కడప

దత్తత గ్రామంలో పంచాయతీ చీఫ్ సెక్రటరీ పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముద్దనూరు, డిసెంబర్ 13: రాష్ట్ర పంచాయతీరాజ్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఆయన దత్తత తీసుకున్న మేజర్ పంచాయతీలో బుధవారం విస్తృత పర్యటనచేస్తూ అభివృద్ధి చేసిన కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేశారు. స్థానిక పోలీసుస్టేషన్‌లో పంచాయతీకి దాతలు విరాళం ఇచ్చిన సిసి కెమెరాలు ప్రారంభించారు. అనంతరం చెత్తద్వారా సంపద యార్డును ప్రారంభోత్సవంచేసి, ఊరూరా వనం పార్కును ప్రారంభించారు. పార్కుకు అభివృద్దికి కావలసిన నిధులు ప్రభుత్వం నుండి మంజూరు చేయిస్తామని, త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంచాయతీలో అండర్ డ్రైనేజి ఆరు మాసాల్లో పూర్తి చేయాలన్నారు. జడ్పీ ఉన్నత పాఠశాల ఆటస్థలం పూర్తిగా సద్వినియోగం అయ్యేలా వాకింగ్ ప్లాట్‌ఫారమ్ ఏర్పాటుచేస్తూ, మద్యలో పిల్లలు ఆడుకోవడానికి వారికి సంబంధించిన ఆటస్థలంను కూడా ఏర్పాటు చేయాలన్నారు. సీపీడబ్ల్యూయస్‌కు రూ.1.70కోట్లు ఖర్చుచేసిన ఇంకా గ్రామాలకు నీరు అందనట్లు తెలుస్తోందన్నారు. అనంతరం కలెక్టర్ బాబూరావు నాయుడు మాట్లాడుతూ గ్రామాల్లో మరుగుదొడ్లు త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఈవో ఆనంద్, ఆర్‌డబ్ల్యుయస్ ఎస్‌ఈ సంజీవరాయుడు, డ్వామా పీడీ, ఉపాధి హామీ పథకం రాష్ట్ర డైరెక్టర్, డ్వామా ఎపిడి, అధికారులు పాల్గొన్నారు.

నల్లమలలో
తమిళకూలీల హల్‌చల్.!

పోరుమామిళ్ల, డిసెంబర్ 13 : నల్లమల ఫారెస్టులోని తమిళకూళీల హల్‌చల్ సృష్టించారు. విషయం తెలుసుకున్న ఫారెస్టు సిబ్బంది పారెస్టులో కూబింగ్‌కు వెళ్లగా ఫారెస్టు సిబ్బంది కదలికలను తమిళకూలీలు గుర్తించి గుట్టల పైనుండి పారెస్టు సిబ్బందిపై రాళ్లతో దాడి చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు నల్లమల పారెస్టులో పోరుమామిళ్ల ఫారెస్టు పరిధిలోని ఇటుకులపాడు బీటు రామన్నబావి సమీపంలో తమిళకూలీలు దాదాపు 40మందికి పైగా ఎర్రచందం దుంగలు నరుకుతున్నారన్న రహస్య సమాచారం మేరకు ఫారెస్టురేంజ్ అధికారి సుబ్బరామిరెడ్డికి సమాచారం అందగా గత మూడు రోజులుగా కూంబింగ్ నిర్వహించినట్లు సమాచారం. బుధవారం రాత్రి ఎట్టకేలకు రామన్నబావి సమీపంలో తమిళకూలీలను గుర్తించి 20 మంది సిబ్బందితో అక్కడికి వెళ్లగా గుట్టలపై నుండి ఫారెస్టు సిబ్బందిపై రాళ్లతో దాడికి పాల్పడినట్లు సమాచారం. పరిస్థితి విషమించడతో ఫారెస్టు సిబ్బంది మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపినట్లు సమాచారం. అక్కడ కొంతమంది తమిళకూలీలను 36 ఎర్రచందనం దుంగలను ఫారెస్టు సిబ్బంది అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంపై ఎఫ్‌ఆర్‌ఓ సుబ్బరామిరెడ్డిని వివరణ కోరగా గత మూడు రోజులుగా తమిళకూలీలు కదలికలు ఉన్నట్లు సమాచారం వచ్చినట్లు నిజమేనని పై అధికారులకు సమాచారం అందించి, రహస్యంగా 20 మంది సిబ్బందితో 3 రోజులుగా ఫారెస్టులో కూంబింగ్ నిర్వహించగా ఇటుకులపాడు బీటు రామన్నబావి సమీపంలో తమిళకూలీలను గుర్తింది పట్టుకునేందుకు వెళ్లగా ఎగువ గుట్టలపై నుండి తమపై రాళ్లతో దాడిచేసినమాట వాస్తమేనని మా దగ్గర ఆయుధాలు ఉన్నా, కాల్పులు జరుపుతామని హెచ్చరించామేతప్ప కాల్పు జరుపలేదన్నారు. మేము దాదాపు 17 తమిళకూలీలను వెంటాడామన్నారు. కానీ ఏ ఒక్కరు దొరకలేదని, 36 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామాన్నారు.

ఉక్క్ఫ్యుక్టరీ నిర్మాణం కోసం
కలిసి పోరాడుదాం..

ఖాజీపేట,డిసెంబర్ 13: రాష్ట్ర విభజనలో పొందుపరచిన ప్రత్యేకహోదా, ప్రత్యేకప్యాకేజి, ఉక్క్ఫ్యుక్టరీ, సెంట్రల్ యూనివర్సిటీల్లాంటివి సాధించాలంటే ప్రజా ఉద్యమాలతోనే సాధ్యవౌతుందని మాజీ ఎంపి, అఖిలభారత విద్యార్థి సంఘం మాజీ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. కడప ఉక్కుసాధన కమిటీ బుధవారం కడపలోని జిల్లాపరిషత్ ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగసభకు ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. సమావేశానికి ఉక్కుసాధనకమిటీ కన్వీనర్ బి.నారాయణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఏచూరి మాట్లాడుతూ పార్లమెంట్‌లో రాష్ట్ర విభజనను అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ అధ్యక్షతన చేస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా 5సంవత్సరాలైనా ఇవ్వాలని తాను ప్రతిపాదన చేయగా అక్కడే ఉన్న బీజేపీ నాయకుడు ఎం.వెంకయ్యనాయుడు కాదు 10సంవత్సరాలు ప్రత్యేకహోదా కల్పించాలని డిమాండ్ చేశారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ రాష్టవ్రిభజనను చేసేటప్పుడు దానికి చట్టబద్దత కల్పించలేదని ప్రస్తుతం ఒక రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తే మిగిలిన రాష్ట్రాలు అడుగుతాయంటూ దాటవేస్తున్నారన్నారు. ప్రత్యేకహోదా, ప్రత్యేక ప్యాకేజీ, ఉక్కుపరిశ్రమ, సెంట్రల్ యూనివర్సిటీల్లాంటివి అందులో పొందుపరచినప్పటికీ వాటిని చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వెనుకడుగువేస్తున్నా రాష్ట్రప్రభుత్వం మాత్రం తన గొంతు విన్పించలేకపోతోందన్నారు. వ్యవసాయ రంగంలో 20వేల మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదిస్తే వ్యవసాయంలో రైతులు చేసే ఖర్చుకన్నా అధికంగా ఇస్తామని ప్రధాని ప్రకటించిన ఇంతవరకు అమలు చేయలేదన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు 3సంవత్సరాలు క్రితం ఢిల్లీలో కలిసినప్పుడు మాట్లాడితే కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో టీడీపీ కలిసి దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూడా ప్రత్యేక ప్యాకేజీలేదు, రాయలసీమకు ఉక్క్ఫ్యుక్టరీ, సెంట్రల్ యూనివర్సిటీ లాంటివి లేవన్నారు. అమరావతి నిర్మాణం కోసం వేలాది ఎకరాలు రైతుల నుంచి లాక్కోవడం జరిగిందన్నారు. నిరుద్యోగ సమస్య పెరిగి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్భ్రావృద్ధికోసం కేంద్రంపై వత్తిడి తెచ్చే పరిస్థితి లేదన్నారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేకహోదా, విభజన చట్టంలోని అంశాలు ప్రస్తావించేందుకు కృషి చేస్తామని, శాసనసభ, పార్లమెంట్ సమావేశాలతోపాటు ఉద్యమాలు చేసేందుకు అందరు కలిసి వచ్చి పోరాటాలు సాగించాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో వేసిన రోడ్లుమాత్రమే కన్పిస్తున్నాయని ప్రస్తుతం ఎలాంటి అభివృద్ధి తనకు కన్పించలేదన్నారు.

ప్రాజెక్టుల పరిశీలనకు రానున్న
సీఎం చంద్రబాబు
జమ్మలమడుగు, డిసెంబర్ 13: గండికోట జలాల ముంపు విషయం జటిలంగామారిన విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పలు ప్రాజెక్టుల పరిశీలనకు రానున్నారు. గత సోమవారం ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులకు ఈనెలలో ప్రాజెక్టులు పరిశీలించనున్నట్లు తెలిపారు. ఇంజినీరింగ్ అధికారుల ఊహాజనిత అంచనా లెక్కలు తప్పడంతో గండికోట బ్యాక్‌వాటర్ ముంపు విషయంపై ఆంధ్రభూమి దినపత్రిక ప్రధాన సంచికలో ఈనెల 5వ తేదీన 3గండికోట ముంచుతోంది2 అన్న కథనం పతాక శీర్షికన ప్రచురితమైన విషయం విదితమే. టీడీపీ జిల్లా నేతలు, ప్రజాప్రతినిధులు ముంపువాసుల సమస్యలపై చర్చించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గండికోట జలాశయంలో ఈ యేడాది 12టీయంసీల నీటీ నిల్వను ప్రభు త్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలోనే మొదటి విడతకు 14 గ్రామాల ప్రజలకు రూ.490కోట్లు పరిహారం విడుదలచేసి పంపిణీ దాదాపు పూర్తిచేసింది. దీంతో జలాశయంలో 12టీఎంసీల నీటి నిల్వకు మార్గం సుగమం అయిందని ప్రభుత్వం భావించి నీటి విడుదలలు చేపట్టింది. దీనికోసం కర్నూలు జిల్లా గోరకల్లు నుండి అవుకు రిజర్వాయర్‌కు, అవుకు నుండి వరద కాలువ ద్వారా గండికోట జలాశయానికి 4500 క్యూసెక్కుల నీటి విడుదల చేపట్టారు. గండికోట జలాశయంలో 7.5 టీయంసీలకు నీటి నిల్వకు చేరేసమయానికే చివరి విడతలో ఉన్న కొండాపురం గ్రామంనకు చేరుకుంది. స్థానికులు ఆందోళనకు దిగడంతో అధికారుల్లో చలనం మొదలై ఉరుకులు, పరుగులు పెట్టారు. ఈ క్రమంలో గండికోట జలాశయంలో 7.5 టీఎంసీల నీటిని స్థిరీకరించేందుకు మైలవరం జలాశయంకు 2500 క్యూసెక్కులు, పైడిపాళెంకు 680, సిబిఆర్‌కు 1000, వామికొండకు 300 క్యూసెక్కుల చొప్పున నీటివిడుదలలు చేపట్టారు. ఎగువ నుండి వస్తున్న నీటితో మైలవరం జలాశయంలో 5.30 టీఎంసీలకు నీటినిల్వ చేరుకుంది. అధికారుల అంచనాల ప్రకారం మైలవరం జలాశయంలోనూ గరిష్ఠంగా 6.50 టీయంసీల వరకే నీటినిల్వకు ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. గండికోట జలాశయంలో ఈ యేడాదికి 12టీయంసీల నీటినిల్వ ద్వారా సీమ సస్యశ్యామలంతోపాటు తాగునీటికి సమస్యలు లేకుండా చేయాలనుకున్న ప్రభుత్వ బృహత్తర ఆశయం నీరుగారిపోయినట్లయింది. కృష్ణాజలాలు పుష్కలంగా అందుబాటులో ఉన్నా నిర్లక్ష్యంతో నీటినింపుకోలేని దుస్థితిపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇటువంటి తరుణంలో సమస్యలపై రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన అధికారగణంలో వణుకుపుట్టిస్తున్నా, భవిష్యత్తులో ఇలాంటి దుస్థితులు తలెత్తకుండా అటు ప్రభుత్వం, ఇటు ఉన్నతాధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఎర్రచందనం జోలికెళ్తే జైలుకే..

సిద్ధవటం, డిసెంబర్ 13: ప్రపంచంలోనే అత్యంత విలువైన ఎర్రచందనం జోలికెళ్తే జైలుకు వెళ్లక తప్పదని రాజంపేట డీఎస్పీ లక్ష్మినారాయణ హెచ్చరించారు. సిద్ధవటం మండలంలోని శివునిపల్లె, మిట్టపల్లె హరిజనవాడలో బుధవారం రాత్రి ప్రజలకు ఎర్రచందనంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశాలకు చెందిన కొందరు స్వార్థపరులు డబ్బు ఎర చూపి సామాన్య ప్రజలను ఎర్రచందనం అక్రమరవాణాలో జోక్యం చేయడంతో స్థానిక ప్రజలు కేసుల్లో ఇరుక్కుని బలవుతున్నారన్నారు. ఎంతో విలువైన ఎర్రచందనాన్ని విదేశాలకు చెందిన స్మగ్లర్లు తరలించుకు వెళ్తున్నారన్నారు. ఎర్రచందనం అక్రమరవాణాకు సంబంధించి ఎవరైనా గ్రామాల్లోకి వచ్చినట్లయితే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. కొత్త వ్యక్తులు వాహనాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేయాలన్నారు. ప్రతి గ్రామంలో వాలంటీర్లను నియమించడం జరిగిందని, వారికి సమాచారం ఇస్తే పోలీసులకు సమాచారం అందజేస్తారన్నారు. చిన్నపిల్లలకు వివాహ వయస్సులోనే వివాహాలు చేయాలని, మేజర్లకు వివాహం చేయడం చట్టరీత్యా నేరమన్నారు. అలాగే ప్రతి వాహనదారుడు డ్రైవింగ్ లైసెన్సు తప్పనిసరిగా ఉండాలన్నారు. కుటుంబసభ్యుల సమస్యలు ఏవైనా ఉంటే తమ దృష్టికి తెస్తే సామరస్యంగా తాము పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట సీఐ రవికుమార్, ఎస్‌ఐ అరుణ్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

విద్యార్థిని బెల్టుతో కొట్టిన
ఉపాధ్యాయుడు.!

వేంపల్లె, డిసెంబర్ 13: స్థానిక ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి విద్యాభ్యాసం చేస్తున్న రవిని ఆ పాఠశాలలో గణితం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సురేష్ తన బెల్టుతో చితకబాదినట్లు విద్యార్థి తల్లిదండ్రులు ప్రభాకర్ తెలిపారు. బుధవారం పాఠశాలకు వచ్చిన విద్యార్థి రవిని పాఠశాలకు సరిగా ఎందుకు రావడం లేదంటూ తీవ్ర ఆగ్రహావేశాలతో తన నడుముకు ఉన్న బెల్టును తీసి తలకు, వీపుకు బలంగా కొట్టారు. దీంతో విద్యార్థికి రక్తగాయాలయ్యాయి. హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి ప్రధమచికిత్సలు చేయించారు. ఆ విద్యార్థి ఇంటికి వెళ్లగానే విద్యార్థి తల్లిదండ్రులు మరికొంత మందితో కలిసి వేంపల్లె పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకొని ఉపాధ్యాయునిపై ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో పోలీసులు జోక్యం చేసుకొని పాఠశాల వద్దకు వెళ్లి ప్రధానోపాధ్యాయుడు నారాయణను జరిగిన సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థి సరిగా పాఠశాలకు రాకపోవడంతోనే యాదృచ్ఛికంగా కొట్టినందుకు గాయాలయ్యాయని ఆయన తెలిపారు. ఏది ఏమైనప్పటికీ విద్యార్థిని ఈ తరహాలో చితకబాదడం సమంజసం కాదని పోలీసులు ఉపాధ్యాయుడిని, ప్రధానోపాధ్యాయుడికి సూచించారు. భవిష్యత్తులో ఇలా జరగకుండా చూసుకుంటామని హెచ్ ఎం నారాయణ తల్లిదండ్రులకు, పోలీసులకు తెలిపారు. దీంతో సమస్య సర్దుమణిగింది.

వైభవంగా శ్రీవేంకటేశ్వరస్వామి
కల్యాణోత్సవం

కడప,(కల్చరల్)డిసెంబర్ 13: అరటి పిలకలు...మామిడాకుల తోరణాలు..మంగళవాయిద్యాలు...వేదపండితుల మంత్రోచ్చారణలు..ప్రాంగణమంతా పసుపు ఆరబోసినట్లుగా పసుపురంగు దుస్తులతో గోవింద దీక్షాపరులైన భక్తులు...ప్రతిధ్వనించిన గోవింద నామస్మరణలతో మున్సిపల్ స్టేడియం అపర తిరుమలగా కళకళలాడింది. దీంతో అడుగడుగునా భక్త్భివం ఉట్టిపడింది. గోవిందమాల దీక్షదారులైన భక్త బృందం సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 9.30గంటల నుంచి నగరంలోని మున్సిపల్ స్టేడియంలో శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. నెల్లూరుకు చెందిన వేదపండితులు అనంతాచార్యుల బృందం ఆధ్వర్యంలో ఉభయ దేవేరులతో సహా శ్రీవారి ఉత్సవ మూర్తులకు పంచామృతాభిషేకంతోపాటు పలురకాల పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత విష్ణుసహస్రనామ పారాయణం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదికపై ఏర్పాటుచేసిన పూల పందిట్లో శ్రీదేవి, భూదేవి సమేతంగా వైకుంఠవాసుడు శ్రీనివాసుడిని కళ్యాణమూర్తులుగా అలంకరించి కొలువుదీర్చారు. కలశస్థాపనం, గణపతి పూజ, సర్వదేవతాహ్వానం, ఇతర కళ్యాణ క్రతువులను క్రమంగా నిర్వహించారు. వేదపండితుల బృందం వరదాతలుగా, నిర్వాహకుల బృందం కన్యాదాతలుగా వ్యవహరించారు. మహామంగళ సూత్రాలకు పూజలు చేసి, భక్తులకు దర్శింపచేశారు. భక్తుల గోవిందనామస్మరణలు ప్రతిధ్వనిస్తుండగా, మంగళవాయిద్యాలు, మంత్రోచ్చారణల మద్య దేవదేవుడు శ్రీనివాసుని పక్షాన వేదపండితులు మహామంగళ సూత్రాలను అమ్మవారల గళ సీమల్లో అలంకరించారు. స్వామివారి కళ్యాణోత్సవం సందర్భంగా నిర్వాహకులు స్టేడియం ప్రాంగణం సంప్రదాయ పద్ధతిలో అందంగా అలరించారు. ఈ సందర్భంగా వేదికపై అందంగా అలంకరించి ఏర్పాటు చేసిన 21అడుగుల శ్రీవేంకటేశ్వరుని విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అలాగే టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమాచార్యుల గీతాలను ఆలపిస్తూ కార్యక్రమాన్ని రక్తికట్టించారు. గోవిందమాల దీక్షాదారులు, మహిళా భక్తులు, భక్తులతో స్టేడియం కిక్కిరిసింది. కళ్యాణ ఘట్టాన్ని తన్మయంగా తిలకిస్తూ భక్తులు పలుమార్లు గోవిందనామస్మరణలు చేశారు. శ్రీ వేంకటేశ్వరుని అవతారం, ఉభయ దేవేరుల పాణిగ్రహణం వెనుక గల ఆధ్యాత్మిక రహస్యాలను అర్చకులు వివరించిన తీరు ఆద్యంతం అలరించింది. కల్యాణం అనంతరం వేలాది మంది భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేశారు.
అలాగే సాయంత్రం 6గంటల నుంచి గోవిందస్వాముల ఆధ్వర్యంలో వైభవంగా గ్రామోత్సవం జరిగింది. పురవీధుల గుండా సాగిన గ్రామోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో ప్రజలు కాయ కర్పూరాలు సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. కాగా ఈకార్యక్రమాన్ని ఉత్సవ కమిటీ చైర్మన్ పుల్లారెడ్డి పర్యవేక్షించగా గోవింద భక్త బృందం పాల్గొన్నారు.

మునిసిపాలిటీ అభివృద్ధే ధ్యేయం
రాయచోటి, డిసెంబర్ 13: రాయచోటి మునిసిపాలిటీని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే ధ్యేయమని రాయచోటి శాసనసభ్యులు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మునిసిపల్ ఛైర్‌పర్సన్ నసీబున్‌ఖానమ్, కౌన్సిలర్లు, వైసీపీ నాయకులతో కలిసి పట్టణంలో రూ.40 లక్షల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతివీధిలో సిమెంట్‌రోడ్లు, తాగునీటి పైపులైన్లు, వౌలిక వసతుల కల్పనే తన లక్ష్యమన్నారు. మునిసిపాలిటీ పరిధిలోని 3, 4, 5, 6, 8వ వార్డులలో పూర్తయిన వివిధ సిమెంట్‌రోడ్లు, మురికికాలువల నిర్మాణాలను ఎమ్మెల్యే ప్రారంభోత్సవం చేశారు. 3వ వార్డులో పూర్తయిన నీటిపైపులైన్‌ను ప్రారంభించి నీటిని విడుదల చేశారు. 5, 6వ వార్డులలో నీటి పైపులైన్ నిర్మాణాలను భూమి పూజలు చేశారు. 28వ వార్డులు నిర్మాణ దశలో ఉన్న నీటిపైపులైన్ పనులను పరిశీలించి పనులు నాణ్యతగా చేపట్టాలని ఆయన ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. పలు వీధులలో పర్యటించి ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఇచ్చారు. కొత్తపల్లె మహమ్మద్‌పురా మసీదు ప్రాంతంలో వీధుల్లో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సిమెంట్‌రోడ్లు, మురికి కాలువల నిర్మాణాలు, కల్వర్టుల నిర్మాణాలను చేపట్టి సమస్యలను పరిష్కరించినందుకు ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డిని, మునిసిపల్ ఛైర్‌పర్సన్ నసీబున్‌ఖానమ్, పాలకవర్గాన్ని స్థానిక ప్రజలు ప్రశంసిస్తూ అభినందించారు. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యులు సలావుద్దీన్, కౌన్సిలర్ ఫయాజుర్‌రెహమాన్, చిల్లీస్ ఫయాజ్, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ ఆఫ్జల్‌అలీఖాన్, వైసీపీ నాయకులు జాకీర్, రిజ్వాన్, హబీబ్, ముల్లా అక్రంబాష, అన్వర్‌బాష, హజరత్, కొలిమి చాన్‌బాష, విజయభాస్కర్, ఫయాజ్, అల్త్ఫా, సలీం, కాంట్రాక్టర్ రెహమాన్, హేమంత్‌నాయక్, డీఈ సుబ్రమణ్యం, మునిసిపల్ ఏఈ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రూ. కోటి విలువ చేసే ప్రభుత్వ భూమి స్వాహా!

నందలూరు, డిసెంబర్ 13: సుమారు రూ. కోటి విలువచేసే ప్రభుత్వ స్థలం కబ్జాదారుల కోరల్లో చిక్కుకుంది. అధికారుల నిర్లక్ష్యం కబ్జాదారులకు వరంలా మారింది. గతంలో ఈ భూమిపై కబ్జాదారులు కనే్నయడంతో పత్రికలలో వచ్చిన కథనాలతో అధికారులు అడ్డుకున్నారు. ఈ భూమిని ఎవరు ఆక్రమణ చేయకుండా పటిష్టమైన చర్యలు చేపట్టక పోవడంతో ప్రస్తుతం ఈ భూమిలో పట్టపగలే బహిరంగంగా అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయి. స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నా అధికారులు చేతులెత్తాశారు. నాగిరెడ్డిపల్లె పంచాయతీ అరవపల్లెలోని పంచాయతీ కార్యాలయం ఎదురుగా సర్వేనెంబర్ 235లో దాదాపు 65 సెంట్లు స్థలం ఉండగా ఇప్పటికే సగం స్థలం ఆక్రమణకు గురైంది. అయినా ఏ నాడు రెవెన్యూ, పంచాయతీ అధికారులు పట్టించుకున్న పాపానపోలేదు. మిగిలిన స్థలంపై అక్కడే నివాసాలు ఉన్నవారి కన్ను పడింది. ప్రభుత్వ భూమి అని తెలిసినా నిర్మాణాలు సాగిస్తున్నారు. ఇదేమిటని కొందరు ప్రశ్నించడంతో కోర్టు ఆదేశాలు ఉన్నాయని పేర్కొనడం గమనార్హం. దాదాపు 4 నెలల క్రితం ఈ కబ్జా వ్యవహరం రెవెన్యూ అధికారులకు తెలిసి వారు హెచ్చరించి ఆపేశారు. అక్కడ ప్రభుత్వభూమి అని నోటీసు బోర్డు పెట్టకపోవడంతో గతంలో కబ్జాకు యత్నించిన వ్యక్తులే తిరిగి జోరుగా అక్రమ నిర్మాణాలు సాగిస్తున్నారు. రెవెన్యూ అధికారులు వివాద స్థలం వద్దకు రాగా ఆక్రమణదారులు వీడియో తీయడంతో వెళ్లిపోవడంతో ప్రజలు విస్మయం చెందుతున్నారు. నడిబొడ్డులో ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేయడం దర్జాగా సాగుతున్నా అధికారులు పట్టించుకోక పోవడంపట్ల ప్రజల నుండి విమర్శలు ఉన్నాయి.
తహసీల్దార్ వివరణ
గతంలో గ్రామకంఠం స్థలంలో అక్రమ నిర్మాణాలు సాగడంతో నిలిపేయడం జరిగిందని, ఆ స్థలం పక్కనే ఉన్నవారు మా స్థలం అని హైకోర్టులో కలెక్టర్, ఆర్డీఓ, తహశీల్దార్, పంచాయతీ వారిపై రిట్ పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు మమల్ని జోక్యం చేసుకోరాదనే ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. అయితే ఈ స్థలంపై హైకోర్టులో కౌంటర్ ఫైల్‌చేసి స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.