కడప

మామాడికి ధరలు లేక అన్నదాత ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైల్వేకోడూరు, మే 22: రాయలసీమలోనే మరో కోనసీమగా పండ్లతోటలకు ప్రసిద్ధిగాంచిన రైల్వేకోడూరు నియోజకవర్గంలో ఈ ఏడాది మామిడి పంటకు ధరలు లేక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఈ నియోజకవర్గంలో రైతులు సుమారు లక్ష ఎకరాలలో మామిడి తోటలు సాగు చేస్తున్నారు. ప్రతి యేటా రైల్వేకోడూరు కేంద్రంగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీష్‌ఘడ్, ఢిల్లీ, తమిళనాడు తదితర రాష్ట్రాలకు మామిడి కాయలు ఎగుమతి అవుతాయి. ఈ ఏడాది ప్రకృతి వైఫరీత్యాలు, దళారుల బెడద, జ్యూస్ ఫ్యాక్టరీల యాజమానులు సిండికేట్ కావడం తదితర సమస్యలు చోటు చేసుకోవడంతో మామిడి పంటకు సరియైనటు వంటి గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది సుమారు 30 శాతం కూడా పంట రాలేదని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని బోగస్ ఎరువుల కంపెనీలు ఈ మందులు వాడితే పంట బాగా వస్తుందని నమ్మబలకడంతో ఆ మందులు వాడామని, మరోవైపు ప్రకృతి కరుణించక పోవడంతో పెద్దగా పంట రాలేదని రైతులు అంటున్నారు. పంట బాగా పండితే ధరలు బాగా ఉన్నపుడు రూ.125 కోట్ల నుండి రూ. 150 కోట్ల వరకు రైల్వేకోడూరులో మామిడి వ్యాపారం జరిగేది. మరీ ఈ ఏడాది 30 శాతం కూడా పంట రాక పోవడంతో రూ. 75 కోట్ల నుండి వంద కోట్ల వరకు వ్యాపారం సాగుతుందని రైతులు అంటున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్ల రద్దు కారణంగా బ్యాంక్‌లకు వెళితే డబ్బులు అడిగినంత ఇవ్వక పోవడం కూడా మామిడి వ్యాపారంపై ప్రభావం చూపుతోందని రైతులు వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు రైల్వేకోడూరు రైతులు, వ్యాపారులపై పడటం వలన డబ్బుల కొరత తీవ్రంగా ఉండటం, ఇతర రాష్ట్రాల నుండి కోడూరుకు మామిడి వ్యాపారులు రాలేక పోతున్నారని రైతులు అంటున్నారు. ఐదు ఎకరాలు మామిడి తోటను పంట వచ్చేంత వరకు సుమారు రూ. 75 వేల నుండి లక్ష వరకు ఎరువులు, క్రిమిసంహరక మందులతో పాటు వ్యవసాయ కూలీలకు డబ్బులు చెల్లించాల్సి వస్తుందని, ఈ ఏడాది ప్రకృతి కరుణించక పోవడంతో పంట పెద్దగా రాలేదు. మామిడి తోటలపై పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితులు కనిపించడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో పాటు కర్నాటక రాష్ట్రంతో పాటు ఎపిలోని చిత్తూరు, విజయవాడ, బంగారుపాళ్యెం తదితర ప్రాంతాలలో మామిడి పంట అధికంగా రావడంతో కోడూరు మామిడి పంటను కొనుగోలు చేసేందుకు ఇతర రాష్ట్రాల వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కోడూరులో 67 మామిడి కాయల మండీలు ఉన్నాయి. కాగా బేనీషా రకం టన్ను రూ. 20 వేల నుండి రూ. 25 వేలు, బెంగుళూరు రకం రూ. 9 నుండి 10 వేల వరకు, నీలం రకం టన్ను రూ. 20 నుండి 23 వేల వరకు, పులిహోర 10 నుండి 13 వేల వరకు ఇతరత్రా రకాలు రూ. 6 నుండి 8 వేల వరకు టన్ను ధరలు పలుకుతున్నాయి. అయితే మే నెల నుంచి జూలై వరకు ప్రతి యేటా రైల్వేకోడూరులో ప్రవేటు మార్కెట్‌యార్డ్‌లో ఈ మామిడి కాయల వ్యాపారం జరుగుతుంది. అయితే చిత్తూరు జిల్లాలోని 70కి పైగా మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలకు ఈ ప్రాంతం నుంచి రైతులు మామిడి కాయలు రవాణా చేస్తుంటారు. మరోవైపు రైల్వేకోడూరులో మధ్య దళారులు, వ్యాపారులు, జ్యూస్ ఫ్యాక్టరీల యాజమానులు ఈ ఏడాది సిండికేట్ కావడంతో ఇతర రాష్ట్రాలలో రైల్వేకోడూరు మామిడి కాయలకు మంచి ధర ఉన్నప్పటికీ సిండికేట్‌తో వారు ధరలు పెంచడం లేదని రైతులు వాపోతున్నారు. రైతు పండించే మామిడి పంట వలన మధ్య దళారులు, వ్యాపారులు, జ్యూన్ ఫ్యాక్టరీ యాజమానులు లక్షలాది రూపాయలు ప్రతి యేటా ఆదాయం పొందుతుంటే ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తున్న తమ నోటిని వారు కొడుతున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులకు తప్ప మిగిలిన వారందరికి సంఘాలు ఉన్నాయని తమకు ఏ దిక్కు లేదన్నారు. ఈ మామిడి సీజన్ వలన అనంతపురం, కర్నూల్ జిల్లాల నుండి 2 వేల మందికి పైగా వలస కూలీలకు రైల్వేకోడూరు ఉపాధి లభిస్తుంది. మరోవైపు కోడూరు నుంచి ఇతర రాష్ట్రాలకు మామిడి రవాణా కావడంతో స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీకి ప్రతి యేటా సుమారు రూ. కోటికి పైగా ఆదాయం ఉంటుంది. మరోవైపు రవాణాకు ఉపయోగించే పేపర్, గడ్డి, తీటలు తదితర అమ్మకాలతో లక్షలాది రూపాయల వ్యాపారం జరుగుతుంది. లారీల యాజమానులు, బ్రోకర్లకు మామిడి రవాణాతో మంచి ఆదాయాన్ని రైల్వేకోడూరులో గడుస్తున్నారు. అయితే పంట పండిస్తున్న అన్నదాతలకు మాత్రం చివరకు అన్యాయమే జరుగుతుందని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వమైనా రైతులకు మామిడి వ్యాపారం విషయంలో గిట్టుబాటు ధరలు కల్పించాలని రైల్వేకోడూరు ప్రాంత రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఈశ్వరయ్య, రైతు, వీవీ కండ్రిగ
మండలంలోని వీవీ కండ్రిగకు చెందిన రైతు ఈశ్వరయ్య మాట్లాడుతూ మామిడి తోటలపై పెట్టిన పెట్టుబడి కూడా ఈ ఏడాది రావడం లేదంటూ ఆందోళన చెందారు. ప్రతి యేటా ప్రకృతి వైఫరీత్యాలు, అకాల వర్షాలు, ఈదురుగాలుల కారణంగా పండ్లతోటలు సాగుచేసిన రైతులు అన్ని విధాల నష్టపోతున్నామని, ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు.
మణి, రైతు, తిమ్మిశెట్టిపల్లె
రైల్వేకోడూరు మామిడి కాయలయార్డ్‌లో మధ్య దళారుల బెడద ఉందని తిమ్మిశెట్టిపల్లెకు చెందిన రైతు మణి ఆరోపించారు. జ్యూస్ ఫ్యాక్టరీల యాజమానులు సిండికేట్ అయి మామిడి ధరలను బాగా తగ్గించారన్నారు. క్రిమి సంహరక మందులు అధికంగా వాడటం, ప్రకృతి కరుణించక పోవడం వంటి కారణాలతో మామిడి రైతులు అన్ని విధాల నష్టపోయామని, అధికారులు, పాలకులు రైతులను ఆదుకోవాలని కోరారు.