కడప

అర్ధాంతరంగా డిగ్రీ పరీక్ష కేంద్రం మార్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయచోటి, నవంబర్ 17: పట్టణంలో రాజు డీఈడీ డిగ్రీ పరీక్ష కేంద్రాన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మార్పు చేస్తున్నట్లు వైవీయూ అధికారులు శుక్రవారం వెల్లడించారు. యోగివేమన యూనివర్శిటీ పరిధిలో ఈ నెల 15వ తేదీ నుంచి డిగ్రీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాయచోటి పట్టణంలో ప్రభుత్వ, పలు ప్రైవేటు డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఈ కశాశాలలో మొతం 3 వేల మంది విద్యార్థులు డిగ్రీ పరీక్షలు రాస్తున్నారు. వీరికి పట్టణంలో రెండు పరీక్ష కేంద్రాలను యూనివర్శిటీ అధికారులు కేటాయించారు. ఇందులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరొకటి రాజు డీఈడీ కళాశాల. ఈ రెండు కేంద్రాల్లో డిగ్రీ పరీక్షలు గత మూడు రోజుల నుంచి ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉన్నట్లుండి రాజు డీఈడీ కళాశాల కేంద్రాన్ని అర్ధాంతరంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మార్చుతున్నట్లు యూనివర్శిటీ అధికారులు పేర్కొన్నారు. దీంతో విద్యార్థులు అయోమయంలో పడ్డారు. ఈ పరీక్ష కేంద్రం మార్పులో కరెస్పాండెంట్ల హస్తం ఉన్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఎందుకంటే రాజు డీఈడీ కళాశాలలో ప్రతి ఒక గదికి సీసీ కెమెరాలు ఉండటంతో విద్యార్థులు ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా చెక్ పెట్టినట్లు అయిం ది. అంతేకాకుండా ఇదే విధంగా భవిష్యత్తులో నిఘా నీడలో యూనివర్శిటీ అధికారులు పరీక్షలు నిర్వహిస్తే ప్రైవేటు డిగ్రీ కళాశాల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారుతుందని ఊహించిన కరెస్పాండెంట్లు యూనివర్శిటీ అధికారులపై రాజకీయ నాయకుల ద్వారా ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. దీంతో యూనివర్శిటీ అధికారు లు చేసేదేమీ లేక అర్ధాంతరంగా రాజు డీఈడీ కళాశాల కేంద్రాన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మార్పు చేశారు. ఇకపోతే గురువారం జరిగిన పరీక్షలకు అవగాహన ఉన్న సిబ్బంది రాని కారణంగా చీఫ్ సూపరింటెండెంట్ రమేష్ ఒక కళాశాలకు చెందిన సిబ్బందిని నియమించారు.( అది మింగుడు పడని మరొక కళాశాల యాజమాన్యం మా కళాశాలకు చెందిన సిబ్బందిని ఎందుకు నియమించలేదని ఫిర్యాదు చేసి ఒకరిపై మరొకరు బురద చల్లుకున్నారు. దీంతో పరీక్ష కేంద్రాన్ని మార్చినట్లు సమాచారం. ఇకపోతే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 3 వేల మంది విద్యార్థులు డిగ్రీ పరీక్షలు శనివారం నుంచి రాయనున్నారు. కనీస వసతులు, అందరికీ సరిపడ్డ డెస్కులు కూడా లేక విద్యార్థులు షామియానాల కింద విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇక వర్షం పడితే అంతే సంగతలు, ఈ విధంగా ఇరుకు, ఇరుకు గదుల్లో, షామియానాల కింద పరీక్షలు నిర్వహిస్తే తాము చెప్పిందే జరుగుతుందని ప్రైవేటు కళాశాలల కరెస్పాండెంట్లు భావిస్తున్నారని చెప్పవచ్చు. ఇదే జరిగితే బాగా చదివిన విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని మేధావులు అంటున్నారు. ఇప్పటికైనా యోగివేమన యూనివర్శిటీ అధికారులు ఎక్కడ పరీక్షలు నిర్వహించినా కట్టుదిట్టంగా నిర్వహించాలని విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.
అవగాహన ఉన్న సిబ్బంది లేకనే కేంద్రం మార్పు - రమేష్, సూపరింటెండెంట్:
రాయచోటి పట్టణంలో డిగ్రీ పరీక్ష కేంద్రంను అర్ధాంతరంగా మార్పు విషయంపై చీఫ్ సూపరింటెండెంట్ రమేష్‌ను వివరణ కోరగా అవగాహన ఉన్న సిబ్బంది లేకనే పరీక్ష కేంద్రాన్ని మార్పు చేశామన్నారు.

చక్రాయపేటకు వెలిగల్లు నీరు

చక్రాయపేట, నవంబర్ 17: పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేట మండలంకు సాగునీరు కేటాయించేందుకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చినట్లు సతీష్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం వెలిగల్లు ప్రాజెక్టు నుండి చక్రాయపేట మండలానికి నీళ్లు తెప్పించేందుకు వెలిగల్లు ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వీఎన్‌సీ గిరి, మైనర్ ఇరిగేషన్ డీఈ వెంకట్రామయ్య, ఏసీఎస్‌ఐసీసీ ఈఈ సింధు, మైనర్ ఇరిగేషన్ డీ ఈ వెంకటేశ్వర్లు కలిసి చక్రాయపేట మండలంలోని కుప్పం పంచాయతీలో ఉన్న వెలిగల్లు ప్రాజెక్టు కింది భాగంలోని నిమ్మకుంట మడుగు వద్దకు వెళ్లారు. అక్కడ వెలిగల్లు ప్రాజెక్టు నుండి 3 కిలోమీటర్ల దూరంలో నిమ్మకుంట మడుగు వద్ద రెండు కొండలకు చెక్‌డ్యాం నిర్మించినట్లయితే ఆ నీటిని మండలంలోని చిన్నమోరయ్యగారిపల్లె, మహదేవపల్లె, సురభి, నెరుసుపల్లె, చక్రాయపేట గ్రామాలకు చెరువుల ద్వారా నీరు నింపే అవకాశం ఉందని అధికారులు చెప్పడంతో అందుకు సంబంధించిన మ్యాప్‌ను పరిశీలించారు. దీంతో 10 వేల ఎకరాల వరకు సాగునీరు ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని, సాగునీరు అందిస్తే మండలం సస్యశ్యామలంగా ఉంటుందన్నారు. అలాగే వెలిగల్లు ప్రాజెక్టు నుండి ఎడమ కాలువ ద్వారా కల్లూరుపల్లె, యర్రగుడి గ్రామాలకు నీరు అందించడానికి సులభతరంగా వీలవుతుందని అధికారులు ఆయన దృష్టికి తెచ్చారు. దీంతో దాదాపు చక్రాయపేట మండలానికి 80 శాతం పైబడి సాగునీరు అందించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. నిమ్మకుంట మడుగు వద్ద చెక్‌డ్యాం నిర్మించడానికి ఎస్టిమేషన్ అవసరమయ్యే ఖర్చు సీఎం దృష్టికి తీసుకెళ్లి వెంటనే మంజూరు చేసేందుకు కృషి చేస్తామన్నారు. 2019 ఎన్నికలలోపే పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేట మండలానికి సాగునీరు అందించేందుకు శ్రీకారం చుట్టామన్నారు. పులివెందుల నియోజకవర్గంలో ఏడు మండలాలకుగాను ఆరు మండలాలకు సాగునీరు సంపూర్తిగా ఉందని, చక్రాయపేట మండలానికి సాగునీరు అందించినట్లయితే రైతాంగానికి ఇబ్బందులు ఉండవన్నారు. వెలిగల్లు ప్రాజెక్టులో 4.2 టీఎంసీల నీరు నిల్వ చేయవచ్చని, కుడి కాలువ కింద పంట పొలాలకు నీరు అందించడం జరుగుతున్నదని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గిరి తెలిపారు. ఏది ఏమైనప్పటికీ వెలిగల్లు ప్రాజెక్టు నీటి కోసం గతంలో కూడా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రామచంద్రారెడ్డి కె.రాజుపల్లె పాపాఘ్ని నది వద్ద నుండి కడప కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేసిన విషయాలు కూడా అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ మాజీ డైరెక్టర్ కర్నాటి నాగభూషణరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు ఈశ్వరరెడ్డి, మండల ఉపాధ్యక్షుడు వెంకటమల్లప్పనాయుడు, గ్రంథాలయ మాజీ ఛైర్మన్ మునిరెడ్డి, మాజీ సర్పంచ్ జగన్‌మోహన్‌రెడ్డి, భాస్కర, వెంకటరమణ, ఏఈలు మధు, గంగులయ్య, తదితరులు పాల్గొన్నారు.

పార్కింగ్ ప్లేస్ చూపం..!

రాజంపేట, నవంబర్ 17: రాజంపేట ట్రాఫిక్‌ను ఎలా నియంత్రించాలో అర్థంకాక అధికారయంత్రాంగం వింత ప్రవర్తనలకు దిగుతోంది. పార్కింగ్ స్థలం చూపం..మీ అవస్థ మీరు పడాలన్నట్లుగా ఇక్కడి అధికారుల ప్రవర్తన ఉండడం శోచనీయం. పార్కింగ్ స్థలం చూపకుండా ఎలా ట్రాఫిక్‌ను నియంత్రించగలరో ట్రాఫిక్‌ను నియంత్రించాలనుకుంటున్న అధికారులకే తెలియాలి. పట్టణంలో ట్రాఫిక్ సమస్యలను అధిగమించాలని అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించక తప్పదు. అయితే ఇందుకు సహేతుకమైన మార్గాలను అనే్వషించడంలో అధికారత్రయం విఫలమవుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు సహేతుకమైన మార్గాలను అనే్వషించకుండా అధికారబలంతో ట్రాఫిక్‌ను నియంత్రించాలని భావిస్తున్నట్టుగా అధికారుల తీరు రాజంపేటలో కనిపిస్తుండడం విచారకరం. ట్రాఫిక్‌ను నియంత్రించాలని, ఇందుకు పట్టణంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఆర్డీఓ ఇచ్చిన ఆదేశాల మేరకు గురువారం అర్బన్ సిఐ యుగంధర్, మున్సిపల్ కమిషనర్ ఎన్‌వి.రమణారెడ్డిలు తమ సిబ్బందితో కలిసి పట్టణ రహదారుల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అయితే పార్కింగ్ ప్లేస్ చూపకుండా ట్రాఫిక్‌ను ఎలా నియంత్రించగలమన్న అంశాన్ని పూర్తిగా ప్రక్కన పడేశారు. అధికారుల ప్రవర్తన చూస్తే పార్కింగ్ ప్లేస్ మేము చూపం..మీ అవస్థలు మీరు చూసుకోడంన్నట్టుగా ఉందన్న విమర్శలు వివిధ వర్గాల ప్రజల నుండి వినిపిస్తున్నాయి. అంతకు మించి పట్టణంలో ట్రాఫిక్ సమస్యలకు ఒక రకంగా టెలీకం, ట్రాన్స్‌కో శాఖలకు చెందిన స్థంభాలు కూడా అడ్డుగా ఉన్నాయని చెప్పవచ్చు. వీటి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోరు. కరంట్, టెలీకం స్థంభాలు రోడ్డుకు చివరకు జరిపితే చాలావరకు ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అయితే వివిధ ప్రభుత్వ శాఖలతో సమీక్షలు జరపడం వరకే పరిమితవుతారు తప్పితే వీటి విషయం పట్టించుకోరు. ఇకపోతే ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ దుకాణాదారులను అటు అర్బన్ సిఐతో పాటు మున్సిపల్ కమిషనర్ తమ సిబ్బందితో కలిసి దుకాణాల ముందు వాహనాలు ఎవరివైనా ఉంటే అందుకు దుకాణాదారుడే బాధ్యత వహించాలని బహిరంగంగా హెచ్చరికలు చేయడం చూస్తే దుకాణాలకు వచ్చి కొనుగోలు చేసే వారు దుకాణాల ముందు ఉంచే వాహనాలకు నైతిక బాధ్యత వహించాలన్నట్టుగా అధికారుల తీరుంది. అసలు ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు ఉన్నమార్గాలన్నింటిని ప్రక్కన పెట్టి అధికారులు దుకాణాదారులను హెచ్చరికలు చేసినంత మాత్రాన ఏమి ఉపయోగం ఉంటుందో అర్థం కాదు. పట్టణంలో ట్రాఫిక్‌ను నియంత్రించాలంటే రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలి. పెరిగిన ఆటోల విషయాన్ని కూలంకషంగా చర్చించాలి. ప్రధాన రహదారిలో ఎక్కడ పడితే అక్కడ బస్సులు, వాహనాలు నిలపకుండా చూడాలి. వివిధ రకాల నిత్యావసర వస్తువుల వాహనాలు రోడ్డు మధ్యలో నిలిపి అన్‌లోడ్ చేయకుండా చూడాలి. అవసరమైతే వన్‌వే పద్దతిని ఆలోచించాలి. ప్రధాన రహదారితో పాటు ఆర్ యస్ రోడ్డులో పార్కింగ్ స్థలాలను చూపి, వాహనాలు పార్కింగ్ ప్లేస్‌లో నిలుపుకునేలా వసతులు కల్పించాలి. ట్రాన్స్‌కో, టెలీకం స్థంభాలను రోడ్డు చివరకు జరిపిందుకు యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ట్రాఫిక్ నియంత్రణకు అనేక చర్యలు తీసుకుంటే కాని సాధ్యపడదు. పార్కింగ్ స్థలాలు చూపిన తరువాత ఆపైన ద్విచక్ర వాహనదారులు దుకాణాల ఎదుట వాహనాలు నిలిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు చేయాలి. అలాగే పార్కింగ్ ప్లేస్ లేకున్నా మున్సిపాలిటీ అప్రూవల్స్ భవన నిర్మాణాలకు ఇవ్వడం కూడా ట్రాఫిక్ సమస్యలకు కారణం. రోడ్డు చివరకు వచ్చి భవన నిర్మాణాలు జరిపి దుకాణాలు ఏర్పాటు చేస్తే ఆ దుకాణంలో కొనుగోలు చేసేందుకు వచ్చిన కొనుగోలుదారుడు తన వాహనాన్ని ఎక్కడ ఉంచాలన్న ప్రశ్నకు ఎవరు సమాధానమిస్తారు. ఏది ఏమైనా రాజంపేటలో అధికారత్రయం ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవడం మంచి పరిణామమే. అంతకన్నా ముందు ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతున్న అనేక అంశాలపై కూడా దృష్టి పెట్టాల్సి ఉంది. అలా కాకుండా దుకాణాదారులపైనే తమ అధికారదర్పం చూపేందుకు సిద్ధపడితే అన్ని వర్గాల ప్రజల నుండి తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తమయ్యే పరిస్థితులు లేకపోలేదు. కనుక అధికారత్రయం ముందుగా పట్టణంలో పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసే అంశానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటన్నింటిని కాదని అధికారదర్పంతో దుకాణాల ఎదుట వాహనాలు ఉంచడంపై, చెత్తకుప్పలపై దృష్టి పెట్టడం ఎంతవరకు సబబన్నది అధికారులే ఆలోచించాల్సి ఉంది.