కడప

కొత్త ఎస్పీ బాపూజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జూన్ 20: అందరూ ఊహించినట్లుగానే జిల్లా పిహెచ్‌డి రామకృష్ణను నెల్లూరుకు బదిలీ చేయగా, కడప ఎస్పీగా విశాఖపట్నం రూరల్ ఓఎస్‌డిగా పని చేస్తున్న బాపూజీని నియామకం చేస్తు మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. అదే విధంగా కడప ఓఎస్‌డి ఆపరేటర్ సత్యయేసుబాబుకు పదోన్నతి కల్పిస్తు ప్రకాశం జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు. బాపూజీ ఓఎస్‌డి నుంచి పదోన్నతి పొంది కడప ఎస్పీగా వస్తున్నారు. ఇక్కడ పని చేస్తున్న సత్యయేసుబాబు, బదిలీపై వస్తున్న బాపూజీ ఇరువురు ఒకేమారు ఎంపిక అయ్యారు. సత్యయేసుబాబు స్థానంలో ఓఎస్‌డిగా ప్రస్తుతం ఎవరిని నియామకం చేయలేదు.

జిల్లాలో 50లక్షల మొక్కల పెంపకం సాధ్యమయ్యేనా?

కడప,జూన్ 20: రాష్ట్రం కన్నులపండువగా నిర్వహించే వనమహోత్సవ కార్యక్రమం 68వ వనమహోత్సవం త్వరలో చేపడుతున్న తరుణంలో ఈ ఏడాది 50లక్షల మొక్కల పెంపకమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంగళవారం అధికారులు ప్రణాళికలు రూపొందించారు. గత ఏడాది కోటి మొక్కల పెంపకం లక్ష్యంగా పెట్టుకుని కేవలం 29లక్షలు మొక్కలు మాత్రమే నాటినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ 29లక్షల మొక్కలు నాటేందుకు రూ.కోటి పైబడి ఖర్చుచేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. అయితే ఇంతవరకు గత ఏడాదిలో మొక్కలు నాటిన అటవీశాఖ, సామాజిక అటవీ విభాగం అన్ని ప్రభుత్వశాఖలు ముఖ్యంగా పాఠశాలల ఆవరణలోనూ పురపాలక సంఘాల పరిధిలోనూ గత ఏడాది నేతలు మొక్కలునాటేందుకు క్యూకట్టి అధికారులు, నేతలు ఫోజులతో ఫొటోలు తీసుకున్న ఆ మొక్కల్లో చాలావరకు నిట్టనిలువునా ఎండిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఏడాది అటవీశాఖ, డ్వామా 10లక్షల మొక్కలు, డిఆర్‌డిఏ 5లక్షల మొక్కలు, హౌసింగ్ 2లక్షల మొక్కలు, సాంఘిక సంక్షేమశాఖ 2లక్షలు, విద్యాశాఖ 4లక్షలు, జిల్లాలోని ఎనిమిది మున్సిపాల్టీల్లో 10లక్షలు మొక్కలు, పోలీసు, పరిశ్రమలశాఖ 2లక్షలు మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రూపొందించారు. జిల్లాలో 20 ప్రభుత్వ నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నారు. మొక్కల పెంపకానికి, ఖర్చుకు పొంతన కుదరడంలేదు. మొక్కల నర్సరీల పెంపకాల్లో అడుగడుగునా అవకతవకలుగా ఉన్నట్లు తెలిసింది. నర్సరీ పెంపకాల్లో నిర్వాహకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వెరసి మొక్కల పెంపకం లెక్కలు కాగితాలకే పరిమితవౌతున్నాయి. ఏటా మొక్కల పెంపకానికి రూ.కోటి నుంచి రూ.3కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. ప్రతి వనమహోత్సవం సందర్భంగా ఏటా విస్తారంగా మొక్కలు పెంచేందుకు లక్ష్యం రూపొందించడం, ఆ లక్ష్యం మేరకు ఇంచుమించు మొక్కలు నాటినట్లు లెక్కలు రాసుకుని మొక్కల పేరిట కూడా కొంతమంది నిధులు స్వాహా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ మొక్కలు నాటినా వాటిని సంరక్షించేందుకు పురపాలక సంఘాలు, ప్రభుత్వ వసతిగృహాలు, విద్యాశాఖ తదితరులు శ్రద్ధ కనబరచని కారణంగా వర్షాకాలంలో కొంతమేరకు ఏపుగా పెరిగి వేసవిలో నిట్టనిలువునా ఎండిపోతున్నాయి. మొక్కల పెంపకాల్లో కూడా తప్పుల తడకలతో లెక్కవేసి లక్ష్యం పూర్తి చేసినట్లు అధికారులు చెప్పుకుంటున్నారు. గత ఏడాది కోటి మొక్కలు లక్ష్యంగా పెట్టుకుని కోటి 6లక్షల మొక్కలు నాటినట్లు వాటికి రూ.1.30 కోట్లు ఖర్చుచేసినట్లు లెక్కలు చూపారు. ఈ ఏడాది 50లక్షలు మొక్కలు నాటేందుకు కలెక్టర్ టి.బాబూరావునాయుడు జిల్లాలోని సంబంధిత అధికారులతో సమీక్షించారు. అయితే మొక్కలు నాటడం లక్ష్యం నెరవేరే వరకు అనుమానమే. ఈ పరిస్థితుల్లో పచ్చదనం పేరిట నిధులు దుర్వినియోగం చేయకుండా సంబంధిత అధికారులు పకడ్బంధీగా చర్యలు తీసుకుని మొక్కలు సక్రమంగా నాటేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని మేధావులు డిమాండ్ చేస్తున్నారు.
వనమహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

కడప,జూన్ 20: జిల్లాలో 68వ వన మహోత్సవ కార్యక్రమానికి 50లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ టి.బాబూరావునాయుడు ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని మీ కోసం సభాభవన్‌లో 68వ వనమహోత్సవ కార్యక్రమం ఏర్పాట్లపై అధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రణాళిక బద్దంగా చర్యలు తీసుకుని 50లక్షల మొక్కలు నాటి వాటిని సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని అందుకు సంబంధించి ఆయా ప్రాంతాలను గుర్తించాలని ఆదేశించారు. అధికారులు నిర్ణీత ప్రొఫార్మాను అందజేసి పూరించి పంపాలన్నారు. పాఠశాల, కాలేజి విద్యార్థులను సమాయత్తం చేసి ఈకార్యక్రమంలో భాగస్వామ్యులను చేయాలన్నారు. అధిక సంఖ్యలో మొక్కలునాటి సంరక్షించిన పాఠశాల పిల్లలకు బహుమతుల కార్యక్రమం ఉంటుందన్నారు. మొక్కలు నాటి సంరక్షించేందుకు ముందుకు వచ్చిన వారికి స్వయం సహాయక సంఘాలకు సంబంధిత అధికారులు సహకరించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులతో మొక్కలు నాటించి ఒక్కొక్క విద్యార్థికి ఒక్కొక్క మొక్కను కేటాయించి వాటిని సంరక్షించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సామాజిక అడవులు డిఎఫ్ నరసింహులు, రాజంపేట డిఎఫ్ ఖాదర్‌వల్లీ, వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ ఠాగూర్‌నాయక్, సాంఘిక సంక్షేమశాఖ డిడి సరస్వతి, డిఇఓ శైలజ, ఫారెస్టు రేంజర్, ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.

ముస్లింల సంరక్షకుడు చంద్రబాబు

రాజంపేట, జూన్ 20:ముస్లింల సంరక్షకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒక్కరేనని ప్రభుత్వ విప్ మేడా వెంకట మల్లికార్జునరెడ్డి అన్నారు. స్థానిక జడ్పీ బాలికోన్నత పాఠశాలలో మంగళవారం జరిగిన రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మేడా మాట్లాడుతూ లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ముస్లింల కష్టాలు, నష్టాలు తెలుసుకుంటూ వారికి అండదండలు అందిస్తూ వస్తున్న ముఖ్యమంత్రి ముస్లింల సంక్షేమానికి, అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు కేటాయిస్తున్నారన్నారు. ముస్లిం హక్కులకు భంగం వాటిల్లకుండా రాష్ట్ర, దేశ స్థాయిలో కూడా అనుక్షణం స్పందించే ఏకైక నేత కూడా చంద్రబాబే అన్నారు. ముస్లింలలో పేదలు కూడా ధనవంతులతో సమానంగా రంజాన్ పండుగ జరుపుకోవాలన్న ఉద్దేశంతో రంజాన్ తోఫా అందజేస్తున్నారన్నారు. ముస్లింలకు రాజంపేటలో అతి పెద్ద ఈద్గా మైదానం అందించేందుకు, ఈ మైదానం అభివృద్ధికి నిధులు సమకూర్చడంలో కూడా ముఖ్యమంత్రి పూర్తిస్థాయి సహకారాన్ని అందించారన్నారు. ముస్లింల సంరక్షణకు, మశీదులు, ఈద్గాల అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలు, ప్రత్యేక నిధులు సమకూరుస్తున్న తెలుగుదేశం ప్రభుత్వంకు ముస్లింలంతా అండగా నిలవాలన్నారు. రంజాన్ తోఫా అందించే కార్యక్రమంలో పాల్గొనడం తనకెంతో సంతోషాన్నిస్తోందన్నారు. ప్రతి ముస్లిం రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని మేడా మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు. అనంతరం ముస్లింలకు ప్రభుత్వం అందిస్తున్న రంజాన్ తోఫాను మేడా వెంకట మల్లికార్జునరెడ్డి అందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్‌రెడ్డి, తెలుగుదేశం పార్టీలోని ముస్లిం మైనార్టీ నేతలు జి.గుల్జార్‌బాషా, షేక్ అబ్దుల్లా, ఖాజా మొహిద్దీన్, ముజఫర్ అహమ్మద్, పట్టణ టిడిపి అధ్యక్షుడు టి.సంజీవరావు, రూరల్ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యంనాయుడు, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి మనుబోలు వెంకటసుబ్బయ్య, రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి అడ్వైజరీ కమిటీ ఛైర్మెన్ పి.వి.రమణ, పార్టీ సీనియర్ నేతలు శవన వెంకటసుబ్బానాయుడు, మలిశెట్టి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

శిల్పసంపదను భావితరాలకు అందించాలి

ఒంటిమిట్ట, జూన్ 20:ప్రస్తుతం ఒంటిమిట్ట రామాలయంలో ఉన్న ఆలనాటి శిల్పసంపదను నేడు మనమందరం చూస్తున్నామంటే అది కేంద్ర పురావస్తు శాఖ చలువేనని, ఇదే శిల్పసంపదను భావితరాల కోసం రక్షించాల్సిన బాధ్యత అందరిదని కేంద్ర పౌర విమానాల శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. మంగళవారం మధ్యాహ్నం ప్రొద్దుటూరుకు వెళ్తూ రామయ్యను మంత్రి దర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రభుత్వవిప్ మేడా మల్లికార్జునరెడ్డి, స్థానిక టిడిపి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మంత్రికి వేద మంత్రోచ్చరణల మధ్య అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. మంత్రి గజపతిరాజు ఆలయం చుట్టూ తిరిగి ఆలయ శిల్పసంపదను చూసి తన్మయం చెందారు. అనంతరం స్వామివారికి 20 నిమిషాల పాటు ప్రత్యేక పూజలు జరిపారు. తర్వాత మంత్రికి అర్చకులు ఆలయ చరిత్రను విపులంగా వివరించారు. ఈ సందర్భంగా విలేఖరులు రామాలయంలో అభివృద్ధి పనులు జరిగే సమయంలో కేంద్ర పురావస్తు శాఖ అడ్డంకులు సృష్టించడంతో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదని ఆయన దృష్టికి తీసుకెళ్లగా మంత్రి స్పందించి ఎంతో పురాతనమైన ఆలయాన్ని మనం చూస్తున్నామంటే అది పురావస్తు శాఖతో సాధ్యమైందన్నారు. దేశంలోని అన్ని పురాతన ఆలయాలలో శిల్పసంపదను కాపాడే శక్తి ఒక పురావస్తు శాఖకే ఉందన్నారు. పురావస్తు శాఖ అభివృద్ధి నిరోధకం కాదని, అద్భుతమైన శిల్పసంపదను కాపాడే రక్షక భటులు వంటి వారన్నారు. అలాగే ఒంటిమిట్ట రైల్వే సమస్యపై మంత్రి స్పందిస్తూ రైల్వేశాఖ తన పరిధిలో లేదని తాను కేవలం పౌర విమాన శాఖను మాత్రమే చూస్తున్నట్లు తెలిపారు. మరి కొన్ని ప్రశ్నలకు తాను రామయ్యను దర్శించేందుకే వచ్చానని ఇక్కడ ఏలాంటి ప్రశ్నలు వేయరాదన్నారు. ఆలయం వెలుపల కొంతమంది ముస్లింలు మంత్రికి ముస్లిం టోఫీ పెట్టి దుశ్శాలువతో సత్కరించారు. అంతకు ముందు కొంతమంది నాయకులు రామాలయం వెలుపల గజమాలతో సత్కరించేందుకు ఉండగా మంత్రి తిరస్కరించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు సిఎం రమేష్, డిఎస్పీ ఎ.రాజేంద్ర, రాష్ట్ర కల్లుగీత కార్పోరేషన్ డైరెక్టర్ కొమరా వెంకటనరసయ్య, బొడ్డే సుబ్బానాయుడు, గడ్డం జనార్ధన్‌రెడ్డి, తహశీల్దార్ శ్రీనివాసులరెడ్డి, ఎంపిడిఓ వెంకటప్రసాద్, సిఐ రవికుమార్, టిటిడి సిబ్బంది, టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.

అడ్డగోలుగా అనుమతులు..
జమ్మలమడుగు, జూన్ 20: స్థానిక అవసరాల కోసం మంజూరు చేసిన ఇసుక క్వారీల అనుమతులు ఇసుకాసురులకు వరంగా మారింది. అధికారయంత్రాంగం నిర్లక్ష్యం, పాలకుల ఉదాశీనత కారణంగా ఇప్పటికే పెన్నానది పందుల అడుగుల మేర తగ్గిపోయింది. పెన్నానదిలో ఇప్పటికే భూగర్భజలాల స్థాయి ప్రమాద హెచ్చరికలను తలపిస్తోంది. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు మున్సిపాలిటీలకు త్రాగు నీటిని అందించడానికి పెన్నానదిలో వేసిన బోర్లు అడుగంటిపోయాయం టూ ప్రతి ఏటా మైలవరం జలాశయం నుండి దక్షిణ కాలువల ద్వారా నీటి విడుదలలను చేపడుతున్నారు. మొన్న టి వరకు జమ్మలమడుగు పెన్నానదికి మైలవరం, ఉత్తర, దక్షిణ కాలువల ద్వారా నీటి విడుదలలను సమారు నెల రోజుల పాటు విడుదల చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇసుక క్వారీలకు అధికారంగా అంబవరం, పొన్నతోట ప్రాంతాల్లో అనుమతులను ఇచ్చారు. అయితే ఇచ్చిన క్వాంటిటీ పూర్తి కావడంతో మూసివేశారు. ఆ తరువాత కాలంలో అవసరాల నిమి త్తం అంటూ ఉచిత అనుమతులను ఇవ్వడంతో పెన్నానది పూర్తిగా కుంచించుకుపోయింది. ఇప్పటికే పెన్నానది కనుమరుగు కావడంతో పలు ప్రాంతా ల్లో పంటలు సాగుచేస్తున్నారు. తాజా గా స్థానిక అవసరాలంటూ మరోమారు జమ్మలమడుగు మండలంలో ఐదు క్వారీలకు అనుమతులు జారీ చేశారు. పొన్నతోట వద్ద 20వేలు, సున్నపురాళ్లపల్లె వద్ద 20వే లు, అంబవరం వద్ద 25వేలు, దేవగుడి వద్ద 20వేలు, సుగుమంచిపల్లె వద్ద 10వేలు క్యూబిక్ మీటర్లు చొప్పు న ఇసుకను తరలించడానికి అధికారులు అనుమతులను ఇచ్చారు. ఇసుక తరలింపుకు వేచివున్న దళారీలు అనుమతులను అడ్డం పెట్టుకొని పెన్నానదిలో ఎక్కడ పడితే అక్కడి నుండి ఇసుకను యథేచ్చగా తరలిస్తున్నారు. క్వారీల నుండి ఇసుక తరలింపుకు కఠినతర నిబంధనలు లేకపోవడం అక్రమార్కులకు వరంగా మారింది. దీంతో పట్టపగలే పట్టణంలో నుండి ఇసుకను ట్రాక్టర్లతో ఎటువంటి పట్టలు లేకుండా యథేచ్చగా తోలుకుంటున్నారు. పట్టణంలో ఎటువంటి పట్టలు లేకుండా తరలిస్తూండడంతో పట్టణంలోని రోడ్లపై ఇసుక పడుతూండడంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. పెన్నానదిలో భూగర్భజలాలు ప్రమాద ఘంటికలు మ్రోగిస్తున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ విషయంపై భవిష్యత్తులో ఇసుక విషయంపై కఠినతర నిర్ణయాలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం

కడప,జూన్ 20: యోగా జ్ఞానం యొక్క అంతర్భాగమని గత 5వేల సంవత్సరాలుగా భారతదేశంలో యోగాసనాలు మానవ జీవితంలో ఒక భాగంగా మిగిలి పోయాయని డిపార్ట్‌మెంట్ ఆఫ్ కమ్యూనిటీ మెడిషన్ ఫాతిమా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ సైనె్సస్ ప్రొఫెసర్ డాక్టర్ మహ్మద్ అజ్గర్ అలీ, అసిస్టెంట్ ఫ్రొఫెసర్ డా.చంద్రశేఖర్‌లు పేర్కొన్నారు. యోగాడే పురస్కరించుకుని మంగళవారం వారు మాట్లాడుతూ యోగాసనాల వల్ల శరీరం బరువు అదుపులోకి రావడం, ఊబకాయం తగ్గడం, రక్తపోటు అదుపులో ఉండటం, గుండెసంబంధిత వ్యాధులు నియంత్రించుకోవడం, మధుమేహం నియంత్రణలోకి రావడం, అస్తిపంజరం, కండరాల సమస్యలు రాకుండా యోగాభ్యాసం నయం చేస్తాయన్నారు. క్యాన్సర్‌వ్యాధి యొక్క ప్రభావం శరీరంపై పడకుండా ఒకవేళ పడినా ఆ వ్యాధి నుంచి బయటపడేందుకు యోగసనాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ప్రపంచదేశాలన్నీ జూన్ 21న జరిగే ప్రపంచయోగా దినోత్సవాన్ని జరుపుకునే సందర్భంగా మనదేశంలో ప్రతి ఒక్కరు ఈదినోత్సవాన్ని ప్రతిరోజు జరుపుకోవాలని వారు కోరారు. చాలా మంది యోగా అంటే శారీరక వ్యాయామం మాత్రమేనని కొన్ని ఆసనాలు, శ్వాసక్రియకు సంబంధమేనని భావిస్తున్నారని నిజానికి మానవుని యొక్క అనంతమైన మేధాశక్తి, ఆత్మశక్తుల కలయిక యోగా ద్వారా సంభవమన్నారు. విజ్ఞాన శాస్త్రం ప్రకారం యోగా అంటే పరిపూర్ణ జీవనసార విధానమని దీనిలో జ్ఞానయోగం, భక్తియోగం, రాజయోగం, ఖర్మయోగాలు ఉన్నాయన్నారు. అలాగే యోగాసనాలు శరీరానికి శక్తిని, ధృడత్వాన్ని ఇస్తాయని, పెద్దలైనా చిన్నవారైనా, ధృడంగా ఉన్నవారైనా లేనివారైనా ఆసనాలు వేసేందుకు ఇష్టపడాలన్నారు. సాధనచేస్తున్న కొద్దీ ఆసనాలు వెనుక ఉన్న అంతరార్థం అవగాహనకు వస్తుందని ఆసనంలో ఉంటూనే బాహ్యకరమైన శారీరక క్రమం నుంచి అంతరంగిక పరివకృత అనుభూతిలోకి వస్తుందన్నారు. ఈ ఆసనాలను ప్రతి ఒక్కరు అనుసరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజి సోషియల్ వర్కర్ కె.సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

సంక్షేమం మరచిన గురుకులం..

రాయచోటి, జూన్ 20: ప్రభుత్వం గురుకుల పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశాల జారీ చేయడమే తప్ప అవి అమలు చేయడం లేదని మున్సిపల్ చైర్‌పర్సన్ నసిబున్‌ఖానబ్ ఆరోపించారు. మంగళవారం మునిసిపల్ ఛైర్‌పర్సన్ నసీబున్‌ఖానమ్, కో ఆప్షన్ సభ్యులు సలావుద్దీన్‌లు కలిసి గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనాన్ని ఆమె తనిఖీ చేశారు. ఇలాంటి భోజనం మీ పిల్లలకు పెడతారని అని గురుకుల పాఠశాల సంక్షేమాధికారి శ్రీనివాసరావుపై మండిపడ్డారు. అంతేకాకుండా విద్యార్థులకు నీళ్లరసం, పలుచని పప్పు వడ్డించడం చూసి ఆమె అవాక్కయ్యారు. అదే విధంగా విద్యార్థులకు వడ్డించే అన్నంను తిన్నారు. ఈ అన్నంలో సున్నం కలిపి ఉండటాన్ని ఆమె గమనించి వార్డన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా విద్యార్థుల మరుగుదొడ్లను కూడా ఆమె పరిశీలించారు. మరుగుదొడ్లు కంపు కొడుతున్నట్లు తెలిపారు. ఈ గురుకుల పాఠశాలలో 152 మంది విద్యార్థులు ఉన్నారని, వారికి సరిపడా భోజనం కూడా వార్డన్ పెట్టడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా విద్యార్థులకు ప్రభుత్వం సూచించిన మెను ప్రకారం విద్యార్థులకు భోజన వసతులు ఏర్పాటు చేయాలని ఆమె తెలిపారు. ఇక ముఖ్యంగా విద్యార్థులు తాగే నీటితో పురుగుల ఉన్నట్లు ఆమె తెలిపారు. అంతేకాకుండా ఈ నీటితోనే మజ్జిగ కూడా తయారు చేసి విద్యార్థులకు సరఫరా చేస్తున్నారని ఇలా అయితే పిల్లలు రోగాలకు గురవుతారని నిర్వాహకులపై అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా విద్యార్థులకు గ్లాసులు సరఫరా చేయకపోవడంతో విద్యార్థులు భోజనం చేసిన తర్వాత ప్లేట్‌తోనే నీళ్లు తాగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. ఈ విధంగా గిరిజన గురకుల పాఠశాలలో విద్యార్థుల సంక్షేమ గాలికి వదిలేశారని చెప్పవచ్చును. అంతేకాకుండా ప్రభుత్వ మెను ప్రకారం విద్యార్థులకు ఏమి ఏమి సరఫరా చేస్తున్నారో రికార్డులు చూపించాలని వార్డన్‌ను కోరగా ఆయన చూపించకుండా వెళ్లిపోయినట్లు ఆమె తెలిపారు. ఈ విషయాలను గురుకుల పాఠశాల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ అఫ్జల్‌అలీఖాన్ తదితరులు ఉన్నారు.
వార్డన్ వివరణ: విద్యార్థులకు నాణ్యమైన భోజనం కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. అంతేకాకుండా విద్యార్థులు మరుగుదొడ్లతో అవస్థలు పడుతుండటంతో కొత్త మరుగుదొడ్లను నిర్మిస్తున్నామన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం నుండి పాఠశాలకు గ్లాసులు సరఫరా కాలేదని, అందువల్ల విద్యార్థులు ప్లేట్‌తో నీరు తాగుతున్నారని తెలిపారు. ప్రభుత్వం నుంచి గ్లాసులు సరఫరా అయిన వెంటనే విద్యార్థులకు సరఫరా చేస్తామన్నారు.

బడుగుల సంక్షేమమే టీడీపీ ధ్యేయం

గాలివీడు, జూన్ 20: గ్రామీణ ప్రాంతాల్లోని బడుగు, బలహీనవర్గాల సంక్షేమమే తెలుగుదేశం ప్రభుత్వం ధ్యేయమని మాజీ ఎమ్మెల్యే, రాయచోటి నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి రమేష్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం అరవీడు గ్రామం అరవీడు గ్రామ పంచాయతీలోని పలు పల్లెల్లో ఇంటింటా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని చేపట్టారు. దినె్నమీదపల్లె హరిజనవాడలో దళితుల సమస్యలపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల నివాస ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను కేటాయించడం జరిగిందన్నారు. అంతేకాకుండా వరుస కాంగ్రెస్ ప్రభుత్వాలతో విసిగి వేసారిన ప్రజలు దివంగత ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకులు ఎన్‌టి రామారావు టీడీపీ మూడు నెలల కాలంలోనే ప్రజల మన్ననలు పొంది అధికారంలోకి రావడం జరిగిందన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగుతోందన్నారు. అనంతరం ఆయన పిన్నంవారిపల్లె, ఉయ్యాలవాండ్లపల్లె, లక్కెంవాండ్లపల్లె, యల్లంపల్లె, కొత్తపల్లె, నడింపల్లె, అరవీడు కస్పాలో పర్యటించి ప్రజా సమస్యలను సేకరించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు రవీంద్రబాబు, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు లక్షుమయ్య, సర్పంచులు మహమ్మద్‌రియాజ్, శ్రీనివాసరాజు, భావన, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

జాతీయ రహదారిపై సబ్‌వే నిర్మించాలి
* బిజెపి జిల్లా అధ్యక్షుడు శ్రీనాథరెడ్డి
మైదుకూరు,జూన్ 20:40వ నెంబర్ జాతీయ రహదారి వెంబడి శ్రీనగరం, వెంకటాపురం ,జాఫర్‌పల్లి, మామిళ్లపల్లి, కొత్తపల్లె గ్రామాల ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఎదురౌతున్నాయని ప్రభుత్వం ప్రజల సౌకర్యార్థం ఈ జాతీయ రహదారికి సబ్‌వే దారిని నిర్మించాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనాథరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం మైదుకూరు పురపాలక పరిధిలోని 22వ వార్డు శ్రీనగర్ గ్రామాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు రహదారి సమస్యను ఆయన దృష్టికి తెచ్చారు. ఆయా గ్రామాల ప్రజలు వ్యవసాయ పనులు చేసుకుంటున్నారని ప్రజల సౌకర్యార్థం రవాణా సదుపాయాన్ని కల్పించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జాతీయ మెంబర్ ప్రతాప్‌రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ గుర్రప్ప, నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, రాజమోహన్‌రెడ్డి, సుబ్బరాజు, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

మైనార్టీలకు పెద్దపీట : విప్ మేడా

నందలూరు, జూన్ 20:రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది రూపాయలు వెచ్చించి ముస్లింలకు రంజాన్ తోఫా అందజేస్తున్నారని ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక ఆర్‌అండ్‌బిలో సర్పంచ్ సమ్మెట శివప్రసాద్ అధ్యక్షతన రంజాన్ తోఫా కిట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేడా మాట్లాడుతూ ముస్లింలు సంతోషంగా పండుగ జరుపుకోవాలని 5 కిలోల గోధుమపిండి, 1 కిలో సేమియా, 2 కిలోల చక్కెర, నెయ్యి, సంచి కలసి రూ.400 విలువ చేసే సామాగ్రి సిఎం చంద్రబాబునాయుడు అందజేశారన్నారు. సిఎం ముస్లింల కోసం మైనార్టీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఈద్గా, మసీదుల నిర్మాణాలు, మరమత్తులు, పెళ్లిళ్లకు ఆర్థిక సాయం, కడపలో హజ్ హౌస్ వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారన్నారు. నందలూరు మండలాన్ని శ్యామ్ ప్రసాద్‌ముఖర్జీ రర్భన్ మిషన్ క్రింద ఎంపిక చేసి మొదటి విడత రూ.30 కోట్లు త్వరలో మంజూరు చేస్తారన్నారు. ప్రతి సంవత్సరం వెయ్యి కోట్లతో అన్ని వర్గాల ప్రజలకు నిత్యావసర వస్తువులు అందజేస్తున్నారన్నారు. రాజంపేట నియోజకవర్గంలోనే ముస్లింలకు రూ.42 లక్షలతో రంజాన్ తోఫా పంపిణీ చేయడం జరిగిందన్నారు. అభివృద్ధే ధ్యేయంగా టిడిపి ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రజలు సహకరించాలన్నారు. మైనార్టీ నాయకులు గుల్జార్‌బాషా, మున్వర్‌బాషా, షమీవుల్లాఖాన్ మాట్లాడుతూ రాజంపేట అసెంబ్లీలో దివంగత నేత బండారు రత్నసభాపతి అనంతరం ముస్లీంల కోసం అహర్నిశలు పాటుపడుతుంది మేడాయేనన్నారు. ఆర్టీసీ రీజనల్ మాజీ ఛైర్మన్ యెద్దల సుబ్బరాయుడు మాట్లాడుతూ దేశం హయాంలో ముస్లింలకు అనేక సంక్షేమాలతో అభివృద్ధి జరుగుతుందన్నారు. అనంతరం ముస్లింలకు మేడా రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంపిడిఓ మల్లీశ్వరి, జడ్పీటీసీ శివరామరాజు, సొసైటీ అధ్యక్షులు మేడా విజయభాస్కర్‌రెడ్డి, పార్టీ నాయకులు బి.లక్ష్మీనరసయ్య, టి.లక్ష్మీదేవి, ఎ.విశ్వనాధ్, ఎం.రాము, మైనార్టీ నాయకులు గౌస్‌పీర్, అన్సర్, నవాబ్‌జాన్, ధనుంజయనాయుడు పాల్గొన్నారు.