కడప

కార్యకర్తలే పార్టీకి పట్టుకొమ్మలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జూన్ 6: పార్టీకి పట్టుకొమ్మలు కార్యకర్తలేనని పార్టీని పటిష్టం చేసేందుకు ప్రతి ఒక్కరు అంకితభావంతో పనిచేయాలని, 2019లో రానున్నది తమ ప్రభుత్వమేనని వైసిపి ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథరెడ్డి, ఎస్‌బి అంజద్‌బాషా, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏ.అమరనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్‌రెడ్డిలు పిలుపునిచ్చారు. కడప నగరం శివారులో మంగళవారం కమలాపురం నియోజకవర్గ వైసిపి నియోజకవర్గ కార్యకర్తలచే ఒక ప్రైవేట్ కల్యాణ మండపంలో ప్లీనరీని ఏర్పాటుచేశారు. ఆ సందర్భంగా వారు మాట్లాడుతూ బిజెపి, టిడిపిలు ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకు అందరూ అడ్డుతగులుతున్నారని రాష్ట్ర విభజన పాపం కాంగ్రెస్, టిడిపి, బిజెపిలదే నని హోదా దక్కకుండా అడ్డుకుంటున్నారని వారు ఆరోపించారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఏ జిల్లాలో పర్యటించినా ప్రజాదరణ చెక్కుచెదరలేదని, ఆయన సభలకు వచ్చే వారిని చూసి టిడిపి నేతలు జీర్ణించుకోలేక చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని, 2019లో తమ పార్టీ అధికారంలోకి రావడం తధ్యమన్నారు. ప్రతి కార్యకర్త, నాయకుడు ధైర్యంగా ముందుకుసాగాలని వారు పిలుపునిచ్చారు. రాష్టప్రతి ఎన్నికల్లో ఏకాభిప్రాయంతో పార్టీ మద్దతు ఇస్తామని తెలిపామే తప్ప తమనాయకుడిపై ఉన్న కేసులకోసం ప్రధాని మోదీని కలిశామని అబద్దమని కొట్టిపారేశారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపేరిట ప్రత్యేక గ్రాంట్లను తెలుగుతమ్ముళ్లకే నిధులు కేటాయించి వైసిపి ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వకుండా గ్రామాల్లో తమ పార్టీ కార్యకర్తలను వేధించడమే ధ్యేయంగా పెట్టుకున్నారని వాటిని కార్యకర్తలు, నాయకులు ఎదుర్కోవాలని , ఏ ఒక్కరు భయాందోళనకు గురికాకూడదని వారు సూచించారు. ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు అమలుకాని హామీలు ఇచ్చి గద్దెనెక్కి, ఎన్నికల అనంతరం ఆ హామీలు మరచి పబ్బం గడుపుతున్నారని వారు ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కమలాపురం నియోజకవర్గం నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.

బడుగుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కృషి

రాజంపేట టౌన్, జూన్ 6:బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాటు పడే తత్వం, పేదలకు సహాయం చేయాలనే మనస్థత్వం, అట్టడుగు వర్గాలకు మెరుగైన అవకాశాలు కల్పించాలనే తపనతో ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని విప్ మేడా వెంకట మల్లికార్జునరెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ ఆవరణలో నవనిర్మాణ దీక్ష ఐదవ రోజు కార్యక్రమంలో మేడా మాట్లాడుతూ గత మూడేండ్లగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేపట్టిందన్నారు. ఎన్టీఆర్ భరోసా క్రింద పింఛన్‌ను రూ. 200ల నుండి వెయ్యి రూపాయలకు పెంచిన ఘనత ఈ ప్రభుత్వానికి చెందుతుందన్నారు. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం ద్వారా యువత ఉన్నత విద్య అభ్యసించేందుకు, సివిల్ సర్వీసెస్‌లో ప్రతిభావంతులు ప్రతిభ చాటేందుకు ఎన్టీఆర్ ఉన్నత విద్యాధరణి పథకం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందులో బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులు విదేశాలలో పీజీ కోర్సులు చదువుకొనే అవకాశం కల్పించడమైందన్నారు. బీసీ విద్యార్థుల ఉన్నత విద్యాభివృద్ధికి ప్రతి నియోజకవర్గంలో ఒక బాలుర, బాలికల హస్టల్‌ను ఏర్పాటు చేసి ప్రతి జిల్లాలో రెండు ఎకరాల విస్తీర్ణంలో రూ. 5 కోట్లతో బీసీ భవనాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా ప్రభుత్వాసుపత్రులలో ఉచిత వైద్యపరీక్షలు చేయించడం, 104 వైద్యవాహనం ద్వారా గ్రామీణులకు వైద్యసేవలు, 108 వాహనం ద్వారా రోడ్డుప్రమాదాలలో గాయపడిన వారికి వైద్యసేవలు కల్పించడం జరుగుతుందన్నారు. అంతే కాకుండా రాష్ట్రంలో అనేక ఆస్పత్రులలో కోట్ల రూపాయలు వెచ్చించి వౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని, అందులో భాగంగా రాజంపేట పట్టణంలో కూడా దాదాపు రూ. 5.75 కోట్లతో నూతన ఆసుపత్రి భవనాన్ని నిర్మించడం జరుగుతుందని, అందులో ట్రామా కేర్ యూనిట్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అనంతరం టెన్త్‌లో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థిని, విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతుల క్రింద తన స్వంత నిధులతో ఒకొక్కరికి రూ. 5 వేలు అందజేసి, దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు. ఒంటిమిట్ట మండలంలో ఈ-పాస్ పథకాన్ని సద్వినియోగం చేసుకున్న వారిలో కొందరికి సెల్‌ఫోన్‌లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వీరబ్రహ్మం, నియోజకవర్గంలోని తహశీల్దార్‌లు, ఎంపిడిఓలు, వ్యవసాయ శాఖ ఏడి సుబ్బారావు, రాష్ట్ర కల్లుగీత కార్మికుల కార్పోరేషన్ డైరెక్టర్ కొమరా వెంకటనరసయ్య, టిడిపి నాయకులు గడ్డం జనార్థనరెడ్డి, పిసి యోగీశ్వరరెడ్డి, కుసుమకుమారి, ఎజిపి టి.లక్ష్మీనారాయణ, డాక్టర్ సి.సుధాకర్, కట్టా నారాయణ, బి.లక్ష్మీనరసయ్య, టి.సంజీవరావు, మదన్‌మోహన్‌రెడ్డి, దొరబాబు, సుధాకర్‌రాజు, బాపనయ్యనాయుడు, మనుబోలు వెంకటసుబ్బయ్య, సురేష్‌రాజు, వడ్డెర రమణ, కోవూరు సుబ్రమణ్యంనాయుడు, దొంకా సూరి, షేక్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.

బాలికల విద్యను ప్రోత్సహిస్తాం

కడప,జూన్ 6: బాలికల విద్యను ప్రోత్సహించేందుకు బాలికలు 9వ తరగతి నుంచే బడి మానకుండా వారికి జిల్లాలో 9257 సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని, రాష్టవ్య్రాప్తంగా 1.90లక్షల సైకిళ్లు పంపిణీ చేశామని ఎమ్మెల్సీ, టిడిపి జిల్లా పరిశీలకులు దొరబాబు పేర్కొన్నారు. కలెక్టరేట్ సభాభవన్‌లో నవనిర్మాణదీక్ష 5వ రోజైన మంగళవారం ఆయన ముఖ్యఅతిధిగా హాజరై ప్రసంగించారు. ఎస్సీ,ఎస్టీ, బిసి, మైనార్టీ ఇతర వెనుకబడిన వర్గాల వారికి ఉన్నత విద్యనభ్యసించేందుకు ఒక్కొక్కరికి రూ.10లక్షలు రుణసౌకర్యం కల్పిస్తున్నట్లు ఆయన గుర్తు చేశారు. 35సంవత్సరాలు పైబడిన మహిళలకు ప్రభుత్వాసుపత్రిలో మాస్టర్ హెల్త్ చెకప్‌ను ఉచితంగా చేయిస్తున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వాసుపత్రిల్లో ప్రసవం జరిగితే ఎన్‌టిఆర్ బేబి కిట్స్ అందిస్తున్నామన్నారు. 2019 నాటికి జిల్లాలో అన్ని గ్రామాలకు నీరు అందించి హార్టికల్చర్ హబ్‌గా జిల్లాను మార్చడమే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్యేయమన్నారు. రాష్ట్రంలో 18 మంది సివిల్స్‌లో ర్యాంకు సాధించడం పై ఆయన విద్యార్థులను కొనియాడారు. అలాగే కలెక్టర్ బాబూరావునాయుడు మాట్లాడుతూ మానవవనరుల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగ కల్పన, తాగునీరు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల గృహనిర్మాణం, విద్యుత్, రోడ్‌నెట్ వర్క్ అంశాలపై జిల్లాలో సాధిస్తున్న ప్రగతిని సంబంధిత అధికారులచేత వివరించారు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ ఎం.లింగారెడ్డిమాట్లాడుతూ నైపుణ్యాభివృద్ధిపై ఆరోగ్యం, వౌలిక సదుపాయాలు కీలక అంశాలని విద్య ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవచ్చునని, ప్రతి వ్యక్తి తనకున్న బలహీనతలు తెలుసుకుని క్రమశిక్షణ, దీక్షపట్టుదలతో ఎదిగేందుకు కృషి చేయాలని కోరారు. రాష్ట్రంలో 20శాతం ఇంజనీరింగ్ డిగ్రీ చదివిన యువత ప్రైవేట్ రంగంలో ఉపాధి పొందుతున్నారని, 80శాతం నైపుణ్యతపై అవగాహన కల్గినప్పుడే ఉపాధి అవకాశాలుంటాయన్నారు. కమ్యునికేషన్ స్కిల్స్ ద్వారా నైపుణ్యతపై శిక్షణ పొందాలని కోరారు. అలాగే వైవియు కార్యవర్గ సభ్యుడు ఎస్.గోవర్దన్‌రెడ్డి మాట్లాడుతూ విద్యలేనిదే మనం ఏమీ సాధించలేమని గుర్తించిన ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి అనేక విద్యాసంస్థలను తీసుకొచ్చారని అందులో తిరుపతిలో ఐఐటి, ఐఐఎస్‌ఆర్, మంగళగిరిలో ఎయిమ్స్, వైజాగ్‌లో ఎన్‌ఐటి, ఐఐఎం, అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ, కర్నూలులో ఉర్దూయూనివర్సిటీ రావడానికి కృషిచేశారన్నారు. ఆరోగ్యపరంగా విద్యాపరంగా రాష్ట్రాన్ని మొదటి స్థానంలో ఉంచేందుకు నాలెడ్జ్ హబ్‌గా చేస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో సివిల్స్‌లో గత మూడు సంవత్సరాల్లో ఎక్కువ సంఖ్యలో టాపర్లు వస్తున్నారన్నారు. ఈసందర్భంగా 100డెస్క్‌లను కడప జిల్లాలోని పాఠశాలలకు మరో 10రోజుల్లో వితరణ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. డిఇవో శైలజ మాట్లాడుతూ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యాశాఖలో సాధిస్తున్న విజయాలను వివరించారు. జిల్లాలో 457 పాఠశాలల్లో 4,15,462 మంది విద్యార్థులు చదువుతున్నారని గుర్తు చేశారు. మధ్యాహ్న భోజనం పథకం కింద 2,16,795మంది లబ్దిపొందుతున్నారని, 2014-15, 2015-16వ సంవత్సరంలో రాష్ట్రంలో 10వ తరగతిలో మొదటి స్థానాన్ని, 2016-17లో విద్యాశాఖ మూడవ స్థానాన్ని కైవసం చేసుకుందన్నారు. ప్రతిభా అవార్డులు ఒక్కొక్క పాఠశాల నుంచి ఎంపికచేసి రూ.5వేలు చొప్పున బహూకరిస్తున్నామని తెలిపారు. ట్రిపుల్ ఐటిలో కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాల్లో 35మంది సీటు సాధించారన్నారు. జెసి -2, డిఆర్‌డిఏ పిడి శివారెడ్డి మాట్లాడుతూ విద్య, ఆరోగ్యంతో పాటు నైపుణ్యాలున్నప్పుడే ఆ దేశం పారిశ్రామికంగా సాంకేతికపరంగా అభివృద్ధి చెంది ఉన్నత స్థాయికి చేరుకుంటుందన్నారు. ప్రభుత్వం గత మూడు సంవత్సరాలలో డిఆర్‌డిఏ ద్వారా యువతలో నైపుణ్యాభివృద్ధి పెంచేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోందని గుర్తు చేశారు. ఈకార్యక్రమంలో డిఎంహెచ్‌ఓ రామిరెడ్డి, డిసిహెచ్‌వో జయరాజన్, ట్రాన్స్‌కో ఎస్‌ఇ శివప్రసాద్‌రెడ్డి, టిడిపి జిల్లా ప్రధానకార్యదర్శి బి.హరిప్రసాద్, విద్యాశాఖ ఆర్‌జెడి ప్రతాప్‌రెడ్డి, ఉపాధిహామీ కౌన్సిల్ సభ్యుడు పీరయ్య, ఏపిఎంఐసి పిడి మధుసూధన్‌రెడ్డి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

రెండవ రోజూ యల్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు
సుండుపల్లె, జూన్ 6: మండల పరిధిలోని రాయవరంలో వెలిసిన యల్లమ్మ అమ్మవారి జాతరలో భాగంగా రెండో రోజు మంగళవారం అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు చేయించారు. జాతరలో భాగంగా వివిధ గ్రామాల భక్తులు అమ్మవారికి ప్రత్యేకంగా అభిషేకాలు, కుంకుమార్చనలు అర్చనలు చేయించుకున్నారు. అమ్మవారిని పూలతో పాటు నిమ్మకాయలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. బుధవారం పగలు పూజలు, రాత్రికి తిరుణాల ఉత్సవాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.

రాహుల్ సభ సక్సెస్
బిజెపి, టిడిపి గుండెల్లో రైళ్లు..

కడప,(కల్చరల్)జూన్ 6: గుంటూరులో ఆదివారం జరిగిన కాంగ్రెస్ ప్రత్యేక హోదా భరోసా సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి సక్సెస్ కావడంతో బిజెపి, టిడిపిల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ నజీర్ అహ్మద్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఇందిరాభవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సభలో రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణల్లో నిజంలేదని బిజెపి, టిడిపి నాయకులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బిజెపి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులు తిరుపతిలో శ్రీ వేంకటేశ్వరస్వామి సన్నిధిలో ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తామని, మోసం చేసింది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుందనే విషయం పిల్లలు నుంచి పెద్దల వరకు ఎవరిని అడిగినా చెబుతారన్నారు. ప్రత్యేక హోదా కంటే వంద రెట్లు అధికంగా మేలు చేస్తున్నామని వెంకయ్యనాయుడు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా ఇస్తేచాలు అధిక మేలు అవసరం లేదని ఏపి ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ప్రత్యేకహోదా ముగిసిన అధ్యయనం అని టిడిపి, బిజెపి పార్టీల నాయకులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
ప్రత్యేకహోదా టిడిపి, బిజెపి పార్టీల భవిష్యత్ ముగిసిన అధ్యయనం అని తెలుసుకోవాలన్నారు. ఈసమావేశంలో పిసిసి జాయింట్ సెక్రటరీ కర్నాటి చంద్రశేఖర్‌రెడ్డి, సేవాదల్ చైర్మన్ చీకటి చార్లెస్, క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ విజయభాస్కర్, ప్రధాన కార్యదర్శి జోడు నాగరాజు, కార్యదర్శి అబ్దుల్‌రౌఫ్, మైనార్టీ నాయకులు అల్లాబకష్, రహీముల్లాబాషా, గౌస్‌మొద్దీన్, ఓబిసి నాయకులు సుంకేసుల బాదుల్లా, పెద్దన్న తదితరులు పాల్గొన్నారు.

పశువులకు గ్రాసం కొరత.!

సుండుపల్లె, జూన్ 6: తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో మూగజీవాలకు మేత, నీళ్లు కరువయ్యాయి. పచ్చగడ్డి మాట ఎలా ఉన్నా ఎండుగడ్డి కూడా దొరక్కపోవడంతో పశువులను ఎలా పోషించాలో రైతులకు పాలుపోవడం లేదు. ఓ వైపు దాణా ధరలు, మరోవైపు ఎండు గడ్డి ధరలు రైతులను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఒక ట్రాక్టర్ గడ్డిని రూ.10 వేల వరకు వెచ్చించి కొంటున్నారు. కొనలేని వారు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. మరికొందరు విధిలేని స్థితిలో పశువులను అమ్ముకుంటున్నారు. గ్రామాలకు పట్టుకొమ్మగా నిలిచే పశుపోషణ నేడు భారంగా మారింది. ఒకప్పుడు పాడి పశువులతో కళకళలాడే గ్రామాలు నేడు వాటి ఉనికిని కోల్పోతున్నాయి. సాధారణంగా గ్రామాల్లో వ్యవసాయం తరువాత పశుపోషణకే పెద్ద పీట వేస్తారు. వరుసగా రెండేళ్ల తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడటంతో పంటలు పండక అన్నదాతలు నష్టపోయారు. రైతులకు ఆసరాగా ఉన్న మూగజీవాలు సైతం కరవు కోరల్లో చిక్కుకొని గ్రాసం కొరతతో అల్లాడుతున్నాయి. దీంతో పాడిపై ఆధారపడిన పశుపెంపకదారులు పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గి ఆందోళన చెందుతున్నారు. పూటకు ఐదు లీటర్లు ఇచ్చే ఆవులు, గేదెలు ప్రస్తుతం 2 లీటర్లు మాత్రమే ఇస్తున్నాయని పాడి రైతులు వాపోతున్నారు.
ఆకాశాన్నంటిన పశుగ్రాసం ధరలు..
వ్యవసాయం భారంగా మారింది. ప్రత్యామ్నాయం వైపు దృష్టి సారించే రైతులకు పాడి పశువుల పెంపకం ఆసరాగా కనిపించింది. వర్షాకాలంలో వరి, వేరుశనగ పంటలు సాగు చేసే రైతులు వీటి ద్వారా లభించే గడ్డిని వేసవిలో పశుగ్రాసంగా వినియోగించడం పరిపాటి. ఇప్పుడు పరిస్థితులు మారాయి. అరకొర వర్షాలతో వరిసాగు పడిపోయింది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని మూగజీవాలకు దాహార్తీ కరువయ్యాయి. పచ్చగడ్డి మాట ఎలా ఉన్నా ఎండుగడ్డి కూడా దొరక్కపోవడంతో పశువులను ఎలా పోషించాలో గోశకులకు పాలుపోవడం లేదు. ఒక ట్రాక్టర్ గడ్డిని రూ.10 వేల వరకు వెచ్చించి కొంటున్నారు. కొనలేని వారు ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
పల్లెలకు ప్యాకెట్ పాలు..
సుండుపల్లె మండల పరిధిలోని పాడిపై ఆధారపడి జీవనం సాగించే వారి పరిస్థితి దారుణంగా మారింది. మేతలేక పాల దిగుబడి పడిపోవడంతో చేసేది లేక కొందరు పశువులను అమ్మేసి ఇతర పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. దీంతో పల్లెల నుండి పట్టణాలకు పాలను సరఫరా చేసే రోజులు పోయి గ్రామాలు, పాల ప్యాకెట్లపై పెరుగు, మజ్జిగ ప్యాకెట్లపై ఆధారపడే పరిస్థితులు తలెత్తుతున్నాయి. దీనికితోడు పాల ప్యాకెట్ల ధరలు అధికంగా ఉండటంతో సామాన్యుడికి మరింత భారంగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పశుగ్రాసం కొరతను తీర్చాలని పాడి రైతులు కోరుతున్నారు.

వైద్యమిత్రలను యథావిధిగా కొనసాగించాలి
రాయచోటి, జూన్ 6: డాక్టర్ ఎన్‌టిఆర్ వైద్యసేవ పథకంలో పనిచేస్తున్న వైద్యమిత్రలు ఇతర సిబ్బంది విద్యార్హతల్లో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించి తమను యథావిధిగా కొనసాగించాలని సదరు తీర్పుపై ఫ్రభుత్వం సుప్రీంకోర్టు చేసిన అప్పీలును వెనక్కి తీసుకోవాలంటూ ఆ పథక ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొండేటి ప్రసాద్‌నాయుడు ఆధ్వర్యంలో వైద్యమిత్రలు ఎమ్మెల్సీ సత్యనారాయణరాజును కోరారు. మంగళవారం రాయచోటికి వచ్చిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రాజును నియోజకవర్గంలోని వైద్యమిత్రలు కలిసి తమ గోడును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని అభ్యర్థించారు. తాము పథకం ప్రారంభం నుండి పనిచేస్తన్నామనీ, పథకంలో పనిచేస్తున్న సిబ్బంది సమిష్టి కృషి వల్లే పథకం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. దేశంలోని పలు సర్వే సంస్థలు వైద్యమిత్రల కృషి ప్రశంశనీయమని పేర్కొన్నాయన్నారు. ప్రభుత్వం తమ స్థానాల్లో ఉన్నత, నర్సింగ్ విద్యార్హతలు కావాలని 2016లో జీవో నెంబర్ 28ని విడుదల చేసిందన్నారు. సదరు జీవో వల్ల తాము రోడ్డున పడతామని ప్రభుత్వానికి విన్నవించుకున్నా ఫలితం కలగకపోయేసరికి విధిలేని పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయిస్తే గౌరవ హైకోర్టు వారు పూర్తి స్థాయిలో విచారించి సదరు జీవోను రద్దు చేస్తూ తమను యథావిధంగా కొనసాగించాలని తీర్పు ఇచ్చిందన్నారు. సదరు తీర్పును ప్రభుత్వం అమలుపరచకుండా సుప్రీంకోర్టుకు వెళ్లి అప్పీలు చేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు స్థాయిలోనే తాము ఆర్థిక, మానసిక ఇబ్బందులకు గురయ్యామని, ఇక ప్రభుత్వంతో పోరాడే శక్తి, ఓపిక లేదని విన్నవించారు. ప్రభుత్వం ఒక వైపు సుప్రీంకోర్టులో అప్పీలు చేసి మరోవైపు నర్సింగ్ విద్యార్హలతో ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయడం ధర్మం కాదన్నారు. ప్రభుత్వం తమపై కరుణించి, తమ విషయంలో సుప్రీంకోర్టులో చేసిన అప్పీలు పిటీషన్‌ను వెనక్కి తీసుకునేలా మీ వంతు కృషి చేయాలంటూ వారు ఎమ్మెల్సీ సత్యనారాయణరాజుకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో వైద్యమిత్రలు చెన్నక్రిష్ణయ్య, శ్రీనివాసులు, గిరిజ, ప్రసన్నలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

పగుళ్లుబారుతున్న గ్రామీణ రోడ్లు!

చెన్నూరు, జూన్ 6: మండలంలో రాష్ట్రప్రభుత్వం అభివృద్ధి పనులకు గ్రామీణ ఉపాధిహామీ పథకం పనులు లింక్‌చేయడంతో మెటల్ రోడ్లు, సిసిరోడ్లు ఆయా గ్రామపంచాయతీల్లో అధ్వాన్నంగా చేపడుతుండటంతో అలాగే పనులకు ఉపాధి కూలీలను వినియోగించకుండా యంత్రాల ద్వారా ఏర్పాటుచేయడంతో అనేకచోట్ల మెటల్ రోడ్లు నాసిరకంగా దర్శనమిస్తున్నాయి. పలు చోట్ల సిసి రోడ్లు కూడా అధ్వాన్నంగా వేయడంతో రోడ్లు బీటలు బారుతున్నాయి. మండలంలో చెన్నూరు పరిధిలో భవానీనగర్, సరస్వతి కాలనీ, మెయిన్‌రోడ్డు, అరుంధతి కాలనీ, కెసి కెనాల్ రోడ్డు తదితర ప్రాంతాల్లో రోడ్లు అధ్వాన్నంగా ఏర్పడటం, సిసి రోడ్లు మద్యలో పగుళ్లు బారడంతో ప్రజలు విమర్శిస్తున్నారు. నాసిరకంగా కంకర, సిమెంట్ వాడటంతోనే రోడ్లు పగుళ్లు బారుతున్నాయని విమర్శిస్తున్నారు. మండలంలో అంగన్వాడీ కేంద్రాలను పునాదుల నుంచి పాత రాళ్లు, నాసిరకం ఇటుకలు వాడారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. దీని కారణంగా అంగన్వాడీ కేంద్రాల్లో వౌలిక సదుపాయాలు సక్రమంగా ఏర్పాటు చేయకపోవడం తో అనేక ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక గ్రామపంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన గ్రంథాలయం కోసం రెండు విడతలుగా మొదటి విడతలో రూ.4లక్షలు, రెండవ విడతలో రూ.4లక్షలు మంజూరుకాగా మూడేళ్ల నుంచి గ్రంథాలయం నిర్మాణం పూర్తికాలేదు. దీంతో గ్రంథాలయ ఆవరణం పశువులకు నిలయంగా మారింది. ప్రస్తుతం గ్రంథాలయ భవనం పంచాయతీ భవనంలో కొనసాగుతోంది. స్థానిక బస్టాండ్‌లో కాంప్లెక్స్ రూమ్‌లు ఏర్పాటుచేశారు. ప్రస్తుతం కొంతమంది గదులను తమ ఇష్టానుసారంగా వాడుకుంటున్నారు. కానీ అధికారులు ఇంతవరకు గదుల విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మండలంలో జరుగుతున్న రోడ్లు, అంగన్వాడీ భవన నిర్మాణాలపై డివిజనల్ ఇంజనీరింగ్ అధికారి చంద్రశేఖర్‌రావును వివరణ కోరగా మండలంలో రోడ్ల నిర్మాణ పనుల్లో సక్రమంగా జరుగుతున్నాయని, స్థానిక భవానీనగర్‌లో సిసిరోడ్లు నెర్రలు బారిన విషయం తమ దృష్టికి వచ్చిందని ఈవిషయంపై సంబంధిత అధికారులకు తెలియజేశామన్నారు.