కడప

సమస్యల వలయంగా సాధికారిక సర్వే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,సెప్టెంబర్ 21: ప్రతి ఊర్లో ప్రతి ఇంటా ప్రజాసమస్యలు తెలుసుకుని వారికి కావాల్సిన సౌకర్యాలు, పథకాలు అందించేందుకు రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన సాధికారిక సర్వే సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. ఏ పథకానికి వెళ్లినా...ఏ పనికి వెళ్లినా సాధికారిక సర్వేలో మీ వివరాలు లేవు, అందువల్ల ఈ పథకం వర్తించదు అంటూ రెవెన్యూ అధికారులు చేతులెత్తేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలంలో ఈ సమస్య జఠిలమై కూర్చుంది. ఆయా మండలాల స్థాయిలో వీఆర్వోలు సాధికారిక సర్వే సభ్యులతో గ్రామాల్లోకి వెళ్లి ఇంటింటా ఆధార్‌కార్డు, ఫోన్‌నెంబర్, వేలిగుర్తులు తీసుకుని వివరాలు ఆన్‌లైన్‌లో నమోదుచేశారు. ఈసర్వే కూడా చాలాకాలం క్రితమే ముగిసిపోయింది. కానీ ఈ సర్వేచేసే వ్యవహారంలో ఆయా పంచాయతీల్లోని వీఆర్వోలు,సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వారు వెళ్లిన సమయానికి ఊర్లో, ఇంట్లో ఉన్నవారి వివరాలు మాత్రమే నమోదుచేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు, రైతులకు ఈసర్వే గురించి తెలియకపోవడంతో చాలా కుటుంబాలు ఇందులో నమోదుకాలేదు. గ్రామాల్లో కన్నా ఈసమస్య పట్టణాలు, కడప నగరంలోనే అధికంగా ఉంది. గ్రామాల్లో సర్వే నిర్వహిస్తున్న సమయంలో ఒకరి నుండి ఒకరికి విషయం తెలిసి చాలా మంది ఈ సాధికారిక సర్వేలో తమ వివరాలు నమోదుచేయించారు. పట్టణాలు, కడప నగరంలో సర్వే బృందం ఎప్పుడు ఎక్కడికి వచ్చిందో తెలియని పరిస్థితి. పక్కింటిలో వివరాలు నమోదుచేసినా, తమకు తెలియక చాలా మంది ఈ సర్వేలో వివరాలు నమోదుచేసుకోలేకపోయారు. సర్వే బృందాలు కూడా పట్టణాలు, నగరంలో పూర్తిగా అన్ని ఇండ్లను సందర్శించలేదు. దీనికితోడు ఈసాధికారిక సర్వేపై ఏమాత్రం ప్రచారం కూడా జరగలేదు. ఫలితంగా ఇప్పుడు తమ సమస్యల కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టు తిరిగితే ఏ సమస్య వచ్చినా, ఏ సమస్య చెప్పినా మీరు సాధికారిక సర్వేలో వేలిముద్ర వేయలేదు. అందువల్లే మీకు ఈ పథకాలు వర్తించవంటూ వెనక్కు పంపుతున్నారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పలువురు వృద్ధులు, వికలాంగులు, వితంతువులు వారివారి వయస్సులను నిర్దారించడంలో ఆధార్‌కార్డు నిర్వాహకులు ఇష్టానుసారంగా వయస్సును నిర్దారించారు. ఇందువల్ల వీరు పెన్షన్ తీసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ అనేక కష్టాలుపడి ఆధార్‌కార్డులో వయస్సును మార్పించుకుని పెన్షన్‌కోసం అధికారుల తలుపులు తడితే మీరు సాధికారిక సర్వేలో లేరు, పథకం రాదంటూ వెనక్కు పంపిస్తున్నారు. మరోవైపు పట్టణప్రాంతాల నుండి పల్లె ప్రాంతాల వరకు రేషన్‌కార్డుల కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి. ఇటీవల నిర్వహించిన జన్మభూమి కమిటీల సమావేశంలో కూడా ప్రజలు రేషన్‌కార్డుల కోసం ఆయా మండలాల్లో దరఖాస్తులు చేసుకున్నారు. కానీ వీరికి కూడా రేషన్‌కార్డులు రావడం లేదు. మరోవైపు గ్రామాల్లో ఇండ్లస్థలాలు కావాలన్నా, ఎన్‌టిఆర్ గృహనిర్మాణానికి సైతం సాధికారిక సర్వే అవసరమంటూ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన గృహనిర్మాణ కార్యక్రమాలు నత్తనడకన నడుస్తున్నాయి. ఇళ్లులేనివారు ఇంటి స్థలంతోపాటు గృహనిర్మాణానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా దరఖాస్తులు చేసుకున్నారు. అక్కడక్కడ ఇళ్లస్థలాలు ఉన్నాయి. ఈ స్థలాలను పేదలకు అప్పగించేందుకు సైతం రెవెన్యూ అధికారులు సాధికారిక సర్వే బూతాన్ని చూపిస్తున్నారు. ఫలితంగా ఈసాధికారిక సర్వే సమస్యతో ప్రతి సోమవారం కలెక్టరేట్‌కు అధిక సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. జిల్లాస్థాయిలో సైతం అధికారులు గట్టిగా చర్యలు తీసుకోకపోవడంతో వేలాది మంది పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలస్థాయిలోనే రెవెన్యూ కార్యాలయంలో సాధికారిక సర్వే కోసం ప్రత్యేక సిబ్బందిని నియమించాల్సివున్నా ఎక్కడా రెవెన్యూ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. రానున్న ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని రాష్ట్రప్రభుత్వం ఇటీవల కొత్త రేషన్‌కార్డులు, పెన్షన్లు మంజూరు చేస్తున్నాం దరఖాస్తుచేసుకోవాల్సిందిగా సూచించినప్పటికీ ఇక్కడ పరిస్థితి వేరుగా ఉంది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం సాధికారిక సర్వే సెంటర్లను విరివిగా ఏర్పాటుచేసి, ప్రజల్లో ఈసర్వేపై ప్రచారం చేసి అన్ని కుటుంబాలను ఈ సర్వేపరిధిలోకి తీసుకురావాల్సివుంది.