కడప

విజృంభిస్తున్న డెంగ్యూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జూలై 18: వర్షాకాలం మొదలైందో లేదో కాని వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని, తాగునీరులో కలుషితమై గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసి జిల్లా వ్యాప్తంగా విషజ్వరాలు విజృంభించడంతో రోగులు మంచాలమీద గజ గజవణుకుతున్నారు. గ్రామాలతోపాటు పురపాలక సంఘాల్లో పారిశుద్ధ్యం పడకేసి దోమలు విజృంభించి రోడ్లపై జనవాసాల్లో మురుగునీరు నిల్వతో జ్వరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇప్ప టి వరకు ఈ ఏడాదిలో మలేరియా 200మందికి పైబడి సోకడం, డెంగ్యూ జ్వరాలు అధికారికంగా 15కు చేరుకుని, అనధికారికంగా పదులు సంఖ్యలోనే డెంగ్యు వ్యాప్తి చెందింది. గత ఏడాదికంటే ఈ ఏడాది జ్వరాలు ప్రబలి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో రక్తపరీక్షలు చేసేందుకు అన్ని వసతులున్నా పలువురు ఆరోగ్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా సరైన వైద్యం అందలేదని ప్రజలు వాపోతున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ వైద్యులు ప్రజల అవసరాలు ఆసరా చేసుకుని జ్వరాలు నయం చేస్తామంటూ మొక్కుబడిగా వైద్యపరీక్షలు, చికిత్సలు చేసి జ్వరాలు తీవ్రతరం చేసి రోగుల పరిస్థితి ఆందోళనకు చేరిన తర్వాత వైద్యులు చేతులెత్తేసి తిరుపతి, బెంగళూరు, ఏలూరు, హైదరాబాద్‌లకు వెళ్లాలని ఉచిత సలహాలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. రక్తంలో కణాలు తక్కువై ప్లేట్లెస్‌లో మార్పు వచ్చేవరకు ప్రైవేట్ వైద్యులు చాలావరకు జ్వరపీడితుల నుంచి డబ్బులు గుంజుతున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రతి నియోజకవర్గం కేంద్రంలో ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లు, ప్రాథమిక వైద్య ఆరోగ్యకేంద్రాలు, ఇక మూడు నాలుగు గ్రామాలకు సబ్‌సెంటర్లు కూడా ఉన్నాయి. ఈ ఆరోగ్యకేంద్రాల్లో మలేరియా యూనిట్‌కు ఉంది. వివిధ రకాల సీజన్లలో ముందస్తుగా వైద్యులు, వైద్యసిబ్బంది వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించి, వ్యాధుల విజృంభన తగ్గుముఖం పట్టేలా చర్యలు తీసుకోవాల్సివుండగా చాలామంది ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ క్లీనిక్‌లు నెలకొల్పుకోవడంతో తమ క్లీనిక్‌లకు రోగులను మళ్లించి సొమ్ము చేసుకుంటున్నారనేది జగమెరిగిన సత్యం. డెంగ్యు, మలేరియాకు పూర్తిస్థాయిలో పరీక్షలు, వైద్యసేవలు కడప రిమ్స్‌లో ఉన్నా అక్కడి వైద్యులు, వైద్యసిబ్బంది సక్రమంగా వైద్యసేవలు అందించకపోవడంతో ప్రాణాలు అనంతవాయులో కలిసిపోయే ప్రమాదం ఉందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో చాలావరకు అనేక సౌకర్యాలున్నా కొంతమంది అంకితభావంతో పనిచేయడం, కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ప్రభుత్వ వైద్యంపై నమ్మకం సన్నగిల్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో ఈ ఆరుమాసాల్లో విష జ్వరాలు 4వేలమందికి, టైఫాయిడ్ 3వేల మందికి పైబడి, వాంతులు విరోచనాలు 11వేల మందికి పైబడి, పచ్చకామెర్లు 600 మందికి, మలేరియా 110 మందికి, డెంగ్యు 17 మందికి పైబడి జిల్లాలో వ్యాప్తి చెందినట్లు అధికారగణాలు చెబుతున్నాయి. అయితే అంతకురెట్టింపులోనే వ్యాధుల విజృంభన ఉంది. చికున్‌గున్యా ప్రతి గ్రామంలో, పారిశుద్ధ్యం గ్రామాల్లో రోడ్డుమార్గాలు లేక డ్రైనేజీల నిర్మాణం లేకపోవడంతో వర్షం నీరు, మురుగునీరు కలిసి కుంటలు, చెరువులుగా మారి దోమలు వ్యాప్తిచెంది కుక్కలు, పందుల స్వైరవిహారం చేస్తున్నాయి. రక్షిత నీటి పథకాలు, పైపులైన్లను, గొట్టపుబావులు క్లోరినేషన్ చేయని కారణంగా తాగునీరు పూర్తిస్థాయిలో కలుషితమై అంటువ్యాధులు విజృంభిస్తున్నాయి. ఇక మలేరియాశాఖ అధికారులు, సిబ్బంది దోమలు, ఈగల నివారణ చర్యలు పూర్తిస్థాయిలో చేపట్టని కారణంగా జ్వరాలు తీవ్రవౌతున్నాయి. ఈ పరిస్థితుల్లో సంబంధిత జిల్లా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుని వ్యాధులు తగ్గించి ప్రజలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మహిళల ఆందోళనతో బెల్టుషాపులు రద్దు!

కడప,జూలై 18: మద్యం షాపుల ఏర్పాటుపై జిల్లా వ్యాప్తంగా మహిళలు, యువత ఆందోళన చేపట్టడంతో గ్రామాల్లో బెల్టు షాపులు తొలగించేందుకు చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. దీంతో మద్యం వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో పలువురు మద్యంషాపు యజమానులు చాలా వరకు బెల్టుషాపులపై ఆధారపడి వ్యాపారం చేస్తున్నారన్నది బహిరంగ రహస్యం. కాగా స్వయంగా ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు నెలరోజులలోపు బెల్టుషాపులు లేకుండా చేస్తానని ప్రకటించడం, దీనికితోడు మహిళల్లో నిరసన వ్యక్తం కావడంతో ప్రభుత్వం ఆదాయాన్ని వదులుకుని ఒక మెట్టు దిగి వచ్చింది. ఏటా వివిధ రకాల రుసుముల ద్వారా బ్రాందిషాపులు నెలకొల్పేవారి నుంచి వచ్చే దరఖాస్తులకు రూ.30కోట్లు ఆదాయం రాగా ఈ ఏడాదిలో రూ.25కోట్లకే పరిమితమైంది. జిల్లాలో 255 బ్రాందీషాపులు నెలకొల్పాల్సివుండగా కేవలం 221 బ్రాందీషాపులు మాత్రమే ఏర్పాటు చేశారు. ఇక 30బార్లు ప్రారంభించాల్సివుండగా 15 బార్లు మాత్రమే తెరచి సగానికి పరిమితం చేశారు. దీంతో ప్రభుత్వానికి బార్లు, బ్రాందీషాపుల ప్రారంభానికే తలప్రాణం తోకకు వచ్చింది. దీనికితోడు పట్టణంలో చాలావరకు కూల్‌డ్రింక్ షాపులు, చిన్నపాటి హోటల్స్, చిల్లర దుకాణాలు సైతం బెల్టుషాపులు ఏర్పాటు చేసి మద్యం విక్రయాలు చేస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ఉన్న బ్రాందీషాపుల ద్వారా ఎక్కడపడితే అక్కడ కూల్‌డ్రింక్ షాపులు, హోటల్స్‌లోనూ, గ్రామంలో ప్రతి చిరువ్యాపారులు బెల్టుషాపులు నెలకొల్పి మద్యం వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగిస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా బెల్టుషాపులను నిర్మూలన చేసేందుకు రాష్ట్రప్రభుత్వం గ్రామ, మండల, నియోజకవర్గం, జిల్లా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసినా సత్ఫలితాలు ఇవ్వలేదు. ఈ నేపధ్యంలో ప్రస్తుతం బెల్టుషాపులను నిర్మూలిస్తామని ఒక మాసం గడువు ఇచ్చినా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజా ప్రకటనతో బ్రాందీషాపుల యజమానులు లబోదిబోమంటున్నారు. పోలీసు, ఎక్సైజ్‌శాఖ పలువురు అధికారులకు, సిబ్బందికి బెల్టుషాపులే ఆదాయ వనరులు కాగా బెల్టుషాపుల మూతకు ప్రభుత్వం యోచిస్తుండటంతో మద్యంషాపుల యజమానులు, పోలీసు, ఎక్సైజ్‌శాఖ అధికారులు సైతం నివ్వెరపోతున్నారు. ఇక ప్రతి ఎక్సైజ్‌శాఖ పరిధిలో ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది ప్రభుత్వం మద్యం అమ్మకాలపై టార్గెట్ విధించిన నేపధ్యంలో బెల్టుషాపులు రద్దుతో నెలకు రూ.100కోట్లు పైబడి మద్యం అమ్మకాలకు జిల్లాలో గండిపడే అవకాశాలు కన్పిస్తున్నాయి. అలాగే మద్యం దుకాణదారులు, బార్ల యజమానులు కూడా వారు కోరుకున్న స్టాకు కాకుండా ఎక్సైజ్ అధికారులు మరీ బలవంతం చేసి ఇతరత్రా స్టాకులను బ్రాందీషాపులకు, బార్లకు చేరవేస్తున్నారు. ఆ కొత్త బ్రాండ్లను వారు అమ్ముకోలేక ఇబ్బందిపడుతున్న తరుణంలో బెల్టుషాపుల రద్దుతో వారి పరిస్థితి త్రిశంకుస్వర్గంగా మారింది. ఏది ఏమైనా బెల్టుషాపుల రద్దుతో ప్రజలు, ముఖ్యంగా మహిళలు మినహా మిగిలిన వారంతా ఆదాయ వనరులు కోల్పోతుండటంతో ఢీలాపడ్డారు. దీంతో ఎక్సైజ్ అధికారులు తమకు ఇచ్చిన టార్గెట్ ప్రకారం మద్యం విక్రయాలు చేయలేమని చాలా వరకు మద్యం షాపులన్నీ రాజకీయ నాయకులకు చెందినవి కావడంతో తాము ఉద్యోగాన్ని కాపాడుకోవాలంటే నాయకులను బెదిరించలేమని వారు పూర్తిస్థాయిలో ఢీలాపడి పలువురు అధికారులు సెలవుపై వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

‘పిఆర్’ను వరించిన ఎమ్మెల్సీ పదవి..

జమ్మలమడుగు, జూలై 18: తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి కేటాయించారు. ఎమ్మెల్సీ పదవి కేటాయింపుపై ఉన్న ఊగిసలాటకు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు తెరదించుతూ మంగళవారం నాటికి కేటాయించారు. 1993 హైదరాబాదులో మాజీ మంత్రి పొన్నపురెడ్డి శివారెడ్డి జరిగిన హత్యోదనంతరం ఆయన వారసుడిగా రామసుబ్బారెడ్డి రాజకీయ రంగప్రవేశం చేశారు. ఈ క్రమంలోనే 1994, 1999 ఎన్నికల్లో జమ్మలమడుగు ఎమ్మెల్యేగా గెలిచి అటవీ, గృహనిర్మాణ శాఖల మంత్రిగా పదవులు నిర్వహించారు. తదనంతరం 2004 ఎన్నికల్లో వైయస్ రాజశేఖరరెడ్డి హవాతో రామసుబ్బారెడ్డి ఓటమిచెందారు. తదనంతర కాలంలో రాజకీయంగా ఎన్నో ఒడిదడుకులను ఎదుర్కొన్నా, పలు అవకాశాలు వచ్చినా తెదేపాను వీడకుండా కొనసాగుతూ వచ్చారు. రాజకీయంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటూ పరిస్థితులు అనుకూలించక ఆ తదనంతరం కూడా ఎన్నికల్లో విజయాన్ని సాధించలేకపోయారు. ప్రస్తుత తెదేపా ప్రభుత్వ హయాం నుండి రాజకీయంగా రామసుబ్బారెడ్డి పుంజుకుంటున్న తరుణంలో వైకాపా అధినేతతో ఉన్న విబేధాల వల్ల వైకాపా జమ్మలమడుగు ఎమ్మెల్యే సి. ఆదినారాయణ రెడ్డి తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. ఆది చేరికను మొదటి నుండి వ్యతిరేకిస్తూ వస్తున్న ఆయన ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆదికి మంత్రి పదవి ఇవ్వడంపై బహిరంగంగా వ్యతిరేకను వ్యక్తం చేశారు. వివిధ రాజకీయ పరిణామాల అనంతరం చంద్రబాబునాయుడు స్వీయ పర్యవేక్షణలో జమ్మలమడుగు రాజకీయాన్ని కొలిక్కి తెచ్చి ఎవరికి రాజకీయ నష్టాలు చోటుచేసుకుండా నాటకీయ పరిణామాల మధ్య రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు. మంచి ముహూర్తాన పిఆర్ ఎమ్మెల్సీగా పదవీబాధ్యతలు చేపట్టనున్నట్లు తెదేపా వర్గాలు చెబుతున్నాయి. రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి చేపట్టిన అనంతరం జమ్మలమడుగుతో పాటు కడప జిల్లాలో రాజకీయాల్లో పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశే్లషకులు చెబుతున్నారు.

ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం ఉద్యమాలు

బద్వేలు,జూలై 18: కడపలో ఉక్కుపరిశ్రమ సాధించేంతవరకు ఉద్యమాలు కొనసాగించాలని, ఉద్యమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని రాయలసీమ కమ్యూనిస్టుపార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రవిశంకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని నాలుగురోడ్ల కూడలిలో ఆర్‌సిపి ఆధ్వర్యంలో బహిరంగసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడపలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటుకు రాజకీయ నాయకులు తమ స్వార్థరాజకీయాలు పక్కనపెట్టి ఉక్కుపరిశ్రమ ఉద్యమంలో పాల్గొనాలన్నారు. రాష్ట్ర విభజన తర్వాత రాయలసీమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. కడపలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటువల్ల సీమ అభివృద్ధి చెందుతుందని యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. విభజన సమయంలో ఏ అంశాలపై ప్రకటన చేశారో అవి అమలుపరచాలన్నారు. ఆర్‌సిపి జిల్లా నాయకులు లింగమూర్తి మాట్లాడుతూ బద్వేలు ప్రాంత అభివృద్ధిని పట్టించుకునే నాధుడే కరువయ్యారన్నారు. బ్రహ్మంసాగర్, కుడి ఎడమ కాలువలు నేటికీ పూర్తికాని కారణంగా తాగునీరు లేక రైతులు పంటలు పండించుకునే పరిస్థితి లేదన్నారు. సీమ అభివృద్ధికి ప్రజలందరూ ఐక్యంగా ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌సిపి నాయకులు ఓబులేసు, ఇమ్మానుయేల్, విజయకుమార్, రవి, ఓబయ్య తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

రామాపురం, జూలై 18: ఆర్టీసీ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాయచోటి ఆర్టీసీ డిపో మేనేజర్ ముత్యాలనాయక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఆయన ప్రయాణీకులతో మాట్లాడుతూ ఆర్టీసీ అనేక పథకాలను ప్రవేశపెట్టిందని, విద్యార్థుల పాసు, వయోవృద్ధులకు నవ్యా కార్డు, క్యాట్ కార్డు, మరిన్ని పథకాలు ఉన్నాయని వీటన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆర్టీసీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఇప్పటికే పలు రకాల ఆర్టీసీ సంస్థ ప్రజలకు సేవ చేస్తున్నదన్నారు. నల్లగుట్టపల్లె సర్పంచ్ నాగభూషణరెడ్డి నాన్‌స్టాప్ బస్సులను కడప నుండి రాయచోటికి వెళ్లు సమయంలో రామాపురంలో ఆపాలని డీఎం దృష్టికి తీసుకెళ్లారు. ప్రయాణీకులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, నాన్‌స్టాప్ బస్సులను రామాపురంలో ఆపి వారిని కూడా ఎక్కించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డిపో కార్యదర్శి శరత్‌నాయక్ పాల్గొన్నారు.

ఇండ్లు కూల్చివేత తగదు

రాయచోటి, జూలై 18: మునిసిపల్ పరిధిలోని మదనపల్లె మార్గంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇండ్లు కూల్చేశారన్న బాధతో బాధితులు నిందను తమపై వేశారని, తమకు ఎటువంటి సమాచారం కూడా అధికారులు ఇవ్వలేదని, ఇండ్ల కూల్చివేతకు తనకు సంబంధం లేదని మునిసిపల్ ఛైర్‌పర్సన్ నసీబున్‌ఖానమ్, మునిసిపల్ కో ఆప్షన్ సభ్యులు సలావుద్దీన్‌లు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక మునిసిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెంది, మునిసిపల్ ఛైర్మన్ అయిన తాము ప్రజలకు, ప్రజల యొక్క అవసరాలకు వారి కష్టనష్టాలను భావించే తాము నడుచుకుంటున్నామని, దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అడుగుజాడల్లోను, ఆయన కుమారుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యవేక్షణలో నడుస్తున్నామని తెలిపారు. గడిచిన రెండు రోజుల కిందట మదనపల్లె మార్గంలో జరిగిన ఇండ్ల కూల్చివేతకు తమకు ఎలాంటి సంబంధం లేదని, మునిసిపల్ కమిషనర్‌కు ఆర్డీ నుంచి లెటర్ అందినా తమకు ఇంత వరకు సమాచారం తెలియపరచకుండా ఇండ్లను కూల్చివేశారని తెలిపారు. దానికితోడు ఇండ్ల కూల్చివేతకు తమను అడ్డం పెట్టుకొని టీడీపీ నాయకులు, మునిసిపల్ కమిషనర్ మాట్లాడటం సమంజసం కాదన్నారు. కమిషనర్ తమకు ఎలాంటి సమాచారం తెలియపరచకుండానే ఇష్టానుసారంగా పనులు చేసుకుంటున్నాడని, మునిసిపల్ నిధులపై కూడా తమకు సమాచారం అందివ్వడం లేదని, మునిసిపాలిటీలో జరగాల్సిన అభివృద్ధి పనులకు కమిషనర్ అడ్డుపడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం జరిగిన సంఘటనలో తమ హస్తం ఉందని నిరూపిస్తే తాము రాజీనామాకు సిద్ధమని, అలా కాకుండా నిరూపించలేకపోతే కమిషనర్ రాజీనామా చేస్తారా అని సవాల్‌ను విసిరారు. మునిసిపల్ అభివృద్ధికి తాము ఎవరితోనైనా కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇంతకు మునుపే ఈ విషయాన్ని పలుమార్లు చెప్పడం జరిగిందన్నారు. గడిచిన మూడేళ్లలో వర్గాలకు అతీతంగా మునిసిపల్ అభివృద్ధికి తాము నిరంతరం కష్టపడుతున్నట్లు వారు వివరించారు. కమిషనర్ ఇదే తీరును వ్యవహరిస్తే సరెండర్ చేస్తామని హెచ్చరించారు. అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు మునిసిపల్ అభివృద్ధికి నిధులైనా మంజూరు చేయించారా అని 9వ వార్డు కౌన్సిలర్ ఫయాజుర్‌రెహమాన్ ప్రశించారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా పట్టణ అభివృద్ధికి సహకరించాలని ఆయన సూచించారు. సమావేశంలో కౌన్సిలర్లు ఫయాజుర్‌రెహమాన్, అల్త్ఫా, చాన్‌బాష, నాయకులు పాల్గొన్నారు.

ఓటర్ల జాబితాలో చేర్చేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలి

కడప,జూలై 18: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 18సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటర్ల జాబితాలో నమోదు చేసేందుకు అన్ని కళాశాలల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక ఓటర్ల నమోదుసేకరణ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంలో స్వీకరించిన దరఖాస్తులను ఏరోజుకారోజు వెబ్‌సైట్‌లో నమోదు చేయడంతోపాటు 18సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటర్ల జాబితాలో నమోదు చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గ ఇఆర్‌ఓ 5 కళాశాలలకు స్వయంగా వెళ్లి ఓటు హక్కుపై విద్యార్థులను ప్రభావితం చేసి ఓటర్ల జాబితాలో నమోదు పైప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఇంటర్మీడియట్ కళాశాలల్లో 15-17 సంవత్సరాలు లోపు విద్యార్థుందరికి ఓటు ప్రాధాన్యత జాబితాలో నమోదు తదితర అంశాలపై ఇప్పటి నుంచే అవగాహన కల్పించి 2019 ఎన్నికల్లో ఓటు వేసేందుకు సంసిద్ధం చేయాలని ఆదేశించారు. బూత్‌స్థాయి అధికారులు ఇం టికి వెళ్లి ఓటర్ల జాబితాలో తప్పులు సవరించడం, చిరునామా మార్పు, చనిపోయిన ఓటర్ల తొలగింపు కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జెసి శే్వత తెవతియ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాలమేరకు జిల్లాలో ఓటర్ల జాబితాలో ఎన్‌రోల్ కాని 18 నుంచి 21 సంవత్సరాలు లోపు వయస్సు కలిగిన వారిపై ప్రత్యేక దృష్టి సారించి కళాశాలల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించామన్నారు. ఈనెల 9 నుంచి 23వ తేదీ ల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటుచేసి పోలింగ్ కేంద్రాల్లో బూత్ లెవల్ ఆఫీసర్లతో క్యాంపు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ నరసింహారావు, కడప, రాజంపేట, జమ్మలమడుగు ఆర్డీవోలు తదితరులు పాల్గొన్నారు.