కడప

వైకాపాచే జిల్లావ్యాప్తంగా దద్దరిల్లిన ధర్నాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, మే 2: వైసిపి హైకమాండ్ పిలుపు మేరకు సోమవారం జిల్లా వ్యాప్తంగా అన్ని తహసీల్దార్ కార్యాలయాల ఎదుట ప్రభుత్వవిధానాలకు వ్యతిరేకంగా చేపట్టిన ధర్నా నిర్వహించారు. వైకాపా శ్రేణులు ఎండను లెక్కచేయకుండా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. కడపలో వైకాపా జిల్లా అధ్యక్షుడు ఎ.అమరనాధరెడ్డి, ఎమ్మెల్యే ఎస్‌బి అంజద్‌బాషా, కడప మేయర్ కె.సురేష్‌బాబుల నేతృత్వంలో ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో కరవు విలయతాండవం చేస్తున్నా రాష్ట్రప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదని నాయకులు దుయ్యబట్టారు. అలాగే పులివెందులలో కడప ఎంపి వైఎస్ అవినాష్‌రెడ్డి నేతృత్వంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపట్టి, కరవు నివారణ చర్యల్లో చేపట్టడంలో ప్రభుత్వం ఘోరగా విఫలమైందని రాయలసీమ ఎడారిగా మారే పరిస్థితులు దాపురించాయని ధ్వజమెత్తారు. ప్రజలకు గుక్కెడు నీరు సరఫరా చేయలేని టిడిపి ప్రభుత్వానికి పాలించే అర్హత లేదన్నారు. ప్రొద్దుటూరులో వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు వెంకట ప్రసాద్‌రెడ్డి నేతృత్వంలో ధర్నా చేపట్టారు. కమలాపురంలో ఎమ్మెల్యే పి.రవీంద్రనాధరెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. బద్వేలులో వైకాపా ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ నియోజకవర్గంలో బ్రహ్మంసాగర్ ప్రాజెక్టు ఉన్నా ఆ ప్రాజెక్టుద్వారా సాగునీరు సరఫరా చేయకుండా ప్రజాసమస్యలను పక్కదారిపట్టించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలు చేసి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. జమ్మలమడుగులో ఆ పార్టీ ఇన్‌చార్జి సుధీర్‌రెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. దివంగతనేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు జలయజ్ఞం కింద అనేక ప్రాజెక్టులు చేపట్టినా చంద్రబాబు నాయుడు కమీషన్లకు కక్కుర్తిపడి ప్రాజెక్టుల నిర్మాణాలు జాప్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మైదుకూరులో వైకాపా ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి పెద్ద ఎత్తున మహిళలచే ఖాళీ బిందెలు చేతపట్టించి ధర్నా చేపట్టారు. కరవు సహాయక చర్యలు అమలుచేయడంలో తెలుగుదేశం ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, వడదెబ్బతో చనిపోయిన వారికి ఎలాంటి నష్టపరిహారం చెల్లించలేదని ధ్వజమెత్తారు. రైల్వేకోడూరులో వైకాపా ఎమ్మెల్యే కె.శ్రీనివాసులు, డిసిసిబి మాజీ అధ్యక్షుడు కొల్లం బ్రహ్మానందరెడ్డి నేతృత్వంలో ప్రజలు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
రాజంపేటలో ధర్నా కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఎ.అమరనాధరెడ్డి, వైకాపా నేతలు అనిల్‌కుమార్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాయచోటిలో మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్‌రెడ్డి, వైకాపా రాష్టన్రేత మదన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి ప్రజాసమస్యలు పట్టని ప్రభుత్వం కొనసాగే అర్హలేదని, నీటి ఎద్దడినివారణలో ప్రభుత్వం విఫలమైందని , వడదెబ్బతో మృతి చెందిన బాధిత కుటుంబాలను ఇంతవరకు ఆదుకోలేదని ధ్వజమెత్తారు.

బిషప్ కిడ్నాప్ కేసులో 14 మంది అరెస్టు
* చర్చి ఫాదర్లే కిడ్నాప్ సూత్రధారులు
ఆంధ్రభూమి బ్యూరో
కడప,మే 2: కడప క్యాథలిక్ మిషన్ బిషప్ గల్లెలప్రసాద్ గత నెల 25న ఖాజీపేట నాగసానిపల్లె వద్ద కిడ్నాప్ చేసిన సంఘటనను పోలీసులు చేధించారు. ఈ సంఘటనకు సంబంధించి 14 మందిని సోమవారం అరెస్టు చేయగా, నలుగురు పరారీలో ఉన్నారు. కిరాయి ముఠానాయకుడు గోవర్దన్‌రెడ్డి అనుచురులే బిషప్‌ను కిడ్నాప్ చేశారని జిల్లా ఎస్పీ డా.నవీన్‌గులాఠి సోమవారం విలేఖరుల సమావేశంలో పేర్కొన్నారు. బిషప్ ప్రసాద్ కిడ్నాప్‌కు వినియోగించిన ఐదు కార్లు, బిషప్ నుంచి తీసుకున్న నాలుగు ఎటిఎం కార్డులు, వారి వద్దవున్న 14సెల్‌ఫోన్లు, రూ.46,100నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. బిషప్ రాయలసీమ జిల్లాల్లో అన్ని చర్చిలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను చూడటంతోపాటు పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు. వివిధ చర్చిల్లో ఫాదర్లే కిడ్నాప్‌లో సూత్రధారులని, బిషప్‌ను కిడ్నాప్‌చేసి విడుదలకు రూ.50లక్షలు డిమాండ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. బిషప్‌ను మూడు పర్యాయాలు కిడ్నాప్‌కు విఫలయత్నం చేశారని అన్నారు. ఈ సంఘటనలో సూత్రధారులు రాజారెడ్డి, విజయోమోహన్‌రెడ్డి, మారెడ్డి, కిరాయి ముఠానాయకుడు గోవర్దన్‌రెడ్డి అనుచరులు ఉన్నారని ఎస్పీ తెలిపారు. బిషప్ గల్లెల ప్రసాద్‌ను కిడ్నాప్‌చేసి మానసికంగా ,శారీరకంగా హింసించి చంపుతామని బెదిరించారన్నారు. గత నెల 27న బాధితుడు ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. 9 మంది ఈఘటనలో పాల్గొన్నట్లు బిషప్ ప్రసాద్ తెలిపారు. 25 అర్థరాత్రివరకు కర్రలతో కొట్టి గాయపరచి రూ.50లక్షలు డిమాండ్ చేశారని చెప్పారు. బిషప్‌ను 26న తెల్లవారుజామున 2గంటలకు తాడిపత్రి హైవేరోడ్డులో వదిలి వెళ్లారని, నిందితులంతా 25 నుంచి 30సంవత్సరాలులోపు వారేనని తెలిపారు. ఇటీవలే డయాసిస్ పరిధిలోని ఫాస్టర్లను బదిలీ చేయడం కారణంగానే బిషప్‌పై కొంతమంది ఫాస్టర్లు కక్షగట్టి కిడ్నాప్‌కు పాల్పడ్డారని అన్నారు. మతగురువు కిడ్నాప్ కేసును పోలీసులు ఛాలెంజ్‌గా తీసుకుని ఓఎస్‌డి సత్యయేసుబాబు నేతృత్వంలో మైదుకూరు డిఎస్పీ రామకృష్ణ, ప్రొద్దుటూరు సిఐ, మైదుకూరు సిఐలతో కూడిన ప్రత్యేక బృందం విచారించింది. ఇప్పటివరకు ఈసంఘటనలో 13మంది చర్చిలకు చెందిన ఫాస్టర్లతోపాటు కిరాయి ముఠానాయకుడు గోవర్దన్‌రెడ్డిని అరెస్టు చేశారు. రాజుపాళెంకు చెందిన రమణారెడ్డి, జమ్మలమడుగుకు చెందిన నాగేశ్వరరెడ్డి, దస్తగిరి, చాగలమర్రికి చెందిన రామకృష్ణలు పరారీలో ఉన్నారని, వారిని త్వరలో అరెస్టుచేస్తామని ఎస్పీ పేర్కొన్నారు.
వడగాలులు,ఉక్కపోత
* కడపలో 43.9 డిగ్రీలు
ఆంధ్రభూమి బ్యూరో
కడప,మే 2: జిల్లాలో జోరుగా వడగాలులు ఉక్కపోత పెరిగింది. కడపలో 43.9సెల్సియస్ డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లావ్యాప్తంగా రాజంపేటలో 41సెల్సియస్ డిగ్రీలు, రాయచోటిలో 41, రైల్వేకోడూరులో 42, బద్వేలులో 42, ప్రొద్దుటూరులో 42, మైదుకూరు 42, జమ్మలమడుగులో 42, పులివెందులలో 41, కమలాపురంలో 42సెల్సియస్ ఢిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంగళ, బుధ, గురువారాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి వర్షాలు కురిసే అవకాశాలు మెండుగా ఉన్నాయని వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు.
రేషన్‌డీలర్ల భర్తీకి కసరత్తు
ఆంధ్రభూమి బ్యూరో
కడప,మే 2: కడప రెవెన్యూ డివిజన్‌లో 259 చౌకదుకాణాల డీలర్ల భర్తీ నిమిత్తం కడప ఆర్డీవో ఆర్.చిన్నరాముడు సోమవారం నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో రాజకీయ పైరవీలు మళ్లీ ఊపందుకున్నాయి. ప్రస్తుతం రూల్ ఆఫ్ రేషన్, రోస్టర్ ప్రకారమే నోటిఫికేషన్ జారీ చేశారు. ఈనెల 1కి 18సంవత్సరాలు నిండి 40సంవత్సరాలు లోపు కలిగివుండి 10వ తరగతి పాసైన వ్యక్తులు సంబంధిత తహసీల్దార్ నుంచి డీలర్ షిప్ కోరే ప్రాంతంలో స్థిరనివాసం ఉన్నట్లు సర్ట్ఫికెట్లు తీసుకుని దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. డీలర్‌షిప్‌లకు రాతపరీక్ష , ఇంటర్వ్యూ ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రకటించిన చౌకదుకాణాలకు ఆథరైజేషన్ రద్దు, రాజీనామా , మరణించిన వారి ఖాళీల్లో మాత్రమే శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు.
ఆ మేరకు చక్రాయపేటలో 25 దుకాణాలు, చెన్నూరులో 5దుకాణాలు, చిన్నమండెంలో 17, చింతకొమ్మదినె్న 12, గాలివీడు 18, కడప 21, కమలాపురం 9, ఖాజీపేట 9, లక్కిరెడ్డిపల్లె 9, పెండ్లిమర్రి 8, రామాపురం 19, రాయచోటి 19, సంబేపల్లె 12, టి.సుండుపల్లె 14,వీరపునాయునిపల్లె 7, వల్లూరు 13, వీరబల్లె 13, ఎర్రగుంట్ల 29 చౌకదుకాణాలకు సంబంధిత మండలాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని ఆర్డీవో చిన్నరాముడు కోరారు.

15 నుంచి మైదుకూరులో మెగా క్రికెట్ టోర్నమెంట్
మైదుకూరు, మే 2: తెలుగుదేశం పార్టీ మైదుకూరు నియోజకవర్గం ఇన్‌చార్జ్, టిటిడి పాలకమండలి సభ్యుడు పుట్టా సుధాకర్‌యాదవ్ తనయుడు మహేష్‌యాదవ్ సహకారంతో మైదుకూరులో ఈనెల 15వ తేదీ నుంచి నియోజకవర్గ స్థాయిలో మెగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు మార్కెట్‌కమిటీ ఛైర్మెన్ మాచనూరు చంద్ర, టిడిపి రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి తెలిపారు. స్థానిక నంద్యాల రోడ్డులోని చర్చి క్రికెట్ మైదానాన్ని వారు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతలో వేసవి సెలవుల్లో ఆటలపై ఆశక్తిని ప్రేరేపించడంలో భాగంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. గెలుపొందిన మొదటి, రెండవ జట్లకు లక్షరూపాయలు, రూ.40 వేలు అందజేయనున్నట్లు తెలిపారు. అలాగే ప్రతి మ్యాచ్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బహుమతితోపాటు మూడు, నాల్గు బహుమతులు కూడా అందిస్తామన్నారు. పాల్గొనదలచిన వారు ఈనెల 10వ తేదీలోపు తమ జట్ల వివరాలను తమ వద్ద నమోదు చేయించుకోవాలనిఈ కార్యక్రమంలో టిడిపి యువత పట్టణాధ్యక్షుడు కిట్టు, బండివారిపల్లె శ్రీను పాల్గొన్నారు.
రూ. 2.5కోట్లతో ఇండోర్ స్టేడియం
వేంపల్లె, మే 2: రూ.2.50 కోట్ల నిధులతో వేంపల్లెకు ఇండోర్ స్టేడియం మంజూరైందని శాసనమండలి ఉపాధ్యక్షుడు సతీష్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక జిల్లాపరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణంలో వేసవి క్రీడల శిక్షణా శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ జిల్లాపరిషత్ పాఠశాలకు హ్యాండ్‌బాల్ సెంటర్‌ను కేటాయించారు. ఈ సెంటర్‌లో కబడ్డీ మరియు వాలీబాల్ క్రీడల్లో శిక్షణ ఇవ్వనున్నారు. శిబిరం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన సతీష్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ వేంపల్లెలో నిర్మించబోయే ఇండోర్ స్టేడియంకు వారం రోజుల్లో ఆదేశాలు జారీ కానున్నాయన్నారు. ఈ స్టేడియంలో వాలీబాల్, హ్యాండ్‌బాల్, టెన్నిస్, లాంగ్‌జంప్, హైజంప్, బాస్కెట్‌బాల్, అథ్లెటిక్స్ ట్రాక్‌లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అన్ని రంగాలలో వేంపల్లె మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఆయన అన్నారు. అలాగే విద్యార్థులు కూడా విద్యతోపాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. అనంతరం పాఠశాల ఆవరణంలో ఇంకుడుగుంతలను తవ్వించారు. ఈ కార్యక్రమంలో ఎం ఇ ఓ వీరారెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నారాయణ, పి ఇటిలు రాజశేఖర్, శ్రీనివాసులు, రామచంద్రారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్లు మునిరెడ్డి, బాలస్వామిరెడ్డి, టిడిపి మండలాధ్యక్షుడు షబ్బీర్, దేవస్థాన ఛైర్మెన్ ఎద్దుల కొండ్రాయుడు, ఎస్‌టియు నేతలు నరసింహారెడ్డి, సంగమేశ్వరరెడ్డి, టిడిపి నాయకులు భాస్కర్‌రెడ్డి, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
21రోజుల్లో పరిశ్రమల స్థాపనకు అనుమతులు
కడప (కల్చరల్), మే 2: జిల్లాలో పరిశ్రమల స్థాపనకు సింగల్ డెస్క్ పాలసీ కింద ఆన్‌లైన్ ద్వారా అందిన దరఖాస్తులను 21రోజుల లోపు పరిష్కరించి పరిశ్రమల స్థాపనకు అనుమతులు జారీ చేయాలని జిల్లాకలెక్టర్ కెవి రమణ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా పరిశ్రమల అభివృద్ధి కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు వారు కోరిన అనుమతులను సంబంధిత శాఖాధికారులు ప్రభుత్వం విధించిన గడువులోగా జారీ అయ్యేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో నలుగురు షెడ్యూల్డు కులాల వారికి ఒక జెసిబి, టిప్పర్, 5సీట్లు గల 2 ప్యాసింజర్ వాహనాలకు సంబంధించి రూ.28లక్షల 88వేలు సబ్సిడీ మంజూరు చేశారు. అలాగే 19 సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేశారు. జెసి -2 శేషయ్య, పరిశ్రమలశాఖ ఇన్‌చార్జ్ జిఎం జయలక్ష్మి, ఏపి ఐఐసి జోనల్ మేనేజర్ రమణారెడ్డి, ట్రాన్స్‌కో పర్యవేక్షణ ఇంజనీర్ సుబ్బరాజు, ఎల్‌డిఎం రఘునాధ్‌రెడ్డి పాల్గొన్నారు.
కేంద్రమంత్రి స్మృతి ఇరానీతో మిథున్ భేటీ
రాజంపేట, మే 2:కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మతి ఇరానీతో సోమవారం మంత్రి చాంబర్‌లో బేటీయైనట్లు రాజంపేట పార్లమెంటు సభ్యులు పివి మిధున్‌రెడ్డి సోమవారం తెలిపారు. రాజంపేటకు కేంద్రీయ విద్యాలయం మంజూరు చేసినందులకు ప్రత్యేకంగా ఈ బేటీలో మంత్రికి కృతజ్ఞతలు తెలిపామన్నారు. ఈ సందర్భంలో రాజంపేటకు మంజూరైన కేంద్రీయ విద్యాలయాన్ని రానున్న విద్యాసంవత్సరం నుండి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆయన మంత్రికి వివరించారు. అయితే రాజంపేటకు మంజూరైన కేంద్రీయ విద్యాలయంకు ఐదు మంది ప్రాధమిక ఉపాధ్యాయులు, ఒక మ్యూజిక్ ఉపాధ్యాయుని కొరత ఉన్నట్లు మంత్రి తెలిపామన్నారు. ఇంకా ఈ విద్యాలయానికి ఉపాధ్యాయుల కొరత లేకుండా సంబంధిత ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయాలని ఈ సందర్భంగా మంత్రిని కోరామన్నారు. ఈ విద్యాలయంకు ప్రత్యేకంగా వసతులు కల్పించేందుకు సత్వరం కంప్యూటర్స్, రెండు లైబ్రరీ విభాగాలను విద్యార్థుల ప్రయోజనాల కోసం సత్వరమే ఏర్పాటు చేయాలని మంత్రిని కోరామన్నారు. ఇందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపి వివరించారు.
తెదేపా ప్రభుత్వంలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు
జమ్మలమడుగు, మే 2: తెదేపా ప్రభుత్వంలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని కడప ఎంపి వైయస్ అవినాష్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం ముద్దనూరు రోడ్డులోని వైకాపా పార్టీ కార్యాలయం వద్ద నుండి ఎంపి అవినాష్‌రెడ్డి, ఇన్‌చార్జి సుధీర్‌రెడ్డి, వైకాపా నాయకులు, కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరి తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపి అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి అమలుచేసిన పథకాలకే పేర్లు మార్పు చేసి కొత్తవిగా చెబుకుంటున్నారన్నారు. చంద్రన్న బ్యాంకు పేరుతో ప్రజలకు రుణాలు ఇవ్వకుండా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యేలు అమ్ముడుపోవడం సిగ్గుచేటన్నారు. అనంతరం నియోజకవర్గ ఇన్‌చార్జి సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ కృష్ణా, గోదావరి జలాలలను రాష్ట్రానికి రాకుండా తెలంగాణాతో పాటు ఎగువ రాష్ట్రాలు నదులపై ప్రాజెక్టు నిర్మిస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిమ్మకునీరెత్తినట్లు వున్నాడన్నారు. వేసవికితోడు ఎండతీవ్రతకు ప్రజలు ఇబ్బందులు పడుతూంటే ప్రభుత్వానికి ప్రజాసమస్యలు ఏమాత్రం పట్టడం లేదని సుధీర్‌రెడ్డి ఆరోపించారు. ఈ కార్యక్రమంలో వైకాపా రాష్ట్ర కార్యదర్శి హనుమంతరెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి మహేశ్వరరెడ్డి, వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
సికె దినె్నలో వైకాపా ధర్నా
చింతకొమ్మదినె్న: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలకు ఆచరణ సాధ్యంకాని హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత ప్రజల సమస్యలు పట్టించుకోని చంద్రబాబుకు ప్రజలే గుణపాఠం చెబుతారని మండల వైకాపా నాయకుడు బాలమల్లారెడ్డిపేర్కొన్నారు. సోమవారం రాష్ట్ర వైకాపా పిలుపుమేరకు సికె దినె్నలో సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ కార్యక్రమానికి మండల పరిధిలోని వైకాపాకు చెందిన ఎంపిటిసిలు, సర్పంచ్‌లు, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల నాయకులు మాట్లాడుతూ ఎన్నికల్లో రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులకు పలు వాగ్దానాలుచేసి ఎన్నికల అనంతరం సవాలక్ష కారణాలు చూపి ఏ ఒక్కటి పరిష్కారం చేయని చంద్రబాబు... కరవు సమస్య గురించి పట్టించుకోకపోవడం దారుణమన్నారు. గత సంవత్సరం జిల్లా పరిధిలోని అన్ని మండలాలను కరవు మండలాలుగా ప్రకటించినప్పటికీ ఇప్పటికీ ఏ ఒక్కరైతుకు ఇన్‌ఫుట్ సబ్సిడీ కానీ, సకాలంలో రుణమాఫీ కానీ చేయకపోవడం ఆందోళన కలిగిస్తోందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి సుధాకర్‌రెడ్డి, సర్పంచ్‌లు శ్రీరామిరెడ్డి, పలవలి భాస్కర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి తోపాటు పలువురు మాజీ సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ముగ్గురు క్రికెట్ బుకీలు అరెస్టు
* రూ.1.30 లక్షలు స్వాధీనం
ప్రొద్దుటూరు, మే 2: స్థానిక రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఖాదరబాదర గ్రామంలో ఆదివారం సాయంత్రం ముగ్గురు క్రికెట్ బుకీలను అరెస్టు చేసినట్లు రూరల్ సి ఐ ఓబులేసుయాదవ్ తెలిపారు. సోమవారం రూరల్ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న ఐపిఎల్ మ్యాచ్‌లకు సంబంధించి బెట్టింగ్ జరుగుతోందన్న సమాచారంతో ఆదివారం సాయంత్రం ఖాదరబాదర గ్రామంలోని జడ్పి హైస్కూల్ వద్ద బెట్టింగ్ నిర్వహిస్తున్న సింగనమల రవికుమార్, చెన్నా రంగస్వామి, వద్ది లక్ష్మీరంగయ్య అనే ముగ్గురు బుకీలను అరెస్ట్ చేశామన్నారు. వారి వద్ద నుండి రూ.1.30 లక్షల నగదు, బెట్టింగ్ స్లిప్పులు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ చలపతి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
వాహనాలు దగ్ధం
పోరుమామిళ్ల, మే 2: మండల పరిధిలోని కమ్మరపల్లె గ్రామానికి చెందిన మాజీ మార్కెట్‌యార్డు ఛైర్మెన్ చెరుకూరు చండ్రాయుడుకు చెందిన ఒక కారు, మూడు ద్విచక్ర వాహనాలకు గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం నిప్పంటించగా అందులో రెండు ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధం కాగా కారు, ఒక ద్విచక్ర వాహనం పాక్షికంగా దెబ్బతిన్నాయి. అలాగే ఆర్టీసీ బస్టాండ్‌లో పిపి ఆర్ లాడ్జి వద్ద కూడా నిప్పంటించేందుకు ప్రయత్నించగా కానిస్టేబుల్ మహమ్మద్ గమనించి వారిని తరమడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. విషయాన్ని తెలుసుకున్న మైదుకూరు డీ ఎస్పీ, బద్వేలు ఎమ్మెల్యే జయరాములు అక్కడికి చేరుకొని ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడిన వారు ఎటువంటి వారినైనా కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. పోరుమామిళ్ల సి ఐ, ఎస్ ఐలు ముద్దాయిలను రెండురోజుల్లో గుర్తించి అదుపులోకి తీసుకుంటామని పేర్కొన్నారు.
రూ. 10 లక్షల విలువ చేసే ఎర్రచందనం పట్టివేత
రైల్వేకోడూరు, మే 2:మండలంలోని బాలుపల్లె అటవీ పరిధిలోని అన్నదమ్ముల బండ శేషాచలం అటవీ ప్రాంతంలో సోమవారం రూ. 10 లక్షల విలువ చేసే ఎర్రచందనాన్ని పట్టుకున్నట్లు అటవీ అధికారి శ్రీనివాసులరెడ్డి తెలిపారు. తిరుపతి కన్జర్వేటర్ చలపతిరావు, డిఎఫ్‌ఓ సుబ్బారెడ్డి సిబ్బంది సహకారంతో అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న సందర్భంలో ఈ దుంగలు దొరికాయని, సుమారు పది మంది ఎర్రచందనం కూలీలు సంఘటనా స్థలం నుండి తమను చూసి పారి పోయారన్నారు. పారిపోయిన కూలీల కోసం ప్రత్యేక పోలీస్ బలగాలతో శేషాచలంలో జల్లెడ పడుతున్నామన్నారు.
మోటార్‌సైకిల్ - టాటాసుమో ఢీ
* ఇద్దరికి తీవ్ర గాయాలు
మైదుకూరు, మే 2: మైదుకూరు పట్టణంలోని బద్వేలురోడ్డులోని విలియమ్స్‌నగర్ సమీపంలో సోమవారం సాయంత్రం మోటార్‌సైకిల్ - టాటాసుమో ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సుంకులుగారిపల్లె గ్రామానికి చెందిన రమణారెడ్డి, ప్రసాదరెడ్డి మోటర్‌సైకిల్‌పై జివిసత్రం వైపు వెళ్తుండగా బద్వేలు నుంచి మైదుకూరు వైపు వస్తున్న సుమో వేగంగా మోటర్‌సైకిల్‌ను ఢీకొట్టింది. దీంతో మోటర్‌సైకిల్‌లో ప్రయాణిస్తున్న మామా, అల్లుళ్లైన రమణారెడ్డి, ప్రసాదరెడ్డిల రెండు కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో హుటాహుటిన వారిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి, మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలించారు.

వడదెబ్బకు ఇద్దరు మృతి
నందలూరు, మే 2: జిల్లాలో వడదెబ్బకు గురై సోమవారం ఇద్దరు మృతిచెందారు. నందలూరు దళితవాడకు చెందిన ఆటోడ్రైవర్ కత్తికట్టు జయరామ్ (43) ఆదివారం రాత్రి వడదెబ్బకు గురై మృతి చెందాడు. వివరాలిలావున్నాయి. జయరామ్ ఆటోడ్రైవర్‌గా పనిచేసే వాడు. ఆదివారం సాయంత్రం ఆటో బాడుగకు వెళ్లి తిరిగి వచ్చే సమయంలో వడదెబ్బతో అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స నిమిత్తం ప్రవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యుడు నిర్ధారించాడు. జయరామ్‌కు భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు కలరు. కుటుంబ యాజమాని మృతితో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు శోకసముద్రంలో మునిగారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించి ఆదుకోవాలని స్థానికులు కోరారు.
వడదెబ్బతో వ్యక్తి మృతి
రైల్వేకోడూరు: పట్టణ శివారులోని బయనపల్లెకు చెందిన కె.సుబ్బరాయుడు (65) అనే వ్యిక్తి వడదెబ్బకు తాళలేక ఆదివారం అర్ధరాత్రి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నాలుగైదు రోజులుగా ఎండలకు ఆనారోగ్యం పాలైన సుబ్బరాయుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య లక్ష్ముమ్మ, నలుగురు పిల్లలు కలరు. ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామానికి చెందిన ఎంపీటీసీ గడికోట సుమతి కోరారు.
హత్యాయత్నం కేసులో ఆరుగురి అరెస్టు
రైల్వేకోడూరు, మే 2:మండలంలోని జ్యోతినగర్ కాలనీకి చెందిన మహేష్ అనే యువకునిపై గత నెల 13వ తేది హత్యాయత్నం కేసుకు సంబంధించిన చెన్నైకి చెందిన సతీష్, రాజగురు, లక్ష్మీపతి, అజారుద్ధీన్, డేవిడ్, లోకేష్‌లను సోమవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
22 గొర్రెపిల్లలు దగ్ధం
ఆంధ్రభూమి బ్యూరో
కడప,మే 2: లక్కిరెడ్డిపల్లె మండలం పందిళ్లపల్లె పంచాయతీ పొర్లకుంటవాండ్లపల్లెలో సోమవారం మద్యాహ్నం జరిగిన రెండు బోగకొట్టాల దగ్ధంలో 22 గొర్రె పిల్లలు దగ్ధమయ్యాయి. సోమవారం మద్యాహ్నం వీచిన గాలులు , విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో పర్లకుంట రమణ, తలారి బాలనరసింహులుకు చెందిన బోధ ఇళ్లు దగ్ధమయ్యాయి. దీంతో వెంకరమణకు చెందిన 12 గొర్రెపిల్లలు, బాలనరసింహులకు చెందిన 10గొర్రె పిల్లలు దగ్ధమయ్యాయి. ఈ సంఘటనలో ఎద్దుల బండి, టెంకాయచెట్లు, వివిధ రకాల మొక్కలు కాలిపోయాయి. లక్కిరెడ్డిపల్లె ఫైర్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో ఫైరింజన్ వచ్చి హుటాహుటిన మంటలను ఆర్పివేశారు. సోమవారం సంఘటనలో గొర్రెపిల్లలతోపాటు దాదాపు రూ.2లక్షలు నష్టం వాటిల్లింది.
కరువును పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం
కడప (కైం), మే 2: రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తాగునీరు, పశుగ్రాసం కొరతతో తల్లడిల్లిపోతుండగా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని వైకాపా నాయకులు దుయ్యబట్టారు. సోమవారం కడప కలెక్టరేట్ ఎదుట నగర మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్యే అంజద్‌బాషాల ఆధ్వర్యంలో వైస్సార్ సిపి శ్రేణులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయం లేక ప్రజలు వలసలుపోతున్నారని, పశుగ్రాసం లేక పశువులను కబేళాలకు తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రెండేళ్లుగా పరిస్థితి ఇలాగే ఉన్నా ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. ప్రభుత్వం కరవును నివారించడంలో విఫలమైందన్నారు. నగరంలోనే రెండు,మూడు రోజుల కొకసారి మంచినీరు వస్తుంటే ఇక మారుమూల గ్రామాల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చన్నారు. గ్రామాలు, పట్టణాల్లో ఇంటింటికి తగినంత సురక్షితమైన తాగునీరు , గృహావసరాలకు నీటి సరఫరా చేసేందుకు యుద్దప్రాతిపదికను చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పోచంరెడ్డి సుబ్బారెడ్డి, నగర అధ్యక్షుడు నిత్యానందరెడ్డి, నాయకులు అఫ్జల్‌ఖాన్, షఫీ, ఇలియాస్, చల్లారాజశేఖర్, సునీల్‌కుమార్, నాగమల్లారెడ్డి, శ్రీరంజన్, వినోద్,త్యాగరాజు తదితరులు పాల్గొన్నారు.
సంతలో పశువుల్లా కొంటున్నారు
పులివెందుల: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొంటున్నాడని కడప ఎంపి వైఎస్.అవినాష్‌రెడ్డి అన్నారు. సోమవారం వైకాపా అధ్యక్షుడు వై ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అవినాష్‌రెడ్డి స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాచేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు బృతి, అర్హులైన ప్రతి పేదవారాకి పక్కా గృహాలు, రైతు, డ్వాక్రా సంఘాల రుణమాఫీ, చేనేతలకు ఉచిత ఇళ్లు, ఉచిత విద్యుత్, ఇంటింటికీ ఒక ఉద్యోగం తదితర అమలుకాని హామీలతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. అలాగే రాజధాని నిర్మాణమంటూ వేలకోట్లరూపాయల అవినీతికి పాల్పడ్డారన్నారు. ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రభుత్వ సొమ్మును ఖర్చు చేయాలన్నారు. అలాకాకుండా ప్రతిపక్ష నేతలను కొనడానికి డబ్బు ఖర్చుచేయడం వలన అభివృద్ధి జరగదన్నారు. ఇప్పటికైనా తెలుగుదేశం ప్రభుత్వం కళ్లుతెరిచి ప్రజలను మోసం చేయకుండా ఇచ్చిన హామీల అమలను నిలుపుకొనేందుకు ప్రయత్నించాలన్నారు. అలా కాకపోతే తమ పార్టీ అధ్యక్షుడు ప్రజల పక్షాన నిలబడి ప్రతినిత్యం ప్రభుత్వంపై పోరాటం చేస్తారన్నారు. ఈ ధర్నాలో మున్సిపల్ వైస్ ఛైర్మెన్ చిన్నప్ప, వైకాపా నాయకులు బలరామిరెడ్డి, సర్వోత్తమరెడ్డి, ఓ.రసూల్, లక్ష్మీనారాయణరెడ్డి, కౌన్సిలర్లు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.