఫీజు అన్నట్టుగా ఈ కార్యాలయం అధికారులు అవినీతి ఊబిలో కూరుకుపోయి దోచుకుంటుండడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. అవినీతికి అడ్డాగామారిన రాజంపేట ఎంవిఐ కార్యాలయంపై పలువురు చేసిన ఫిర్యాదుల మేరకు ఆకస్మిక దాడులు కడప ఎసిబి డిఎస్పీ నాగరాజు, సిఐ శివశంకర్‌నాయక్‌లతోపాటు సిబ్బంది నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ నాగరాజు మాట్లాడుతూ రాజంపేట ఎంవిఐ కార్యాలయాన్ని దాడి చేశామని, రాజంపేట ఎంవిఐ కార్యాలయం బయట ఉన్న ఏజెంట్లు అయిన ఆంజనేయులు, రామిరెడ్డి, శేఖర్, దుర్గయ్యలను పట్టుకొని వారివద్ద ఉన్న నగదును స్వాధీనం చేసుకోవడంతో పాటు నంబర్ ప్లేట్, కంప్యూటర్ ఆపరేటర్స్ అయిన శ్రీహరి, సందీప్‌లను పట్టుకొని వారి వద్ద ఉన్న నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఏజెంట్లను కార్యాలయంలోపలికి అనుమతిస్తున్నారని, పెయింటింగ్, స్టిక్కరింగ్ బయటవారికి ఇస్తూ ముడుపులు తీసుకుంటున్నారన్నారు. మొత్తంగా ఎంవిఐతో పాటు సిబ్బంది, పలువురు ఏజెంట్లపై కేసులు నమోదు చేసి రూ.35,390 రూపాయలు సీజ్‌చేసి విచారణ జరిపిస్తున్నామన్నారు. ఈ కేసు నివేదికలను ఉన్నతస్థాయి అధికారులకు పంపిస్తున్నట్టు వివరించారు. ఈ దాడులు ఉదయం నుండి రాత్రి 8 గంట వరకు జరిగాయి.

వేరుశెనగ, వరి పంటకు నష్టపరిహారమివ్వాలి

రాయచోటి, అక్టోబర్ 20: వర్షాభావ పరిస్థితుల వల్ల నిట్టనిలువునా ఎండుతున్న వేరుశెనగ, వరి తదితర పంటలకు నష్టపరిహారమివ్వాలని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన మండలంలోని పెమ్మాడపల్లె గ్రామంలోని గరుగుపల్లెలో ఉదయం 6 గంటలకే గడప గడపకూ వైఎస్‌ఆర్‌సీపీ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇంటింటా తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకుంటూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ, కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తుండటం విశేషం. రైతులైతే ఎండుతున్న పంటల గురించి ఎమ్మెల్యేకు వివరిస్తూ, ఏ విధంగా బతకాలి అంటూ బాధలను వ్యక్తం చేశారు. మొరవలు పోయిన చెరువుల్లో కూడా నీళ్లు ఇంకిపోయామని, తమ కళ్లు ముందరే పొట్టదశలో ఉన్న వరి పంట ఎండిపోతోంది. పూర్తిగా వేరుశెనగ పంట ఎండిపోయి పనికిరాకుండా పోయిందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు నిరుద్యోగ యువకులు ఆయన్ను కలిసి ప్రభుత్వం నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెడుతోందని, ఎన్నికల హామీ అయిన నిరుద్యోగ భృతి అమలయ్యేలా ఒత్తిడి చేయాలని కోరారు. రేషన్‌కార్డులు లేవని, కొత్తగా పక్కా గృహాలు మంజూరు కాలేదని పలువురు విన్నవించారు. తమ పల్లెకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థులు, గ్రామస్థులు కోరగా ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్సు సౌకర్యాన్ని కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్భాటపు ప్రకటనలు మాని ఎండుతున్న వేరుశెనగకు ఎకరాకు రూ.15 వేలు, వరికి ఎకరానికి రూ.25 వేలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువకులకు చిన్న ఉద్యోగులకు సైతం దొరక్కపోవడంతో ఉపాధి, కూలీ పనులకు వెళ్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ల కాలం గడుస్తున్నా హామీల గురించి పట్టించుకోవడం లేదన్నారు. నిరుద్యోగభృతి హామీ మేరకు పాలన చేపట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి ఇంటికీ నిరుద్యోగభృతిగా రూ.60 వేలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలను నెరవేర్చలేనందుకు గాను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజమ్మ, వైసీపీ నాయకులు పల్లపు రమేష్, ప్రతాప్‌రెడ్డి, గోపాల్, వెంకటరమణ, శ్రీనివాసులు, సుబ్బరాయుడు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.