కడప

బయోమెట్రిక్‌తో అధికారుల ఆందోళన..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,మార్చి 21: ప్రభుత్వశాఖల్లో కొరవడిన నిర్లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని బయోమెట్రిక్ విధానం ద్వారా ఉద్యోగుల్లో బాధ్యత పెంచాలని ప్రభుత్వం చేపట్టిన విధానం పలుశాఖల్లో అధికారులకు కలవరపాటు కలిగిస్తోంది. తక్కువ ధరల మిషన్ల దెబ్బకు ఉద్యోగులు జీతాలు అందుకోలేని పరిస్థితి ఏర్పడింది. వచ్చేనెల ఒకటవ తేదీనాటికి బయోమెట్రిక్ అన్ని శాఖల్లో అమలుచేయాలని లేకపోతే జీతాలు ఇవ్వకపోవడమే గాకుండా అధికారులు, సిబ్బందిపై చర్య ఉంటుందని ఒకవైపు ప్రభుత్వం, మరో వైపు కలెక్టర్ జిల్లా యంత్రాంగంపై తీవ్రస్థాయిలో వత్తిడి పెంచుతోంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఈ బయోమెట్రిక్ విధానాన్ని అమలుచేయకపోతే ఆయాశాఖల ఉన్నతాధికారులపై చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. ఈ హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం పరుగులు పెడుతోంది. వాస్తవానికి బయోమెట్రిక్ మిషన్ పూర్తిక్వాలిటీ ఉంటే రూ.3వేలు ఖర్చు అవుతోంది. కానీ ఇందుకు సంబంధించిన ఓ కంపెనీ గత రెండునెలల క్రితమే జిల్లాలోని కీలకమైన అధికారిని కలిసి తాము రూ.1200లకే ఈ బయోమెట్రిక్ మిషన్ అందజేస్తామని చెప్పి, పలుశాఖలకు వీటిని అందజేశారు. అయితే ఈ బయోమెట్రిక్ మిషన్లు ఏర్పాటు చేసుకున్న పలుశాఖల్లో ఇవి పనిచేయడం లేదు. కీలకమైన జిల్లా కలెక్టరేట్‌లో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇటీవల కలెక్టరేట్‌లో ప్రధానశాఖకు ఉన్నతాధికారిగా బాధ్యతలు చేపట్టిన అధికారి తమ సిబ్బంది సక్రమంగా విధులకు హాజరుకాలేదంటూ ఏకంగా వారి జీతాలే నిలిపివేశారు. ఈశాఖలో బయోమెట్రిక్ మిషన్ పనిచేయలేదు కాబట్టి మీరు విధులకు సక్రమంగా రావడం లేదంటూ ఆ అధికారి కిందిస్థాయి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జీతాలు నిలుదల చేసినట్లు తెలుస్తోంది. ఇలా పలుశాఖల్లో అధికారులు కిందిస్థాయి సిబ్బందిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. తక్కువ ధరకు మిషన్ వచ్చినా అది పనిచేయకపోవడం మీ చేతగాని తనమే, కనుక మిషన్ పనిచేసేంతవరకు మీకు జీతాలు ఇవ్వమంటూ తేల్చిచెప్పారు. దీంతో మూడుశాఖలకు చెందిన సిబ్బంది లబోదిబోమంటూ మొత్తుకునే పరిస్థితి ఏర్పడింది. గతంలో అనేకశాఖల్లో అధికారులు ఇష్టానుసారంగా విధి నిర్వహణ సాగించేవారు. దీంతో పాలన వ్యవహారాలు అస్తవ్యస్తంగా మారాయి. ఈనేపధ్యంలో ఆయాశాఖల పరిధిల్లోని పనులకోసం వచ్చే ప్రజల ఫిర్యాదులు భారీ ఎత్తున ప్రభుత్వానికి చేరాయి. ఈ పరిస్థితిని గమనించిన రాష్ట్రప్రభుత్వం శాఖల్లో అధికారుల హాజరుపై గట్టి నిఘా పెట్టేందుకు దృష్టిసారించింది. ఇందులో కీలకమైన విద్యాశాఖ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిబంధనలకు చర్యలు చేపట్టింది. హెడ్మాస్టర్లు మొదలుకుని ఉపాధ్యాయుల వరకు పాఠశాలలకు వెళ్లకుండా జీతాలు మాత్రం క్రమం తప్పకుండా తీసుకుంటూ విద్యావ్యవస్థను గాడి తప్పించారన్న ఆరోపణలు జోరుగా వినిపించాయి. ఇందువల్లే గ్రామీణ ప్రాంతాలు మొదలుకుని పట్టణ ప్రాంతాల్లో సైతం ప్రభుత్వ పాఠశాలలు మూతపడే పరిస్థితి ఏర్పడింది. ఇందుకు ఉపాధ్యాయులే సరైన బాధ్యతలు నిర్వహించకపోవడం వల్ల పిల్లల్లో విద్యాభ్యాసం లోపించి వారి తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల వైపు దృష్టిపెట్టారన్న సమాచారం ప్రభుత్వానికి అందడంతో ఉపాధ్యాయ వ్యవస్థలో మార్పులు తెచ్చేందుకు బయోమెట్రిక్ విధానం చేపట్టారు. ఈ విధానం దాదాపుగా మంచి ఫలితాలనే సాధించింది. ఈనేపధ్యంలో రాష్ట్రప్రభుత్వ పరిధిలోని అన్ని శాఖల్లో ఈ విధానాన్ని ప్రవేశపెట్టి పాలన రంగం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలకు శ్రీకారం చుట్టింది. ఫలితంగా ఏప్రిల్ 1వ తేది నుండి జిల్లాలోని అన్ని ప్రభుత్వశాఖల్లో బయోమెట్రిక్ విధానం తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించడమే గాకుండా దీనిపై అన్నిశాఖలకు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆఘమేఘాల మీద అధికారులు అందుబాటులో ఉన్న బయోమెట్రిక్ కంపెనీలను సంప్రదిస్తూ వాటిని ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఇప్పటికే అతి తక్కువ ధరకు తెచ్చి బిగించిన ఈ మిషన్ల ద్వారా ఫలితాలు లేకుండాపోవడం , ఉద్యోగులకు జీతాలు నిలిపివేయడం వంటి పరిణామాల నేపధ్యంలో ఇప్పుడు హఠాత్తుగా బిగిస్తున్న మిషన్లు పనిచేస్తాయా తమ జీతాలకు ఇబ్బందులు ఉంటాయన్న భయం ఉద్యోగుల్లో కలవరపాటు కలిగిస్తోంది.