కడప

ప్రజా సమస్యలపై పోరాడే పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పులివెందుల, మార్చి 12: నిరంతరం ప్రజల సమస్యల కోసం పోరాడే పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీయేనని మాజీమంత్రి వైఎస్.వివేకానందరెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక పాత ఎమ్మెల్యే కార్యాలయంలో పార్టీ ఏడవ ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. వివేకానందరెడ్డి వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నియోజకవర్గ ఇన్‌చార్జి వైఎస్.్భస్కర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ వైఎస్.మనోహర్‌రెడ్డిలు పార్టీ జెండాను ఎగురవేశారు. అలాగే కేక్‌ను కట్‌చేసి పంచిపెట్టడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ వెస్సార్ ఆశయాలను నెరవేర్చడం కోసం జగన్‌మోహన్‌రెడ్డి పార్టీని స్థాపించడం జరిగిందని, దివంగత వైఎస్సార్ ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలూ పాటుపడ్డారన్నారు. ఆయన ఆశయసాధనకై జగన్ ఎంతో కృషి చేస్తున్నారని, జగన్‌తోపాటు మేమందరం కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. స్థానికసంస్థల్లో వైకాపా గెలుపు తధ్యమని, 2019 ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి వస్తుందని ఆయన జోశ్యం చెప్పారు. కార్యక్రమంలో వైకాపా జిల్లా ప్రధానకార్యదర్శి ఓతూరు రసూల్, వేల్పుల రామలింగారెడ్డి, సురేష్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

నియోజకవర్గాల పునర్విభజన

కడప,మార్చి 12: నియోజకవర్గ పునర్విభజనకు కేంద్రప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో రాష్టవ్య్రాప్తంగా ఉన్న 175 అసెంబ్లీ సెగ్మెంట్లు 220 సెగ్మెంట్లుగా ఏర్పడనున్న నేపధ్యంలో జిల్లాకు రెండు లేదా మూడు నియోజకవర్గాలు దక్కే అవకాశాలున్నాయి. నియోజకవర్గాల పునిర్వభజనలో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం చిన్నభిన్నమై వేంపల్లె, లక్కిరెడ్డిపల్లె, కడప రూరల్, పోరుమామిళ్లతో రెండు లేదా మూడు నియోజకవర్గాలు ఏర్పడనున్నట్లు తెలుస్తోంది. జనాభా రీత్యా కడప అసెంబ్లీ సెగ్మెంట్‌లో దాదాపు 5లక్షలు చేరుకున్న జనాభా నేపధ్యంలో ప్రస్తుతం ఉన్న కడప అసెంబ్లీ సెగ్మెంట్, కడప అర్బన్, కడప రూరల్ సెగ్మెంట్‌గా రూపుదిద్దుకోనున్నాయి. అలాగే గతంలో లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గాన్ని రాయచోటిలోకి విలీనం చేశారు. ప్రస్తుతం లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గాన్ని ఏర్పాటుచేసి లక్కిరెడ్డిపల్లెలో వీరబల్లి, చక్రాయపేట, రామాపురం, గాలివీడు మండలాలతో నియోజకవర్గాన్ని ఏర్పాటుచేయనున్నట్లు తెలుస్తోంది. ఫ్యాక్షన్‌కు నిలయమైన పులివెందుల నియోజకవర్గంలో కొన్ని మండలాలు విలీనం చేసి వేంపల్లె నియోజకవర్గంగా రూపుదిద్దుతూ పులివెందుల నియోజకవర్గంలోని పలు మండలాలను పలు ప్రాంతాల్లో కలపనున్నట్లు తెలుస్తోంది. పోరుమామిళ్ల మండలం ప్రకాశం జిల్లా సరిహద్దుల్లో ఉండటంతో ప్రకాశంకు జిల్లాకు సంబంధించిన కొన్ని మండలాలు పోరుమామిళ్లకు విలీనం చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ముఖ్యంగా వైఎస్ కుటుంబం నాలుగుదశాబ్దాల కాలంగా పులివెందులలో ఏకచక్రాధిపత్యంలో వుండగా పులివెందులను ఈ మారు నియోజకవర్గ పునర్విభజనంలో నిట్టనిలువునా చీల్చనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పులివెందుల నియోజకవర్గం అలాగే కొనసాగిస్తే వేంపల్లె లక్కిరెడ్డిపల్లెలో విలీనం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక కడప నియోజకవర్గంలో అత్యధికంగా మైనార్టీలు ఉన్న నేపధ్యంలో గ్రామీణ ప్రాంతంలోని కమలాపురం నియోజకవర్గానికి చెందిన చెన్నూరు, చింతకొమ్మదినె్న మండలాలను కడప రూరల్ నియోజకవర్గంలో చేర్చనున్నారు. ఇక పార్లమెంట్ స్థానాల విషయంలో కడప, రాజంపేట పార్లమెంట్ స్థానాలు ఉండగా ప్రస్తుతం కడపలో ఉన్న జమ్మలమడుగు, పులివెందులను ఆ పొరుగు పార్లమెంట్ నియోజకవర్గాల్లో కలిపేందుకు అధికారపార్టీ నేతలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా జిల్లాకు మరో రెండు లేదా మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు త్వరలో జరిగే నియోజకవర్గాల పునర్విభజనలో చోటు లభించనుంది.

క్యాంపుల నుంచి జిల్లాకు

కడప,మార్చి 12: జిల్లాకు చెందిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన అధికార, ప్రతిపక్ష వైసిపి ఓటర్లు ఇతర ప్రాంతాల్లో క్యాంపుల్లో నుంచి సొంత స్థావరాలకు రానున్నారు. టిడిపి నేతలు ప్రత్యేక విమానంలో రేపోమాపో జిల్లాకు చేరుకోనున్నారు. వైసిపి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన నేతలు 15 లేదా 16న జిల్లాకు రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అధికారపార్టీకి చెం దిన నేతలు పాండిచ్చేరిలో ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి (వాసు), శాసనమండలి డిప్యుటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు తమకు సంబంధించిన ఎంపిటిసిలు, జడ్పిటిసిలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లను విమానం ద్వారా తరలించనున్నట్లు తెలుస్తోంది. వారందర్నీ జిల్లాలోని రహస్య ప్రాంతంలో ఉంచి పోలింగ్‌లో ఓటు హక్కుపై తర్ఫీదు ఇవ్వనున్నారు. ఇక ప్రతిపక్ష వైసిపి నేతల విషయంలో అభ్యర్థి వైఎస్ వివేకానందరెడ్డి తమ పార్టీకి చెందిన వైసిపి నేతలందర్నీ తీసుకుని వారికి అనువైన ప్రాంతమైన పులివెందులకు లేదా మరో ప్రాంతానికి తరలించేందుకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. సీమ జిల్లాలకు చెందిన వైసిపి ఎమ్మెల్యేలు, ఎంపిలు, వైఎస్ కుటుంబ సభ్యులు, వైసిపి నేతలను తీసుకురానున్నారు. వైసిపిలో అనుమానం ఉన్న ఓటర్లను వైసిపి అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వద్దకు తీసుకెళ్లి ఆయన చేత గట్టి హామీ ఇప్పించి వారందర్నీ కడపకు తీసుకురానున్నారు. ఈనెల 17న ఎమ్మెల్సీ ఎన్నిక నేపధ్యంలో అవసరమనుకుంటే ప్రతిపక్షనేత జగన్మోహన్‌రెడ్డి స్వయంగా తమ పార్టీ ఓటర్లను కడప, జమ్మలమడుగు, రాజంపేట రెవెన్యూ డివిజన్లకు స్వయంగా తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద క్యాంపు రాజకీయాలకు ఉత్సాహంగా వెళ్లిన నేతలంతా తిరుగుప్రయాణంలో ఏ నిమిషానికి ఏమి జరుగునోనని కొంతమంది ప్రజాప్రతినిధులకు భయం వెంటాడుతోంది. ఎస్పీ రామకృష్ణ నిబంధనల మేరకే పోలీసులు వ్యవహరించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ఇరుపార్టీల నేతలకు ప్రతిష్టాత్మకంగా మారాయి.

ఆధునీకరణ పనుల్లో
ముందడుగు పడేనా..

మైలవరం, మార్చి12: మైలవరం జలాశయ కాలువల ఆధునీకరణ పనులు ముందడుగు పడేందులకు అధికారులు చర్యలకు ఉపక్రిమించారు. చివరి ఆయకట్టువరకు సాగునీరందించాలన్న ఆశయంతో 2006లో అప్పటి వైయస్‌ఆర్ ప్రభుత్వం దాదాపు రూ.155 కోట్లతో కాలువల ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టింది. 2006 మే 18న చేపట్టిన పనులను 2018 మే 18నాటికి పూర్తిచేసేందుకు గుత్తేదారులతో ఒప్పందం జరిగింది. పనుల్లో భాగంగా 90, 91వ ప్యాకేజిల క్రింద ఉత్తర కాలువ, దాని ఉప కాలువలు, దక్షిణ కాలువ, దాని ఉపకాలువలను, జలాశయం వద్ద కొన్ని పనులను చేపట్టారు. ఉత్తర కాలువలో 98శాతం పనులు పూర్తిచేయగా అప్పటి కలెక్టర్ క్రిష్ణబాబు పనుల్లో నాణ్యతలేకపోవడంతో 30 వేల స్కేర్ మీటర్లు తొలగించి తిరిగివేయాలని ఆదేశించారు. వీటిలో ఇప్పటికీకేవలం 2700 స్క్వేర్ మీటర్లు మాత్రమే పనులుచేసి వదిలేశారు. దక్షిణ కాలువ పనుల్లో ఇప్పటికీ 65 శాతం పనులు మా త్రమే పూర్తి చేసి వదిలేశారు. దీనికై రూ.47కోట్లు గుత్తేదారు కు వెచ్చించారు. గుత్తేదారుల స్వార్థం, అధికార యంత్రాం గం ఉదాశీనత వెరసి ఆధునీకరణ పనుల పాలిటి అశనిపాతంలా మారింది. పనులుచేపట్టి 11 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ పూర్తి కాలేదు. దీంతో మైలవరం జలాశయ అధికారులు ఆధునీకరణ పనుల విషయంపై చర్యలకు ఉపక్రమించారు. ఈక్రమంలో ఈ ఏడాది జనవరి మాసంలో గుత్తేదారులపై చర్యలకు, తదుపరి పనులకై ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వానికి నివేదికలు పంపారు.
పనుల పూర్తికై చర్యలు
* సుధాకర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు
ఆధునీకరణ పనుల్లో ఉత్తర కాలువ గుత్తేదారు బ్యాంకు గ్యారెంటీలను రూ.3.40కోట్లు ప్రభుత్వ ఖజానా జమ చేసుకోవడం జరిగింది. మిగిలిన 2శాతం పనులు, తొలగించిన ప్యానెల్ల పనులను చేయడానికి నివేదికలు పంపాము. అలాగే దక్షిణ కాలువ క్రింద పనులు నిలిపివేసిన వైనంపై గుత్తేదారు ఒప్పందంను రద్దుకు సిఫారసు చేస్తూ, మిగిలిన 35 శాతం పనులను చేయడానికి నివేదికలను ఉన్నతాధికారుల ద్వారా ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు చేపడతాము.

స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లు
పరిశీలన
జమ్మలమడుగు, మార్చి12: స్థానిక సంస్థల ఎన్నికలకై జిల్లా ఎస్పీ పి.హెచ్.డి. రామక్రిష్ణ ఆదివారం జమ్మలమడుగులో పర్యటించి పరిశీలనలు చేశారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకై జిల్లాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పోలీసుశాఖ పూర్తిస్థాయిలో దృష్టిసారించింది. ఈ క్రమంలో ఎస్పీ రామక్రిష్ణ స్థానికంగా పర్యటించారు. ఈ నెల 17వ తేదీన ఎన్నికల నిర్వహణ జరుగనుంది. ఎన్నికల ఏర్పాట్లపై ఆర్డీవో వినాయకం జిల్లా ఎస్పీకి వివరించారు. అలాగే స్థానిక పరిస్థితులతోపాటు పలు విషయాలపై పోలీసు అధికారుల ద్వారా ఆరా తీశారు. పోలీసు అధికారులకు పలు విషయాలపై సూచనలు ఇచ్చారు. ఈ పర్యటనలో ఎస్పీ వెంట ఒయస్డీ సత్య ఏసుబాబు, డియస్పీ సర్కార్, పులివెందుల డియస్పీ అంబురాజన్, అర్బన్ సిఐ శ్రీనివాసులు, పోలీసు అధికారులు ఉన్నారు.

ఘనంగా సయ్యద్‌షా బిస్మిల్లాషాఖాద్రీ గంధం మహోత్సవం

సిద్దవటం,మార్చి 12: స్థానిక ఎగువపేట పరకోటలో ఉన్న శ్రీశ్రీశ్రీ సయ్యద్‌షా బిస్మిల్లాషా ఖాద్రీ గంధం మహోత్సవం నిర్వాహకులు సయ్యద్ షా మగ్దుమ్ పీర్ ఖాద్రీ ఆదివారం ఘనంగా నిర్వహించారు. పరకోటలో వెలసిన అత్యంత ప్రాచీనమైన సయ్యద్ షాబిస్మిల్లా షా ఖాద్రీ గంధం మహోత్సవం సందర్భంగా ఆయన స్వగృహం నుంచి గంధం దర్గాకు తీసుకొచ్చి గుంబద్ వద్ద సమర్పించారు. జమ్మలమడుగు పీఠాధిపతి జిలానీ సాహెబ్, కడప ఆస్తాన్ ఏ మురాదియా పీఠాధిపతి జమాలుల్లా బాషా సాహెబ్ సోదరులు ఖనీఫా, అక్మల్‌పీరా, అంజద్‌పీరా, అస్మల్ పీరా, మురాదియాపీఠం డైరెక్టర్ నాసీర్ హుస్సేన్, తాడిపత్రి పీఠాధిపతి ఆరిఫ్ బాషా హుస్సేని ఖాద్రీ, వర్క్‌బోర్డు ఇన్‌స్పెక్టర్ షవీవుల్లా, జవహర్‌బాషా, ఖాజాపీరాతోపాటు సిద్దవటానికి చెందిన స్థానికులు నౌషద్, కరీముల్లా, అహ్మద్ నూర్‌బాషా, ఖలీమ్ తదితరులు గంధం మహోత్సవంలో పాల్గొని దర్గాలో ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గాను పూలచాందినీతో అలంకరించారు. కాగా సిద్దవటం పరకోటలో ఉన్న అత్యంతప్రాచీనమైన సయ్యద్ షా బిస్మిల్లా ఖాద్రి దర్గా అభివృద్ధికి వర్క్‌బోర్డు ఇన్‌స్పెక్టర్ షఫీవుల్లా కృషి అభినందనీయమని పీఠాధిపతి మగ్దుమ్‌పీర్ బాషా ఖాద్రీ కొనియాడారు. మొదట ఎన్నో అడ్డంకులు ఉన్నా వాటిని అధిగమించేందుకు వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్ షఫీవుల్లా ప్రోత్సహించి దర్గా అభివృద్ధికి కృషి చేశారన్నారు. దీంతో ఆయన్ను శాలువ ,పూలమాలవేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కడప ఆస్తాన్ ఏ మురాదియా పీఠాధిపతి జమాలుల్లాబాషా సాహెబ్ తదితరులు ఉన్నారు.

ప్రజా సంక్షేమం కోసం పోరాడుతున్న వైకాపా

రాయచోటి, మార్చి 12: రాష్ట్రంలో నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పోరాటం చేస్తున్న పార్టీ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అని రాయచోటి శాసనసభ్యులు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన తన కార్యాలయంలో వైఎస్‌ఆర్‌సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కేక్‌ను కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ఆరు వసంతాలు పూర్తి చేసుకొని ఏడో వసంతంలోకి అడుగిడుతోందన్నారు. వైఎస్‌ఆర్ ఆకాంక్ష, ఆశయాలను వారసత్వంగా స్వీకరించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓ మహోన్నతాశయంతో స్థాపించిన పార్టీ అని వివరించారు. నైతిక విలువలు, సాంప్రదాయాలకు పెద్దపీట వేసిందన్నారు. విశ్వసనీయత అనే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ నిరంతరం ప్రజలతో మమేకమవుతూ శాసనసభలోనైనా, వెలుపలనైనా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తూ, బలమైన పార్టీగా అవతరించిందన్నారు. పార్టీ ఆరేళ్లుగా ఎన్నో ఆటుపోట్లకు ఎదురొడ్డి నిలబడిందన్నారు. శాసనసభలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా ఎదిగిందన్నారు. అధికారానికి చేరువగా వచ్చి అత్యంత ప్రజాదరణ గల పార్టీగా నిరూపించుకుందన్నారు. రాష్ట్రంలో వైఎస్‌ఆర్ పాలనను తిరిగి తీసుకువచ్చేందుకు ప్రజా సంక్షేమం కోసం వైఎస్‌ఆర్‌సీపీ ప్రతి కార్యకర్త, నాయకుడు సైనికుడి వలే కృషి చేస్తున్నారన్నారు. పార్టీకి అన్ని వేళలా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్‌ఛైర్మన్ దేవనాధరెడ్డి, కౌన్సిలర్ నగేశం, కో ఆప్షన్ సభ్యుడు సలావుద్దీన్, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ ఆఫ్జల్‌అలీఖాన్, వైఎస్‌ఆర్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి మదన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వంగిమళ్ల శివప్రసాద్‌రెడ్డి, బీసీ నాయకుడు విజయభాస్కర్, వైసీపీ నాయకులు చెన్నూరు అన్వర్‌బాష, జాకీర్, రియాజుర్‌రెహిమాన్, గంగిరెడ్డి, హజరత్, నూలివీడు సర్పం చ్ ఉమాపతిరెడ్డి, ప్యారంపల్లె భూషణ్‌రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు.

ఘనంగా శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణం

కమలాపురం, మార్చి 12: మండల పరిధిలోని మాచిరెడ్డిపల్లెలో వెలసిన శ్రీలక్ష్మినరసింహాస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య జరిగిన ఈ కల్యాణాన్ని మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి దంపతులు నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి బ్రహ్మోత్సవాలకు హాజరైన భక్తులు శ్రీలక్ష్మినరసింహాస్వామి కళ్యాణాన్ని కనులారా తిలకించారు. ఈ కల్యాణానికి రాజ్యసభ సభ్యుడు సియం రమేష్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, మండలి తెలుగుదేశం అభ్యర్థి బిటెక్ రవి, జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు దివాకరరెడ్డి, తెలుగుయువత నేతలు కృష్ణచైతన్యరెడ్డి, లక్ష్మిరెడ్డి, మండల వైస్ వాసుదేవరెడ్డి, పార్టీనేతలు అంకిరెడ్డి, నాగిరెడ్డి, సుబ్బారెడ్డి, రాఘవరెడ్డి, కమలాపురం, కడప మార్కెట్‌యార్డు చైర్మన్లు తిరుమలరెడ్డి, జయసుబ్బా రెడ్డిలతోపాటు జిల్లాలోని పలువురు తెలుగుదేశంపార్టీనేతలు అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్బంగా పెద్దఎత్తున అన్నధాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు నరసింహా, గాయత్రి, నారాయణ ఉపనిషత్, నవగ్రహ, గూడాన్న అవరణ దేవతల ధ్వజగాయత్రి హోమాలు, పురుష, శ్రీసూక్తం పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తుల గ్రామోత్సవం నిర్వహించారు. ఈ తిరుణాలకు జిల్లాలోని నలుమూలల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో హాజరై స్వామివారికి తమ కానుకలు, మొక్కులు

రెడ్ల చెరువు ఎండిపోయింది.!

సుండుపల్లె, మార్చి 12: మండలంలోని మాచిరెడ్డిగారిపల్లె పంచాయతీలో ఉన్న రెడ్లచెరువు ఎండిపోయింది. రెడ్లచెరువు నిండితే 150 ఎకరాల ఆయకట్టు సాగవుతుంది. గతంలో పలుమార్లు భారీగా వర్షాలు కురిసి రెడ్లచెరువు నిండుకుండలా తొణికిసలాడింది. 2016లో చెరువు తూముకు గండిపడి మరమ్మతులు లేకపోవడంతో నీరు వృధా అయింది. అయినా వ్యవసాయానికి సరిపడు నీరు లేకపోయినా పశువులకు తాగునీరైనా ఉండేది. కొద్దిరోజుల నుండి భారీగా ఎండల తీవ్రత పెరగడంతో చుక్కనీరు లేక చెరువు ఎండిపోయింది. గతంలో వేసిన వరి పంటను కాపాడుకునేందుకు రైతులు ఆయిల్ ఇంజన్లు చెరువు దగ్గర అమర్చి గుంతల్లో ఉన్న నీటిని తోడేసుకొని వరిపంటను సాగు చేసుకున్నారు. గతంలో పింఛా నీటిని రైతుల అవసరాల మేరకు విడుదల చేసినా ఆ నీరు చెరువుకు చేరలేదు. పింఛా కుడికాలువలో సరైన మరమ్మతులు లేకపోగా సరైన రీతిలో కాలువను దిగువున ఉన్న చెరువును పట్టించుకోవాల్సిన అధికారులు నిద్రావస్థలో ఉన్నారు. చెరువును నమ్మి దిగువ ప్రాంతంలో వరి, వేరుశనగ సాగు చేసిన రైతుల పరిస్థితి అయోమయంగా ఉంది. ఖరీఫ్ కాటేయడంతో రబీపై నమ్మకం ఉంచిన రైతు సోదరులకు పరాభవమే ఎదురైంది. అప్పుల ఊబి నుండి రైతు ఇప్పట్లో గట్టెక్కే పరిస్థితి కనిపించడం లేదు. దానికితోడు ప్రతి రైతుకు మామిడి తోటలు ఉండటంతో కనీసం తోటల ద్వారా అయినా అరకొరగా అప్పులు తీరుతాయనుకున్నారు. చెట్లకు నీరు లేక భూగర్భ జలాలు అడుగంటిపోయి దిక్కుతోచని పరిస్థితులలో రైతులు ఉన్నారు.

రాజ్యాధికారం సాధించేంతవరకు ఉద్యమిస్తాం

బద్వేలు, మార్చి 12: రాష్ట్రంలో బడుగు, బలహీనవర్గాల హక్కులు, రాజ్యాధికారం సాధించేంతవరకు ఉధ్యమిస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, సామాజిక హక్కులవేదిక రాష్ట్ర కన్వీనర్ కె.రామక్రిష్ణ పేర్కొన్నారు. సామాజిక హక్కులవేదిక బస్సుయాత్ర బద్వేలుకు చేరిన సందర్భంగా ఆదివారం పట్టణ పురవీధుల్లో భారీగా తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజల మధ్య రోడ్‌షో నిర్వహించారు. పట్టణంలోని మార్కెట్‌యార్డు నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ నాలుగురోడ్ల కూడలికి చేరుకుంది. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి ఎస్.చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో రామక్రిష్ణ మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాల ప్రజలకు విద్య, ఉపాధి, ఉద్యోగావకాశాలలో సమానవాటా కల్పించాల్సిందేనని, అంతవరకు ఉధ్యమిస్తామని పేర్కొన్నారు. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై సమరశంఖం పూరించి యుద్ధం చేయడానికి సన్నద్ధమయ్యామన్నారు. రాష్ట్రంలో 80శాతం పైబడి ఉన్న బలహీనవర్గాలపై 20శాతం మంది ఉన్న ఆదిపత్య కులాలు పెత్తనం చెలాయిస్తున్నాయన్నారు. 70 సంవత్సరాల స్వాతంత్య్ర భారతావనిలో నేటికీ పేదవాడు ఇంటిస్థలం, భూముల కోసం పోరుబాట పట్టాల్సిరావడం సిగ్గుచేటన్నారు. పేదవానికి మూడుసెంట్ల ఇంటి జాగా అడుగుతే కేసులు, నిర్బంధాలు, జైళ్లు అని పార్టీ కార్యకర్తలను భయపెట్టడం సరికాదన్నారు. బహుజనులకు రాజ్యాధికారం వచ్చినపుడే అందరికీ ఉపాధి, ఉద్యోగావకాశాలు దొరుకుతాయని, అలాంటి సమాజంకోసం అందరం కలిసి ఉధ్యమిస్తామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అణగారిన ఎస్సీ, ఎస్టీ, బిసి, ముస్లీం మైనార్టీలందరినీ ఒక తాటిపైకి తేవడానికి ఈ ప్రయత్నం చేస్తున్నామని, ఇందులో ఏమాత్రం రాజకీయ ప్రయోజనాలు లేవని, అందరూ కలిసి రావాలని కోరారు. కార్యక్రమంలో సిపిఐ మహిళాసంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మీ, విహెచ్‌పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్, బికె ఎంయు అధ్యక్షులు ఆవుల శేఖర్, ఎఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లెనిన్, విశ్వనాధ్, ఎ ఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ఎస్.వెంకటసుబ్బయ్య, సిపిఐ పట్టణ కార్యదర్శి వి.వీరశేఖర్, ఇన్సాఫ్ రాష్ట్ర కార్యదర్శి అప్సర్, గోవింద్, చంద్రానాయక్, బి. అనిల్ తదితర సంఘాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

కోరలు చాస్తున్న నాటుసారా!

సుండుపల్లె, మార్చి 12: నాటుసారా గ్రామాల్లో కోరలు చాస్తోంది. విచ్చలవిడిగా సారాబట్టీలను పెట్టి నాటుసారాను తయారుచేస్తున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో నాటుసారా విచ్చలవిడిగా తయారుచేసి అమ్మకాలు సాగిస్తున్నారు. ప్రభుత్వం నాటుసారాను నిషేధించాలని కృషి చేస్తుండగా కొంత మంది అక్రమాలకు పాల్పడటం వలన అధికారులు సారా తయారీ అరికట్టలేకపోతున్నారు. సుండుపల్లెలోని గ్రామీణ ప్రాంతాల్లో అయితేనేమి, వంకల్లోనూ రహస్య స్థావరాలు ఏర్పాటు చేసుకొని నాటుసారా తయారు చేస్తున్నారు. మండలంలోని వానరాచపల్లె, ఎగువబిడికి, నాయునివారిపల్లె, మడితాడు వడ్డెపల్లె, మాచిరెడ్డిపల్లె కఠారుముడుకుతో పాటు పలు గ్రామాల్లో సారా బట్టీలు వెలుగుతూనే ఉన్నాయి. అయితే మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పగుట్ట, హరిజనవాడల్లోనూ మాదిగపల్లెలోనూ నాటుసారా ఏరులై పారుతున్నది. గత కొన్ని సంవత్సరాల నుండి అధికారుల నిర్లక్ష్యం వలన రోడ్లకు ఇరువైపులా పబ్లిక్‌గానే అమ్మకాలు సాగుతున్నాయి. ప్రభుత్వం సారారహిత గ్రామాలే లక్ష్యంగా ముందుకుపోతుంటే ఎక్సైజ్ అధికారులు సారా రహిత గ్రామాల్లో నామమాత్రపు దాడులు నిర్వహిస్తున్నారు. నాటుసారా తయారే జీవనోపాధిగా నేటి గ్రామాల్లో నాటుసారా తాండవమాడుతోంది. సుండుపల్లె మండలంలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి సుమారు ఆరు నెలలవుతోంది. అప్పట్లో రెండు, మూడు కేసులు నమోదు చేసుకొని హడావుడి చేసి ఆపేశారు. అంతే సంగతులు ఆ తరువాత నాటుసారా జోలికెళ్లలేదు. అధికారులు శాశ్వతంగా నాటుసారా నిర్మూలన చేపట్టే దిశగా వారు పనిచేయడం లేదని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఏయే గ్రామాల్లో సారా తయారు చేస్తున్నారో, ఎవరు అమ్ముతున్నారో ఎక్కడ అమ్ముతున్నారో తెలిసినా నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు చోద్యం చూస్తున్నారు. గతంలో ఎక్సైజ్ అధికారులు దాడులు చేసిన ప్రతి చోటా సారాబట్టీలు ఊట బిందెలు, డ్రమ్ములు, కుండలు తిరిగి ప్రాణం పోసుకున్నాయి. చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతమైన జిల్లేలమంద నుండి రోజు వందల లీటర్లు సుండుపల్లె మండలంలోని పలు ప్రాంతాలకు యధేచ్ఛగా అమ్ముకుంటున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు సారారహిత గ్రామాలు చేయలేకపోయినా నాటుసారా నిర్మూలించి గ్రామాల్లో శాంతిభద్రతలు కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని మండల ప్రజలు కోరుతున్నారు.