కడప

ప్రపంచ పర్యాటక కేంద్రంగా గండికోట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,డిసెంబర్ 18: జిల్లాలో ఎంతో ఘనచరిత్ర కలిగి 13వ శతాబ్దంలో నిర్మింబడిన గండికోటకు ప్రపంచస్థాయిలో మూడవ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుకునేందుకు భారత ప్రభుత్వం ఆమోదముద్రవేసింది. వచ్చేనెల 19నుంచి 22వ తేదీ వరకు మూడురోజులపాటు గండికోట ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. గత ఏడాది ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గండికోట వారసత్వ ఉత్సవాలకు హాజరై ప్రపంచస్థాయిలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. వచ్చేనెలలో ఉత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పెద్ద ఎత్తున కేంద్ర, రాష్టమ్రంత్రులు కూడా హాజరౌతున్నట్లు తెలుస్తోంది. పెన్నానది ఒడ్డున ఎర్రమల పర్వతశ్రేణి పాదం మద్య ప్రవహించే పెన్నానది మధ్య గండికోట ఏర్పడింది. 300 అడుగుల వెడల్పుతో నది వుంది. దట్టమైన అడవులు అత్యంత ఆహ్లాదకరంగా కన్పించే ప్రాంతంలో భూతలం మద్య బలమైన శత్రువులను ఎదుర్కొనేందుకు ఈ కోట అనువుగా ఉండేది. లోతైన లోయలతో ఎర్రటి గ్రానైట్ తో 300 అడుగులు దిగువలో పెన్నానది ప్రవహిస్తోంది. ఈపెన్నానది కోటలో సహజ సిద్దమైనదిగా చెప్పవచ్చు. గండికోట కైఫియత్తులో చాళుక్య రాజైన సోమేశ్వర్‌చే నియమింపబడిన కాకరాజు కోటను కట్టించినట్లు చరిత్ర చెబుతోంది. అలాగే త్రిపురాంతకం వద్దగల శాసనం ప్రకారం అంబాదేవ అనే తాయత్త నాయకుడు రాజధానిని నెల్లూరు నుంచి గండికోటకు మార్చారని, ఉప్పరపల్లె వద్ద ఒక శాసనం ప్రకారం ప్రతాపరుద్రుడిని జయించారని చరిత్ర చెబుతోంది. విజయనగర సామాజ్య్రంకాలంలో గండికోట సీమకు రాజధానిగా వుండేది. 16వ శతాబ్దంలో గండికోటను పెమ్మసానితిమ్మనాయుడు, రామలింగనాయుడు, విజయనగర రాజులు పాలించారు. విజయనగర సామ్రాజ్యంలో 17వ శతాబ్దంలో అబ్దుల్లా కుతుబ్‌షా సేనాని మీర్ తిమ్మనాయుడి మంత్రి ద్వారా విషప్రయోగం చేసి స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో కోట ప్రాంతంలో మూడు విభాగాలుగా విభజించి బంగారువాడ, అమర, మాన్య విభాగాలుగా చేసి చక్రవర్తుల ఆధీనంలో ఉంచుకున్నారని తెలుస్తోంది. ఈ కోటను చూస్తే రాజులు, రాజవంశీయులు, రాజకీయ, సామాజిక, పౌరుషాలు, యుద్దాలు గుర్తుకొస్తాయి. దీంతో గండికోట ప్రాంతాన్ని గిరిదుర్గమని పిలిచే వారు. కోటలో వివిధ దేవాలయం, పెన్నానది, జుమ్మామసీదు, మసీదు చుట్టుపక్కల 64 గదులు తదితర నిర్మాణాలు ఉన్నాయి. గండికోట చుట్టూ ఐదు కిలోమీటర్లు ఉండి, ఎతె్తైన తలుపులు ఇనుపరేకులతో ఉన్నాయి. కోట ప్రాకారం ఎతె్తైన రాళ్లతో, కొండరాయితో పునాదులు లేకుండా గోడ నిర్మించారు. ఈ గోడ 15మీటర్ల ఎత్తువుంటుంది. 40 బురుజులు సైనికుల సంచారం నిమిత్తం ఏర్పాటుచేశారు. గండికోట అంతర్భాగంలో నవాబుల కాలంలో ఆలయాన్ని తొలగించి జుమ్మామసీదును నిర్మించారు. ఇప్పటికీ శిధిలం చేసిన ఆలయాల పలకాలు ఇప్పటికీ చెక్కుచెదర్లేదు. ఇక్కడి మాధవ ఆలయం, రంగనాధ ఆలయాలు శిల్పసంపద ఎంత చూసిన తనివితీరదు. కోటలో పెమ్మసాని, అగస్థీశ్వరకోన, మైలవరం డ్యామ్‌లు మొత్తం మీద బ్రిటీషు హయంలో గండికోటను వర్తకులు, పెన్నానది సముద్రమార్గంలో వజ్రాలు, వైడూర్యాలు, నగలు వివిధ రకాల వస్తువులు తీసుకొచ్చి కోటలో ప్రపంచవ్యాప్తంగా వర్తకులు అమ్మేవారు. ఇంతటి ఘనచరిత ఉన్న గండికోటకు పూర్వవైభవాన్ని ప్రపంచ స్థాయిలో తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారు.

ప్రమాదపు అంచుల్లో ముంపు గ్రామాలు!

కడప,డిసెంబర్ 18: గత కొంత కాలంగా గండికోట రిజర్వాయర్‌కు నీరు చేరుతుడడంతో చెవిటిపల్లె, బొమ్మెపల్లె నిర్వాసితులు ప్రమాదటంచున నిలచాయని చెప్పవచ్చు. ప్రాజెక్టు నిర్మాణంలో అట్టహాసంగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, పరిహారం, సదుపాయాలు పేరిట హామీలు ఇచ్చి కాంట్రాక్టర్లు, కొంతమంది పాలకులు తమ పబ్బం గడుపుకుని నిర్వాసితులను గాలికి వదిలేశారు. ప్రస్తుతం గండికోట ప్రాజెక్టుకు దాదాపు 3 టిఎంసిల నీరు చేరికతో పలు గ్రామాలు ముంపునకు గురికావడంతో నిర్వాసితులు తమకు పూర్తిస్థాయిలో పరిహారం ఇస్తే తప్ప తమ గ్రామాలు ఖాళీ చేయమని తెగేసి చెబుతున్నారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వం మొదటి విడత కింద రూ.400కోట్లను ఎనిమిది గ్రామాల నిర్వాసితులకు అందజేసేందుకు సర్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 2007లో అప్పటి ముఖ్యమంత్రి దివంగతనేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గండికోట రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేశారు. అప్పట్లో అరకొర పరిహారం చెల్లించారు. నిర్వాసితులు ఆ రిజర్వాయర్ సమీపంలో 22 గ్రామాలు రాగా ప్రస్తుతం 14 గ్రామాల ప్రజలకు ప్రత్యేక ప్యాకేజి చెల్లించాల్సివుంది. కృష్ణాజలాలు గండికోటకు శరవేగంతో తరలివస్తుండటంతో చౌటపల్లె, బొమ్మేపల్లెలకు నీరు చేరి రేపోమాపో గ్రామాలు మునకకు గురికానున్నాయి. మునకే జరిగినట్లయితే ప్రాణనష్టం, ఆస్తినష్టం భారీగానే ఉంటుంది. అలాగే రేపోమాపో గండ్లూరు, మరికొన్ని గ్రామాలు మునకకు గురికానున్నాయి. ప్రత్యేక ప్యాకేజి కింద ఒక్కొక్క కుటుంబానికి రూ.6లక్షల 75వేలు ఇప్పటికే కొన్ని రాయితీలు పొందిన నిర్వాసితులకు రూ.3లక్షల 75వేలు, 2016 నాటికి 18 ఏళ్లు పూర్తి అయిన యువతీ యువకులకు కూడా ప్రత్యేక ప్యాకేజిని ప్రభుత్వం ప్రకటించింది. ఈ పరిస్థితులను ఇప్పటికే రాష్టమ్రాజీ మంత్రి , జమ్మలమడుగు ఇన్‌చార్జి పి.రామసుబ్బారెడ్డి, టిడిపిలో చేరిన వైసిపి ఎమ్మెల్యే సి.ఆదినారాయణరెడ్డిలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిర్వాసితులనే నేరుగా ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులను కలిసి వారి గోడు విన్పించారు. ఇదిలావుండగా కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టు నిర్మాణం ఇంచుమించు పూర్తికాగా అప్పట్లో అనేక రాయితీలు ఆ ప్రభుత్వం అందించింది. అరకొర రాయితీలు మాత్రం అందాల్సివుండగా ఏకంగా రాయితీలు పొందిన వారు, రాయితీలు పొందని వారు ప్రభుత్వసాయం కోసం ఎదురుచూస్తుండగా రాజకీయ నాయకులు కూడా తమ స్వార్థ ప్రయోజనాలకోసం ప్రజాధనానికోసమే ఎసరు పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. దాదాపు 10 ఏళ్లక్రితం నిర్మించిన ప్రాజెక్టుకు 2016సంవత్సరానికి 18 నిండిన యువతీ యువకులకు కూడా ప్రత్యేకప్యాకేజిని ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నారు. వేలకోట్లరూపాయలు గండికోట ప్రాజెక్టుకు ఖర్చుచేశారేకానీ ఇంతవరకు చుక్కనీరు కూడా పారలేదు. ప్రస్తుతం కృష్ణాజలాలు పుణ్యమా అని రేపోమాపో మైలవరం ప్రాజెక్టుకు, పులివెందుల ప్రాంతానికి నీరు వదిలేందుకు జలవనరుల అధికారులు ప్రభుత్వాదేశాల కోసం ఎదురుచూస్తున్నారు. మొత్తంమీద నిర్వాసితుల మొండితనానికి ప్రభుత్వమే కిందకు దిగివచ్చి నిర్వాసితులకు స్పెషల్ ప్యాకేజిని అందజేసేందుకు రంగం సిద్దమైంది.

ఇసుక మాఫియాపై ఎస్పీ ఉక్కుపాదం!

కడప,డిసెంబర్ 18: జిల్లాలో ఇసుక అడ్డుఅదుపులేకుండా ఎల్లలుదాటిస్తున్న ఇసుక మాఫియాను కట్టడి చేసేందుకు జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ నేతృత్వంలో జిల్లా వ్యాప్తంగా పోలీసులంతా అప్రమత్తమయ్యారు. ఇసుక అక్రమరవాణా చేయడం కానీ, జిల్లా సరిహద్దుల నుంచి ఇతర ప్రాంతాలకు తరలించడం కానీ చేసినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం రెవెన్యూ, గ్రామపంచాయతీ, ట్రాన్స్‌పోర్టు, గనులు, భూగర్భజలాలశాఖలు, పోలీసు, జలవనరుల, అటవీశాఖ తదితర శాఖల అధికారులకు బాధ్యతలు అప్పగించారు. అయితే ఆ శాఖలకు చెందిన పలువురు సిబ్బంది, అధికారులు ఇసుక మాఫియాతో చేతులుకలిపి వారు సైతం అక్రమాలకు పాల్పడటంతో ఉచిత ఇసుక పంపిణీ నీరుగారిపోయింది. ప్రభుత్వం ఉచిత ఇసుక రవాణా ప్రకటించిన నాటినుంచి నేటి వరకు జిల్లాలో ఆ పార్టీ ఈపార్టీ నేతలని కాకుండా బలమైన, అధికార పరపతి కలిగిననేతలంతా సిండికేట్‌గా ఏర్పడి ప్రాంతాల వారీగా విభజించుకుని ఇసుకను తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలతోపాటు ప్రకాశం, నెల్లూరు తదితర జిల్లాలకు ప్రతినిత్యం రాత్రి అనక పగలకన్నా వందలాది లారీలు, టిప్పర్లు ద్వారా ఇసుకను తరలించి కోట్లకు పడగెత్తారు. జిల్లాలో డ్వామా, డిఆర్‌డిఏ, గనులు, జలవనరులు తదితర శాఖలు కలిసి జిల్లా వ్యాప్తంగా 19 ఇసుక రీచ్‌లను గుర్తించి తద్వారానే ఇసుకను ఉచితంగా తరలించాల్సివుంది. అయితే జిల్లాలో తొలి నుంచి పలు అక్రమార్గాల్లో, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే కొంతమంది అధికార, ప్రతిపక్ష నేతలు పాపాగ్ని, చెయ్యేరు, కుందూ, పెన్నా, బహుద తదితర నదీ పరివాహక ప్రాంతాల్లో , ప్రాజెక్టుల సమీపంలో యధేచ్చగా ఇసుకను అక్రమంగా తరలించుకుపోతున్నారు. ముఖ్యంగా రెండుమూడురోజులపాటు సెలవుదినాలు వచ్చాయంటే ఇటు ఇసుకమాఫియాలకు అటు అక్రమార్జనలో ఉన్న అధికారులకు పండుగే పండుగ. దీంతో జిల్లాలో అక్రమంగా ఇసుక యధేచ్చగా ఎల్లలుదాటి వెళ్తున్నట్లు తేటతెల్లమైంది. ఈనేపధ్యంలో జిల్లాలో కఠినంగా వ్యవహరిస్తున్న అధికారుల్లో జిల్లా మొట్టమొదటి ఉన్నతాధికారైన ఎస్పీపిహెచ్‌డి రామకృష్ణకు అటు ప్రభుత్వం ఇటు జిల్లా యంత్రాంగం బాధ్యతలు అప్పగించింది. చట్టపరంగా ఉచిత ఇసుకరవాణా చేసేందుకు కేవలం ట్రాక్టర్లు సంబంధిత అధికారుల అనుమతితో ఇసుక రవాణా చేయాల్సివుంటుంది. ఇప్పటి వరకు ఇసుకమాఫియాలు జెసిబిలు, ఇటాచ్‌లు, పెద్దలారీలు, టిప్పర్లు అనేక యంత్రాలు వాడుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతాలు, ప్రాజెక్టుల ప్రాంతాల్లో పది మీటర్ల లోతుమించి తవ్వకాలుజరుగుతున్నందున భూగర్భశోకంతో ఎడారులుగా తలపిస్తున్నాయి. ఎస్పీకి బాధ్యతలు అప్పచెప్పడంతో అవినీతి అక్రమార్కులు, ఇసుక మాఫియాలు, చివరకు కానిస్టేబుళ్లు, ఎస్‌ఐలు, సిఐలు సైతం ప్రస్తుతం ఉన్న విధులతోపాటు ఎర్రచందనం స్మగ్లింగ్ అరికట్టడం ఒక ఎతె్తైతే, ఇసుక మాఫియాను అరికట్టడం మరో ఎతె్తైంది. ఏదేమైనా ఇసుక మాఫియాకు అడ్డుకట్టవేసేందుకు ఎస్పీ రామకృష్ణ నడుం బిగించడంతో ఇసుక మాఫియా, వారికి సహకరించే అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి.

మతసామరస్యానికి ప్రతీక కడప

సిద్దవటం,డిసెంబర్ 18: కడప జిల్లా మతసామరస్యానికి ప్రతీక అని, విభిన్నమతాలున్నా ఆయా మతాలకు చెందిన ప్రజలు సామరస్యంగా పండుగలు నిర్వహించుకోవడం జరుగుతుందని కలెక్టర్ కెవి సత్యనారాయణ అన్నారు. మండలంలోని భాకరాపేట సమీపంలో ఉన్న ఏపి ఎస్పీ 11వ బెటాలియన్‌లో ఆదివారం ముందస్తు క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కలెక్టర్ బెటాలియన్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన పశువులపాకను ప్రారంభించారు. అనంతరం క్యాండిల్స్‌తో ర్యాలీ నిర్వహించారు. ముందస్తు క్రిస్మస్ వేడుకల సందర్భంగా కేక్‌కట్‌చేసి చిన్నారులకు తిన్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2వేల సంవత్సరాల క్రితం కరుణామయుడైన ఏసుప్రభువు జన్మించారన్నారు. ప్రపంచానికి ఒక ధృవతారలా జన్మించి వెలుగుచూపారన్నారు. మానవజన్మలో దేవుని రూపం దాల్చిన వ్యక్తి ఏసుప్రభువు అన్నారు. 2వేల సంవత్సరాలకు పూర్వం ప్రపంచంలో యుద్దాలు, వైషమ్యాలు, స్వార్థంతో కూడిన అణాగరీకులు జీవించేవారన్నారు. అనాగరికులను నాగరికులుగా తన ప్రేమ ,కరుణతో మానవులుగా తీర్చిదిద్దారన్నారు. అన్నిమతాల సారాంశం ఒకటేనని నాగరికులుగా జీవించడంమే అన్నారు. మే, జూన్‌నెలల్లో ప్రభుత్వం ముస్లింలకు ఇఫార్ విందు ఇచ్చామని, ఈనెల 20న కలెక్టరేట్‌లో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ప్రభుత్వం నిర్వహిస్తుందన్నారు. జైళ్లశాఖ డిఐజి జయవర్దన్ మాట్లాడుతూ మానవాళికి పాపాల నుంచి విముక్తి కలిగించేందుకు దారి దప్పిన వ్యక్తులను సన్మార్గంలో నడిపేందుకు ఏసు జన్మించారన్నారు. సిఎస్‌ఐ చర్చి ఫాదర్ వరప్రసాద్ మాట్లాడుతూ ఏసుప్రభువు ప్రకృతి సంబంధమైన జన్మకాకుండా కన్యమరియను ఒక సాధనంగా తీసుకుని జన్మించడం జరిగిందన్నారు. ఆకాశంలో నక్షత్రాన్ని ఖగోళ శాస్తవ్రేత్తలు గుర్తించి ఎవరో గొప్పవ్యక్తి జన్మించారని చెప్పారు. గొర్లకాపరులకు దేవధూత ప్రత్యక్షమై తొట్టిలో పరుండబెట్టిన ఏసుప్రభువు సమాచారాన్ని ఇచ్చిందన్నారు. ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన జన్మ ఏసుదే అన్నారు. అనంతరం బెటాలియన్ కమాండెంట్ సామ్యూల్‌జాన్ సిబ్బందికి ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈకార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్లు కేశవరెడ్డి ,అనిల్‌కుమార్, బెటాలియన్ అసోసియేషన్ అధ్యక్షుడు షరీఫ్, టిడిపి బిసి కార్యదర్శి కృష్ణయ్య, మహిళానాయకురాలు రాజేశ్వరీరెడ్డి, మాజీ సర్పంచ్ కెవి సుబ్బయ్య, ట్రాన్స్‌కో ఏఇ గంగులయ్య, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రాజకీయ కురువృద్ధుడిని
కోల్పోయాం: సతీష్‌రెడ్డి
వీరబల్లి, డిసెంబర్ 18: తమ బంధువులలో రాజకీయ కురువృద్ధుడిని కోల్పోయామని శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ ఎస్‌వి సతీష్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఆదివారం మాజీ ఎమ్మెల్యే గాలివీటి విశ్వనాధరెడ్డి భౌతికకాయానికి ఆయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కుటుంబంలో బంధువులలో గాలివీటి విశ్వనాధరెడ్డి చురుకైన నాయకుడిగా ఒక వెలుగు వెలిగారన్నారు. గాలివీటి సోదరుల కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. అదే విధంగా గాలివీటి విశ్వనాధరెడ్డి అంతిమయాత్ర వీరబల్లి బస్టాండు మీదుగా చౌటహరిజనవాడ సమీపంలో అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రమేష్‌కుమార్‌రెడ్డి, గడికోట మోహన్‌రెడ్డి, జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఆకేపాటి అమరనాధరెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.

గండికోట ప్రాజెక్టును సందర్శించిన ఎమ్మెల్యే

కొండాపురం, డిసెంబర్ 18: గాలేరునగరి - సృజలశ్రవంతిలో అంతర్భాగమైన గండికోట జలాశయాన్ని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఆదివారం సందర్శించారు. అక్టోబర్ 2వ తేదీ నుండి కృష్ణా జలాలు గండికోట ప్రాజెక్టుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈమేరకు ప్రాజెక్టు నందు నీటిమట్టమును ఆయన పరిశీలించారు. నీటి ప్రవాహాన్ని ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆదివారం నాటికి గండికోట ప్రాజెక్టు నందు 2.525 టిఎంసీల నీరు వుందని అధికారులు ఎమ్మెల్యేకు తెలిపారు. అలాగు ముంపుగ్రామమైన చెవిటిపల్లెను ఆయన సందర్శించారు. గ్రామ సరిహద్దుల వరకూ వచ్చిన జలాలను ఆయన గ్రామస్తులతో కలిసి పరిశీలించి గ్రామంలోని రామాలయం వద్ద ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ ముంపుగ్రామాల ప్రజలకు పరిహారంతో కూడిన ప్యాకేజీని ఇప్పించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఎవరూ అధైర్యపడవద్దని ఆయన హామీ ఇచ్చారు. ఇటీవల నీటిపారుదలశాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆర్‌అండ్ ఆర్ కమిషనర్ శశిభూషణ్‌కుమార్‌తోపాటు రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులను కలిసి ఈ విషయాలపై చర్చించామని మరోసారి ముఖ్యమంత్రిని కలిసి జి ఓ విడుదల చేసేందుకు తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

మహాకవి ఇనాక్ ఆత్మీయ సన్మానం

కడప,డిసెంబర్ 18: సమసమాజ నిర్మాణం కోసం సమాజం స్వరూపాన్ని అర్థం చేసుకుని సుజనాత్మకత రచనలు చేసి మానవ మనుగడకు దోహదపడేందుకు కృషిచేసిన మహాకవి పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ అని కలెక్టర్ కెవి సత్యనారాయణ , కేంద్రసాహిత్య పురస్కార గ్రహీత ఆచార్య రాచపాలెం చంద్రశేఖరరెడ్డిలు పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని కలెక్టర్ సభాభవన్‌లో సుదీక్ష వ్యవస్థాపకులు, ఎంపిడివో మొగిలిచెండు సురేష్ నిర్వహణలో మహా ఆత్మీయ సన్మాన మహోత్సవం, ఆంధ్రముత్యం బిరుదు ప్రధాన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ భారతదేశం గర్వించబడిన సాహిత్యరచయిత, నాటక రచయిత, వ్యాసకర్త, పద్మశ్రీ అవార్డుగ్రహీత ఇనాక్ సామాజిక స్పృహపై అవిరామంగా కృషి చేస్తూ తన రచనల ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్నారని కొనియాడారు. అనంతరం ఆచార్య రాచపాలెం చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో ఎవరికీ రాని పురస్కారాలు ఇనాక్ మహాకవికి అందాయని , నాకన్నీళ్లే నాసాహిత్యమని సాహిత్యానికి కులం, మతం అవసరం లేదని మానవత్వం మాత్రమే కావాలని ఇనాక్ రచనల ద్వారా సమాజానికి తెలియజేశారన్నారు. ఆయన రచనలు నిరంతరం ప్రవహించే మహాప్రవాహమని, ఆయన రచనలు సృసించని సామాజిక అంశాలు ఏమీ లేవన్నారు. అనంతరం సన్మానగ్రహీత పద్మశ్రీ అవార్డు గ్రహీత కొలకలూరు ఇనాక్ మాట్లాడుతూ తన రచనల్లో ఇతరుల బాధలు, సమస్యలు అవగతం చేసుకుని సమాజంలో జీవన ప్రమాణాలు సుఖవంతం చేసుకునే విధంగా రచించడం వల్ల అవి ప్రజలకు ఇష్టమైనందున తనకు ఇంతటి గౌరవం లభించిందన్నారు. తాను 87 పుస్తకాలు రచించానని అందుకు కారణం సామాజిక ప్రేరణ అన్నారు. మానవజీవితం చాలా సంక్లిష్టమైందని ఒక్కో పార్సవంలో ఒక్కో విధంగా కన్పిస్తుందని , సమాజాన్ని అర్థం చేసుకోవడానికే సాహిత్యాన్ని చేపట్టానన్నారు. ప్రతి సాహిత్యవేత్త ఓర్పు నేర్పుగా వ్యవహరిస్తూ సమాజానికి ఉపయోగపడే మంచి సాహిత్యాన్ని ప్రోత్సహించాలని సూచించారు. తన రచన ప్రస్తానంలో కవిత్వం , నాటక సాహిత్యం, నవలాసాహిత్యాలను రచించి ప్రభుత్వ పురస్కారాలు, విద్యాపురస్కారాలు, మరెన్నో సాహిత్య పురస్కారాలు అందుకున్నానన్నారు. ఈకార్యక్రమంలో ఇంటర్మీడియట్ బోర్డు రిటైర్డ్ జాయింట్ సెక్రటరీ అలపర్తి పిచ్చయ్యచౌదరి, యోగివేమన విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ డా.మూల మల్లికార్జునరెడ్డి, రిటైర్డ్ ప్రిన్సిపల్ డా.సంజీవమ్మ, ప్రముఖ కథకులు డాక్టర్ మల్లెమాల వేణుగోపాల్‌రెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే టి.జయరాములు, ప్రముఖ సాహిత్యవేత్తలు డాక్టర్ ఎన్.రామచంద్రయ్య, డాక్టర్ పుత్తా బాలిరెడ్డి, కార్యనిర్వాహకులు మొగిలిచెండు సురేష్ తండ్రి లక్ష్మయ్య, బిసి కార్పొరేషన్ ఇడి రామచంద్రారెడ్డి, బిసి సంక్షేమాధికారి వెంకటయ్య తదితరులు పాల్గొని ఇనాక్‌ను ఘనంగా సన్మానం చేసి ఆంధ్ర ఆణిముత్యం బిరుదును కలెక్టర్ కెవి సత్యనారాయణ చేతులమీదుగా ఎంపిడివో మొగిలిచెండు సురేష్ ప్రదానం చేశారు.

ఇంకెన్నాళ్లీ నగదు కష్టాలు..

రాజంపేట, డిసెంబర్ 18:పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన చిల్లర సమస్యలు ఇంకెన్నాళ్లకు తీరతాయన్న ఆందోళన అన్ని వర్గాల ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. పెద్దనోట్లు రద్దయ్యి 40 రోజులవుతున్నా చిల్లర సమస్యలతో పాటు తగినన్ని నోట్లు లభ్యం కాని పరిస్థితుల్లో 50శాతానికి పైగా వ్యాపారాలు పడిపోవడంతో వ్యాపారస్తుల బాధకు అంతులేకుండా పోతుంది. స్వైపింగ్ మిషన్ల ద్వారా నగదు రహిత లావాదేవీలకు అలవాటు పడాలని ప్రభుత్వం పేర్కొంటున్నా ఇంకా చాలామంది వ్యాపారస్తులు స్వైపింగ్ మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోని పరిస్థితులున్నాయి. దరఖాస్తు చేసుకున్న వ్యాపారస్తులందరికి కూడా ఇప్పట్లో స్వైపింగ్ మిషన్లు అందించే స్థితిలో కూడా బ్యాంకులు లేవు. దీంతో ముఖ్యంగా చిల్లర దుకాణాలు, ఫర్నీచర్, హోమ్‌నీడ్స్, వస్త్ర వ్యాపారాలు భారీగా పడిపోయాయి. ప్రజల వద్ద తగినంత డబ్బులు చేతిలో లేని కారణంగా ఉన్న డబ్బులతో విలువైన ఈ వస్తువులు అవసరమైనవారు కూడా వాయిదా వేసుకుంటుండడమే ఇందుకు కారణం. కాగా బంగారు తదితర దుకాణాలు కొన్ని స్వైపింగ్ మిషన్లు పెట్టుకొని ఉండడంతో చాలావరకు ఈ మిషన్లు కలిగిన దుకాణాలు తమ దుకాణాల ఎదుట స్వైపింగ్ మిషన్లు ఉన్నాయని బోర్డులు పెట్టడం విశేషం. మొత్తానికి పెద్దనోట్ల రద్దుతో వ్యాపారస్తులు లబోదిబో మనే పరిస్థితులు గత 40 రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి. చిల్లర సమస్యతో పాటు అవసరమైన మేరకు నగదును బ్యాంకుల నుండి తీసుకునే వెసులుబాటు లేకపోవడం ఆందోళనలో పడేస్తుందంటున్న వారిశాతమే ఎక్కువగా ఉంది. మొత్తానికి 50శాతానికి వ్యాపారాలు పడిపోయాయని వ్యాపారస్తులు పేర్కొంటున్నారు. నల్లదనం వెలికి తీసేందుకు, నకిలీ నోట్లను రూపుమాపేందుకు పెద్దనోట్లను రద్దు చేశామని కేంద్ర ప్రభుత్వం చెపుతున్నా, ప్రతిరోజు నల్లకుబేరుల వద్ద కోట్లాది రూపాయల కొత్తనోట్లు దొరుకుతుండడంతో పెద్దనోట్ల రద్దు వల్ల ఒనగూరిన ప్రయోజనమేమిటన్న ప్రశ్నలు వివిధ వర్గాల ప్రజల నుండి వినిపిస్తుంది. మొదట పెద్దనోట్ల రద్దు అంశాన్ని మెజార్టీ జనం స్వాగతించినా, పెద్దనోట్ల రద్దువల్ల ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడంలో సరైన దిశలో ప్రభుత్వ పనితీరు లేకపోవడంపై వివిధ వర్గాల ప్రజల్లో అసహనం ఎక్కువవుతున్నది. పెద్దనోట్ల రద్దువల్ల ఏర్పడిన సమస్యలు ఎప్పటికి పరిష్కారమవుతాయన్న ఆందోళన కూడా చాలా మంది నుండి వ్యక్తమవుతోంది. ఏటిఎంలలో తగినంత నగదును నిల్వ చేసే వసతులుండి ఉంటే ఏటిఎంల వద్ద క్యూ లైన్ల కొనసాగింపు చాలా వరకు తగ్గి ఉండేది. మొత్తానికి నల్లకుబేరుల ఆటలు కట్టించడం మాట ఎలా ఉన్నా పెద్దనోట్ల రద్దు వల్ల సామాన్యులు అధికస్థాయిలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇకపోతే ప్రస్తుతం బ్యాంకుల్లో నగదు నిల్వలుండి కూడా చేతిలో డబ్బుల్లేని సమస్యలను దాదాపుగా అన్నివర్గాల ప్రజలు ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎదుర్కొనే పరిస్థితులున్నాయి. ఉన్న కొద్దిపాటి డబ్బును జాగ్రత్తగా ఖర్చు పెట్టుకునే పరిస్థితిని అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఇకపోతే పెళ్ళిళ్లు, ఇతరత్రా అత్యవసర ఖర్చులున్న వారు పడుతున్న అవస్థలు చెప్పనలవి కావడం లేదు.

రాష్ట్రంలో పాలన శూన్యం

ప్రొద్దుటూరు టౌన్, డిసెంబర్ 18: రాష్ట్రంలో పాలన శూన్యమని, ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం గడపగడపకూ వైకాపా కార్యక్రమంలో భాగంగా ఆయన 10వ వార్డులోని సుబ్బిరెడ్డికొట్టాలు ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా తమకు తాగునీటి కొరత తీవ్రతరంగా వుందని, విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నాయని, రోడ్లు సరిగా లేవని, పారిశుద్ధ్యం లోపించిందని, అధికారులు పట్టించుకున్నపాపానపోలేదని స్థానిక ప్రజలు ఎమ్మెల్యేకు విన్నవించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానిక మున్సిపాలిటీలో పుష్కలంగా నిధులున్నా అభివృద్ధి చేయడంలో పాలకవర్గం, అధికారులు విఫలమవుతున్నారని తెలిపారు. ప్రజల ఓట్లతో గద్దెనెక్కిన టిడిపి నాయకులు ప్రస్తుతం ప్రజా సమస్యలను గాలికొదిలేసి వారి స్వలాభమే పరమావదిగా వ్యవహరించడం దారుణమన్నారు. డ్వాక్రా రుణాల మాఫీ, నిరుద్యోగబృతి, ప్రతి ఇంటికో ఉద్యోగమని ఆచరణకు సాధ్యం కాని పలు హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రస్తుతం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. టిడిపి పాలనను ప్రజలు గమనిస్తున్నారని, రాబోవు ఎన్నికల్లో ప్రజలు వారికి సరైన బుద్ధి చెబుతారన్నారు. రాష్ట్రంలో రాబోయేది జగన్ పాలనేనని, జగన్ ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధిపరిచి చూపుతారని ఆయన పేర్కొన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటామ న్నారు. కార్యక్రమంలో వైకాపా పట్టణాధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మురళీధర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.