కడప

రాయితీ రుణాలు.. తొలగని అవాంతరాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మలమడుగు/మైలవరం, మార్చి 11: నిరుద్యోగులకు జీవనోపాధులు కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్‌ల ద్వారా చేపట్టిన రాయితీ రుణాల పంపిణీకి అవాంతరాలు తొలగడంలేదు. అటు ప్రభుత్వ నిబంధనలు, ఇటు బ్యాంకర్ల నిరాసక్తతలు వెరసి నిరుద్యోగులకు ఆర్థిక సంవత్సరం ముగింపుకు వచ్చినా రాయితీ రుణం అందని ద్రాక్షగానే మిగిలింది. ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు హడావిడిచేస్తూ ఆర్భాటాలతో ఆదేశాలకే పరిమితం అవుతున్నారు తప్ప క్షేత్రస్థాయిలో లబ్దిదారులకు రుణ ఫలాలు అందించడంలో చిత్తశుద్ది కొరవడుతోంది. ప్రభుత్వం నిర్దేశించిన మార్చి 31లోపు 2016-17 ఆర్థిక సంవత్సరానికి కార్పొరేషన్‌ల వారీగా కేటాయించిన రాయితీ రుణాలను గ్రౌండింగ్ చేయించాలని విధించిన గడువు సమీపిస్తున్నా రుణపంపిణీ కార్యక్రమం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న సామెతగా మారింది.
* జిల్లా వ్యాప్తంగా కార్పొరేషన్ వారీగాల లక్ష్యాలను పరిశీలిస్తే ఎస్సీ కార్పొరేషన్ క్రింద 2460 యూనిట్లకు ప్రభుత్వ రాయితీ రూ.1692.64 లక్షలు కాగా బ్యాంకర్ల రుణం రూ.2940.21లక్షలుగా నిర్ణయించారు. ఎస్టీ కార్పొరేషన్‌లో 168 యూనిట్లకు రాయితీ రూ.152.65 లక్షలు కాగా బ్యాంకర్ల రుణం రూ.185.50లక్షలు, బిసి కార్పొరేషన్‌లో 2893 యూనిట్‌లకు రాయితీ రూ.1859.50 లక్షలు కాగా బ్యాంకర్ల రుణం రూ.1859.50, క్రిష్టియన్ మైనార్టీకి 40 యూనిట్లకు రాయితీ రూ.40 లక్షలు కాగా బ్యాంకర్ల రుణం రూ.32లక్షలు, మైనార్టీ కార్పొరేషన్‌లో 1618 యూనిట్లకు రాయితీ రూ.795.84లక్షలు కాగా బ్యాంకర్ల రుణం రూ.2020.16 లక్షలుగా లక్ష్యాన్ని నిర్దేశించారు. అయితే ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నా ఇప్పటి వరకు ఏ కార్పొరేషన్‌లో రుణ మంజూరులో లక్ష్యఛేధన ఆచరణలో కనిపించడం లేదు.
* రాయితీ రుణాలు నిరుద్యోగులకు కార్పొరేషన్ల ద్వారా కల్పించేందుకు ప్రభుత్వం సంకల్పించిన నిబంధనలు సరళతరంగా లేవని అధికారగణం, నిరుద్యోగులు వాపోతున్నారు. రుణాలను అర్హులైన వారికి అందించేందుకు గతంలో వున్న నిబంధనలను మార్పులు, చేర్పులు చేస్తూ ప్రభుత్వం ప్రత్యేక జిఓతో విధివిధానాలను ఇచ్చింది. గతంలో అయితే అర్హులైన వారు దరఖాస్తుచేసుకోవడం, మండల స్థాయిలో సంబంధిత అధికారులతో ఇంటర్వ్యూలు నిర్వహించడం, డీఫాల్లర్లు కాని వ్యక్తులను బ్యాంకర్లు పరిశీలించుకుని రుణమంజూరు తంతు పూర్తిచేసేవారు. ఈ ప్రక్రియ ముగియగానే సంబంధిత కార్పొరేషన్లు రాయితీ మొత్తాన్ని, బ్యాంకర్లు రుణాన్ని లబ్దిదారులకు ఖాతాల్లోవేసేవారు. అయితే ప్రస్తుతం లబ్దిదారుల ఎంపికకు ప్రభుత్వం పెట్టిన నిబంధనల ప్రకారం జడ్పీటిసి, ఎంపిపి, ఎంపిటిసిలు, జన్మభూమి కమిటీ సభ్యులు, సామాజిక కార్యకర్త, కార్పొరేషన్ అధికారి, ఎంపిడివో, బ్యాంకర్ల వరకు అందరికీ సమ్మతమైన వ్యక్తిని అర్హునిగా ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో సామాన్య వ్యక్తి ప్రభుత్వ రుణరాయితీ చాలా దూరంలోనే ఉండిపోతున్నాడు. ప్రజాప్రతినిథులు సూచించిన వ్యక్తులకు రుణమంజూరుకు బ్యాంకర్లు విముఖత వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం నిర్దేశించిన రాయితీ రుణమంజూరు లక్ష్యాలను చేరలేని పరిస్థితి తలెత్తింది. మార్చి మొదటి వారంలో జిల్లా వ్యాప్తంగా లీడ్ బ్యాంకు మేనేజర్ రఘునాథరెడ్డి సమావేశాలు నిర్వహించి బ్యాంకర్లు రుణ మంజూరుపై లక్ష్యాలను చేరడానికి కృషిచేయాలని బ్యాంకర్లకు సూచించడం రాయితీ రుణమంజూరు పరిస్థితిని తెలుపుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఎన్నో వ్యయప్రయాసలకోర్చి నిరుద్యోగ యువతకు ఆసరా కల్పించేందుకు కార్పొరేషన్‌ల ద్వారాచేపట్టిన రాయితీ రుణ మంజూరులో లక్ష్యాలను సాధించేదిశగా సంబంధిత అధికారులు కృషిచేయాలని నిరుద్యోగ లబ్దిదారులు కోరుతున్నారు.