కడప

ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల బాదుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మలమడుగు, జూన్ 19: పర్యవేక్షించాల్సిన అధికార యంత్రాంగం ఉదాశీనత, ప్రశ్నించాల్సిన పాలకులవౌనం వెరసి ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు వరంగామారింది. పేద కుటుంబాలకు చదువు రానురాను భారంగా మారుతోంది. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా వౌళిక పలుచోట్ల వౌళిక సదుపాయాలు లేక తల్లిదండ్రులు పిల్లలను సర్కారు బడులకు పంపకుండా ప్రైవేటు బడులవైపు చూస్తూంటే అక్కడా అందిన కాడికి బాదుడు తప్పడం లేదు. అడ్మిషన్ ఫీజు మొదలు, తరగతులకు, రవాణాకు, పుస్తకాలకు ప్రత్యేక విద్యకు... ఇలా రకరకాలుగా ప్రైవేటుల్లో తల్లిదండ్రులను దోపిడీకి పాల్పడుతున్నారు. ఆబడి, ఈబడి అన్న తేడాలేదు. ప్రైవేటు పాఠశాలల్లో కాసింత పేరున్న ప్రతీ పాఠశాలదీ ఇదే తంతు. రాష్ట్ర ప్రభుత్వం 1994(జిఒ నెంబరు.1)లో ఒకసారి, 2008 (జిఒ నెంబరు.90, 91, 92)లో మరోసారి ప్రైవేటు విద్యాసంస్థల విషయమై జివోలను జారీ చేసింది. ఆయా జివోల్లో ఫీజుల నియంత్రణ విషయమై కొన్ని స్పష్టమైన ఆదేశాలను ఇచ్చింది. వాటిని పరిశీలిస్తే... జివోనెంబరు1: ఫీజు నిర్ణయించడానికి పాఠశాల చైర్మన్, ప్రిన్సిపల్, తల్లిదండ్రుల్లో ఇద్దరితో ఒక కమిటీని నియమించుకోవాలి. పాఠశాల తీసుకునే ఫీజులో ఐదు శాతం పాఠశాల మేనేజ్‌మెంట్ ఆదాయం తీసుకోవాలి. 15 శాతం ఫీజును పాఠశాల నిర్వహణ (అద్దె, విద్యుత్) ఖర్చులు, 15శాతం పాఠశాల అభివృద్దికి వినియోగించాలి. 50శాతం ఫీజును పాఠశాల సిబ్బంది వేతనాలుగా ఇవ్వాలి. 15శాతం ఫీజును పాఠశాల సిబ్బందికి బీమా సౌకర్యం, పిఎఫ్‌గా వినియోగించాలి. * జివో నెంబరు 90, 91, 92: ఫీజు నిర్ణయించే విషయమై జిల్లా విద్యాశాకాధికారి, ఓ స్వచ్చంద సంస్థ ప్రతినిథి, ప్రైవేటు విద్యాసంస్థల ప్రతినిథులతో కూడిన ఒక కమిటీని కలెక్టర్ నియమించాలి. ఈ కమిటీ పాఠశాలలను పరిశీలించి, వౌళిక సదుపాయాలు, పరిస్థితులు చూసింత ఫీజు వసూలుచేయాలో నిర్ణయిస్తుంది. ఇలా పాఠశాలలు ఎంత ఫీజు వసూలు చేయాలనే విషయం విద్యాసంత్సరం ఆరంభానికి ముందే ఒక ప్రకటన వెలువడాలి. ఈ ఉత్తర్వులను ఖచ్చితంగా అమలుచేస్తే జిల్లాలో నగర, పట్టణాల్లో రూ.18వేలు, గ్రామాల్లో రూ.12వేలుకు మించి వసూలు చేయరు. కానీ ప్రభుత్వం ఇచ్చిన జివోల విషయమే అధికారగణం మరిచిపోయినట్లు కనిపిస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఫీజుల విషయంలో ఆందోళన ఉన్నా ఈ ఏడాది కూడా కమిటి ఊసే కనిపించడం లేదు. 2009లో అప్పటి కేంద్ర ప్రభుత్వం విద్యాహక్కు చట్టాన్ని తీసుకువచ్చింది. దీనిలోనూ ప్రైవేటు పాఠశాలల ఫీజుల విషయం, పేద విద్యార్థులను చేర్చుకునే విషయమై స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. 25శాతం పేదపిల్లలకు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఉచిత విద్యను అందించాల్సి ఉన్నా మమ అనిపిస్తున్నాయి యాజమాన్యాలు. దీనిపై తల్లిదండ్రులకు పెద్దగా అవగాహన లేకపోవడం, అధికారగ యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తూండడంతో చట్టం కాస్తా అటకెక్కింది. ఇప్పటికైనా ప్రైవేటు బాదుడుపై విద్యాశాఖాధికారులు దృష్టి సారించి పేద పిల్లలకు కూడా కార్పొరేట్ విద్య అందే దిశగా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

2019లో అధికారం మనదే..

కడప,జూన్ 19: 2019లో అధికారం వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీదేనని పార్టీనేతలు, కార్యకర్తలు పార్టీకోసం కష్టపడి పనిచేయాలని జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో సోమవారం జరిగిన వైఎస్సార్ సిపి జిల్లా ప్లీనరీలో నేతలు పిలుపునిచ్చారు. ఈ ప్లీనరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి అధ్యక్షతన నిర్వహించగా ఈ సమావేశానికి కర్నూలు ఎంపి బుట్టా రేణుక, కడప ఎంపి వైఎస్ అవినాష్‌రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు ఎస్‌బి అంజద్‌బాషా, కె.శ్రీనివాసులు, ఎస్.రఘురామిరెడ్డి, పి.రవీంద్రనాథరెడ్డి, ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి తదితరులు హాజరై ప్రసంగిస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్.చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలో 600 హామీలు ఇచ్చారని ఆ హామీలన్నీ నెరవేర్చలేదని ఆ పార్టీ, ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని ఆరోపించారు. రైతులకు రుణమాఫీ జరగలేదని, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయలేదని ఆరోపించారు. ముఖ్యంగా రైతు సంక్షేమాన్ని, ప్రజాసంక్షేమాన్ని ఆ ప్రభుత్వానికి పట్టడం లేదని పచ్చచొక్కాలకే అభివృద్ధి పరిమితవౌతోందని వారు ధ్వజమెత్తారు. 2019లో అధికారంలోకి రావడం తధ్యమని, జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని అంతవరకు కార్యకర్తలు, అధికారపార్టీ నేతల హెచ్చరికలకు, బెదిరింపులకు తట్టుకుని పనిచేయాలని తమ పార్టీ అధికారంలోకి వస్తే రాజన్న పాలన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రాజన్నపాలనలో ప్రతి పేదవాడి మొఖంలో చిరునవ్వు, సంతోషం ఉండేదని అదే తరహాలో జగనన్న పాలన ఉంటుందని వారు స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ, 108, 104, అందరికీ పెన్షన్లు , అందరికీ ఆరోగ్యశ్రీ, అందరికీ రేషన్‌కార్డులు, అవసరమున్నవారందరికీ గృహనిర్మాణం, రైతులకు రుణాలు, ఫీజు రీయంబర్స్‌మెంట్ తదితర సంక్షేమ పథకాలు అమలు చేస్తామని, ఈపథకాలపై ప్రజల్లోకి తీసుకెళ్లాలని వారు పిలుపునిచ్చారు. కార్యకర్తలు, నాయకులు అధైర్యపడకుండా మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్లి 2019 ఎన్నికల వరకు ఓపిక పట్టి అన్నీ ఓర్చుకుని ధైర్యంగా పనిచేయాలని వారు విజ్ఞప్తి చేశారు. వచ్చేనెలలో గుంటూరులో జరిగే వైసిపి ప్లీనరీని విజయవంతం చేసేందుకు నేతలు, కార్యకర్తలు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.

దళితవాడలో రామాలయ నిర్మాణానికి భూమిపూజ

ఖాజీపేట,జూన్ 19: మండలంలోని సుంకేసుల దళితవాడలో టిటిడి నిధులతో రామాలయాన్ని నిర్మిస్తున్నట్లు జిల్లా ధర్మప్రచార మండలి కార్యదర్శి రామసుబ్బారెడ్డి తెలిపారు. సోమవారం సుంకేసుల గ్రామంలో రూ.5లక్షలతో రామలయ నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమానికి ధర్మప్రచార పరిరక్షణ సమితి సభ్యులు వెంకటసుబ్బారెడ్డి, భారవి, మాజీ ఎంపిపిలు కెవిపి సుబ్బన్న, శ్రీనివాసులురెడ్డి, సభ్యులు మాకం రామకృష్ణయ్య, వాసవీ క్లబ్ పరిపాలనాధికారి నారాయణ పాల్గొన్నారు.

నైతిక విలువలతో కూడిన విద్యనందించాలి

వల్లూరు,జూన్ 19: సమాజంలో విద్యార్థులకు నైతిక విలువలతో కూడుకున్న విద్యను అందించినప్పుడే దేశాభివృద్ధి జరుగుతుందని పుష్పగిరి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విద్యాశంకరభారతి అన్నారు. సోమవారం పవిత్రపుణ్యక్షేత్రం పుష్పగిరిలో పీఠం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పాఠశాలను పీఠాధిపతి, ఎంఇఓ లీలమ్మలు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం స్వామివారు మాట్లాడుతూ నేడు పాఠశాలలు కార్పొరేట్ హంగులతో దేశీయ విద్యను పక్కనఫెట్టి ఆధునిక విద్యపైనే మక్కువ చూపుతున్నారని కానీ విద్యార్థులకు నైతిక విలువలతో కూడుకున్న విద్యే ప్రమానికమన్నారు. కార్యక్రమంలో జడ్పిటిసి వీరారెడ్డి, మండల వైకాపా కన్వీనర్ శివకుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

నగదు రహిత లావాదేవీలకు
ప్రోత్సాహక బహుమతులు

గాలివీడు, జూన్ 19: ప్రభుత్వ చౌకదుకాణాలలోని నిత్యావసర సరుకులను నగదు రహిత లావాదేవీలు నిర్వహించిన రేషన్ కార్డుదారులకు ప్రోత్సాహక బహుమతులు అందించనున్నట్లు తహశీల్దార్ భవానీ పేర్కొన్నారు. సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో బోరెడ్డిగారిపల్లె ప్రభుత్వ చౌకదుకాణం నెం.3లో మహదేవపల్లె లక్ష్మిదేవికి, అరవీడు గ్రామం గాండ్లపల్లెకు చెందిన నాగేశ్వరకు తహశీల్దార్ సెల్‌ఫోన్లను అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి రేషన్‌కార్డుదారుడు కచ్ఛితంగా బ్యాంకు ఖాతా కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వం నగదురహిత లావాదేవీలకే అదిక ప్రాధాన్యత కల్పిస్తోందని ప్రతి ఒక్కరికీ నగదురహిత లావాదేవీలపై కనీస అవగాహన కలిగి ఉండాలన్నారు. జిల్లా స్థాయిలో నగదురహిత లావాదేవీలు నిర్వహించిన వారిని డ్రిప్ పద్ధతి ద్వారా ఎంపిక చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా మండలంలోని 39 ప్రభుత్వ చౌకదుకాణాల ద్వారా 2,865 మంది ముస్లిం మైనార్టీల వర్గాల వారికి రంజాన్ తోఫా పంపిణీకి చర్యలు తీసుకున్నట్లు తహశీల్దార్ పేర్కొన్నారు. ప్రతి మైనార్టీ కుటుంబానికి రంజాన్‌తోఫా అందిస్తామని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ యునీత్‌కుమార్‌రెడ్డి, వీఆర్‌వోలు రవీంద్రారెడ్డి, వెంకటనారాయణ, ఎఫ్‌పీ షాపు డీలర్లు హరినాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారానికి మేడా విశేష కృషి

రాజంపేట, జూన్ 19: రాజంపేట ఎమ్మెల్యే, విప్ మేడా మల్లికార్జునరెడ్డి ప్రత్యేక కృషితో సున్నపురాళ్లపల్లెలోని ప్రధానమైన గ్రామ సమస్యలు పరిష్కారం కావడంతో ఆ గ్రామస్తులు ఆనందం వ్యక్తంచేశారు. సోమవారం స్థానిక పార్టీకార్యాలయంలో మేడా మల్లికార్జునరెడ్డిని వారు దుశ్శాలువతో ఘనంగా సత్కరించారు. సున్నపురాళ్లపల్లె గ్రామానికి రూరల్ ఫీడింగ్ ద్వారా విద్యుత్ సరఫరాతో కలిగే సమస్యలను మేడాకు వివరించగా అర్భన్ ఫీడింగ్ క్రిందకు మార్పుచేయడంతో నిరంతరంగా విద్యుత్ సరఫరా అవుతుందని నూర్‌బాషా సంఘ నాయకులు మస్తాన్, వి.బాషా ఈ సందర్భంగా తెలిపారు. పాఠశాల విద్యార్థులకు అనువుగా క్రీడామైదానం మంజూరు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా మైనార్టీ నాయకులు గుల్జార్‌బాషా, షేక్ అబ్దుల్లా, అబూబకర్, ఖాజామోహిద్ధీన్, మదార్‌సాహెబ్ పాల్గొన్నారు.

ఎవరెస్ట్ అధిరోహించిన హరిప్రసాద్‌కు సన్మానం

కడప,జూన్ 19:ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేసిన ఓబులవారిపల్లె మండలం సంజీవపురం ప్రభుత్వ సాంఘిక సంక్షేమశాఖ రెసిడెన్షియల్ జూనియర్‌కాలేజి హాస్టల్ విద్యార్థి గానుగపెంట హరిప్రసాద్‌ను కలెక్టర్ టి.బాబూరావునాయుడు ఘనంగా సత్కరించారు. సోమవారం మీకోసం సభామందిరంలో జరిగిన కార్యక్రమంలో ఈమేరకు అధికారులు సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అతిపిన్న వయస్సులోనే అత్యంత కఠినమైన హిమాలయ పర్వత శ్రేణులు అధిరోహించడం ఎంతో అభినందనీయమన్నారు. జిల్లా వాసులకు హరిప్రసాద్ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. హరిప్రసాద్ మాట్లాడుతూ కృష్ణాజిల్లా కేతరకొండ తర్వాత డార్జిలింగ్‌లో ఎవరెస్ట్ శిఖరం అధిరోహణంపై కఠిన శిక్షణ తీసుకోవడం, మే 18న అధిరోహణ యాత్ర ప్రారంభించి, 22వ తేదీ ఎవరెస్ట్ శిఖరం అంచులు చేరుకుని ఎనలేని ఆనందం పొందడం జరిగిందన్నారు. ఎవరెస్ట్‌శిఖరం చేరుకున్న మే 22వ తేదీ తన పుట్టినరోజు కూడా కావడం యాధృచ్చికం అన్నారు. ఎవరెస్ట్ ఎక్కిన తీరును, పడిన కష్టాలను ఆయన గుర్తు చేశారు. ఈ శిఖరాన్ని అధిరోహించేందుకు 70మందికి శిక్షణ ఇచ్చారని అందులో 30మందిని ఎంపికచేసి ఫిట్‌నెస్ పరీక్షల అనంతరం 16మంది ని ఎంపిక జేశారన్నారు. ఎవరెస్ట్ శిఖరం వద్దకు వెళ్లగా అక్కడ వైద్యపరీక్షలు నిర్వహించి 13మందిని మాత్రమే శిఖరం ఎక్కేందుకు అనుమతించారన్నారు. ఎక్కిన 13మందికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక్కొక్కరికి రూ.10లక్షలు చొప్పున రివార్డు ఇవ్వడానికి ప్రకటించారని గుర్తుచేశారు. కళాశాల ప్రిన్సిపాల్, అధికారుల సహాయ సహకారాల కారణంగానే ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడం జరిగిందన్నారు. అనంతరం హరిప్రసాద్ వారి తల్లిదండ్రులను, కలెక్టర్,జెసి శే్వతతెవతియలు శాలువకప్పి జ్ఞాపికతో సత్కరించారు. కార్యక్రమంలో జెసి-2 శివారెడ్డి, డిఆర్వో నరసింహారావు, బిసి కార్పొరేషన్ ఇడి రామచంద్రారెడ్డి, హాస్టళ్ల జిల్లా కో-ఆర్డినేటర్ నిర్మల, ప్రిన్సిపాల్ మోహన్‌రాజు పాల్గొన్నారు.

మీకోసం వినతులు పరిష్కరించండి

కడప,(కల్చరల్)జూన్ 19: మీకోసం కార్యక్రమానికి వచ్చే ప్రజావినతులు అధికారులు పరిశీలించి సానుకూలంగా పరిష్కరించాలని కలెక్టర్ టి.బాబూరావునాయుడు అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని మీకోసం భవనంలో మీకోసం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు ప్రజావినతుల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధచూపి సకాలంలో వినతులు పరిష్కరించాలని జాప్యం తగదన్నారు. వినతులు సమర్పించిన వారిలో కడపనగరానికి చెందిన జయంతి తనకు ఎన్‌టిఆర్ గృహనిర్మాణం పథకం కింద ఇళ్లు మంజూరు చేయాలని, దువ్వూరు మండలం కె.సుందర్‌రావు తనకు 69సంవత్సరాలు వయస్సు అని ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థికసహాయం చేయాలని, చక్రాయపేట మండలం చిలేకాంపల్లె గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి తన గ్రామంలో ఉన్న హైస్కూల్‌కు ప్రహరీగోడ నిర్మించాలని ఒంటిమిట్టమండలం కొత్తమాధవరానికి చెందిన ప్రసాద్ కొత్తమాధవరంలో మద్యం షాపును వేరేచోటికి మార్చాలని అభ్యర్థించారు. వేంపల్లె మండలం బక్కన్నగారిపల్లెలో ఏ.బాలయ్య తన గ్రామంలో ఉన్న ఐదు ఎకరాలు భూ ఆక్రమణను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్‌కు విన్నవించారు. కార్యక్రమంలో జెసి శే్వత, జెసి-2 శివారెడ్డి, స్పెషల్ కలెక్టర్ నాగేశ్వరరావు, డిఆర్వో నరసింహారావు, అధికారులు పాల్గొన్నారు.