కడప

ఉల్లంఘేశ్వరాలయం అభివృద్ధికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందలూరు, జనవరి 15:దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో దాదాపు రూ. 86 లక్షల నిధులతో శ్రీ కామాక్షి సమేత ఉల్లంఘేశ్వరస్వామి ఆలయ పునః నిర్మాణ పనులకు శనివారం విప్ మేడా మల్లికార్జునరెడ్డి శంకుస్థాపన చేసి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు శ్రీ సౌమ్యనాధాలయం, ఉల్లంఘేశ్వరాలయం 11వ శతాబ్దంలో నిర్మితమైనట్లు చరిత్ర చెబుతుందని, ఈ ఆలయం శిథిలావస్థకు చేరడంతో పునః నిర్మాణ పనులను దేవాదాయ శాఖ చేపట్టడం అభినందనీయమన్నారు. సౌమ్యనాధస్వామి అన్నదాన సేవా ట్రస్టు అధ్యక్షులు యెద్దల సుబ్బరాయుడు మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి పెన్నా గ్రూప్స్ అధినేత ప్రతాప్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి రూ. 16 లక్షలు, దేవాదాయ శాఖ రూ. 64 లక్షలు మంజూరు చేశారన్నారు. చరిత్రకు నిదర్శనంగా ఉన్న ఈ ఆలయం పూర్తి శిథిలావస్థలో ఉన్నందున తిరిగి నిర్మించాలని, పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన కోరారు. అనంతరం విప్ మేడా, ఎంఆర్‌కెఆర్ అధినేత రఘునాధరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి తదితరులు సౌమ్యనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఎసి శంకరబాలాజీ, టిడిపి నాయకులు శివరామరాజు, ఆలయ సభ్యులు గంటా వాసుదేవయ్య, పల్లె సుబ్రహ్మణ్యం, జంగంశెట్టి సుబ్రహ్మణ్యం, కొండపల్లె సుబ్బరాయుడు, సుబ్బరామయ్య, సమ్మెట శివప్రసాద్ పాల్గొన్నారు.

అంతర్జాతీయ పర్యటక కేంద్రంగా
గండికోట..

కడప,జనవరి 15: ప్రపంచంలోనే అత్యంతపురాతనమైన గండికోట వైభవానికి గుర్తింపుతెచ్చి పర్యాటక రంగంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బ్రిటీషుపాలనలో వర్తకుల రాకపోకలకు పెన్నానది ద్వారా నౌకల రాకపోకలకు సౌకర్యంగా ఉండటంతో ఈ గండికోటను అప్పటి రాజులు అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. జిల్లాలోని జమ్మలమడుగు సమీపంలోని గండికోట వైభవాన్ని ప్రపంచస్థాయిలో తెలియజేసేందుకు ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఏడాది క్రితమే అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా ప్రకటించారు. ఈనేపధ్యంలో ఈనెల 29,30న గండికోట ఉత్సవాలను నిర్వహించనున్నారు. కలెక్టర్ కెవి సత్యనారాయణతోపాటు పర్యాటకశాఖ రాయలసీమ అధికారి జి.గోపాల్ గత పదిరోజులుగా ఈ ఉత్సవాల ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. రాజసం ఉట్టిపడేలా చారిత్రాత్మకంగా ఎంతో చరిత్ర ఉన్న గండికోటలో ఏటా నిర్వహించే ఉత్సవాలను రాష్టస్థ్రాయిలో ప్రభుత్వం జరుపుకునే పండుగల్లో ముఖ్యమైన పండుగగా గుర్తించారు. ఈ ఉత్సవాల సందర్భంగా గండికోటలోని పురాతన కట్టడాలను, ప్రవేశద్వారం, మాధవరాయ ఆలయం, జుమ్మామసీదు, కారాగారం, ధాన్యాగారం, బురుజులు, మినార్లు, పురాతన కట్టడాలు పడిపోయిన వాటన్నింటినీ మరమ్మతులు చేసి వాటికి రంగులు వేసి అందంగా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశంతో శరవేగంతో పనులు చేపడుతున్నారు. ఈ ఉత్సవాలకు జాతీయ స్థాయిలో, రాష్టస్థ్రాయిలో పేరుపొందిన కళాకారులు, గేయ కళాకారులు, వివిధ సాంస్కృతిక విభాగాల్లో పేరుపొందిన వారందర్నీ రప్పించే యోచనలో ఉన్నారు. ప్రపంచంలో కేవలం మూడు పర్యాటక కేంద్రాల్లో గండికోట కట్టడాలు, గండికోట చారిత్రత్మక గండికోట వారసత్వం కట్టడాలు, స్థలపురాణం తదితర వాటన్నింటినీ పోల్చుకుంటే ప్రపంచంలోనే మొదటిస్థానంలో గండికోట ఉండటంతో ఈ కోటను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు వేగవంతంగా చర్యలు మొదలయ్యాయి. ఒకప్పుడు శ్రీకృష్ణదేవరాయులు, చోళులు, మట్లిరాజులు, నవాబులకు నిలయమై రత్నాలు, వజ్ర వైడూర్యాలు, బంగారు, వెండి ఖనిజ సంపదను సీమ జిల్లాలకు, అక్కడి నుంచి గండికోటకు బ్రిటీషు పాలనలో వర్తకులు అక్కడకు తెచ్చుకుని, పెన్నానదిలో ఉన్న గండికోట సొరంగ మార్గమద్యం ద్వారా నీటిలోనే పడవలతో వెళుతూ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేవారు. జాతీయ సంపదగా మనగలుగుతున్న గండికోట కడప జిల్లాలో ముఖ్యంగా రాయలసీమలో ఉండటం జిల్లాకే గాక రాష్ట్రానికి గర్వకారణంగా ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు. ఇలాంటి అతిపురాతనమైన గండికోట చరిత్ర బాహ్యప్రపంచానికి తెలియజేసేందుకు తద్వారా జిల్లాను వెలుగులోకి తెచ్చేందుకు గతంలో నిర్లక్ష్యం వహించిన పాలకులు ప్రస్తుతం ఉత్సవాల పేరిట అభివృద్ధి చేయడం అభినందనీయమని ప్రజలు భావిస్తున్నారు. అయితే ఉత్సవాల పేరుతో ధన దుర్వినియోగానికి ఆస్కారం ఇవ్వకుండా పురాతన కట్టడాలు తిరిగి మరమ్మతులు చేయడం ద్వారా బాహ్యప్రపంచానికి గండికోట చరిత్రను తెలియజేసేందుకు ప్రభుత్వాలతోపాటు ప్రజలు కూడా శ్రద్ధవహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపధ్యంలో ఈనెల 29,30న ప్రపంచపర్యాటక వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిశ్చయించడం అభినందనీయం.

ఇక నుంచి పాఠశాలల్లో
కూచిపూడి శిక్షణ

కడప,జనవరి 15: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపాఠశాలల భాష సంస్కృతి నేతృత్వంలో నాట్యతరంగాన్ని ఇటీవల విజయవాడలో నిర్వహించగా ఆ నాట్యాన్ని వీక్షించిన ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ప్రతి పాఠశాలలో కూడిపూడి నిర్వహించాలని ప్రకటించారు. ఈనెల 11న ఆయన జిల్లా పర్యటన సందర్భంగా జిల్లాలో కూచిపూడి నాట్యప్రదర్శనను స్వయంగా వీక్షించి సభావేదిక మీద బహిరంగంగానే ప్రకటించారు. ఈ నేపధ్యంలో జిల్లాలోని కూచిపూడి శిక్షణ ఇచ్చే వారికి ఆదరణ పెరిగింది. గతంలో పలు ప్రభుత్వపాఠశాలల్లో సంగీతం, డ్రాయింగ్, ఒకేషనల్ విద్యాబోధకులు తదితర ఉపాధ్యాయులు ఉండేవారు. క్రమేపీ ఆ ఉపాధ్యాయుల భర్తీ లేకపోవడంతో ప్రభుత్వపాఠశాలల్లో ఆ ఉపాధ్యాయుల ఖాళీలు కనుమరుగయ్యాయి. రాష్ట్ర విభజన అనంతరం ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు వివిధ దేశాల పర్యటన సందర్భంగా కూచిపూడికి ప్రతిదేశంలో గౌరవం వుందని గుర్తించారు. ఈనెల 5న అంతర్జాతీయ కూచిపూడి నాట్యప్రదర్శన విజయవాడలో నిర్వహించడం రెండురోజులపాటు కూచిపూడి నాట్యాల ప్రదర్శనను, వివిధ రకాల నృత్యాలు అభినయ పూర్వక ప్రసంగాలు పెద్ద ఎత్తున ప్రదర్శనలు ఇవ్వడంతో రెండురోజులపాటు విజయవాడలో జరిగిన నవ్యాంధ్ర కూచిపూడికి గౌరవం దక్కేందుకు ఏకకాలంలో 6వేల మంది కూచిపూడి నాట్యాన్ని ప్రదర్శించడంతో ఆ ప్రదర్శనలు స్వయంగా సుప్రీంకోర్టు జస్టిస్ ఎస్వీ రమణ, ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు కూచిపూడి ప్రదర్శనలు చూసి అన్ని నాట్యాలకంటే కూచిపూడి నాట్యమే బాగుంటుందని గుర్తించి, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో కూచిపూడినాట్యంలో శిక్షణ ఇవ్వాలని ప్రకటించడంతో జిల్లాలో పలు పాఠశాలల్లో కూచిపూడి నాట్యంపై శిక్షణ ఇచ్చే ఉపాధ్యాయులు ముందుకొస్తున్నారు. మొత్తం మీద జిల్లాలో కూడిపూడి నాట్యానికి ఆదరణ లభిస్తోందని చెప్పవచ్చు. ఈ బాధ్యతను ప్రతి పాఠశాల హెచ్‌ఎంలకు, జిల్లా విద్యాశాఖాధికారులకు, ప్రాంతీయ వ్యాయామ అధికారులకు అప్పజెప్పుతున్నట్లు తెలుస్తోంది.

ఘనంగా కనుమ పండుగ

కడప,(కల్చరల్)జనవరి 15: సంక్రాంతి పండుగలో భాగంగా ఆదివారం జిల్లా వ్యాప్తంగా కనుమ పండుగతో ఘనంగా ముగిసింది. పట్టణాల్లో అంతంతమాత్రంగానే పండుగ సంబరాలు కన్పించినా, హిందూ సాంప్రదాయాలు, గాలిపటాలకే పరిమితం కాగా గ్రామీణ ప్రాంతాల్లో కనుమ ఘనంగానే జరుపుకున్నారు. కొత్త అల్లుల్లకు అత్యంత ప్రీతిపాత్రమైన సంక్రాంతి పండుగ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కన్పించినా, పట్టణాల్లో సంబరాలు తక్కువగానే కన్పించాయని చెప్పవచ్చు. గ్రామాల్లో ఆనవాయితీగా కోడిపందేలు, పేకాటలు ఉన్నప్పటికీ ఉభయ గోదావరి జిల్లాలను తలపించే విధంగా సాంప్రదాయాలే కాకుండా జూదం యధేచ్చగా కొనసాగింది. దశాబ్దకాలం నుంచి జిల్లా రైతాంగాన్ని వరుస కరువులు వెంటాడుతుండటం, కొత్త పంటల దిగుబడితో ప్రారంభమయ్యే సంక్రాంతి ఈ ఏడాదికి కూడా అతివృష్టి, అనావృష్టితో అప్పులు చేసుకుని గ్రామీణప్రాంతాల్లో పండుగ జరుపుకున్నారన్నది నగ్నసత్యం. ముఖ్యంగా సంక్రాంతి సంబరాల్లో ముందస్తుగా గ్రామీణ ప్రాంతాల్లో గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, వివిధ సాంప్రదాయ ఆట పాటలతో కళకళలాడేవి. కానీ వర్షాలు సరైన సమయంలో పడకపోవడంతో కరవుకారణంగా సాంప్రదాయాలన్నీ కేవలం మొక్కుబడిగానే కన్పించాయి. ప్రభుత్వమేమో అట్టహాసంగా సంక్రాంతి పండుగను ప్రభుత్వ పండుగగా కోటిరూపాయలు పైగా ఖర్చుచేసి గ్రామీణ ప్రాంత ఆటలు, సంప్రదాయాలు మరిచిపోకుండా ముగ్గులు, కబడ్డీ, జానపద నృత్యాలు తదితర పోటీలు మొక్కుబడిగానే నిర్వహించారన్న విమర్శలున్నాయి. తొలిరోజు శుక్రవారం బోగిపండుగ గ్రామీణ ప్రాంతాల్లో ఘనంగా జరిగింది. ఇళ్ల ముంగిట ముగ్గులతో, గుమ్మడి పూల ప్రదర్శన, గొబ్బెమ్మలు, రేగిపండ్లతో తలంటు స్నానాలు చేసి, పాతవస్తువులు, బోగికోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసుకున్న కొయ్యలన్నింటినీ ఇంటిముందు వేసి కాల్చివేసి ఒక పక్క చలిమంటలు, మరోపక్క కాంచిన బోగినీటితో స్నానాలు ఆచరించారు. శనివారం మకరసంక్రాంతి పురస్కరించుకుని దేవాలయాల్లో, ఇళ్లల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి గుమ్మడికాయలతో దిష్టితీసి పెద్ద ఎత్తున గుమ్మడికాయలు కొట్టారు. అలాగే పెద్దలను స్మరించుకునేందుకు పిండివంటలు తయారుచేసి గతించిన వారికి అత్యంత ప్రీతికరమైన వంటకాలు తయారుచేసి సమాధుల వద్ద వుంచి తర్పణం వదిలారు. ఏటా తమ పొలాల్లో పండిన అలసందల ద్వారా వడలు, వివిధ రకాల వంటకాలు, మాంసాహారంతో విందు ఆరగించారు. ముఖ్యంగా గంగిరెద్దులు, హరిదాసులు, గొబ్బెమ్మల ప్రదర్శనలతో పాటు తమ ఇళ్లల్లో ఉన్న పశువులకు వివిధ రకాల రంగులతో ముస్తాబుచేసి సాయంత్రం తమ పంటశాలలో పార్వేట నిర్వహించారు. అంతేగాకుండా బండ్లు, బండలాగే వృషభరాజముల పోటీలు నిర్వహించడానికి కూడా జూదం తరహాలో నిర్వహించి పందేలు లక్షల రూపాయల్లో కాసారు. అలాగే టెంకాయల పోటీలు, టెంకాయలు పగులకొట్టే పోటీలు, కుందేళ్ల పందేలు, పొట్టేళ్ల పందేలు, కోడిపందేలు, ఎద్దలపోటీలు అత్యుత్సాహంగా నిర్వహించారు. న్యాయస్థానాలు, చట్టాలు, ప్రభుత్వం కోడిపందేలు, జూదాలు నిర్వహించరాదని కఠినంగా ప్రకటించినా ఇవేమి పందెం రాయుళ్లు పట్టించుకోకుండా వారికి నచ్చిన ప్రాంతాల్లో పందేలు జరిగాయి. మొత్తం మీద జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఒక మోస్తరులో నిర్వహించారని చెప్పవచ్చు.

జన్మభూమి అర్జీలపై
అధికారుల కసరత్తు..

కడప,జనవరి 15: ఈనెల 2 నుంచి 11వరకు నాల్గవ విడత జన్మభూమి -మా ఊరు కార్యక్రమంలో భాగంగా జరిగిన గ్రామసభల్లో వచ్చిన అర్జీలపై సోమవారం నుంచి అధికారులు కసరత్తు మొదలుపెట్టనున్నారు. రెవెన్యూ డివిజన్ల వారీగా దరఖాస్తులు పరిశీలించి కడప, జమ్మలమడుగు, ప్రొద్దుటూరులో వచ్చిన దరఖాస్తులను మండలస్థాయిల్లో మరోమారు సర్వేచేసి దరఖాస్తు దారులకు న్యాయం చేయనున్నారు. ముఖ్యంగా సమాజ వికాసానికి పది సూత్రాలు, కుటుంబ వికాసానికి 15 సూత్రాలు రూపొందించి జన్మభూమి -మా ఊరు కార్యక్రమం నిర్వహించారు. సమాజ వికాసంలో ఆరోగ్యం, వైద్యం, విద్య, వ్యవసాయం వౌలిక రంగాల అభివృద్ధి పారిశ్రామిక అభివృద్ధి, సమాచారం, సమ్మిళిత అభివృద్ధి, పౌరసేవలపై అర్జీలను పరిశీలించనున్నారు. ఇక కుటుంబ వికాసానికి 15 సూత్రాల్లో అర్హులందరికీ పెన్షన్లు, వృద్ధులకు, వితంతువులకు రూ.1000లు, వికలాంగులకు రూ.1500లు, ప్రతి కుటుంబానికి నెలకు రూ.15వేలు ఆదాయం, 24గంటల విద్యుత్, వంటగ్యాస్ తదితర వాటిని అధికారులు పరిశీలించనున్నారు. ప్రతి జన్మభూమిలో ఇదే తరహా దరఖాస్తులు వస్తుండటంతో అధికారులు నెత్తిపట్టుకుని అయోమయంలో పడ్డారు. ముఖ్యంగా ఎన్‌టిఆర్ గృహాలు, పెన్షన్లలో వేలిపెడితే వారు బుక్ అయ్యే పరిస్థితులు ఉన్నాయని అధికారుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇదిలా వుండగా ఇలాంటి పథకాల అభివృద్ధికి జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేయడం ఆ కమిటీల్లో అధికారపార్టీకి చెందిన వారే అధికంగా ఉండటం, అధికారపార్టీ నేతలకే అర్హత ఉన్నా అర్హత లేకపోయినా ప్రభుత్వ సంక్షేమపథకాలు అందుతున్నాయని విమర్శలు సర్వత్రా విన్పిస్తున్నాయి. దీనికితోడు గ్రామాల్లో జరిగే జన్మభూమి కార్యక్రమాలకు గతంలో పెన్షన్లు తీసుకున్నవారితోపాటు అర్హతలేని వారు కూడా తిరిగి దరఖాస్తులు పెట్టుకోవడం వాటిని పార్టీ తరపున ఏర్పాటుచేసిన జన్మభూమి కమిటీ సభ్యులు బలపరచడం లాంటి అక్రమాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. అలాగే బ్యాంకుల రుణాలు గతంలో పొంది డీ ఫాల్టర్స్ అయిన వారిని కూడా జన్మభూమి కమిటీ సభ్యులు బలపరుస్తూ అధికారులపై వత్తిడి తెస్తున్నారన్న విమర్శలు కూడా విన్పిస్తున్నాయి. వాస్తవానికి అర్హులకంటే అనర్హులకే జన్మభూమి కమిటీ సభ్యులు సిఫార్సులు చేస్తూ అర్హులకు అందకుండా చేస్తున్నారని ప్రజలు బహాటంగా విమర్శిస్తున్నారు. ఈవిషయంపై సంబంధిత మండల అధికారులు పార్టీ నాయకుల వత్తిడికి లొంగి అనర్హులకు అవకాశాలు కల్పిస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. జన్మభూమి జరిగితే పేదలకు మేలు జరుగుతుందన్న నమ్మకాన్ని కమిటీలు వమ్ముచేస్తున్నాయి. ఈవిషయంపై ప్రభుత్వ ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకుని అర్హులకు సంక్షేమ ఫలాలు అందినప్పుడే ఇలాంటి కార్యక్రమాల పట్ల ప్రజలు స్పందించడంతోపాటు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఆ దిశగా అటు నాయకులు ఇటు అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సీఎంను కలిసిన
ఎమ్మెల్యే జయరాములు

బద్వేలు, జనవరి 15: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని శనివారం స్వగ్రామమైన నారావారి పల్లెలో బద్వేలు ఎమ్మెల్యే జయరాములు, బద్వేలు పట్టణాధ్యక్షుడు నరసింహనాయుడు, మార్కెట్‌యార్డు మాజీ ఛైర్మన్ చనరాజుయుడు, నడిపి వెంకటసుబ్బయ్య, పిఒ పొట్టి సుబ్బారెడ్డితో కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మొదటగా సీఎంతోను, నారా లోకేష్‌ను కలిశారు. బద్వేలు నియోజకవర్గ పరిస్థితులను వారికి వివరించినట్లు తెలిపారు. అదేవిధంగా ప్రజా సమస్యలు వారి దృష్టి కి తీసుకెళ్లినట్లు తెలిపారు. అలాగే మార్కెట్‌యార్డు ఛైర్మన్ పదవి గురించి కూడా ముఖ్యమంత్రితో చర్చించినట్లు సమాచారం. కాగా ఈనెల 20వ తేదీ తర్వాత బద్వేలు నియోజకవర్గ పరిస్థితులపై సమీక్షించి తగు చర్యలు తీసుకుంటామని సిఎం చెప్పినట్లు సమాచారం.

జంబ్లింగ్ పద్ధతిలో ఇంటర్ ప్రాక్టికల్స్..

కడప,జనవరి 15: ఈ యేడాది నుంచి ఇంటర్ ప్రయోగశాల పరీక్షలు జంబ్లింగ్ పద్ధతిలో నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో అధికమార్కులు సంపాదనకోసం ప్రయోగపరీక్షలు కీలకంగా మారడంతో కార్పొరేట్ విద్యాసంస్థలు తమ విద్యాసంస్థలు ర్యాంక్‌లు సంపాదనకోసం సర్వం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని కార్పొరేట్, ప్రైవేట్ విద్యాసంస్థల్లో గతంలో ఇంటర్ విద్యార్థులకు ప్రయోగపరీక్షలు నిర్వహించేవారు. ఈ ఏడాది నుంచి ప్రయోగ పరీక్షలకు జంబ్లింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడంతో ప్రైవేట్, ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ , సహకార కళాశాలల్లో , ఏపి రెసిడెన్షియల్ కళాశాలల్లో విద్యార్థులందరికీ పబ్లిక్ పరీక్షలు తరహాలో ప్రయోగ పరీక్షలు కూడా జంబ్లింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. వచ్చేనెల 3 నుంచి జంబ్లింగ్ పరీక్షలు ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలన్నింటిలోని విద్యార్థులు ఏ కళాశాలల్లో పరీక్షలు రాసేది ఎవరికీ అంతుపట్టడం లేదు. అయితే ప్రైవేట్ విద్యాసంస్థలు, కార్పొరేట్ విద్యాసంస్థలు జంబ్లింగ్ విధానంలో మెళుకువలు కనుగొని ఏకళాశాలల్లో ఏ కళాశాల విద్యార్థులు పరీక్షలకు హాజరౌతారోనని తెలుసుకుని ప్రయోగాల పరీక్షలకు కాపీలు కొట్టించేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎంసెట్ ర్యాంకుకు ఇంటర్ మార్కులు కీలకం కావడంతో జంబ్లింగ్ విధానంలో ప్రయోగ ఫలితాలు మార్కులు తగ్గితే ఎంసెట్‌లో ర్యాంకు రాదు. బైపిసి విద్యార్థులకు బాటనీ, జువాలజి, ఫిజిక్స్, కెమిస్ట్రి ఒక సబ్జెక్టుకు 30మార్కులు చొప్పున 120మార్కులు ప్రయోగపరీక్షలకే ఉంటాయి. గతంలో ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థల యాజమాన్యాలు 50శాతం పైబడి విద్యార్థులకు 120 మార్కులు వేయించుకునేవారు. అప్పట్లో పరీక్షలు కూడా ఏకళాశాలలో చదువుతుంటే ఆ కళాశాలల్లోనే ప్రయోగ పరీక్షలకు విద్యార్థులు హాజరయ్యేవారు. ప్రస్తుతం జంబ్లింగ్‌తో ఆ విద్యార్థులు ఎక్కడ పరీక్షలు రాసేది తెలియదు. అయినా ఎంసెట్ పరీక్షలు బైపిసి, ఎంపిసి విద్యార్థులకు ర్యాంకులు వచ్చేందుకు విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రైవేట్ యాజమాన్యాలు మాట్లాడుకుని వేలాది రూపాయలు వసూళ్లు చేసి, ఇంటర్ ప్రయోగపరీక్షల నిర్వహణకు ప్రైవేట్ విద్యాసంస్థల విద్యార్థులకే అధికమార్గుల సాధనకోసం సర్వం సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. ప్రయోగ ఫలితాలపై ఈమారు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నా ప్రైవేట్ సంస్థల యాజమాన్యాలు ఇంటర్‌మీడియట్ బోర్డు, ఆర్‌ఐఓ కార్యాలయంలో చిరు ఉద్యోగులను ఆశ్రయించి జంబ్లింగ్ విధానంలో తమ విద్యార్థులకు ఏఏ సెంటర్లలో పరీక్షలు కేంద్రాలు ఉంటాయని సమాచారం రాబట్టుకున్నట్లు తెలిసింది. డిపార్టుమెంట్స్, చీఫ్ సూపరింటెండెంట్లు పరీక్షల నిర్వహణకు వచ్చే సంబంధిత పాఠ్యాంశ అధ్యాపకుల గురించి కూడా ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఇంటర్ ప్రయోగ పరీక్ష జంబ్లింగ్‌లో కూడా ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు ర్యాంకు కోసం సర్వం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

వెల్లాలలో ఘనంగా పార్వేట ఉత్సవం

రాజుపాళెం, జనవరి 15: పూర్వకాలం నుండి గ్రామాల్లో ప్రతి ఏడు సంక్రాంతిని పురస్కరించుకొని ఆయా దేవాలయాల్లో ఘనంగా పార్వేట ఉత్సవం నిర్వహిస్తారు. త్రేతాయుగం నాటి చరిత్ర కలిగిన వెల్లాల చెన్నకేశవ, సంజీవరాయస్వామి దేవస్థానమునకు సంబంధించి సంక్రాంతి పండుగరోజు శనివారం హనుమత్ వాహనంపై శ్రీదేవిభూదేవి సమేత చెన్నకేశవస్వామి పార్వేట ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక పుష్పాలతో అలంకరించిన పీఠంపై స్వామివారిని కూర్చోబెట్టి డప్పు వాయిద్యాలు, మేళతాళాలు, చెక్క్భజన కోలాహలం మధ్య చెన్నకేశవస్వామి ఆయా గ్రామాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. పార్వేటలో రాష్ట్ర పౌరసరఫరాల కార్పోరేషన్ ఛైర్మెన్ మల్లెల లింగారెడ్డి, టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జి నంద్యాల వరదరాజులరెడ్డి తనయుడు కొండారెడ్డి తదితర ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. వెల్లాల దేవస్థానం నుండి ప్రారంభమైన ఈ పార్వేట ఉత్సవం మండలంలోని గోపల్లె, దద్దనాల, పగిడాల, కుమ్మరపల్లె, పర్లపాడు గ్రామా ల్లో సాగింది. కర్నూలు జిల్లా చాగలమర్రి మండలంలోని మల్లెవేముల గ్రామంలో కూడా స్వామివారి పార్వేట ఉత్సవం జరిగింది. ఏ మాగ్రంలో చూసినా పెద్ద ఎత్తున మహిళలు, పిల్లలు, పెద్దలు స్వామివారిని దర్శించుకున్నారు. ఆనవాయితీగా పండుగరోజున స్వామివారి పార్వేటను దేవాదాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. రామరావణ సంగ్రామంలో లక్ష్మణుడు మూర్చ చెందగా శ్రీ ఆంజనేయస్వామి సంజీవనీ పర్వతం కోసం వెళ్లినపుడు పుణ్యక్షేత్రమైన వెల్లాలలో కాసేపు ఆగారని చరిత్ర చెబుతోంది. అలాంటి మహిమాన్వితమైన ఆలయాన్ని 15వ శతాబ్దంలో హనుమత్‌మల్లు అనే యాదవరాజు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. సంజీవరాయస్వామి, మూలవిరాట్ చెన్నకేశవస్వామి ప్రత్యేక పూజలందుకుంటున్నాడు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఇఓ రామాంజనేయులు, భక్తజనసేవా దుద్ద్యేల చంద్రశేఖర్‌రెడ్డి, రాష్ట్ర తెలుగుయువత కార్యదర్శి పురుషోత్తమరెడ్డి, జడ్పిటిసి మంజుల, మాజీ ఎంపిపి ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.