కడప

అధికారంలోకి రాగానే రాజోలి ప్రాజెక్టు నిర్మిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దువ్వూరు, నవంబర్ 12 : సీమకు సాగునీరందించడంలో ప్రభుత్వం విఫలమైందని వైకాపా అధినేత వైఎస్.జగన్మోహన్‌రెడ్డి ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాయలసీమలోని భూములను సస్యస్యామలం చేస్తామన్నారు. రాజోలు ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేసి భూములకు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. జగన్ చేపట్టి ప్రజా సంకల్ప యాత్ర 6వ రోజు ఆదివారం మైదుకూరు నియోజకవర్గంలోని దువ్వూరు మండలానికి చేరుకుంది. సాయంత్రం దువ్వూరులో జరిగిన సభలో జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ దివంగత వైయస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో కెసి కెనాల్‌కు ఆగస్టులోనే నీళ్లు విడుదల అయ్యేవని అప్పుడు సంవత్సరానికి రెండు పంటలు పండించే ఆయకట్టు రైతులు ఇప్పుడు ఒక్క పంట కూడా పండించలేని స్థితిలో ఉన్నారని అన్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్‌లో పూర్తిస్థాయిలో నీరున్నా రాయలసీమకు నీళ్లు ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టంలేదని ఆరోపించారు. కమీషన్ కోసమే ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని ఆరోపించారు. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ధరల స్థితికరణ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చాడు. ఈ ప్రాంతంలో పండించే కె.పి. ఉల్లిగడ్డలు, పసుపు తదితర పంటలకు శీతల గిడ్డంగులు ఏర్పాటు చేస్తానని ఆయన సూచించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఏఒక్క హామీని తెలుగుదేశం ప్రభుత్వం నెరవేర్చలేదని జగన్ ఆరోపించాడు. 2014 సంవత్సరానికి ముందు చౌకదుకాణంలో రేషన్ కార్డులకు బియ్యంతోపాటు కిరోసిన్, కందిపప్పు, పామాయిల్, చక్కర, గోధుమపిండి, చింతపండు, తదితర వస్తువులను పేదలకు అందించేవారని, 2014 తర్వాత ఒక్క బియ్యం తప్పా మిగతా వస్తువులన్నీ తొలగించారన్నారు. ఆ బియ్యం కోసం కూడా వేలిముద్రలు వేయాలని నిబంధన పెట్టారని, వేలిముద్రలు పడక బియ్యం కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. ముఖ్యమంత్రి అడ్డగోలుగా ఎన్నికల హామీలు గుప్పించి ప్రస్తుతం వాటిని మరచిపోయారని విమర్శించాడు. 2019 ఎన్నికల్లో మీరందరు నన్ను ఆశీర్వదించాలని, మీ ఆశీస్సులు కావాలి, మీ బిడ్డను ఆదుకోవాలంటూ రెండు చేతులెత్తి నమస్కరించారు.
జాబు రావాలంటే బాబు రావాలని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని, రైతు, డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని, బ్యాంక్‌లోఉన్న ఆడపడుచుల బంగారం పూర్తిగా విడిపిస్తానని చెప్పి వాటిలో ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించాడు. వైకాపా అధికారంలోకి రాగానే వృద్ధుల ఫించన్లు పెంచుతామని, రైతులు, చేనేత కార్మికులు, అన్నికులాల సంఘాలను ఆదుకుంటానని హామి ఇచ్చారు.

జగన్‌కు జనం నీరాజనం
ప్రజా సంకల్ప యాత్ర ఆదివారం మధ్యాహ్నం 2.45 నిముషాలకు ప్రొద్దుటూరు నుంచి దువ్వూరు మండలంలోని గోపులాపురం క్రాస్‌రోడ్డు వరకు చేరుకుంది. అక్కడ మైదుకూరు శాశనసభ్యులు శెట్టిపల్లె రఘురామిరెడ్డి పెద్దఎత్తున స్వాగతం పలికారు. భోజన విరామం తర్వాత తిరిగి పాదయాత్ర ప్రారంభమైంది. దారి పొడువునా పెద్దఎత్తున రోడ్డుపై పూలుచల్లి స్వాగతం పలికారు. పంటపొలాల్లో పనిచేసుకునే రైతులు, వరి నాటుతున్న కూలీలు అర కిలోమీటర్ దూరం నుంచి పరిగెత్తుకుంటూ జగన్‌ను చూసేందుకు వచ్చారు. అలాగే సుగాలిదండ నుండి మహిళలు పెద్దఎత్తున వచ్చి జగన్‌మోహన్‌రెడ్డికి వారి బాధలు చెప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మైదుకూరు శాశనసభ్యులు రఘురామిరెడ్డితో పాటు జిల్లా వైసిపి అధ్యక్షులు ఆకెపాటి అమర్‌నాథ్‌రెడ్డి, రాయచోటి ఎంఎల్‌ఎ గండికోట శ్రీకాంత్‌రెడ్డి, రైల్వేకోడూరు ఎంఎల్‌ఎ కొరముట్ల శ్రీనివాసులరెడ్డి, చాపాడు, మైదుకూరు, ఖాజీపేట, బి.మఠం, దువ్వూరు మండలాలకు చెందిన నాయకులు, జడ్పీటిసిలు, ఎంపిపి, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

సెయిల్ ఆంథోని స్కూల్‌కు ఉత్తమ పాఠశాల అవార్డు

పోరుమామిళ్ల,నవంబర్ 12: జిల్లా గ్రామీణ ప్రాంతంలో బెస్ట్‌స్కూల్ అవార్డును అందుకున్న సెయింట్ ఆంథోని స్కూల్ ఆదివారం బెంగళూరులోని 5వ నేషనల్ కాన్ఫరెన్స్‌లో భారతదేశంలో 500 బెస్ట్‌స్కూల్ అవార్డులు అందివ్వగా అందులో కడప జిల్లాలో పోరుమామిళ్ల ఆంధోని స్కూల్‌కు బెస్ట్‌స్కూల్ అవార్డు అందడం గర్వకారణమని ప్రిన్సిపల్ సునందారెడ్డి, చైర్మన్ చిత్త విజయప్రతాప్‌రెడ్డిలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు విలేఖర్లతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో కడప జిల్లాలోనే అన్ని వసతులు కలిగిన స్కూల్ ఆంథోని స్కూల్ అని, ఐఐటి, ఒలంపియాడ్ తదితర ఉన్నత టెక్నాలజీలతో అందిస్తున్నామన్నారు. ప్రస్తుత కాలంలో లాభాపేక్ష లేకుండా విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని వారికి ఆధునిక టెక్నాలజితోపాటు అనుభవమున్న ఉపాధ్యాయులతో విద్యనందిస్తున్నామన్నారు. ఇందుకుగాను మా స్కూల్‌కు బెస్ట్‌స్కూల్ అవార్డు రావడం అభినందనీయమన్నారు. ఈకార్యక్రమంలో కర్నాటక విద్యాశాఖ మంత్రి అన్వర్‌సేత్ హాజరయ్యారన్నారు.

చేనేతలను ఆదుకుంటాం

ప్రొద్దుటూరు/ప్రొద్దుటూరు టౌన్, నవంబర్ 12: అధికారంలోకి రాగానే చేనేతలను అన్నివిధాలా ఆదుకుంటానని వైకాపా అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ప్రొద్దుటూరు నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభించిన జగన్ రూరల్ పరిధిలోని అమృతానగర్‌కు చేరుకోగా చేనేతలు పెద్దసంఖ్యలో కలిశారు. ఈ సందర్భంగా జగన్ రాట్నం తిప్పారు. చేనేతల కష్టాలు తనకు తెలుసునని, వైకాపా అధికారంలోకి వస్తే వారి సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని సూచించారు. రుణమాఫీ పేరుతో ప్రభుత్వం మహిళలు, రైతులను మోసం చేసిందన్నారు. కనీసం పేదలకు ఉండటానికి ఇళ్లుకూడా ఇంతవరకు కట్టించిన పాపాన పోలేదని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్‌రెడ్డి హయామంలో మంజూరైన ఇందిరమ్మ కాలనీలో కనీసం వౌళిక సదుపాయాలను ప్రజలకు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. తాము అధికారంలోకి రాగానే ఇళ్లులేని పేదలకు ఉచితంగా గృహాలను నిర్మించి ఇస్తామని, వౌళిక వసతులు కల్పిస్తామని, భూగర్భ డ్రైనేజి పనులు పూర్తిచేస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. అనంతరం చెనమరాజుపల్లె, కామనూరు, రాధానగర్‌ల గుండా పాదయాత్ర కొనసాగించారు. యాత్రలో ఎంపి వైఎస్.అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, మాజీ ఎంఎల్‌ఎ ఎంవి రమణారెడ్డి, మండల వైసిపి నాయకులు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, నేలటూరు వెంకటసుబ్బారెడ్డి, వెలవలి నారాయణరెడ్డి, వైసిపి కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కాగా ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ప్రొద్దుటూరు మండలంలో పర్యటిస్తున్న జగన్ దృష్టికి పలు కులసంఘాలు, వ్యాపార సంఘాలు తమ సమస్యలను వినతి పత్రం ద్వారా తీసుకువచ్చాయి. ప్రైవేట్ కళాశాలల యూనియన్ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయుల యూనియన్లు, చేనేతలు, సగర కులస్తులు (ఉప్పర) తమ సమస్యలను జగన్ దృష్టికి తీసుకెళ్ళారు. వారి సమస్యలనువిన్న జగన్ సానుకూలంగా స్పందిస్తూ అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

నేడు అగస్తీశ్వరస్వామి ఆలయంలో కార్తీక పూజలు

కమలాపురం, నవంబర్ 12: హిందువులకు అతి పవిత్రమైన కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో మండలంలోని శివాలయాలన్నీ ముస్తాబయ్యాయి. ఆలయాలను విద్యుత్‌దీపాలతో, మామిడి తోరణాలతో అందంగా అలంకరించారు. మండలంలోని పురాతన దేవాలయాల్లో ఒకటైన చదిపిరాల అగస్తీశ్వరస్వామి ఆలయం ఒకటి. ఈ ఆలయంలో గత మూడువారాలుగా, కార్తీక పౌర్ణమిరోజున పెద్ద ఎత్తున అన్నదాన నకార్యక్రమాలు, భజన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చివరి సోమవారం ఈ ఆలయంలో అన్నదాన కార్యక్రమం గ్రామోత్సవం నిర్వహిస్తున్నారు. అలాగే మండల పరిధిలోని మరో పురాతన శివాలయం అయిన పెద్దచెప్పల్లి అగస్తీశ్వరస్వామి ఆలయంలో, పట్టణంలోని పాతాళసోమేశ్వరస్వామి ఆలయంలో, గంగవరం, కోగటం, రామాపురం ఆలయాల్లో కార్తీకసోమవారం పెద్ద ఎత్తున అభిషేకాలు, విశిష్టపూజలు, మహిళల నోములు, గ్రామోత్సవాలు నిర్వహించనున్నారు.

పోలీసుల సేవలు ఎనలేనివి..

సిద్దవటం,నవంబర్ 12:సంఘ విద్రోహ శక్తులను ఎదుర్కోవడంలో పోలీసుల సేవలు ఎనలేనివని కలెక్టర్ టి.బాబూరావునాయుడు పేర్కొన్నారు. 11వ ఏపిఎస్పీ బెటాలియన్‌లో ఆదివారం 12వ క్రీడావార్షికోత్సవ క్రీడాపోటీల ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిధిగా హాజరై ప్రసంగించారు. పోలీసు వృత్తి ఎంతోకష్టతరమైందన్నారు. గతంలో గ్రేహౌండ్స్ తదితర వాటిని పోలీసులు చూసేవారన్నారు. ప్రస్తుతం ఉగ్రవాదుల కార్యక్రమాలు తగ్గుముఖం పట్టాయన్నారు. మనిషి జీవించేది కొద్దిరోజులు మాత్రమేనని జన్మ అనేది చాలా గొప్పదన్నారు. పోలీసు వృత్తి ఎంతో క్రమశిక్షణతో కూడుకున్నదన్నారు. పోలీసులు రాష్ట్రానికి, దేశానికి మంచిపేరు తేవాలన్నారు. బెటాలియన్‌లోని సమస్యలను కమాండెంట్ తన దృష్టికి తేవడం జరిగిందని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రధానంగా ఇళ్లస్థలాల కేటాయింపు, బెటాలియన్‌లో రోడ్లు, లైబ్రరీకి భవన నిర్మాణం, స్విమ్మింగ్‌ఫూల్ తదితర వాటి పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. పోలీసులు కుటుంబాన్ని, వారి పిల్లల గురించి ఆలోచించేందుకు కూడా సమయం ఉండదని ధర్మాన్ని, న్యాయాన్ని కాపాడేందుకు వారు ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తారన్నారు. అహర్నిశలు ప్రజలకోసం తపిస్తూ సంఘవిద్రోహ శక్తులను ధీటుగా ఎదుర్కొంటున్న పోలీసులు కృషి చేయడం జరుగుతుందన్నారు. నగరానికి దగ్గరగా స్థల ఉన్నట్లయితే ఇళ్లస్థలాలు కేటాయింపుకోసం కృషి చేస్తామన్నారు. అనంతరం కలెక్టర్ క్రీడాపోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఓవరాల్ చాంపియన్ షిప్ ఎఫ్.కంపెనీ దక్కించుకోగా, ఆల్ రౌండర్‌గా కె.నాగరాజు దక్కించుకున్నారు. అనంతరం పోలీసులు కలెక్టర్‌కు అభివాదంచేసి ఈకార్యక్రమంలో కమాండెంట్ రాజకిశోర్‌బాబు, అడిషనల్‌కమాండెంట్ శామ్యూల్‌జాన్, అసిస్టెంట్ కమాండెంట్లు ఉదయ్‌కుమార్, కేశవరెడ్డి, హనుమంతప్ప, సురేష్‌బాబు, ఆర్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, ఏపిఎస్పీ బెటాలియన్ అసోసియేషన్ అధ్యక్షుడు షరీఫ్ పాల్గొన్నారు.