కడప

కెసికి నీరు ఇచ్చి తీరుతాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,సెప్టెంబర్ 24: జిల్లాలోని కెసి కెనాల్‌కు, గండికోట ప్రాజెక్టుకు నీరు ఇచ్చేందుకు సర్వశక్తులు వడ్డుతున్నామని అయితే ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తన పత్రికలో శ్రీశైలం జలాలను ప్రభుత్వం దొంగిలించిన విధంగా తెలంగాణ ప్రాంతంలో తన పత్రికలో ముద్రించడం, జిల్లాలో మాత్రం కెసికి నీటికోసం వైసిపి నేతలు ఆందోళన చేపట్టడం విడ్డూరంగా ఉందని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసారెడ్డి (వాసు) ఆదివారం విలేఖర్ల సమావేశంలో పేర్కొన్నారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా శ్రీశైలంకు నీరు చేరడమే ఆలస్యమైందని గత ఏడాది కెసి కెనాల్‌కు నీరు తాము హామీ ఇచ్చిన గడువులోపే ప్రభుత్వంనీరు వదిలిందని కెసి నుంచి జిల్లాకు నీరు తేవడం తథ్యమని గండికోటకు నీరు చేర్చి కనీసం 5టిఎంసిల నీటినైనా ప్రభుత్వం నిర్దేశించిన ప్రాంతాలకు సరఫరా చేస్తామని ఆయన ఘంటా పథంగా నొక్కిచెప్పారు. గత ఏడాది సెప్టెంబర్ మాసంలో 215 టిఎంసిలు నీరు శ్రీశైలం రిజర్వాయర్‌లో ఉండేదని గత 10రోజుల నుంచే శ్రీశైలం రిజర్వాయర్‌కు 160టిఎంసిల నీరు మాత్రమే చేరిందని, ప్రస్తుతం కెసి కెనాల్‌కు ఈనెల 9వ తేదీ నుంచి 1500 క్యూసెక్కులుపైబడి నీరును సంబంధిత అధికారులు వదిలారని, గత ఏడాది నీరు పుష్కలంగా ఉన్నందున శ్రీశైలం నుంచి కెసి కెనాల్‌కు ఆగస్టు 13 నుంచే నీరు విడుదల చేసినట్లు ఆయన గుర్తు చేశారు. కేవలం వైసిపి నేతలు తమ ఉనికిని కాపాడుకునేందుకు ప్రభుత్వంపై బురదచల్లడం, తమ అధినేత ఎన్.చంద్రబాబునాయుడుపై విమర్శలు చేయడం పనిగట్టుకుని అధికారదాహంతో వ్యవహరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇక ప్రతిపక్షనేత, వైసిపి అధినేత జగన్ మాత్రం ప్రాంతాలవారీగా, మతాలవారీగా ప్రజలను రెచ్చగొట్టడం, మీడియా తనచేతుల్లో ఉందని ఇష్టం వచ్చినట్లు రాయించడం, ప్రభుత్వంపై బురదచల్లడం షరామామూలైందన్నారు. శ్రీశైలం జలాలపై తెలంగాణ జిల్లాల్లో తన పత్రికలో సీమ జిల్లాలకు నీరు చోద్యమని రాయడం, సీమ జిల్లాలకు కృష్ణాజలాలు,శ్రీశైలం జలాలు రావడంలేదని అదే పత్రికలో ఈ ప్రాంతంలో రాయించడం జగన్ తన సొంత జిల్లాకే అన్యాయం చేస్తు ప్రభుత్వంపై బురదచల్లడం తగదని ఆయన హితవుపలికారు. కెసి కెనాల్‌కు నీరు ఎటు తిరిగి పూర్తిస్థాయిలో నీరు తెస్తామని రబీసీజన్‌లో పంటలు కాపాడుతామని, గండికోటకు నీరు తెప్పిస్తామని ఆయన పేర్కొన్నారు. 2019 ఎన్నికల కోసం అధికార దాహంతో సిద్దాంతాలు లేకుండా ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని, ఆయన కల కలగానే మిగిలిపోతుందని ఆయన జోస్యం పలికారు. ప్రభుత్వంచేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజలు కితాబు ఇస్తు ఆనందంగా ఉంటే వైసిపి నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేయడం దెయ్యాలు వేదాలు పలికినట్లు ఉందని ఆయన చమత్కరించారు. ఏది ఏమైనా త్వరలో కెసి కెనాల్‌కు పూర్తిస్థాయిలో నీరందిస్తామని, వామికొండ రిజర్వాయర్, సర్వారాయసాగర్ ,మైలవరం ప్రాజెక్టులకు నీరు ఇచ్చి పులివెందుల ప్రజల దాహాన్ని తీరుస్తామని ఆయన స్పష్టం చేశారు.
సబ్సిడీ విత్తనాల పంపిణీలో చేతివాటం!

కడప,సెప్టెంబర్ 24: జిల్లాలో సబ్సిడీ విత్తనాల పంపిణీలో సంబంధిత అధికారులు చేతివాటం ప్రదర్శించినట్లు సమాచారం. ఫలితంగా ప్రభుత్వానికి భారీగా నష్టం చేకూరింది. ప్రభుత్వరంగ సంస్థలు విత్తనాలు కొనుగోలుకు అధిక ధరలు చెల్లించి, రైతులకు మాత్రం నాసిరకం విత్తనాలు పంపిణీ చేశారని స్థానిక రైతులు విమర్శిస్తున్నారు. ఖరీఫ్ సీజన్‌లో వర్షాభావ పరిస్థితులు నెలకొని ఖరీఫ్‌లో పంటలసాగుకే జిల్లాలో నోచుకోలేదు. ఖరీఫ్ సీజన్‌లో రైతులు పంటలసాగుకు సర్వం సిద్ధం చేసుకుని అప్పులు చేసుకుని దుక్కులు చేసుకుని వర్షాభావంతో రైతులు పూర్తిగా విత్తనాలు విత్తుకోలేదు. ఖరీఫ్‌లో తీవ్రంగా నష్టపోయిన జిల్లా రైతాంగాన్ని ఆదుకునేందుకు రబీసీజన్‌లో వర్షాలు కురుస్తున్న తరుణంలో ప్రభుత్వం ముందుకొచ్చి పూర్తి సబ్సిడీతో అన్ని రకాల విత్తనాలు సరఫరా చేసేందుకు ఆరుతడి పంటలు చిరుధాన్యాలకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. అయితే అధికారులు ప్రభుత్వరంగ సంస్థలైన మార్క్‌ఫెడ్, ఏపి సీడ్స్, ఆగ్రో తదితర సంస్థలు కొంతమంది అధికారులతో కుమ్మక్కై మార్కెట్‌లో ధరలకంటే అధిక ధరలు వెచ్చించి బుడ్డశెనగ విత్తనాలు కొనుగోలు చేశారు. మార్కెట్‌లో బుడ్డశెనగ క్వింటాళ్లు రూ.6లోపే ధర పలుకుతుంటే, అధికారులు రూ.8వేలకు పైబడి కొనుగోలు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. జిల్లాలో ఒక బుడ్డశెనగ సాగుకే 80వేల క్వింటాళ్లు కావాల్సివుండగా, అధికారులు కొనుగోలుచేసిన మేరకు ప్రభుత్వాదాయానికి రూ.15కోట్లు పైబడి నష్టం వాటిల్లింది. ఇదే తరహాలోజిల్లాలో రైతులకు సరఫరాచేసిన సజ్జ, మినుము,రాగి, పెసలు,అలసందలు, కొర్రలు తదితర కాయదాన్యపు గింజలు ఇష్టారాజ్యంగా అధికారులు మార్కెట్‌లో రేటుకంటే అధికధరలు చెల్లించే ఆ విత్తనాలన్నీ కొనుగోలుచేసి రైతులకు సరఫరా చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ విత్తనాల్లో కూడా నాసిరకం విత్తనాలే ప్రైవేట్ ఏజెన్సీలను ఆశ్రయించి అధికారులకు అధికంగా ఆదాయం వచ్చే విత్తనాలే కొనుగోలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ప్రభుత్వరంగ సంస్థలైన మార్కెఫెడ్, ఏపిసీడ్స్ ఏటా సరఫరాచేసే వేరుశెనగ విత్తనపుకాయ నాసిరకమని ఒక పక్క రైతులు గగ్గోలు పెడుతుండగా మరో పక్క వ్యవసాయాధికారులు వాటిని గెర్మినేషన్ చేయించి సరైన మొలకలు రాకపోవడంతో ఆవిత్తనాలు నాసిరకమని తేలుస్తు వస్తున్నారు. ఇదే తరహాలో ప్రభుత్వరంగసంస్థలు ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించి నాసిరకం విత్తనాలు కొనుగోలు చేయడం, బహిరంగ మార్కెట్‌లో వాటి ధరకంటే అధికంగా వెచ్చించి కొనుగోలుచేసినట్లు రికార్డులు రాసుకుని ప్రజధనాన్ని దోపిడీ చేస్తున్నారనేది జగమెరిగిన సత్యం. జిల్లాలో 10 పైబడి ప్రైవేట్ ఏజెన్సీలు ఉండగా వారి నుంచే విత్తనపుకాయలు , విత్తనాలు కొనుగోలుచేసి సంబంధిత ప్రభుత్వరంగ సంస్థల ఉన్నతాధికారులే ముడుపులు తీసుకుని బహిరంగ మార్కెట్‌లో రేట్లకంటే రెట్టింపులో ఏజెన్సీలకు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఈ వ్యవహారాలపై రాష్ట్రప్రభుత్వానికి పలు మార్లు ఫిర్యాదులు అందడం జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపినా ప్రభుత్వరంగ సంస్థల మాయాజాలంతో నాసిరకం విత్తనాలు రైతులకు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు సరఫరాచేసిన విత్తనాలు రైతులు గంపెడు ఆశతో విత్తుకున్నా అవి ఇంతవరకు మొలకెత్తలేదని రైతులు వాపోతున్నారు. ఈ తరుణంలో రాష్ట్రప్రభుత్వం జిల్లాలో రబీ సీజన్‌లో సబ్సిడీ కింద పంపిణీ జరిగిన విత్తనాల వ్యవహారాన్ని విచారించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కార్మికుల దరిచేరని చంద్రన్న బీమా..

కడప,సెప్టెంబర్ 24: కార్మికులను, కార్మిక కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకునేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రన్న బీమా నమోదు కార్యక్రమం జిల్లాలో నత్తనడకలో కొనసాగుతోంది. జిల్లా టార్గెట్ 2లక్షల 34వేల మంది కార్మికులను నమోదు చేయాల్సివుండగా కేవలం 4వేల మంది వరకు నమోదు చేశారు. 2 సంవత్సరాలుగా చంద్రన్న బీమాపై రాష్టవ్య్రాప్తంగా ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేస్తున్నా జిల్లాలో ప్రచార లోపం, ప్రజల్లో అవగాహన లేకపోవడం, కార్మికుల గురించి పట్టించుకునే నాధుడే లేకపోవడం, చంద్రన్న బీమా పథకం నమోదు కార్యక్రమం అస్తవ్యస్థంగా కొనసాగుతోంది. చంద్రన్న బీమా పథకంలో చేరేందుకు కేవలం 2రోజులు మాత్రమే గడువు వుంది. సోమవారంతో గడువుముగుస్తుండటంతో జిల్లాలో టార్గెట్ పూర్తికాలేదని చెప్పవచ్చు. కార్మిక , కర్షకులకు సాధారణ మరణానికి రూ.30వేలు నుంచి రూ.2లక్షల వరకు ప్రభుత్వం బీమా పెంచిందని కేవలం లబ్దిదారుడు రూ.15లు చెల్లిస్తే బీమాపాలసీని ప్రభుత్వం అందజేస్తుంది. జిల్లాలో 9పురపాలక సంఘాలున్నా, అధికారులు కానీ, ప్రత్యేకించి పేదరిక నిర్మూలన కోసం ఏర్పాటుచేసిన మెప్మా అధికారులు, గ్రామీణ ప్రాంతంలో వెలుగు అధికారులు, సిబ్బంది చంద్రన్నబీమా పథకంపై ప్రజల్లో ప్రచారం చేయడంలేదు. ప్రతి అర్హుడిని చైతన్యవంతం చేసినట్లయితే ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ కంటే టార్గెట్‌ను మించి నమోదయ్యేందుకు లబ్దిదారులున్నారు. వెలుగు, మెప్మా అధికారులు తాము డ్వాక్రా గ్రూపులు బలోపేతం చేయలేకపోతున్నామని చంద్రన్న లాంటి బీమా పథకాల నమోదుకు కష్టంతో కూడుకున్న పని అని తెగేసి చెబుతున్నారు. కర్షకులు , కార్మికులు ఈ పథకంపై అవగాహన లేకనే చంద్రన్న బీమా కింద పేర్లు నమోదు చేసుకోలేకపోతున్నట్లు ఆరోపణలున్నాయి. గ్రామస్థాయిలో గ్రామకార్యదర్శులు, విఆర్వోలు, విఏలు, అనేక మంది సిబ్బంది ఉన్నా చంద్రన్నబీమా కార్యక్రమం కింద నమోదులో అడుగడుగునా అందరి నిర్లక్ష్యంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. సోమవారంతో గడువుముగియడంతో ఇక జిల్లాలోని పేదప్రజానీకానికి చంద్రన్న బీమా పథకం ద్వారా లబ్ది ఉండదని మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చంద్రన్న బీమా పథకం నమోదు కార్యక్రమంలో అర్హులందరినీ చేర్చి పేదలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

శ్రీ గజలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారు

కడప,(కల్చరల్)సెప్టెంబర్ 24: దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా నాల్గవరోజు ఆదివారం స్థానిక అమ్మవారిశాలలో శ్రీమత్స్యకన్యకాపరమేశ్వరీ అమ్మవారు గజలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 7గంటల నుంచి అమ్మవారికి పంచామృతాభిషేకం, సహస్రనామార్చన, ఉదయం 11గంటలకు మంగళహారతి తీర్థప్రసాద వినియోగాలు నిర్వహించారు. సాయంత్రం 6.30గంటల నుంచి అమ్మవారు గజలక్ష్మీదేవి అలంకారంతో భక్తులకు దర్శనమివ్వగా బారులు తీరిన మహిళలు, భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు విచ్చేశారు. శ్రీగజలక్ష్మీదేవి అలంకారంలో మత్య్సకన్యకాపరమేశ్వరీదేవి వజ్రవైడూర్య మణిమాణిక్యాలు పొదిగిన సువర్ణ శోభితమైన అలంకారంతో ప్రశాంతవదనంతో భక్తులకు దర్శనమిచ్చింది. అమ్మవారిశాలలో అమ్మవారికి రత్నకచక కిరీటధారణ, స్వర్ణ్భారణాల అలంకార శోభితమైన గజలక్ష్మీదేవిని చూసి భక్తులు తరించారు. గత నాలుగురోజులుగా అమ్మవారిశాలలో జరుగుతున్న నవరాత్రి ఉత్సవాలు రోజురోజుకు భక్తులను అలరిస్తున్నాయి. అలాగే శ్రీశ్రీశ్రీ విజయదుర్గాదేవి దేవస్థానంలో దసరా సందర్భంగా ఉదయం 4గంటలకు విశేషపూజా కార్యక్రమాలు , 36కలశాలతో విశేష అభిషేకం, చతుషష్టి ఉపచారపూజ తదితర కార్యక్రమాలతో కూష్మాండాదేవి అలంకారంతో అమ్మవారు దర్శనమిచ్చారు. దుర్గామాత నాల్గవ అవతరామైన కూష్మాంఢ దేవి దరహాసం చేస్తూ బ్రహ్మాండమును సృజించునది కావున అమ్మవారికి కూష్మాంఢా దేవి అనే పేరు విఖ్యాతమైనది. కూష్మాండం అనగా గుమ్మడికాయ. ఈదేవికి కూష్మాండ బలి ప్రీతికరమైనది కావడంతో అమ్మవారికి కూష్మాండాదేవి అని ప్రఖ్యాతి చెందింది. నవరాత్రి ఉత్సవాల్లో నాల్గవరోజున కూష్మాండదేవి స్వరూపానే దుర్గామాత భక్తుల పూజలు అందుకుంటుంది. కొద్దిపాటి భక్తిసేవలు కూడా ఈదేవి ప్రసన్నరాలు అవుతుందని, మానవుడు నిర్మల హృదయంతో ఈ అమ్మవారిని శరనజొచ్చినచో అతి సులభంగా పరమపదం ప్రాప్తించునని పురాణాలు ఘోషిస్తున్నాయి. కూష్మాంఢాదేవి అలంకారంతో విజయదుర్గాదేవి దేవస్థానం అలంకారశోభితంగా వెలుగొందింది. సాయంత్రం 6.30గంటల నుంచి అమ్మవారి కరుణాకటాక్షాలకు పాత్రులం కావాలని భక్తులు తంతోపతండాలుగా తరలివచ్చారు. ఉత్సవాల నిర్వాహకులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకున్నారు. ఇదిలా ఉండగా నగరంలోని పలుదేవాలయాల్లో కూడా దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఖాజీపేటలో...
ఖాజీపేట: దసరా ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారిశాలలో గజలక్ష్మీ అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. అమ్మవారికి ఉదయం నుంచి ప్రత్యేకపూజలు, అలంకారాలతోపాటు తీర్థప్రసాదాలు అధ్యక్షుడు రామకృష్ణయ్య, ఉపాధ్యక్షుడు మురళీ, కార్యదర్శి మోహన్,కోశాధికారి సుబ్బారావులు అందించారు. కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శివాలయంలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమివ్వగా ఉదయం నుంచే భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ కూడా కమిటీ సభ్యులు గంగిశెట్టి, జక్కావెంకట సత్యనారాయణ, వాసు, సత్యంలు పర్యవేక్షిస్తు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూశారు.
చెన్నూరులో..
చెన్నూరు: స్థానిక చౌడేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారికి ఆదివారం భవానీ దేవి అలంకారం చేశారు. ఆలాగే బ్రాహ్మణవీధిలో వాసవీకన్యకాపరమేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారికి గజలక్ష్మి అలంకారాన్ని చేశారు. సాయంత్రం 6గంటల నుంచి అమ్మవారు అలంకారాలు చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈసందర్భంగా భక్తులకు ఆలయాల నిర్వాహకులు అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేశారు.

పింఛా ప్రాజెక్టు నీరు వృధా..
సుండుపల్లె, సెప్టెంబర్ 24: పింఛా ప్రాజెక్టుపై రైతుల ఆశలు సన్నగిల్లుతున్నాయి. ప్రాజెక్టు గేట్ల ద్వారా భారీగా నీరు వృధా అవుతోంది. కడప, చిత్తూరు జిల్లాల సరిహద్దు ప్రాంతమైన పింఛా సమీపంలో నిర్మించిన యర్రపురెడ్డి ఆదినారాయణరెడ్డి పింఛా ప్రాజెక్టు రైతులకు వరప్రసాదిని. అలాంటి పింఛా ప్రాజెక్టుపై రైతన్నల ఆశలు నీరుగారుతున్నాయి. రెండు వారాల క్రితం భారీగా వర్షాలు కడప, చిత్తూరు జిల్లాల్లో పడటంతో ఆ నీరు పింఛా ప్రాజెక్టులోకి చేరడంతో జలకళ వచ్చింది. కానీ ఆ నీరు ప్రాజెక్టులో ఎక్కువ కాలం నిలిచి పొలాలకు నీటి తడులు అందించే ఆశలు కనపడటం లేదు. రైతులు ఆశించినంత లాభం చేకూర్చేలా లేదు. దానికి కారణం పింఛా ప్రాజెక్టు గేట్లు దెబ్బతినడం ముఖ్యకారణం. ప్రాజెక్టు గేట్ల ద్వారా భారీగా నీరు వృధా అవుతోంది. 94 అడుగుల వరకు చేరిన నీరు రోజు రోజుకూ వృధాగా ఏటిలోకి పోతోంది. శాశ్వత మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.3 కోట్లు మంజూరు చేసినా ఇప్పట్లో పనులు చేసే అవకాశం లేదు. కానీ తాత్కాలిక మరమ్మతులు అయినా చేయాల్సిన అవసరం ఉంది. దీనిపై అధికారులు, నాయకుల నుండి సరైన స్పందన అవసరం ఉంది. పూర్తి స్థాయిలో వృధా అయ్యే నీటిని ఆపకపోతే వేల కుటుంబాల రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. తాత్కాలిక మరమ్మతులతోనైనా వృధా నీటిని ఆపాలని పింఛా దిగువ ప్రాంతాల ఆయకట్టు రైతులు పేర్కొంటున్నారు.

భక్తులనలరించిన అన్నపూర్ణాదేవి

ప్రొద్దుటూరు టౌన్, సెప్టెంబర్ 24: దసరా ఉత్సవాలలో భాగంగా ఆదివారం అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులనలరించినది. పట్టణంలో వెలసిన శ్రీమత్కన్యకాపరమేశ్వరీదేవి ఆలయంలో వేకువజాము నుంచి వేదపండితులు అమ్మవారి మూలవిరాట్‌కు అభిషేకాలు, అర్చనలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే సాయంత్రం అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అందంగా తీర్చిదిద్దగా భక్తులు పెద్దసంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. కాగా పాతమార్కెట్‌లో వెలసిన శ్రీ మహాలక్ష్మీ సమేత శ్రీ చెన్నకేశవాలయంలో సంతానలక్ష్మీ అలంకారంలో, శ్రీ అగస్త్యేశ్వరాలయం (శివాలయం)లో శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో, శ్రీ లలితాదేవి, శ్రీ రతనాల వేంకటేశ్వరాలయంలో అన్నపూర్ణాదేవి అలంకారంలో, స్థానిక వైఎంఆర్ కాలనీలోని సాయినాథుని ఆలయంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆదివారం కావడంతో భక్తులు వేలాదిగా ఆలయాలకు చేరుకొని అమ్మవార్లను దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కాగా పోలీసులు ఆలయాల వద్ద గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు.
క్షేత్రస్థాయికి అధికారులు వెళ్లాలి..

కడప,సెప్టెంబర్ 24: జిల్లాలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు తీరుతెన్నులతోపాటు ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి అధికారులందర్నీ కలెక్టర్ టి.బాబూరావునాయుడు క్షేత్రస్థాయిలో పంపేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ భూములు దురాక్రమానికి గురికాకుండా అర్హులకే అందేలా చర్యలు, పేద కుటుంబాలకు ఎన్‌టిఆర్ గృహం పథకం కింద ఇళ్లు, పెన్షన్‌లేని వారికి పెన్షన్, బడిఈడు పిల్లలందర్నీ బడికి పంపేందుకు చర్యలు, ఆరోగ్యం పరిశుభ్రత, వ్యక్తిగత మరుగుదొడ్లు తదితరాలు పకడ్బంధీగా అమలుచేసేందుకు అధికారులు, సిబ్బందిపై కొరడా ఝళిపించేందుకు రంగం సిద్దమైంది. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం అమలు తీరుతెన్నులలో వాటి నిబంధనల తయారీలోనే కీలకపాత్ర వహించిన కలెక్టర్ ఉపాధిహామీ పథకాన్ని పకడ్బందీగా జిల్లాలో అమలుచేసేందుకు చర్యలు తీసుకోబోతున్నారు. అధికారుల పనితీరుపై వారం వారం సంబంధితశాఖ అధికారులు సాధించిన ప్రగతి శాఖలవారీగానే నిర్వహించనున్నారు. ప్రతి సోమవారం మీకోసంలో వచ్చే అర్జీలు జిల్లావ్యాప్తంగా పరిష్కారానికి వినూత్న కార్యక్రమం చేపట్టబోతున్నారు. అధికారులు కార్యాలయాల్లో వుండేందుకు వచ్చే నెల 1నుంచే బయోమెట్రిక్ విధానం కలెక్టర్ అమలులోకి తెస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా శాఖల పనితీరు మెరుగుపరిచి జిల్లాకు ఆదాయ వనరులు తెప్పించి, పండ్ల ఎగుమతి, జిల్లాలో ఉన్నఖనిజ సంపద ఎగుమతులు, ఆహార ఉత్పత్తులు, జిల్లాకు ఆదాయం పెంచడం, జిల్లా వృద్దిరేటును పెంచడం, సంక్షేమ పథకాల అమలుతీరుతెన్నులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి అన్నిరంగాల్లో జిల్లాను అగ్రస్థాయిలో తీర్చిదిద్దేందుకు అవినీతి అధికారులపై కొరడా ఝళిపిస్తూ జిల్లా అభివృద్ధే ధ్యేయంగా కలెక్టర్ ముందుకు సాగేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు.

రాయచోటి నియోజకవర్గం
అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే

గాలివీడు, సెప్టెంబర్ 24: నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా తన శాయశక్తులా కృషి చేస్తానని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఎస్‌కే మిషన్‌లో మండల వైసీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ వైకాపా అధినేత వై ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే అమలు చేయనున్న నవరత్నాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. ప్రధానంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజలకు సమగ్రంగా వివరించి తెలియజేయాలన్నారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన వెంటనే కృష్ణా జలాలను వెలిగల్లు ప్రాజెక్టుకు అందించి ఈ ప్రాంత రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. మండలంలోని కొన్ని ప్రాంతాలకు వెలిగల్లు ప్రాజెక్టు నీళ్లు వెళ్లవని అలాంటి ప్రాంతాలకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ప్రాజెక్టు నీటిని అందించి మెట్ట ప్రాంత రైతులను ఆదుకుంటామన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలన తిరిగి చూడాలంటే ప్రతి కార్యకర్తల సైనికుడిలా పనిచేసి పార్టీని విజయపథంలో పయనింప చేసేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిన్నరెడ్డి, మండల వైసీపీ నాయకులు యదుభూషణరెడ్డి, మాజీ జడ్పీటీసీ సుదర్శన్‌రెడ్డి, మండల ఉపాధ్యక్షులు రమేష్‌రెడ్డి, ఎంపీటీసీలు చిన్నరెడ్డి, లోకేశ్వర, రమణ, సర్పంచులు చంద్రారెడ్డి, ప్రసాదరెడ్డి, శంకర్‌రెడ్డి, ఉమాపతిరెడ్డి, వైసీపీ నాయకులు ఎస్‌కే ఖాదర్‌మొదీన్, విశ్వనాధరెడ్డి, కూరగాయల సుబ్బారెడ్డి, శంకర్‌నాయుడు, పలువురు వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

జమ్మలమడుగుకు మరోమారు ప్రాధాన్యం

జమ్మలమడుగు, సెప్టెంబర్ 24: రాష్ట్రంలో ఫ్యాక్షన్ గడ్డగా పేరొందిన జమ్మలమడుగుకు తెలుగుదేశం పార్టీ మరింత ప్రాధాన్యతనిస్తూ పార్టీ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్ష పదవిని ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో, కేంద్ర, రాష్ట్ర కమిటీ ఎంపికలో భాగంగా అధినేత చంద్రబాబునాయుడు మరోమారు జమ్మలమడుగు నియోజకవర్గానికి గుర్తింపును ఇచ్చారు. తెదేపా ప్రభుత్వం హయాంలో జమ్మలమడుగు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారికి అమాత్య పదవులు దక్కుతూ వస్తున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు. దీంతో పాటు తాజాగా నూతనంగా ఏర్పాటు చేసిన తెదేపా కేంద్ర, రాష్ట్ర కమిటీల్లో భాగంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి, కేంద్ర కమిటీలో అధికార ప్రతినిధిగా నియోజకవర్గ పరిధిలోని ఎర్రగుంట్లకు చెందిన రాజ్యసభ్యుడు సిఎం రమేష్‌నాయుడుకు ఇచ్చారు. జమ్మలమడుగు అసెంబ్లీ సెంగ్మెంట్ ఏర్పడిన తరువాత 14సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అనంతరం పొన్నపురెడ్డి శివారెడ్డి 1983లో తెదేపా తరపున భారీ మెజార్టీతో గెలిచారు. ఆ తరువాత 1985, 1989 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా శివారెడ్డి గెలిచారు. ఈ సమయంలోనే ఆయన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. 1993లో హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొని వస్తూండగా శివారెడ్డి ప్రత్యర్థుల చేతిలో హత్యకు గురయ్యాడు. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తమ్ముడి కుమారుడు పి.రామసుబ్బారెడ్డి 1994, 1999 ఎన్నికల్లో గెలిచారు. ఈ కాలంలో పిఆర్ అటవీ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పనిచేశారు. 2004 నుండి వరుసగా మూడు సార్లు దేవగుడి వారసుడిగా సి. ఆదినారాయణ రెడ్డి జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో వైకాపా నుండి గెలిచినప్పటికీ అధినేతతో విబేధాల కారణంగా 2016 ఫిబ్రవరిలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబునాయుడు ఈ ఏడాది జరిగిన మంత్రివర్గ విస్తరణలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి ఈ ఏడాది ఏప్రిల్ ప్రథమార్థంలో తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. కడప జిల్లా వ్యాప్తంతో పాటు జమ్మలమడుగుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వీయపర్యవేక్షణలో రాజకీయ పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే మంత్రి పదవి ఉండగా, అదనంగా ఎమ్మెల్సీ పదవిని కేటాయించారు. దీంతో పాటు నియోజకవర్గంలో ఇరువురికి పార్టీలోనూ ప్రాధాన్యత పదవులు కల్పించడం విశేషం. ఒకవైపు మంత్రి పదవి కల్పించడంతో రాష్ట్ర వ్యాప్తంగా తెదేపాకు అధికార కొనసాగింపుకు ఆదినారాయణ రెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డికి పార్టీ రాష్ట్ర కమిటీలో ఉపాధ్యక్ష పదవి ఇవ్వడంతో ఈయన రాష్టర్రాజకీయాల్లో కీలకస్థానం కల్పించినట్లయింది. అలాగే కేంద్ర కమిటీలో అధికార ప్రతినిధిగా ఎంపి సిఎం రమేష్‌కు అవకాశం దక్కడంతో జమ్మలమడుగు ప్రాధాన్యత అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తెదేపాకు సంక్లిష్టంగా ఉన్న కడప జిల్లాలో ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డికి, వైయస్ ఆర్ కాంగ్రెస్‌పార్టీకి చెక్ పెట్టేదిశగా జమ్మలమడుగు కీలక నేతలు అధినేత చంద్రబాబునాయుడు ఆశలను ఏమేర నెరవేర్చగలుగుతారో వేచిచూడాల్సిందే.