కడప

నవనీతునిగా అలరించిన రాములోరు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంటిమిట్ట, ఏప్రిల్ 8: ఏకశిల నగర కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా నాల్గవరోజు శనివారం ఉదయం కోదండ పాణి నవనీత కృష్ణునిగా భక్తబృందంగా దర్శనమిచ్చి పునీతులను చేశారు. ముందుగా సీతారామలక్ష్ముణ ఉత్సవమూర్తులకు వేద మంత్రోచ్ఛరణలు, సుగంధ ద్రవ్యాలతో తిరుమంజన పూజలు నిర్వహించారు. అనంతరం నవనీతునిగా అలంకార భూతుడైన భక్తబృందానికి స్వామివారు దర్శనం ఇచ్చారు. కరతళ ధ్వనుల మధ్య, రామనామ స్మరణలతో మార్మోగగా స్వామివారు పురవీధులలో దర్శనమిచ్చారు. రాత్రి ప్రియ భక్తుడైన హనుమంతుని వాహనంపై శ్రీ సీతారామలక్ష్ముణులు మాడవీధులు, పురవీధులలో భక్తులను కనువిందు చేశారు. మరో రెండు రోజులలో సీతారాముల కల్యాణ ఘడియలు దగ్గర పడుతుండడం, మరోవైపు శనివారం కావడంతో పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తాదుల రామనామ స్మరణలు ఆలయమంతా మార్మోగాయి. ఒకపక్క తిరుమంజన పూజ తిలకిస్తూ, మరో పక్క అలంకార భూతుడైన ఏకశిలపై సీతారామలక్ష్ముణులను భక్తులు దర్శించుకోవడం జరిగింది.
నేడు కోదండ పాణికి
మోహినీ అలంకారం
బ్రహ్మోత్సవాల సందర్భంగా ఐదవ రోజు ఏకశిల నగర కోదండ రామునికి మోహినీ అలంకారంలో భక్తాదులకు దర్శనమివ్వనున్నారు. ఆదివారం రాత్రి గరుడ వాహనంపై సీతా సమేతంగా లక్ష్ముణ కోదండస్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు.బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం తిరుపతికి చెందిన సావిత్రిదేవి ఆలపించిన పాదుకా పట్ట్భాషేక ఘట్టం భక్తాదులను విశేషంగా ఆకట్టుకుంది. కడపకు చెందిన సొట్టు సాంబమూర్తి ఉపన్యసించిన శ్రీరామ మైత్రి ఆధ్యాత్మిక ఉపన్యాసం భక్తులను ఆకట్టుకుంది. సాయంత్రం ఊంజల్ సేవలో రామయ్య భక్తులను కనువిందు చేశారు. అనంతరం టిటిడి ధర్మ ప్రచార పరిషత్ కళాకారుల అన్నమాచార్య సంకీర్తనాలాపన అందరిని అలరించింది.

వడదెబ్బకు ముగ్గురి మృతి

జిల్లాలో వేసవి ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. వేసవి తాపానికి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిల్లలకు, పెద్దలు, వృద్ధులు మధ్యాహ్నం సమయంలో బయటకు రావాలంటేనే జంకుతున్నారు. శనివారం జిల్లాపరిధిలో ఎండ వేడికి వడదెబ్బ తగిలి ముగ్గురు వృద్ధులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్లితే...

కోడూరులో గుర్తు తెలియని వృద్ధుడి మృతి..
రైల్వేకోడూరు,ఏప్రిల్ 8: స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో శనివారం మధ్యాహ్నం గుర్తుతెలియని వృద్ధుడు ఎండలకు తాళలేక వడదెబ్బకు గురై మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ముస్లిం మతానికి చెందిన ఈ వృద్ధునికి సుమారు 70 సంవత్సరాల వయస్సు ఉంటుందని, చిరునామా తెలియకపోవడంతో స్థానికులు పంచాయతీ, పోలీస్‌స్టేషన్‌లో జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేశారు.
గోపవరంలో...
గోపవరం: పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన నాగిపోగు వీరయ్య (67) వడదెబ్బ తాళలేక శనివారం మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. బంధువుల వివరాల మేరకు వీరయ్య కూలిపని చేసుకుంటూ జీవించేవాడన్నారు. గత పదిరోజుల క్రితం అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటికి చేరుకున్నాడు. శనివారం ఎండ తీవ్రతకు లోనై మృతిచెందినట్లు బంధువులు తెలిపారు.
వృద్ధురాలి మృతి
నందలూరు: మండలంలోని నాగిరెడ్డిపల్లె దళితవాడకు చెందిన కొండా రామలక్షుమ్మ (70) అనే వృద్ధురాలు వడదెబ్బకు గురై శనివారం తెల్లవారుజామున మృతిచెందింది. మృతురాలు మధుమేహ వ్యాధితో బాధపడేది. కుమారుడు కొండా మధుసూదన్‌రావు ఆరోగ్యం సరిగాలేక చికిత్స నిమిత్తం రామలక్షుమ్మ తిరుగుతూ వడదెబ్బకు గురైందని బంధువులు తెలిపారు. తల్లి మృతితో కుమారుడు ఆనాధగా మిగిలాడు. ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని స్థానికులు కోరారు.

ఆది మంత్రి పదవి శిరోభారమే!

కడప,ఏప్రిల్ 8: ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణలో జిల్లా నుంచి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి మంత్రివర్గం స్థానంలో స్థానం లభించినా ఆయనకు పదవి శిరోభారమేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మంత్రి పదవి లభించి మొట్టమొదటి పర్యాయంగా శుక్రవారం జిల్లాలో ఆది జిల్లాకు వచ్చి పర్యటించినా పలువురు నేతలు ఆయన్ను మొక్కుబడిగా కలవడం, తాము సీనియర్లుగా ఉండి పదవులు దక్కలేదని తమ అనుచరులతో వాపోతున్నట్లు తెలుస్తోంది. ఆయన రాజకీయ ప్రత్యర్థి పి.రామసుబ్బారెడ్డి ప్రత్యక్షంగానే శుక్రవారం నియోజకవర్గ వ్యాప్తంగా జమ్మలమడుగులో జరిగిన నేతలు, కార్యకర్తల సమావేశంలో ఆవేశ భరితంగా ప్రసంగించారు. కార్యకర్తల విషయంలో ఆయన మరోమారు ఆదినారాయణరెడ్డిపై నిప్పులు కక్కారు. కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిధిగా వెళ్లిన రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్‌నాయుడుకు భంగపాటు కలిగింది. కార్యకర్తలు రెచ్చిపోయి ఒకరిపై మరొకరు కుర్చీలు విసురుకుని గందరగోళం సృష్టించారు. కడపలో జరిగిన మంత్రి పర్యటనకు పలువురు నేతలు అధిష్ఠానం ఆదేశాలమేరకు మొక్కుబడిగా హాజరైనట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు కీలక పదవిలో వుండి ఇటీవల పదవీవిరమణ చేసిన ఆనేత కన్పించలేదు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆదినారాయణరెడ్డి తన పంథం నెగ్గించుకుని బిటెక్ రవికి టికెట్ ఇప్పించుకున్నప్పటి నుంచి జిల్లాలో లుకలుకలు మొదలయ్యాయి. అయితే హైకమాండ్ వద్ద పలువురు నేతలు ఆదికి పదవి ఇవ్వరాదని ప్రయత్నాలు చేసినా ఆదికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపే పదవికి దోహదపడింది. విప్ మేడా వెంకటమల్లికార్జునరెడ్డి మంత్రి పదవి దక్కలేదని తీవ్ర అసంతృప్తితో ఉండి ఆయన కూడా ఆది పర్యటనకు చివరి నిమిషంలో వచ్చినట్లు తెలిసింది. ఆదినారాయణరెడ్డి కడపలోని ఆర్‌అండ్‌బి గెస్ట్‌హౌస్‌కు వచ్చిన తర్వాత కొంతమంది నేతలు పలకరించి వెళ్లి సాయంత్రం జరిగిన సమావేశానికి మొక్కుబడిగా వచ్చారు. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే జమ్మలమడుగు నియోజకవర్గానికి పోటీకి ఆది బరిలో దిగినా వైసిపి నుంచి బలమైన అభ్యర్థినే రంగంలో దింపి స్వయంగా జగనే నియోజకవర్గంలో మకాం వేస్తారని కూడా తెలిసింది. మరోపక్క రామసుబ్బారెడ్డిని వైసిపి ఏదోవిధంగా తమ పార్టీలోకి చేర్చుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. రామసుబ్బారెడ్డి స్వయంగా శుక్రవారం కార్యకర్తల సమావేశంలో పార్టీని వీడను, తన కుమారుడిని రాజకీయ రంగ ప్రవేశం చేయిస్తానని ప్రకటించడంతో పలువురికి పలు రకాల అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. జిల్లాలోని పలువురు అధికారపార్టీ నేతలు రామసుబ్బారెడ్డికి అండగా నిలుస్తామని కూడా చెప్పుకుంటున్నారు. ఇక ఆదికి మంత్రి పదవి దక్కడంతో నియోజకవర్గంపై పెద్దగా దృష్టి పెట్టని కారణంగా రాష్టవ్య్రాప్తంగా పర్యటనలు చేయాల్సివుండటంతో ఆయన కుటుంబ సభ్యులకు బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. వారి కుటుంబ సభ్యుల్లో కొంతమందిపై నియోజకవర్గంలో అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది. ఈనేపధ్యంలో వైసిపి, రామసుబ్బారెడ్డిలు నియోజకవర్గంపై దృష్టిపెట్టి తమ వర్గాన్ని బలోపేతం చేసుకుని ప్రజల్లోదూసుకెళ్లే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఆది అన్న ఎమ్మెల్సీ నారాయణరెడ్డికి నియోజకవర్గంలో పట్టువున్నా ప్రస్తుత పరిస్థితులు దృష్ట్యా ఆయన వైసిపిని విమర్శించే అవకాశాలు కన్పించడంలేదు. ఇక జిల్లాలో టిడిపి నాయకులు కూడా పదవులకోసం ప్రయత్నాలు మొదలుపెట్టి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావుతోను, రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్‌నాయుడుతో మంచి సంబంధాలు పెట్టుకున్నారు. మొత్తంమీద జిల్లాలో టిడిపి నేతల మధ్య నెలకొన్న పరిస్థితులు ఆదినారాయణరెడ్డికి తలనొప్పిగానే మారాయి. ఆది ఆపరిస్థితులు తనకు అనుకూలంగా ఎలా మలుచుకుంటారో కాలమేనిర్ణయించాల్సివుంది.

10న సీఎం, గవర్నర్ రాక

కడప,ఏప్రిల్ 8: మరో అయోధ్యగా పేరుగాంచి ఏకశిలానగరంగా దినదినాభివృద్ధి చెందుతున్న పవిత్రపుణ్యక్షేత్రమైన ఒంటిమిట్టలో కొలువుదీరిన శ్రీకోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 10వ తేదీ సోమవారం జరుగుతున్న శ్రీసీతారాముల కల్యాణానికి ఏపి ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు, గవర్నర్ నరసింహాన్ సతీసమేతంగా వస్తున్నట్లు కలెక్టర్ కెవి సత్యనారాయణ ఒంటిమిట్టలో జరుగుతున్న ఏర్పాట్లు పరిశీలిస్తున్న సందర్భంగా ఆయన విలేఖర్లకు తెలిపారు. సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి కడపకు చేరుకుని అక్కడి నుంచి రోడ్డుమార్గాన రాత్రి 7 గంటలకు ఒంటిమిట్ట హరితరెస్టారెంట్‌కు చేరుతారన్నారు. అక్కడి నుంచి సతీసమేతంగా ఏకశిలపై వెలసిన శ్రీసీతారామలక్ష్మణ మూలవిరాట్‌లకు పట్టువస్త్రాలు సమర్పించి స్వాములవారిని దర్శించుకుంటారన్నారు. అనంతరం స్వామివారి కల్యాణానికి హాజరౌతారన్నారు. కాగా అరగంట తేడాతో ఏపి గవర్నర్ నరసింహన్ కుటుంబ సమేతంగా రాములవారిని దర్శించుకుని కల్యాణవేదిక వద్దకు హాజరౌతారన్నారు. ఇదిలా ఉండగా కల్యాణానికి సంబంధించిన ఏర్పాట్లు పరిశీలించేందుకు ఎస్పీ రామకృష్ణ, కలెక్టర్ సత్యనారాయణ పరిశీలించారు. ఆయన కల్యాణవేదిక ప్రాంగణం వద్ద, హరితప్రాంగణం వద్ద ఆలయం ప్రాంగణం వద్ద ఒంటిమిట్ట పరిసర ప్రాంతాల వద్ద బాంబుస్వ్కాడ్‌తో పరిశీలించారు. కార్యక్రమంలో రాజంపేట డిఎస్పీ రాజేంద్ర, ఆర్డీవో వీరబ్రహ్మం తదితర అధికారులు పాల్గొన్నారు.

క్యాంపులో ముక్తియార్
వర్గం కౌన్సిలర్లు.!

ప్రొద్దుటూరు టౌన్, ఏప్రిల్ 8: ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ఛైర్మన్ పదవిపై పోటీ తారాస్థాయికి చేరింది. ఇందులో భాగంగా వైకాపాలో కౌన్సిలర్‌గా గెలుపొంది గత యేడాది తెలుగుదేశంపార్టీలో చేరిన ముక్తియార్ తన అనుచర కౌన్సిలర్లు, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఛైర్మన్ మల్లెల లింగారెడ్డి వర్గానికి చెందిన కౌన్సిలర్లు మొత్తం 13మంది శుక్రవారం క్యాంపునకు తరలివెళ్లడం జరిగింది. మున్సిపల్ ఎన్నికల ముందు ఉండేల గురివిరెడ్డి, ఆసం రఘురామిరెడ్డిలు ఇద్దరూ ఛైర్మన్ పదవిని అధిష్టించేలా ఒప్పందం కుదిరింది. అయితే తన పదవీకాలం ముగిసినా రాజీనామాచేయనని మొండికేసిన ఉండేల గురివిరెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా టిడిపి అభ్యర్థిని గెలిపించుకోవాలనే ఉద్దేశ్యంతో ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, రాజ్యసభ సభ్యుడు సి ఎం.రమేష్‌నాయుడులు మధ్యవర్తిత్వం చేసి గురివిరెడ్డితో రాజీనామా చేయించారు. నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి నంద్యాల వరదరాజులరెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఆసం రఘురామిరెడ్డిని ఈనెల 15న ఎన్నికల నిబంధనలమేరకు కౌన్సిలర్లు ఎన్నుకోవాల్సివుంది. దీనిని ముందు నుంచీ వ్యతిరేకిస్తూ ఛైర్మన్ పదవిని గట్టిగా ఆశిస్తున్న ముక్తియార్ క్యాంపు రాజకీయాలకు తెరతీశారు. ముక్తియార్ వద్ద 13మంది టిడిపి కౌన్సిలర్లుండగా వైకాపాకు చెందిన 9మంది కౌన్సిలర్లు, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదెడ్డితో కలిపి మొత్తం 10మంది సభ్యులు తనకే మద్దతు తెలుపుతారని ముక్తియార్ గట్టిగా విశ్వశిస్తున్నారు. ఇక వరదరాజులరెడ్డి వర్గంలో 18మంది సభ్యులుండగా ముక్తియార్ వర్గానికే ఎక్కువమంది సభ్యులున్నట్లు సమాచారం. గత కొంతకాలం నుంచి వరదరాజులరెడ్డి గ్రూపు రాజకీయాలు చేస్తున్నారని, తమవర్గం వారికి అసలు ప్రాధాన్యతనివ్వడం లేదని, ఛైర్మన్ పదవిపై వరద బలపరిచే వ్యక్తికి తాము వ్యతిరేకమని ముక్తియార్ అనేకసార్లు పత్రికా ప్రకటనలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వరద నిర్వహించే గ్రూపు రాజకీయాలపై అధిష్టానం కలుగజేసుకుని తమకు న్యాయం చేయాలని కూడా ముక్తియార్ అనేకమార్లు జిల్లా, రాష్ట్ర నాయకులతో మొరపెట్టుకోవడం జరిగింది. ఛైర్మన్ పదవిపై పార్టీ అధిష్టానమే చూసుకుంటుందని వరదరాజులరెడ్డి ధీమాగా ఉన్నట్లు సమాచారం. మొత్తమీద నియోజకవర్గంలోని టిడిపిలో గ్రూపు రాజకీయాలు ముక్తియార్ క్యాంప్‌కు తరలడంతో ప్రజలందరికీ తెలిసేలా బట్టబయలైంది. ఇప్పటికైనా జిల్లా, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధిష్టానం కలుగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దకపోతే పార్టీ ప్రతిష్ట మసగబారే పరిస్థితి ఏర్పడుతుందని కొందరు రాజకీయ విశే్లషకులు భావిస్తున్నారు.

లోక్ అదాలత్‌లో నిష్పక్షపాతంగా కేసులు పరిష్కారం

కడప,(లీగల్)ఏప్రిల్ 8: కేసుల పరిష్కారంలో లోక్ అదాలత్‌లో ధనిక, పేద అనే తారతమ్యం లేకుండా కేసుల పరిష్కారంలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని కడప జిల్లా ప్రధాన జిల్లా జడ్జి జి.శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం జాతీయలోక్ అదాలత్‌లో కక్షిదారులు, న్యాయవాదులు, పారాలీగల్ వాలంటరీస్‌లనుద్దేశించి ఆయన ప్రసంగించారు. లోక్ అదాలత్‌లో పరిష్కరించుకున్న కేసుల్లో అప్పీలు అనేది ఉండదని కక్షిదారులకు, కోర్టు ఫీజు వాపసు ఇవ్వబడుతుందని లోక్ అదాలత్ అంటే పూర్వకాలం రచ్చబండలాంటిదని ప్రతికక్షిదారుడు క్రిమినల్ కేసుల్లో రాజీపడి గ్రామాల్లో కక్షలు, కార్పణ్యాలు తగ్గేందుకు దోహదపడుతుందని అలాగే లోక్ అదాలత్ వల్ల కోర్టుల్లో ఉన్న కేసుల పెండెన్సి తగ్గుతుందని రాజీమార్గంద్వారా ప్రజల్లో స్నేహభావం ఏర్పడుతుందని ప్రజలకు సేవచేసేందుకే జాతీయ లోక్ అదాలత్ వారు ఈ చట్టాన్ని ప్రవేశపెట్టిందన్నారు. జిల్లావ్యాప్తంగా 2274 సివిల్, క్రిమినల్, ప్రీలిటికేషన్, మోటార్‌వాహనాల కేసులు పరిష్కారం ద్వారా సంబంధిత కక్షిదారులకు రూ.2కోట్ల42వేల 286లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. అలాగే రూ.4లక్షలు ఇఫ్‌కో టోపియో ఇన్సురెన్స్ కంపెనీ బాధిత మోటార్ వాహనాల నష్టపరిహారదారునికి జిల్లా జడ్జి ద్వారా చెక్కును అందరి సమక్షంలో ఇవ్వడం జరిగింది. శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ విష్ణుప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ గణనీయంగా లోక్ అదాలత్‌ను కక్షిదారులు ఉపయోగించుకుంటున్నారని తద్వారా ప్రజల్లో అవగాహన శక్తి పెరిగి లోక్ అదాలత్‌ను ఆశ్రయిస్తున్నారన్నారు. మొదటి అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ మోటార్‌వాహనాల నష్టపరిహారం కేసుల్లో గణనీయంగా కక్షిదారులు, క్షతగాత్రులు, వారసులు నష్టాన్ని త్వరితగతిన పొందుతున్నారన్నారు. లోక్ అదాలత్ కార్యదర్శి యు.యు.ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడేందుకే ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. ఈ సమావేశానికి న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జివి రాఘవరెడ్డి, కార్యదర్శి రవిచక్రవర్తి, జూనియర్ జడ్జిలు శోభారాణి, శ్రీ్ధర్, ప్రవీణ్‌కుమార్, బాంజుదేవ్, సాయిభాను, కక్షిదారులు, పోలీసులు, ఇన్సురెన్స్ కంపెనీ అధికారులు పాల్గొన్నారు.

రోగులకు మెరుగైన సేవలందించాలి

రాజంపేట, ఏప్రిల్ 8: రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని ఆసుపత్రి అడ్వైజరీ కమిటీ సభ్యులకు, ఆసుపత్రి డాక్టర్లకు, సిబ్బందికి విప్ మేడా మల్లికార్జునరెడ్డి ఆదేశించారు. శనివారం ఆసుపత్రిలో జరిగిన ఆసుపత్రి అడ్వైజరీ కమిటీ సమావేశంలో విప్ మేడా మాట్లాడుతూ రాజంపేట ఆసుపత్రి అభివృద్ధిలో అందరి సహకారంతో అసుపత్రి అడ్వైజరీ కమిటీ ముందుకు వెళ్ళాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చేరోగులకు సరైన సౌకర్యాలతోపాటు మంచి ఆహారం అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ సౌకర్యం కల్పించాలన్నారు. వేసవి తీవ్రతతో గదుల్లో ఉక్కపోత దృష్ట్యా రెండు రోజుల్లో ఏయిర్ కూలర్స్ సౌకర్యం కల్పించాలని కమిటీకి సూచించారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్య పనులు సక్రమంగా చేయడంలేదని, అనేక లోపాలున్నాయని, ఇవి తన దృష్టికి వచ్చినట్టు చెప్పారు. వెంటనే పారిశుద్ధ్య కాంట్రాక్టర్‌ను పిలిచి ప్రభుత్వం నిర్దేశించిన నియమనిబంధనల ప్రకారం పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరిగేవిధంగా చర్యలు తీసుకోవాలని, అలా వీలుకానిపక్షంలో కాంట్రాక్ట్ రద్దు చేసేందుకు కమిటీ తీర్మానం చేయాలన్నారు. పారిశుద్ధ్య పనులుచేసే సిబ్బందికి సక్రమంగా జీతాలు చెల్లించడం లేదని, ఇచ్చే వాటిలో చాలా తక్కువగా ఇస్తున్నారని వస్తున్న ఆరోపణలపై కమిటీ కాంట్రాక్టర్‌తో చర్చించి పారిశుద్ధ్య సిబ్బందికి న్యాయం చేకూర్చాలన్నారు. ఈ సమావేశంలో ఆర్డీఓ వీరబ్రహ్మం, మున్సిపల్ కమిషనర్ ఎన్.వి.రమణారెడ్డి, ఆసుపత్రి అడ్వైజరీ కమిటీ ఛైర్మన్ వడ్డి రమణ, సభ్యులు పి.ఖాజామొహిద్దీన్, నారదాసు మధు, ఎల్.సుజాత, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్బరాయుడు, డాక్టర్ శేఖర్ పాల్గొన్నారు.

ఒంటిమిట్టను మోహరించిన పోలీసు బలగాలు
ఒంటిమిట్ట, ఏప్రిల్ 8: ఏకశిల నగర కోదండ రామస్వామి కల్యాణం సోమవారం జరగనున్న దృష్ట్యా పోలీస్ యంత్రాంగం భారీ స్థాయిలో తమ బలగాలను మోహరించింది. ఓఎస్డీ సత్యయేసుబాబు, జిల్లా ఎస్పీ రామకృష్ణ నేతృత్వంలో భారీస్థాయిలో పోలీస్ బలగాలు ఇప్పటికే ఒంటిమిట్టకు చేరాయి. కడప-చెన్నై జాతీయ రహదారి కావడంతో కల్యాణ వేదిక వద్ద నుంచి పోలీస్ బలగాలు మోహరించాయి. శనివారం మధ్యాహ్నం సైతం ఎస్సీ రామకృష్ణ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. సోమవారం గవర్నర్ నరసింహాన్, ఎపి ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు దంపతులు రామయ్య కల్యాణోత్సవంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక హరిత రెస్టారెంట్ ప్రాంగణాలు, ఆలయ ప్రాంగణాలు, కల్యాణ వేదిక ప్రాంగణాలను, హైవేలోని భాక్రాపేట నుండి మండల పరిధిలోని చెర్లోపల్లె వరకు డాగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం నుండి దాదాపు హైవేలో జరిగే భారీ వాహనాలను కడప బైపాస్ నుండి రాయచోటి, రాజంపేట మీదుగా తిరుపతి, చెన్నై పట్టణాలకు దారి మళ్లించనున్నారు. ఈ పోలీస్ బలగాలలో సుమారు 20 మంది డిఎస్పీలు, 40 మంది సిఐలు, పారా మిలటరీ, హోం గార్డు, 11వ బెటాలియన్ తదితర అందుబాటులోని అన్ని ప్రాంతాల బలగాలు రంగంలో దిగాయి. ఇప్పటికే ఒంటిమిట్టలో ఎక్కడ చూసినా ఖాకీలే దర్శనమిస్తున్నాయి. మొత్తం మీద పోలీస్ భద్రతా వలయంలో ఒంటిమిట్ట ఉందని చెప్పకనే చెప్పవచ్చు.