కడప

కామ్రేడ్ల తిరుగుబాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,నవంబర్ 17:సిపిఎం పార్టీలో తమకు సరైన గుర్తింపులేదని , కొన్ని దశాబ్దాలుగా పార్టీ జెండా మోస్తున్నామని కొంతమంది నాయకుల వ్యవహారశైలితో తాము విసిగిపోయి 50 మంది పైబడి నేతలు గురువారం రాజీనామా చేస్తూ విలేఖర్ల సమావేశం ఏర్పాటుచేశారు. ఆ సందర్భంగా లింగమూర్తి, రాష్ట్ర కార్యవర్గసభ్యుడు ఎన్.రవిశంకర్‌రెడ్డి కలిసి విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో సిపిఎం ఒక బలమైన పార్టీగా పనిచేస్తోందని, అయితే ఒంటెద్దుపోకడలతో కొంతమంది సిపిఎం జిల్లా, రాష్ట్ర నేతలు ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుని పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారని, క్రమశిక్షణ లోపించి ఉద్యమాల బాట పక్కదారి పడుతోందని తాము వాటన్నింటినీ వ్యతిరేకిస్తూ రాజీనామా చేసి జిల్లా, రాష్ట్ర సిపిఎం అధిష్టానానికి రాజీనామా లేఖలు పంపుతున్నామన్నారు. తాము రాజకీయ భవిష్యత్ కోసం నూతన పార్టీ కానీ, ప్రస్తుతం ఉన్న ప్రజాసేవచేసే పార్టీలోకానీ చేరతామని రాజీనామా చేసిన సిపిఎం నేతలు, కార్యకర్తలు మూకుమ్మడిగా నిర్ణయం తీసుకుని ఏదో ఒక రాజకీయపార్టీలో చేరతామని స్పష్టం చేశారు. గత నాలుగేళ్లుగా తమను మానసికంగా ఎన్నో ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర నాయకత్వం కొంతమందిని పిలిచి రాష్టస్థ్రాయిలో పనిచేయాలని ఆదేశిస్తే రాష్టస్థ్రాయిలో పనిచేసినా తమకు వేధింపులు తగ్గడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమను అనుసరిస్తున్న నాయకులను కూడా పార్టీలో నుంచి తీసివేయడం, వివిధ రకాల కారణాలు చూపుతూ వేధించడం మొదలుపెట్టారని ఆరోపించారు. ఇప్పటి వరకు కూడా వారితోనే ఉంటూ పార్టీలో సమైఖ్యత కోసం ఎన్నో విధాలుగా ప్రయత్నించినా ఫలితం లేదన్నారు. ఇందుకోసమే తాము పార్టీకి రాజీనామా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. విలేఖర్ల సమావేశంలో సీనియర్ నాయకులు, జిల్లా, నగర కమిటీ, ప్రజాసంఘాల సభ్యులుగా ఉన్న ఓ.శివశంకర్, ఎస్.మగ్బుల్‌బాషా, సి.శేఖర్, బి.ఓబయ్య, ఎస్.సిద్దిరామయ్య, హరిబాబు, తులసీరాం, లక్ష్మిదేవి తదితరులు పాల్గొన్నారు.
గుప్తనిధుల ముఠా అరెస్టు
సంబేపల్లె, నవంబర్ 17:గుప్తనిధుల కోసం అనే్వషిస్తున్న ఐదు గురు అనుమానితులను అరెస్టు చేసినట్లు సంబేపల్లె సయ్యద్ హషం తెలిపారు. గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎస్‌ఐ మాట్లాడుతూ గురువారం రాత్రి దుద్యాల చెక్‌పోస్టు వద్ద వాహనంలో గస్తీ నిర్వహిస్తుండగా రోడ్డుపక్కన నిలిపివున్న కారులోని వ్యక్తులు పోలీసులను చూసి పరుగులు పెట్టారని, వారిని తమ సిబ్బంది వెంబడించి పట్టుకుని విచారించగా కర్ణాటకకు చెందిన మునిరాజు, చంద్రశేఖర్, వివ్వనాధ్, కరీముల్లా, నాగరాజలు గుప్తనిధుల కోసం ఈ ప్రాంతంలో వెతుకుతున్నట్లు పోలీసులు తెలిపారు. సంబేపల్లె ప్రాంతంలో గుప్తనిధులు ఉన్నట్లు ఒక స్వామీజీ చెప్పడంతో ఇక్కడికి వచ్చామని విచారణలో వారు వెల్లడించారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. హెడ్‌కానిస్టేబుల్ రమేష్, వెంకటేశ్వర్లు, పుష్పరాజ్‌లు పాల్గొన్నారు.
శారీరక లోపం అభివృద్ధికి అడ్డుకాదు

కడప, నవంబర్ 17:చిన్న చిన్న శారీరక లోపాలు ప్రతిభావంతుల ఎదుగుదలకు అడ్డంకాదని కలెక్టర్ కెవి సత్యనారాయణ అన్నారు. గురువారం స్థానిక మున్సిపల్ స్టేడియంలో ప్రపంచ విభిన్నప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా విభిన్నప్రతిభావంతులకు ఆటల పోటీల కార్యక్రమం జరిగింది. సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ దేశంలో విభిన్న ప్రతిభావంతుల అభ్యున్నతికోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమశాఖ ద్వారా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి అమలుచేస్తోందని వాటిని పిల్లలు ఉపయోగించుకోవాలన్నారు. మాలో అన్నీ సక్రమంగా ఉన్నా లోపాలు చాలా ఉన్నాయని, మీలో ఒక చిన్నశారీరక లోపం ఉండటం వల్ల నిరాశ చెందరాదని మాకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్నవారు మీరే అన్నారు. అద్భుతమైన శక్తిసామర్థ్యాలు మీలో ఉన్నాయని ఆ విషయం మీరు గుర్తుంచుకోవాలన్నారు. పాఠశాలలు, వివిధ సంస్థలు సంప్రదించడం ద్వారా మరిన్ని సౌకర్యాలు ఏర్పాటుచేస్తామన్నారు. కేవలం క్రీడాపరంగానే కాకుండా సంస్కృతి సంప్రదాయాలపట్ల, చదువుపరంగా మీ యాజమాన్యాల ద్వారా తమవద్దకు వస్తే తప్పక చర్యలు తీసుకుంటామన్నారు. గత ఒలంపిక్స్ క్రీడల్లో భిన్నసామర్థ్యం ఉన్న క్రీడాకారులు పాల్గొన్నారని భారతదేశం నుంచి పాల్గొన్నవారిలో ఇద్దరికి బంగారు పథకాలు, మరొకరికి రజిత , కంచుపతకాలు వచ్చాయని గుర్తు చేశారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలకు కూడా అవకాశాలున్నాయన్నారు. అంతకుముందు జిల్లా జాయింట్ కలెక్టర్ శే్వత తెవతియ మాట్లాడుతూ బాగా చదువుకుంటూ క్రీడల్లో పాల్గొని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. అనంతరం ప్రతిభావంతుల క్రీడాపోటీలు కలెక్టర్ ప్రారంభించారు. క్రీడల్లో పాల్గొన్న బుద్దిమాంధ్యత పిల్లలతో ఆయన ముచ్చటించారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ సహాయ సంచాలకులు వాణి, ఓలంపిక్స్ అసోసియేషన్ సెక్రటరీ సుభాన్‌బాషా, వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు చిన్నసుబ్బయ్య, కార్యదర్శి బాబు, దివ్యాంగుల ఉద్యోగుల సంక్షేమసంఘం ప్రధానకార్యదర్శి లక్ష్మికాంత్, ఎస్‌ఎస్‌ఏ ఇఇఆర్‌టి ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ప్రేమికుల ఆత్మహత్యాయత్నం
* ప్రియురాలి మృతి * కోలుకుంటున్న ప్రియుడు
* ప్రియునిపై కేసు నమోదు
బద్వేలు, నవంబర్ 17: మండలంలోని పెద్ద అగ్రహారం గ్రామానికి చెందిన ప్రేమికులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా ప్రియురాలు మృతిచెందింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పెద్ద అగ్రహారం గ్రామానికి చెందిన పిచ్చయ్య, కేశమ్మల కుమార్తె ఝాన్సీసుమతి (21), పందీటి సుబ్బమ్మ కుమారుడు బాలుడు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే బాలుడికి ఇటీవల అట్లూరు మండలానికి చెందిన ఓ అమ్మాయితో వివాహం కుదిరి నిశ్చితార్థం చేసుకున్నారు. డిసెంబర్‌లో వివాహం కూడా నిశ్చయించుకున్నారు. ఈ నేపథ్యంలో బాలుడు, ఝాన్సీసుమతి గుంతపల్లె క్రాస్‌రోడ్డు వద్ద బుధవారం రాత్రి సూపర్‌వాస్మోల్ తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. అనంతరం బంధువులకు ఫోన్ ద్వారా సమాచారమందించడంతో వారిరువురినీ బంధువులు హుటాహుటిన స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఇరువురి పరిస్థితి విషమించడంతో కడపకు తరలిస్తుండగా మార్గమధ్యంలో ఝాన్సీసుమతి మృతిచెందింది. బాలుడు చికిత్స పొందుతున్నాడు. తన కుమార్తెను వదిలించుకోవడానికే బాలుడు ఆత్మహత్యాయత్నం పేరుతో నాటకమాడాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తూ మృతదేహాన్ని అతడి ఇంటిముందు వుంచి ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న బద్వేలు సిఐ రామాంజినాయక్ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు బాలుడుపై కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోరుమామిళ్లకు తరలించారు.
నల్లకుబేరుల అప్పుల రద్దు తగదు

కడప,నవంబర్ 17: కేంద్రం నల్లకుబేరులను ఏరివేస్తామంటూ వారికి వత్తాసు పలుకుతూ వారి వేలాది కోట్లరూపాయల అప్పులను మాఫీ చేసిందని, పెద్దనోట్లు రద్దుపై నల్లకుబేరులకే అండగా కేంద్రప్రభుత్వం నిలిచిందని సిపిఐ జిల్లా కార్యదర్శి జి.ఈశ్వరయ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. గురువారం ఈశ్వరయ్యతోపాటు జిల్లా ముఖ్యనేతలు నగరంలోని ఎస్‌బిఐ ప్రధాన కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోనే నల్లకుబేరులైన బడా పారిశ్రామికవేత్తలైన వారికి రూ.7వేల కోట్లు రుణాలు రద్దుచేశారని ధ్వజమెత్తారు. కేవలం నల్లధనాన్ని వెలికితీస్తానని ప్రధాని మోదీ ఒకపక్క ప్రకటిస్తూ పెద్దనోట్లు రద్దుచేసి సామాన్యులకు అన్యాయం చేశారని ఆరోపించారు. నోట్లరద్దు నిర్ణయంలో రాజకీయమేనని పెద్దనోట్ల రద్దును తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. చాలా మందికి పెద్దనోట్ల రద్దువిషయం తెలుసునని, వారు నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకుని దాచిపెట్టుకున్నారని , ప్రజలంతా కేంద్రప్రభుత్వంపై తిరగబడే రోజులు దగ్గర పడ్డాయని కేవలం తమ స్వార్థప్రయోజనాలకోసమే బిజెపి ప్రభుత్వం పెద్దనోట్లను రద్దుచేసిందని విమర్శించారు.
అల్లాడుపల్లె వీరభద్రస్వామి ఆలయ కమిటీ ప్రమాణస్వీకారం నేడు
చాపాడు, నవంబర్ 17:మండలంలోని పుణ్యక్షేత్రమైన అల్లాడుపల్లె వీరభద్రస్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణస్వీకారం శుక్రవారం ఉదయం 9గంటలకు జరగనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి డి.వెంకటరమణారెడ్డి తెలిపారు. ఆలయ కమిటీ నూతన చైర్మన్‌గా గోసుల చిన్నవీరారెడ్డి, కమిటీ సభ్యులుగా గోసుల ఎరికలయ్యగారి వీరారెడ్డి, రాచపల్లె వీరభాస్కర్‌రెడ్డి, ఆలూరి నడిపి సంజన్న, గోదెన పెద్దవీరయ్య, గొడుగు దివ్య, ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఆలయ ప్రధాన అర్చకులు డి.నాగశివప్రసాద్‌లు ప్రమాణస్వీకారం చేస్తారన్నారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిధులుగా టిటిడి పాలక మండలి సభ్యులు, టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జ్ పుట్టాసుధాకర్ యాదవ్, మండల ఇన్‌చార్జ్ వైవి సుబ్బారెడ్డి, మాజీ ఎంపిపి , సర్పంచ్ గోసుల శ్రీదేవిలతోపాటు దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శంకర్ బాలాజీ, దేవాదాయశాఖ ఇన్‌స్పెక్టర్ నరసింహమూర్తి తదితరులు హాజరుకానున్నారన్నారు.
రాజకీయాల్లో హుందాగా ఉంటా..
ప్రొద్దుటూరు, నవంబర్ 17:తాను ప్రాణమున్నంతవరకు రాజకీయాల్లో హుందాతత్వంతోనే ఉంటానని, తన రాజీకీయ జీవితంలో ఎక్కడా ఎటువంటి చౌకబారు రాజకీయాలు చేయలేదని నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి నంద్యాల వరదరాజులరెడ్డి అన్నారు. గురువారం స్థానిక టిడిపి కార్యాలయంలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ కుందూ-పెన్నా వరదకాలువ నిర్మాణంలో తాను మంత్రులతో, స్థానిక టిడిపి నాయకులతో లాలూచీపడి కాంట్రాక్టు దక్కించుకోవాలని చూస్తున్నాని కొందరు చేస్తున్న ఆరోపణల్లో ఎంతమాత్రం నిజం లేదన్నారు. ప్రొద్దుటూరు పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఒకే ఒక్క అవకాశం కుందూ-పెన్నా వరదకాలువ నిర్మాణమని, అందుకు తాను శాయశక్తులా కృషి చేస్తున్నానని తెలిపారు. అంతేగానీ తనకు ఏవిధమైన లాభాపేక్ష లేదని, రాజ్యసభ సభ్యుడు సి ఎం.రమేష్‌నాయుడు, లింగారెడ్డిలతో కలిసి భారీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమా సహకారంతో కాలువనిర్మాణాన్ని పూర్తిచేయాలనే ఉద్దేశ్యంతో ముందుకెళ్తున్నాని అన్నారు. దీనిని ప్రతిపక్ష నాయకులు కొందరు ఆసరగా చేసుకొని తనపై బురదజల్లేందుకు ప్రయత్నిస్తున్నారని, అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని, తానెలాంటి వాడినో తనతోపాటు తిరిగి వారికి కూడా తెలుసునని స్పష్టం చేశారు. 25 సంవత్సరాలపాటు ఎమ్మెల్యేగా కొనసాగినప్పటికీ చిన్నపాటి చెడ్డపేరు తెచ్చుకోలేదని, శాంతికాముఖునిగా పేరుతెచ్చుకున్నానని అన్నారు. కాలువకు సంబంధించిన టెండర్లు కేవలం ఇంజనీర్ల సాంకేతిక లోపం వల్లే రెండుసార్లు రద్దయ్యాయని, అందులో ఎటువంటి మతలబు లేదన్నారు. తనకు గిట్టని వారు చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు ఎన్నటికీ నమ్మరన్నారు. టిడిపి తరుపున ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోటీచేస్తున్న వారిని మార్చిలో జరగబోయే ఎన్నికల్లో తన శక్తివంచన లేకుండా కృషి చేసి వారి గెలుపుకు కృషి చేస్తానని అన్నారు. అలాగే టిడిపి నాయకులు, కార్యకర్తలు కూడా వారి గెలుపుకు సహకరించాలని ఆయన సూచించారు. మున్సిపల్ వైస్ చైర్మెన్ వైఎస్.జబీవుల్లా, టిడిపి పట్టణాధ్యక్షుడు ఘంటసాల వెంకటేశ్వర్లు, కౌన్సిలర్లు తలారి పుల్లయ్య, మునిరెడ్డి పాల్గొన్నారు.

పెద్దనోట్ల రద్దుతో సామాన్యుల ఇక్కట్లు
* జిల్లా పరిషత్ చైర్మెన్ గూడూరు రవి
కమలాపురం, నవంబర్ 17:పెద్దనోట్ల రద్దుతో సామాన్యులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని జడ్పీ చైర్మెన్ గూడూరు రవి అన్నారు. ఆయన గురువారం స్థానిక ఎస్‌బిఐ వద్ద డబ్బుల కోసం వేచి ఉన్న మహిళలతో మాట్లాడి వారు పడుతున్న ఇబ్బందులనడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం ఎటువంటి కార్యాచరణ ప్రణాళికలు సిద్దం చేయకుండా పెద్దనోట్లను రద్దు చేయడంతో పేద, మధ్య తరగతి ప్రజలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటి, వ్యవసాయపనులను వదిలేసి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి బ్యాంకుల వద్ద గంటలతరబడి వేచి ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. దేశంలో అధికాశాతం ప్రజలు పట్టణాలలో నివసిస్తున్నారని తక్కువశాతం రైతులు, సామాన్యులు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నారన్నారు. వీరికి బ్యాంకింగ్ వ్యవస్థకు సంబందించిన సాంకేతిక పరిజ్ఞానం తెలియదని అన్నారు. వీరందరూ గత 10రోజులుగా బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సివస్తోందని విమర్శించారు. అంతేకాక బాంకుల వద్ద అధికారులు క్యూలో నిల్చుకున్న వారికోసం షామియానాలు కాని, మంచినీటి సౌకర్యాన్ని గాని ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాగే డబ్బుల కోసం పల్లెల నుంచి వచ్చేవారికి భోజనాలు, చార్జీలు తడిసి మోపెడు ఖర్చవుతోందని అన్నారు. ఇప్పటికైనా బ్యాంకు అధికారులు ప్రజలకు తగిన వసతులు ఏర్పాటు చేయాలన్నారు. బ్యాంకు మేనేజర్ గంగరాజును జడ్పీ చైర్మెన్ ఛాంబర్‌లో కలసి బ్యాంకు ఖాతాదారులకు మంచినీరు ఎండలో నిలవకుండా షామియాలను కూడా వేయలేదని ఆయన దృష్టికి తెచ్చారు. అలాగే వివాహాలు, అశుభాలకోసం డబ్బులు ఎంతో అవసరం ఉంటుందని వీటి విషయంలో కొంత ప్రాధాన్యత కల్పించి వారికి అవసరమైన మేర డబ్బులు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరగా మేనేజర్ అందుకు స్పందిస్తూ ప్రభుత్వం,రిజర్వుబ్యాంకు ఆదేశాల మేరకు తాము నడుచుకోవాల్సి వస్తుందని స్పష్టం చేసారు. ఐతే జడ్పీ చైర్మెన్ సూచన మేరకు స్పందించిన బ్యాంకు మేనేజర్ క్యూలో ఉన్న ఖాతాదారుల కోసం వెంటనే మినరల్‌వాటర్ ఏర్పాటు చేసారు.
విద్యార్థులకు వ్యాసరచన పోటీలు
రైల్వేకోడూరు, నవంబర్ 17:మండలంలోని అనంతరాజుపేట హైస్కూల్‌లో గురువారం విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ అనే అంశంపై వ్యాస రచన పోటీలు నిర్వహించారు. గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా విద్యార్థులకు ఈ పోటీలను నిర్వహించినట్లు లైబ్రేరియన్ మధు తెలిపారు. విజేతలకు బహుమతీ ప్రధానం చేస్తామన్నారు. ఆసక్తి ఉన్న వారు కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ కె.ప్రతాప్‌రాజు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
14వ తిరుమల మహాపాదయాత్ర గోడపత్రిక విడుదల
రాజంపేట, నవంబర్ 17:జిల్లా వైకాపా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి నేతృత్వంలో 14వ మారు అన్నమయ్య తిరుమలకు నడిచి వెళ్ళిన మార్గంలో చేపట్టనున్న మహాపాదయాత్ర పోస్టర్‌ను గురువారం స్థానిక ఆకేపాటి భవన్‌లో విడుదల చేశారు. డిసెంబర్ 10వ తేదీ రాజంపేట మండలం ఆకేపాడు ఆలయాల సముదాయం నుండి ప్రారంభమయ్యే మహాపాదయాత్రలో భక్తులు వేలాదిగా వచ్చి పాల్గొనాలని ఈ సందర్భంగా పసుపులేటి సుధాకర్ తెలిపారు. పాదయాత్రలో పాల్గొనే భక్తులకు భోజన వసతి సదుపాయాలు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో వైకాపా బీసీ సెల్‌కు చెందిన పసుపులేటి సుధాకర్, వైకాపా నేతలు గోవిందు బాలక్రిష్ణ, వెంకటరెడ్డి, ఆర్ట్స్ శేఖర్, ఎస్‌ఆర్ యూసఫ్, దండుగోపి, కళాకారుల ఐక్యవేదిక కన్వీనర్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సాధికార సర్వే పూర్తికి
ప్రజలు సహకరించాలి:జెసి
కడప(కల్చరల్),నవంబర్ 17: ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రజాసాధికార సర్వే ఈనెల 30తో ముగుస్తున్నందున సర్వేలో ఇప్పటి వరకు నమోదుచేసుకోని ప్రజలు తమ వివరాలతో ఎన్యూమరేటర్లకు సహకరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శే్వత తెవతియ గురువరం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో 88.86శాతం, పట్టణ ప్రాంతాల్లో 49.93శాతం మాత్రం ప్రజాసాధికార సర్వేలో నమోదు చేసుకున్నారు. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో 2లక్షల ఒక్కవెయ్యి 104 మంది , పట్టణ ప్రాంతాల్లో 6లక్షల 34వేల 957 మంది నమోదు కావాల్సి ఉందన్నారు. ముఖ్యంగా కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు, పులివెందుల మున్సిపాల్టీలో అతి తక్కువ నమోదు కాబడిందన్నారు. సాధికార సర్వే గడువు ముగుస్తున్నందున ప్రజలు ముందుకు వచ్చి తప్పక సర్వేలో వివరాలు నమోదుచేసుకోవాలన్నారు. గడువు ముగిసిన తర్వాత ఎటువంటి నమోదులు చేయబడవన్నారు. ఇంటర్‌నెట్ సౌలభ్యం లేని ప్రాంతాల్లో ప్రజల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదుచేయబడి ఇంర్నెట్ సౌలభ్యం ఉన్న ప్రాంతం నుంచి వివరాలు ఆప్‌లోడ్ చేస్తారన్నారు. ప్రభుత్వం ప్రజలకు కల్పించే అభివృద్ధి, సంక్షేమం పథకాలు ప్రజాసాధికార సర్వే వివరాలు ఆధారంగా కల్పించడం జరుగుతుందన్నారు. కావున ప్రజాసాధికార సర్వేలో నమోదు చేసుకోని వారు తమ వద్దకు వచ్చే ఎన్యూమరేటర్ల ద్వారా వెంటనే నమోదుచేసుకోవాలని కోరారు. ప్రజాసాధికార సర్వేలో తమ వివరాలు నమోదుకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే ఆయాప్రాంతాల సంబంధిత కార్యాలయాలను సంప్రదించాలన్నారు. కావునప్రజలు ముందుకువచ్చి తప్పక సర్వేలో వివరాలు నమోదుచేసుకోవాలని జెసి వివరించారు.
మహిళ ఆత్మహత్య
వల్లూరు,నవంబర్ 17:మండలంలోని కొప్పోలు గ్రామానికి చెందిన ఎర్రమాచు శ్రావణి (27) నిప్పంటిచుకుని మృతి చెందినట్లు ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు. మృతురాలికి ఓబులరెడ్డితో గత ఏడుసంవత్సరాల క్రితం వివాహం జరిగిందని, వీరికి ఇద్దరు పిల్లలున్నారన్నారు. నాలుగు సంవత్సరాల నుంచి మృతురాలికి మతిస్థిమితం సరిగా లేదని బుధవారం రాత్రి ఆమెపై కిరోసిన్ పోసుకుని నిప్పుపెట్టుకుందన్నారు. మృతురాలి తండ్రి మహేశ్వరరెడ్డి ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
గుర్తు తెలియని శవం లభ్యం
ఖాజీపేట,నవంబర్ 17:మండలంలోని ఆంజనేయపురం గ్రామ సమీపంలోని కల్వర్టు కింద గుర్తు తెలియని (42) మృతదేహాన్ని స్థానికులు కనుగొన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. చొక్క, లుంగీ ధరించిన వ్యక్తిపై కిరోసిన్ లేదా పెట్రోలు పోసి నిప్పంటించినట్లు అక్కడి పరిస్థితులు బట్టి తెలుస్తోంది. దీంతో వ్యక్తి గుర్తులు ఏవీ కన్పించకపోవడంతో పోలీసులు విచారణ చేపట్టారు. మైదుకూరు డిస్పీ రామకృష్ణయ్య, ఖాజీపేట ఎస్‌ఐ రంగారావు తన సిబ్బందితో వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కడప నుంచి క్లూస్ టీమ్ రప్పించి విచారణ చేపట్టారు. చనిపోయిన వ్యక్తి స్థానికేతరుడై ఉంటాడని , స్థానికుడై ఉంటే పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదులు అందేవన్నారు. వీటిపై సమగ్ర దర్యాప్తు చేసి నిందితులను పట్టుకుంటామని డిఎస్పీ తెలిపారు.
కిడ్నాప్ కేసులో
నిందితులకు యావజ్జీవం
* ఆత్మహత్యకు పాల్పడిన నిందితుడు
ప్రొద్దుటూరు టౌన్, నవంబర్ 17:మైదుకూరు మండలం కేశలింగాయపల్లె గ్రామానికి చెందిన బండి సూర్య అనే బాలుడి కిడ్నాప్ కేసుకు సంబంధించి ప్రొద్దుటూరు రెండవ అదనపుజడ్జి మనోహన్‌రెడ్డి ముగ్గురు ముద్దాయిలకు యావజ్జీవ ఖారాగారశిక్ష విధిస్తూ గురువారం తీర్పు వెలువరించారు. ఈ నేపథ్యంలో మూడవ నిందితుడిగా ఉన్న బండి క్రిష్ణ కోర్టు హాలు నుంచి బయటకు వచ్చి కోర్టు భవనం రెండవ అంతస్తు నుంచి ఒక్కసారిగా కిందకు దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఊహించని ఈ సంఘటనకు అక్కడున్న న్యాయవాదులు, ప్రజలు దిగ్బ్రాంతికి గురయ్యారు. గాయపడిన క్రిష్ణను పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని ముఖానికి, నడుముకు గాయాలవడంతో చేతులు, కాళ్లు చచ్చుపడిపోయాయని వైద్యులు తెలిపారు. మైదుకూరు నియోజకవర్గ పరిదిలోని కేశలింగాయపల్లె గ్రామానికి చెందిన బండి సూర్యను అదే గ్రామానికి చెందిన సూర్యదాయాది అయిన బండి క్రిష్ణతోపాటు మైదుకూరుకు చెందిన షేక్ ముబారక్, షేక్ షాదిక్ సూర్యను కిడ్నాప్ చేశారు. అప్పట్లో ఈ ముగ్గురిపై కేసు నమోదైంది. ఆస్తి కోసం సూర్యను కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. కిడ్నాప్‌కు గురైన బండి సూర్య మైదుకూరులో కిడ్పాపర్ల చెర నుంచి తప్పించుకుని ఇంటికి చేరాడు. అప్పటి నుంచి ప్రొద్దుటూరు కోర్టులో విచారణ జరుగుతుండగా కేసు పూర్వాపరాలను పరిశీలించిన మెజిస్ట్రేట్ ముగ్గురికీ జీవితఖైదును విధించారు. శిక్ష పడిన ముద్దాయిలు ముగ్గురు యువకులు కావడంతో తమ జీవితమంతా జైల్లోనే మగ్గిపోవాల్సి ఉంటుందని భావించి బండి క్రిష్ణ ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
ఎర్రచందనం స్వాధీనం
రైల్వేకోడూరు, నవంబర్ 17:మండలంలోని శెట్టిగుంటకు చెందిన టిడిపి నాయకులు నీలకంఠయ్య మామిడి తోటలో బుధవారం రాత్రి అందిన సమాచారంతో 45 దుంగలను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు తన మామిడి తోటలో ఈ దుంగలను ఉంచారని, తనను రాజకీయంగా దెబ్బ తీయాలనే ఉద్ధేశ్యంతో ఈ కార్యక్రమానికి ఒడికట్టినట్లు తోట యాజమాని నీలకంఠయ్య పోలీసులకు వివరించారు. పట్టుకున్న దుంగల విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.