కడప

రగులుతున్న రాజకీయ జలజగడం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జనవరి 13: జిల్లాలో గండికోట ప్రాజెక్టు నీటి విడుదల జరిగిందో లేదో కానీ అధికార, ప్రతిపక్ష నేతల మధ్య జలజగడం మొదలైంది. వాస్తవంగా ఈ ప్రాజెక్టు రూపకల్పన, శంకుస్థాపన, ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతులమీదుగానే జరిగింది. అయితే బడ్జెట్ కేటాయింపుల్లో కొంత మేరకు పనులు పూర్తికావడంలోనూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లాప్రాజెక్టులకు అధికప్రాముఖ్యత ఇచ్చి వేలాదికోట్లరూపాయలు విడుదల చేశారు. అప్పట్లో కాంట్రాక్టర్లు, కాంగ్రెస్ నేతలు, అధికారులు నిర్లక్ష్యం వహించడంతోపాటు అక్రమాలకు పాల్పడటం వల్లనే ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో తీవ్ర జాప్యం జరిగింది. అదేవిధంగా వైకాపా నేతలు తమ ఉనికిని కాపాడుకునేందుకే పార్టీ స్థాపితం నుంచి ప్రాజెక్టుల నిర్మాణాలపై పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండవ పర్యాయం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రాజెక్టుల నిర్మాణాలకు పెద్దపీట వేయడం, ముఖ్యంగా ప్రతిపక్షనేత జగన్మోహన్‌రెడ్డి సొంత జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టిపెట్టారు. దీన్ని జీర్ణించుకోలేని వైసిపి నేతలు విమర్శలకు పరిమితం కాగా, అధికార టిడిపి నేతలు కార్యసాధనలో ఒక అడుగుముందుకేసి వైసిపి నేతల ఆరోపణలు తిప్పికొడుతూ ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నారు. దీన్ని జీర్ణించుకోలేక వైసిపి నేతలు అధికారపార్టీపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఇదిలావుండగా రాయల సీమకే తలమానికమైన గండికోట రిజర్వాయర్‌కు నాడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్.చంద్రబాబునాయుడు శిలాఫలకం వేయగా, మూడురోజుల క్రితం మళ్లీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతులమీదుగానే గండికోట నుంచి నీరు వదిలారు. గాలేరు-నగరి, సుజలస్రవంతి అంతర్భాగమైన గండికోట జలాశయం ఏర్పాటుకు అనేక సర్వేలు అనంతరం కృష్ణామిగులు జలాలు, కర్నాటక, మహారాష్ట్ర, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రాల ఎగువ ప్రాంతాల నీరు చేరి సీమ జిల్లాలు సస్యశ్యామలం అవుతాయని గుర్తించిన తర్వాతనే గండికోట ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. 1996 ఫిబ్రవరి 29న అప్పటి ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు అప్పటి నీటిపారుదలశాఖ మంత్రి డా.కోడెల శివప్రసాద్, జిల్లా మంత్రి బి.వీరారెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే పి.రామసుబ్బారెడ్డిలచే జలాశయానికి పునాదిరాళ్లు వేశారు. అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి కడప పార్లమెంట్ సభ్యునిగా ఉండేవారు. అనంతరం నిధుల కొరత అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో కొంతమేరకు జాప్యం జరగడం, తెలుగుదేశం ప్రభుత్వం పాలనలో ఉన్నకాలంలో బడ్జెట్ కేటాయింపుల్లో కేంద్రం సహకరించలేదు. కొంతకాలానికి కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి రావడం, అడుగడుగునా నిర్లక్ష్యం జరగడం, 2004లో కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా అయిన అనంతరం గాలేరు-నగరి, సుజలస్రవంతి, హంద్రీ-నీవా, తెలుగుగంగ ప్రాజెక్టులకు రూ.4వేలకోట్లుపైబడి ఖర్చుచేశారు. ఈ మొత్తం కూడా ఫేస్ -1,2,3,4 కింద వేలాది కోట్లరూపాయలు ఖర్చు చేసినా కార్యరూపం దాల్చలేదు. ప్రాజెక్టుల నిర్మాణంలో అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుచూపులేకపోవడం, కేవలం సీమ జిల్లాలకు చెందిన కాంగ్రెస్ నేతలే కాంట్రాక్టర్ల అవతారం ఎత్తడం, అధికారపార్టీ నేతలకు చెందిన అనుచరులు కాంట్రాక్టర్లుగా రంగ ప్రవేశం చేయడం,తమకు అనుకూలమైన అధికారులను నియామకం చేసుకుని అడుగడుగునా ప్రాజెక్టుల నిర్మాణాలు గాలికి వదిలేశారు. దీంతో ప్రాజెక్టుల నిర్మాణాలకంటే నిధులు పక్కదారి పట్టించడమే అధికమైంది. ముఖ్యమంత్రిగా 2014లో చంద్రబాబునాయుడు ఎన్నికకావడం, వైసిపి అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి చంద్రబాబునాయుడు చేపట్టే ప్రతి కార్యక్రమంపై ఆరోపణలు, ఆందోళనలు చేపట్టడం అర్థాంతరంగా నిలచిపోయిన ప్రాజెక్టులు, కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలకు బాబు కృషి చేస్తుంటే జగన్మోహన్‌రెడ్డి విమర్శిస్తూ వస్తూ అడుగడుగునా అభివృద్ధికి ఆటంకం చేస్తున్నారనేది జగమెరిగిన సత్యం. బాబు కూడా తాను సీమ జిల్లాలకు నీరు ఇస్తానంటే జగన్ అడ్డుపడుతున్నారని వైఎస్ కుటుంబం 40సంవత్సరాలుగా పాలనలో ఉండి పులివెందులకు సాగునీరు, తాగునీరు తెప్పించుకోలేకపోయారని ధ్వజమెత్తారు. అతి తక్కువకాలంలో గండికోట నీటిని లిఫ్టు ద్వారా పైడిపాలెం ప్రాజెక్టుకు నీరు విడుదల చేసి తద్వారా ప్రస్తుతం పులివెందుల నియోజకవర్గాన్ని మరో కొన్నిరోజుల్లో సర్వారాయ సాగర్, వామికొండ ప్రాజెక్టులకు నీరు తెప్పించనున్నారు. ప్రస్తుతం ప్రత్యక్షంగా 47వేల ఎకరాలు , పరోక్షంగా మరో 15వేల ఎకరాలు సాగుకునోచుకునేందుకు గండికోటకు నీరు వదిలారు. దీన్ని జీర్ణించుకోలేక వైసిపి నేతలు తెలుగుదేశం ప్రభుత్వంపై, టిడిపి జిల్లా, సీమ జిల్లాలకు చెందిన నేతలపై విమర్శలు చేస్తున్నారు. అయితే అధికారపార్టీ నేతలు కూడా జగన్మోహన్‌రెడ్డి సొంత జిల్లాలోనే ఆయన కుటుంబం 40ఏళ్లుగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు పదవులు చేపట్టి సొంత నియోజకవర్గానికి చేసింది శూన్యమని , కేవలం అధికారం, ఆధిపత్యం, ఫ్యాక్షన్‌కే పరిమితమయ్యారని ధ్వజమెత్తుతున్నారు. అదే రీతిలో వైసిపి నేతలు కూడా అధికార టిడిపి నేతలపై కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. మొత్తం మీద చిలికి చిలికి గాలివానై జిల్లాలో ఎక్కడ చూసినా గండికోట రిజర్వాయర్ నుంచి పులివెందులకు నీటి విడుదల చేసిన వ్యవహారంపైనే తారాస్థాయిలో చర్చజరుగుతోంది. ఇరుపార్టీలకు చెందిన నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ప్రస్తుతం ఎన్నికలు లేకపోయినా ఎన్నికల వాతావరణం వేడి సృష్టిస్తున్నారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో
ప్రభుత్వం విఫలం

ఎర్రగుంట్ల,జనవరి 13: గ్రామాల్లో వౌలిక సదుపాయాలతోపాటు సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్రప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్‌సిపి జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ మూలె సుధీర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలపరిధిలోని చిలమకూరు ఎస్సీకాలనీలో గడప గడపకు వైఎస్సార్ సిపి కార్యక్రమంలో భాగంగా ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజాసమస్యలను అడిగితెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీకాలనీలో మంచినీటి సమస్యతోపాటు రోడ్లు, విద్యుత్ తదితర సమస్యలు తీవ్రంగా ఉన్నాయని వీటిని పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలు ఉన్న ఈ కాలనీల్లో మహిళలకు, వృద్ధులకు పెన్షన్లతోపాటు కాలనీల్లో వీధిలైట్లులేని కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. కేవలం ప్రజలను మభ్యపట్టేందుకే చీటికి మాటికి జన్మభూమిలంటూ సమావేశాలు నిర్వహించి మొండిచేతులు చూపిస్తున్నారన్నారు. గ్రామంలో వౌలిక వసతులు కూడా కరువై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గ్రామంలో స్వచ్ఛ భారత్ ఎక్కడ కన్పించలేదని వీధుల్లో మురుగుకాలువలు పారుతున్నా పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ ఆకాశంలో అమరావతిని చూపిస్తున్నారని వాస్తవానికి ప్రజలు ఎన్నో సమస్యలతో సతవౌతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులు కేవలం సొంతపార్టీ వారికి తప్ప మిగతావారికి సమస్యల సాధనకు సహకరించడం లేదన్నారు. ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలపట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
కార్యక్రమంలో ఎంపిటిసిలు ప్రతాప్, ముస్త్ఫా, మాజీ ఎంపిటిసి గంగులయ్య, వైఎస్సార్‌సిపి నాయకులు రఘునందన్‌రెడ్డి, రామకృష్ణ, రామాంజనేయరెడ్డి, గంగా కృష్ణారెడ్డి, జయరామకృష్ణారెడ్డి, హరిప్రసాద్, కార్యకర్తలు పాల్గొన్నారు.