కడప

బిఆర్‌జిఎఫ్ నిధుల కోసం నిరీక్షణ..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, ఏప్రిల్ 28: కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే బిఆర్‌జిఎఫ్ నిధుల కోసం స్థానిక సంస్థల సభ్యులు ఎదురుచూస్తున్నారు. దీంతో అభివృద్ధికి గ్రామాలు ఆమడదూరంలో ఉన్నాయని చెప్పవచ్చు. బిఆర్‌జిఎఫ్ కేంద్ర నిధులద్వారా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితోపాటు ముఖ్యంగా మారుమూల ప్రాంతాలకు నిధులు రావాల్సి ఉంది. అయితే 2014-15 సంవత్సరం నుండి ఆ నిధులను ఆపేశారు. ఆ నిధులు విడుదలచేసి గ్రామసీమలను అభివృద్ధి చేయాల్సి ఉంది. గడిచిన ఏడు సంవత్సరాలుగా రూ. 183 కోట్లు విడుదల కాగా దాదాపు రూ. 150 కోట్లు ఖర్చుచేశారు. ప్రతియేటా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితోపాటు పురపాలక సంఘాల్లో వెనుకబడిన వార్డుల అభివృద్ధి చేయాల్సిఉంది. 2007లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టి యేటా జిల్లాకు రూ. 240 కోట్లు విడుదల చేసేందుకు 2007లో అధికారులు ప్రణాళికలు రూపొందించిన ప్రతియేటా రూ. 250 కోట్లు కావాల్సి ఉంది. 2014-15లో మంజూరైన నిధులు కూడా రాలేదు. అయితే మంజూరుచేసిన నిధుల ద్వారా 10 నుండి 20 వేల పనులు చేపట్టాల్సి ఉంది. ఏడేళ్ల క్రితం మంజూరైన నిధులల్లో కూడా జిల్లాకు ఇంకా రూ. 7 కోట్లు విడుదల కావాల్సి ఉంది. 2013-14లో రూ. 36.59 కోట్లు అవసరమని జడ్పీ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపారు. రూ. 29.60 కోట్లు మంజూరుచేశారు. అయితే యేటా గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లాపరిషత్, పురపాలక సంఘాలు బిఆర్‌జిఎఫ్ నిధులను ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు చేయడమే తప్ప ఆడిట్ చేయడంలో తప్పుల తడకలు సాగాయనే చెప్పవచ్చు. చాలా పంచాయతీల్లో సర్పంచులు కాంట్రాక్టర్లుగామారి పాత పనులకు కొత్త సొగసులు చేయడం, కొంతమంది పనులు చేయకుండానే మారుమూల ప్రాంతాల అభివృద్ధి పేరిట పనులు చేయకనే చేసినట్లు రికార్డులు రాయడం, చేసిన పనులనే చేసినట్లు తప్పుడు రికార్డులు తయారు చేయడంతో పంచాయతీల సర్పంచ్‌లు, కార్యదర్శుల మధ్య వాటాల పంపిణీలో బేధాలువచ్చి సమన్వయం లేకపోవడంతో కార్యదర్శులు ఆడిటర్‌లు వచ్చిన సమయంలో సరియైన సమాధానం ఇవ్వకపోవడంతో సక్రమంగా ఆడిట్ జరగకపోవడం, ఆడిటర్లకు అంతో ఇంతో సర్పంచులు ముట్టజెప్పి ఇబ్బడి ముబ్బడిగా రికార్డులు సమర్పించినా ఆడిటర్ల నివేదికలను రాష్ట్రప్రభుత్వం వెనక్కు పంపడంతో బిఆర్‌జిఎఫ్ నిధుల విషయంలో కేంద్రం జాప్యంచేస్తుంది. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి నిధులు మంజూరుచేసినా అవినీతి, అక్రమాల మూలంగా ఈ నిధులు ఆగిపోయినట్లు తెలుస్తుంది. సర్పంచులు, మండలాధ్యక్షులు, పురపాలక సంఘ ఛైర్మన్‌లు తమకొచ్చే అరకొర నిధులు కూడా రాక పోవడంపై పెదవి విరుస్తున్నారు.

విధులను బాధ్యతగా
నిర్వహించేవారిని గౌరవించాలి

* వైవియు రిజిస్ట్రార్ల సన్మాన సభలో విసి రామచంద్రారెడ్డి

కడప,ఏప్రిల్ 28: సక్రమంగా విధులు నిర్వహిస్తూ, అభివృద్ధికి పాటుపడుతూ, సమాజ సంస్కర్తలను గౌరవించడం వారిని సన్మానించడం గొప్ప సంస్కృతి అని యోగివేమన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ఏ.రామచంద్రారెడ్డి శుక్రవారం పేర్కొన్నారు. ఇప్పటి వరకు రిజిస్టార్‌గా పనిచేసిన ఆచార్య వై.నజీర్ అహ్మద్‌కు వీడ్కోలు పలుకుతూ కొత్తగా రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టిన ఆచార్య కె.చంద్రయ్యకు స్వాగతం పలుకుతూ వైవియు అధ్యాపక సంఘం ఏర్పాటుచేసిన సన్మాన సభలో ముఖ్యఅతిధిగా హాజరై ప్రసంగించారు. ఇరువురు అనుభవం కలిగిన వారేనని కష్టపడే తత్వం కలిగిన ఆచార్యులని, విధుల్లో నిరంతరం సహాయ సహకారాలు అందించడం వారి పనితనమని వారిని అధ్యాపకులు గౌరవించడం అందరి బాధ్యత అని ఆయన వారి సేవలు కొనియాడారు. ఆచార్య నజీర్ అహ్మద్ విశ్వవిద్యాలయం అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని, వృత్తిపరంగా కూడా ఆయన అనేక సెమినార్లు, కార్యక్రమాలు యూనివర్సిటీలో ర్యాంకింగ్‌లు లభించేందుకు విశేషంగా కృషి చేశారని ఆయన స్పష్టం చేశారు. చంద్రయ్య ప్రఖ్యాతిగాంచిన మనోవిజ్ఞాన వేత్త అని, సుజనాత్మక పనివంతునిగా ఎక్కడపనిచేసినా పూర్తిస్థాయిలో న్యాయం చేయడం జరుగుతోందన్నారు. వైవియు అధ్యాపకుల అసోసియేషన్ అధ్యక్షుడు ఆచార్య కె.గంగయ్య మాట్లాడుతూ ఇరువురు రిజిస్ట్రార్లను గౌరవించడం తమ విధి నిర్వహణలో భాగమేనని నజీర్ అహ్మద్ సేవలను మరువరానివని ప్రస్తుతం రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టిన చంద్రయ్య మంచి సంస్కర్తగా కొనియాడారు. అలాగే ఆచార్య నజీర్ అహ్మద్ మాట్లాడుతూ తనకు పదవి వున్నా లేకపోయినా యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేస్తూ విద్యాభివృద్ధికి గతంలో మాదిరిగానే పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. అలాగే రిజిస్ట్రార్ ఆచార్య చంద్రయ్య మాట్లాడుతూ తాను ఈ జిల్లావాసిగా విశ్వవిద్యాలయం అభివృద్ధికి అధ్యాపకులు, ముఖ్యంగా వైస్ చాన్స్‌లర్ ఇచ్చే సలహాలు, సూచనలు పాటిస్తూ విశ్వవిద్యాలయాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయ అధ్యాపకులు, వివిధ శాఖల అధిపతులు డా.ఎన్.ఈశ్వరరెడ్డి, డా.రామసుబ్బారెడ్డి, డా.ప్రమీలామార్గరేట్, డా.లలిత, డా.వై.సుబ్బారాయుడు, డా.విజయకుమార్ నాయుడు, శ్యామ్‌స్వరూప్, అసోసియేషన్ ప్రధానకార్యదర్శి డా.వెంకటసుబ్బయ్య, అసోసియేషన్ నేత డా.మునికుమారిలు పాల్గొని ప్రసంగించారు. ఈకార్యక్రమానికి వెంకటసుబ్బయ్య అతిధులకు స్వాగతం పలకగా మునికుమారి వందన సమర్పణ గావించారు.

జిల్లా అభివృద్ధికి అడ్డంకి జగన్..

రాయచోటి, ఏప్రిల్ 28: రాష్ట్రంలో ప్రతి అభివృద్ధి పనికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిత్యం అడ్డుపడుతున్నాడని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి(వాసు) ఆరోపించారు. స్థానిక మదనపల్లె మార్గంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమలను రాకుండా, అభివృద్ధి జరగకుండా, ప్రాజెక్టులు పూర్తికాకుండా అడుగడుగునా అడ్డు తగులుతున్నాడన్నాడు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నీరు-చెట్టు కార్యక్రమంతో రాబోవు వర్షాకాలంలో పడే ప్రతి నీటిచుక్కను కూడా సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో, భావనతో ఎన్ని వీలైతే అన్ని చెక్‌డ్యాంలపై నిర్మిస్తోంది, దీనిపైన ప్రత్యేక శ్రద్ధ ఆ శాఖా మంత్రి రావెల కిశోర్‌బాబు తీసుకోవడం జరుగుతోంది. ఇందులో భాగంగా ఇటీవల విజయవాడలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారన్నారు. గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా వర్షపు నీటిని ఆదా చేయాలి, సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచన చేయలేదని, కానీ చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయ్యాక దీనిపై అత్యధిక ప్రాముఖ్యతను ఇవ్వడం జరిగిందన్నారు. ప్రజల సంక్షేమం కోసం లోతుగా ఆలోచిస్తున్న సీఎం చంద్రబాబు అని కొనియాడారు. అలాగే కడప జిల్లాలో తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉందని, ముఖ్యంగా రాయచోటి, పులివెందుల, బద్వేలు నియోజకవర్గాలలో తాగునీటి కొరతను తీర్చేందుకు శాశ్వత నీటిపథకాలను ప్రభుత్వం మంజూరు చేస్తోందన్నారు. లక్కిరెడ్డిపల్లె, గాలివీడు మండలాల్లో శాశ్వతంగా నీటిపథకాలు వేసేందుకు సహకరిస్తామని పలువురు మంత్రులు తెలిపారన్నారు. గతంలో సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా రూరల్ పరిధిలో ఇచ్చిన హామీ మేరకు ఐదు గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే టెండర్లు పిలవడం జరుగుతుందన్నారు. సంబేపల్లె, చిన్నమండెం మండలాలకు కోటి రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగిందన్నారు. తాగునీటికి శాశ్వత నీటిపథకాలకు వచ్చే ఆరు నెలల్లో పూర్తి చేసి రాయచోటి తాలూకాలో అన్ని గ్రామాలకు నీళ్లు అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉందన్నారు. ఈ రోజు సీఎం అనుభవాన్ని, పరిపాలనను చూసి దేశ, విదేశాల నుండి భారీ సంస్థలు రావడం జరుగుతోందన్నారు. పక్కనే ఉన్న చిత్తూరు జిల్లాలో కూడా యాపిల్ సంస్థ ఏర్పాటు, కార్ల పరిశ్రమ అనంతపురం జిల్లాలో రావడం శుభపరిణామమన్నారు. అదే విధంగా కడప జిల్లాలో మున్ముందు పరిశ్రమలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే ప్రతిపక్షాలు అడ్డు పడటాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలుగుదేశం పార్టీ జిల్లా, రాష్ట్రంలో విజయకేతనం ఎగురవేయనుందన్నారు. ముఖ్యంగా కడప జిల్లాలో అన్ని స్థానాలను కైవసం చేసుకోగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. మే నెలలో జరగబోవు మహానాడుకు గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు కూడా ఏర్పాటు చేసుకొని రాబోయే ఎన్నికలకు పార్టీ పూర్తి స్థాయిలో సిద్ధం అవుతోందన్నారు. ప్రతి కార్యకర్త పార్టీ కోసం అంకితభావంతో పనిచేయాలని సూచించారు. గడిచిన మూడు సంవత్సరాలలో పార్టీ కోసం కష్టపడిన వారికి మహానాడు పూర్తయిన తరువాత నామినేటెడ్ పోస్టులు అందజేయనున్నట్లు సీఎం తెలిపారని వివరించారు. జిల్లా అభివృద్ధి మీద ప్రతిపక్ష పార్టీలు గడిచిన మూడు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిపై తాము ప్రతిపక్షాలకు సవాల్ విసురుతున్నామని, ఎప్పుడైనా సమీక్షకు సిద్దమని ప్రకటించారు. ఈ సమావేశంలో తెలుగు మహిళ జిల్లా ప్రధాన కార్యదర్శి సుజాత, సంబేపల్లె జడ్పీటీసీ నరసారెడ్డి, టీడీపీ పట్టణ, రూరల్, సంబేపల్లె అధ్యక్షులు సాదక్‌అలీ, సుబ్బారెడ్డి, నాయకులు కొప్పుల గంగిరెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షురాలు లక్ష్మిదేవి తదితరులు పాల్గొన్నారు.
ఇసుకాసురుల ఆగడాలను అరికట్టాలి

రాజంపేట టౌన్, ఏప్రిల్ 28:జిల్లాలో ఇసుకాసురుల ఆగడాలను అరికట్టాలని, ఇసుక అక్రమ రవాణాతో సామాన్య ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందని బిజెపి జిల్లా అధ్యక్షులు పుష్పాల శ్రీనాధరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం రాజంపేటలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొందరు అధికార పార్టీ నేతలు, అధికారుల అండదండలతో ఇసుక మాఫియా రెచ్చిపోయి ఇతర రాష్ట్రాలకు ఇసుకను అక్రమరవాణా చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం నిర్ధేశించిన క్వారీలలో ఇసుక తవ్వకాలు నిర్వహించకుండా విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ తవ్వకాలు సాగించి తరలించడంతో భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయన్నారు. ఫలితంగా ప్రజలకు తాగునీటి సమస్యలతో తల్లడిల్లుతున్నా అధికారులు పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణాపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్న అధికార యంత్రాంగం స్పందించకపోవడం దారుణమన్నారు. అవినీతి అధికారులు, నాయకుల అండదండలతో ఇసుక అక్రమ రవాణా మాఫియాగా మారడం చాలా ప్రమాదకరమన్నారు. అధికార యంత్రాంగంలో పెరుగుతున్న అవినీతికి ఇసుక అక్రమ రవాణా అద్దం పడుతుందన్నారు. సర్వేలలో సైతం ఆంధ్రప్రదేశ్ అవినీతిలో దేశంలోనే రెండవ స్థానంలో నిలబడటం ఆందోళన కలిగించే అంశమన్నారు. అధికార యంత్రాంగం నామమాత్రపు చర్యలు అక్రమార్కులకు వరంలా మారుతున్నాయన్నారు. అధికార పార్టీ నేతల ప్రమేయంతో నిత్యం వేలాది వాహనాలలో విచ్చలవిడిగా ఇసుక అక్రమ రవాణా జరుగుచున్న ప్రభుత్వం అక్రమార్కుల పట్ల మెతక వైఖరి అవలంభించడం చాలా దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇసుక దందాను ఉపేక్షించినట్లైతే ప్రజలకు అన్యాయమే మిగులుతుందన్నారు. ఇసుక అక్రమ రవాణానుపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బిజెపి జాతీయ కౌన్సిల్ సభ్యులు పోతుగుంట నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పిండిబోయిన కృష్ణాయాదవ్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఈటిమార్పురం సుబ్రమణ్యం, పార్టీ మండల అధ్యక్షులు వై.సురేష్‌రాజు పాల్గొన్నారు.

చందనోత్సవ అలంకారంలో
చెన్నకేశవుడు

వల్లూరు,ఏప్రిల్ 28: చల్లని మనసుతో భక్తులు కోరిన కోర్కెలు తీర్చే చెన్నకేశవుని దర్శనార్థం భక్తులు చందనోత్సవ అలంకారం కోసం ఎదురుచూస్తుంటారు. శుక్రవారం పుష్పగిరి శ్రీలక్ష్మీచెన్నకేశవ స్వామికి చందనోత్సవ అలంకారం చేపట్టారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు లోనయ్యారు. ఉదయం నుంచి సుప్రభాతసేవ, చందనోత్సవం, చతుస్థానార్చన నిత్యహోమాలు నిర్వహించారు. అనంతరం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేతుడైన చెన్నకేశవుడు హనుమంతవాహనంలో దర్శనమిచ్చారు. గ్రామంలో వెలసిన వైద్యనాదేశ్వరస్వామి ఆలయంలో ఉదయం నుంచి గణపతిపూజ, రుద్రాభిషేకం, కుంకుమార్చన, నిత్యహోమ, బలిప్రధానం తదితర పూజలు నిర్వహించారు. రాత్రి శ్రీకామాక్షి సమేతుడైన వైద్యనాదేశ్వరుడు నెమలివాహనంలో ఊరేగారు. బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైన ఘట్టం అక్షయతదియను దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

వేసవిలో మజ్జిగ, నీరు పంపిణీ

కడప,ఏప్రిల్ 28: జిల్లాలోని దాతలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు ఆర్థిక స్తోమత కలిగిన టిడిపి నేతలు, కార్యకర్తలు వేసవి కాలంలో మజ్జిగ, నీటిని ఉచితంగా సరఫరా చేయాలని తెలుగుదేశంపార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులురెడ్డి (వాసు) శుక్రవారం పిలుపునిచ్చారు. వేసవి తాకిడికి వడదెబ్బకు ఉపశమనం కలిగించేందుకు 44వ డివిజన్‌లో ఉచితంగా మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేస్తామని తెలుగుదేశంపార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులురెడ్డి (వాసు) మజ్జిగ ప్యాకెట్ల పంపిణీలో ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఆర్థికంగా ఉన్న ప్రతి ఒక్కరు ప్రజలకు ఉపశమనం కలిగేందుకు మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు ఉచితంగా ఇచ్చి ప్రజలను ఆదుకోవాలని ఆయన కోరారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండలు ఉన్నాయన్నారు. ఏదైనా పనినిమిత్తం పట్టణాలకు వచ్చేవారు ఎండలకు తల్లడిల్లిపోతున్నారని సాటి మనిషిగా మానవత్వంతో ప్రతి ఒక్కరు మజ్జిగ, మంచినీరు పంపిణీ చేసి తమ ఔనత్యాన్ని చాటిచెప్పాలన్నారు. ప్రభుత్వం కూడా మంచినీటి సమస్య పరిష్కరించేందుకు అనేక చర్యలు తీసుకుంటోందన్నారు. దాతలు ముందుకు వచ్చి దాహార్తికి సహాయ సహకారాలు అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆయనతోపాటు తెలుగుదేశంపార్టీ రాష్ట్ర కార్యనిర్వాహణ కార్యదర్శి ఎస్.గోవర్ధన్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బి.హరిప్రసాద్, పార్టీ కార్యాలయ మేనేజర్ టి.వెంకటశివారెడ్డి, టిడిపి నాయకులు పాల్గొన్నారు.

జూన్ నుంచి మద్యం అమ్మకాలు

కడప,ఏప్రిల్ 28: జిల్లాలో ఇటీవల 255 మద్యం షాపులకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం, 238 మద్యం షాపుల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారు. మరో 17 మద్యం షాపులకు శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేయగా వచ్చేనెల 3లోపు మద్యంపాపులు కావాలనుకునే వ్యాపారులు ఆన్‌లైన్‌లో సంబంధిత అధికారులు దరఖాస్తులు కోరారు. వచ్చేనెల 4న పాతకలెక్టరేట్‌లో మధ్యాహ్నం 2గంటలకు లాటరీ పద్ధతిలో మద్యం షాపులు ఎంపిక చేయనున్నారు. వచ్చే జూన్ 1వ తేదీ నుంచి కొత్తగా మద్యం షాపులు దక్కించుకున్న వ్యాపారులు మద్యం దుకాణాలు నడపనున్నారు. జిల్లాలో రాజంపేట పరిధిలో 9 దుకాణాలు, సిద్దవటం పరిధిలో 4 దుకాణాలు, ఎర్రగుంట్ల పరిధిలో 3 దుకాణాలు, జమ్మలమడుగు పరిధిలో ఒక దుకాణానికి నోటిఫికేషన్ జారీ చేశారు. అలాగే జిల్లాలో 12 బార్ల వ్యవహారంపై ఇంతవరకు న్యాయస్థానం ఎటు తేల్చనందుకు ప్రభుత్వం కూడా వాటికి ఇప్పట్లో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలు లేవు. ఒకపక్క మద్యం దుకాణాల్లో భారీగా నష్టాలు వస్తున్నాయని వ్యాపారులు అంటూనే మరో పక్క లక్షలాది రూపాయలు పెట్టి షాపులు దక్కించుకునేందుకు మరీ క్యూకట్టి దరఖాస్తులు చేసుకున్నారు. మద్యం దుకాణాల దరఖాస్తులకే ప్రభుత్వానికి రూ.25కోట్లు పైబడి ఆదాయం వచ్చింది. కొంతమంది మద్యం షాపులు దక్కించుకున్నవారు గుడ్‌విల్ తీసుకుని ఇతరులకు లక్షలాది రూపాయల లాభానికి అమ్మకాలు చేసినట్లు తెలుస్తోంది. చాలా మంది బ్రాందిషాపుల్లో ఆరితేరిన యజమానులు లోలోపల ఏటా తరహాలో ఈమారుకూడా సిండికేట్‌గా కన్పించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇక బెల్టుషాపుల విషయానికొస్తే ఈమారు 4వేలు పైబడే అవకాశాలున్నాయి. గ్రామ, మండల స్థాయిల్లో బెల్టు షాపులు నిషేధం నిమిత్తం కమిటీలు న్నా ఆ కమిటీలు ప్రేక్షక పాత్ర వహిస్తూ బెల్టుషాపులు యథేచ్చగా కొనసాగిస్తున్నారు. మొత్తం మీద జిల్లాలో మద్యం దుకాణాలకు మరీ పోటీపడి ఇప్పటి వరకు 238 దుకాణాలు దక్కించుకోగా మరో 17 దుకాణాలకు దరఖాస్తులు చేసుకోవాలని మద్య నిషేధం, ఆబ్కారీ జిల్లా అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు.

వేసవి దాహార్తి తీర్చేందుకు
దాతలు సహకరించాలి

కడప,ఏప్రిల్ 28: వేసవిదాహార్తి తీర్చేందుకు దాతలు ముందుకురావాలని, మానవసేవే మాధవసేవ అని శుక్రవారం నగరంలో జెసి శే్వత చలివేంద్రాలు ప్రారంభించి ప్రసంగించారు. ఎండలు రోజురోజుకు తీవ్రంగా ఉన్నాయని నిత్యం నగరానికి వచ్చేవారు, పాదాచారులు దాహార్తితో అలమటిస్తున్నారని వారి దాహార్తి తీర్చేందుకు ప్రతి ఒక్కరు చలివేంద్రాలు ఏర్పాటుచేసి ప్రజానీకాన్ని ఆదుకోవాలని ఆమె కోరారు. ప్రభుత్వం నీటి ఎద్దడి నివారణకు జిల్లాకు రూ.30కోట్లు కేటాయించిందని ఈనేపధ్యంలో సంబంధిత ప్రాంతాల్లో జలవనరులు లభ్యం కాని ప్రదేశాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని, నీటి ఎద్దడి గురించి అధికారులకు వెంటనే సమాచారం ఇవ్వాలని, వేసవిలో దాహార్తిని తీర్చేందుకు ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా గుఃర్తించాలని ప్రభుత్వం వంతుగా శాశ్వత పథకాలు చేపడుతున్నామని దాతలు కూడా భాగస్వామ్యమై వేసవిలో ప్రజలకు గుక్కెడు నీరు అందేలా సహకరించాలని ఆమె కోరారు. ప్రభుత్వం కూడా కడప నగరంలో చలివేంద్రాలు ప్రారంభిస్తున్నామని ప్రతి మండల కేంద్రంలోనూ సంబంధిత అధికారులు తాగునీరును ఏర్పాటు చేశామని దాతలు కూడా ముందుకు వచ్చి చలివేంద్రాలు ఏర్పాటుచేయడం వారి దాన గుణానికి గుర్తు అని ఆమె వారిని కొనియాడారు. జెసితోపాటు టిడిపి జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసులురెడ్డి (వాసు), పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శ బి.హరిప్రసాద్, రాష్టక్రార్యనిర్వాహక కార్యదర్శి ఎస్.గోవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మార్కెట్‌యార్డును ముట్టడించిన రైతులు

కడప,ఏప్రిల్ 28: కడప మార్కెట్‌యార్డులో పసుపుకొనుగోలు చేస్తున్న కేంద్రంలో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయాలని కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాధరెడ్డి రైతులతో కలిసి శుక్రవారం ముట్టడిచేశారు. పసుపు పంటకు మద్దతు ధర ఇచ్చి రైతులకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేశారు. వెంటనే అధికారులు జెసి శే్వతకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఆమె మార్కెట్‌యార్డుకు చేరుకుని పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా జెసితో ఎమ్మెల్యే పి.రవీంద్రనాథరెడ్డి మాట్లాడుతూ పసుపురైతులు తన నియోజకవర్గంలో అధికంగా ఉన్నారని, అధికారులు ఒకే కౌంటర్ ప్రారంభించి మేలి రకమైన పసుపు పంటకు క్వింటాలుకు రూ.6,500లు ఇవ్వాల్సివుంటే, రూ.6వేలు ఇస్తామని చెప్పడం పసుపు రైతులు మార్కెట్ యార్డుకు తీసుకొచ్చిన బస్తాలు ఆలస్యంగా తీసుకుని వాటిని తూకాలు వేసుకోవడంలో తీవ్రి జాప్యం చేస్తున్నారన్నారు. రైతులకు అందే పసుపురేటు వారి ఖర్చులకు సరిపోతుందని రైతులు రోజుల తరబడి వేచివుండాల్సి వస్తోందని ఆయన జెసి దృష్టికి తెచ్చారు. అంతేగాకుండా కొంతమంది సిబ్బంది తూకాల్లో వ్యత్యాసం చూపుతూ రైతులకు అన్యాయం చేస్తున్నారని గ్రేడింగ్ పేరుతో రైతులకు నష్టం కలిగిస్తున్నారని ఆయన ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఆమె అక్కడున్న మార్క్‌ఫెడ్ అధికారులు, సిబ్బంది, మార్కెట్ యార్డు అధికారులను ప్రశ్నించగా తమకు హమాలీల కొరత వుందని, అందువల్ల ఒకే కౌంటర్‌లో కొనుగోలు చేస్తున్నామని దీని వల్ల జాప్యం జరుగుతోందని జెసికి వివరించారు. ఎమ్మెల్యే, రైతులు జోక్యం చేసుకుని హమాలీలు కొరతగా ఉన్నారని అధికారులకు తెలిసి కూడా కౌంటర్లు తగ్గించడం, రైతులను అవస్థలకు గురిచేయడం భావ్యం కాదన్నారు. పొరుగున ఉన్న మార్కెట్ యార్డుల నుంచి హమాలీలను పిలిపించి కౌంటర్లు అధికంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో జెసి కూడా ఎమ్మెల్యే, రైతుల డిమాండ్ మేరకు హమాలీలను పిలిపించి అదనపు కౌంటర్లు ఏర్పాటుచేసి తూకాలు ఖచ్చితంగా వేసి నాణ్యత కలిగిన పసుపుకు క్వింటాలుకు రూ.6,500లు, నాణ్యతలేని పసుపుకు రూ.6వేలు చెల్లించాలని ఆమె అధికారులను ఆదేశించారు. దీంతో ఎమ్మెల్యే, రైతులు ఆందోళన విరమించడంతో సమస్య పరిష్కారమైంది.