కడప

అధికార పార్టీ నేతలకు అచ్చిరాని 2015

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, డిసెంబర్ 28: జిల్లాలో అధికారపార్టీ నేతలకు 2015 పెద్దగా కలసిరాలేదు. రాజకీయంగా జిల్లాలో పెద్దగా మార్పులు చేర్పులు లేవు. అధికార పార్టీ నేతలు నామినేటెడ్ పదవులకోసం కళ్లుకాయలుకాచేలా ఎదురుచూసి చివరకు పార్టీ పదవులకే పరిమితమయ్యారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎం.లింగారెడ్డి ఒక్కరికే కేబినెట్ హోదా కలిగిన పౌరసరఫరాల సంస్థ రాష్ట్ర చైర్మన్ పదవి దక్కింది. మైదుకూరు టిడిపి ఇన్‌చార్జ్ పుట్టాసుధాకర్ యాదవ్‌కు టిటిడి బోర్డు సభ్యత్వం లభించింది. జిల్లాలో అధికారపార్టీ నేతల్లో ఐక్యత లోపించి ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తుండటంతో నేతలందరినీ ఏకతాటిపై తీసుకురావడానికి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావును, జిల్లా అధ్యక్షునిగా ఆర్.శ్రీనివాసరెడ్డి (వాసు)లను నియమించారు. వైఎస్ కుటుంబాన్ని రాజకీయంగా ఢీ కొంటున్న ప్రధాన ప్రత్యర్థి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి గండికోట నుంచి పులివెందులకు నీరు తెప్పించేందుకు కంకణం కట్టుకుని పులివెందులకు నీరు తెచ్చేంతవరకు గడ్డం గీయనని శపధం చేశారు. అలాగే ఆయన పులివెందుల నియోజకవర్గంలో ప్రతిపక్ష నేత జగన్‌ను ఎదుర్కోవడానికి వైఎస్ హయాంలో జరిగిన అవినీతి, టిడిపి పాలనలో జరిగిన అభివృద్ధిపై సైకిల్ యాత్ర ద్వారా పులివెందుల ప్రజలకు వివరించడంలో సఫలీకృతులయ్యారు. ప్రతిపక్ష వైకాపా విషయానికొస్తే డిసిసిబి ఎన్నికల్లో మెజారిటీ ఉన్నప్పటికీ ఘోరపరాజయానికి గురయ్యారు. ఆ పార్టీ నేతలు అధినేత చేపట్టిన ఆందోళనలకే పరిమితమయ్యారు. ఇక బిజెపి విషయానికొస్తే పార్టీ బలోపేతానికి కేంద్ర, రాష్ట్ర నేతలు జిల్లాకు రాకపోకలు కొనసాగిస్తున్నా పార్టీని నమ్ముకుని పనిచేసే వారికే పదవులు లేకపోవడంతో వారు తీవ్ర నిరాశ,నిస్పృహకు లోనయ్యారు. సీనియర్ నేతలకే పదవులు ఉంటాయని కూడా పార్టీ హైకమాండ్ స్పష్టం చేసింది. ఇక కాంగ్రెస్‌పార్టీ విషయానికొస్తే జిల్లాలో కేడర్ అంతంతమాత్రంగా ఉండగా, పలువురు సీనియర్ నేతలు వలస బాటలో ఉన్నారు. పిసిసి చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి తరచూ జిల్లాలో పర్యటిస్తూ పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఉభయ కమ్యూనిస్టులు అధికారపార్టీపై ఒంటికాలుమీద లేస్తూ ఉద్యమాలబాటలో పయనిస్తున్నారు. ఇదిలాఉండగా తెలుగుదేశం పార్టీ పదేళ్ల తర్వాత అధికారంలోకి రాగా, పార్టీని నమ్ముకున్న పలువురు నాయకులను పక్కనబెట్టి వలస నేతలకు ప్రభుత్వంలో పెద్దపీట వేస్తున్నారని అసంతృప్తి నెలకొని ఉంది. ఈ ఏడాది జరిగిన రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో జిల్లా నుంచి ఒకరిని కూడా పార్టీ హైకమాండ్ పెద్దల సభకు పంపలేదు. పార్టీ పరంగా పదవుల భర్తీలో రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్‌నాయుడు సోదరుడు కె.సురేష్ నాయుడుకు రాష్ట్ర కార్యదర్శి పదవి, జిల్లాకు చెంది పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న కృష్ణమూర్తికి పార్టీ కార్యదర్శి పదవులు లభించాయి. అలాగే సీనియర్ నేతలు ఎస్.గోవర్దన్‌రెడ్డి, రెడ్యం వెంకటసుబ్బారెడ్డిలకు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులుగా పదవులు లభించాయి. ముఖ్యంగా మూడు దశాబ్దాలకాలం పార్టీని నమ్ముకుని పార్టీలు మారకుండా ఉన్న నేతల్లో చాలావరకు ఆర్థికంగా చితికిపోయి ఉండగా, పార్టీ పదవులు కానీ, కార్పొరేషన్ పదవులు కానీ లభించకపోవడంతో వారు మనస్తాపానికి గురై ఉన్నారు. 2019 ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని టిడిపి హైకమాండ్ ఇప్పటి నుంచే ఇతర పార్టీల నేతలందర్నీ టిడిపిలోకి తెచ్చి బలోపేతం చేసేందుకు ఆకర్ష్ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని తెలుగుతమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక తమకు పదవీ యోగం లేదని డీలాపడ్డారు. వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తరచూ జిల్లా పర్యటనలు చేసి రానున్నది తమ ప్రభుత్వమేనని అధికారపార్టీ నేతలకు ఎవరూ భయపడరాదని ప్రకటనలు చేస్తున్నా వైకాపా నేతలకు నమ్మకం కుదరడం లేదు. మొత్తమీద 2015 సంవత్సరం జిల్లాలో ఏ పార్టీకి పెద్దగా అచ్చిరాలేదు.