కడప

రూ.8,318.83 కోట్ల నాబార్డు రుణ ప్రణాళిక..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,(కల్చరల్)నవంబర్ 22: జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధిబ్యాంకు 2018-19 సామర్థ్య ఆధారిత రుణప్రణాళిక రూ.8,318.83కోట్లతో రూపొందించినట్లు జిల్లా కలెక్టర్ టి.బాబూరావునాయుడు పేర్కొన్నారు. కడప సభాభవన్‌లోని సమావేశమందిరంలో 2018-19 రుణప్రణాళిక నాబార్డు డిడిఎం బి.శ్రీనివాసులు బ్యాంకు అధికారులతో కలిసి రూపొందించిన రుణప్రణాళికలు విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత ఏడాది రుణప్రణాళిక కంటే ఈ ఏడాది 15.57శాతం అధికంగా రుణాలకేటాయింపు జరిగిందన్నారు. కడప జిల్లా అభివృద్ధికోసం నాబార్డు రూపొందించిన రుణప్రణాళికను అన్ని బ్యాంకులవారు వారి వారి రుణప్రణాళికను రూపొందించుకుని జిల్లా అభివృద్ధికి దోహదపడాలన్నారు. నీటి వనరుల అభివృద్ధి, వ్యవసాయ యాంత్రీకరణ, పాడిపరిశ్రమ, గొర్రెలపెంపక, పండ్లతోటలు, కూరగాయల పెంపకం వంటి పెట్టుబడిరుణాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. రూ.4,602కోట్లు పంట రుణాలకు గాను రూ.1604 కోట్లు వ్యవసాయ అనుబంధరంగాలకు కేటాయించినట్లు తెలిపారు. అలాగే చేతివృత్తులు, కుటీరపరిశ్రమలకు రూ.1105కోట్లు, ఇతర ప్రాధాన్యత రంగాలకు రూ.1008కోట్లు కేటాయించినట్లు ఆయన వివరించారు. నాబార్డు జిల్లా అభివృద్ధి అధికారి బి.శ్రీనివాసులు మాట్లాడుతూ రుణప్రణాళిక మొత్తం ప్రాధాన్యత రంగ అంచనాలతో 55.32శాతం పంటల రుణకాలకు, 19.28శాతం వ్యవసాయ అనుబంధరంగ రుణాలకు కేటాయించినట్లు చెప్పారు. సామర్థ్య రుణప్రణాళికాధారంగా ఈ ఆర్థిక సంవత్సరానికి అన్ని బ్యాంకులు రుణప్రణాళికలు సిద్దంచేసుకోవాల్సిందిగా ఆయన కోరారు. కార్యక్రమంలో జెసి-2 శివారెడ్డి, వ్యవసాయశాఖ జెటి ఠాగూర్‌నాయక్, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆంజనేయచారి, జయకుమారి, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.

మరుగుదొడ్ల నిర్మాణం పనులను తనిఖీ చేసిన కలెక్టర్

వేంపల్లె, నవంబర్ 22: వేంపల్లెలో నిర్మించుకుంటున్న వ్యక్తిగత మరుగుదొడ్లను జిల్లా కలెక్టర్ బాబురావునాయుడు బుధవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. స్థానిక రాజీవ్‌నగర్‌కాలనీలో నిర్మితమవుతున్న వ్యక్తిగత మరుగుదొడ్లను కలెక్టర్ తనిఖీ చేశారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం త్వరితగతిగా పూర్తి చేసుకోవాలని కలెక్టర్ లబ్దిదారులను కోరారు. అలాగే సంబంధిత అధికారులు కూడా లబ్దిదారుల వెంటే ఉండి పనులు పూర్తి చేయించాలన్నారు. అలాగే రాజీవ్‌నగర్ కాలనీలోని పాఠశాలను కూడా ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఆయన కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు. అంతకు మునుపు స్థానిక ప్రభుత్వ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలను, వ్యక్తిగత మరుగుదొడ్లను ఆయన పరిశీలించారు. పాఠశాల వాతావరణం చాలా బాగుందని కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. అలాగే మండల వ్యాప్తంగా నిర్మితమవుతున్న వ్యక్తిగత మరుగుదొడ్ల గురించి ఆయన ఆరా తీశారు. మరుగుదొడ్ల నిర్మాణంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే కఠినచర్యలు తప్పవని ఆయన అధికారులను హెచ్చరించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం కోసం నిధుల కొరత ఏమీ లేదని ఆయన వివరించారు.

ఆహార భద్రత కల్పించడమే
ప్రభుత్వ ధ్యేయం..

ఖాజీపేట,నవంబర్ 22: ప్రజలు గౌరవప్రధమమైన జీవితాన్ని గడిపేందుకు నాణ్యమైన తగినంత ఆహారాన్ని ధరలకు అనుగుణంగా అందేలా చేయడం మానవజీవిత చక్రంలో ఆహారం, పోషణ భద్రత కల్పించడమే ఆహార కమిషన్ ఉద్దేశ్యమని ఆ దిశగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఏపి రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు విజయకుమార్ అన్నారు. బుధవారం కడపలోని కలెక్టరేట్‌లోని మీకోసం హాల్‌లో జిల్లా పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో పౌరసరఫరాలు, విద్య, స్ర్తిశిశుసంక్షేమం, తూనికలు, కొలతలు అధికారుల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆహారకమిషన్ రాష్ట్రంలో పేదప్రజల నిత్యావసర వస్తువులు, మధ్యాహ్న పథకంలోని సమస్యలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఇస్తున్న పౌష్టికాహారం, ఆహార కమిటీకి సంబంధించి ఆహారభద్రత తూనికలు కొలతలు సంబంధించి పర్యవేక్షణ ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఏ విధంగా అమలు జరగాలన్న అంశంపై వాటిపై ఎవరికి ఫిర్యాదు చేయాలనే అంశంపై అధికారులను నియమించారన్నారు. రాష్ట్రంలో కమిషన్ ఏర్పడిందని జిల్లా స్థాయిలో ఆహార కమిషన్లు ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో జాయింట్ కలెక్టర్ -2ను జిల్లా గ్రీవెన్స్ రెడ్రసిల్ అధికారిగా నియమించారన్నారు. మండలస్థాయిలో తహశీల్దార్, తహశీల్దార్ స్థాయిలో 20రోజుల్లో అక్కడి నుంచి జెసికి 30రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందన్నారు. అలా కాకుండా సుమోటాగా రాష్ట్రం తీసుకుంటుందన్నారు. ఆహార కమిషన్‌తరపున 5మంది సభ్యులు ఉండి ఇక్కడ జరిగే సమస్యలు తెలుసుకుని చర్యలు తీసుకుంటారన్నారు. అనంతరం జెసి శివారెడ్డి, కమిషన్ సభ్యులతో కలిసి స్థానిక మున్సిపల్ ఉన్నతపాఠశాల, ఉర్దూ ఉన్నతపాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేశారు. అక్కడి పిల్లలతో మాట్లాడి భోజనం ఎలా ఉంటుంది, ఎంతమంది ఇంటి నుంచి తెచ్చుకుంటున్నారు ఇక్కడ ఎందుకు తినడంలేదన్న వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్వయంగా జెసి, సభ్యులు భోజనం రుచి చూశారు. కార్యక్రమంలో డిఎస్‌వో విజయరాణి, ఐసిడిఎస్ పిడి మమత, పౌరసరఫరాల డిఎం నాగరాజు, డిఇవో శైలజ, డిప్యుటీ డిఇవో జిలానీబాషా, ఎంఇవోలు తదితరులు పాల్గొన్నారు.

గండికోటలో గ్యాంబ్లింగ్.!

జమ్మలమడుగు, నవంబర్ 22: చారిత్రాత్మక గండికోట కేంద్రంగా కొందరు భారీ గాంబ్లింగ్ తెరలేపారు. మంగళవారం అర్ధరాత్రి పోలీసుల దాడుల్లో పదుల సంఖ్యల జూదరులు, పట్టుబడిన నోట్ల కట్టలే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. గండికోట టూరిజం రెస్టారెంట్ అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారి పలు సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మక గండికోట దుర్గానికి ప్రపంచస్థాయి ఖ్యాతిని ఇనుమడింపజేసేలా అన్ని విధాల అభివృద్ధికి కృతనిశ్చయంతో ఉన్నామని చెబుతోంది. ఈ క్రమంలోనే ప్రతి ఏటా గండికోట వారసత్వ ఉత్సవాలను కూడా చేపడుతోంది. 2018 జనవరి మాసంలో గండికోట వారసత్వ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లకు సన్నద్ధం అవుతోంది. దీంతో జిల్లా నుండే కాక మద్రాసు, బెంగళూరు ప్రాంతాల నుండి సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంది. సహజ సిద్ధంగా ప్రకృతి అందాలు, అలనాటి రాజరిక వ్యవస్థకు నిలువెత్తు నిదర్శనంగా పర్యాటకులకు కనువిందు చేయాల్సిన పర్యాటకేంద్రంలో అసాంఘిక కార్యకలాపాలు తరచూ జరుగుతున్నాయి. ఏడాది కాలంలో పరిస్థితులను చూస్తే అతిథి గృహంలో ఓ అమ్మాయిని అసభ్యకరంగా మొబైల్‌తో ఫోటోలు చిత్రీకరించగా సదరు వ్యక్తి ఓ ఉన్నత కుటుంబానికి కావడంతో అర్బన్ స్టేషన్‌లో పంచాయితీ చేసి సర్దిచెప్పి పంపిన విషయం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. ఆ తదనంతర కాలంలో పలుమార్లు గాంబ్లింగ్ ముఠాలు పట్టుబడినా పోలీసులు ఉదాశీనంగా వ్యవహరించారన్న విషయం చర్చగా మారింది. ఆ విషయం మరువక ముందే మంగళవారం అర్ధరాత్రి సమయంలో పోలీసుల దాడుల్లో సుమారు 52మంది పట్టుబడగా వారి వద్ద నుండి దాదాపు రూ.72లక్షలు రూపాయల నగదు స్వాధీనం అయినట్లు సమాచారం. అయితే పట్టుబడిన వ్యక్తులో పలువురు జిల్లాలో ఓ కీలక నేతకు చెందిన వ్యక్తులు కావడంతో పోలీసులు స్వామి భక్తితో 21మందిని మాత్రమే చూపించారని పట్టణంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. పోలీసులు చూపిన 21మంది జాబితాలో ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, నందలూరు, ఎర్రగుంట్ల ప్రాంతాల నుండే గాక కర్నూలు జిల్లాలోని నంద్యాల, కోవెలకుంట్ల ప్రాంతాల వ్యక్తులు ఉండడం గమనార్హం. వారిలో ప్రజాప్రతినిధులు, నేతలు, ప్రముఖులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్ర కీలకంగా చెలామణి అవుతున్న ఓ నేత జోక్యంతో చలావరకు వ్యవహారం తీవ్రతను సద్దుమణిచినట్లు తెలుస్తోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా గండికోట గాంబ్లింగ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. జిల్లా లో మట్కా మహమ్మారిపై ప్రత్యేక దృష్టి సారించిన ఎస్పీ గండికోట ప్రాంతంలో పెద్ద ఎత్తున చోటు చేసుకుంటున్న అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి సారించాలని పర్యాటకులు, ప్రజలు కోరుతున్నారు.

ప్రతిపక్ష హోదా నిలుపుకునేందుకే
జగన్ పాదయాత్ర..

ప్రొద్దుటూరు, నవంబర్ 22 : కేవలం ప్రతిపక్ష హోదానైనా నిలుపుకోవాలనే ఉద్దేశ్యంతోనే రాష్ట్రంలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మల్లెల లింగారెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఆయన కార్యాలయంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసత్య ప్రచారాల్లో మంత్రి నారా లోకేష్‌కు డాక్టరేటు ఇవ్వవచ్చని ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి పేర్కొనడం విడ్డూరమని, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధి ఆయనకు కనిపించక పోవడం హాస్యాస్పదమన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఎన్ని సిసి రోడ్లు వేశారో, రాష్ట్రంలో ప్రస్తుతం టిడిపి మూడున్నర సంవత్సరాల కాలంలో ప్రతి గ్రామంలోనూ సిసి రోడ్లు, కాలువలు నిర్మించిందని, దాదాపు రూ.16,000 కోట్ల మేర ఉపాధి హామీ పనులు చేశారని వివరించారు. కేవలం ప్రొద్దుటూరు మండలంలోని కొత్తపల్లె పంచాయతీ అమృతనగర్ ప్రాంతానికి మాత్రమే ఏడున్నర కోట్ల రూపాయల నిధులతో భూగ డ్రైనేజీ పనులు జరుగుతున్నాయని, మున్సిపాలిటీ పరిధిలో పక్కాగృహాలు ఎన్ని కావాల్సిన ఇస్తామని పేర్కొన్నారు. గండికోట నుంచి పులివెందులకు నీరు విడుదల, ప్రొద్దుటూరులో నీటి ఎద్దడి నివారణకు పైపులైను తదితర కార్యక్రమాలను టీడీపీ హయాంలో నిర్వహించామని వివరించారు. తమ హయాంలో కేవలం జగన్‌కు సీఎం పదవి ఇవ్వడం తప్పా మిగిలిన పనులన్నీ చేశామని పేర్కొన్నారు. కనీసం ప్రతిపక్ష హోదానైనా నిలుపుకునేందుకే జగన్ పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ముక్తియార్, పట్టణ టీడీపీ అధ్యక్షులు ఇ.వి.సుధాకరరెడ్డి, కౌన్సిలర్ నాగరాజు, ఈశ్వరరెడ్డినగర్ మాజీ సర్పంచు మోతుకూరు సుబ్బారావు, టౌను బ్యాంకు డైరెక్టర్ సుబ్బారెడ్డి, నాయకులు లక్ష్మీనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరుగుదొడ్లు సకాలంలో పూర్తి చేయాలి

సిద్దవటం,నవంబర్ 22: వ్యక్తిగత మరుగుదొడ్లను డిసెంబర్ చివరికల్లా పూర్తిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వాధికారులదేనని రాజంపేట ఆర్డీవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. సిద్దవటం తహశీల్దార్ కార్యాలయంలో బుధవారం వ్యక్తిగత మరుగుదొడ్లపై మండల అధికారులతో ఆర్డీవో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజంపేట రెవెన్యూ సబ్ డివిజన్‌లో వ్యక్తిగత మరుగుదొడ్లు చురుకుగా సాగుతున్నాయన్నారు. సిద్దవటం మండలంలో కూడా మరుగుదొడ్ల నిర్మాణాల్లో ముందంజలో ఉందన్నారు. రాజంపేట మండలమైన హస్తవరం ఊటుకూరు, నందలూరు మండలం నాగిరెడ్డిపల్లె, ఒంటిమిట్టమండలం నర్వకాటిపల్లెతోపాటు సిద్దవటం మండలంలో వ్యక్తిగత మరుగుదొడ్లపై ప్రతి బుధవారం 750 మరుగుదొడ్లు పూర్తి చేయాలన్నదే కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారన్నారు. అధికారులందర్నీ పల్లెనిద్ర కార్యక్రమంలో పాల్గొనాలని సూచించామన్నారు. కార్యక్రమంలో ప్రత్యేక అధికారి సుబ్బారావు, ఎంపిడివో జయసింహ, ఏపిఎం సుబ్బలక్ష్మి మండల అధికారులు పాల్గొన్నారు.
కాగా ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి తప్పనిసరి అని స్థానిక తహశీల్దార్ చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో భాకరాపేటలో మానవహారం, సిద్దవటంలో ర్యాలీ నిర్వహించారు. మండలంలోని ప్రజలను వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవాలని బుధవారం అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. తహశీల్దార్ మాట్లాడుతూ మహిళల కోసం ప్రత్యేకంగా రాష్ట్రప్రభుత్వం శ్రద్ధ చూపి మరుగుదొడ్ల నిర్మాణం చేపడుతుందన్నారు. ఈ బృహత్తర కార్యక్రమం ప్రతి ఒక్కరు సద్వినియోగించుకోవాలని కోరారు.

24న శివభక్తేంద్రస్వామి
ఆరాధన మహోత్సవాలు
ఖాజీపేట,నవంబర్ 22:మండలంలోని పి.డబ్ల్యుడి బంగ్లావద్ద వెలసిన శ్రీ శివభక్తేంద్రస్వామి 23వ ఆరాధన మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు బాబూస్వామీ తెలిపారు. 24న ఉదయం విఘ్నేశ్వర, ప్రసన్నలక్ష్మి, నవగ్రహదేవతల అభిషేకాలతో కార్యక్రమం మొదలవుతుందన్నారు. 6నుంచి 7గంటలవరకు శివభక్తేంద్రస్వామికి ప్రత్యేకపూజలు, 9నుంచి 10గంటల వరకు ప్రసన్న లక్ష్మిఅమ్మవారికి పూజలు, 11నుంచి 12 వరకు స్వామివారికి పాలాభిషేకం నిర్వహిరు. మద్యాహ్నం భక్తులకు విజయమోహన్‌రెడ్డి, శకుంతలమ్మ కుటుంబ సభ్యులు అన్నదానం ఏర్పాటుచేయగా చెన్నూరు బాలాజీమినరల్‌వాట్‌ను సరఫరా చేయనున్నారు. సాయంత్రం 4గంటలకు చెక్క్భజన కళాకారులతో స్వామివారికి ఊరేగింపు ఉంటుందన్నారు.

శ్రీ సౌమ్యనాథస్వామి సన్నిధిలో
సీఎం సలహాదారుడు

నందలూరు, నవంబర్ 22:జిల్లాలో అతి పురాతన ఆలయం, సుప్రసిద్ధి ఆలయంగా ప్రసిద్ధి చెందిన నందలూరు శ్రీ సౌమ్యనాథాస్వామి ఆలయాన్ని బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సలహాదారుడు వేమూరి రవికుమార్ సందర్శించుకున్నారు. ఆయనతో పాటు ఎపిఎన్‌ఆర్‌టి మైగ్రేడ్ రిసోర్స్ సెంటర్ డైరెక్టర్ సిహెచ్ రాజశేఖర్, ఓఎస్‌డి బి.వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి జయకుమార్, అమెరికా ఎపిఎన్‌ఆర్‌టి కౌన్సిల్ సభ్యులు పి.రూపారాజు, ఎపిఎన్‌ఆర్‌టి తిరుమల సమాచార అధికారి శేషుబాబు, ఎపిఎన్‌ఆర్‌టి కో-ఆర్డినేటర్ ఎబిఎన్ ప్రసాద్, కొత్తపల్లె రామ్మోహన్‌లు స్వామిని సందర్శించుకున్నవారిలో ఉన్నారు. తొలుత ఆలయానికి విచ్చేసిన వీరికి రాజంపేట మార్కెటింగ్ యార్డు మాజీ ఛైర్మెన్ యెద్దల విజయసాగర్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారిని సందర్శించుకున్న అనంతరం ఆలయ మర్యాదలతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి సునీల్‌శర్మ ఆలయ విశిష్టతను వారికి తెలియజేశారు.
నిరుద్యోగులకు వరం
భారతి సిమెంట్స్ జాబ్‌మేళా

కమలాపురం, నవంబర్ 22: భారతి సిమెంట్స్‌లో ఏర్పాటు చేసిన జాబ్ మేళా నిరుద్యోగులకు వరమని ఎమ్మెల్యే పి రవీంద్రనాథరెడ్డి పేర్కొన్నారు. ఆయన బుధవారం మండలపరిదిలోని నల్లింగాయపల్లె భారతి సిమెంట్స్‌లో జరిగిన జాబ్‌మేళాను జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛంగా ప్రారంబించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డి, వైకాపా అధినేత జగన్, కమలాపురం నియోజకవర్గ అభివృధ్ధిని దృష్టిలో ఉంచుకుని గత 10 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో భారతి సిమెంట్స్ నెలకొల్పి ప్రత్యక్షంగా 1100మందికి పరోక్షంగా వందలాదిమందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తోందన్నారు. ఐతే అందరికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు వీలులేని పరిస్థితి ఉండడంతో ఈ ఫ్యాక్టరీలో హెచ్‌ఆర్‌డి కేంద్రాన్ని ఏర్పాటుచేసి జాబ్ మేళా నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించడం స్వాగతించ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో భారతి సిమెంట్స్ బ్రాంచ్ మేనేజర్ మధుసూదన్‌రావు మాట్లాడుతూ తమ సంస్థలో మానవవనరుల అభివృద్ది కేంద్రాన్ని అభివృద్ది చేసి నిరుద్యోగులకు శిక్షణ, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోందని,సామాజిక బాద్యత అనే అంశం ద్వారా ఈ సంస్థను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాగా గురువారం రాత్రి 10 పారిశ్రామిక సంస్థల్లో 350మందికి ఇంటర్వూలు నిర్వహించి 125మందికి నియామకపత్రాలను బ్రాంచ్ మేనేజర్ సంస్థల అధికారులు అందచేశారు. ఇందులో భారతి సంస్థ అధికారులు రవీంద్ర,్భర్గవరెడ్డి,వైసిపి నేతలు ఉత్తమారెడ్డి,రాజశేఖరరెడ్డి,సుబ్బారెడ్డి, యన్ సి పుల్లారెడ్డి,కృష్ణారెడ్డి,చెన్నకేశవరెడ్డి,కొండారెడ్డి,మాజీ సర్పంచ్ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గండి క్షేత్రంలో టెండర్ల ద్వారా
ఏడాదికి రూ. కోటి ఆదాయం

చక్రాయపేట, నవంబర్ 22: జిల్లాలో ప్రసిద్ధిచెందిన శ్రీ గండి వీరాంజనేయస్వామి ఆలయంలో తలనీలాల ద్వారా రూ.65 లక్షల పైబడి, టెంకాయల ద్వారా రూ.25 లక్షల పైబడి, కొబ్బరిచిప్పల ద్వారా రూ.5 లక్షల పైబడి దాదాపు కోటి రూపాయల వరకు గండి క్షేత్రానికి టెండర్ల ద్వారా ఆదాయం వస్తున్నట్లు దేవస్థాన సహాయ కమిషనర్ పట్టెం గురుప్రసాద్, ఛైర్మన్ వడ్లకుంట రాజారావులు తెలిపారు. అదే విధంగా ఈ నెల 29వ తేదీన భక్తులు సమర్పించుకునే టెంకాయల కొబ్బరిచిప్పలకు రూ.50 వేల ధరావత్తు చెల్లించి పాటలో పాల్గొనాలన్నారు. అలాగే దేవస్థానానికి అవసరమగు పూలు సరఫరా చేయుటకు రూ.25 వేలు ధరావత్తు చెల్లించాలని, దేవస్థానానికి కావాల్సిన పాలు, పెరుగు, అరటిపండ్లు, తమలపాకులు, పచ్చి టెంకాయలు సరఫరా చేయుటకు రూ.25 వేలు డిపాజిట్ చెల్లించి వేలం పాటలో పాల్గొనాలన్నారు. ఈ వేలం దేవాదాయ శాఖ కమిషనర్, విజయవాడ వారి ఉత్తర్వుల లోబడి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టెండరుదారుడు షెడ్యూల్‌లో పైన తెలిపిన హక్కులకు గాను ప్రతి టెండరుదారుడు చెల్లించి ఈ నెల 18వ తేదీ నుండి 28వ తేదీ వరకు టెండర్ ఫారంలో రేట్ల కోడ్‌ను ఎంపిక చేయాలన్నారు. అలాగే ప్రతి టెండరు ధరావత్తుపై చెల్లించి వేలం టెండరులో పాల్గొనాలన్నారు. దేవస్థానానికి సప్లయ్ చేసిన వివరాలకు అగు మొత్తాన్ని దేవస్థానం నుండి పొందుటకు సరిపడు బిల్లులను ముద్రించుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ వేలం పాటలో హిందూ మతస్థులు మాత్రమే పాల్గొనాలన్నారు. కొబ్బరిచిప్పలు దేవస్థానానికి అందించే పూలు, పండ్లు జనవరి 1వ తేదీ నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు ఈ టెండర్లో నియమించిన ధరలకు దేవస్థానం వారు అందజేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.

శతాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయండి

ప్రొద్దుటూరు టౌన్, నవంబర్ 22: పట్టణంలోని అనిబిసెంట్ మున్సిపల్ ఉన్నత పాఠశాల ఏర్పాటై వంద సంవత్సరాలైన సందర్భంగా పాఠశాల పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి శతాబ్ది ఉత్సవాలకు ప్రజలందరూ పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి నంద్యాల వరదరాజులరెడ్డి కోరారు. బుధవారం స్థానిక పాఠశాల ఆవరణలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ డిసెంబర్ నెల 8,9వ తేదీల్లో ఉత్సవాలు జరుగుతాయని, 8వ తేదీన భారత ఉపరాష్టప్రతి మొప్పవరపు వెంకయ్యనాయుడు హాజరవుతారని, ఆయన చేతులమీదుగా ఉత్సవాలకు సంబంధించిన పైలాన్‌ను ఆవిష్కరిస్తారని, అలాగే పాఠశాలకు స్థల దాత విగ్రహాన్ని ఆవిష్కరించడం జరుగుతుందన్నారు. ఉదయం 9గంటలకు మూడువేలమంది విద్యార్థులతో స్థానిక పుట్టపర్తి సర్కిల్ నుంచి పాఠశాల వరకు భారీ ర్యాలీ వుంటుందన్నారు. అలాగే రాష్ట్ర మంత్రులైన ఆదినారాయణరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి హాజరై ఉత్సవాల్లో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారన్నారు. సాయంత్రం 4గంటల నుంచి వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు వుంటాయన్నారు,
9వ తేదీ పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులకు ఘనంగా సన్మానం నిర్వహిస్తామని, ఉత్సవాలకు హాజరయ్యే ప్రముఖులు ప్రసంగిస్తారన్నారు. పట్టణం నుంచే కాకుండా పరిసర గ్రామాల నుంచి, పాఠశాలలో విద్యనభ్యశించిన ప్రతి ఒక్కరూ హాజరై ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.