కడప

రాయలసీమ మైనార్టీలపై టిడిపి దృష్టి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,అక్టోబర్ 21: రానున్న 2019 ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం అధిష్ఠానం ముందస్తు చర్యల్లో భాగంగా రాయలసీమ జిల్లాలకు చెందిన మైనార్టీల అభివృద్ధికి చర్యలు చేపట్టి అదే వర్గానికి చెందిన ముగ్గురు, కేబినేట్ హోదా కలిగిన నేతలను జిల్లా పర్యటనలకు పంపేందుకు శ్రీకారం చుట్టారు. ఈ నేపధ్యంలో శుక్రవారం రాష్టమ్రైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ హిదాయత్, రాష్ట్ర ఉర్దూఅకాడమి చైర్మన్ నవ్‌మాన్, రాష్ట్ర హజ్‌కమిటీ చైర్మన్ అహ్మద్ హుస్సేన్, ఎమ్మెల్సీ షరీఫ్‌లను కడప నగరానికి పంపి మైనార్టీలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పర్యటనలు జరిపారు. ఏకంగా నలుగురు కీలక నేతలు మైనార్టీలు అధికంగా ఉన్న సీమ జిల్లాల్లోనే ప్రత్యేకించి పర్యటనలు జరపనున్నట్లు విశ్వనీయ వర్గాల సమాచారం. అలాగే మైనార్టీ కార్పొరేషన్ నుంచి ఒక్కో జిల్లాకు రూ.100కోట్లు చొప్పున నైపుణ్యాభివృద్ధి సంస్థ నేతృత్వంలో వివిధ శిక్షణలు ఇవ్వనున్నారు. కడపలో ఒకేరోజు మైనార్టీ యువతులకు దాదాపు రూ.50లక్షలు ఖర్చుచేసి కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. అలాగే 106 మసీదులు కొత్తగా కడపలో నిర్మించనున్నారు. చిత్తూరు జిల్లాలో 300 మసీదుల నిర్మాణాలు, అనంతపురం జిల్లాలో 200పైబడి మసీదు నిర్మాణాలు , కర్నూలు జిల్లాలో 300 మసీదులు నిర్మాణాలు చేపట్టేందుకు ప్రతిపాదనలు తయారు చేసినట్లు తెలిసింది. ముస్లిం మైనార్టీలు అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో తొలి నుంచి కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థులే విజయం సాధించడం అనంతరం ఏర్పడిన పరిణామాలతో వైఎస్సార్‌పార్టీవైపే అధికంగా ముస్లిం మైనార్టీలు ఉండటంతో వారిలో చైతన్యం తెచ్చేందుకే తెలుగుదేశంపార్టీ అధిష్ఠానం రాష్ట్రంలో మైనార్టీ వర్గానికి చెందిన నలుగురు సీనియర్ నేతలను రాయలసీమ జిల్లాల వైపు మళ్లించారు. ఈనలుగురు నేతలు జిల్లాల్లో సంబంధిత మైనార్టీనేతలు, అన్ని రాజకీయపార్టీలకు చెందిన నేతలతో సంప్రదింపులు చేసి మసీదులు, దర్గాల నిర్మాణం, హజ్‌యాత్రకు వెళ్లేందుకు దరఖాస్తులు స్వీకరించడం, మైనార్టీ యువత మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీ, అంతో ఇంతో విద్యాభ్యాసం చేసిన వారికి వారికి ఆసక్తి కలిగినవారిలో జిల్లాలో కనీసం 4వేలమందికి శిక్షణ ఇచ్చి వారికి బ్యాంకు రుణాలు ఇచ్చేందుకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇటీవల నంద్యాల ఉప ఎన్నికల్లో మైనార్టీ ఓటర్ల తీర్పు తెలుగుదేశం వైపే ఉండటం, ఎన్నికల సమయంలో మైనార్టీల ప్రాంతాల్లో సంక్షేమ పథకాలు పంపిణీ చేయడం, అభివృద్ధికి శ్రీకారం చుట్టడం, శాశ్వత గృహాలు కేటాయింపు, రుణాల పంపిణీతో మైనార్టీల్లో చైతన్యం వచ్చి టిడిపికి ఓట్లు వేశారని అధిష్ఠానం గుర్తించింది. ఈ నేపధ్యంలో రాయలసీమ జిల్లాల్లో మైనార్టీలు అధికంగా ఉన్న కడప, రాజంపేట, ప్రొద్దుటూరు, మైదుకూరు, కర్నూలు, నంద్యాల, ఆళ్లగడ్డ, బనగానపల్లి, అనంతపురం జిల్లాల్లోని కదిరి, అనంతపురం, తాడిపత్రి, పెనుకొండ, ధర్మవరం, చిత్తూరు జిల్లా పీలేరు, తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, పుంగనూరు, వాయల్పాడు తదితర ప్రాంతాల్లో రాష్టస్థ్రాయి నలుగురు నాయకులు సభలు, సమావేశాలు నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 2019 ఎన్నికల నాటికి మైనార్టీ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి టిడిపి అధిష్ఠానం సర్వం సిద్ధం చేసుకుందని చెప్పవచ్చు.

వర్షం నీటిని నిల్వ చేయాలి..

రాజంపేట, అక్టోబర్ 21:రాజంపేట డివిజన్‌లో వరుస కరవును దృష్టిలో ఉంచుకొని వర్షం నీటి నిల్వకు చర్యలు చేపట్టాలని, రానున్న రబీకాలంలో వర్షాభావ పరిస్థితులపై ఇప్పటి నుండే సమీక్షలు జరిపి తగువిధంగా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం ఈ యేడాది ఎంతైనా అవసరమని పలుగ్రామాల రైతాంగం నుండి విజ్ఞప్తులు వినిపిస్తున్నాయి. పై ప్రాంతంలోపడ్డ భారీ వర్షాలతో చెయ్యేరు, పెన్నా నదులు పొంగి ప్రవహించడంతో చెయ్యేరు, పెన్నా నదీ పరీవాహక ప్రాంతాల్లో భూగర్భజలాలు పెరగడం, అన్నమయ్య ప్రాజెక్టుకు పూర్తిస్థాయిలో నీటిమట్టం రావడంతో ఈ ప్రాజెక్టు క్రింద ఆయకట్టుకు సాగునీటి సమస్యలు తీరడం, చెయ్యేరు నదిని నమ్ముకున్న 24 ఊటకాలువల క్రింది రైతాంగం ప్రయోజనాలు బాగుపడ్డా, డివిజన్‌లో చెరువులు, కుంటలకు సాగునీటి చేరికలు లేవు. అయితే పలు చెరువులకు వరిపంటకు అవసరమైన సాగునీటి చేరికలు లేకున్నా కొద్దిపాటి నీరు చేరి ఉంది. దీంతో వీటి క్రింద ఆయకట్టు రానున్న రోజుల్లో భారీ వర్షాలు పడకుంటే బీడుగా ఉండాల్సిందే. కనుక ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే కరవుతో బతుకుభయంతో ఉన్న ఇక్కడి రైతాంగాన్ని ఆదుకునేందుకు వర్షాభావ పరిస్థితులను కూడా దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ పంటల సాగుకు, సబ్సిడీతో విత్తనాలను అందించేందుకు వీలుగా ప్రణాళికలు చేపట్టడంవల్ల వలసలను ఆరికట్టేందుకు వీలవుతుందన్న అభిప్రాయం వ్యవసాయ శాఖలో కూడా వినిపిస్తుంది. గతంలో ఇలాంటి ప్రణాళికలు సిద్దం చేసినా అమలులో సరైన విధానం అవలంభించని కారణంగా రైతాంగాన్ని ఆదుకోవడంలో సత్ఫలితాలు సాధించలేదన్న విమర్శలు వ్యవసాయశాఖపై ఉన్నాయి. ఈ యేడాది కూడా ఖరీఫ్‌లో వర్షాలుపడని కారణంగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులను కార్యోన్ముఖులను ఇప్పటి నుండే చేయడం ఇందుకోసం సబ్సిడీతో అవసరమైన విత్తనాలను సిద్ధంచేయడం ఎంతైనా అవసరమన్న డిమాండ్‌ను కొట్టిపారేసేందుకు వీలులేదు. ఈ విషయంలో జిల్లా వ్యవసాయశాఖనే కాకుండా, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ముందుచూపుతో ఆలోచన చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. వరుస కరవుతో అల్లాడుతున్న రైతాంగాన్ని ప్రస్తుతం జాతీయ ఉపాధిహామీ పథకం జిల్లాలో కొంతవరకు ఆదుకుంటున్నట్టు కనిపిస్తున్నా అది పూర్తిస్థాయిలో సత్ఫలితాల దిశగా పయనించడం లేదన్నది మాత్రం వాస్తవం. కనుక తిరిగి ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే ఇక్కడి రైతులను వ్యవసాయ కూలీలను వలసలు వెళ్ళకుండా ఆపడం చాలా కష్టమైన పనని కూడా పలు వర్గాలు భావిస్తున్నాయి. కనుక ఇప్పటినుండే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా వర్షాలు పడినా పడకపోయినా కొంతవరకు రైతులను ఆదుకునేందుకు వీలవుతుందన్నది వాస్తవం. రెండేళ్లుగా వర్షాల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వర్షాభావ పరిస్థితులు ఏర్పడి రబీలో కూడా చెరువుల క్రింది ఆయకట్టు రైతులకు కరవు రావడం జరిగితే పరిస్థితులపై ప్రత్యేక నివేదికలు రూపోందించుకోవడం వల్ల వర్షాలను బట్టి అధికారులు పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించి తగు విధంగా చర్యలు తీసుకొని రైతాంగాన్ని ఆదుకునేందుకు సులభంగా ఉంటుందన్నది వాస్తవమే. అయినా ఈ విషయంలో ఉన్నతాధికారుల స్పందన ఏ విధంగా ఉంటుందన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకం. వర్షాలువస్తే దానికి తగ్గట్టుగా రైతు పంట వేసుకునే అవకాశం కల్పించేందుకు సూచనలు ఇవ్వడం పెద్ద కష్టమైన పని కాదు. కనుక ముందుజాగ్రత్త చర్యలు ఎంతైనా అవసరమన్నది అనుభవజ్ఞులైన రైతులు అంటున్నారు. అలాగే ఇప్పటివరకు రైతులకు అందజేసిన సబ్సిడీ విత్తనాలు అధునాతన పరికరాల వివరాలకై కూడా నివేదికలు రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందంటున్నారు. ప్రతి ఏటా వర్షాభావ పరిస్థితులు ఏర్పడడం ఈ పరిస్థితుల్లో రైతులు వరిసాగు చేసుకోలేరని నివేదికలు పంపించడం అప్పుడు ప్రత్యామ్నాయ పంటలకు అవసరమైన విత్తనాలను సబ్సిడీకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం జరుగుతూ వస్తుంది. ఇందువల్ల రైతులకు మేలుకన్నా కీడే ఎక్కువవుతుంది. గత రెండేళ్ల చరిత్రను పక్కనుంచితే పదిహేను సంవత్సరాలుగా వర్షాల పరిస్థితిని డివిజన్‌లో అంచనాకట్టినా ముడూ నాలుగేళ్లు మినహాయించి వర్షాలు పడిన జాడ కనిపించదు. కనుక ముందుజాగ్రత్త చర్యలు రైతును ఆదుకునేందుకు తీసుకోవడం ఎంతైనా అవసరమన్నది ప్రభుత్వం గుర్తించాల్సి ఉంది. రైతుల సంక్షేమంపై ఎన్నో మాట్లాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి వీలుగా ముందుజాగ్రత్త చర్యలపై దృష్టి కేంద్రీకరించడం ఎంతైనా అవసరం.

23న కమలాపురంలో భవన నిర్మాణం కార్మికుల ధర్నా
వేంపల్లె, అక్టోబర్ 21: ఈనెల 23న భవన నిర్మాణ కార్మికుల ఆధ్వర్యంలో కమలాపురంలో జరుగుతున్న ధర్నాను విజయవంతం చేయాలని భవన నిర్మాణ కార్మికుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు టోపీవలి, ఓబులేసు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. అలాగే ప్రమాదబీమా కింద రూ.5 లక్షల నుండి రూ.10 లక్షలు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రభుత్వం మంజూరు చేయాలన్నారు. సహజ మరణానికి రూ.30 వేల నుండి రూ.5 లక్షల వరకు కేటాయించాలన్నారు. వివాహ కానుక రూ.10 వేల నుండి రూ.1 లక్ష వరకు పెంచాలన్నారు. గుర్తింపుకార్డు కలిగిన ప్రతి కార్మికునికీ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ ఫలాలు అందేవిధంగా ప్రభుత్వం కృషి చేయాలన్నారు. వేంపల్లె మండలంలోని భవన నిర్మాణ కార్మికుల కోసం స్థలాన్ని కేటాయించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు ఉత్తన్న, కార్యదర్శి రామాంజనేయులు, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు బాలాజీ, దస్తగిరి, సంజీవ్, శీను, రామాంజి, చండ్రాయుడు తదితరులు పాల్గొన్నారు.

అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు

లక్కిరెడ్డిపల్లె,అక్టోబర్ 21: అర్హులైన ప్రతి లబ్దిదారునికి ప్రభుత్వం నుంచే వచ్చే పథకాలు అందుతున్నాయా లేది అని తెలుసుకుని, అందని వారికి పథకాలు అందేలా చర్యలు తీసుకునేందుకే ఇంటింటికి టిడిపి కార్యక్రమం అని రాయచోటి నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే ఆర్.రమేష్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం లక్కిరెడ్డిపల్లెలోని పెట్రోల్‌బంక్, చర్చివీది, వైఎస్సార్‌కాలనీ, నలందనగర్ తదితర ప్రాంతాల్లో ఇంటింటికీ టిడిపి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వృద్ధులకోసం, వితంతువులకోసం రూ.200 నుంచి రూ.1000లు వరకు పెన్షన్ పెంచారన్నారు. అలాగే అర్హులైన లబ్దిదారులకు ఎన్‌టిఆర్ గృహాలు మంజూరుచేస్తున్నామన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తెస్తే వచ్చే జన్మభూమి కార్యక్రమంలో వాటన్నింటిని పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాసులు, ఎంపిటిసి చండ్రాయుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపిపి ఉమాపతిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు రాఘవేంద్ర, నాయకులు అంజాద్‌అలీఖాన్, బిసి నాయకులు వాసుదేవుడు, మాజీ సర్పంచ్‌లు దేవనాధరెడ్డి, వెంకట్రామిరెడ్డి, హరినాధ్, సర్పంచు భువనేశ్వరరెడ్డి, జయరాం, రవిశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎలక్షన్ కేసులను సత్వరం పరిష్కరించాలి

కడప,(లీగల్)అక్టోబర్ 21: కొన్ని సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఎలక్షన్ కేసులను సత్వరం పరిష్కరించాలని జిల్లాప్రధాన జడ్జి జి.శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లాకోర్టు ప్రాంగణంలో శనివారం ఒక్కరోజు పోలీసులు, జ్యుడిషియల్ ఆఫీసర్ల కో ఆర్డినేషన్ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా జడ్జి వారినుద్దేశించి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా క్రిమినల్ కేసుల్లో 1044 పోలీసులు కోర్టుల్లో చార్జ్‌షీట్ దాఖలు చేయగా కేవలం 91 కేసుల్లో సిసి నెంబర్ అయ్యాయని మిగిలిన చార్జ్‌షీట్స్ వాపసు చేశారని, అలాగే ఏవైనా క్రైమ్ స్టేజిలో ఉండే కేసుల్లో ముద్దాయిలు తప్పించుకుని తిరుగుతున్నా మిగిలిన వారిపైన చార్జ్‌షీట్ దాఖలు చేయాలని, తద్వారా సాక్షులను కోర్టుల్లో హాజరుపెట్టి సత్వర కేసుల పరిష్కారానికి వీలౌతుందన్నారు. కాగా ప్రస్తుతం ఎలక్షన్ కేసుల్లో రైల్వేకోడూరులో 2016 నుంచి 4 కేసులు, బద్వేలులో ఒక కేసు, ప్రొద్దుటూరులో 3, రాజంపేటలో 1, మైదుకూరులో 5, జమ్మలమడుగులో 6, ఎల్.ఆర్.పల్లిలో 1, పులివెందులలో 7కేసుల్లో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వీటిలో సత్వరం పరిష్కారమైతే పోలీసులు ఎలక్షన్ నాటికి కొత్త కేసులు రిజిస్టర్ చేసుకునేందుకు ఇబ్బందులు ఉండవన్నారు. ఎస్పీ అట్టాడబాబూజీ మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో 383 మంది పోలీసులు విధి నిర్వహణలో మృతి చెందారని అలాగే జిల్లా వ్యాప్తంగా ప్రధాన కూడళ్లల్లో సిసి కెమెరాలు అమర్చి నేరాలు జరగకుండా అరికట్టేందుకు అలాగే ప్రజలకు భద్రత కల్పిస్తున్నామని ఎవరైనా మత్తు పదార్థాలు సేవించి వాహనాలు నడిపితే అట్టివారిపై అక్కడే వారికి జరిమానా రశీదు ఇస్తున్నామని, కోర్టుల్లో ప్రవేశపెట్టి శిక్షలు కూడా వేస్తున్నామన్నారు. మారుతున్న సమాజానికి అనుగుణంగా పోలీసుశాఖ తమ పద్దతులు మార్చుకుంటోందని కావున జ్యుడిషిల్ ఆఫీసర్లు పోలీసుశాఖకు ఎంతో సహకారం అందిస్తున్నారన్నారు. కాగా ఫారెస్టు శాఖ , రెవెన్యూశాఖ మాకు ఎంతో సహకారం అందిస్తున్నారన్నారు. కలెక్టర్ టి.బాబూరావునాయుడు మాట్లాడుతూ రెవెన్యూ శాఖ సివిల్ కేసుల్లో కోర్టుకు సహకరిస్తోందని అలాగే ఏ వ్యక్తి అయినా చట్టం ముందు తలవంచక తప్పదని, మారుతున్న టెక్నాలజి ప్రకారం పోలీసు, జ్యుడిషిల్ చక్కగా పనిచేసి నేరాలు కట్టడికి కృషి చేయాలన్నారు. ఈ సమావేశానికి అదనపు జడ్జిలు అన్వర్‌బాషా, శ్రీనివాసమూర్తి, ఎస్.ప్రసాద్, తిరుమలరావు, సీనియర్ సివిల్ జడ్జిలు సిఎన్ మూర్తి, శుభవాణి, జూనియర్ జడ్జిలు సత్యకుమారి, శ్రీ్ధర్, పద్మశ్రీ, శోభారాణి, సుధాసాయి, అశోక్‌కుమార్, జిల్లాలోని డిఎస్పీలు శ్రీనివాసులు, మాసూంబాషా, పులివెందుల అదనపు ఎస్పీ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

రేషన్‌షాపు డీలర్ల భర్తీకి నోటిఫికేషన్
జమ్మలమడుగు, అక్టోబర్ 21: జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్ పరిధిలోని 16 మండలాల్లో ఖాళీగా ఉన్న రేషన్ షాపు డీలర్ల భర్తీకి ఆర్డీవో నాగన్న నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ విషయమై ఆర్డీవో నాగన్న మాట్లాడుతూ డివిజన్ పరిధిలో జమ్మలమడుగు మండలంలో 10 రేషన్ డీలర్ల ఖాళీలు, పెద్దముడియంలో 8, మైలవరంలో 11, ముద్దనూరులో 7, కొండాపురంలో 8, ప్రొద్దుటూరు 7, చాపాడు 3, మైదుకూరులో 4, దువ్వూరులో 4, పులివెందులలో5, లింగాలలో 4, సింహాద్రిపురంలో9, తొండూరులో 6, వేములలో 6, వేంపల్లె మండలంలో 5 చొప్పున మొత్తంగా 97 రేషన్ షాపులకు డీలర్లను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు సంబంధిత మండలాల్లోని తహశీల్దార్ కార్యాలల్లో దరఖాస్తులను తీసుకొని, పూర్తి చేసిన వాటిని తహశీల్దార్ కార్యాలయంలోనే అందజేయాల్సి ఉంటుందన్నారు. నోటిఫికేషన్‌లో సూచించిన మేరకు రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులకు ఈ నెల 23వ తేదీ నుండి నవంబర్ 6వ తేదీ వరకు గడువు ఇవ్వడం జరిగిందన్నారు. అర్హులైన దరఖాస్తుదారులకు నవంబర్ 19వ తేదీన పరీక్ష నిర్వహిస్తామన్నారు. ప్రధానంగా 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు, 18-40 ఏళ్లలోపు వయస్సు ఉన్నవారు, స్థానికులైన వారు అర్హులవుతారని ఆర్డీవో నాగన్న తెలిపారు.
ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడమే
చంద్రబాబు లక్ష్యం

కడప,(కల్చరల్)అక్టోబర్ 21: జిల్లాలోని ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందినప్పుడే లక్ష్యానికి ప్రతి ఒక్కరు చేరుకునేందుకు ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని టిడిపి జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసారెడ్డి పేర్కొన్నారు. శనివారం నగరంలోని 44వ డివిజన్ ఇన్‌చార్జి రాజశేఖరరెడ్డి, కార్పొరేటర్ పార్వతమ్మ ఆధ్వర్యంలో ఇంటింటికీ టిడిపి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో వాసుతోపాటు రాష్టన్రాయకులు ఎస్.గోవర్దన్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి బి.హరిప్రసాద్, నగర అధ్యక్షుడు జిలానీబాషా, మైనార్టీ నాయకులు విఎస్ అమీర్‌బాబు పాల్గొని ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటికి తెలుగుదేశం నాయకులు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని సమస్యలు వ్యాప్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో రైతులు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే దక్కిందన్నారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లలో ప్రభుత్వ చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సక్రమంగా అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఫ్లోర్‌లీడర్ జికె విశ్వనాధరెడ్డి, బాలకృష్ణయాదవ్, కె.వెంకటరామిరెడ్డి, బుఖారి, నిజాం, కె.సుబ్బరాయుడు, దాసరి శ్రీనివాసులు, , లోకేష్, రమణమ్మ, పార్వతమ్మ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

స్వచ్ఛ భారత్ విజయవంతం చేయాలి

నందలూరు, అక్టోబర్ 21: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న స్వచ్ఛ్భారత్ కార్యక్రమాన్ని అందరూ భాగస్వాములై సమష్టి కృషితో విజయవంతం చేయాలని కలెక్టర్ బాబూరావునాయుడు పిలుపునిచ్చారు. శనివారం నందలూరు మండలానికి విచ్చేసిన కలెక్టర్ ఆడపూరు ప్రాథమిక పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాల స్థితిగతులను స్వయంగా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆర్డీఓ వీరబ్రహ్మం, తహశీల్దార్ చంద్రశేఖర్, పలువురు అధికారులతో మరుగుదొడ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. ఆయా గ్రామాలలో నియమితులైన అధికారులు మరుగుదొడ్ల నిర్మాణంపై ప్రత్యేకశ్రద్ద వహించి లేనివారు నిర్మించుకునేలా చూడాలన్నారు. ఆర్డీఓ వీరబ్రహ్మం నందలూరు, ఆడపూరులతో పాటు పలు గ్రామాలలో మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించారు. గ్రామాల్లోని అంగన్వాడీల సహకారంతో సర్వేతో పాటు చేసే పనులపై పూర్తి సమాచారాన్ని ఎప్పటికపుడు ఆన్‌లైన్ చేయాలని ఆర్డీఓ సూచించారు. నందలూరును ఓడిఎఫ్ మండలంగా ప్రకటించేందుకు అందరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేకాధికారి శ్రీనివాసులు, తహశీల్దార్ చంద్రశేఖర్, ఈఓఆర్డీ ప్రసాద్, ఎఓ నాగలక్ష్మీ, ఎఎస్‌ఓ సుబ్బరాయుడు, ఆర్‌ఐ సతీష్, విఆర్వోలు పాల్గొన్నారు.

కేసును తప్పుద్రోవ పట్టించకండి..

నందలూరు, అక్టోబర్ 21:తన భర్త ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాడు కాడని, హత్య చేశారని వెంటనే నిందితులపై కేసు నమోదుచేసి తమకు న్యాయం చేయాలని మృతుని భార్య తన బంధువులు, గ్రామస్థులతో కలసి పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించిన సంఘటన శనివారం చోటు చేసుకుం ది. మృతుని భార్య జి.రాజేశ్వరి, సోదరుడు హరిబాబు చెప్పిన కథనం మేర కు వివరాలిలావున్నాయి. నాగిరెడ్డిపల్లె రెడ్డివారివీధిలో ఈ నెల 16న అనుమా నాస్పద స్థితిలో గుండుబోయిన లక్ష్మీనరసయ్య (34) తన ఇంటి సమీపంలోని స్నేహితుని ఇంట్లో మృతి చెందిన సంఘటన జరిగింది. తన భర్త మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని, పాటూరు జడ్పీ హైస్కూల్ రికార్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శివశంకర్ ఇంట్లో మృతదేహం లభించడం, మృతదేహంపై చెప్పలేనిచోట పలు గాయాలుకావడం జరిగిందన్నారు. అంతకు ముందు రోజు శివశంకరయ్య, జయరామయ్యతో కలసి మద్యం సేవించడం, ఆపై తన భర్త మృతి చెందడం, వారు ఇరువురు పరారీయై ఫోన్ ద్వారా మా ఇంట్లో ఎవరో చనిపోయారని తెలపడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. వారు ఇరువురు తన భర్తను హత్యచేసి ఉంటారని వారు ఆరోపించారు. వెంటనే నిందితులను అరెస్టుచేసి, తమకు న్యాయం చేయాలన్నారు. ఇక్కడ న్యాయం జరగకుంటే జిల్లా ఎస్పీకి, మానవ హక్కుల సంఘం, కలెక్టర్‌ను ఆశ్రయిస్తామన్నారు. రోజు కూలీ పని చేస్తూ తమను పోషిస్తున్న తన భర్త చనిపోవడంతో ఇద్దరు కుమారులు, కూతురు, తాను అనాథలయ్యామని, న్యాయం జరిగేంత వరకు నిరాహారదీక్ష చేపడతామన్నారు. ఎస్సై మాట్లాడుతూ ఈనెల 16వ తేది జరిగిన అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన గుండుబోయిన లక్ష్మీనరసయ్య మృతికి సంబంధించి కేసును నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు. కేసును అన్నికోణాల్లో దర్యాప్తుచేసిన అనంతరం కోర్టుకు సమర్పించి, బాధితులకు న్యాయం చేస్తామని, ఎలాంటి అపోహలు తగవన్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన బాధితులకు తెలిపారు. బాధితుల తరపున మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు శివప్రసాద్, టిడిపి మండల అధ్యక్షులు బి.లక్ష్మీనరసయ్య ఎస్సైతో మాట్లాడి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.