కడప

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,ఏప్రిల్ 23: సేవ్ డెమోక్రసీ పేరిట జిల్లాలోని వైఎస్సార్ పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు శనివారం సాయంత్రం నగరంలోని పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు పెద్దఎత్తున ప్లకార్డులు చేబూని కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపడకుండా స్పీకర్ అడ్డుకుని ఆయన సైతం రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారని వైకాపా జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి బాబు, ఆయన కోటరీ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలు చేస్తూ ఓటుకు నోటు కేసులో అడ్డంగా చిక్కిన బాబు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారని అన్నారు. వైకాపా వీడిన నేతలకు పుట్టగతులుండవని, దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు వచ్చి సత్తా నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలే వారికి బుద్ధి చెబుతారని వారు హెచ్చరించారు.
రాష్ట్రంలో చీకటిపాలన చోటుచేసుకుందని, వైకాపా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వైకాపా నేతలు ఆరోపించారు. అవినీతిలో కూరుకుపోయిన టిడిపి ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. టిడిపిలో చేర్చుకున్న వైకాపా ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి, ప్రజాక్షేత్రంలోకి రావాలని వైసిపి నేతలు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు ఏ.అమరనాధరెడ్డి అధ్యక్షత వహించగా, కడప ఎంపి వైఎస్ అవినాష్‌రెడ్డి, వైకాపా ఎమ్మెల్యేలు ఎస్‌బి అంజద్‌బాషా, పి.రవీంద్రనాధరెడ్డి, మేయర్ కె.సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి, ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి మాసీమ బాబు, నగర అధ్యక్షుడు బి.నిత్యానందరెడ్డి, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు పులిసునీల్‌కుమార్, జెడ్పిటీసీలు, పార్టీలోని వివిధ అనుబంధ సంఘాల ప్రముఖులు పాల్గొన్నారు.
విఆర్‌ఎలను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి
ఆంధ్రభూమి బ్యూరో
కడప,ఏప్రిల్ 23: విఆర్‌ఏలు (గ్రామసేవకులు) వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించి, నాల్గవ తరహా ఉద్యోగులుగా గుర్తించి పనికి తగిన వేతనం ఇచ్చి ఆదుకోవాలని ఎమ్మెల్సీ శ్రీనివాసులురెడ్డి, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎంఏ గఫూర్‌లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏ.పి.గ్రామసేవకుల సంఘం 5వ రాష్ట్ర మహాసభ ర్యాలీ, ప్రదర్శన శనివారం స్థానిక సిఐటియు కార్యాలయం నుంచి ప్రారంభమై పాతబస్టాండు, ఏడురోడ్లు, కళాక్షేత్రం వరకు నిర్వహించి నేక్‌నామ్‌ఖాన్ కళాక్షేత్రానికి చేరింది. బహిరంగ సభ రాష్ట్ర కార్యదర్శి ఎం.బాలకాశి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇందిరా పార్కు వద్ద జరిగిన ధర్నాకు హాజరైన ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక హామీల వర్షం కురిపించారని గుర్తు చేశారు. 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తిస్తామని , 010 పద్దుకింద ట్రెజరీ ద్వారా జీతాలు మంజూరు చేస్తామని , కనీస వేతనం రూ.15వేలు చెల్లిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చి రెండుసంవత్సరాలు అవుతున్నా ఇంత వరకు ఏ సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. కనీస వేతనం రూ.15వేలు అడిగితే రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉందని అంటున్నారని, ఎమ్మెల్యే, ఎంఎల్‌సి, మంత్రులకు లక్షల రూపాయలు వేతనాలు ఎలా పెంచుకున్నారని ప్రశ్నించారు. గ్రామసేవకులు గ్రామాలకు సైనికులుగా పనిచేస్తున్నారని, గ్రామంలో భూమి శిస్తువసూలు దగ్గర నుంచి ప్రభుత్వానికి రాబడి సమకూరుస్తున్నారని చెప్పారు. గ్రామసేవకులు సమస్యలు పరిష్కారం కావాలంటే రానున్న కాలంలో ఐక్యంగా సమరశీల పోరాటాలకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు.
అనంతరం ఎమ్మెల్సీ శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు పాదయాత్రలో గ్రామసేవకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని హామీ ఇచ్చారన్నారు. గ్రామసేవకులు రూ.6వేలు వేతనంతో ఏమి తిని జీవిస్తారని ప్రశ్నించారు. ఇటీవల కాలంలో అధికార పార్టీ నాయకులు ఇసుక మాఫియా, రియల్ ఎస్టేట్ మాఫియాలుగా మారి గ్రామసేవకులపై దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని అన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పారని, నిరుద్యోగ భృతి ఇంతవరకు లేదని ఆరోపించారు. ఈ సభలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు, జిల్లా అద్యక్ష, కార్యదర్శులు కె.ఆంజనేయులు, రామమోహన్, గ్రామసేవకుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ధైర్యం, ఏసురత్నం, సిపిఎం రాష్ట్ర నాయకులు బి.నారాయణతోపాటు 13 జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.

కలెక్టర్, ఇద్దరు ఆర్‌డిఓలు బదిలీ?
ఆంధ్రభూమి బ్యూరో
కడప,ఏప్రిల్ 23: కలెక్టర్ కెవి రమణ బదిలీ దాదాపు ఖరారైంది. ఆయన జిల్లా నుంచి వెళ్లేందుకే ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన సతీమణి రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఈశ్వరీ సుదీర్ఘ సెలవుపై వెళ్లి కలెక్టర్ బదిలీ అయ్యే ప్రాంతానికి వెళ్లేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిసింది. అదే బాటలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న పలువురు అధికారులు రెడీ అయ్యారు. కడప, జమ్మలమడుగు ఆర్డీఓలు చిన్నరాముడు, వినాయకం కూడా రాజకీయ వత్తిళ్లకు భయపడి ఇప్పటికే బదిలీలు చేయించుకునే ప్రయత్నంలో ఉన్నారు. రాజంపేట ఆర్డీఓ ప్రభాకర్‌పిళ్లై మరో మూడు మాసాలలో పదవీ విరమణ కానుండటంతో ఆయన మాత్రం అక్కడే పదివీ విరమణ పొందేందుకు సిద్ధంగా ఉన్నారు. కలెక్టర్ వ్యవహార శైలిపై పలుమార్లు అధికారపార్టీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటనలో అధికారపార్టీ నేతలు, కలెక్టర్ మధ్య విభేధాలు తొలగించడానికి ప్రయత్నించినా ఫలితం కన్పించలేదు. దీంతో ముఖ్యమంత్రి కలెక్టర్ బదిలీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే జిల్లాస్థాయిలో కీలకమైన రాజీవ్ విద్యామిషన్ , డిఆర్‌డిఏ, మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్లు, బిసీ, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్టులకు బాగా డిమాండ్ ఉండడంతో ఆ పోస్టులకోసం పలువురు అధికారపార్టీ నేతల ద్వారా ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎండలు బాబోయ్...ఎండలు
ఆంధ్రభూమి బ్యూరో
కడప,ఏప్రిల్ 23: జిల్లాలో రోజురోజుకు ఎండలు తారాస్థాయికి చేరుతున్నాయి. జిల్లా అగ్నిగుండంగా మారి ఇళ్లల్లో నుంచి బయటకు రావాలంటే ప్రజలు జంకుతున్నారు. శనివారం కడప నగరంలో 43.6సెల్సియస్ డిగ్రీలు, ప్రొద్దుటూరు, కమలాపురం, మైదుకూరు నియోజకవర్గాల్లో 43సెల్సియస్ డిగ్రీలు, జమ్మలమడుగు , రాయచోటి, బద్వేలు, రాజంపేట , పులివెందుల నియోజకవర్గాల్లో 42సెల్సియస్ డిగ్రీలు, రైల్వేకోడూరులో 41సెల్సియస్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మేనెలలో ఉండాల్సిన ఉష్ణోగ్రతలు ఏప్రిల్‌నెలలో నమోదవుతున్నాయి. దీంతో మేనెల నాటికి ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత 30 ఏళ్లుగా ఈ ఉష్ణోగ్రతలు నమోదు కాలేదని, ఈ ఏడాది ఉష్ణోగ్రత రోజురోజుకు పెరుగుతోందని వాతావరణ కేంద్ర అధికారులు స్పష్టం చేస్తున్నారు. అదే తరహాలోనే జిల్లావ్యాప్తంగా ఎండలతోపాటు వడగాలులు పెద్ద ఎత్తున వీస్తున్నాయని వైవియు భౌతికశాస్త్ర అధిపతి ప్రొఫెసర్ కృష్ణారెడ్డి తెలిపారు. వేసవి కాలం కారణంగా ఇళ్ల నుంచి వృద్ధులు, పసిపిల్లలు బయటకు రావడం లేదు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు అన్ని నియోజకవర్గ కేంద్రాలు కర్ఫ్యూ వాతావరణం నెలకొంటోంది. చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లో నీరు అడుగంటడంతో తాగునీరు దొరకడం గగనంగా మారింది.

రాజోలిపై ఊసెత్తని టిడిపి
* రిజర్వాయర్ నిర్మించాలని డిమాండ్
రాజుపాళెం, ఏప్రిల్ 23: రాజోలి ఆనకట్టవద్ద రిజర్వాయర్‌ను నిర్మించాలని కెసి రైతులు ఎదురుచూస్తున్నారని వైకాపా జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు సంబటూరు ప్రసాదరెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన రాజోలి ఆనకట్టను పరిశీలించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఒకప్పుడు రాజోలి ఆనకట్టను నిర్మించాలని టిడిపి నాయకులు డిమాండ్ చేశారని, ప్రస్తుతం అధికార పార్టీలోవున్నా దీని ఊసేత్తడం లేదన్నారు. ఈ రిజర్వాయర్ నిర్మాణం జరుగితే కెసి రైతులకు సాగునీటికోసం పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదన్నారు. రిజర్వాయర్ నిర్మాణం అయితే రెండుకార్ల పంటలు సాగుచేసుకోవచ్చునని, దాంతో రైతులు మరింత అభివృద్ధిచెందే అవకాశం ఉంటుందన్నారు. కెసి కాలువకు సక్రమంగా సాగునీరు అందక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, అయినా టిడిపి ప్రభుత్వం, నాయకులు దీనిపై స్పందించడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రాజోలి ఆనకట్టవద్ద రిజర్వాయర్ నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైకాపా మండల రైతు విభాగం అధ్యక్షుడు కానాల శ్రీకాంత్‌రెడ్డి, మాజీ జడ్పిటిసి భాస్కర్ పాల్గొన్నారు.

జాతీయ పంచాయతీరాజ్ సదస్సుకు జిల్లా ప్రజాప్రతినిధులు
* కాంబల్లెకు జాతీయ స్వశక్తి పురస్కారం
* జడ్పీ చైర్మన్, ఇద్దరేసి ఎంపిపిలు, సర్పంచ్‌ల ఎంపిక
ఆంధ్రభూమి బ్యూరో
కడప, ఏప్రిల్ 23: జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్‌పూర్‌లో ఆదివారం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగే సదస్సుకు జిల్లా నుంచి జెడ్పి చైర్మన్, ఇద్దరు మండల పరిషత్ అధ్యక్షులు, ఇద్దరు సర్పంచ్‌లను ఎంపికచేశారు. వీరిలో ఒక మండల అధ్యక్షురాలు మినహా మిగిలిన వారు శుక్రవారం రాత్రి విజయవాడ నుంచి రైలులో బయలుదేరి వెళ్లారు. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం కాంబల్లె గ్రామపంచాయతీ ఏకగ్రీవ సర్పంచ్, తెలుగుదేశం పార్టీ శిక్షణా తరగతుల డైరెక్టర్ భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి సతీమణి బి.ఉమాదేవి తమ గ్రామంలో చేపట్టిన అభివృద్ధికి జాతీయ స్వశక్తి కిరణ్ పురస్కారం కింద ఎంపికయ్యారు. ఆమె ప్రధాని నరేంద్రమోదీ చేతులమీదుగా రూ.8లక్షల నగదు అందుకోనున్నారు. అలాగే జిల్లా నుంచి జెడ్పి చైర్మన్ గూడూరు రవి, చాపాడు, వేంపల్లె మండల పరిషత్ అధ్యక్షులు కొండమ్మ, ఎం.రవికుమార్, నాగిరెడ్డిపల్లె సర్పంచ్ శివప్రసాద్‌రెడ్డి, కాంబల్లె సర్పంచ్ ఉమాదేవిలు సదస్సుకు వెళ్లాల్సివుండగా, చాపాడు ఎంపీపీ కొండమ్మ మినహా సదస్సుకు మిగిలిన వారు బయలుదేరి వెళ్లారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ జాతీయ సదస్సుకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు బయలుదేరి వెళ్లారు.
ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రభుత్వం విఫలం
బ్రహ్మంగారిమఠం, ఏప్రిల్ 23: రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రాజెక్టుల స్థితిగతుల గురించి పట్టించుకున్నపాపాన పోలేదని సిపి ఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య పేర్కొన్నారు. శనివారం బ్రహ్మంగారిమఠం వచ్చిన ఆయన కార్యకర్తలు, నేతలతో కలిసి బ్రహ్మంసాగర్ ప్రాజెక్టును పరిశీలించి ప్రాజెక్టులో నీరు పూర్తిగా అడుగంటిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనంతటికీ కారణం ఈ ప్రాంతంలో వుండే రాజకీయ పార్టీల నేతల అసమర్థతే కారణమని దుయ్యబట్టారు. అనంతరం ఐదురోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో తీవ్ర తాగునీటి కరువు ఏర్పడిందని, ముఖ్యంగా వై ఎస్సార్ జిల్లాలో 670 గ్రామాలలో తాగునీరు లేక తీవ్ర నీటి ఎద్దడితో ప్రజలు అలమటిస్తున్నా ఈ ప్రభుత్వంగానీ, పాలకులుగానీ పట్టించుకోలేదన్నారు. అధికార పార్టీలో వున్న నేతలందరూ తమకేమి పదవులొస్తాయా అంటూ పదువుల కోసమే ప్రాకులాడుతున్నారే తప్ప ఈ ప్రాంత అభివృద్ధి కోసం కాదు, జిల్లాలో వుండే సమస్యలపైగానీ ప్రశ్నించిన సందర్భాలే లేవన్నారు. జిల్లాలో శాసనమండలి ఉపాధ్యక్షుడిగా వున్న సతీష్‌కుమార్‌రెడ్డి నీరు వచ్చేంతవరకు తన గెడ్డం తీయనని భీష్మ ప్రతిజ్ఞ చేశాడే తప్ప నీటి కోసం కృషి చేసిన దాఖలాలు లేవని, ఆయన నీరు తెచ్చే పరిస్థితులు కనిపించకపోగా తన గెడ్డం మాత్రం పెంచుకుంటున్నారన్నారు. అదేవిధంగా జిల్లాలోని ప్రాజెక్టుల కోసం రూ.130 కోట్ల నిధులు విడుదల చేశామని, ప్రభుత్వ పాలకులు ప్రకటనలు గుప్పిస్తున్నారేగానీ అరకొరగా వున్న పనులను కూడా పూర్తి చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టులు పూరె్తైతే ఎప్పుడో ఒకసారైనా వర్షాలు వస్తే ఆ నీటినైనా నిలుపుకొనే అవకాశం వుండేదని, ప్రస్తుతం ఏ ప్రాజెక్టులూ పూర్తి కాకుండా అరకొరగా మిగిలిపోతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి, వారివారి సొంత లాభాల కోసమే ప్రభుత్వంలో వున్న పాలకులు, ఇతర నేతలు పాటుపడుతున్నారే తప్ప ప్రజల కోసంగానీ, ప్రజా సమస్యల కోసం గానీ ఏ ఒక్కరోజూ కృషి చేసిన దాఖలాలు లేవన్నారు. ఇటువంటి నేతలున్నంత కాలమూ జిల్లా అధోగతిపాలుకాక తప్పదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు ఎప్పుడో పట్టాలిచ్చారుగానీ వారికి భూములు చూపించడం గానీ, పాసుపుస్తకాలు, టైటిల్ లీడ్ ఇవ్వడంగానీ, కొలతలు వేసి భూములను చూపించడంగానీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులుగానీ, పాలకులుగానీ ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వ భూములను పేదలకు ఇస్తే ఆ భూములనే లాక్కొని, ఇతరులకు అప్పగించేందుకు ఈ ప్రభుత్వం చూస్తోందని ఆయన పేర్కొన్నారు. అదే జరిగితే పేద ప్రజల తరుపున సిపి ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆంధోళన చేయక తప్పదని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఐదురోడ్ల కూడలి నుంచి బద్వేలు వరకు బైక్‌ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో సిపి ఐ నాయకులు వీరశేఖర్, వెంకటసుబ్బయ్య, రమణయ్య, అంకిరెడ్డి ఇతర నేతలు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
కడప (కల్చరల్), ఏప్రిల్ 23: ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ -2 శేషయ్య జిల్లా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని సభాభవనంలో జరిగిన ఎస్సీ,ఎస్టీ ప్రత్యేక ఫిర్యాదులు కార్యక్రమంలో జెసి ప్రజల నుంచి సమస్యల వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ ప్రజలు వ్యయప్రయాసాలతో సుదూర ప్రాంతాల నుంచి తమ సమస్యలను విన్నవించుకోవడానికి వస్తారని, వారి సమస్యలను పరిష్కరించడానికి అన్ని శాఖల అధికారులు కృషి చేయాలన్నారు. తమకు అందిన ఫిర్యాదులపై స్పందించి పరిష్కరించి వివరాలను కలెక్టర్ కార్యాలయానికి పంపించాలన్నారు. ప్రజాసమస్యల పట్ల అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. చిన్నమండెం మండలం మల్లూరు గ్రామానికి చెందిన రెడ్డయ్య గతంలో సుమో డ్రైవర్‌గా పనిచేస్తూ 2007లో ప్రమాదంలో వికలాంగుడయ్యాడు. తనకు వికలాంగుల సర్ట్ఫికెట్‌మంజూరు చేయాలని కోరారు. కడప నగరం బచ్చంపల్లె గ్రామానికి చెందిన శ్రీనివాసులు తనకు ప్రభుత్వం తరపున గృహం మంజూరు కోసం అభ్యర్థించారు. రాజంపేట మండలం కూచువారిపల్లె గ్రామానికి చెందిన సుబ్బరాయుడు తన స్థలం వాటర్ ట్యాంక్ నిర్మాణం కింద నష్టపోయానని నష్టపరిహారం అందజేయాలన్నారు. కడప నగరం ప్రకాశ్‌నగర్‌కు చెందిన రాజేంద్ర పంతులు ప్రకాశ్‌నగర్‌లో తనకు 850 ప్లాట్లు ఎస్సీ,ఎస్టీ ఎంప్లారుూస్‌కు కేటాయించారని, కానీ ఆ స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారంటూ వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాలనీలో ఎన్‌టిఆర్ సుజల స్రవంతి ప్లాంటు నిర్మించాలని కోరారు. సికె దినె్న మండలం మామిళ్లపల్లె గ్రామానికి చెందిన మాతయ్య తమ గ్రామానికి సరైన రోడ్డులేదని, రోడ్డుమంజూరు చేయాలన్నారు. డిఆర్వో సులోచన, ఎస్సీ కార్పొరేషన్ ఇడి ప్రతిభాభారతి, జెడ్పి సిఇఓ రజియాబేగం, స్టెప్ సిఇఓ మమత పాల్గొన్నారు.

ఎంసెట్‌కు చేతి గడియారం నిషేధం
ఆంధ్రభూమి బ్యూరో
కడప, ఏప్రిల్ 23: ఎంసెట్ - 2016కు హాజరయ్యే విద్యార్థులకు చేతి గడియారంను నిషేధిస్తూ ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది. ప్రతి పరీక్ష గదిలో గోడ గడియారాలను అమర్చాలని ఆదేశించింది. గతంలో కడపలో ఎలక్ట్రానిక్ పరికరాలు, యూట్యూబ్, సెల్ బ్యాటరీల సహాయంతో మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన ఘటనలు చోటు చేసుకోవడంతో ఈమారు కంటికి కన్పించే ప్రతి ఎలక్ట్రానిక్ పరికరాన్ని తనిఖీలు చేయడమేగాక జామర్లు అమర్చనున్నారు. జిల్లాలో కడపలో 10 పరీక్షా కేంద్రాలు ఏర్పాటుచేశారు. 8 కేంద్రాల్లో మెడికల్, అగ్రికల్చర్ విభాగంలో 3446 మంది, రెండు పరీక్షా కేంద్రాల్లో ఇంజనీరింగ్‌లో 5572 మంది పరీక్ష రాయనున్నారు. ప్రొద్దుటూరుకు పట్టణంలో నాలుగు పరీక్షా కేంద్రాల్లో ఇంజనీరింగ్ 1701 మంది పరీక్ష రాయనున్నారు. కడప, ప్రొద్దుటూరు రెండు పట్టణాలకు ఎంసెట్ నిర్వహణకు ఇద్దరిని రీజనల్ కో-ఆర్డినేటర్లుగా నియమించారు. ఇంజనీరింగ్ పరీక్ష ఉదయం 10గంటల నుంచి మద్యాహ్నం 1 గంటల వరకు , మెడికల్, అగ్రికల్చర్ పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహిస్తారు. పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించరు. పరీక్షా కేంద్రాల విషయానికొస్తే కడపలో కోటిరెడ్డి మహిళా డిగ్రీకళాశాల, ఎస్వీ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలల్లోనూ, కేఎల్‌ఎం, స్విస్ట్, కేఎస్‌ఆర్‌ఎం, కేఓఆర్‌ఎం, గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాలల్లో పరీక్షా కేంద్రాలను కేటాయించారు. స్విస్ట్, కేఎల్‌ఓ ఇంజనీరింగ్ కళాశాలలు మినహా మిగిలిన కళాశాలల సెంటర్లలో మెడికల్ ఎంట్రెన్స్‌కు కేటాయించారు. ఇక ప్రొద్దుటూరు వీబీఐటి, సిబీఐటి, వాగ్దేవి, వైఎస్సార్ ఇంజనీరింగ్ యోగివేమన ఇంజనీరింగ్ కేంద్రాల్లో ఇంజనీరింగ్‌కు మాత్రమే ప్రవేశపరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక ప్రతి విద్యార్థి హాల్ టికెట్‌తోపాటు వ్యక్తిగత గుర్తింపు కార్డు, వ్యక్తిగత వివరాలు కలిగిన ఓఎంఆర్ షీట్‌ను బ్లాక్ లేదా బ్లూ కలర్ బాల్ పాయింట్ పెన్స్‌తో నింపాల్సివుంటుంది. ఎస్సీ,ఎస్టీ విద్యార్థులు కుల ధృవీకరణ సర్ట్ఫికెట్ తీసుకుని వచ్చి పరీక్ష నిర్వాహకులకు చూపాల్సి ఉంటుంది. సంబంధిత పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ జిరాక్స్ సెంటర్లు, బుక్ స్టాల్స్ మూసివేయాలని పరీక్షల నిర్వాహకులు ఆదేశించారు.

వడదెబ్బతో రిటైర్డ్ హెచ్‌ఎం మృతి
పుల్లంపేట, ఏప్రిల్ 23:మండలంలోని రెడ్డిపల్లెకు చెందిన రిటైర్డ్ హెచ్‌ఎం నంద్యాల యల్లయ్య (80) శనివారం వడదెబ్బతో మృతి చెందినట్లు ఆయన కుమారుడు రవి తెలిపారు. యల్లయ్య హెచ్‌ఎంగా, ఉపాధ్యాయుడుగా మండలంలోని రాళ్లచెరువుపల్లె, రెడ్డిపల్లెలలో పనిచేసి విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేశాడు. ఇదే కాకుండా రెడ్డి స్నేహహస్తం స్వచ్చంధ సేవా సంస్ధ ద్వారా యల్లయ్య సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టారు. ఆయన మృతి పట్ల మండలంలోని పలువురు సంతాపం తెలిపారు.
వడదెబ్బకు వ్యక్తి మృతి
రైల్వేకోడూరు, ఏప్రిల్ 23:పట్టణ శివారులోని శాంతినగర్‌కు చెందిన సుబ్బరామయ్య (60) అనే వ్యక్తి శనివారం మృతి చెందాడు. ఎండ తీవ్రతకు తట్టుకోలేక సొమ్మసిల్లి ఇంటిలో పడి పోయాడు, అస్పత్రికి తీసుకెళ్లగా మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుంకున్నాయి. ప్రభుత్వం ఆ కుటుంబానికి ఆర్థిక సహయం అందించి ఆదుకోవాలని సర్పంచ్ మోహన్ కోరారు.
హత్యాయత్నం కేసులో నిందితుడి అరెస్టు
వీరబల్లి, ఏప్రిల్ 23: వీరబల్లి గ్రామ పంచాయతీలోని ఈడిగపల్లెకు చెందిన వ్యక్తి వారం క్రితం రమణ అనే అబ్బాయిని స్థానిక బస్టాండు ఆవరణంలో కత్తితో పొడిచి హత్యాయత్నం చేసినందుకు కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు స్థానిక ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు. నిందితుడ్ని శనివారం కోర్టుకు హాజరుపరచి, రిమాండుకు తరలించినట్లు ఆయన తెలిపారు.
10 కుటుంబాలపై పోలీసులకు ఫిర్యాదు
రైల్వేకోడూరు, ఏప్రిల్ 23:పట్టణ శివారులోని శాంతినగర్‌లో ప్రధాన రహదారికి సమీపంలో నివాసం ఉంటున్న పది కుటుంబాలపై శనివారం ఆర్‌అండ్‌బి ఏఇ సోమశేఖర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గడిచిన రెండు, మూడు మాసాలుగా ఇళ్లలోని వృధా నీటిని ప్రధాన రహదారిపైకి ఆ కుటుంబాలు వదలడం జరుగుతుందని, పలుమార్లు చెప్పినా పట్టించుకోక పోవడంతో వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశామన్నారు. రోడ్లపై నీరు వదలడంతో రోడ్లు దెబ్బతింటున్నాయన్నారు.
మనిషిని కరచిన కుక్కది సహజ మరణమే
* పిహెచ్‌సి డాక్టర్ దేవేంద్రరెడ్డి
పుల్లంపేట, ఏప్రిల్ 23:మండలంలోని అనంతపల్లె పంచాయితీ చాపల హరిజనవాడలో మందా నారాయణ అనే వ్యక్తిని కరచి మరణించిన కుక్కది సహజ మరణమేనని పిహెచ్‌సి డాక్టర్ దేవేంద్రరెడ్డి అన్నారు. శనివారం పిహెచ్‌సిలో ఆయన మాట్లాడుతూ చాపల హరిజనవాడకు చెందిన మందా నారాయణను బుధవారం రాత్రి కుక్క కరచి, గురువారం మధ్యాహ్నం కుక్క చనిపోయినట్లు గ్రామస్తులు తెలిపారన్నారు. దీంతో ముందు జాగ్రత్తగా మందా నారాయణను పిహెచ్‌సికి తీసుకొచ్చి అన్ని రకాల వైద్యపరీక్షలు నిర్వహించగా అతను పూర్తి ఆరోగ్యం ఉన్నాడన్నారు. అయినా ముందు జాగ్రత్తగా రోగికి యాంటీ ర్యాబీస్ వ్యాక్సిన్‌తో పాటు టిటి ఇంజక్షన్ ఇచ్చి వైద్యసేవలు కల్పించామన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు.
సిఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
రామాపురం, ఏప్రిల్ 23: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెల 25వ తేదీన రామాపురం మండలానికి రానున్న సందర్భంగా జిల్లా కలెక్టర్ కెవి రమణ, ఎస్పీ నవీన్‌గులాఠీ, మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డిలు శనివారం పరిశీలించారు. సిఎం చంద్రబాబు పర్యటన రాచపల్లె పంచాయతీ గంగనేరులో జరగాల్సి ఉండగా, కానీ అక్కడ స్థలాన్ని కలెక్టర్, ఎస్పీలు పరిశీలించి అనువైన స్థలం కాదని నిర్ధారించారు. చిట్లూరు పంచాయతీలోని మద్దిరేవుల వంక, చిట్లూరు పెద్దచెరువును పరిశీలించారు. ఈ స్థలం కూడా వారికి నచ్చకపోవడంతో కాసేపు తర్జనభర్జనలు పడ్డారు. అంతలోనే నల్లగుట్టపల్లె పంచాయతీలో ఉన్న పోలీస్‌స్టేషన్ సమీపంలో గల రామరాజువంకలో గతంలో నీరు-చెట్టు కార్యక్రమాన్ని చేపట్టారు. అక్కడ, రామాపురం సమీపంలో ఉన్న బల్లికుంటచెరువును పరిశీలించి ఎంపిక చేశారు. అదే విధంగా నల్లగుట్టపల్లె బీసీ కాలనీ సమీపంలో ఉన్న ఆదర్శ పాఠశాల సమీపంలో హెలీప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. ఆఖరికి ఆదర్శ పాఠశాల సమీపంలో హెలీప్యాడ్.. ఎన్‌హెచ్‌కు సమీపంలో ఉండటంతో అనువైన స్థలంగా ఉంటుందని నిర్థారించారు..