కడప

చెక్‌డ్యామ్‌ల నిర్మాణంలో అవినీతి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,ఆగస్టు 22: భూగర్భజలాలు పెంపొందిస్తూ ఎగువప్రాంతాల్లో నీరు వృథాకాకుండా అడ్డుకట్ట వేసేందుకు జలసంరక్షణ పేరుతో నిర్మాణాలు చేపడుతున్న జిల్లాలో చెక్‌డ్యామ్‌ల నిర్మాణాల్లో అవినీతి అంతులేకుండా కొనసాగుతోంది. దాదాపు 2 దశాబ్దాల క్రితం ఈ చెక్‌డ్యామ్‌ల నిర్మాణ ప్రక్రియ కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కరవు నివారణ నిమిత్తం పనులు చేపట్టారు. గతంలో డిఆర్‌డిఏ పరిధిలో చాయనివారణ పథకం ఉండగా ప్రస్తుతం డ్వామా శాఖను ప్రత్యేకించి ఏర్పాటుచేసి ఈ పనుల సంరక్షణకు డ్వామాకు బాధ్యతలు అప్పచెప్పింది. వాస్తవంగా గతంలో వాటర్‌షెడ్ పథకం కింద చిన్న, మధ్య తరహా ఇరిగేషన్ శాఖలతోపాటు పంచాయతీరాజ్‌శాఖ కూడా చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలు, కట్టడాల మరమ్మతులు చేపట్టేవారు. ప్రస్తుతం డ్వామా ఆధ్వర్యంలో జలసంరక్షణ కింద చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలు చేపట్టారు. కొత్తచెక్‌డ్యామ్‌ల నిర్మాణాలకోసం పాతచెక్‌డ్యామ్‌లు నిర్మించడం, అయితే చెక్‌డ్యామ్‌లే లేని ప్రాంతాల్లో చెక్‌డ్యామ్‌ల మరమ్మతులు చేసినట్లు కోట్లాదిరూపాయలు బిల్లులు చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా వాటర్‌షెడ్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, అటవీశాఖ నేతృత్వంలో 3వేల చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలు, 2600 పైబడి చెక్‌డ్యామ్‌ల మరమ్మతులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 2016-17లో 1056 చెక్‌డ్యామ్‌లు మంజూరుకాగా 832 చెక్‌డ్యామ్‌లకు పనులు మొదలుపెట్టి 565 చెక్‌డ్యామ్‌లు పూర్తిచేశారు. వీటికి రూ.102కోట్లు ఖర్చు చేయాల్సివుంది. అయితే ఇప్పటివరకు రూ.3.88 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. గత ఏడాది 4266 పనులకు రూ.84.24కోట్లు, రెండవ విడతలో 2836 పనులకు రూ.51.73కోట్లు, మూడవ విడతలో 1476 ప్రాంతాల్లో రూ.26.89కోట్లు ఖర్చు చేయాల్సివుండగా 765 చెక్‌డ్యామ్‌లు పూర్తిచేసి రూ.10.19 కోట్లు ఖర్చు చేశారు. అటవీప్రాంతాల్లో జంతువులకు నీటి ఆదరవు నిమిత్తం పెద్ద ఎత్తున చెక్‌డ్యామ్‌లు నిర్మించినట్లు అధికారులు కాకిలెక్కలు చెబుతున్నారు. చెక్‌డ్యామ్‌లకు మరమ్మతులు కూడా పెద్ద ఎత్తున చేపట్టినట్లు పెద్దమొత్తంలో బిల్లులు మార్చుకున్నారు. కొంతమంది అటవీ అధికారులు, కొంతమంది సిబ్బంది తమశాఖ పరిధిలో నిధులు పెద్ద ఎత్తున స్వాహా చేసినట్లు తెలుస్తోంది. ఇక పంచాయతీరాజ్, వాటర్‌షెడ్, జలవనరుల శాఖచే చేపడుతున్న ప్రతి పనికి పర్సెంటీజి మత్తులో అధికారులు జోగుతూ ఏపార్టీ అధికారంలో ఉంటే ఆపార్టీ నేతలు చెప్పిందే వేదంగా భావించి బాగున్న చెక్‌డ్యామ్‌లు ధ్వంసం చేయడం, వాటికి ఎలాగూ బేస్‌మట్టం, కాంక్రీట్ ఉండటం వల్ల నేలమట్టం వరకు చెక్‌డ్యామ్‌లు కూల్చివేసి నేలమట్టంపై అదే బేసిమట్టంపై చెక్‌డ్యామ్ నిర్మించి రూ.3లక్షల నుంచి రూ.6లక్షల వరకు నూతన చెక్‌డ్యామ్‌ల నిర్మాణం పేరిట అధికారులు కాంట్రాక్టర్లకు, నేతలకు పూర్తి స్థాయిలో బిల్లులుచేసి వారు మామూళ్లమత్తులో జోగుతున్నారు. ఇక 2017-18లో 1175 చెక్‌డ్యామ్‌లను రూ.117.75కోట్లతో పనులుచేపట్టాల్సివుంది. అయితే పలు చెక్‌డ్యామ్‌లు గతశాఖ ఆధ్వర్యంలో పనులుచేపట్టి బిల్లులు చేసుకున్న అనంతరం కొంతకాలానికి మరోశాఖ నుంచి అదే చెక్‌డ్యామ్‌లకు ప్రతిపాదనలు పంపి సంబంధిత చెక్‌డ్యామ్‌లు నిర్మించి యథేచ్చగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారనేది జగమెరిగిన సత్యం. ఇకపోతే పల్లపుప్రాంతాల్లో వ్యవసాయ పొలాల సమీపంలో ఈచెక్‌డ్యామ్‌లు నిర్మించాల్సివుండగా నీరు నిల్వవుండే ప్రాంతాలు తప్ప నేతలకు అనుకూలంగా ఉండే ప్రాంతాల్లో చెక్‌డ్యామ్‌లు నిర్మించినా చుక్కనీరు కూడ లేదు. ఇప్పటికైనా సంబంధిత జిల్లా ఉన్నతాధికారులు జలసంరక్షణకోసం మాత్రమే చెక్‌డ్యామ్‌లు నిర్మించి ప్రస్తుతం ఇబ్బడిముబ్బడిగా నిర్మించిన చెక్‌డ్యామ్‌లు పరిశీలించి పాత పనులకు కొత్తసొగసులు చేసినవాటి నిర్మాణాలు క్వాలిటీ కంట్రోల్ అధికారులచే తనిఖీలు చేయించి ప్రభుత్వం లక్ష్యం నెరవేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రభుత్వ భూమిని అప్పనంగా అప్పజెప్పారు.!

సుండుపల్లె, ఆగస్టు 22:ప్రభుత్వ భూమిని అప్పనంగా అప్పజెప్పారు. కంచె వేయమని కలెక్టర్ ఆదేశిస్తే రెవెన్యూ శాఖాధికారులు ఆ భూమి పట్టా ఇచ్చేశారు. ఆ ప్రభుత్వ భూమిని సుండుపల్లె మండల కేంద్రానికి అతి సమీపంలో ఉంది. దీని విలువ లక్షల రూపాయలలో ఉంది. సుండుపల్లె మండలంలో భూముల విలువలు పెరగడంతో ఇక్కడి ఇంటి స్థలాలకు గిరాకీ పెరిగింది. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులకు ఉంది. భూమి లేని నిరుపేదలను గుర్తించి పట్టా ఇవ్వాల్సిన అధికారులు ఓ బడా బాబుకు సుండుపల్లె రెవెన్యూ అధికారులు దాసోహమై చిల్లర డబ్బుకు కక్కుర్తిపడ్డారు. లక్షల రూపాయల విలువ చేసే స్థలాన్ని అప్పనంగా కట్టబెట్టిన వైనం సుండుపల్లె మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్లితే..స్థానిక సుండుపల్లెలోని జడ్పీ హైస్కూల్ వెనుక భాగంలో కాకలపల్లెకు వెళ్లే మార్గంలో సర్వే నెంబర్ 1592లో 1 ఎకరా 34 కుంటల ప్రభుత్వ స్థలం ఉంది. దానికి రెవెన్యూ శాఖే బోర్డు పాతిపెట్టింది. ఇది ప్రభుత్వ స్థలం అని గుర్తింపునిచ్చారు. అయితే ధన దాహానికి రాజకీయ పలుకుబడికి లొంగిన అధికారులు ఖాతా నెంబర్ 1460 షేక్ నజీర్(జబీల్లే) అనే మహిళకు అక్షరాలా ఒక ఎకరా స్థలాన్ని డీకేటీ పట్టా ఇచ్చేశారు. ఇది ప్రభుత్వ స్థలం అని గత కలెక్టర్ ఈ స్థలానికి కంచె వేసేందుకు రూ.5 లక్షల రూపాయల నగదును మంజూరు చేశారు. కానీ కలెక్టర్ ఆదేశాలు పనిచేయకపోగా ఏకంగా సుమారు రూ.10 లక్షలు తీసుకుని పట్టా ఇవ్వడం ఏమిటని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇదే స్థలంలో మరో 34 కుంటల ప్రభుత్వ ఆస్థిగా మిగిలింది. ఇది ప్రభుత్వ భూమిని పట్టాలుగా పంచి పెడతామని ఓ రెవెన్యూ అధికారి అడిగిన వారికి సమాధానమిస్తున్నారు. ఈ స్థలాన్ని కాపాడాల్సిన అవసరం జిల్లా సర్వోన్నతాధికారి చేతుల్లోనే ఉంది.
కడప ఆర్డీఓ చినరాముడును వివరణ నిమిత్తం రెండు మార్లు ఫోన్‌లో ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. తహసీల్దార్ సుబ్రహ్మణ్యంరెడ్డి 30 రోజులు సెలవులో ఉన్నారు. ఇన్‌ఛార్జి తహసీల్దార్ కార్యాలయానికి రాలేదు. సుండుపల్లె వీఆర్‌వో రాజగోపాల్‌రెడ్డిని వివరణ కోరగా తనకు పూర్తి వివరాలు తెలియదు దీనిపై విచారిస్తామని మాట దాటవేసే ప్రయత్నం చేశారు.
రేషనలైజేషన్ పేరిట బడులు మూత!

కడప,ఆగస్టు 22: కొండనాలుకకు మందు వేస్తే ఉన్ననాలుక ఊడిన చందంగా రేషనలైజేషన్ పేరిట జిల్లాలో 120 పైబడి మారుమూల గ్రామాల్లో పాఠశాలలు మూతవేశారు. 135మంది ఉపాధ్యాయులు అధికంగా ఉండటంతో వారిని సర్దుబాటు దిశగా భర్తీకి జాప్యం చేస్తూ వస్తున్నారు. ఉపాధ్యాయుల బదిలీల కౌన్సిలింగ్ ముగిసి 20రోజులు గడుస్తున్నా ఇంతవరకు బదిలీ అయిన ఉపాధ్యాయులు కొత్తపాఠశాలల్లో చేరడం కానీ, అధికంగా ఉన్న ఉపాధ్యాయులను సర్దుబాటు చేయడం లో అధికారులు జాప్యం చేస్తున్నారు. బదిలీ అయిన ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన ఉత్తర్వులు కూడా ఆలస్యంగానే ఇచ్చారు. జిల్లాలో డిఇవో పూలింగ్ పేరిట కొంతమంది ఉపాధ్యాయులను రిజర్వులో పెట్టి రాజకీయ సిఫార్సులున్న ఉపాధ్యాయులకు కావాల్సిన ప్రాంతాల్లోనే సర్దుబాటు చేసినట్లు తెలుస్తోంది. బాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయులు, వృత్తివిద్య ఉపాధ్యాయులు తమకు ఉన్న పరపతి ద్వారా కావాల్సిన ప్రాంతాల్లో బదిలీపై వెళ్లినట్లుతెలుస్తోంది. చాలా మంది ఉపాధ్యాయులు అంగవైకల్యం పేరిట, అనారోగ్యం పేరిట నకిలీ ధృవపత్రాలు సృష్టించుకుని అధికారుల అండదండలతో నేతల సిఫార్సులతో కావాల్సిన ప్రాంతాలకే బదిలీపై వెళ్లినట్లు తెలుస్తోంది. 4వేల మంది పైచిలుకు ఉపాధ్యాయులు బదిలీలకోసం దరఖాస్తుచేసుకుని తమకు అనుకూలమైన ప్రాంతాల్లో బదిలీ వచ్చిన వారు మాత్రమే జాయిన్ అయ్యారు. కొన్ని పాఠశాలల్లో ఆంగ్లం, సామాన్యశాస్త్రంలో ఖాలీలు లేకపోయినా ఒక పోస్టుకు మరోపోస్టుకు బదలాయింపు చేసుకుని భౌతిక, రసాయనిక శాస్త్రం ఉపాధ్యాయుల స్థానంలో జీవశాస్త్రం ఉపాధ్యాయులకు పోస్టింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. చాలా వరకు కౌన్సిలింగ్ సజావుగా జరగలేదని ఆరోపణలున్నాయి. జిల్లాలో 3060 ప్రాథమిక పాఠశాలలు, 658 ప్రాథమికోన్నత పాఠశాలలు, 855 ఉన్నత పాఠశాలతో మొత్తం 4573 పాఠశాలలు ఉన్నాయి. అయితే పాఠశాలలు ప్రారంభించి మూడు మాసాలు గడిచినా చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియలో జరగలేదు. మరో నెలరోజుల్లో క్వార్టల్లీ పరీక్షలు దగ్గరుండటంతో సిలబస్ పూర్తిగాక ఉపాధ్యాయులతోపాటు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అసలే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రజల్లో మంచి అభిప్రాయం లేక ఆరుగాలాలు కష్టించే దినకూలితోపాటు రైతులు అధికశాతం మంది తమ పిల్లల విద్యాభవిష్యత్‌కోసం ప్రైవేట్ విద్యాసంస్థలను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో అంకితభావం కొరవడిన కారణంగానే ప్రైవేట్ పాఠశాలల వైపు మొగ్గుచూపుతున్నారు. దీనికితోడు విద్యాశాఖ అధికారులు ప్రభుత్వం సైతం ప్రభుత్వపథకాలపై ప్రచారం తప్ప అంకితభావం కొరవడి ప్రభుత్వపాఠశాలలు గాలికి వదిలారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేసేలా చర్యలు తీసుకుని ప్రభుత్వపాఠశాలలు బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మట్కా మహమ్మారిని
తరిమికొడదాం :డిఎస్పీ
పోరుమామిళ్ల,ఆగస్టు 22:మట్కా మహమ్మారిని తరిమికొట్టి బంగారం లాంటి జీవితాలు నాశనం చేసుకోవద్దని మైదుకూరు డిఎస్పీ శ్రీనివాసులు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక పోలీసుస్టేషన్ నుంచి పరివర్తన కార్యక్రమంలో భాగంగా డిఎస్పీ,పోరుమామిళ్ల సిఐ పద్ననాభన్, ఎస్‌ఐ పెద్ద ఓబన్న , కలసపాడు ఎస్‌ఐ వెంకటరమణ, బి.కోడూరు ఎస్‌ఐ రమణయ్య, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈసందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ పేద, మధ్య తరగతి కుటుంబాల వారు మట్కాబారిన పడి వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారన్నారు. జిల్లాలో సంవత్సరానికి రూ.70కోట్లు మట్కాపైనే వెచ్చిస్తున్నారని వీరందరూ చిన్నా చితక కుటుంబాలకు చెందిన వారన్నారు. కూలీ, నాలీ చేసుకుని వచ్చిన ఆదాయంతో సగం డబ్బులు మద్యానికి, మిగతా డబ్బులు మట్కాలాంటి దుర్వ్సనాలకు ఖర్చుచేస్తూ వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారన్నారు. ఒక్కరోజులోలే లక్షాధికారి కావాలన్న దురాశతో కష్టపడిన డబ్బును మట్కాలాంటి జూదాలకు వెచ్చించి కుటుంబాలను రోడ్డుపాలు చేస్తున్నారన్నారు. వీటన్నింటినీ అరికట్టేందుకు ఈకార్యక్రమంలో మూడు మండలాల పోలీసు సిబ్బంది, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మీసేవలో కొరవడుతున్న ప్రభుత్వ సేవలు
జమ్మలమడుగు, ఆగస్టు 22: మీ సేవ కేంద్రాల్లో ప్రభుత్వం చేపడుతున్న సేవలు ప్రజలకు కొరవడుతున్నాయని బిజెపి దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు మేకల ఆంజనేయులు ఆరోపించారు. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఈ విషయమై మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వ మీసేవ కేంద్రాల్లో సైతం ప్రభుత్వం ఆదేశించిన సేవలన్నింటినీ కల్పించడం లేదన్నారు. జమ్మలమడుగు డివిజన్ పరిధిలోని 16 మండలాల్లో కేవలం ఆరు మండలాల్లో మాత్రమే ఆధార్ సేవలు ప్రజలకు అంతంత మాత్రంగా అందుతున్నాయన్నారు. . ఇప్పటికైనా మీ సేవ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో సేవలను విస్తరింపజేసేందుకు, సకాలంలో, నిర్ణీత ధరల్లో సేవలు అందేలా చర్యలు చేపట్టాలని ఆంజనేయులు విన్నవించారు.

అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు..

కడప,ఆగస్టు 22: రాష్ట్రంలోని అర్హులందిరికీ ప్రభుత్వ పథకాలు అందాలని, పేదవారికి అందించే రేషన్‌కార్డులు కేవలం నిత్యావసర వస్తువులకే గాకుండా విద్య, వైద్యం, గృహనిర్మాణ తదితర ప్రభుత్వపథకాల్లో వ్యక్తిగత లబ్ధిచేకూర్చేందుకు ఉపయోగపడతాయని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ లింగారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక పౌరసరఫరాల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆహారభద్రత కింద దేశంలోనే మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో స్వర్గీయ ఎన్‌టి రామారావు రూ.2లు కిలోబియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. జిల్లాలో ప్రస్తుతం 7,61,570 రేషన్‌కార్డులు పంపిణీ చేశామని, కంప్యూటర్లలో జరిగిన సాంకేతిక పొరపాట్ల వల్ల 2231 మంది ఆస్తిపన్ను చెల్లిస్తున్నట్లు డేటా ఉన్నందున వారికి కార్డులు మంజూరైనా రేషన్‌పొందలేక పోయారని లోపాలు సరిదిద్దడమైందన్నారు. అలాగే 390 కార్డు దారులు 4చక్రాల వాహనాలు కలిగివున్నట్లు నమోదుకావడంతో వాటిని పెండింగ్‌లో పెట్టి అందులో 80కార్డులను తిరిగి అమలులోకి తెచ్చామన్నారు. 2300 మంది కార్డు దారులకు సాంకేతిక సమస్యలు పరిష్కరించారని సెప్టెంబర్ నుంచి వారికి కూడా రేషన్ అందిస్తామన్నారు. దీపం పథకం కింద మొట్టమొదటి సారిపేదప్రజలకు గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కిందన్నారు. పొగరహిత రాష్ట్రంగా చేసేందుకు ముఖ్యమంత్రి సంకల్పించారని జిల్లాలో 2లక్షల 9వేల 134 మందికి గ్యాస్ కనెక్షన్లు కావాల్సినట్లు గుర్తించామని ఇప్పటి వరకు లక్షా 15వేల 717మందికి కనెక్షన్లు అందజేశామన్నారు. గ్యాస్ కనెక్షన్ల కోసం రూ.1000లు డిపాజిట్ కట్టిన వారికి మంజూరు చేస్తామన్నారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనం పథకానికి దీపం కనెక్షన్లు మంజూరుచేసేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. జిల్లాలో 1765 పాఠశాలలకు 1665 అంగన్వాడీ కేంద్రాలకు దీపం పథకం మంజూరు చేశామన్నారు. నిత్యావసర వస్తువులను పంపిణీ చేసేందుకు ఈపాస్ విధానం అమలుచేస్తున్నామని అలాగే ఎంఎల్‌వో పాయింట్లవద్ద కూడా ఈపాస్ విధానం అమలుచేయాలని డీలర్ల సంఘం కోరిన మేరకు సిద్దవటం, ఎర్రగుంట్లలో ప్రారంభించామన్నారు. దశలవారీగా ఈ ప్రక్రియ అన్ని మండలాలకు విస్తరిస్తుందన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఏడాదికి రూ.350కోట్లు ఖర్చుచేసి సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ పండుగలకు పేదలకు నిత్యావసర వస్తువులు ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రతి ఎంఎల్‌వో పాయింట్లలో సొంత గోదాములు ఏర్పాటు చేయాలని నిర్ణయించి పులివెందుల, రాయచోటి, చిన్నమండెం, చెన్నూరు మండలాలకు మంజూరు చేశామని త్వరలో ప్రొద్దుటూరులో కూడా గోదాములు ప్రారంభం చేస్తామన్నారు. అన్ని మున్సిపాల్టీల్లో పేదప్రజలకు అతి తక్కువ ధరకు టిఫెన్, భోజనం అందించేందుకు అన్నక్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో డిఎస్‌వో విజయరాణి, సివిల్ సఫ్లై కార్పొరేషన్ జిల్లా మేనేజర్ నాగరాజు పాల్గొన్నారు.