కడప

పైడిపాలెం డ్యామ్‌కు చేరిన కృష్ణాజలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జనవరి 6: గాలేరు-నగరి సుజల స్రవంతిలో అంతర్భాగమైన గండికోట జలాశయానికి అక్టోబర్ 2వ తేదీ నుంచి కృష్ణాజలాలు వస్తున్న విషయం తెలిసిందే. గండికోట ఎత్తిపోతల పథకంద్వారా జికెఎల్ స్టేజి-1 పైపులైన్ నుంచి శుక్రవారం రాత్రి పైడిపాలెం డ్యామ్‌కు కృష్ణాజలాలు చేరాయి. కృష్ణాజలాలు చేరగానే డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఎత్తిపోతల పథకం నుంచి పైడిపాలెం ప్రాజెక్టుకు నీటిని తరలించేందుకు బ్రిజిల్ దేశం నుంచి తెప్పించిన భారీ మోటార్లు నీటిని ఎత్తిపోస్తున్నాయి. కృష్ణాజలాలు పైడిపాలెంకు చేరగానే పులివెందుల ప్రాంతం రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లకల నెరవేరుతోందని హర్షం తెలిపారు. ఇక తమప్రాంతమంతా సస్యశ్యామలంగా ఉంటుందని రైతులు, ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. పులివెందుల ప్రాంతానికి నీరు తీసుకురావాలని ధృడ సంకల్పంతో ఉన్న డిప్యూటీ చైర్మన్ సతీష్ నీరు రాగానే ఆయన ముఖంలో ఆనందం కన్పించింది. ఉదయం 11 గంటలకు గండికోట ఎత్తిపోతల వద్ద ప్రారంభించిన ట్రైల్ రన్ విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ సిఇ వరదరాజులు, ఇఇ చంగల్‌కుమార్, ప్రాజెక్టుల జిఎం సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

సీఎం రాకకు భారీ ఏర్పాట్లు

కడప,జనవరి 6: జన్మభూమి కార్యక్రమం కంటే అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న గండికోట రిజర్వాయర్ నీరును పులివెందులకు వదులుతున్న తరుణంలో ఈనెల 11న ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు జిల్లా రాక పురస్కరించుకుని భారీ ఏర్పాట్లు నేతలు, అధికార యంత్రాంగం శ్రీకారం చుట్టింది. జన్మభూమి ముగింపు కూడా జిల్లాలోనే ఉంటుందని పలువురు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 11న గండికోట రిజర్వాయర్ ఎత్తిపోతల పథకం పరిసర ప్రాంతాలకు రావడం, బహిరంగసభ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఏర్పాట్లు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సి.ఆదినారాయణరెడ్డి, కలెక్టర్ కెవి సత్యనారాయణ, ఆర్డీవో వినాయకం తదితరులు తరలివచ్చి ఏర్పాట్లు సమీక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులో భారీ తొలిప్రాజెక్టు గండికోట పూర్తిచేసి 11న నీరు విడుదలచేసేందుకు ప్రతిష్టాత్మకంగా టిడిపి నేతలు, అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నారు. ప్రతిపక్షనేత, వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సొంతజిల్లాలో సొంత ఇలాఖాలో ఆయన తండ్రి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపనచేసిన ప్రాజెక్టులు అర్ధాంతరంగా నిర్మాణాలు ఆగిపోవడం, టిడిపి పాలనలో ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రారంభించడంతో ప్రత్యేకించి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి శపధం పూని ప్రాజెక్టుల నిర్మాణానికి అహోరాత్రులు కృషి చేశారు. ఈ నేపధ్యంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి , జమ్మలమడుగు ఎమ్మెల్యే సి.ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డి, కలెక్టర్ కెవి సత్యనారాయణ పైడిపాలెం ప్రాజెక్టును పరిశీలించి సిఎం సభా ఏర్పాట్లు పరిశీలించారు. గండికోట నుంచి ఎత్తిపోతల పథకం ద్వారా పైడిపాలెంకు అటు నుంచి పులివెందులకు నీటి తరలింపులో టిడిపి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితుల్లో సభ విజయవంతానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సభకు దాదాపు 35వేల మందికి పైగా కార్యకర్తలతో భారీ ఎత్తున సభ నిర్వహించేందుకు సిద్దవౌతున్నారు. ఇందుకోసం సభా స్థలి కోసం పైడిపాలెం రిజర్వాయర్ వద్ద ఉన్న ప్రదేశాన్ని పరిశీలించారు. సమీపంలోని హెలిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించారు. అలాగే విఐపి వాహనాల ఏర్పాట్లకు స్థలాలు, ముఖ్యమంత్రి ప్రసంగించే సభావేదికను కూడా పరిశీలించారు. పైడిపాలెం కట్టపైకి సిఎం కాన్వాయ్ వెళ్లలేనందున మూడవ మలుపులో స్టెప్స్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దాదాపు 40వేల మందికి భోజన ఏర్పాట్లపై నాయకులు తగిన సూచనలు ఇచ్చారు. పైడిపాలెంలో రిమోట్ ద్వారా సిఎం చంద్రబాబు గండికోట ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో మార్కెట్‌యార్డు చైర్మన్ వైవి నారాయణరెడ్డి, న్యాయవాది మురళి, శంకర్‌రెడ్డి, అంకిరెడ్డి, డ్వామా పిడి రమేష్, డిఆర్‌డిఏ పిడి అనిల్‌కుమార్‌రెడ్డి, జమ్మలమడుగు ఆర్డీవో వినాయకం, పలువురు ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పులివెందుల నియోజకవర్గంలో
ప్రతి ఎకరాకు సాగునీరు..

వేంపల్లె, జనవరి 6: పులివెందుల నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందనుందని మండలి ఉపాధ్యక్షుడు ఎస్‌వి సతీష్‌కుమార్‌రెడ్డి అన్నారు. స్థానిక ప్రభుత్వ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం వేంపల్లె సర్పంచ్ విష్ణువర్ధన్‌రెడ్డి అధ్యక్షతన జన్మభూమి కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 11వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పైడిపాలెం రిజర్వాయర్ వద్దకు రానున్నారని, దీంతో రిజర్వాయర్ పరిధిలోని భూములు సస్యశ్యామలం కానున్నాయని తెలిపారు. అలాగే పైడిపాలెం రిజర్వాయర్ నీరు అందని రైతులకు కృష్ణా జలాలను ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు. పులివెందుల ప్రాంతం పూర్తి స్థాయిలో సస్యశ్యామలం చేసేందుకే తమ లక్ష్యమన్నారు. ఒక సైనికుడిలా కష్టపడి పనిచేసే సీఎం మనకు దొరకడం అదృష్టమన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను సీఎం అమలు చేయలేడని ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెట్టాయన్నారు. కానీ తమ నాయకుడు సీఎం చంద్రబాబు విడతల వారీగా హామీలను నెరవేర్చారని తెలిపారు. కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో అభివృద్ధి పనులు సాగుతుంటే మరుగుదొడ్ల నిర్మాణం మాత్రం నత్తనడకన సాగుతున్నాయని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మరుగుదొడ్ల నిర్మాణంలో నిధుల కొరత లేదన్నారు. ప్రతి ఒక్కరూ తప్పక మరుగుదొడ్డిని నిర్మించుకోవాలన్నారు. అర్హులైన వారందరికీ రేషన్‌కార్డులు, పింఛన్లు మంజూరు చేయిస్తామన్నారు. జిల్లాలో రూ.50 కోట్లతో సీసీ రోడ్లు నిర్మించడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు 217 కిలోమీటర్లు పూర్తిచేశామని తెలిపారు. అలాగే అంగన్‌వాడీ, గ్రామ పంచాయతీ తదితర భవనాలను నిర్మిస్తున్నామని తెలిపారు. పాఠశాల మైదాన అభివృద్ధి కోసం రూ.10 లక్షల నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు. అలాగే శ్మశాన వాటికల కోసం కూడా రూ.10 లక్షల నిధులు ఇవ్వడం జరుగుతున్నదన్నారు. జిల్లా అభివృద్ధి కోసం నిధుల కొరత లేదని ఆయన వివరించారు. వేంపల్లె పట్టణంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వేంపల్లె సర్పంచ్ విష్ణువర్ధన్‌రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో డీ ఆర్‌డీ ఏ పీడీ అనిల్‌కుమార్‌రెడ్డి, డ్వామా పీడీ రమేష్, ఆర్డీవో వినాయకం, ప్రత్యేకాధికారి దేవేందర్‌రెడ్డి, తహశీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో వెంకటరమణయ్య, ఈవో నాగభూషణ్‌రెడ్డి, డిప్యూటీ డీఈవో శైలజ తదితరులు పాల్గొన్నారు.

తెలుగుతమ్ముళ్లలో కోల్డ్‌వార్!

కడప,జనవరి 6: తెలుగుదేశం పార్టీ పదేళ్లతర్వాత అధికారంలోకి వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు కావస్తున్నా జిల్లాలో అధికారపార్టీ నేతల్లో కోల్డ్‌వార్ నెలకొని ఎవరికివారే యమునాతీరే అన్న చందంగా ఉండటంతో పార్టీకి తీరని నష్టంజరుగుతుందని ఆపార్టీ అధిష్ఠానం తెలుసుకుని తెలుగుతమ్ముళ్ల సయోధ్యకు శుక్రవారం అధిష్ఠానం జిల్లా నేతలను పంపింది. ఈనేతల్లో టిడిపి సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు సిఎం రమేష్‌నాయుడు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులురెడ్డి (వాసు), పార్టీకార్యదర్శి బి.హరిప్రసాద్‌లు రంగంలో దిగారు. వీరు శుక్రవారం బద్వేలుకు చేరుకోగా మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఒక గ్రూపుగా, ఇటీవల వైసిపి నుంచి టిడిపిలోకి చేరిన ఎమ్మెల్యే టి.జయరాములు, 2014 ఎన్నికల్లో జయరాములుపై టిడిపి అభ్యర్థిగా పోటీచేసి ఓటమి చవిచూసిన ఎన్‌డి విజయజ్యోతిలు ఇరువురు కలిసి ఒక గ్రూపుగా, బద్వేలు ఎస్సీ నియోజకవర్గం అయినందున ప్రస్తుత ఎమ్మెల్యే జయరాములు ఒక ఉన్నతాధికారిగా, ఓటమి చవిచూసిన ఎన్‌డి విజయజ్యోతి బ్యాంకు మేనేజర్‌గా ప్రభుత్వానికి రాజీనామాలు ఇచ్చి ఎన్నికల బరిలో దిగిన వారే. వీరు ఇరువురు విజయమ్మ మాట వినడం లేదని కొత్తనిర్ణయాలు తీసుకుంటున్నారని, విజయమ్మ వారితో విబేధించి ప్రత్యేక గ్రూపుగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. జయరాములు, జ్యోతిలు తామేమీ విజయమ్మకు తీసిపోమనే చందంగా వారిరువురు ప్రత్యేక కార్యకలాపాలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. గత మూడు మాసాలుగా వీరి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. ఈలోపు ఎమ్మెల్సీ ఎన్నికలు రాకతో ఎమ్మెల్సీ ఎన్నికలు అధికారపార్టీకి కీలకంగా మారాయి. వీరి మధ్యవిబేధాలు తారాస్థాయికి చేరికతో శుక్రవారం అగ్ర నేతలంతా బద్వేలుకు చేరుకుని నేతలు గ్రూపు శిబిరాలకు వెళ్లి చర్చించి ఐక్యంగా కలిసివుండాలని రెండువర్గాల వారిక నచ్చచెప్పినట్లు తెలుస్తోంది. పైకి రెండు గ్రూపుల నేతలు సమ్మతించగా, భవిష్యత్‌లో ఇదే తరహాలో వీరు ఉండరనేది జగమెరిగిన సత్యం. అధిష్ఠానం మరి కొన్నిరోజులపాటు వీరితో చర్చలు జరిపి అందర్నీ ఏకం చేయనున్నట్లు తెలుస్తోంది. అయినా ఏకమయ్యేది ఇప్పట్లో జరిగే పనికాదు. ఇక రాయచోటి విషయానికొస్తే ప్రస్తుత రాయచోటి ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే ఆర్.రమేష్‌కుమార్‌రెడ్డి, సీనియర్ నేత, మాజీ ఎంపి, మాజీ ఎమ్మెల్యే ఎస్.పాలకొండ్రాయుడు, ఆయన తనయుడు ఎస్.ప్రసాద్‌బాబు (చిన్నరాయుడు), ఎస్.బాలసుబ్రహ్మణ్యంతో రమేష్‌రెడ్డికి విబేధాలు తారాస్థాయికి చేరాయి. తాము తెలుగుదేశంపార్టీ స్థాపించిన మూడు దశాబ్దాల నుంచి పార్టీలో కొనసాగుతున్నామని తమ సామాజికవర్గానికి చెందిన చిరంజీవి ప్రజారాజ్యంపార్టీ ఏర్పాటుచేసినప్పుడు సీమ జిల్లాలకు చెందిన తమ సామాజికవర్గ నేతలంతా వలసలు వెళ్లినా తాము పార్టీని అంటిపెట్టుకుని ఉన్నామని తమకు పార్టీలో గుర్తింపులేదని రాయుడు, ఆయన తనయులు పార్టీ అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. పలు సందర్భాల్లో రాష్ట్ర అగ్రనాయకులు వచ్చినప్పుడు ఇరువర్గాల నేతలు పైకి ఏకమైనట్లు కన్పిస్తూ ఇరువర్గాలు బహిరంగంగానే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా అధికారులు రమేష్‌రెడ్డికే ప్రాముఖ్యత ఇస్తున్నారని రాయుడు వర్గీయులు బహిరంగ ఆరోపణలు చేస్తున్నారు. మరో రెండేళ్లలో రాజకీయ భవిష్యత్ కోసం రాయుడు, తనయులు నిర్ణయం తీసుకునే దిశగా వెళ్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో ఇరువర్గాల మధ్య అఘాధం ఏర్పడకుండా రెండువర్గాలను రాజీచేసేందుకు ఇటీవల ఎమ్మెల్సీ, టిడిపి సీనియర్ నేత గాలిముద్దుకృష్ణమనాయుడు ఇరువర్గాలతో చర్చించారు. తాజాగా సోమిరెడ్డి కూడా రాయచోట వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కడపలో రెడ్ల, బలిజ సామాజికవర్గాలకు చెందిన నేతల మధ్య పోటీ కొనసాగుతోంది. మైదుకూరులో రెడ్డి, నాన్‌రెడ్డి మధ్యపోటీ నెలకొంది. ప్రొద్దుటూరు, జమ్మలమడుగులలో ఇరువురు వర్గాలకు చెందిన పాతకాపునేతల మధ్యనే రగడ కొనసాగుతోంది. మొత్తం మీద తెలుగు తమ్ముళ్ల మద్య కోల్డ్‌వార్ తారాస్థాయికి చేరి త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుతమ్ముళ్లు ఇలాగే కొనసాగితే వైకాపా అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డిదే విజయమని అధికారపార్టీ నేతలు బాహాటంకంగా చెప్పుకుంటున్నారు. ఇక తెలుగుతమ్ముళ్లలో మార్పురాకపోతే పార్టీకే భారీ నష్టం వాటిల్లే పరిస్థితులు ఉన్నాయి.

పేదల సంక్షేమమే ప్రభుత్వధ్యేయం

సిద్దవటం,జనవరి 6: రాష్ట్రంలోని పేద బడుగు,బలహీన వర్గాల సంక్షేమం కోసమే రాష్ట్రప్రభుత్వం అహర్నిషలు కృషిచేస్తోందని మాజీ మంత్రి పి.బ్రహ్మయ్య అన్నారు. మండలంలోని మాచుపల్లె, టక్కోలు గ్రామాల్లో శుక్రవారం జన్మభూమి గ్రామసభలు ఆయా గ్రామాల సర్పంచ్‌ల అధ్యక్షతన జరిగాయి. టక్కోలు లో జరిగిన సభకు బ్రహ్మయ్య హాజరై మాట్లాడుతూ టిడిపి అధికారంలోకి రాగానే ఎవరూ ఊహించని విధంగా ఐదు రెట్లుపెంచి పేదలకు పెన్షన్లు పం పిణీ చేయడం జరుగుతోందన్నారు. ప్రతి ఒక్కరికీ రేషన్‌కార్డులు పంపిణీ చేయడంతోపాటు మత సామరస్యాలకు ప్రతీకగా ప్రతి పండుగకు ఆయావర్గాలకు చంద్రన్నకానుకలు పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రజలు ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజలు నగదు రహిత లావాదేవీలపట్ల అవగాహన పెంచుకోవాలన్నారు. రెవెన్యూశాఖ రేషన్‌కార్డులు పంపిణీచేస్తోందన్నారు. నోట్లరద్దుతో ఇబ్బందిపడ్డ వృద్దాప్య, వికలాంగ, వితంతు,చేనేత కార్మికుల పెన్షన్లు పాదపద్ధతిలోనే పం పిణీ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీకారం చుట్టారని పేదలు ఇబ్బంది పడకూడదన్నదే ఆయన ధ్యే యమన్నారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి సుబ్బారావు, తహశీల్దార్ మహబూబ్‌చాన్, ఎంపిడివో జయసింహ, ఆర్‌డబ్ల్యుఎస్ ఏఇ విశ్వనాధం, ఇఓపిఆర్‌డి సోమశేఖరరెడ్డి, పంచాయతీ రాజ్ ఏఇ గంగులయ్య, ఏపిఓ భార్గవి, ఏపిఎం సుబ్బలక్ష్మి, సర్పంచ్‌లు, అధికారులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ అధికారంలో ఉంటే
2014లోనే పైడిపాలెంకు నీళ్లు వచ్చేవి..

వేంపల్లె, జనవరి 6: కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చి ఉంటే 2014లోనే కృష్ణా జలాలు గండికోట, వామికొండ సాగర్, సర్వరాయసాగర్, పైడిపాలెం, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు నీళ్లు వచ్చి ఉండేవని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తన స్వగృహంలో విలేఖరులతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల 2017 నాటికి కూడా పై రిజర్వాయర్లకు నీళ్లు రాకపోవడం దురదృష్టకరమన్నారు. శ్రీశైలం రిజర్వాయర్ నుండి 38 శతకోటి ధనపుటడుగుల కృష్ణా వరదజలాలను చిత్తూరు జిల్లాలోని నగిరి వరకు మళ్లించి కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు, 640 గ్రామాల్లో 5 లక్షల మందికి తాగునీరు అందించే విధంగా 1986లో ఎన్‌టిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు గాలేరు-నగిరి సుజల స్రవంతికి రూపకల్పన జరిగిందన్నారు. 1995 నుండి 2004 వరకు చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో ఈ ప్రాజెక్టును పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగిందన్నారు. కేవలం రూ.13 కోట్ల మొక్కుబడిగా ఖర్చు చేయడం జరిగిందన్నారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో గాలేరు-నగిరి ప్రాజెక్టుపై పూర్తి శ్రద్ధ వహించి రూ.4,600 కోట్లు ఖర్చు చేసి ఫేజ్-1 కింద 85 శాతం పనులు చేయడం జరిగిందన్నారు. గండికోట రిజర్వాయర్ నుండి 6 టీఎంసీల నీటిని ఎత్తిపోతల ద్వారా పైడిపాలెం రిజర్వాయర్‌కు అక్కడి నుండి గ్రావెల్ ద్వారా విమకుంట్ల రిజర్వాయర్‌కు అక్కడి నుండి పీబీసీ కాల్వకు ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా జలాలు పులివెందుల నియోజకవర్గంలో 88.500 ఎకరాలకు నీరిచ్చే విధంగా కాంగ్రెస్ హయాంలో రూపకల్పన చేసి 90 శాతం పనులు జరిగాయని ఆయన అన్నారు. ఇలా కాంగ్రెస్ పాలనలో ఎనలేని అభివృద్ధి జరిగిందని ఆయన వివరించారు. ఈ సమావేశంలో ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు ధృవకుమార్‌రెడ్డి, డాక్టర్ సుబ్రహ్మణ్యం, ఉత్తన్న, బాబు, రామకృష్ణ, కొండయ్య, నరసింహారెడ్డి, షరీఫ్, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.

సమాజ వికాసమే జన్మభూమి ధ్యేయం

రాయచోటి, జనవరి 6: రాష్ట్ర సమాజ వికాసమే జన్మభూమి ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రవేశపెట్టడం జరిగిందని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, టీడీపీ నాయకులు రమేష్‌కుమార్‌రెడ్డి, సుగవాసి ప్రసాద్‌బాబులు అన్నారు. శుక్రవారం మునిసిపల్ పరిధిలోని 15, 16, 17, 18వ వార్డులకు సంబంధించి స్థానిక కె.రామాపురంలో గల పాఠశాలలో జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వారు మాట్లాడుతూ జన్మభూమి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను తీర్చేందుకు అవకాశం కలుగుతుందన్నారు. అంతేకాకుండా నాల్గో విడత జన్మభూమిలో సమాజ వికాసం ద్వారా సమాజంలోని అసమానతలు తగ్గించి పేదరిక నిర్మూలన దిశగా మనందరం అడుగులు వేయాలని వారు ప్రజలకు సూచించారు. అనంతరం లబ్ధిదారులకు మంజూరైన రేషన్‌కార్డులను, చంద్రన్న బీమా సర్ట్ఫికెట్లను, సంక్రాంతి కానుకలను, స్కాలర్‌షిప్పులను వారు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కెట్‌యార్డు ఛైర్మన్ ఖాదర్‌బాష, మునిసిపల్ డీఈ సుబ్రహ్మణ్యం, మెప్మా అధికారి అబ్బాస్‌అలీఖాన్, కౌన్సిలర్లు ఆనందరెడ్డి, సహదేవ, రెడ్డమ్మ, రమాదేవి, రశీద్, టీడీపీ నాయకులు మనే్నరు రామాంజనేయులు, వతన్‌నిసార్, టీడీపీ జిల్లా నాయకులు జానం రవీంద్ర, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
పట్టిసీమతోనే గండికోట ప్రాజక్టు నీరు

జమ్మలమడుగు, జనవరి 6: పట్టిసీమ ప్రాజెక్టుతోనే గండికోట, మైలవరం జలాశయాలకు నీరువస్తోందని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. మున్సిపాలిటీలోని 9, 10 వార్డులకు కనె్నలూరు ప్రాథమిక పాఠశాల ఆవరణలో జన్మభూమి- మా ఊరు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి టిడిపి నేతలు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, మాజీమంత్రి రామసుబ్బారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ పట్టిసీమ కారణంగానే జమ్మలమడుగు ప్రాంతంలోని ప్రాజక్టులకు నీళ్లు వస్తున్నాయన్నారు. గండికోట గండికోట ప్రాజెక్టులో 4.50టియంసిలు నిల్వ తరువాత, వచ్చే నీటిని మైలవరానికి తరలిస్తారన్నారు. ప్రభుత్వం ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కారమే లక్ష్యంగా జన్మభూమి చేపట్టిందన్నారు. నియోజకవర్గానికి 2400 పింఛన్లు అవసరం కాగా 2వేల పింఛన్లు మంజూరయ్యాయన్నారు. మిగతావి కూడా త్వరలో మంజూరు చేసేందుకు కృషిచేస్తామన్నారు. పెద్దనోట్ల రద్దుకు సంబంధించి సబ్‌కమిటి చైర్మన్‌గా చంద్రబాబునాయుడు ఉండడంతో రిజర్వుబ్యాంకుతో మాట్లాడి పించనర్లకు నగదు ఇచ్చేలా చర్యలు తీసుకున్నారన్నారు. గండికోట వాసుల సమస్యలను రామసుబ్బారెడ్డితో కలిసి రూ.479కోట్లు తెప్పించుకున్నామన్నారు. ముఖ్యమంత్రికి ముంపువాసుల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ప్రభుత్వ పథాకాలపై ప్రజలు అవగాహన కలిగివుండాలన్నారు. అధికారులు ఆయా శాఖల పరిధిలో అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఎ పిడి వెంకటసుబ్బయ్య, చైర్‌పర్సన్ టి.తులసి, మున్సిపల్ ఇంజినీరు వేణుగోపాల్, అధికారులు, ప్రజాప్రతినిథులు, ప్రజలు పాల్గొన్నారు.

స్వామివారి ఉత్తర ద్వార దర్శనానికి విస్తృత ఏర్పాట్లు

కడప,(కల్చరల్)జనవరి 6:వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి పురస్కరించుకుని ఆదివారం భక్తులు స్వామివారిని ఉత్తర ద్వారా దర్శనం చేసుకునేందుకు జిల్లాలోని వైష్ణవాలయాలన్నీ ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఆయా ఆలయాల ఇఓలు, చైర్మన్లు, కమిటీ సభ్యులు భక్తుల స్వామివారి దర్శనానికి ఇబ్బంది లేకుండా ఆలయం బయట, ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా బ్యారిగేట్లు ఏర్పాటు చేశారు. అలాగే మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున వారికి ప్రత్యేక క్యూలైన్లు కూడా ఏర్పాటు చేశారు. కాగా కొన్ని ఆలయాల్లో తెల్లవారు జామున 3గంటల నుంచి స్వామి దర్శనాలు ప్రారంభమయ్యే నేపధ్యంలో చీకటి కారణంగా క్యూలైన్లలో ప్రత్యేకంగా లైటింగ్ ఏర్పాట్లు చేశారు. ఆలయాలన్నింటికీ రంగు రంగుల విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అలాగే వైష్ణవాలయాలతోపాటు ఆంజనేయస్వామి ఆలయాల్లో విశేష పూజలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి ఆలయం, పుష్పగిరి చెన్నకేశవస్వామి ఆలయం, నందలూరు శ్రీసౌమ్యనాథస్వామి ఆలయం, జమ్మలమడుగు నారాపురస్వామి ఆలయంతోపాటు పలు ఆలయాల్లో ఉదయం 5గంటల నుంచి ఉత్తర దిక్కున గల ద్వారం నుంచి భక్తులకు స్వామి ఉత్సవమూర్తుల దర్శన భాగ్యం కల్పిస్తారు. అదేవిధంగా కడప నగరంలోని దేవునికడప శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో కూడా ఆదివారం తెల్లవారు జామున 3గంటల నుంచే స్వామి మూలవిరాట్‌ను దర్శించుకునేందుకు భక్తులకు సౌకర్యం కల్పించారు. అలాగే వైకుంఠ ద్వారం వైపు నుంచి తెల్లవారు జామున 3గంటల నుంచి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తుల దర్శనం కల్పిస్తారు. అదేవిధంగా కడపలోని జయనగర్ కాలనీలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఉదయం 5గంటల నుంచి స్వామి, అమ్మవార్లను వైకుంఠ ద్వారం నుంచి దర్శించుకునేందుకు భక్తులకోసం ప్రత్యేక ఏర్పాట్లు కల్పించారు. కడప నగర శివార్లలోని శ్రీ పాలకొండరాయస్వామి ఆలయంలో కూడా ఉదయం 5గంటల నుంచి మూలవిరాట్, ఉత్సవ మూర్తుల దర్శనానికి భక్తులకు అనుమతిస్తారు. నగరంలోని జౌళి బజారులోని శ్రీ కోదండరామస్వామి ఆలయం, గడ్డిబజారువీధిలోని శ్రీబాలాజీదేవస్థానం తోపాటు తదితర ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ప్రజా సమస్యల పరిష్కారమే టిడిపి ధ్యేయం

పెండ్లిమర్రి,జనవరి 6: ప్రజాసమస్యలను పరిష్కరించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం ముందుంటుందని విప్ రామ్మోహన్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చెర్లోపల్లె గ్రామంలో నిర్వహించిన జన్మభూమి - మా ఊరు నాల్గవ విడత కార్యక్రమంలో విప్ ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం పవిత్ర ఆశయంతో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని దీని వల్ల ప్రజల సమస్యలను గ్రామాల్లోనే తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. అధికారంలోకి టిడిపి ప్రభుత్వం వచ్చి మూడుసంవత్సరాలు కావస్తున్న సందర్భంలో పట్టిసీమ నుంచి రాయలసీమకు నీళ్లు తెచ్చి రాయలసీమ ప్రాంతవాసుల చిరకాల కోరికను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. అందులో భాగంగా ఈనెల 11న తేదీన గండికోట నుంచి పులివెందులకు నీరు విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి జిల్లా పర్యటన చేస్తున్నారని గుర్తుచేశారు. అర్హులైన పేదలకు ఎన్‌టిఆర్ పథకం ద్వారా గృ హాలు మంజూరుచేసి వారికి డి.్ఫరా లు కూడా ఇచ్చామని, అలాగే పెన్షన్లు కూడా ప్రతినెలా క్రమం తప్పకుండా పెన్షన్‌దారుల గ్రామాలకే వెళ్లి పెన్షన్లు అందిస్తున్న ఘనత టిడిపిదేనని చెప్పారు. కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ గంగిరెడ్డి, తహశీల్దార్ ఆంజనేయులు, ఎంపిడివో మల్‌రెడ్డి, పశువైద్యులు బాబురామచంద్ర, ఎంఇఓ సుజాత, ఏపిఎం శైలజ, ఏపిఓ వసుధ, అధికారులు పాల్గొన్నారు.

పూరె్తైన ప్రాజెక్టులను ప్రారంభిస్తున్న బాబు

కమలాపురం, జనవరి 6: రాష్ట్రంలో దివంగతనేత వైయస్ చేపట్టిన ప్రాజెక్టులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించి గొప్పలు చెప్పుకుంటున్నాడని జిల్లా వైసిపి రైతు విభాగం కన్వీనర్ పుత్తా ప్రసాదరెడ్డి విమర్శించారు. ఆయన శుక్రవారం పార్టీ కార్యాలయంలో వైసిపి నేతలతో కలసి విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ వైయస్ హయాంలో రాయలసీమ ప్రాంతంలో చేపట్టిన ప్రాజెక్టు పనులు 80% పూర్తి కాగా కొంతభాగం కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో జరిగాయని అన్నారు. మిగిలిన 5 శాతం పనులను మూడేళ్లలో అరకొరనిధులతో పూర్తి చేసి తమ హయాంలో ఈ ప్రాజెక్టులను పూర్తి చేసినట్లు సీఎం ప్రారంభసభల్లో అబద్దాలు చెపుతున్నారని అన్నారు. టిడిపికి చెందిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రే సీమను అభివృద్ధి చేస్తున్నట్లు, ప్రాజెక్టులు చేసినట్టు తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. పోలవరం, ముచ్చుమర్రిలతో పాటు గాలేరు-నగిరి, హంద్రీనీవా ప్రాజెక్టులు వైయస్ మరణాంతరం 2011లోనే నీటిని విడుదల చేశారన్నారు. గాలేరు-నగిరి మొదటిభాగంలో గండికోట అంతర్భాగంలో మొదటి ప్రాధాన్యత వామికొండ, సర్వారాయసాగర్‌లకు నీటిని పంపిన తర్వాతే మిగిలిన ప్రాజెక్టులకు నీరందించాలన్నారు. తెలుగుదేశం నేతలు ప్రాజెక్టుల విషయంలో తమ ఎమ్మెల్యేలు విరిసిన సవాల్‌కు కట్టుబడి ఎక్కడైనా చర్చకు వచ్చి ప్రజలకు వివరణ ఇవ్వాలన్నారు. లేనిపక్షంలో మీరు ప్రారంభించిన ప్రాజెక్టులోని నీళ్లను తీసుకువచ్చి వైయస్ సమాధి వద్ద నివాళులర్పించాలని డిమాండ్ చేశారు. 2012-13లో బుడ్డశనగ ఇన్సూరెన్స్ మొత్తం రు.173కోట్లు ప్రభుత్వం వెంటనే రైతులకు విడుదల చేయాలని, రబీలో సాగుచేసిన బుడ్డశనగ పంటను ప్రభుత్వం కాపాడాలని ఆయన కోరారు. ఇందులో వైకాపా నేతలు రఘునాధరెడ్డి, శివకుమార్‌రెడ్డి, సురేశ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

అర్హులకే ప్రభుత్వ పథకాలు
చింతకొమ్మదినె్న,జనవరి 6: రాష్ట్రప్రభుత్వం పేదప్రజలకు ప్రభుత్వపథకాలు అందించాలన్న ఉద్దేశ్యంతో అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలని మండల తహశీల్దార్ మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం చింతకొమ్మదినె్న మండల పరిధిలోని కొప్పర్తి, తాడిగొట్ల పంచాయతీల్లో ఎంపిడివో రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జన్మభూమి నిర్వహించారు. ఈ సందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ అర్హులకు సంక్షేమ పథకాలు అందజేయడం జరుగుతుందని ఇందులో భాగంగా కొత్తగా రేషన్‌కార్డులు ఇవ్వడం జరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు నిత్యం కష్టాల్లో ఉండటం, ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చేందుకు ఇబ్బందిగా ఉండటంతో జన్మభూమి పేరిట గ్రామాల్లోనే సదస్సులు నిర్వహించడం జరుగుతోందన్నారు. గతంలో జరిగిన జన్మభూమిలోనూ, తహశీల్దార్ కార్యాలయంలో గ్రీవెన్స్‌సెల్‌లో ఇచ్చిన దరఖాస్తులు పరిశీలించిన అనంతరం అర్హులైన వారిని గుర్తించి ప్రభుత్వ పథకాలు అందించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్లు, ఎన్‌టిఆర్ గృహనిర్మాణ పథకాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఎంపిపి వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ పేదప్రజలు సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకోవాలన్న ఉద్దేశ్యంతో చంద్రబాబునాయుడు ప్రతి సంవత్సరం చంద్రన్న కానుక ఇవ్వడం ఎంతో హర్షణీయమన్నారు.
డ్వాక్రా మహిళలకు, రైతులకు రుణమాఫీ చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందన్నారు. అనంతరం ప్రజల నుంచి తహశీల్దార్, ఎంపిడివోకు తమ సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఇ, వెలుగు ఏపిఎం, కార్యాలయం సిబ్బంది, సిసిలు, ప్రజలు, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

కుటుంబ వికాసమే సమాజ ప్రగతికి నాంది
మైదుకూరు,జనవరి 6: కుటుంబ వికాసం సమాజ ప్రగతికి ప్రతిరూపంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మభూమి గ్రామసభలద్వారా ప్రతి కుటుంబ వికాసం కోసం చేయూతనిచ్చి ప్రోత్సహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. జన్మభూమి నాల్గవ విడతలో భాగంగా పట్టణంలోని 11వ వార్డు సర్వాయపల్లె రోడ్డులో కౌన్సిలర్ ఎస్.కవితా బచ్చన్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన జన్మభూమి గ్రామసభకు ఆయన ముఖ్యిఅతిధిగా విచ్చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబు జన్మభూమి గ్రామసభలు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారన్నారు. ప్రభుత్వ అన్ని శాఖల అధికారులను నేరుగా ప్రజలవద్దకే పంపించి సమస్యల పరిష్కారం కోసం పనిచేయడమే గ్రామసభల ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఈగ్రామసభలు ప్రజాసమస్యల పరిష్కార వేదికలుగా నిలుస్తున్నాయని ప్రజలు గ్రామసభలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గతంలో ఎన్నడూ మున్సిపాల్టీలో అభివృద్ధికి నోచుకోని పనులు సైతం టిటిడి పాలక సభ్యుడు సుధాకర్ యాదవ్ అభివృద్ధిపరచడమే ఆయన పనితనానికి నిదర్శనమన్నారు. నూతనంగా మంజూరైన గృహాలను లబ్ధిదారులు తక్షణమే నిర్మించుకోవాలని నిర్మించుకోకపోతే మంజూరైన గృహాలు రద్దుచేసి ఇతరులకు కేటాయిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయన నూతనంగా మంజూరైన రేషన్‌కార్డులు, పెన్షన్లు, చంద్రన్న సంక్రాంతి కానుకలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ నజీర్ అహ్మద్, ఇన్‌చార్జి మున్సిపల్ కమిషనర్ నరసింహులు, మండల వైద్యాధికారి డాక్టర్ మల్లేష్, కో-ఆప్షన్ మెంబర్ గంగయ్య, టిడిపి నాయకులు ఎస్.అమీర్‌బాషా, పిచ్చిపాటి వీరారెడ్డి, ప్రసాద్, సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు కొండపల్లి ఉమాకాంత్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.