కడప

కత్తిదూసిన పందెంకోళ్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుండుపల్లె, జనవరి 14: సంక్రాంతి పండుగ మొదలు కావడంతో కోడిపందేల జోరు ఎక్కువైంది. పందెం కోళ్లు కత్తిదూసిన వేళ పందెగాళ్లు కొంత మంది జేబులు నింపుకున్నారు. కోడిపందేల నిర్వహణ నిషేధం కారణంగా పోలీసు దాడులు చేస్తున్నా పందెం కోడి కత్తి దూసింది. సంక్రాంతి సీజన్ మొదలు కానప్పటి నుండే జాగ్రత్తగా పందేంకోళ్లను ఆరోగ్యంగా పెంచి పోషిస్తున్నారు. కానీ మండలంలోని పాలు గ్రామాలతో పాటు కడప, చిత్తూరు జిల్లాల సరిహద్దు ప్రాంతమైన మామిడితోటల్లో జరిగిన పందేలతో కోళ్లు నెత్తుటి ముద్దలయ్యాయి. మూగజీవుల ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నా వాటి పౌరుషాన్ని పందెగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. కోడిపుంజుల పోరాట పటిమలను సద్వినియోగం చేసుకున్నవారు లక్షల రూపాయల్లో దండుకుంటున్నారు. మైల, డేగ, సవల, పచ్చకాకి, నెమలి వంటి జాతికోళ్లను అక్కడికక్కడే రూ.30 వేల నుంచి రూ.40 వేలు వెచ్చించి కొనుగోలు చేసి వాటి ప్రాణాలను నిలువునా తీసేశారు. కుప్పగుట్ట, చండ్రాజుగారిపల్లె, ఏటిగడ్డరాజుగారిపల్లె, పింఛా, మాచిరెడ్డిగారిపల్లె, జిల్లేలమంద గ్రామాల్లో పందెం జోరందుకుంటోంది. అరుదైన జాతికోళ్లు చివరకు మాంసం ముద్దలయ్యాయి. వేల రూపాయలు పెట్టి కొనిన కోళ్లను రూ.1,000, రూ.1,500లకు మాంసాహారాలకు అమ్మేశారు. చివరకు కత్తి కట్టేవారు కోడిని వదిలే వారు జేబులు నింపుకున్నారు. వీరిలో అధికంగా నష్టపోయింది మధ్య తరగతి ప్రజలు. అయితే కొంతమంది కోళ్లను వదిలి కత్తులు కట్టే సమయంలో గాయాలపాలయ్యారు. మరికొంత మంది కోడిపందేల పోరును చూసి సంబరాలు చేసుకున్నారు. ఏది ఏమైనా సంక్రాంతి సంబరాల్లో భాగంగా భోగి పండుగ రోజు కోడిపందేల ప్రాణాలు పందెగాళ్లను ఎంతో సంతోషాన్నిచ్చాయి. కొం త మందికి బాధను కలిగించినా మరో రెండు రోజులుగా జోరుగా పం దేలు జరుగుతాయని ముందస్తు సన్నాహాలు చేసుకుంటున్నారు. పందెంలో ఓడిన కొంత మంది పక్క జిల్లాల నుండి కోళ్లు కొనుగోలు చేసేందుకు వెళ్లినట్లు సమాచారం. ఒక్క మాచిరెడ్డిగారిపల్లె పంచాయతీలోనే సుమారు 20 కోళ్ల మధ్య పోటీలను పెట్టినట్లు సమాచారం. మరో రెండు రోజుల్లో మరిన్ని జాతికోళ్ల ప్రాణాలను మాంసపు ముద్దలై నెత్తుటి ఏరులు పారిస్తాయో మరిన్ని కోళ్లు కత్తులకు గాయపడతాయోనని కొంత మంది ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బాబు ‘నాన్చుడు’ ధోరణి..

కడప,జనవరి 14: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎత్తుగడతో జిల్లా రాజకీయాల్లో ఏమి జరగబోతుందో అనే వ్యవహారం అంతుపట్టడం లేదు. శాసనసభ ఎన్నికలు దగ్గరపడటంతో జిల్లాపై పూర్తిస్థాయిలో దృష్టిసారించే పరిస్థితి ఏర్పడింది. కానీ ఆయన ఎలాంటి అంచనాల్లో ఉన్నాడో జిల్లాస్థాయి నేతలకు అంతుపట్టడం లేదు. ఇందుకు నిదర్శనం మైదుకూరు నియోజకవర్గం ఇన్‌చార్జి పుట్టాసుధాకర్ యాదవ్ వ్యవహారంలో సాగిస్తున్న ధోరణి జిల్లా నేతలను, సుధాకర్ యాదవ్‌ను వారి అనుచరులను కలవరపాటుకు గురిచేస్తోంది. గత ఎన్నికల్లో సుధాకర్ యాదవ్ హఠాత్తుగా మైదుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీ ఇన్‌చార్జిగా వ్యవహరించడంతోపాటు ఎన్నికల్లో పోటీచేసి ఓటమి పాలయ్యారు. పార్టీలో కీలకస్థానంలో ఉన్న మంత్రి యనమల రామకృష్ణుడుగు వియ్యంకుడు కావడంతో ఈయనకు అప్పట్లో పార్టీ టికెట్ దక్కడం సాధ్యమైంది. ఎన్నికల్లో ఓటమిపాలు కావడంతో సుధాకర్‌యాదవ్‌ను టీటీడీ పాలకవర్గం డైరెక్టర్‌గా నియమించడం జరిగింది. ఏడాదిపాటుగా పాలకవర్గంలో ఉన్న సుధాకర్‌యాదవ్ తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే అత్యధిక మందికి అనేక రకాల దర్శనాలు కల్పించారనే వాదన ఉంది. ఈనేపధ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు రద్దుకావడంతో కొత్తకమిటీని ఎంపిక చేసుకునే వ్యవహారంలో కీలకమైన చైర్మన్ పదవికి సుధాకర్‌యాదవ్‌ను ఎంపిక చేసేందుకు 6నెలల క్రితమే చంద్రబాబునాయుడు నిర్ణయించారు. అయితే అనేక రాజకీయ అవాంతరాల మధ్య ఆయన ఎంపిక ఆగిపోయింది. తిరిగి ఇటీవల సుధాకర్ యాదవ్‌నే టీటీడి చైర్మన్‌గా నియమించాలని తెలుగుదేశం అధిష్ఠానవర్గం నిర్ణయించింది. ఇంకా సభ్యులను కూడా నియమించాల్సివుంది. దీనిపై అధిష్ఠానవర్గం కసరత్తు సాగిస్తోంది. అయితే పార్టీలోని ఒక వర్గం సుధాకర్ యాదవ్ నియామకాన్ని జీర్ణించుకోలేకపోతోంది. ఇందుకోసం రకరకాలుగా అడ్డంకులు మొదలయ్యాయి. తాజాగా ఆయన గతంలో ఓ మత సంప్రదాయమైన వర్గం కార్యక్రమాల్లో పాల్గొన్నారని దాన్ని సాకుగా చూపిస్తూ ఏకంగా ఓ బలమైన సామాజికవర్గం అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించడంతో జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. జిల్లా చరిత్రలోనే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పీఠం మొదటిసారిగా మన జిల్లాకు దక్కే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడ్డాక చరిత్రలోనే కేవలం ముగ్గురు మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానం డైరెక్టర్లుగా కొనసాగారు. చైర్మన్ పదవి జిల్లాకు దక్కితే మొదటిసారిగా నవ్యాంధ్రప్రదేశ్ చరిత్రలోనే కడప జిల్లాకు ప్రధమస్థానం దక్కే అవకాశం ఏర్పడుతుంది. అయితే కొత్త కమిటీని ఎప్పుడు నియమిస్తారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. టీటీడీ పాలక చైర్మన్‌గా సుధాకర్‌యాదవ్ పేరును తెరమీదకు తెచ్చినా ఆచరణలో అమలుల్లోకి రావడం లేదు. దీంతో సుధాకర్‌యాదవ్ వ్యతిరేక వర్గాలు ఏకమై ఆయన్ను చైర్మన్‌గా ఎంపికయ్యేందుకు అనేక రకాలుగా అడ్డంకులు సృష్టించే పరిస్థితి ఏర్పడింది. 6నెలలుగా ఈ పదవిపై తర్జన భర్జన సాగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సరైన నిర్ణయం ప్రకటించకపోవడంతో సుధాకర్ యాదవ్ వర్గం కలవరపాటు చెందుతోంది. దీంతో జిల్లా రాజకీయాల్లో ఏమి జరుగుతుందో అంతుపట్టడం లేదు. సుధాకర్‌యాదవ్‌కు టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చి మరొక నాయకుడిని తెరమీదకు తీసుకొస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఈనేపధ్యంలో సుధాకర్‌యాదవ్‌కు ఈ పదవి అప్పగించరాదంటూ ఒక వర్గం నేతలు తెరవెనుక సాగిస్తున్న ప్రయత్నాలు జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో ఆ పార్టీలో రెండువర్గాల మధ్య సీట్ల ఆధిపత్యం జోరుగా సాగుతోంది. అయితే మైదుకూరు రాజకీయాల్లో కొత్త మలుపుల కోసం అధిష్ఠానవర్గం ప్రయత్నాలు చేస్తుందా అనే అనుమానాలు కూడా లేకపోలేదు. ఈ పరిస్థితిలో పదవి వస్తుందో రాదో తెలియదు కానీ మరోవర్గం అడ్డుపడుతున్న వైనాన్ని అడ్డుకునేందుకు సుధాకర్‌యాదవ్ పెద్ద ప్రయత్నాలే చేసే పరిస్థితి ఏర్పడింది. ఈ వ్యవహారంపై జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపధ్యంలో చంద్రబాబునాయుడు జిల్లాపై ఎటువంటి వ్యూహంలో ఉన్నాడన్నది అంతుపట్టడం లేదు.

పుష్పగిరిలో ఘనంగా గోదాదేవి కల్యాణం

కమలాపురం, జనవరి 14: పవిత్రపుణ్యక్షేత్రమైన పుష్పగిరిలో ఆదివారం భోగిపండుగ సందర్బంగా సాయంత్రం శ్రీచెన్నకేశవస్వామి గోదాదేవి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవానికి పుష్పగిరి పీఠాధిపతి విద్యాభారతిస్వామి హాజరయ్యారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ కల్యాణోత్సవాన్ని భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కనులారా తిలకించారు. చైర్మెన్ సుబ్బారెడ్డి, ఈవో సురేశ్‌కుమార్‌రెడ్డి భక్తులకెలాంటి అసౌకర్యం కలుగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కల్యాణోత్సవ అనంతరం భక్తులకు స్వామివారి తలంబ్రాలు, ప్రసాదాలను నివేదించారు. అంతకుముందు చెన్నకేశవస్వామి లక్ష్మిదేవి మూలవిరాట్‌లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం కనుమపండుగ సందర్భంగా పార్వేట ఉత్సవం నిర్వహిస్తున్నట్లు చైర్మెన్ తెలిపారు.

నంది మండలంలో పర్యటించిన డీఎస్పీ

పెండ్లిమర్రి,జనవరి 14: మండల పరిధిలో డి-కేటగిరి ఫ్యాక్షన్ గ్రామమైన నందిమండలం గ్రామంలో ఆదివారం కడప డీఎస్పీ మాసూంబాషా, రూరల్ సీఐ హేమసుందర్, ఎస్‌ఐ రోషన్, పోలీసు సిబ్బంది కలియతిరిగారు. అలాగే ఫ్యాక్షన్ లీడర్ల ఇంటివద్దకు వెళ్లి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పండుగను చిన్నారిపిల్లలతో, బంధువులతోకలిసి సంతోషంగా జరుపుకోవాలని కోరారు. అనంతరం గ్రామస్థులు, ఫ్యాక్షన్ లీడర్లతో పంచాయతీ కార్యాలయం వద్ద సమావేశం ఏర్పాటుచేసి డీఎస్పీ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ, జూదం, కోడిపందేలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత గ్రామపెద్దలుగా మీకే అధికారం ఇస్తున్నామని వారికి తెలిపారు. అలాగే కోడిపందేలు పంట పొలాల వద్ద జరిగితే సంబంధిత యజమానిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.

చెన్నారెడ్డిపల్లెలో రైతు ఆత్మహత్య
కమలాపురం, జనవరి 14: మండల పరిధిలో చెన్నారెడ్డిపల్లెలో దండుబోయిన మల్లికార్జున (36) అనే రైతు ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. రెండెకరాల భూమి, ఆరు ఎకరాల గుత్త్భూమి చేసుకుంటూ పంట దిగుబడి సక్రమంగా లేక అప్పులు అధికం కావడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు తెలిపారు. మృతునికి భార్య నాగేశ్వరి, చందు, నిఖిలేశ్వర్ అనే కుమారులు ఉన్నారు. రిమ్స్‌లో పోస్టుమార్టం నిమిత్తం ఉన్న మృతుని శవాన్ని ఎమ్మెల్యే రవీంద్రనాధరెడ్డి, జిల్లా వైకాపా రైతువిభాగం కన్వీనర్ ప్రసాదరెడ్డి, సర్పంచ్ రవిశంకర్, మాజీ ఎంపీటీసీ గండి నారాయణ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం ద్వారా సాయం అందేలా చర్యలు తీసుకుందామని ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి తెలిపారు.

మోదీ పాలనలోనే దేశాభివృద్ధి

వేంపల్లె, జనవరి 14: భారతదేశ ప్రధాని మోడీ పాలనలోనే దేశాభివృద్ధి సాధ్యమని భారతీయ జనతా పార్టీ నేత కందుల రాజమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన స్వగ్రామమైన మండలంలోని టి.యల్లంవారిపల్లెలో విలేకరులతో మాట్లాడారు. మోదీ పాలనలో బడుగు, బలహీనవర్గాల ప్రజల అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రధాని అన్ని రంగాల ప్రజల మన్ననలు పొందుతున్నారన్నారు. అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిన ఘనత మోదీదేనన్నారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీకి ప్రజలు పట్టం కడుతున్నారని అన్నారు. ప్రపంచ దేశాలలో భారతదేశం ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటోందన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు రామచంద్రారెడ్డి, గాలి హరిప్రసాద్, డాక్టర్ సుబ్బారెడ్డి, చలమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా శ్రీసౌమ్యనాథుని
కల్యాణోత్సవం

నందలూరు, జనవరి 14: జిల్లాలోని అతిపురాతన ఆలయంగా చరిత్రకెక్కిన ఆలయంగా ప్రసిద్ధికెక్కిన నందలూరు సౌమ్యనాథాలయంలో మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆదివారం ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ గోదాదేవితో స్వామివారి కల్యాణోత్సవం అంగ రంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు సునీల్‌శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కల్యాణ మంటపంలో దేవేర్లతో స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి కల్యాణోత్సవ విశిష్టతను భక్తులకు వివరిస్తూ కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ పాలక మండలి ఛేర్మన్ పల్లె సుబ్రమణ్యం, కార్యనిర్వాహణాధికారి రామాంజులు ఆలయానికి విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కల్యాణోత్సవ అనంతరం భక్తులు స్వామివారి మూలవిరాట్‌ను సందర్శించి ప్రత్యేకపూజలు నిర్వహించారు.
అన్నదాన సేవాట్రస్టు భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు గంటా వాసుదేవయ్య, లంకాయగారి సుబ్బరామయ్య, ఎపీజీబీ అధికారి శైలేంద్రనాధ్ తదితరులు పాల్గొన్నారు.
శిల్పారామంలో
సంక్రాంతి సంబరాలు

ఖాజీపేట, జనవరి 14: కడప నగరంలోని శిల్పారామంలో సంక్రాంతి సంబరాల్లో ప్రదర్శించిన సాంస్కృతి కార్యక్రమాలు అందరినీ అలరించాయి. జేసీ శే్వత, జేసీ -2 శివారెడ్డి కార్యక్రమాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సినిమా రంగానికి చెందిన పలువురు కళాకారులు తమ ఆటాపాటలతో ప్రదర్శనలు ఇచ్చి అలంరించారు. సంక్రాందతి సంబరాల్లో అధిక సంఖ్యలో జనం పాల్గొన్నారు. ముందస్తుగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల విజేతలకు, కళాకారులకు జిల్లా ప్రధాన జడ్జి శ్రీనివాస్ చేతులమీదుగా బహుమతులు అందించారు. స్స్కాృంతిక కార్యక్రమాలు మానసిక ఆనందాన్ని కల్గిస్తాయని పలువురు అధికారులు తెలిపారు. ఈ నెల 21, 22, 23 తేదీల్లో గండికోట ఉత్సవాలు నిర్వహిస్తామని, జిల్లా ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా పర్యాటక శాక విభాగం అధికారులు గోపాల్, విజయ్‌కుమార్ విన్నవించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

బద్వేలులో దారుణం..

బద్వేలు, జనవరి 14: బద్వేలు పట్టణంలో ఇద్దరు వివాహితుల మధ్య ఏర్పడిన వివాహేతర సంబందం వారి ఇద్దరి ప్రాణాల మీదకు వచ్చింది. వివరాల్లోకెళ్తే.. బద్వేలు పట్టణంలోని సిద్దవటం రోడ్డులో గల కిరణ్ చిన్నపిల్లల ఆసుపత్రి సమీపంలో ఆదివారం ప్రియురాలు శాంతి గొంతుకోసి ప్రియుడు ఖాదర్‌వలి కూడా గొంతు కోసుకున్న సంఘటన చోటు చేసుకుంది. సుందరయ్యకాలనీకి చెందిన ఖాదర్‌వలి స్థానిక కిరణ్ ఆసుపత్రి సమీపంలో హెచ్‌ఆర్‌టి సూపర్ బజార్‌ను గత కొనే్నల్లుగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ సూపర్ బజార్‌లో అదే సుందరయ్య కాలనీకి చెందిన శాంతి అసిస్టెంట్‌గా చేరింది. వీరిద్దరి మధ్య పరిచయం వివాహేతర సంబంధంగా మారిందని స్థానికులు అంటున్నారు. ఈ నేపథ్యంలో శాంతి భర్తకు విషయం తెలియడంతో రెండు సంవత్సరాల క్రితం షాపులో పనిని మాన్పించి, అతను కూవైట్‌కు వెళ్లిపోయాడు. ఆ తర్వాత శాంతి పక్కనేవున్న ఆసుపత్రిలో పనిచేస్తూ ఖాదర్‌వలితో తిరిగి అక్రమ సంబంధం కొనసాగించేదని స్థానికులు అంటున్నారు. ఈ నేపథ్యంలో శాంతి భర్త ఇటీవల కువైట్ తిరిగి వచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఆదివారం మధ్యాహ్నం ఎప్పటి లాగానే శాంతి షాపులోకి వెళ్ళి మాట్లాడుతూ ఘర్షణకు పాల్పడినట్లు తెలుస్తుంది. ఈ ఘర్షనలో ఖాదర్‌వలి షాపులోని చాకుతో శాంతి గొంతు కోయడంతో ఆమె అక్కడి నుంచి పరుగులుతీసి పక్కనే వున్న ఆసుపత్రికి చేరుకుంది. అయితే ఏమి జరుగుతుందోనన్న భయంతో ఖాదర్‌వలి కూడా చాకుతో గొంతు కోసుకోవడంతో తీవ్ర రక్తస్రావం అయ్యి అక్కడికక్కడే పడిపోయాడు. స్థానికులు విషయం తెలుసుకొని సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. ఎస్సై చలపతి మాట్లాడుతూ ఖదర్‌వల్లి, శాంతిల పరిస్థితి విషమంగా వుండటంతో కడప రిమ్స్‌కు తరలించామని, పూర్తి విషయాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.

పోలీస్ జీపును ఢీకొని పారిపోయేయత్నం
* వెంబడించి పట్టుకున్న పోలీసులు
మైదుకూరు, జనవరి 14 : తప్పతాగిన మైకంలో విధి నిర్వహణలోవున్న పోలీసు జీపునుగుద్ది ఏకంగా పోలీసులనే తీవ్రభయభ్రాంతులకు గురిచేసి పారిపోవడానికి ప్రయత్నించిన హర్యానా రాష్ట్రానికి చెందిన ఇద్దరు డ్రైవర్లను దువ్వూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను స్థానిక పోలీసుస్టేషన్ ఆవరణలో డీఎస్పీ డీఆర్ శ్రీనివాసులు వెల్లడించారు. హర్యానా రాష్ట్రానికి చెందిన ఆరీఫ్, రహీల్ అనే లారీ డ్రైవర్లు మద్రాసు నుంచి ఎల్‌సీడీ టీవీలను లోడ్‌చేసుకుని ఢీల్లీకి బయలుదేరే సమయంలో వారు మద్యం సేవించి తాగారని చెప్పారు. కడప జిల్లా మాధవరం గ్రామం దాటిన తరువాత పోలీసులు తనిఖీచేస్తున్న నేపథ్యంలో తప్పతాగినవారు లారీని ఆపకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు. పోలీసు జీపును అడ్డంగాపెట్టి వారిని ఆపడానికి ప్రయత్నించగా అరీఫ్ అనే డ్రైవర్ పోలీస్ జీపును లారీతో గుద్ది పారిపోయారు. ఈ సంఘటనలో సిద్ధవం ఎస్‌ఐ అరుణ్‌రెడ్డి, జీపుడ్రైవర్ ప్రదీప్‌కుమార్‌లకు గాయాలయ్యాయి. కడప సమీపంలోని టోల్‌ప్లాజాలోకూడా ఆపకుండా టోల్‌ప్లాజాను గుద్దుకుని వెళ్లిపోయారు. అదేవిధంగా చెన్నూరు దగ్గరల్లో పోలీసు బార్‌గేట్లను అడ్డంపెట్టి లారీ ఆపడానికి ప్రయత్నించగా పోలీసులను తొక్కించైనా పారిపోయేందుకు శరవేగంగా నడుపుకుంటూ వెళ్లారు. ఇంతలో దువ్వూరు సమీపంలో దువ్వూరు ఎస్‌ఐ విద్యాసాగర్, రోడ్డుసేఫ్టీవారు లారీని అటకాయించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ వారు రోడ్డుకు అడ్డంగాపెట్టిన వాటిని గుద్దించి పారిపోయారు. వెంటనేతేరుకుని ఎస్‌ఐ విద్యాసాగర్ వెంబడించి ఇద్దరి లారీ డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
సిద్దవటంలో..
సిద్దవటం: మండలంలోని చాముండేశ్వరీపేట వద్ద సిద్దవటం పోలీసుస్టేషన్‌కు సంబంధించిన జీపును హర్యానాకు చెందిన లారీ ఢీ కొనడంతో డ్రైవర్ ప్రదీప్‌కు గాయాలైనట్లు ఎస్‌ఐ అరుణ్‌రెడ్డి తెలిపారు. ఈమేరకు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
అమెరికా డాలర్లు చూపి
మోసం చేస్తున్న బంగ్లా దేశీయులు
* ఇద్దరి అరెస్టు * నలుగురు పరారీ
ఖాజీపేట, జనవరి 14: అమెరికా డాలర్ల పేరుతో జిల్లా వాసులను మోసం చేస్తున్న బంగ్లాదేశీయుల ముఠాను ఆదివారం చిన్నచౌకు ఎస్సై మోహన్ అరెస్టు చేసినట్లు తెలిపారు. ఆదివారం రాత్రి విలేఖరులతో ఆయన మాట్లాడుతూ బంగ్లాదేశ్‌కు చెందిన ఆరుగురు ముఠా సభ్యులు జిల్లా పర్యటిస్తు అమెరికా డాలర్లను చూపించి మోసం చేస్తున్నారని దేవుని కడపకు చెందిన ఆర్‌ఎంపీ డాక్టర్‌ఝ నాగార్జున ఫిర్యాదు చేశాడన్నారు. ఆ మేరకు తమ సిబ్బంది తో నిఘా ఉంచి ఆదివారం ఆర్టీసీ బస్టాండ్‌లో మాతోఫర్‌తోపీ, మున్సి మహమ్మద్‌ను అదుపులోకి తీసుకున్నామన్నారు. మరో నలుగురు పరారైనట్లు తెలిపారు. అదుపులో ఉన్న వారిని విచారిస్తే వారి వద్ద నకిలీ ఆధార్‌కార్డు, పాస్‌పోర్టులు దొరికాయన్నారు. రేష్మా, అలంకాన్, అమీర్, కితాబ్‌అలీ అంతా ముఠా సభ్యులేనని తమను చూసీ పరారయ్యారన్నారు. శంకరాపురంలోని అరిఫుల్లా నుంచి రూ. 2.50లక్షలు, దేవుని కడపకు చెందిన ఆర్‌ఎంపీ డాక్టర్ రూ. 1.50 లక్షలు మోసం చేసి తీసుకున్నట్లు అంగీకరించారని, ఒరిజనల్ అమెరికన్ డాలర్లతో ముందుగా కలిసి ఇక్కడ ఎవరైన చూస్తే సమస్య అవుతుందని, ఎవరులేని ప్రాంతాలకు తీసుకెళ్లి నకిలీ డాలర్లు అందజేసినట్లు నిందితులు అంగీకరించారని ఎస్సై తెలిపారు.