కడప

కార్యకర్తలే పార్టీ బలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దవటం,డిసెంబర్ 16: బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పిలుపుమేరకు కార్యకర్తలతో బూత్ లెవెల్ కమిటీలు ఏర్పాటుచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనాథరెడ్డి అన్నారు. మాధవరంలోని బిజెపి మండల ప్రధానకార్యదర్శి అమరనాధ్ శర్మ ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సమావేశం రాజోలు సుబ్బరాయుడు అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిధిగా విచ్చేసిన శ్రీనాథరెడ్డి మాట్లాడుతూ పార్టీ కమిటీలు వేసి భవిష్యత్‌లో బిజెపి కార్యకర్తలు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే విధంగా కార్యకర్తలను తయారు చేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో బూత్‌స్థాయి కార్యకర్తలను ఏర్పాటుచేసుకుని కమిటీలు వేయాలన్నారు. కొందరు స్థానిక కార్యకర్తలు సోమశిల ముంపుప్రాంత నిరుద్యోగుల సమస్యలు ఆయన దృష్టికి తేగా రాష్ట్ర బిజెపి నాయకుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మండలంలోని ప్రతి బూత్‌లో కమిటీలు ఏర్పాటు చేయాలని మండల కార్యవర్గం తీర్మానించింది. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యదర్శి మోహన్‌రావు, మండల ఉపాధ్యక్షుడు పి.శ్రీనివాసులు, బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు బత్తలపవన్‌కుమార్, నాయకులు సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి దృష్టికి
గండికోట నిర్వాసితుల సమస్య..

కడప,డిసెంబర్ 16:గండికోట రిజర్వాయర్ ముంపువాసులకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించని కారణంగా ప్రాజెక్టులోకి నీరుచేరిన,ప్రమాదంలో సంబంధిత ప్రాంత ప్రజలు ఉన్నా పరిహారం చెల్లించాలని శుక్రవారం ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు దృష్టికి జమ్మలమడుగు ఎమ్మెల్యే సి.ఆదినారాయణరెడ్డి తీసుకెళ్లారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ వ్యవహారాన్ని జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారు. ఈనేపధ్యంలో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి నిర్వాసితులను వెంటపెట్టుకుని విజయవాడ సచివాలయంలో మంత్రిని నిర్వాసితులు కలిశారు. ఇప్పటికే గండికోట రిజర్వాయర్‌లోకి దాదాపు రెండు టిఎంసిల నీరు చేరగా 14 గ్రామాలు ముంపునకు గురికాగా, మూడు గ్రామాలు ప్రమాదం అంచుల్లో ఉన్నాయి. వారంతా పూర్తిస్థాయిలో పరిహారం అందిస్తే తప్ప గ్రామాలను ఖాళీ చేసే ప్రసక్తేలేదని తేల్చిచెబుతున్నారు. ఈనేపధ్యంలో ఆదినారాయణ దృష్టికి తీసుకెళ్లగా ముంపుగ్రామస్తులందరినీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యమంత్రితో సంప్రదించిన అనంతరం జలవనరులశాఖ మంత్రి దేవినేని నిర్వాసితులు చెప్పిన విషయాలు తెలుసుకున్నారు. జలవనరులశాఖ ప్రభుత్వకార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ను కూడా మంత్రిదేవినేని, ఎమ్మెల్యే ఆది, నిర్వాసితులు సంప్రదింపులు చేశారు. ఎకరాకు రూ.6లక్షల 75వేలు పరిహారం ఇవ్వాలని, నివాస గృహాలు , వౌళిక సదుపాయాలు విశాలంగా ఉండాలని తమకు పూర్తిస్థాయిలో పరిహారం ఇస్తే ఖాళీ చేస్తామని తెగేసా చెప్పడంతో మంత్రిదేవినేని, జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌లు నిర్వాసితులకు గట్టి హామీ ఇచ్చారు.

ఆర్టీసీ సిసిఎస్ ఎన్నికల్లో ఉత్కంఠ..

కడప,డిసెంబర్ 16: ఆర్టీసీ పొదుపు ప్రధాన పరపతి సంఘం (సిసిఎస్) ఎన్నికల పోలింగ్ శుక్రవారం పెద్ద ఎత్తున ముగిసి జిల్లాలోని నాలుగు ఆర్టీసీ డిపోల్లో బరిలో దిగిన రెండు ఆర్టీసీ కార్మికుల యూనియన్లు నాలుగేసి డిపోలను చేజిక్కించుకున్నారు. ఐదు సంవత్సరాలకొకమారు రాష్టవ్య్రాప్తంగా ఆర్టీసీ సిసిఎస్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరగడం, రాష్ట్ర విభజన అనంతరం మొట్టమొదటి ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికలు హోరాహోరీగా నేతలు పోటీపడ్డారు. జిల్లాలో ఎనిమిది ఆర్టీసీ డిపోలు ఉండగా 8డిపోల్లో 3565 ఓట్లు, జోనల్ వర్క్‌షాప్‌లో 216 ఓట్లు, రీజనల్ మేనేజర్ కార్యాలయంలో 135 ఓట్లు ఉన్నాయి. ఎన్నికల్లో తొలి నుంచి నేషనల్ మజ్దూర్ యూనియన్ , ఎంప్లారుూస్ యూనియన్, కార్మిక పరిషత్ సంఘాలు ఉన్నాయి. దాదాపు మూడేళ్లక్రితం వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కూడా కార్మిక యూనియన్ స్థాపించింది. అయితే జిల్లాలో అరకొర డిపోల్లో మాత్రమే వైఎస్సార్ ఆర్టీసీ కార్మికుల్లో కొంతమేరకు పరపతి వుంది. శుక్రవారం జరిగిన ఎన్నికల్లో ఎన్‌ఎంయు, ఎంప్లారుూస్, కార్మిక యూనియన్లు బరిలో దిగడంతో ఎంప్లారుూస్ యూనియన్‌కు వైఎస్సార్ కూటమి ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు తెలిపింది. కడప, రాయచోటి, బద్వేలు, మైదుకూరు డిపోల్లో నేషనల్ మజ్దూర్ యూనియన్ హవా కొనసాగింది. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, రాజంపేట, పులివెందులలో ఎంప్లారుూస్ యూనియన్ వైసిపి మద్దతుతో గెలుపొందాయి. గత రెండురోజులుగా హోరాహోరీగా ఎన్నికల ప్రచారం జరగగా రాజకీయ నాయకుల ఎన్నికల తరహాలో మద్యం ఏరులే పారించి, కరెన్సీని విచ్చల విడిగా ఖర్చుచేశారు. ఎన్నికల్లో ఎనిమిది డిపోల్లో 40మంది అభ్యర్థులు బరిలో దిగగా మజ్దూర్ యూనియన్ తరపున 14 మంది, ఎంప్లారుూస్ యూనియన్ తరపున 14మంది, కార్మిక పరిషత్ తరపున 12 మంది బరిలో దిగారు. వీరంతా రాజకీయ నాయకులను కూడా ఆశ్రయించి కార్మికులపై వత్తిడి తెప్పించి ఓట్లు వేయించుకున్నారు. ఉదయం నుంచి ఉత్కంఠభరితంగా ఎన్నికలు కొనసాగాయి. రాత్రి 9గంటల ప్రాంతంలో ఫలితాలు ప్రకటించారు.

నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలి
కడప,(కలెక్టరేట్)డిసెంబర్ 16: ప్రజలు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని నగదు రహిత లావాదేవీలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కెవి సత్యనారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నగదు రహిత లావాదేవీలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిమానిటైజేషన్ తర్వాత నగదు రహిత లావాదేవీలపై అనేక మార్లు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సులభంగా అర్థంచేసుకుని ప్రజలు నగదు రహిత లావాదేవీలునిర్వహించవచ్చునన్నారు. అందులో భాగంగా శుక్రవారం ఎస్‌బిఐ పేటిఎం కంపెనీ వారు తమ పరికరాలతో నగదు రహిత కార్యక్రమాలు ఎలా నిర్వహించాలో తెలియజేసేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. నెలవారీ అద్దె, సర్వీసుటాక్స్ తదితర లావాదేవీలను ఎలా నిర్వహించాలో వారు చేసి చూపించడం జరిగిందన్నారు. ప్రజలందరూ నగదు రహిత లావాదేవీలకు అలవాటుపడాలని ఆయన కోరారు. ఈసమావేశంలో జెసి శే్వత తెవతియ, డిఆర్‌డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ అనిల్‌కుమార్‌రెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ రఘునాథరెడ్డి, వివిధ మెడికల్ షాపుల యజమానులు, వ్యాపారులు పాల్గొన్నారు.

జగన్ సీఎం కావడం కలే..

కడప,డిసెంబర్ 16: ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వల్ల జనాలకు ఒరిగేదేమి లేదని, అవినీతి అక్రమాల్లో గొంతువరకు కూరుకుపోయారని ఆయన బయటపడటం కలేనని, అధికారం కోసం పాకులాడటమే తప్ప జనాలకు చేసింది ఏమీ లేదని టిడిపి సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ, మాజీమంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు పేర్కొన్నారు. శుక్రవారం ఓ కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాభావంతో రైతులు అల్లాడుతుంటే, సీమ జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టిసీమను పూర్తిచేసి పోలవరం ప్రాజెక్టును శరవేగంగా నిర్మిస్తున్నారన్నారు. గాలేరు-నగరి, హంద్రీ-నీవా సుజల స్రవంతి, భారీ రిజర్వాయర్లు పూర్తిచేసి కరవురైతులకు తాగునీరు, సాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రి విశ్వప్రయత్నాలు యజ్ఞం తరహాలో తపిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను చూసి ప్రజలు ఆకర్షితులౌతూ రోజురోజుకు తెలుగుదేశంపార్టీ పుంజుకోవడం, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ బలహీనపడుతుంటంతో జగన్‌కు మతిభ్రమించి అధికారదాహంతో తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం తగదన్నారు. ఏడాదిలో ఎమ్మెల్యే ఎన్నికలు వస్తాయంటూ భ్రమపెడుతూ తన పార్టీ ఎమ్మెలు పక్కచూపు చూడకుండా కట్టిడిచేసేందుకేనన్నారు. ఇదిగో ఎన్నికలు, అదిగో ఎన్నికలు అంటూ ప్రజలను మభ్యపెడుతూ కాలం గడుపుతున్నారని విమర్శించారు. తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో లక్షలకోట్లరూపాయలు ప్రజాధనాన్ని లూఠీ చేసి తన నాయకుడిని అవినీతి అక్రమార్కులు అంటూ ప్రచారం చేస్తున్న విధానం చూస్తుంటే దెయ్యాలు వేదాలు అల్లినట్లు వుందని ధ్వజమెత్తారు. సిద్దాంతపరంగా రాజకీయాలతో ప్రజల్లోకి వెళ్లాలికానీ ప్రజలు అసహ్యించుకోకూడదన్నారు. అలాగే జగన్‌కు రాజ్యాంగంమీద కానీ మిగిలిన వ్యవస్థలమీదకానీ గౌరవం లేదని ఆరోపించారు. అసెంబ్లీలో ఆయన తీరు ప్రజలే అసహ్యించుకుంటున్నారని ఆయన ప్రతిపక్షహోదాకు తగరని ఆరోపించారు. అత్యంత వెనుకబడిన రాయలసీమకు సాగునీరు, తాగునీరు ఇస్తే జనాలు జగన్‌ను చీదరించుకుంటారని, కరవుతో ప్రజలు అల్లాడుతుంటే ఫ్యాక్షన్‌ను ప్రోత్సహించి జగన్ పబ్బం గడుపుకోవాలని ఉన్నారే తప్ప ప్రజాశ్రేయస్సు కోరడం లేదని, రైతు సంక్షేమం ఆశించడం లేదని ఆయన ధ్వజమెత్తారు. తన తండ్రి హయాంలో, ఆయన హయాంలో పులివెందులకు వందల కోట్లరూపాయలు ఖర్చుచేసి చుక్కనీరు ఇవ్వలేకపోయారని చంద్రబాబు పులివెందులకు నీరిచ్చి ప్రజల హృదయాల్లో నిలిచిపోయారన్నారు. ఇప్పటికైనా జగన్ ప్రాంతాల వారీగీ తిరిగి కులాలు, మతాలపేరుతో రెచ్చగొట్టడం మానుకోవాలని గాలి హితవుపలికారు.

రైతుల సమస్యల పరిష్కార వేదిక
ఫార్మర్స్ క్లబ్

మైదుకూరు, డిసెంబర్ 16: రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సమష్టిగా పరిష్కరించుకునేందుకు ఫార్మర్స్ క్లబ్ ఒక పరిష్కార వేదికగా పనిచేస్తుందని నాబార్డ్ జిల్లా అభివృద్ది అధికారి బి.శ్రీనివాసులు తెలిపారు. జాతీయ గ్రామీణ వ్యవసాయ అభివృద్ధి బ్యాంక్ వారి ఆధ్వర్యంలో హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ శుక్రవారం బి.కొత్తపల్లెలో ఏర్పాటు చేసిన ఫార్మర్స్ క్లబ్‌లో సిండికేట్ బ్యాంక్ సీనియర్ బ్యాంక్ మేనేజర్ లీలా ప్రసాద్‌తో కలిసి ఆయన లాంఛనంగా ప్రారంభించారు. సర్పంచ్ జి.నాగిరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫార్మర్స్ క్లబ్‌ల వలన రైతులకు అనేక ప్రయోజనాలు కల్పిస్తుందని తెలిపారు. నాబార్డ్ ఫార్మర్స్ క్లబ్‌ల ఏర్పాటును ప్రోత్సహిస్తుందని, క్లబ్‌ల సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. క్లబ్‌లో సభ్యులకు నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుందని తెలిపారు. జిల్లాలో నాబార్డ్ ద్వారా పలు బ్యాంకుల నుంచి రూ.1,80,000 కోట్లు స్వల్ప, దీర్ఘ కాలీక రుణాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 38 రకాల సబ్సిడీ రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని, రైతు క్లబ్‌ల సభ్యులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. సిండికేట్ బ్యాంక్ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ లీలాప్రతాప్ మాట్లాడుతూ తమ సంస్ధ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు పలు రకాలలో జీవనోపాధి కల్పించడం కోసం ఉచిత సదుపాయాలు కల్పించి శిక్షణలు ఇస్తున్నామని వాటిని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వెటర్నరి డాక్టర్ శివశంకర్, హెచ్ సంస్ధ అధ్యక్షుడు క్రిష్ణయాదవ్, క్లబ్ కన్వీనర్ శివారెడ్డి, రాటా ప్రతినిధి ఉమాకాంత్‌తో పాటు రైతులు పాల్గొన్నారు.

వ్యవసాయ, పాడి రైతుల సంక్షేమానికి కృషి

రాజంపేట, డిసెంబర్ 16:రూ.100 కోట్ల నిధులతో రాష్ట్రంలో రైతులు తమ పంటలను యార్డులకు చేరివేసేందుకు వీలుగా రహదారుల నిర్మాణాల పనులు చేపట్టడం జరిగిందని రాష్ట్ర మార్కెట్ కమిటీ ఛెర్మన్ల అసోసియేషన్ అధ్యక్షుడు సిద్ధం శివరామ్ తెలిపారు. శుక్రవారం రాజంపేట మార్కెట్ యార్డులో విలేఖరులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మార్కెట్‌యార్డులను రైతులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని, ఇందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించి ఉన్నారన్నారు. అంతేకాకుండా మార్కెట్‌యార్డులను రైతులకు ఉపయోగపడేలా తీర్చిదిద్దేందుకు పూర్తిస్థాయిలో సహకారం సీఎం అందిస్తున్నారన్నారు. ఇప్పటికే వ్యవసాయ రైతులతో పాటు పాడి రైతుల సంక్షేమానికి విశేషంగా కృషి చేస్తున్నామన్నారు. రైతులు తమ పంటలను అమ్ముకునేందుకు వీలుగా రాష్ట్రంలో ఇప్పటికే 50 రైతు బజార్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే రైతులు తమ పంటలకు గిట్టుబాటు ధరలు వచ్చేవరకు యార్డుల్లో నిల్వ ఉంచుకునేందుకు వీలుగా ప్రత్యేక చర్యలు కూడా తీసుకోవడం జరిగిందన్నారు. మార్కెట్ కమిటీలను రైతులకు ఉపయోగపడేలా చేసేందుకు తమ విజ్ఞప్తులన్నింటిని పరిగణనలోకి తీసుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే మార్కెట్‌కమిటీల ఛైర్మెన్స్ పదవీకాలాన్ని 3 ఏళ్ల పాటు పెంచాలని తాము చేసిన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాపితంగా రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు మార్కెట్ కమిటీలు తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించేందుకు పర్యటిస్తూ వస్తున్నామని, రైతులతో ముఖాముఖి సమావేశాలు ఏర్పాటు చేసుకొని చర్చించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర మార్కెట్ కమిటీ ఛైర్మెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో త్వరలోనే రాష్ట్రంలో రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు వీలుగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకొని ముఖ్యమంత్రికి సమర్పించనున్నట్టు కూడా ఆయన వెల్లడించారు. అంతకు ముందుగా రాజంపేట మార్కెట్‌యార్డును సందర్శించిన సిద్ధం శివరామ్‌ను రాజంపేట మార్కెట్ కమిటీ ఛైర్మన్, రాష్ట్ర మార్కెట్ కమిటీ ఛైర్మన్లు ప్రధాన కార్యదర్శి కూడా అయిన యెద్దల విజయసాగర్ దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా యెద్దల విజయసాగర్ మాట్లాడుతూ రాష్టవ్య్రాపితంగా తమ ఛైర్మన్‌తో పాటు తాను పర్యటిస్తూ రైతుల సమస్యలు స్వయంగా తెలుసుకుంటున్నామన్నారు. రాజంపేట మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరాలతో పాటు, మార్కెట్‌యార్డులో రైతులకు అనుకూలంగా సిమెంట్‌రోడ్ల నిర్మాణం జరపడం జరిగిందన్నారు. ఇక్కడి రైతుల ప్రయోజనాలు కాపాడేలా అనేక చర్యలు త్వరలోనే రాజంపేట మార్కెట్‌కమిటీ తరపున తీసుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకొని ఉన్నట్టు కూడా ఆయన చెప్పారు.

నగదు కొంత - క్యూ బారెడంత!

గాలివీడు, డిసెంబర్ 16: మూడు జిల్లాల సరిహద్దు కూడలి మండల కేంద్రమైన గాలివీడు స్టేట్‌బ్యాంకులో నగదు పొందేందుకు ఖాతాదారులు నానా తిప్పలు పడాల్సి వస్తోందని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం కొందరు గ్రామీణ ప్రాంతాల రైతులు తెల్లవారుజామున 4 గంటలకే స్టేట్‌బ్యాంకు వద్ద నగదు కోసం ముందుగా క్యూలో నిల్చునేందుకు రావడం జరుగుతోంది. ఉదయం 6 గంటలకే నగదు కోసం జనం ఎస్‌బీ ఐ నుంచి పోలీస్‌స్టేషన్ వరకు బారులు తీరడంతో ఎస్ ఐ మంజునాధ్ ముందస్తుగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఖాతాదారులు మాత్రం క్యూలైన్లలో బారులు తీరి బారీగా ఉండటంతో పాటు బ్యాంకు వీరందరికీ సరిపడ నగదు లేకపోవడం ఎస్ ఐ మంజునాధ్ బ్యాంకు అధికారులతో చర్చించి కేవలం 300 మందికి మాత్రమే టోకెన్లు ఇచ్చి మిగిలిన వారిని పంపివేయడం జరిగింది. రాయచోటి నియోజకవర్గంలో రాయచోటి తర్వాత గాలివీడు ఎస్‌బీ ఐలోనే అధికంగా లావాదేవీలు జరుగుతుంటాయి. దీనికి తోడు ఈ మండల కేంద్రానికి సమీపంలోని అనంతపురం జిల్లా నంబులపూలికుంట, చిత్తూరు జిల్లాలోని పెద్దమండెం, తంబళ్లపల్లె మండలాలకు కూడా ఈ ఎస్‌బీ ఐలో ఖాతాలు ఉన్నాయి. పరిస్థితి గమనించిన అధికారులు గాలివీడు ఎస్‌బీ ఐకి అదనంగా నగదును అందజేసి రైతులు, మహిళలు, వృద్ధుల కష్టాలు తొలగించాల్సిందిగా పలువురు పేర్కొంటున్నారు.
రోడ్డెక్కిన ఖాతాదారులు
సంబేపల్లె: పెద్దనోట్లు రద్దయి 40 రోజులు కావస్తున్నా బ్యాంకులలో ఖాతాదారులకు సరిపడేంత నగదు మొత్తం లేకపోవడంతో శుక్రవారం మండల కేంద్రంలోని ఎస్‌బీ ఐ శాఖ వద్ద ఆ శాఖకు సంబంధించిన ఖాతాదారులు నో క్యాష్ అని బ్యాంకు అధికారులు బోర్డు తగిలించడంతో రోడ్డుపై బైఠాయించారు. గత వారం రోజుల నుండి పెద్ద బ్యాంకుల నుండి గ్రామీణ బ్యాంకులకు నగదు సక్రమంగా సరఫరా కాకపోవడంతో ఉన్న కొద్దిపాటి మొత్తాలను బ్యాంకు అధికారులు వచ్చిన ఖాతాదారులకు తక్కువ మొత్తాలను ఇస్తుండటంతో రద్దీ నెలకొనడంతో బ్యాంకులో నగదు నిల్వలు లేకుండటంతో ఒక్కసారిగా ఖాతాదారులందరూ ఆగ్రహావేశాలతో రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ సయ్యద్ హషం బ్యాంకు వద్దకు వచ్చి బ్యాంకు అధికారులతో ఖాతాదారులతో చర్చించి ఇకపై నగదుకు సంబంధించిన విషయాన్ని ముందుగానే నోటీసుబోర్డులో తెలియపరుస్తామని తెలపడంతో ఖాతాదారులు శాంతించారు. ఖాతాదారులు బైఠాయించడంతో జాతీయ రహదారిపై కొద్దిసేపు వరకు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఎస్ ఐ సర్దిచెప్పడంతో ఖాతాదారులు అక్కడి నుండి వెళ్లిపోయారు. ఎస్‌బీ ఐకి అదనంగా నగదును అందజేసి రైతులు, మహిళలు, వృద్ధుల కష్టాలు తొలగించాల్సిందిగా పలువురు పేర్కొంటున్నారు.

కడపలో నిర్మిత కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్

కడప,డిసెంబర్ 16: కడప నగరంలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ వద్ద గృహనిర్మాణ సంస్థ ఆధ్వరంలో నిర్వహిస్తున్న నిర్మిత కేంద్రాన్ని కలెక్టర్ కెవి సత్యనారాయణ పునఃప్రారంభించారు. శుక్రవారం ఫ్లయాష్ బ్రిక్స్ యంత్రాన్ని స్విచ్ ఆన్‌చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం పేద ప్రజలకోసం గృహనిర్మాణ కార్యక్రమం చేపట్టినందున లబ్ధిదారులకు సరసమైన ధరలకు నాణ్యమైన ఇటుకలు, కిటికీలు తయారుచేసి ఇవ్వాలని గృహనిర్మాణ సంస్థను కోరారు. ప్రస్తుతం ఎన్‌టిఆర్ పట్టణ గృహనిర్మాణ పథకం కింద మంజూరైన లబ్ధిదారులకు సరఫరా చేయాలనే లక్ష్యంతో నేడు నిర్మిత కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. పేద ప్రజలకు నాణ్యతతో కూడిన కిటికీలు, ఇటుకలు తయారుచేయడంపై శ్రద్ధ చూపాలన్నారు. గృహనిర్మాణ సంస్థప్రాజెక్టు డైరెక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో మూడునిర్మిత కేంద్రాలు ఉన్నాయని ఉపనిర్మిత కేంద్రాలు పులివెందుల, లక్కిరెడ్డిపల్లె, రాయచోటి, ప్రొద్దుటూరు, ముద్దనూరు, కమలాపురంలలో ఉన్నాయన్నారు. కడప నిర్మిత కేంద్రంలో రోజుకు 250 ఇటుకలు తయారు చేయడం జరుగుతుందన్నారు. అనంతరం నిర్మిత కేంద్ర ఆవరణలో కలెక్టర్ హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్, సమాచార శాఖ సహాయ సంచాలకులు అబ్దుల్ రఫిక్‌లు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటనారాయణ, డిఇ బాలగంగన్న, అసిస్టెంట్ ఇంజనీర్ సత్యనారాయణరాజు, హౌసింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

ఫసల్‌బీమా గడువు పొడిగించాలి

కమలాపురం, డిసెంబర్ 16: ప్రధానమంత్రి ఫసల్‌భీమా గడువు పొడిగించాలని వైసిపి జిల్లా రైతువిభాగం కన్వీనర్ పుత్తా ప్రసాదరెడ్డి, మండల కన్వీనర్ ఉత్తమారెడ్డి డిమాండ్ చేశారు. వారు శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో వైసిపి నేతలు సుబ్బారెడ్డి, సుమిత్రా రాజశేఖరరెడ్డి, పుల్లారెడ్డి, నారాయణరెడ్డి, శ్రీనివాసులురెడ్డిలతో కలసి నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ నబీ సీజన్‌లో వర్షాభావ పరిస్థితి నెలకొని రైతులు బుడ్డశనగ, తదితర పంటలను ఈ ప్రాంతంలో సాగుచేయలేకపోయారన్నారు. ఐతే వార్ధా తుపాన్ పుణ్యమా అని వర్షం కురవడంతో రైతులు సాహసించి విత్తనం వేసే పనిలో మునిగారన్నారు. దీంతోపాటు బ్యాంకులో పెద్దనోట్ల రద్దు వల్ల అవసరమైన డబ్బులు చేతికందక రైతులు ఇబ్బంది పడి చాలామంది ఫసల్‌భీమా చెల్లించలేకపోయారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతుల కష్టాలను గుర్తించి మరో నెలరోజులు భీమాగడువును పొడిగించాలని డిమాండ్ చేసారు. అంతేకాక 2012-13సంవత్సరానికి గాను రబీ సీజనుకు చెందిన బుడ్డశనగ పంటకు సంబంధించి 11163మంది రైతులకు భీమా కంపెనీలు 56.43కోట్లు కేంద్రం,్భమాకంపెనీలు మంజూరు చేసాయని ఐతే 6నెలలు గడుస్తున్నా రాష్ట్రప్రభుత్వ వాటా రూ. 25కోట్లు ఇవ్వకపోవడంతో రైతులకు చెందాల్సిన భీమా ఇప్పటివరకు అందలేదన్నారు. దీంతోపాటు ఇంకా 20వేలమంది రైతులకు 103కోట్లు రావాల్సి ఉండగా రెవిన్యూ, రైతుల సంతకాలు సక్రమంగా లేవని పెండింగ్‌లో పెట్టడం అన్యాయమన్నారు. 2014నుంచి ఇప్పటివరకు 73కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ రైతులకు ప్రభుత్వం విడుదల చేయలేదని విమర్శించారు. గండికోటకు సంబందించి ముంపువాసులకు నష్టపరిహారం అందించిన తర్వాతే నీటిని విడుదల చేయాలని అన్నారు. ఇందుకోసం అక్కడి రైతులకు సంఘీభావం ప్రకటించి ఆందోళనలో పాల్గొంటామన్నారు.

30లోగా లబ్దిదారుల ఎంపిక

కడప,డిసెంబర్ 16: ఎస్సీ, ఎస్టీ, బిసి,కాపు, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఈనెల 30వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్ కెవి సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జన్మభూమి తరహాలో ప్రతి గ్రామంలో మున్సిపాల్టీ వార్డులలో నగదు రహిత లావాదేవీలపై గ్రామసభలు ఏర్పాటుచేసి ప్రజలకు వివరించాలన్నారు. ప్రజాసాధికార సర్వే కార్పొరేషన్ పరిధిలో చాలా పెండింగ్‌లో ఉందన్నారు. ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటుచేసి సాధికారసర్వే పూర్తి చేయాలని సూచించారు. అలాగే ఎస్సీ,ఎస్టీలకు ఇచ్చిన భూమికి సంబంధించి స్టేటస్ రిపోర్టును తయారు చేసి సిద్దపరచాలన్నారు. వచ్చే జన్మభూమి కార్యక్రమంలో అర్హులైన వారికి నివేశన స్థల పట్టాలు ఇచ్చేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి మండలంలో లైబ్రరీ నిర్మాణానికి సంబంధిత అధికారులు స్థలాలు గుర్తించి తెలియజేయాలన్నారు. శ్మశాన వాటికల నిర్మాణానికి ప్రభుత్వ భూమిని గుర్తించాలన్నారు. అంగన్వాడీ భవన కేంద్రాలు ఎక్కడ అవసరమో తెలియజేస్తూ స్థలాన్ని గుర్తించి వివరాలు పంపాలని సూచించారు. ఇటీవల కురిసిన వర్షాలకారణంగా ఉత్పన్నమయ్యే అనారోగ్య సమస్యలపై ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని క్లోరినేషన్, బ్లీచింగ్, శుచి, శుభ్రత పాటించాలన్నారు. జిల్లాలో దాదాపు 400 చౌకదుకాణ డీలర్లు గ్రామీణ, సిండికేట్ బ్యాంక్‌లలో అకౌంట్లను తెరచి వివరాలు తెలియజేయాలన్నారు. స్పెషల్ సమ్మరీ రివిజన్‌కు సంబంధించి వచ్చిన క్లైయిమ్‌లను ఈనెల 28వ తేదిలోపు పరిష్కరించాలన్నారు. స్వీస్ యాక్టివిటి ద్వారా ముఖ్యంగా విద్యాలయాలలో బాగా ప్రచారం చేసి యువ ఓటర్లు సమోదు అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రధానంగా బిజినెస్ కరస్పాండెంట్ల ద్వారా పెన్షన్ల పంపిణీ సజావుగా చేపట్టాలన్నారు. బ్యాంకర్లు ముఖ్యంగా పెన్షన్ తీసుకునేందుకు వచ్చే వృద్ధులకు రూ.500ల నోట్లను పంపిణీ చేసి సహకరించాలన్నారు. నగదు రహిత లావాదేవీలు, మొబైల్ బ్యాంకింగ్, ఆన్‌లైన్ బ్యాంకింగ్ పై ఖాతాదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. రూపే కార్డులు, డెబిట్ కార్డులు వెంటనే అందించేందుకు గతు చర్యలు తీసుకోవాలన్నారు.