కడప

కొనసాగుతున్న ఐటి దాడులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,మార్చి 26: జిల్లాలో ఇన్‌కమ్‌టాక్స్ (ఐటి) దాడులు కొనసాగుతున్న నేపధ్యంలో బహిరంగంగా బద్వేలులో, రాజంపేట, రైల్వేకోడూరులో ఆదివారం దాడులు చేసినట్లు తెలుస్తోంది. పెద్దనోట్ల మార్పిడి అనంతరం వ్యాపార, పారిశ్రామికంగా పెట్రోల్ బంకుల్లో చలామణి అయిన పెద్దనోట్లపైనే ఐటి అధికారులు దృష్టిపెట్టారు. ఇక కారు కలిగివున్న ట్యాక్స్ చెల్లించాల్సివుంది. 2013 నుంచి జిల్లాలో ఉన్న అన్ని బ్యాంకుల్లో అందరిలావాదేవీలపై అకౌంట్లను అధికారులు చూపిస్తున్నారు. ఇటీవల రాయచోటిలో పండ్ల వ్యాపారులు, వివిధ దుకాణాలపై దాడులు చేయగా ఆదివారం బద్వేలు ఒక పెట్రోల్ బంక్‌లో నోట్ల రద్దుముందు, నోట్ల రద్దు అనంతరం చేసిన లావాదేవీలపై పరిశీలించి వెళ్లారు. అలాగే ఆదివారం రైల్వేకోడూరు, రాజంపేటలో హోల్‌సేల్ పండ్లవ్యాపారులు, వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు ముఖ్యంగా రియల్టర్లు కాంట్రాక్టర్ల లావాదేవీలపై రెక్కీ తరహాలో అందరి ఇళ్లు, కార్యాలయాలపై నిఘా వుంచినట్లు తెలుస్తోంది. రైల్వేకోడూరులో మైనింగ్, హోల్‌సేల్ దుకాణాలు , రాజంపేటలో వ్యాపారులు , రియల్డర్లు ,రాజకీయనాయకులు అధికంగా ఉండటం, ఎన్‌ఆర్‌ఐ అకౌంట్లు రైల్వేకోడూరు, రాజంపేటలో ఉన్న నేపధ్యంలో ఐటి అధికారులు దృష్టిపెట్టినట్లు తెలిసింది. అలాగే రెండవ ముంబాయిగా ప్రసిద్దిగాంచిన బంగారు బిస్కెట్లు, బంగారునగలు వ్యాపారులు ఉన్న ప్రొద్దుటూరుపై ఐటి అధికారులు గట్టి నిఘాపెట్టినట్లు తెలుస్తోంది. ఇక కడపలో అన్ని రంగాలపై ఐటి అధికారులు దృష్టిసారించారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 10వేల మందికి ఐటి అధికారులు నోటీసులు జారీ చేసి వారి వివరణకోసం ఈనెల 31లోపు వేచిచూస్తున్నారు. అలాగే జిల్లాలోని బార్లు, బ్రాందిషాపుల్లో పెద్దనోట్ల రద్దుసమయంలో అధికంగా డిపాజిట్ చేసిన వారి వివరాలు కూడా సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే మైనింగ్, యాస్ట్‌బెస్టాస్, ముగ్గురాయి, గ్రానైట్, నల్లరాయి, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు బండల పరిశ్రమలపై ఐటి అధికారులు దృష్టిపెట్టారు. అలాగే ఎటువంటి అనుమతులు లేకుండా వడ్డీ వ్యాపారం చేసే వారిపై కూడా ఐటి అధికారులు నిఘా పెట్టినట్లు తెలిసింది. ప్రభుత్వ ఉన్నతాధికారులు, వారి కుటుంబసభ్యులుగా ఉన్నవారి అకౌంట్లను కూడా బ్యాంకు అధికారుల నుంచి వారి లావాదేవీల వివరాలు తెలుసుకుంటున్నారు. ఈమేరకు ఐటి అధికారులు ఎస్‌బిఐ , బరోడా, ఐసిఐసిఐ, ఆంధ్రాబ్యాంకు, వైశ్యబ్యాంకు, కెనరాబ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, ఆంధ్ర గ్రామీణ ప్రగతి గ్రామీణ బ్యాంకు తదితర బ్యాంకులకు ఐటి అధికారులు లేఖలు రాశారు. వాస్తవంగా గతంలో ఖాతాదారులు మినహా మిగిలిన ఎవ్వరికీ సంబంధిత బ్యాంకుల కస్టమర్ల లావాదేవీల వివరణలు ఇవ్వకూడదని నిబంధన ఉండేది. పెద్ద నోట్ల మార్పిడి, ఆదాయ పన్ను ఎగవేతదారుల కోసం ఖాతాదారుల లావాదేవీలు బట్టబయలు చేస్తున్నారు. పెద్దనోట్ల రద్దు నుంచి చాలా మంది జాగ్రత్తపడి పెద్ద మొత్తాలను డిపాజిట్లు చేయలేదని తెలిసింది. ఏది ఏమైనా ఐటి దాడులతో నల్ల కుబేరుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి.

గవర్నర్ కోటాలో బత్యాలకు ఎమ్మెల్సీ ..

కడప,మార్చి 26: ఇప్పటి వరకు గ్రాడ్యుయేట్స్, టీచర్స్, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియడంతో ఇటీవల తెలుగుదేశంపార్టీలో చేరిన ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులును గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా ఎంపికచేసేందుకు అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. రాష్టమ్రాజీ మంత్రి, జమ్మలమడుగు నియోజకవర్గం ఇన్‌చార్జి పి.రామసుబ్బారెడ్డికి కూడా గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ ఎంపికకు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. రామసుబ్బారెడ్డి రాజకీయ భద్రశతృవు, దశాబ్దాలకాలం నుంచి వందల సంఖ్యలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేసిన నేపధ్యంలో వైసిపి ఎమ్మెల్యే సి.ఆదినారాయణరెడ్డి టిడిపిలో చేరడంతో మాజీ మంత్రిరామసుబ్బారెడ్డి వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే టిడిపి అధిష్ఠానం సూచన మేరకు రామసుబ్బారెడ్డి కుటుంబానికి భద్ర శతృవైన ఆదినారాయణరెడ్డితో చేతులు కలిపారు. ఈ నేపధ్యంలో రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ అవకాశాలు కన్పిస్తున్నాయి. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కాపులకోసం చేస్తున్న ఉద్యమంలో టిడిపికి నష్టం వాటిల్లకుండా మేధావైన బత్యాల చెంగల్రాయులుకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చినట్లయితే న్యాయపరంగా ఉంటుందని టిడిపి అధిష్ఠానం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో కేవలం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిటెక్ రవిని గెలిపించుకున్నారే తప్ప గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీలను గెలిపించుకోలేకపోయారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపులో బత్యాల చెంగల్రాయులు జిల్లాలోనే అధిక సంఖ్యలో జడ్పిటిసిలు, ఎంపిటిసిలను పార్టీకి అప్పగించారు. తొలి నుంచి ఆయన క్రమశిక్షణకు, పట్టుదలకు మారుపేరుగా ఉంటూ హుందా తనం రాజకీయాలు చేస్తున్నందున ఆయనకు జిల్లాలో ప్రత్యేక ఆదరణ ఉంది. ఈతరుణంలో ఆయనకు గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ పదవికి ఎంపికచేయడం కానీ, 2019 ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ అభ్యర్థిగా కానీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. చంగల్రాయులుకు గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ పదవి దక్కని పక్షంలో జమ్మలమడుగు నేత పి.రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ ఎంపికకు సుగమమవుతుంది. అయితే గవర్నర్‌కోటా కింద కేవలం రెండు ఎమ్మెల్సీ పదవులు ఉండటంతో రెండుపదవులు రాయలసీమ జిల్లాలకే ఇస్తే రాష్ట్రంలో ఉన్న జిల్లాల్లో వ్యతిరేకత మొదలవుతుందని అధిష్ఠానం సమాలోచనలు చేస్తున్నారు. ఏది ఏమైనా ఎమ్మెల్సీగా బత్యాల చెంగల్రాయులు, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి లలో ఒకరికి పదవి దక్కే అవకాశం ఉంది.

శతాబ్దాల చరిత్రకు సజీవ సాక్ష్యం
ఒంటిమిట్ట

ఒంటిమిట్ట, మార్చి 26:మరో అయోధ్య పేరుగాంచి, ఏకశిల నగరంగా దినదినాభివృద్ధి చెందుతున్న ఒంటిమిట్ట కోదండ రామస్వామి చరిత్ర శతాబ్దాల సజీవ సాక్ష్యంగా ఉట్టి పడుతుంది. ఈ ప్రాంతంలో సంచరించిన మహనీయుల ఆనావాళ్లకు శిల్పసంపదకు మకుటంలోని మణిహరంలా చరిత్ర పుటల్లో నిలిచింది. ఇంతటి మహిమగల కోదండ రాముని బ్రహ్మోత్సవాలు వచ్చే నెల 4వ తేది నుండి 14 వరకు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలను మూడవ సారి ప్రభుత్వ లాంఛనాలతో జరుగుతుండడం, రెండవ సారి ఈ ఉత్సవాలు టిటిడి నిర్వహించనుంది. ఆలయంచుట్టూ విద్యుత్ లైటింగ్, చూపరులను ఆకర్షించేలా గార్డన్‌లు, భక్తులకు ప్రత్యేక షెల్టర్‌లు, మాడ వీధులలో కాకుండా స్వామివారు విహరించే ప్రాంతాలలో ప్రత్యేక కటౌట్ల ఏర్పాటు తదితర పనుల ఏర్పాట్లు చూస్తుంటే పూర్వ వైభవాన్ని తలపించేలా ఒంటిమిట్ట దేశానికి తల మాణికంగా ఉత్సవాలు జరుగుతున్నాయనడంలో అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలో ఒక్కసారి చరిత్రకు ఆనాలైన సంఘటనలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పురాతన చరిత్రగల ఈ ఆలయానికి ఎంత ప్రాముఖ్యత ఉందో భక్తులు, పర్యాటకుల మాటలే నిదర్శనం. త్రేతాయుగంలో జాంబవంతునిచే హనుమంతుడు లేని సీతారామలక్ష్ముణుల విగ్రహాలను ప్రతిష్టించినట్లు చరిత్ర పేర్కొంటుంది. హనుమంతుడు రామయ్య పరిచయం కాని సమయంలో ఒకే శిలపై ఈ ఆలయం ఏర్పడింది. కంపరాయలు అనే రాజు ఒంటిమిట్ట మార్గంలో పయనిస్తూ దాహర్తికి గురైనపుడు ఒంటడు, మిట్టడు అనే వారు ఈ ఆలయ మధ్యరంగాన్ని నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఆ ఇద్దరి పేర్లతోనే ఏకశిల నగరంగా పిలువబడే ఈ ప్రాంతం ఒంటిమిట్టగా పేరొందింది. తిరుమల కొండల తరహాలోనే ఈ ప్రాంతంలోని దట్టమైన అడవుల మధ్య రామయ్య వెలవడంతో ఒంటిమిట్ట అనే పేరు వచ్చినట్లు చరిత్ర చెబుతుంది. సీతారాములు వనవాస సమయంలో ఈ ప్రాంతంలో తిరిగే సమయంలో భక్తుల దాహార్తి తీర్చేందుకు సీతమ్మ తల్లి కోర్కెమేరకు రామయ్య పాతాళగంగను బాణంతో పైకి తెచ్చాడని ఆ ప్రాంతమే నేడు రామతీర్థంగా ఏర్పండిందని కథనం. సీతాదేవి దప్పిక తీర్చేందుకు లక్ష్ముణ స్వామి బాణం సంధించిన చోటు లక్ష్ముణ తీర్థంగా పే రొందింది. మత సామరస్యానికి ప్రతీకగా ఈ ఆలయం ప్రసిద్ధిగాంచింది. ఇందుకు ఉదాహరణ స్వామివారి అభిషేకానికి ఇమాం అనే నవాబు బావిని తవ్వించమే అందుకు తార్కాణం. ముస్లీంలు కూడా ప్రతి శుక్రవారం రామున్ని దర్శించడం ఇక్కడ ఆనవాయితీగా మారింది. ఈ కోవలో శిల్పసంపదను కొనియాడాల్సిన పరిస్థితి కూడా లేకపోలేదు. హంపిని తలదనే్నలా ఇక్కడ శిల్పసంపద ఉంది. అబ్బురపరిచే శిల్పసంపద భక్తులను ఆకట్టుకొంటుంది. దేశంలో ఏ ఆలయంలో లేని శిల్పసంపద ఇక్కడ ఉంది. గోపురాలు చోళకళలతో నిర్మించడమే ఇందుకు తార్కాణం. 11వ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మించినట్లు స్థల పురాణాలు, మూడు గోపురాల నిర్మాణాన్ని బట్టి అర్థమవుతుంది. ఈ ఆలయ అభివృద్ధిలో కృషి చేసిన మహానీయులలో వావిలికొలను సుబ్బారావు మొదటివాడు. భద్రాద్రి రామయ్య ప్రియ శిష్యుడు రామదాసు వలే ఇక్కడ రామయ్యకు సుబ్బారావు ప్రియ శిష్యుడుగా శృంగిశైలంలో దర్శనమిస్తున్నారు. భాగవతాన్ని వ్రాసి ఇక్కడ కొంతకాలం గడిపిన మహకవి బమ్మెర పోతనామాత్యుడు కూడ చరిత్రలో నిలిచిపోయారు. అలాగే చెరువుకట్ట వీరాంజనేయస్వామి ఆలయం ఇక్కడ ఉండడంతో చరిత్రలో నిలిచింది. వెంకటేశ్వరస్వామిపై 32 వేల కీర్తనలు వ్రాసిన అన్నమయ్య రామయ్యను సేవించి తరించినట్లు చరిత్ర చెబుతుంది. ఈ ఆలయంలో అనేక మంది మహనీయులు స్వామిని దర్శించడమే కాకుండా యజ్ఞయాగాలు చేసి చరిత్రలో సజీవ సాక్ష్యాలుగా నిలచారనేందుకు మృకుండాశ్రమమే నిదర్శనం. ఇలా చెప్పుకునే కొద్ది చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంలా ఒంటిమిట్ట ఆలయం చిరస్థాయిలో నిలిచిందనేందుకు సందేహం లేదు.

మా అమ్మఒడి పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దడం అభినందనీయం

కడప,మార్చి 26: రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా రెవెన్యూ సేవాసంస్థ అయిన మా అమ్మఒడి ద్వారా అనాథ పిల్లలను ఒడిన చేర్చుకుని భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడం అభినందనీయమని కలెక్టర్ కెవి సత్యనారాయణ అన్నారు. ఆదివారం కడప నగర చిన్నచౌకు శివారులోని మా అమ్మఒడి అనాథాశ్రమంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో మానవత్వం పరిమళించి వివిధ సేవాకార్యక్రమాల్లో పాల్గొని సహాయ సహకారాలు అందించాలని కోరారు. మా అమ్మఒడి అనాధాశ్రమం రెవెన్యూ అధికారులకు గర్వకారణమని , ఎప్పుడూ ప్రజల సేవాకార్యక్రమాల్లో నిమగ్నమై విధులను నిర్వహిస్తూ అదనంగా రెవెన్యూ సేవా సంస్థ ద్వారా అనాథలకు ఆశ్రయాన్ని ఇచ్చి తన మానవత్వాన్ని చాటిచెప్పారన్నారు. రెవెన్యూశాఖను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరు అనాథల అభివృద్ధికి దాతలు విరివిగా విరాళాలు అందజేయాలన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి ఒక్కరు వారి నెలజీతం నుంచి 20శాతం వివిధ సేవాకార్యక్రమాల కోసం ట్రస్టులకు విరాళాలు అందజేస్తారని, అలాగే మనం కూడా సేవాకార్యక్రమాలకు విరాళాలు అందజేయాలని పిలుపునిచ్చారు. అవసరమైన వౌలిక సదుపాయాలకోసం ప్రణాళికాబద్దమైన నివేదిక సమర్పిస్తే అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. మా అమ్మఒడి ఆశ్రమానికి కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఆశ్రమసమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిని ఆశ్రమానికి మంజూరుచేసేందుకు ప్రతిపాదనలు పంపాలని కోరారు. డిఆర్‌డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ అనిల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రెవెన్యూశాఖ ఎన్నో కార్యక్రమాలు అధికారికంగా నిర్వహిస్తూ అదనంగా మా అమ్మఒడి అనాథాశ్రమాన్ని కూడా రెవెన్యూ సేవా సంస్థ ద్వారా నిర్వహించడం గర్వకారణమన్నారు. కడప ఆర్డీలో చిన్నరాముడు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సేవాభావం కలిగివుండాలని ప్రవేటుగా ఉన్న ఆశ్రమాలకు వెళ్లి మోసపోరాదన్నారు. రాజంపేట ఆర్డీవో వీరబ్రహ్మం మాట్లాడుతూ మా అమ్మఒడి ఆశ్రమంలో ఉన్న పిల్లలు తమ తల్లిదండ్రులను మరచిపోయి వారి స్వశక్తిపై నిలబడే విధంగా అన్ని వసతులు కల్పించడం జరిగిందని, భవిష్యత్‌లో మరిన్ని సౌకర్యాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ గిరిధర్ మాట్లాడుతూ మా అమ్మఒడి ఆశ్రమాన్ని ప్రతి ఒక్కరూ స్పూర్తిగా తీసుకోవాలన్నారు. ఆపదలో ఉన్నవారికి రిమ్స్ రక్తదాన నిధి నుంచి సహాయంచేసి రక్షించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఏపిఎంఐసి ప్రాజెక్టు డైరెక్టర్ మధుసూధన్‌రెడ్డి, హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ ఎల్‌విఎస్ ప్రసాద్, మైన్స్ సహాయ సంచాలకులు ఉమామహేశ్వరరెడ్డి, రెవెన్యూ అధికారి ప్రభాకర్‌రెడ్డి, విశ్రాంత రెవెన్యూ అధికారి ఖాదర్‌బాషా తదితరులు పాల్గొని మాట్లాడారు. మొదట కలెక్టర్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి అనంతరం ఆశ్రమంలోని గదులు సందర్శించి పరిశీలించారు. అక్కడ పిల్లలు చేసే యోగా విన్యాసాలు, కరాటే విన్యాసాలు తిలకించి ఉన్నతస్థాయిలో ఎదిగేందుకు సంకల్పించాలని అందుకు సహాయ సహకారాలు అందిస్తామని ఆశ్రమ నిర్వాహకులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఓ శ్రీరాములు, జిల్లా బిసి సంక్షేమాధికారి వెంకటయ్య, డిఎస్‌డిఓ శర్మ, రిమ్స్ మెడికల్ అధికారి గురవయ్య, పలువురు రెవెన్యూ అధికారులు, ఎంపిడివోలు, విశ్రాంత రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

నియోజకవర్గాల పునర్విభజనపై నేతల ఆశలు!

జమ్మలమడుగు, మార్చి 26: తెలుగు రాష్ట్రాల్లో గత కొనే్నళ్లుగా ఊరిస్తున్న నియోజకవర్గాల పునర్విభజనపై పలువురు జిల్లా నేతలు ఆశలు పెట్టుకున్నారు. అదేవిధంగా నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం సానుకూలంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో జనాభా ననుసరించి నియోజకవర్గాల విభజన ఉంటుందని భావిస్తున్నారు. కేంద్రం ప్రకటన చేసినట్లు ఏప్రిల్ 12లోగా అసెంబ్లీ సీట్ల పెంపుదలపై ఈ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం విభజన తరువాత నూతన ఆంధ్ర రాష్ట్రంలో 175 సీట్లను 225కు, తెలంగాణ రాష్ట్రంలోని 119 సీట్లను 153కు పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తూ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 26 నిబంధనలను పొందుపరచడం జరిగింది. ఈ సమావేశాల్లోనే అసెంబ్లీసీట్ల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని, అవసరమైన రాజ్యాంగ సవరణకు సిద్ధమని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించిన విషయం విధితమే. దీంతో నియోజకవర్గాల పునర్విభజన జిల్లా వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. జిల్లాలో ప్రస్తుతం 10 నియోజకవర్గాలు ఉన్నాయి. 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన చట్టంలో పొందుపరచిన మేరకు 2026వరకు సీట్ల సంఖ్య పెంపునకు అవకాశం లేదన్న వాదన వినిపిస్తోంది. దీంతో హోంశాఖ, న్యాయశాఖల అనుమతితో పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి, రాష్టప్రతి ఆమోదం పొందితే సీట్ల పెంపుకు మార్గం సుగమం అయినట్లేనని నిపుణులు చెబుతున్నారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రకటనతో ఈ సాధారణ ఎన్నికలకు ముందుగానే అసెంబ్లీసీట్ల పెంపు ఖాయమన్నది స్పష్టం అవుతోంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే జిల్లాలో ప్రస్తుతమున్న 10 నియోజకవర్గాలకు అదనంగా మరోమూడు నియోజవర్గాల సంఖ్య పెరిగే అవకాశం వుంది. ప్రస్తుతం ఉన్న 10 అసెంబ్లీ స్థానాల్లో బద్వేలు, రైల్వేకోడూరు అసెంబ్లీ స్థానాలు ఎస్సీలకు రిజర్వుగా ఉన్నాయి. మిగిలిన 8 అసెంబ్లీ స్థానాలు జనరల్ కేటగిరీలో ఉన్నాయి. రాష్ట్రంలోనే ఆసక్తికరంగావున్న కడప జిల్లాలోని జమ్మలమడుగు, పులివెందుల నియోజవర్గాలు ఆసక్తికరంగా మారాయి. జిల్లాలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న జమ్మలమడుగు, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాలు కొన్ని మండలాలతో కలిసి రెండు అసెంబ్లీ సెగ్మెంట్లుగామారే అవకాశాలు స్పష్టంగా కనబడుతోంది. అసెంబ్లీ నియోజవర్గాల సమగ్ర వివరాలు పంపాలని వారంక్రిందట కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాలను కోరింది. అసెంబ్లీ నియోజకవర్గాల స్వరూపాన్ని నివేదించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాలను కోరడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పునర్విభజన సాధ్యాసాధ్యాలు, ఆ తరువాత పరిణామాలపై కేంద్ర ప్రభుత్వంలో స్పందన రావడమే దీనికి కారణమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే జిల్లాలో మరో మూడు అసెంబ్లీస్థానాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జమ్మలమడుగు నియోజకవర్గంలోని రెండు మండలాలతో కలిపి పులివెందుల అసెంబ్లీ సెగ్మెంట్‌లోని దాదాపుగా రెండు మండలాలతో కలిపి మరో అసెంబ్లీ సెగ్మెంట్ ఏర్పడే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. రాజంపేట పార్లమెంటు పరిధిలోని రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు అసెంబ్లీ సెగ్మెంట్‌లలోని కొన్ని మండలాల సరిహద్దులుమారి అదనంగా ఒక అసెంబ్లీ సెగ్మెంట్‌గా మారేఅవకాశం కనిపిస్తోంది. గతంలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు లక్కిరెడ్డిపల్లె నియోజకవర్గం రాయచోటి అసెంబ్లీ సెగ్మెంట్‌లో కలిసిపోయింది. అదేక్రమంలో లక్కిరెడ్డిపల్లె అసెంబ్లీ సెగ్మెంట్‌లోని చక్రాయపేట మండలం పులివెందుల నియోజకవర్గంలో కలిసింది. అలాగే కడప, కమలాపురం అసెంబ్లీ సెగ్మెంట్లలోని మండలాల సరిహద్దుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన విషయం తెరమీదకు వచ్చిన ప్రస్తుత తరుణంలో విభజన జరిగితే కడప జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలకు మరో 3 అసెంబ్లీ సెగ్మెంట్‌లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గ్రామాలకు వెలిగల్లు ప్రాజెక్టు నీరు అందిస్తాం

గాలివీడు, మార్చి 26: వెలిగల్లు ప్రాజెక్టు నీటిని మండలంలోని 17 గ్రామ పంచాయతీలకు అందిస్తామని రాయచోటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని కూరగాయల సంత ప్రాంగణంలో వ్యాపారులకు, వినియోగదారుల సౌకర్యం కోసం నాబార్డు నిధులతో చేపట్టనున్న షెడ్ల నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.10 లక్షల నాబార్డు నిధులతో షెడ్ల నిర్మాణాలను ఆర్‌హెచ్‌జీబీ ఎంఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి బివి రత్నం ఆధ్వర్యంలో చేపట్టడం జరుగుతుందన్నారు. సంత ప్రాంగణమంతా ఎత్తు పెంచి అభివృద్ధి చేయడం పట్ల సర్పంచ్ మహమ్మద్‌రియాజ్‌ను అభినందించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలైన వృద్ధాప్య పింఛన్లు, నిత్యావసర సరుకులు అర్హులకు సక్రమంగా అందుతున్నాయా అని టీడీపీ కార్యకర్తలను, నాయకులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వెంకటనారాయణరెడ్డి, సర్పంచులు చిన్నపరెడ్డి, శ్రీనివాసరాజు, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షుడు లక్షుమయ్య, నీటి సంఘం అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, సుబ్బారెడ్డి, టీడీపీ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీలు రెడ్డిప్రసాద్‌రెడ్డి, ముబారక్‌బాష, మాజీ సర్పంచులు వీరభద్రప్పనాయుడు, ప్రభాకర్‌రెడ్డి, టీడీపీ నాయకులు సత్యారెడ్డి, ధర్మారెడ్డి, రామమోహన్‌నాయుడు, మిట్టేనాయక్, గంగులప్ప, ఆగ్రోస్ సూర్యనారాయణరెడ్డి, ఖాసీం, గూడూసాబ్ పాల్గొన్నారు.

ఆర్టీపీపీకి పతకాల పంట
ఎర్రగుంట్ల,మార్చి 26: రాబోయే మే 1వ తేదీన జరిగే కార్మిక దినోత్సవం పురస్కరించుకుని రాయలసీమ జోన్ పరిధిలో కమిషనర్ ఆఫ్ లేబర్ వై.శ్రీనివాసులు ఆధ్వర్యంలో కర్నూలులో జరిగిన ఉత్సవాల కోసం ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీల్లో ఆర్టీపీపీ కార్మికులు పలు పతకాలు సాధించారు. సాధించిన పతకాలను ఆర్టీపీపీ సిఇ శ్రీరాములుకు ఆదివారం అందజేయడంతో ఆయన పతకాలు సాధించిన కార్మికులకు అభినందనలు తెలిపారు. వంద మీటర్ల పరుగుపందెంలో మేడా రామకృష్ణ మొదటి బహుమతి సాధించగా, సాంస్కృతిక కార్యక్రమాల విభాగంలో ‘్భద్రత పెంచుకో’ అనే నాటకానికి ద్వితీయ బహుమతి ఆర్టీపీపి టీంకు లభించింది. అలాగే హరిశ్చంద్రనాటకంలోని కాటిసీనులో ఏకపాత్రాభినయం చేసిన వైవి రమణారెడ్డికి తృతీయ బహుమతి లభించింది. కళాకారుల విభాగంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొని ప్రశంసలు అందుకున్న బి.వేణుగోపాల్‌రెడ్డి, బి.ఈశ్వరాచారి, ఎన్.రవిచంద్రారెడ్డిలను సిఇ శ్రీరాములు అభినందించారు. కార్యక్రమంలో ఆర్టీపీపీ కార్మిక సంక్షేమ అధికారి తిరుమలరావు పాల్గొన్నారు.

ఘనంగా గంగజాతరలు
కమలాపురం, మార్చి 26: కమలాపురం మండలంలో ఆదివారం పలుచోట్ల గంగజాతరలు ఘనంగా జరిగాయి. మరికొన్నిచోట్ల ముద్దల పండుగలు వైభవంగా జరిగాయి. స్థానిక మార్కెట్‌వీదిలో వెలసిన నడి ఊరు గంగమ్మ ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేషపూజలు నిర్వహించారు. స్థానిక ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని అమ్మవారికి తమ మొక్కులు చెల్లించుకుని పూజలు నిర్వహించుకున్నారు. అలాగే కె అప్పాయపల్లె 15వ వార్డులో, దాదిరెడ్డిపల్లె, నసంతపురం గ్రామాల్లో అమ్మవారి గంగజాతరలను పెద్దఎత్తున నిర్వహించారు. మహిళలు బోనాలు తలపై ఉంచుకుని తప్పెట్లు, డప్పులు, వాయిద్యాల మధ్య జాతర వద్దకు చేరుకుని ప్రత్యేకంగా వేపమండలతో ఏర్పాటు చేసిన మండపాల్లో ప్రతిష్టించిన గంగమ్మ, పెద్దమ్మ తల్లులకు బోనాలు, పొంగుళ్లను సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. బోనాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం వేకువజామున అమ్మవారిని ఊరి పొలిమేరల్లో విడిచిపెట్టడం జరుగుతుందని నిర్వహకులు తెలిపారు. అంతేకాక యర్రగుడిపాడు, పందిళ్లపల్లె, దేవరాజుపల్లె, చిన్నచెప్పల్ల, సముద్రంపల్లె, పెద్దచెప్పల్లి, యర్రబల్లె గ్రామాల్లో ముద్దలపండుగలు నిర్వహించారు. కాగా జాతర సందర్బంగా అమ్మవారి గ్రామోత్సవాలు, పోతురాజుకథలు చేపట్టారు.
మాధుర్యం తగ్గిన మామిడి పండ్లు!

కడప,(కల్చరల్) మార్చి 26:మారుతున్న కాలంతోపాటు మధురమైన మామిడిపండ్లు సహజత్వాన్ని కోల్పోతున్నాయి. మామిడిపండు చూడగానే నోరూరుతుంది. మామిడిపండ్లు మార్కెట్‌లోకి వచ్చాయంటే మిగతా పండ్లు, స్వీట్ల వ్యాపారాలు పూర్తిగా పడిపోతాయి. రకరకాల మామిడిపండ్లు తోపుడు బండ్లపై దర్శనమిస్తుంటాయి. మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఈ మామిడిపండ్ల రుచిలో తేడా స్పష్టంగా కన్పిస్తుంది. వ్యవసాయ విధానంలో వచ్చిన మార్పులే ఈ రుచుల తేడాకు దర్పణం పడుతోంది. అధికదిగుబడి కోసం రకరకాల పురుగుమందులు, ఎరువులు వాడకంతోపాటు మామిడి కాయలను అతి త్వరగా పక్వానికొచ్చేందుకు కూడా వ్యాపారులు రసాయనాలు వాడుతున్నారు. దీంతో పండు కాకముందే కాయ పండులా దర్శనమిస్తోంది. ఆకర్షించేట్టుగా ఉన్న మామిడి తీపిదనానికి వచ్చేసరికి రుచిగా ఉండదు. దీంతో మామిడి మునుపటి రుచికి ప్రస్తుత మాధుర్యానికి తేడా ఎంతగానో కన్పిస్తోందని చెప్పవచ్చు. రాను రాను ఆ పరిస్థితుల్లో మార్పు రావడంతో మామిడి పండు తినాలంటేనే విసుగుగా ఉంటోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు, దళారులు తమ వ్యాపారం కోసం పక్వానికి రాని మామిడి కాయలను అతి కొద్దిరోజులలోనే మార్కెట్‌లోకి తెచ్చి అధిక ధరలకు సొమ్ముచేసుకోవాలనే ఉద్దేశ్యంతో వాటి రుచిని ప్రజలకు దక్కనివ్వడం లేదు. కాలక్రమేణ మార్కెట్‌లో కనిపించిన మామిడి పండ్ల తినడానికి అలవాటుపడిన ప్రజలు రుచితో పనిలేకుండా కొనుగోలు చేయడంతో మార్కెట్‌లో మామిడిపండ్ల గిరాకి బాగా పెరిగింది. ఒకనాడు చెట్లకు మాగినపండ్లనే ప్రజలు తినేవారు. ఇప్పుడు అటువంటి పండ్లు దొరకడం కష్టం. జనాభా పెరిగేకొద్దీ, సైన్స్ పరంగా అభివృద్ధి సాధించేకొద్దీ పక్వానికి రాని మామిడిపండ్లను మందులు, కొన్ని నాటు పద్ధతుల ద్వారా కాయలను నిండు రంగులు తెప్పిస్తున్నారు. ప్రజలను ఆకర్షించే విధంగా వివిధ రకాల రసాయనాలు కలిపి వ్యాపారులు పండ్లకు రంగు తెస్తున్నారనేది జగమెరిగిన సత్యం. ఇటువంటి మందుల కలబోతతో మార్కెట్‌లోకి వస్తున్న మామిడిపండ్లు అధిక ధరలకు విక్రయిస్తు ప్రజలను నిలువుదోపిడీ చేస్తున్నారు. వీటి డిమాండ్‌ను బట్టి వ్యాపారులు దాదాపుగా ఏ రకానికి చెందిన మామిడికాయలనైనా సరే పక్వానికి రాకముందే చెట్ల నుంచి కోసి విక్రయిస్తున్నారు. మామిడిపండ్లు మార్కెట్‌లోకి రావాల్సిన సీజన్‌కు దాదాపు 50 లేక 60రోజులు ముందే కాయలను మార్కెట్‌లోకి తెప్పిస్తున్నారు. ఫలితంగానే మార్కెట్‌లో మామిడిపండ్లకు డిమాండ్ ఏర్పడింది. అటు దళారులు ఇటు వ్యాపారులు తాము అధిక లాభాలను ఆర్జించాలనే ఆశతో మామిడి తోటలను నాలుగైదు సంవత్సరాలకు లీజుకు తీసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకుని కొనుగోలు చేస్తున్నారు. వీరు కొనుగోలు చేసిన తోటల నుండి అధిక లాభాలు సాధించేందుకు పలు రకాల ప్రయోగాలు చేసి చెట్ల నుంచి కాపు కాయించడమేగాక వాటిని ఎప్పుడు మార్కెట్‌లోకి తీసుకెళితే అధిక ధరలు లభిస్తాయో, ఆ సమయానికి మార్కెట్‌కు తరలిస్తున్నారు. సాధారణంగా రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, రాజంపేట, కోడూరు ప్రాంతాల్లో కోట్లాది రూపాయలు మామిడిపండ్ల వ్యాపారం ప్రతి ఏడాది జరుగుతోంది.సాధారణంగా మామిడిపండ్లు, వాటి రుచిని ఎరుగని పట్టణ ప్రజలు మందులతో మాగిన పండ్లను తినడానికి అలవాటు పడినప్పటికీ, గ్రామీణ ప్రాంతాల ప్రజలు మాత్రం నిజమైన మామిడి పండ్ల రు చి పొందలేకపోతున్నారు. బంగినపల్లి, బేనీషా, మలుగూబా, చెరకు రసాలు, అంటుమామిడి, నీలం, లాల్‌బహార్, తోతాపరీ లాంటి పండ్లతోపాటు జిల్లాలోనే గాకుండా విదేశీ మార్కెట్‌లో మంచి గిరాకీ వున్న రాయచోటి, వీరబల్లి బేనీషాల్లో కూడా తీపు తగ్గినట్లు ప్రస్తుత పండ్ల రుచే తేటతెల్లం చేస్తోంది. గతంలో పోలిస్తే 30శాతం రుచికూడా మామిడిపండ్లలో కనిపించడం లేదని మామిడి రైతులు అంటున్నారు. రుచి కోల్పోవడమేగాక మందులతో పక్వానికి వచ్చిన మామిడి పండ్లను తిని ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మామిడి కాయలను మందులతో పక్వానికి తెస్తున్న వ్యాపారులపై చర్యలు తీసుకుని ప్రజలను ఆరోగ్యాలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.