కడప

ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,సెప్టెంబర్ 19: జిల్లాలో పలు ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. నకిలీ ఎరువులు, ఎటువంటి బిల్లులు లేకుండా అక్రమ ఎరువులు, కల్తీ ఎరువులపై విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు అందిన సమాచారం మేరకు మంగళవారం విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిఎస్పీ వెంకటనాధరెడ్డి, సిఐ బాలిరెడ్డి, అధికారులు మైదుకూరు, సిద్దవటం, బద్వేలులో దాడులకు రంగం సిద్ధం చేయగా ముందస్తుగా పలువురు యజమానులకు సమాచారం అందడంతో పలువురు అంగళ్లు మూతవేసుకున్నారు. బద్వేలులో మూడు గోడౌన్లుసీజ్ చేసి 1000 బస్తాలు పైబడి అక్రమ ఎరువులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో కొన్ని దశాబ్దాలకాలంగా ఎరువుల అంగళ్లు, ఫెస్టిఫైడ్ షాపుల్లో ఈ తంతు కొనసాగుతూ వస్తోంది. డిఎస్పీ వెంకటనాధరెడ్డి ఈ జిల్లాలోని సంబేపల్లె మండలంలో రైతు కుటుంబానికి చెందిన అధికారి కావడంతో రైతులకు న్యాయం చేసే విధంగా ఎరువుల అంగళ్లపై ఆకస్మికంగా దాడులకు శ్రీకారం చుట్టారు. ప్రొద్దుటూరు, పులివెందుల, మైదుకూరు, రాయచోటి, బద్వేలు ప్రాంతాల్లో అక్రమనిల్వ ఎరువులు, నకిలీమందులు అధిక రేట్లతో అమ్ముతున్నారని రైతులు బాహాటంగా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎరువుల దుకాణాలపై దృష్టిపెట్టిన నేపధ్యంలో మంగళవారం దాడులకు దిగారు. ఆయన శాఖకు చెందిన కొంతమంది సిబ్బంది ముందస్తు సమాచారం ఇవ్వడంతో చాలామంది ఎరువులు దుకాణాల యజమానులు తాళాలు వేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లడం, మరికొంతమంది స్టాకును సురక్షిత ప్రాంతాల్లోకి తరలించినట్లు తెలిసింది. బద్వేలు దాడులతో జిల్లా వ్యాప్తంగా పలువురికి ఎరువుల దుకాణాల యజమానులకు సమాచారం అందడంతో ముందస్తుజాగ్రత్తలు పడినట్లు తెలిసింది. ఎరువుల అంగళ్ల వ్యాపారులు సిండికేట్‌గా మారడం కారణంగానే ధరలు విపరీతంగా పెరగడం, నల్లబజారు నుంచి ఎరువులు తరలించడం, మార్కెట్‌లో కొత్త బ్రాండ్ల ఎరువుల అమ్మకాలు జరగడం, యదేచ్చగా కొనసాగుతోంది. ప్రస్తుతం పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తుండటంతో ఎరువులకు డిమాండ్ పెరగడం, పలువురు ఎరువులను దాచుకుని కృత్రిమకొరత సృష్టించడం జరుగుతోంది. సంబంధిత వ్యవసాయశాఖ అధికారులకు అన్నీ తెలిసినా వారు ఏమీ తెలియనట్లు వ్యవహరించడం రైతులకు ఇబ్బందులు ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయ అధికారులే సృష్టిస్తున్నారనేది జగమెరిగిన సత్యం. ఈనేపధ్యంలో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు నడుంబిగించడంపై రైతులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

శనగ విత్తనోత్పత్తి కేంద్రంగా నవాబుపేట..
మైలవరం, సెప్టెంబర్ 19: మండలంలోని నవాబుపేటను శనగ విత్తనోత్పత్తి కేంద్రంగా ఎంపిక చేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ ఠాగూర్ నాయక్ పేర్కొన్నారు. నవాబుపేట గ్రామంలో మంగళవారం శనగ ఉత్పత్తి దారుల కంపెనీ సంఘం సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న జెడి ఠాగూర్ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వం విత్తనోత్పత్తి కేంద్రాలను పెంచేందుకు ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని తగిన చర్యలు చేపట్టిందన్నారు. రైతులకు ప్రభుత్వం సరఫరా చేసే రాయితీ విత్తనాల ప్రమాణాలను పెంచేందుకు, సాగు విత్తనాల కల్పనకు విత్తనోత్పత్తి కేంద్రాలు దోహదపడాలన్నారు. నవాబుపేటను ఎంపిక చేయడం ద్వారా సాగు చేసే రైతులకు ఫౌండేషన్ విత్తనాన్ని 75శాతం రాయితీతో సరఫరా చేస్తామన్నారు. ఎప్పటికప్పుడు పంటను సంరక్షించేందుకు రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేందుకు విత్తనోత్పత్తి కేంద్ర గ్రామానికి ప్రత్యేకంగా వ్యవసాయ విస్తరణాధికారిని ఏర్పాటు చేస్తామన్నారు. దాల్మియా సియస్‌ఆర్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా పంటల రక్షణ, రైతుల అభివృద్ధికి దృష్టి సారించడం అభినందనీయమన్నారు. ఎపి సీడ్స్ జిల్లా మేనేజర్ అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ రైతులు పంట సాగులో మెళకువలు పాటించి విత్తనోత్పత్తి కేంద్రంలో మంచి దిగుబడులు సాధించాలన్నారు. పంటకు మార్కెట్ ధరకన్నా 20శాతం ఎక్కువతో కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. దాల్మియా సియస్‌ఆర్ విభాగాధిపతి రాజశేఖర్ రాజు మాట్లాడుతూ స్థానికంగా ఎక్కువగా సాగు చేస్తున్న శనగ పంట విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. రైతుల అభివృద్ధికి విత్తనోత్పత్తి కేంద్రాన్ని నవాబుపేటకు కేటాయించడం రైతులకు వరమన్నారు. దాల్మియా సియస్‌ఆర్, నాబార్డు సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన మెగావాటర్ షెడ్ పనులు, అభివృద్ధి పనులు విస్తృతంగా చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ప్రొద్దుటూరు ఎడిఎ అనిత, డిడిఎ రమాదేవి, శాస్తవ్రేత్త పురుషోత్తం, సైదులు, సియస్‌ఆర్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

త్వరలోనే జిల్లాకు కృష్ణాజలాలు..
* జిల్లా టిడిపి అధ్యక్షుడు వాసు
కమలాపురం, సెప్టెంబర్ 19: త్వరలోనే కడప జిల్లాకు కృష్ణాజలాలు విడుదల అవుతాయని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి (వాసు) తెలిపారు. ఆయన మంగళవారం నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్ పుత్తా నరసింహారెడ్డి, ఎమ్మెల్సీ బిటెక్ రవి, జిల్లా టిడిపి ఉపాధ్యక్షుడు సూదా అంకిరెడ్డితో కలసి మండలంలోని చిన్నచెప్పల్లి గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను కలుసుకుని ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అమలవుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విదంగా ప్రతి గ్రామంలో కూడా అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు, ఇళ్లు, రైతు, డ్వాక్రారుణాల మాఫీ అమలవుతున్నాయన్నారు. 24గంటల విద్యుత్, రైతులకు 7గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పారు. వికలాంగులకు హోండామోటర్ సైకిళ్లు అందచేయడం జరుగుతుందన్నారు. వీటన్నింటిని కూడా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎమ్మెల్సీ బిటెక్ రవి మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం రెండుకళ్లుగా చేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకెళుతున్నారన్నారు. మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి మాట్లాడుతూ ఇప్పట్లో ఎన్నికలు లేకపోయినప్పటికి సీఎం బాబు అనేక కొత్త సంక్షేమ పథకాలను ప్రకటించి ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపినేతలు ఖాదర్‌బాష, ప్రతాపరెడ్డి, సుబ్రహ్మణ్యం, పుల్లారెడ్డి, దాది రామయ్య పాల్గొన్నారు. అనంతరం జిల్లా టిడిపి అధ్యక్షుడు వాసు విలేఖర్లతో మాట్లాడుతూ చంద్రబాబు అనుభవపాలనతో నిర్మించిన పట్టిసీమ ప్రయోజనాలు కళ్లకు కనిపిస్తున్నాయన్నారు. శ్రీశైలం డ్యాంకు పెద్ద ఎత్తున నీరు రావడంతో కడప జిల్లాలోని గండికోట, తెలుగుగంగ, గాలేరు- నగిరి, వామికొండ, సర్వారాయప్రాజెక్టులకు కృష్ణానీటిని విడుదల చేయాలని జిల్లాలోని టిడిపి నేతలమందరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మంగళవారం కడప విమానాశ్రయంలో కోరడం జరిగిందన్నారు. ఈ విషయంపై కీలకనిర్ణయం తీసుకుని జిల్లాలోని ప్రాజెక్టులతో పాటు కెసికెనాల్‌కు కూడా నీరు విడుదల చేసే విషయంపై ప్రకటించడం జరుగుతుందని హామీ ఇచ్చారన్నారు. ఈ మేరకు జల్లాలోని అన్ని ప్రాజెక్టులకు 60టియంసిల కృష్ణాజలాలు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. దీంతో జిల్లాలోని భూములన్ని సస్యశ్యామలం కాగలవని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బిటెక్ రవి పాల్గొన్నారు.

ఉపాధ్యాయులకు పాఠశాలలు కేటాయించండి

కడప,సెప్టెంబర్ 19: రేషనలైజేషన్ పేరిట రెండుమాసాల క్రితం ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ముగియడంతో 224 మంది ఉపాధ్యాయులకు పాఠశాలలు కేటాయించలేదు. డిఇవో స్కూల్ పేరిట సంబంధిత ఉపాధ్యాయులకు పాఠశాలలు కేటాయించకుండా కూర్చోపెట్టి రెండునెలలుగా జీతాలు ఇస్తుంటే సంబంధిత అధికారులు చోద్యం చూస్తూ అవసరమున్న పాఠశాలలకు ఉపాధ్యాయులను పంపకుండా తీవ్రజాప్యం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జూన్ 12 నుంచి పాఠశాలలను పునఃప్రారంభించి ఆసమయంలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ మొదలుకావడం, జిల్లా వ్యాప్తంగా 10మందికి లోబడి ఉన్న విద్యార్థులకు చెందిన 130 పాఠశాలలు పైబడి మూతవేశారు. అయితే సంబంధిత పాఠశాలల్లో 224 మంది ఉపాధ్యాయులు ఉండగా వారికి బదిలీల ప్రక్రియలో పాఠశాలలు చూపించకుండా డిఇవో స్కూల్ కింద వారిని డిఇవో పరిధిలోనే ఉంచుకున్నారు. ఈ స్కూల్ కింద విధులు ఒక ప్రాంతంలో కేటాయించినట్లు చూపి వారికి మరో ప్రాంతం పాఠశాల నుంచి జీతం అందిస్తున్నారు. జిల్లాలో ప్రాథమికోన్నత పాఠశాల, ఉన్నత పాఠశాలల్లో చాలా వరకు ఖాళీలున్నాయి. అయితే డిఇవో స్కూల్ కింద ఉన్న ఉపాధ్యాయులకు ఆ ఖాళీలు చూపి అక్కడ భర్తీ చేస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయని అధికారులు అంటున్నారు. డిఇవో మాత్రం అవసరమున్న ఉపాధ్యాయుల కొరత తీర్చేందుకు మండల విద్యాశాఖాధికారులను, ఉప విద్యాశాఖాధికారులను నివేదికలు కోరుతున్నామని అంటున్నారే తప్ప క్షేత్రస్థాయిలో ఎక్కెడెక్కడ అధికంగా విద్యార్థులున్నారనేది విద్యాధికారులకు అన్నీ తెలిసి కూడా చోద్యం చూస్తున్నారు. ముఖ్యంగా 2014 డిఎస్సీలో జిల్లాలో 111 మంది ఉపాధ్యాయులు ఎంపిక కావడం, తెలంగాణ జిల్లాలతోపాటు ఇతర జిల్లాల నుంచి 38 మంది ఉపాధ్యాయులు 5సంవత్సరాల క్రితమే జిల్లాకు వచ్చి వారికి వివిధప్రాంతాలకు కేటాయించారు. ఈ బదిలీల ప్రక్రియలో 38 మంది డిఇవో స్కూల్ కింద వచ్చారు. ఇక జిల్లాలో అదనంగా 75మంది ఉపాధ్యాయులు ఖాళీగా ఉన్నారు. మొత్తం ఖాళీలు 224 మంది డిఇవో స్కూల్ కింద ఉన్నారు. వారికి ఇంతవరకు పాఠశాలలు కేటాయించకపోవడంతో గత రెండు మాసాలుగా జీతాలు తీసుకుంటున్నారు. విద్యాభివృద్ధికోసం ప్రభుత్వం కోట్లాదిరూపాయలు ఖర్చు చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా 4400 పైబడి పాఠశాలలు ఉన్నా చాలా పాఠశాలల్లో విద్యార్థులు ఎక్కువగా ఉండటం, ప్రస్తుతం ఉన్న సంబంధిత ఉపాధ్యాయులకు వారు బోధించే సబ్జెక్టులకు పొంతన లేదు. పిజిలు చదువుకుని అర్హుత కలిగి బోధించే ఉపాధ్యాయుల్లో చాలామంది అన్ని అర్హతలు ఉండి డిఇవో స్కూల్ కింద ఖాళీగానే ఉపాధ్యాయులున్నారు. వారందర్నీ సర్దుబాటుచేసి అన్ని పాఠశాలల్లో విద్యాబోధన సక్రమంగా జరిగేందుకు రాష్ట్ర విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

గ్రామాల్లో వైద్య సేవలు అందించాలి

రాజంపేట, సెప్టెంబర్ 19:గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అవసరం ఎంతైనా ఉందని విప్ మేడా వెంకట మల్లికార్జునరెడ్డి అన్నారు. మంగళవారం రాజంపేట మండలం హస్తవరం చెర్లోపల్లె జడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని విప్ మేడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచితంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలందించేందుకు ప్రైవేట్ ఆసుపత్రులు ముందుకు రావడం ఎంతో ఆనందదాయకమన్నారు. గ్రామాలలో అంటు వ్యాధులు వ్యాపిస్తున్నాయని, ప్రజలు కూడా జాగ్రత్త వహించి ఏదైనా అరోగ్య సమస్యలుంటే వెంటనే సంబంధిత ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ రోజు నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరంలో వ్యాధిని గుర్తించినవారికి నెల్లూరు నారాయణ ఆసుపత్రిలో ఉచితంగా వైద్య సేవలందించడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా ఇక్కడ నుండి వెళ్ళిన రోగులకు రవాణా, బస్ సౌకర్యం కూడా ఆసుపత్రి వారే ఉచితంగా ఏర్పాటు చేస్తారన్నారు. ఉచిత వైద్య శిబిరం నిర్వహించేందుకు వచ్చిన నెల్లూరు నారాయణ ఆసుపత్రి డాక్టర్లను మేడా అభినందిస్తూ మీకు వీలైనన్ని ఎక్కువ ఉచిత వైద్య శిబిరాలను రాజంపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని, ఇందుకు అవసరమైన అన్నిరకాల వౌళిక సదుపాయాలను ఏర్పటు చేయడం జరుగుతుందన్నారు. ఉచిత వైద్య శిబిరాల్లో రోగులకు అవసరమైన చికిత్సలు, పరీక్షలు నిర్వహించడంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేయడం ఎంతో సత్ఫలితాలిస్తుందన్నారు. భవిష్యత్తులో రోగాలున్నవారు ఆ రోగాలు ముదరకముందే చికిత్సలు నిర్వహించుకునేందుకు వీలవుతుందన్నారు. ఉచిత వైద్య శిబిరాలు మారుమూల గ్రామాల్లో కూడా నిర్వహించేందుకు దాతలు, వివిధ స్వచ్ఛంధ సేవా సంస్థలు ముందుకు రావాలన్నారు. ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బి.శ్యామల, ఉప సర్పంచ్ ఉమా మహేశ్వరరెడ్డి, ఎంపిటిసి నరశింహరాజు, టిడిపి సీనియర్ నాయకుడు డాక్టర్ సి.సుధాకర్, ఎస్.బాపణయ్యనాయుడు, రమణ, చెంగయ్య, మందపల్లె శ్రీను, సర్పంచ్ గంగిరెడ్డి, వెంకటేశ్వర్లునాయుడు, కొండయ్యనాయుడు, అజయ్, చైతన్య స్కూల్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
భూనిర్వాసితులకు న్యాయం చేస్తాం

చక్రాయపేట, సెప్టెంబర్ 19: కడప-బెంగళూరు వయా పెండ్లిమర్రి, నందిమండలం, ఇడుపులపాయ, చక్రాయపేట, లక్కిరెడ్డిపల్లె, రాయచోటి మీదుగా వాయల్పాడు నుండి బెంగళూరుకు వెళ్లే రైల్వే భూముల రైతులకు న్యాయం చేస్తామని ఆర్డీఓ చినరాముడు పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని గండికొవ్వూరు, చక్రాయపేట, చీలేకాంపల్లె గ్రామాల్లో రైతులకు అవగాహనా సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప నుండి బెంగళూరుకు వెళ్లే రైల్వే రోడ్డు సర్వే పూర్తిగా చేశామని కడప నుండి పెండ్లిమర్రి వరకు రైల్వేరోడ్డు పూర్తి కావడంతో గత నెల క్రితం నుండి పెండ్లిమర్రి వరకు రైలు వస్తూ, పోతోందన్నారు. అదే విధంగా పెండ్లిమర్రి నుండి సర్వే పూర్తయిందని రైతుల నష్టపరిహారం అందించిన వెంటనే రైల్వే పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు. రైల్వేరోడ్డు భూముల రైతులకు పట్టాదారు పాసుపుస్తకంలో ఎంత భూమి ఉంది, రోడ్డుకు ఎంత పోతుంది, అది బీడు భూమా, నిమ్మ తోటా లేదా మామిడి తోటా లేదా తదితర వాటి విలువలను ప్రభుత్వమే నిర్ణయించి నష్టపరిహారం పారదర్శకంగా అందించాలనే ఉద్దేశ్యంతో రైతులకు అవగాహనా సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే పెండ్లిమర్రి తరువాత నందిమండలం, ఇడుపులపాయ, చక్రాయపేట, సురభి, కుప్పగుట్టపల్లె, కోనంపేట, లక్కిరెడ్డిపల్లె, రాయచోటిల వద్ద రైల్వే స్టేషన్లు నిర్మించడం జరుగుతుందన్నారు. రైల్వేస్టేషన్లు ఏర్పాటు చేసిన చోట రైలు ఆగుతుందన్నారు. అనంతరం కడప జిల్లా ప్రాంత రైతులకు బెంగళూరుకు వెళ్లడానికి రైలు రావడం హర్షణీయమే కానీ, వారికి నష్టపరిహారాన్ని ప్రస్తుత ధరలకు వర్తింపచేసేలా చేయాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రామచంద్రారెడ్డి ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. తహసీల్దార్ నాగేశ్వరరావు, సీనియర్ ఇంజనీర్ ప్రతాప్‌రెడ్డి, ఆర్డీఓ కార్యాలయ డిప్యూటీ తహసీల్దార్ శంకర్‌రెడ్డి, రిటైర్డ్ తహసీల్దార్ సుబ్రమణ్యం, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రామచంద్రారెడ్డి, ముప్పళ్లకుంట చెరువు ప్రెసిడెంట్ అమరనాధరెడ్డి, సర్పంచ్ పెద్దరామయ్య, ఉపమండలాధ్యక్షుడు క్రిష్ణారెడ్డి, ఆర్‌ఐ శ్రీనివాసులునాయక్, వీఆర్‌ఓలు, సీనియర్ అసిస్టెంట్, ఏఎస్‌ఓ ప్రతాప్ గండికొవ్వూరు, చక్రాయపేట, చీలేకాంపల్లె, రైల్వే రోడ్డు నష్టపరిహార రైతులు తదితరులు పాల్గొన్నారు.