కడప

కెసి కెనాల్‌కు సాగునీరు విడుదల చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైదుకూరు,సెప్టెంబర్ 23: కడప రైతాంగానికి జీవనాధారమైన కెసి కెనాల్‌కు తక్షణమే కృష్ణాజలాలు విడుదలచేసి ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సాగునీటి విడుదలపై ప్రభుత్వం ఈనెల చివరిలోగా స్పష్టమైన ప్రకటనచేయాలని లేదంటే తాము అక్టోబర్ 2 నుంచి 48గంటల పాటు మైదుకూరులో ఆమరణ నిరాహారదీక్ష చేస్తామని ఎంపి వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డిలు ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో స్థానిక నాలుగురోడ్ల కూడలిలో కెసికెనాల్‌కు సాగునీరు విడుదల చేయాలని శనివారం మహాధర్నా నిర్వహించారు. ఈధర్నాలో ఎంపి అవినాష్‌రెడ్డితోపాటు వైకాపా జిల్లా అధ్యక్షుడు అమరనాధరెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, కడప ఎమ్మెల్యే ఎస్‌బి అంజద్‌బాషా, ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి, రైతు సంఘాల ప్రతినిధులు చంద్రవౌళీశ్వరరెడ్డి, డిఎన్ నారాయణ, ఎరికలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కెసి కెనాల్ రైతాంగానికి కృష్ణాజలాలు విడుదలచేసి ఆదుకోవాలని తాము కలెక్టర్ దృష్టికి తెచ్చామన్నారు. శ్రీశైలంప్రాజెక్టులో సామర్థ్యానికి మించి నీటి నిల్వవున్నప్పటికీ విద్యుత్ ఉత్పత్తినెపంతో కిందకునీరు విడుదలచేసి రాయలసీమ రైతాంగానికి నోట్లో మట్టికొడుతున్నారని వారు దుయ్యబట్టారు. పట్టిసీమ పేరుతో రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని గొప్పలు చెప్పి ఈ ప్రాంతానికి మొండిచేయి చూపిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కెసి తోపాటు తెలుగుగంగ, గాలేరు, గండికోట ప్రాజెక్టులకు కూడా కృష్ణాజలాలు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రతి ఏటా మైదుకూరు సెంటర్‌లో నీటికోసం కొట్టాడితే కానీ సాగునీరు విడుదల చేయని దుస్థితి దాపురిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లారైతాంగం కోసం రాజోలి ఆనకట్టనిర్మాణానికి అన్ని రకాల అనుమతులు ఇచ్చివున్నప్పటికీ నేటికీ నిర్మాణ పనులు చేపట్టకపోవడమే ఈ ప్రభుత్వ చిత్తశుద్దికి తార్కాణంగా నిలుస్తోందన్నారు. జిల్లామీదుగా 30 టిఎంసిల నీరు నెల్లూరు జిల్లాకు మేలుచేకూర్చే సోమశిల ప్రాజెక్టుకు చేరుతుంటే ఈ ప్రాంత రైతాంగం చూస్తు ఉండిపోయే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగ వైఖరిపట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వహిస్తే చూస్తు ఊరుకుండిపోయే పరిస్థితులు లేవని రైతాంగం పక్షాన ఎంతటి ఉద్యమాలకైనా తాము వెనుకాడబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో బాలయ్య యాదవ్, జెడ్పిటిసి బాలనసింహారెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు వీరనారాయణరెడ్డి, లక్షుమయ్య, ధనపాల యుగంధర్, బోసెట్టి లక్షుమయ్యతోపాటు రైతులు పాల్గొన్నారు.
కెసి కెనాల్‌కు నీరు ఇచ్చే పరిస్థితి లేదు : ఎఇ
మైదుకూరు,సెప్టెంబర్ 23: కెసి కెనాల్ ఆయకట్టుకు సాగునీరు విడుదలచేసే విషయంపై ప్రభుత్వం నుంచి తమకు ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదని కేవలం తాగునీటి కోసమే నీరు విడుదల చేయనున్నట్లు కెసి కెనాల్ ఎఇ రేస్మాసుల్తానా పేర్కొన్నారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి బుజ్జి అధ్యక్షతన సర్వసభ్యసమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, ఆయా శాఖల ప్రగతిపై సభకు నివేదించారు. ఈ నేపధ్యంలో కెసి కెనాల్ ఏఇ మాట్లాడుతూ పై విషయాన్ని సభకు నివేదించారు. ఎంపిడివో వేణుగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం వద్ద ఎలాంటినిధులు లేవన్నారు. కేవలం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి స్వచ్ఛ భారత్ కింద నిధులు మంజూరు చేస్తున్నారు. కార్యమ్రంలో వివిధ శాఖల అధికారులు, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
గండికోట పరిహారం అక్రమాలపై సిఐడి విచారణ

కడప,సెప్టెంబర్ 23: గండికోట రిజర్వాయర్ ముంపు గ్రామసస్థుల బాధితులకు చెల్లించిన నష్టపరిహారంలో రెవెన్యూ అధికారులు భారీ ఎత్తున స్వాహా చేసిన వ్యవహారంపై రాష్ట్రప్రభుత్వం సిఐడికి అప్పగించింది. ఆ పరిహారం చెల్లింపు అక్రమాల్లో పెద్ద ఎత్తున రెవెన్యూ అధికారులు, సిబ్బంది ప్రమేయం ఉండటంతో వారిపై చర్యల్లో భాగంగా శుక్రవారం అందుకు బాధ్యులైన జమ్మలమడుగు ఆర్డీవో వినాయకంను రాష్ట్రప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. మరికొందరిపై సస్పెన్షన్ వేటు వేసేందుకు రంగం సిద్దమైంది. గత కొనే్నళ్లుగా పరిహారం చెల్లింపులో అధికారులు కోట్లాదిరూపాయలు భోంచేస్తు వచ్చారు. నాలుగు మాసాల క్రితం కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన టి.బాబూరావునాయుడుకు గండికోట పరిహారం ఆయన దృష్టికి రావడంతో ఆయన ప్రాధమికంగా విచారణ చేయించారు. రెండునెలల క్రితం గండికోట పరిహారంపై జిల్లా రెవిన్యు అధికారులను నియామకం చేసి విచారణ చేశారు. నెలరోజుల క్రితం జాయింట్ కలెక్టర్ -2 శివారెడ్డిని అప్పటి ఆర్డీవో వినాయకంపై వచ్చిన ఆరోపణలపై విచారణకు ఆదేశించారు. జెసి శివారెడ్డి అక్రమాలు చోటుచేసుకున్నాయని నిగ్గుతేల్చడం, దీంతో కలెక్టర్ వినాయకంను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. రాష్ట్ర ఉన్నతాధికారులకు మరోమారు ఆర్డీవో అక్రమాలపై నివేదిక అందజేయడం, శుక్రవారం ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ వేటువేసి మరికొంతమందిపై విచారణ జరపాలని ఆదేశించింది. ఈమేరకు ప్రభుత్వం గండికోట ముంపుకంపు వ్యవహారాన్ని సిఐడికి అప్పగించారు. దాదాపు 21 గ్రామాలకు చెందిన ముంపుగ్రామాల్లో రూ.479కోట్లు పరిహారాన్ని చెల్లించారు. ఆ పరిహారంలో బినామీపేర్లు, బోగస్‌పేర్లు, ఆ ప్రాంతానికి చెందని వారిని కూడా చెందినవారిగా తప్పుడు రికార్డులు సృష్టించి గ్రామ రెవెన్యూ అధికారి మొదలుకుని డివిజనల్ అధికారి వరకు తమకు అనుకూలమైన వారి పేర్లను నమోదుచేయించి తప్పుడు పాసుపుస్తకాలు చేయించి, నిజంగా భూములున్నవారికంటే నకిలీ వారికే ఎక్కువ భూములున్నట్లు తప్పుడు రికార్డులు సృష్టించారు. బోగస్ రికార్డులను తయారుచేసి రెవెన్యూ అధికారులు దళారులు, పలువురు ఉద్యోగులతో కలుసుకుని దొరికినకాడికి దోచుకున్నారు. రూ.100కోట్లు పైబడే దళారులు, అధికారులు నకిలీ, బినామీ లబ్దిదారుల జాబితాలో చేర్చి, భూముల పరిహారం పేరిట కొంతమేరకు, ఇళ్లపరిహారం పేరిట మరికొన్ని నిధులు, పండ్లతోటల పేరిట కొన్ని నిధులు చొప్పున పలువురు అధికారులు 150మంది నకిలీలను తయారుచేసి రూ.100కోట్లు పైబడి స్వాహా చేసినట్లు ప్రాధమికంగా కలెక్టర్, ప్రభుత్వం అంచనాకు వచ్చింది. భూసేకరణ కార్యాలయంలో పనిచేసే రెవెన్యూ అధికారులు, కార్యాలయ సిబ్బంది, డిప్యూటీ తహశీల్దార్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఆర్డీవో వినాయకం దళారులతో కుమ్మక్కై రూ.100కోట్లు పైబడి తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నట్లు తెలుస్తోంది. అర్హులైన లబ్ధిదారుల పంపిణీలో కూడా సంబంధిత అధికారులు పర్సెంటేజీలు తీసుకుని పరిహారం చెల్లించినట్లు నిర్వాసితులే కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. 2004 నుంచి గండికోట రిజర్వాయర్ పరిహారం పంపిణీలో అవినీతి ఇష్టారాజ్యంగా జరిగిందని పలువురు స్థానికులు చెబుతున్నారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయినా పరిహారం చెల్లింపునకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులు విడుదల చేసినా ఆ పరిహారం చెల్లింపు వ్యవహారం అక్రమాల పుట్ట కారణంగా ఆ పరిహారం సమస్య ఇప్పట్లో పరిష్కారమయ్యేది కాదు. అక్రమాలకు అడ్డుకట్టవేసి నిర్వాసితులకు పరిహారం పూర్తిస్థాయిలో చెల్లించేందుకు కలెక్టర్ బాబూరావునాయుడు చర్యలకు శ్రీకారం చుట్టి ఈ వ్యవహారాన్ని సిఐడికి అప్పగించారు. దళారులు, అక్రమార్కులు, అధికారులపై క్రిమినల్ కేసులు బనాయించి అనర్హులు, దళారులు తీసుకున్న పరిహారాలను ప్రభుత్వానికి చెల్లించేందుకు వారిపై ఆర్‌ఆర్ యాక్టు ప్రయోగించి వసూళ్లు చేసేందుకు వేగవంతం చేస్తున్నారు. దీంతో పలువురు అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. దళారులు, బినామీలు వసూళ్లుచేసిన మొత్తంలో సగం అధికారులకు అప్పగించడం, సగం వీరు వినియోగించుకున్నారు. ప్రస్తుతం ఆ సొమ్మును రెవెన్యూ అధికారులచేత వసూళ్లు చేస్తారో, దళారులు, బినామీలచేత వసూళ్లు చేస్తారో వేచిచూడాల్సివుంది. ఆయినా ఈపరిహారం పంపిణీలో అక్రమాలు చోటుచేసుకోవడంతో ఎంతమందిపై కేసులు బనాయిస్తారో, అర్హులైన బాధితులకు పరిహారం చెల్లింపు పూర్తి ఎప్పుడు అవుతుందో కాలమే నిర్ణయించాల్సివుంది.

కెసి కెనాల్ కింద వరిసాగు ప్రశ్నార్థకమే?

కడప,సెప్టెంబర్ 23: జిల్లాలో కెసి కెనాల్ వరిసాగు ఆయకట్టుపై నీలినీడలు కమ్ముకుని వరిసాగు ప్రశ్నార్థకంగానే మారింది. ప్రస్తుతం కెసికి 10రోజులుగా 1500 క్యూసెక్కుల నీటిని ఆరుతడి పంటలకే వదులుతున్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటి మట్టం పెరిగినట్లయితే అక్కడి నుంచి మిగులు జలాలను పోతిరెడ్డి పాడుకు తరలించి తద్వారా కెసి కెనాల్‌కు పూర్తిస్థాయిలో నీరందిస్తామని అధికారులు అంటున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీకి నీరు పంపి తద్వారా కెసికి పూర్తిస్థాయిలో నీరు ఇస్తామని అధికారులు అంటున్నారు. అయితే ఈ ఏడాది సకాలంలో వర్షం కురవని కారణంగా జూన్, జూలై, ఆగస్టు నెలలో వర్షాలు లేని కారణంగా శ్రీశైలం రిజర్వాయర్‌కు నీరు చేరక కెసి కెనాల్‌కు నీరు ఇవ్వలేకపోయారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఈనెల 9నుంచి 1500 క్యూసెక్కుల నీటిని మాత్రమే వదిలారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో 885 అడుగుల నీరు నిల్వ చేయాల్సివుండగా, ఇప్పటి వరకు 862.8 అడుగులు మాత్రమే నీరు చేరింది. గత ఏడాది మాత్రం ఈ సమయానికి 874.2 అడుగుల నీరు ఉండేది. వర్షాలజాడ కన్పించని కారణంగా శ్రీశైలంకు నీరు చేరితే తప్ప నీరు ఇవ్వలేమని అధికారులు తెగేసి చెబుతున్నారు. రైతులు మాత్రం కెసి ఆయకట్టు సాగుపై ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నీరు ఇస్తారోనని అధికారికంగా ప్రకటన చేస్తే తప్ప తాము పంటలు సాగు చేయలేమని వాపోతున్నారు. వాస్తవంగా సంబంధిత అధికారులు మాత్రం వరిసాగు చేయరాదని ఆరుతడి పంటలు మాత్రమే సాగు చేసుకోవాలని అక్టోబర్ లేదా నవంబర్‌లో రెండువారాల వరకు కెసికి నీరు వదలుతామని అధికారులు అనధికారికంగా తెగేసి చెబుతున్నారు. కెసి నీటి విషయమై కర్నూలు, కడప కలెక్టర్లు, కెసి అధికారులు, సలహాదారు బోర్డు సమావేశంలో చర్చించి నిగ్గు తేల్చాల్సివుండగా అటువంటి సమావేశాలు ఈ ఏడాది జరగని కారణంగా ఆయకట్టు సాగుపై అధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేకపోతున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కురిసినా జిల్లాలో నీటికి కొరతవుండేది కాదు. ప్రస్తుతం వారం రోజుల క్రితం కురిసిన వర్షాలకు కృష్ణాజలాలన్నీ కర్నాటకలోని ఆల్‌మట్టి డ్యామ్‌కే చేరిపోయాయి. శ్రీశైలంలో నీరు గత ఏడాది ఈనెలకు దాదాపు 160 టిఎంసిల నీరు వుండేది. ప్రస్తుతం దాదాపు 115టిఎంసిల నీరు ఉండటం వల్ల శ్రీశైలం అధికారులు పోతిరెడ్డిపాడుకు నీరు తరలించలేమని, ఇక ఏమాత్రం వర్షాలు కురిసినా శ్రీశైలం రిజర్వాయర్‌కు నీరు చేరినా కర్నూలు జిల్లాకు, కడప జిల్లాకు నీరు వదులుతామని అధికారులు అంటున్నారు. కెసి కెనాల్ కింద జిల్లాలో అధికారికంగా 92వేల ఎకరాల్లో సాగుకు నోచుకోవాల్సివుండగా అనధికారికంగా లక్షా 20వేల ఎకరాలు పైబడి వివిధ పంటలను సాగు చేస్తున్నారు. ఖరీఫ్‌లో కెసి కెనాల్ కింద అరకొర పంటలు సాగుచేసి ప్రస్తుతం ఆ పంటలు దిగుబడి వచ్చే సమయానికి గత వారంరోజులుగా నీరు కొరతలేదు. అయితే చాలా మంది రైతులు వరినాట్లు వేసుకున్నందున రబీసీజన్‌లో వరి ఎక్కువగా కెసి కింద సాగు చేస్తారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో కెసి కెనాల్‌కు నీరు వదలకపోయినా రబీ ప్రారంభంలో నీరు వదలడంతో 35 నుంచి 40వేల ఎకరాల్లో వరిసాగుకు కొంతమంది వరినాట్లు వేసుకోగా మరికొంతమంది ఇప్పుడే వరినాట్లు వేస్తున్నారు. ఆ వరికి మూడు మాసాలుపాటునీరు ఉంటే తప్ప వరిపంట చేతికి అందదు. ఖరీఫ్‌లో సాగు చేసుకున్న వరిమాత్రం దిగుబడి అయ్యే అవకాశాలున్నాయి. కెసి కెనాల్ అధికారులు తాము మరో ఒకటిన్నర మాసం మాత్రమే నీటిని వదులుతామని రైతులు వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని ఆదేశించారు. చాలా మంది రైతులు కెసి అధికారుల మాటలు ఖాతరు చేయకుండా వరిసాగు చేస్తుండటంతో వరి దిగుబడి ప్రశ్నార్థకంగా మారనుంది. జిల్లాలోని ప్రొద్దుటూరు, చాపాడు, మైదుకూరు, దువ్వూరు, చెన్నూరు, ఖాజీపేట, వల్లూరు, కడప మండలాల్లో కెసి నీరు అందించాల్సివుంది. అధికారులు నీటిని ఎప్పటి వరకు విడుదల చేస్తారో ప్రకటించకపోవడంతో కెసి రైతులు ఢీలా పడ్డారు. ఆ నీటి కోసం ప్రభుత్వంపై వత్తిడి తెచ్చేందుకు శనివారం మైదుకూరు ఎమ్మెల్యే ఎస్.రఘరామిరెడ్డి నేతృత్వంలో మహాధర్నా చేపట్టినా ఆ ఆందోళనపై కెసి అధికారులు కానీ, జిల్లా ఉన్నతాధికారులు కానీ ప్రకటించకపోవడంతో కెసి ఆయకట్టు పంట దిగుబడిపై నీలినీడలు కమ్ముకుని ఉన్నాయి.

మొక్కలు నాటుదాం .. కాలుష్యాన్ని నివారిద్దాం

కడప,సెప్టెంబర్ 23: మానవ మనుగడకు పంచభూతాల్లో ఒకటైన చెట్లను ప్రతి ఒక్కరు సంరక్షించి కాలుష్యం నుంచి కాపాడుకుందామని జిల్లా కలెక్టర్ టి.బాబూరావునాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అటవీశాఖ ఆధ్వర్యంలో వనం-మనం కార్యక్రమం కింద మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల్లో మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత అప్పగించాలని మానవ మనుగడకు చెట్లు దోహదపడతాయని వాటిని జిల్లాలో విరివిగా నాటి సుం దర నగరంగా అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి విద్యార్థికి మొక్కలు నాటి వాటిని సం రక్షించే బాధ్యత అప్పగిస్తే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందన్నారు. అందు కు ఉపాధ్యాయులు విద్యార్థులకు చెట్లయొక్క ప్రాధాన్యత ఉపయోగాలపై అవగాహన కల్పించాలన్నారు. తొలుత కలెక్టర్ బాబూరావునాయుడు కన్సర్ వేటర్ ఆఫ్ ఫారస్టు కె.గోపీనాధ్ కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటా రు. అనంతరం ప్రభుత్వబాలుర బధిరుల జూనియర్ కాలేజిని సందర్శించి విద్యార్థులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో డిఎఫ్‌వోలు సలాం, గురుప్రభాకర్, సోషల్ ఫారెస్టు డిఎఫ్‌వో నాగరాజు, ఏపిఎంఐసి పిడి మధుసూధన్‌రెడ్డి, బిసి కార్పొరేషన్ ఇడి రామచంద్రారెడ్డి, ఆర్‌ఐవో రవికుమార్, కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ హబీబుల్లా, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
జొన్నపంటపై రైతులకు ఆశలు
రాజుపాళెం, సెప్టెంబర్ 23: రైతులకు జొన్నపంట సాగు ఆశక్తిని రేపుతోంది. ఇప్పటికే 300 హెక్టార్లకుపైబడి జొన్నపంట సాగులోకి వచ్చింది. కెసికెనాల్ ఆయకట్టు మెట్ట ప్రాంతంలో ఈ పంటను సాగుచేశారు. ప్రస్తుతం క్వింటాలు జొన్న ధర రూ.1800లు పలుకుతోంది. సక్రమంగా వర్షాలు కురిసి లేదా నీటి తడులు అందిస్తే ఎకరాకు 20 నుంచి 30 క్వింటాళ్ల వరకు దిగుబడులు వచ్చే అవకాశముంటుంది. మండలంలో గాదెగూడూరు, టంగుటూరు, తొండలదినె్న, వెంగళాయిపల్లె, రాజుపాళెం, సోమాపురం తదితర గ్రామాల్లో జొన్నపంట సాగైంది. గత ఏడాది కూడా సాగైన జొన్నపంటలో మంచి దిగుబడులు రావడం, ఎప్పుడూ లేని విధంగా జొన్న సొప్ప పశువుల మేత కోసం ఎకరాకు రూ.4 వేలు ఇచ్చి కొనుగోలు చేశారు. ఎక్కువగా మహేంద్రా, హైబ్రేడ్, మహాలక్ష్మి లాంటి జొన్న రకాలను సాగుచేశారు. కెసికెనాల్‌కు సాగునీరు విడుదల చేయకపోవడంతో ఆయకట్టు పరిధిలో కూడా జొన్నపంట సాగైంది. పెట్టుబడులు కూడా తక్కువగా వుండడంతో రైతులకు లాభాన్ని కలిగిస్తోంది. ఈ ఏడు రబీకి ముందు ఈ పంటను విస్తారంగా సాగుచేశారు.

భవానీదేవి అలంకారంలో అమ్మవారి దర్శనం

ప్రొద్దుటూరు టౌన్, సెప్టెంబర్ 23: దేవీ శరన్నవరాత్ర ఉత్సవాలలో భాగంగా మూడవరోజైన శనివారం అమ్మవారు శ్రీ భవానీదేవి రూపమంలో భక్తులకు దర్శనమిచ్చింది. స్థానిక శ్రీమత్కన్యకాపరమేశ్వరీదేవి ఆలయంలో వేకువజాము నుంచే అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని సుందరంగా అలంకరించి 6గంటలకు భక్తులను దర్శనానికి అనుమతించారు. అలాగే స్థానిక పాత మార్కెట్‌లో వెలసిన శ్రీ మహాలక్ష్మీ సమేత శ్రీ చెన్నకేశాలయంలో ధైర్యలక్ష్మీదేవి అలంకారములో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ లలితాదేవి, రతనాల వేంకటేశ్వరాలయంలో శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి, పట్టణ నడిబొడ్డున వెలసిన శ్రీ అగస్త్యేశ్వరాలయంలో శ్రీ భవానీదేవి, వైఎంఆర్ కాలనీలోని శ్రీ సాయినాథుని ఆలయంలో శ్రీ శారదాదేవి అలంకారములో అమ్మవారు భక్తులను అలరించారు. ఆయా ఆలయాల ఉత్సవ కమిటీ నిర్వాహకులు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా పర్యవేక్షించడంతోపాటు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. శనివారం కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో ఆలయాలకు వచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయాలకు వెళ్లు వీధులన్నీ భక్తులతో కిటకిటలాడాయి.

కూర్మావతారంలో శ్రీ సౌమ్యనాథుడు

నందలూరు, సెప్టెంబర్ 23:జిల్లాలో అతి ప్రాచీన ఆలయంగా ప్రసిద్ధి చెందిన నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న దసరా మహోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం జగద్రక్షకుడు శ్రీ మహావిష్ణువు స్వరూపుడైన శ్రీ సౌమ్యనాథస్వామి కూర్మావతారంలో దేదీప్యమానంగా భక్తులకు దర్శనమిచ్చారు. శనివారం పురస్కరించుకొని ఆలయంలో జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఆలయ ప్రధానర్చకులు సునీల్‌శర్మ స్వామివారి ఉత్సవమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పల్లకీపై కూర్మావతారంలో గ్రామ పురవీధుల్లో ఊరేగారు. ఈ సందర్భంగా ఆలయ పాలకమండలి ఛైర్మెన్ పల్లె సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆలయానికి విచ్చేసే వేలాదిమంది భక్తులను దృష్టిలో ఉంచుకొని శుక్ర, శని, ఆదివారాల్లో అన్నదాన సేవా ట్రస్ట్ ద్వారా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఇబ్బందుల్లేకుండా అన్ని చర్యలు చేపట్టామన్నారు.
నేడు నరసింహ అవతారం
దసరా ఉత్సవాల్లో భాగంగా ఆదివారం శ్రీ నరసింహావతారంలో శ్రీ సౌమ్యనాథుడు భక్తులకు దర్శనమివ్వనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

1నుంచి బయోమెట్రిక్ అమలు!

కడప,సెప్టెంబర్ 23: వచ్చేనెల ఒకటవ తేదీ నుంచి జిల్లాలోని అన్ని ప్రభుత్వకార్యాలయాల్లో బయోమెట్రిక్ ప్రవేశపెడుతున్న తరుణంలో పలువురు అధికారులు, సిబ్బంది గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. చాలా మంది అధికారులు క్యాంపుల పేర్లతో, మరికొంతమంది సిబ్బంది వివిధ డ్యూటీలతో కార్యాలయాల మొఖాలు చూడకుండానే డుమ్మాకొడుతూ వస్తున్నారు. ఆదాయం ఉన్న శాఖల్లో అధికారులు, సిబ్బంది సెలవుదినాల్లో కూడ కార్యాలయాలకు రావడం, దొరికిన కాడికి దండుకుంటున్నారు. చాలా మంది అధికారులు సోమవారం ప్రజావిజ్ఞప్తుల రోజు కావడంతో మొక్కుబడిగా కార్యాలయాలకు వచ్చి కన్పించి వెళ్లడం తప్ప, అర్జీలను పరిశీలించడం కానీ, పరిష్కరించడం కానీ జరగడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. చాలామంది అధికారులు వైద్యుల తరహాలో జబ్బు అడిగి తెలుసుకుని ఎర్రమాత్రలు, తెల్లమాత్రలు రాసిచ్చిన తరహాలో ఫిర్యాదు దారులు ఇచ్చిన అర్జీలు పరిశీలించకుండానే మొక్కుబడిగా టేక్ యాక్షన్ అని మొక్కుబడిగా రాయడం, సంతకాలు పెట్టడం షరామామూలైంది. ప్రస్తుతం బయోమెట్రిక్ అమలులోకి రాకతో ప్రతి అధికారి తు.చ తప్పక విధులకు హాజరుకావడం, సాంకేతిక యంత్రంలో తన వేలితో హాజరువేసుకోవాల్సివుంటుంది. అదే తరహాలో కార్యాలయ సిబ్బంది కూడా బయోమెట్రిక్ హాజరు నమోదుకు తప్పనిసరిగా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కొంతమంది ఉద్యోగులు ఉద్యోగ సంఘాల నేతలుగా చలామణి అవుతూ, మరికొంతమంది రాజకీయ నేతల పలుకుబడితో మరికొంతమంది ఉన్నతాధికారులను కాకా పట్టి ఇష్టారాజ్యంగా విధులకు హాజరుకావడం, ఇక మొక్కుబడిగా సోమవారం కార్యాలయాలకు మొఖం చూపించి శుక్రవారం వరకు వేలాపాల లేకుండా విధులకు హాజరై , రెండవ శనివారం వచ్చిందంటే శుక్రవారం నుంచే విధులకు గైర్హాజరు కావడం మామూలు రోజుల్లో శనివారం నుంచే విధులకు గైర్హాజరవుతూ వస్తున్నారు. ఏవైనా సభలు, సమావేశాలు, ముఖ్యనేతలు జిల్లాకు వచ్చినప్పడు జిల్లా అభివృద్ధి, సంక్షేమపథకాలపై మొక్కుబడిగా రికార్డులు తయారుచేయడం తప్ప ప్రజాసమస్యలు పరిష్కరించడంలోనూ, విధులు నిర్వహించడంలో తామేమీ చేస్తున్నామనేది అధికారులు, సిబ్బంది కి తెలియని పరిస్థితి నెలకొని నెలనెలా వేలాది రూపాయలు జీతాలు తీసుకుంటూ వస్తున్నారు తప్ప సామాన్య ప్రజలకు అందుబాటులో లేరనేది జగమెరిగిన సత్యం, ప్రస్తుతం ఫ్రభుత్వం బయోమెట్రిక్ విధానం అన్ని కార్యాలయాల్లో ప్రవేశపెట్టడం, వచ్చేనెల 1 నుంచి వాటిని అమలులోకి తీసుకొస్తున్నట్లు కలెక్టర్ బాబూరావునాయుడు శనివారం ప్రకటించారు. చిరు ఉద్యోగి నుంచి ఉన్నత ఉద్యోగి వరకు బయోమెట్రిక్ తో ఉదయం 10 గంటలకు హాజరైతే 5గంటల వరకు విధులు నిర్వర్తించక తప్పదు. పని దొంగలకు మొక్కుబడిగా ఉద్యోగం చేసే అధికారులు, సిబ్బందికి బయోమెట్రిక్ విధానం మింగుడు పడటం లేదు. బయోమెట్రిక్‌తోనైనా ప్రజలకు అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటారని ఆశిద్దాం